top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

శ్రీరామ కోటి



'Srirama Koti' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 12/07/2024

'శ్రీరామ కోటి' పెద్ద కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


రామపాదమొకప్పుడు చిన్న కుగ్రామం. ఆ కుగ్రామం చుట్టూ పంటపొలాలు ఉన్నప్పటికీ అది సరైన వసతులు లేని కుగ్రామం. ఆధునిక వసతులు అసలు లేని కుగ్రామం. ఆహ్లాదకరమైన పాడి పంటల పంటపొలాల కళకళలతో పాటు విష సర్పాలు, తేళ్ళు, దోమలు, క్రిమికీటకాలు విపరీతంగా ఉన్న కుగ్రామం. ఆకు పచ్చని చేల మాటు ఆకు పచ్చని పాములు వంటి జుగుప్సాకర విష జీవులున్న కుగ్రామం. 


మట్టి రోడ్లే మహా గొప్ప రోడ్లనుకునే అమాయక జనమున్న కుగ్రామం. ఎడ్లబండ్లతో పాటు గాడిద బండ్లు కూడా ఉన్న కుగ్రామం. 


 అలాంటి రామ పాదం కుగ్రామం ఇప్పుడు రాజ ధానిని మించిన పేరుప్రతిష్టలతో అందరి దృష్టిలో పడిం ది. ఒకసారి రామపాదం ను దర్శించుకుంటే చాలు సగం పైగా దరిద్రం తీరి ప్రశాంత జీవనానికి మార్గం మంచిగా కనపడుతుంది అని అనేకమంది రామ భక్తులు అను కునే స్థాయికి ఎదిగిన కుగ్రామం రామపాదం. అందుకు ప్రధాన కారణం అక్కడ కొలువు తీరిన శ్రీసీతారామాంజనేయ దేవాలయం. పూర్వ జన్మ వాసనలను నశింపచేసే పూజ అక్కడ జరుగుతుందరు అక్కడికి వచ్చే భక్తులందరూ నమ్ముతారు. 


 ఏ దైవం ఎప్పుడు ఎక్కడ ఎలా వెలసి, ఏ మహిమ చేస్తుందో ఎందరిని ఆదరిస్తుందో మరెందరి ప్రాణాలనులను కాపాడుతుందో, మరెందరిని మూఢ భక్తులను చేస్తుందో, యిలలో ఎవరు చెప్ప లేరు. 


 బ్రహ్మ రాత బ్రహ్మకు కూడా తెలియదని కొంద రంటారు. రాత రాసిన విధాతకు తను వ్రాసిన రాత గురించి ఎందుకు తెలియదంటే, విధాత ఓ జీవి రాత రాయగానే తన బాధ్యత తీరిపోయినట్లు ఆ రాత మూలాలను మరిచిపోతాడు. మరో జీవి రాత మీద దృష్టి పెడతాడు. అందుకే భూమి మీద మనిషికి వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? 


 చిన్న కుగ్రామమైన రామపాదం మీద అనేక మంది రామ భక్తులు అనేక భజన కీర్తనలు వ్రాసా రు. అందు 


"సుందర మతిసుందరము రామపాదము. 

అంబర మంటే రామపాద రామమందిరము.. 

శ్రీ రాముని హృదయం మెచ్చిన పుణ్య నివాసము. 

శ్రీకౌసల్యామాతకదే సుపుత్ర నిలయం. 

లక్ష్మణ స్వామి నివాసం.. 

కథల కథల విన్యాసం 

కలియుగ త్రేతాయుగ శ్రీరామవాసము. 

సదా మహోన్నత నివాసం.

అబ్బబ్బ తనువును తబ్బిబ్బు చేసే సుర నివాసము. 

రామపాదమ మనోహరం మనోహరం " 


అంటూ రామ భక్తులు పాడే భజన కీర్తనలు అందరిని ఆకట్టుకుంటాయి. 


చిన్న కుగ్రామం ను మహా రాజధానిని చేసిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయం లోనికి ప్రవేశించగానే, 

ముందుగా చిన్న గుడిలో శ్రీకౌసల్యామాత కొలువై ఉంటుంది. అటుపిమ్మట ప్రధాన ఆలయంలో శ్రీసీతారామాంజనేయ స్వామి కొలువై ఉంటారు. ఇక్కడ సీతా రాముల దగ్గర లక్ష్మణుడు కూడా ఉన్నాడు. 


అతగాడు అందరికి కనపడడు అంటారు. అతనిని చూచిన వారే పుణ్యాత్ములు అంటారు. పైకి చూడటానికి మాత్రం సీతారాముల దగ్గర లక్ష్మణ స్వామి కొలువై ఉండే ప్రదేశం ఖాళీగా కనపడుతుంది. 


అక్కడ ఆలయంలోకి ప్రవేశించాక ముందుగా కౌసల్యామాత దర్శనం చేసుకోవాలి. అటుపిమ్మట సీతా రామాంజనేయ లక్ష్మణులను దర్శనం చేసుకోవాలి. 


ఆలయంలోకి ప్రవేశించనవారందరూ, "సహజంగా నాకు లక్ష్మణ స్వామి కనపడ్డాడు" అనే చెబుతారు. కనపడ లేదంటే వారిని పాపాత్ములు అనుకుంటారనేది వారి భయం. 

 దేవాలయంలో భక్తులు లేనప్పుడు, అర్చక స్వా మి ప్రశాంతంగా ఉన్నప్పుడు లక్ష్మణ స్వామి గురించి అర్చక స్వామిని అడిగితే, " ఆ లక్ష్మణ స్వామి ఇంత వరకు నాకే కనపడలేదు. ఆయన ఎవరికీ కనపడకుండా ఉండి "శ్రీరామ కోటి " వ్రాసుకుంటున్నారేమో అని నాకు అనిపి స్తుంది" అని చిరునవ్వు తో అంటారు. అదేమిటంటే అదంతే అంటూ ఉంటారు. 

 "కదిలే కాలం నీతో కలిసి వస్తుంటే నీకు కావల్సిన వన్నీ నీ కళ్ళముందే కనపడతాయి. కలసిరాని కాలంలో నువ్వేం చేసిన తాడే పామై కరచినట్లు నీ పనులే నిన్ను చుట్టుముట్టి నిన్ను అధః పాతాళంలోకి తోసేస్తాయి. ఈ దేవళ దర్శనం చేసుకుంటే కాలంతో పాటు నువ్వు కదులుతున్నావని అర్థం. లక్ష్మణ స్వామి కనపడితే కాలమే నిన్ను అనుసరిస్తుందని అర్థం. అంత అదృష్టం శ్రీరామ చంద్రమూర్తికే కలగలేదు. ఆయన కాలంతో పాటే కదిలారు. పడాల్సిన కష్టాలన్ని పడ్డారు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసారు. " అని అర్చక స్వామి తనదైన వేదాంతం వల్లిస్తారు. 


 కొందరు అర్చక స్వాములు అక్కడి జానపదులతో కలిసి లక్ష్మణ స్వామి మీద కొన్ని జానపద గేయాలను కూడా రచించారు. 


అందులో

"అయ్యా ఓరయ్యా లక్ష్మణా.. 

అన్నమాట జవదాటని ముద్దుల తమ్ముడా.. లక్ష్మణా.. 

ఈ గుడిలోన దొంగాటలు ఆడుతున్నవా? 

నీ వదినమ్మకు నాకు ముదముప్పొంగ ఆడుతున్నవా? అయ్యా ఓరయ్య లక్ష్మణా.." వంటివి ఉన్నాయి. 


 ఆ దేవళానికి రఘురామానుజవల్లభ్ వంశానికి దేవతలు సహితం విడదీయరాని సంబంధం ఉంది. రఘు రామానుజవల్లభ్ వంశం వారు లేనిదే ఆ దేవళం లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ఆ వూరే లేదని చెప్పాలి. 

 రఘురామానుజవల్లభుని అందరూ "అనుజ వల్లభ్ అనుజవల్లభ్" అని పిలుస్తారు. 


అనుజవల్లభ్ శ్రీ రామ భక్తుడు. అతను ఏపని చేసిన జైశ్రీరామ్ అనుకునే పని మొదలు పెడతాడు. అందరి దేవుళ్ళ భక్తులను గౌరవిస్తాడు. అందరి దేవుళ్ళని ప్రార్థిస్తాడు. 

దేవతలను సంతోష పెట్టే అర్చన చేస్తాడు. గత జన్మ పాపాలను పోగొట్టి, జీవుడిని దేవుడిని చేసే జపం చేస్తాడు. దివ్య భావాన్ని కలిగించే దీక్ష చేస్తాడు. 


అయితే అనుజవల్లభ్ సీతారామాంజనేయ స్వామి అంటే ప్రాణం ఇస్తాడు. అనుజవల్లభ్ ఆ దేవాలయ బాధ్యత లన్నిటిని తనే తలకెత్తుకున్నాడు. శ్రీరామ నవమి వంటి వేడుకలకు తనే దగ్గరుండి జరిపిస్తున్నాడు. కొందరు అనుజవల్లభ్ ని ఆ వూరిలో నడిచే, అందరికి కనిపించే లక్ష్మణ స్వామి అని అంటారు. 


"తన తలిదండ్రులు ఉన్నప్పుడే అనుజవల్లభ్ కు వివాహం అయ్యింది. ఆ వివాహానికి అందరూ హాజరయ్యారు. పెళ్ళి కూతురు అనుజవల్లభ్ కు తప్ప ఎవరికి కనపడలేదు. ఆ వూరి వారంతా ఇదేం చిత్రం అనుకున్నారు. 


 అనుజవల్లభ్ తల్లిదండ్రులు కాలం చేసారు. అనుజవల్లభ్ అందరికీ కనపడని ఆ అమ్మాయి తోనే కాపురం చేస్తున్నాడు. కానీ ఆ అమ్మాయిని ఆ వూరి వారు ఎవరూ చూడలేదు. అనుజవల్లభ్ ఆనందంగా ఉన్నాడు.. ఆవూరివారు అనుజవల్లభ్. ఆనందంలోనే ఆ అమ్మాయిని చూసి తృప్తి పడతారు. 


 అనుజవల్లభ్ ని పరిశీలించిన వైద్యులు, "ఆద్యాత్మిక వేత్తలు అనుజవల్లభ్ ని దైవాంశ సంభూతుడు అని అంటారు. మేం అనుజవల్లభ్ తను నిర్మించుకున్న సుందరలోకంలో ఓ యువతితో ఆనందంగ జీవిస్తు న్నాడు. అతను అలా ఆనందంగా జీవించడానికి ప్రధాన కారణం దేవళంలోని లక్ష్మణ స్వామి అని చెప్పవచ్చు ను. అతని వాలకం వలన ఊరిలో ఎవరికీ నష్టం లేదు. లాభం తప్ప" అని అన్నారు.


ఎవరేమన్నా అనుజవల్లభ్ తన మార్గం లో తాను శ్రీరామ సేవ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. దేవాలయం ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళినప్పటికి అక్కడ అనుజవల్లభ్ మాటే చెల్లుతుంది. 


 అనుజవల్లభ్ తల్లిదండ్రులు రామసేన, ప్రజా రాం లే ఆ దేవాలయ నిర్మాణానికి పునాది వేసారు. 


అనుజవల్లభ్ అక్షరాభ్యాసం నాడు రామసేన అనుజవల్లభ్ తో, "ఓ న మః శి వా యః” లతో పాటు “శ్రీరామ శ్రీరామ శ్రీరామ" అని మూడుసార్లు వ్రాయించింది. ఆ తర్వాత తనకు ఖాళీ ఉన్నపుడల్లా అనుజవల్లభ్ తో "శ్రీరామకోటి" వ్రాయిం చడం మొదలు పెట్టింది. 


"శ్రీరామ శ్రీరామ శ్రీరామ" అని ఖాళీ ఉన్నపుడల్లా శ్రీరామకోటి వ్రాసి, శ్రీరామ కోటి పుస్తకాన్ని భద్రాచల దేవాలయానికి, లేదా అయోధ్య రామునికి సమర్పిస్తే, దాని వలన ఎలాంటి పుణ్యమూ రాదు. మరెలాంటి మోక్షము రాదన్నది రామసేన నమ్మకం. ప్రగాఢ విశ్వాసం. అందుకే రామసేన "శ్రీరామ కోటి" వ్రాయలేదు. తన భర్తతో వ్రాయించలేదు. రామసేన శ్రీరామ భక్తురాలు అయిన ప్పటికీ తను "శ్రీరామ కోటి" వ్రాయ కపోవడానికి, భర్తని వ్రాయమని ప్రోత్సహించక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే తన కుమారుడు అనుజవల్లభ్ తో శ్రీరామకోటి వ్రాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. 


 రామసేన పుట్టినప్పుడు రామపాదం చిన్న కుగ్రామం. ఎంత చిన్న కుగ్రామం అంటే అసలు దానిని కుగ్రామం అనికూడా అనకూడదు. గోదారి రహదారి నడుమ పదిళ్ళున్న ప్రాంతం అంటే సరిపోతుంది అని కొందరు అనేవారు. రామసేన కుటుంబానికి ఆ పదిళ్ళ ప్రాంతానికి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉంది. రామసేన తండ్రి అక్కడికి బతకడానికి వచ్చిన వారందరికీ అంతో ఇంతో ఎంతో కొంత ఏదో ఒక సహాయం చేసేవాడు. అలా అలా అదొక కుగ్రామం అయ్యింది. 


 రామసేన తండ్రే ఆ ప్రాంతానికి రామపాదం అని పేరు పెట్టాడు. ఆ వూరికి తనకి జన్మజన్మల సంబంధం ఉందని అతనికి అనిపించింది. 


 అక్కడికి వచ్చి బతికేవాళ్ళకి యిల్లు వేసు కోవడానికి స్థలాలను, తాటి తోపుల్లో తాటాకులను ఉచితంగా ఇచ్చాడు. గోదారి కొంచెం దూరంగా ఉందని ఊరివారంతా కలిసి గోదారినుండి వారి ఊరికి చిన్న కాలువ తవ్వి గోదారి నీళ్ళను వారి ఊరికి దగ్గర చేసారు. 


 రామసేన బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు ఒకసారి ఒక విచిత్రం జరిగింది. ఒకచోట కాలువ గట్టున రామ చిలుకల గుంపు ఒక చిత్రం చుట్టూ తిరగ సాగాయి. రామసేన చిలకల గుంపుల నడుమకు వెళ్ళి చిన్నగా గంతులు వేయసాగింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు రామచిలుకల మాటున ఉన్న శ్రీరామ చంద్రుని విగ్రహం చూసారు. దానిని అక్కడే పరిశుభ్రం చేసి పూజచేయసాగారు. 


రామసేన తండ్రి అనేకమంది పండితులను, స్వామీజీలను పిలిచి ఆ ప్రదేశాన్ని చూపించాడు. అందరి అభిప్రాయాలను స్వీకరించాడు. కడకు అక్కడే దేవళం కట్టాలను కున్నాడు. 

 మంచి ఉన్నచోటే చెడుకూడ ఉంటుంది. అది సృష్టి ధర్మం. రామసేన తండ్రి ఉన్న ఊరిలోనే నాగేంద్ర కుటుం బం కూడా ఉంది. అయితే ఆ కుటుంబం రామసేన తండ్రి ద్వారా రాలేదు. పాముల బసవయ్య ద్వారా నాగేంద్ర కుటుంబం అక్కడకు వచ్చింది. 


రామసేన తండ్రి కి రామసేన ఒక్కతే కుమార్తె. రామసేన తండ్రి ప్రజారాం ను ఇల్లరికం తెచ్చు కున్నాడు. తన పదెకరాల భూమిని అల్లుడి చేతిలో పెట్టాడు. అలాగే "ఊరిని పెద్దది చెయ్యాలి. ఊరిలో దేవళం నిర్మించాలి" అనే తన కోరికలను అల్లుడికి చెప్పాడు. 


 ప్రజారాం కష్టజీవి. పనిపాటలతో కాలం గడిపే వ్యక్తి. తన కష్టం తో మామగారిచ్చిన ఆస్తిని నాలుగు రెట్లు పెంచాడు. అవకాశం వచ్చిన ప్పుడల్లా మామగారి కోరికలను తీర్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. 


 రామసేన పొలంలో భర్తకు సహాయం చేస్తూ ఆడవారికి కర్రసాము నేర్పేది. 


"వెనక నడకతో నాటులు. 

ముందు నడకతో కోతలు. 

కుప్పలమ్మ కుప్పలు. 

బంగరు వన్నెల కుప్పలు 

పల్లెమాత సిరి సంపదలశోభలు" 


అంటూ ఆటపాటలతో ఆనందిస్తూ, అందరిని ఆనందింప చేసేది. ఆమె వస్త్రధారణ చూసి పల్లెమాత పరవసించి పోయేది. 


 "మాలక్ష్మి మహలక్ష్మి మావూరి సిరిసంపదల శ్రీలక్ష్మి.. సాగతమమ్మ సుస్వాగతం.. 

తూరుపుంటి బాల భానుడు శ్రీమన్నారాయణుని బంగారు వెలుగున తులసికోట ముందు ప్రణమిల్లిన భాగ్యలక్ష్మి స్వాగతం సుస్వాగతం" 


అంటూ రామసేనను చూచిన జానపద కవులు కవితలల్లేవారు. 

రామసేన పయిటను గిర్రున తిప్పి అల్లంత దూరంలో ఉన్న ఎదుటివాడి మెడకేసి కొట్టిందంటే వాడు పరలోకానికి వెళ్ళవలసిందే. రామసేన వందకేజీల వడ్లబస్తాని పైకెగరేసి కాలితో తంతే అది వడ్లబండి మీద పడి కుదురుగా కూర్చునేది. రామ సేనకు ఆవులను గేదెలను పెంచడమంటే మహా యిష్టం. వాటి పొదుగు మీద ఆమె చెయ్యి పడితే చాలు పశువులు పాలధారలను కురిపించేయి. మరెవరి చెయ్యన్న పడితే వెనక కాళ్ళు రెండూ ఎత్తి జాడించి కొట్టేయి. 


రామసేన ప్రాణ స్నేహితురాలు హసీనా అక్బర్. 


రామసేన పెళ్ళికాకమందే రామసేన, హసీనా అక్బర్ ఇద్దరూ కలిసి ఊరికి చివరన ఉన్న చంద్రకోన లో చిక్కు కున్న కామధేనువు లాంటి ఆవును కాపాడారు. 


చంద్రకోన ఒక విచిత్రమైన కోన. పౌర్ణమి నాటి చంద్ర కిరణాలకు ఆ కోనలోని కొన్ని చెట్ల ఆకులు కరుగు తాయి. అలా కరిగిన ద్రవం మరుసటి రోజు సూర్య కిరణాలు తాకగానే రకరకాల ఆకారాల్లో రకరకాల రంగు ల్లో గడ్డ కడడతాయి. ఆ ఆకారాలన్ని రకరకాల దేవుళ్ళ స్వరూపాలను కలిగి ఉంటాయి. 


ఒకప్పుడు నాగేంద్ర కన్ను రామసేన మీద పడింది. రామసేనను పెళ్ళి చేసుకుని రామసేనతో పాటు, హసీనా అక్బర్ ని కూడా నాగేంద్ర తన స్వంతం చేసుకో వాలనుకున్నాడు. రామసేన తండ్రి నాగేంద్రకు తన కూతురునిచ్చి పరిణయం చేయడానికి సమ్మతించ లేదు. రామసేన తండ్రి ఊరి పెద్ద అవ్వడంతో నాగేంద్ర తలవంచుకు వెళ్ళిపోయాడు. 


రామసేన వివాహం ప్రజారాం తో జరి గాక ఒకసారి గడ్డివాము చాటున నాగేంద్ర హసీనా అక్బ ర్ భుజం మీద చెయ్యి వేసాడు. అది చూసిన ప్రజారాం నాగేంద్ర జుట్టు పట్టుకుని రచ్చబండ ముందు నాగేంద్ర ను నిలబెట్టాడు. అప్పుడు రామసేన తండ్రి నాగేంద్ర తో హసీనా అక్బర్ యింట పది నెలల వెట్టి చాకిరీ చేయిం చాడు. అప్పటినుండి నాగేంద్ర రామసేన కుటుంబం పై పగబట్టాడు. ఏదో ఒక రకంగా ప్రజారాం ను మంచి చేసు కుని అతని ఆస్తి సమస్తం తన వశం చేసుకోవాలనే ఎత్తుగడతో నాగేంద్ర ప్రవర్తించసాగాడు. 


 నాగేంద్ర చూడటానికి నాలుగు కళ్ళ మనిషిలా ఉంటాడు. అతను చిన్నప్పుడు ఒక కొండ మీదనుండి కిందికి దొర్లి పడ్డాడు. అప్పుడు అతని నుదురు మీద కళ్ళ పైన రెండు పెద్ద గాయాలు అయ్యాయి. ఆ గాయా లు మాని మాని రెండు పెద్ద కళ్ళలా తయారయ్యాయి. దానితో చూసేవారికి నాగేంద్ర నాలుగు కళ్ళ రాక్షసుడు లా కనపడతాడు. అతనికి దేవుడిచ్చిన రెండు కళ్ళు నిరంతరం రుధిర జ్వాలల్లా ఉంటాయి. 


రామసేన తండ్రి ప్రోత్సాహం తో రామసేన, ప్రజారాం లు ఊరిలో శ్రీసీతారామాంజనేయ దేవళ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వారికి హసీనా అక్బర్ కూడా తోడుగా నిలిచింది. చిన్నప్పటి నుండి ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్న రామసేన, హసీనా అక్బ ర్ లు రకరకాల కార్యక్రమాల ద్వారా ధనం రాబట్టి రామ మందిర నిర్మాణ వేగం పెంచాలనుకున్నారు. హసీనా అక్బర్ రామసేన కు రామమందిర నిర్మాణ విషయంలో సహకరించడం చూచిన ముస్లిం పెద్దలలో కొందరు, . 


"బేటీ హసీనా అక్బర్ నువ్వు రామసేన ఎంత ప్రాణ దోస్తులో మాకు తెలుసు. రామసేన మన ముస్లిం పండు గలప్పుడు పర మతం అని అనుకోకుండా మన పండు గలకు రకరకాల సహాయసహకారాలు అందిస్తుంది. 


ఇది ఈ ఊరంతటకు తెలిసిన సత్యం. కాకపోతే మన ఊరి ముస్లింలు, ముస్లిం పెద్దలందరూ నిన్ను సపోర్ట్

చేస్తే చేయవచ్చు. కానీ మనవూరికి అప్పుడప్పుడు వచ్చే మనకంటే గొప్ప వాళ్ళయిన ముస్లిం మతాన్ని పెంచి పోషించే ముస్లిం పెద్దలకు నీ తీరు నచ్చడం లేదని తెలిసింది. ఇలాగైతే నీకు షాదీ అవ్వడం కూడా కష్టమ వుతుంది అని వారు అంటున్నారు. " అని అన్నారు. 


 ముస్లిం పెద్దల మాటలను విన్న హసీనా అక్బర్, "మీరంతా నాకు అల్లాతో సమానం. అయితే ఈ వూరు ఇంత అవ్వడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించింది నా ప్రాణానికి ప్రాణమైన రామసేన తండ్రి. ఆయన నాకు అల్లాలా కనపడతారు. నన్ను కూడా ఆయన "బేటీ.. బేటీ" అనే పిలుస్తారు. మనమంతా మనుషులం. దేవుడు చేసిన మనుషులం. 

ఆ దేవుడు రాముడు కావచ్చు. అల్లా కావచ్చు. మాధవుడు కావచ్చు. జీసస్ కావచ్చు. కనకదుర్గ కావచ్చు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కావచ్చు. బీబీ నాంచారమ్మ కావచ్చు. వారాహి మాత కావచ్చు. 


అంతా సమానమే. 


భగవంతుడు మనకు ప్రాణం పోసాడు. మన కర్మాను సారం మనకు కష్టసుఖాలను ప్రసాదించాడు. దేవుడు మంచిని ఇచ్చా డు. మనసును ఇచ్చాడు. మానవత్వాన్ని ఇచ్చా డు. మతాన్ని ఇచ్చాడు. కులాన్ని ఇచ్చాడు. ప్రతి మతం లో ప్రతి కులంలో ఓ మంచిని, ఓ మానవత్వాన్ని, ఓ మానవ ధర్మాన్ని భద్రపరిచాడు. 


 అయితే కొందరు స్వార్థపరులు కొందరు కుహనా పండితులతో కలిసి కులంలో మతంలో కుళ్ళుని నింపించారు. వారి ధనాభివృద్ధికి, వారి వారి అధికా రాభివృద్ధికి వాటిని వాడుకుంటున్నారు. అలాంటి వారి మాటలను నమ్మి కత్తులు పట్టి ప్రాంతాల మీదకు పోరాదు. 

 దేవుడు చేసిన మనుషులు దేవుడు లాంటి మనుషులుగా ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలతో రాక్ష సులు గా ఉండాలనుకోకూడదు. 


ఎవరి మతంలో వారుండి పరమత దేవుని ప్రార్థించడం తప్పుకాదు. నేను అల్లాని ఎంత భక్తితో ప్రార్థిస్తానో రామ భజన అంత భక్తితో చేస్తాను. 

 ఏ మతం వారికైన, ఏ కులం వారికైన పవిత్ర అవ కాశాలు అన్ని వేళల రావు. వచ్చిన అవకాశాన్ని కులమతాతీత సదాలోచనలతో సద్వినియోగం చేసుకోవాలి గానీ దుర్వినియోగం చేసుకోరాదు. మత మారణ హోమం లో జ్వాలలు కాకండి. " అన్న హసీనా అక్బర్ మాటలు ముస్లిం మత పెద్దలకు నచ్చాయి. 


 హసీనా అక్బర్ రామమందిర నిర్మాణ విషయంలో రామసేనకు తోడుగుండటాన్ని నాగేంద్రకు అసలు నచ్చలేదు. 


"ఇలాంటి వారు సర్వ మత సహనం అంటూనే ఏదో ఒక సందర్భంలో మన మతాన్ని గొయ్యి తీసి పాతిపెడదాం అని చూస్తారు. హే అల్లా హే రాం అంటూనే శ్రీరాముడు పెళ్ళాన్ని నిందించిన భయస్తుడు అంటా”రని పరిహసించాడు. 


విషయాన్ని రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చాడు. 


 "ఒక ముస్లిం మహిళ హిందూ దేవాలయ నిర్మాణ సహకారానికి ముందుకు రావడం వెనుక ఏదో మర్మం దాగి ఉంద”న్నాడు. 


నాగేంద్ర మాటలను ఊరివారంత ఖండించారు. "మనసు మంచిదైతే మంచి చేయడానికి మతం అడ్డు రాద”న్నారు. అయినా నాగేంద్ర వారి మాటలను సమర్థిం చలేదు. 


"ఈ ఊరివారంత రామమందిర నిర్మాణానికి సహకరించినా, రామమందిర నిర్మాణ కమిటీ లో ఒక ముస్లిం మహిళ ఉందంటే పరాయి ఊరువారు సహకరించక పోవచ్చును " అని అన్నాడు. 


"ఇవన్నీ అవకాశవాదులు, స్వార్థ పరులు, కుతంత్ర వ్యాపారస్తులు చేసే పనులు. వాటిని అసలు పట్టించు కో”వద్దని ఊరివారందరితో రామసేన తండ్రి అన్నాడు. 


రామసేన నెల తప్పింది. హసీనా అక్బర్ రామసేన యింటనుండే ఆమె ఆలనా పాలనా చూసుకోసాగింది. 

రామసేన, దశరథరామయ్య, రామసేన తండ్రి, హసీనా అక్బర్ ఖాళీ సమయంలో రామమందిర నిర్మాణం ఎలా ఉండాలనే అంశం మీదనే ఎక్కువగా ముచ్చటించుకునే వారు. 


ఒకనాడు "రామమందిరం గోడలు రామాయణ గాధ ను తెలపాలి. రామమందిరం రామనామాలతో మారు మ్రోగాలి" అంటూ నలుగురు రామమందిర నిర్మాణం గురించి రకరకాల మాటలను చెప్పుకున్నారు. ఆపై అందరూ విశ్రాంతి గ పడుకున్నారు. 


 ఒకగంట అనంతరం హసీనా అక్బర్ కు మెలకువ వచ్చింది. హసీనా అక్బర్ కు గదిలో కిలకిల నవ్వులు వినిపించాయి. ఎవరా అని హసీనా అక్బర్ చుట్టూ చూసింది. ఆమెకు ఎవరూ కనపడలేదు. చివరికి హసీనా అక్బర్ రామసేన కడుపు వైపుకు చూసింది. అక్కడ నుండే కిలకిల నవ్వులు వస్తున్నాయని హసీనా అక్బర్ గమనించింది. రామసేన మంచం దగ్గరకు వచ్చింది. రామసేన గర్భంలోని శిశువు అభిమన్యుడు లా "జైశ్రీరామ్.. రామమందిరం లో ముందుగా అమ్మ కౌసల్య దేవి ఆలయం ఉండాలి. ఆలయంలో అందరూ లక్ష్మణ స్వామి గురించే తలచుకోవాలంటే లక్ష్మణ స్వామి విగ్రహరూపంలో కాక ఛాయా రూపంలో ఉండాలి. " అని అంది. 


"అదెలా సాధ్యం?" శిశువును హసీనా అక్బర్ అడిగింది. 

"అది సుసాధ్యం కావాలంటే మీ మీ త్యాగఫలం అక్కడ ప్రతిష్టించబడాలి. ఏమిటా త్యాగం అనేది కాలం చెబు తుంది. మీరు కరుణాహృదయంతో ఆ త్యాగాన్ని మీ పరం చేసుకోండి. మీలో ఎవరి పరం అవుతుందనేది దేవ రహస్యం. నేను నీకు ఈ విషయాలు చెప్పినట్లు ఎవరికి చెప్పకు. కౌసల్యా మందిరాదుల నిర్మాణం నీ అభిప్రాయం అన్నట్లే చెప్పు" అని హసీనా అక్బర్ తో అంది శిశువు. 


 హసీనా అక్బర్ అందరూ నిద్రలేచాక రామమందిర నిర్మాణం లో కౌసల్యామందిరం గురించి, లక్ష్మణ స్వామి గురించి అందరికి చెప్పింది. శిశువు గురించి మాత్రం చెప్పలేదు. 


రామసేన పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చింది. రామసేన తండ్రి శిశువుకు "రఘురామానుజవల్లభ్" అని పేరు పెట్టాడు. రఘురామానుజవల్లభ్, అచ్చం తండ్రి ప్రజారాం లాగానే ఉన్నాడని కొందరన్నారు. కాదు తల్లి రామసేన లా ఉన్నాడని కొందరన్నాడు. దైవాంశ సంభూతుడని హసీనా అక్బర్ అనుకుంది. రామసేన తండ్రి ఆవూరికి రామానుగ్రహంతో ఎలా వచ్చింది. రామాపాదం వూరు ఎలా ఏర్పడింది అందరికీ చెప్పా డు. రఘు రామానుజవల్లభ్ పుట్టిన పది నెలలకు రామసేన తండ్రి, అతని భార్య ఈ లోకాన్ని వదిలారు. 


 శివరాత్రి పండుగ వచ్చింది. రామపాదం పక్క వూరివారు ఎడ్ల పందాల పోటీలు పెట్టారు. పక్కవూరికి పది మైళ్ళ దూరంలో ఉన్న శివాలయం చుట్టూ ప్రభతో ఉన్న ఎడ్లబండి ని తిప్పుకు తీసుకు రావాలి. ఎవరు గెలిస్తే వారికి ఆరెకరాల పొలమన్నది పందెం. పందెం లో ఆడమగ ఎవరైన పాల్గొనవచ్చును అన్నది నియమం. 


ఎడ్ల బండిని ఒడుపుగ వాయువేగంగా నడప డంలో రామసేన మహాదిట్ట అని చుట్టు పక్కల ఉన్న నలబై గ్రామాలవారికి తెలుసు. అయితే చిన్న బిడ్డ కు తల్లి అయిన రామసేన పోటీలో పాల్గొనడం అసాధ్యం. 


ఆమె ఆరోగ్యం సహకరించదు అని అందరూ అనుకు న్నారు. అయితే రామసేన స్దానంలో హసీనా అక్బర్ నిలబడింది. 

నాగేంద్ర హసీనా అక్బర్ బండికి అనేక అవాంతరాలు కల్పించాలని ప్రయత్నించాడు. కడకు హసీనా అక్బర్ ముఖం పై వసికర్రలు విసిరాడు. అయితే నాగేంద్ర ఎడ్ల బండే పట్టుతప్పింది. నాగేంద్ర చక్రాల కింద పడి చనిపోయాడు. 


 హసీనా అక్బర్ గెలిచింది. అయితే నాగేంద్ర విసిరిన వసికర్రల వలన ఆమె రెండు కళ్ళు పోయాయి. 

హసీనా అక్బర్ ఎండ్ల పందెం లో ఆరు ఎకరాల భూమిని గెలిచింది. ఆ పొలం ను అమ్మింది. సీతారామాంజనేయ నిర్మాణం మొదలయ్యింది. ఆలయ నిర్మాణం శరవేగం గా సాగుతుంది.. 


ఆలయ నిర్మాణం ఎలా సాగుతుంది రామ సేన అనుక్షణం హసీనా అక్బర్ కు చెప్పేది. ఒకనాడు హసీనా అక్బర్ "రామసేన, నాకు తెలిసి కౌసల్య మాతృ హృదయం మహత్తరమైనది. ఆమె శ్రీరాముడు వన వాసం చేసేటప్పుడు, " నాయన రామ! నువ్వు అడవిన ఉన్నప్పుడు నరమాంస భక్షణ చేసే కౄర మృగములు నిన్ను హింసించవు. వనవాసాన నీకు వన్య ఫలములు సంవృద్ధిగా లభిస్తాయి. అలా జరగాలని నేను అనుక్షణం ఇక్కడ సమస్త దేవతలను పూజిస్తాను" అని అంది. 


అలాంటి కౌసల్య మాత మందిరం మన దేవళాన ఉండాలి. " అని రామసేనతో అంది. 


 "తప్పకుండా కౌసల్య మాత మందిరం మన దేవళాన నువ్వనుకున్నట్లే ఉంటుంది. " అని హసీనా అక్బర్ తో అంది రామసేన. అందరూ అనుకున్నట్లే రామాలయ నిర్మాణం అన్ని హంగులతో పూర్తి అయ్యింది. అంగ

రంగ వైభవం గా దేవళ ప్రారంభోత్సవం జరిగింది. 

 రామపాదం ఊరిలోని శ్రీసీతారామాంజనేయస్వామి గురించి, రామసేన గురించి, హసీనా అక్బర్ గురించి చుట్టు పక్కల ఉన్న అన్ని గ్రామాలవారు గొప్పగా చెప్పుకుంటూ రామ దర్శనానికి రాసాగారు. 

రామపాదం కుగ్రామానికి రాజధాని కి ఉన్నంత క్రేజ్ వచ్చింది. 


 రామసేన అనుజవల్లభ్ తో శ్రీరామ కోటి వ్రాయించడం మొదలు పెట్టింది. 


"శ్రీరామ కోటి వ్రాయాలనుకుంటే కోటి మందికి అన్నదానం చెయ్యాలన్న సత్సంకల్పంతో శ్రీరామ కోటి మొదలు పెట్టాలి. అంతేగానీ కాలక్షేపం కోసం రెండు కోట్ల శ్రీరామ కోటి వ్రాసిన ప్రయోజనం లేదు. " అన్న సంకల్పం గల రామసేన కోటి మందికి అన్నదానం చేయగల శక్తిని సంపాదించుకున్నాక కొడుకు రఘుతో శ్రీరామ కోటి వ్రాయడం మొదలు పెట్టించింది. 


రామసేన, హసీనా అక్బర్ ల ముచ్చట్లప్పుడు శ్రీరామ కోటి గురించి హసీనా అక్బర్ రామ సేనకు చెప్పి న విషయం యిది. హసీనా అక్బర్ మాటలు రామ సేన కు బాగా నచ్చాయి. రామసేన ఆ పనిని తన కొడుకు అనుజవల్లభ్ తో చేయించి విజయం సాధించింది. శ్రీరామ కోటి విశిష్టత ను, అన్నదానం గొప్పదనాన్ని అనుజవల్లభ్ అనేక పుణ్య క్షేత్రాలలో తన అనుభవ పూర్వకంగా వివరించాడు. శ్రీరామకోటి మర్మం చాటి చెప్పాడు. 


కొన్ని సంవత్సరాల అనంతరం రామపాదం వూరిలో రామసేన, హసీనా అక్బర్, ప్రజారాం లు కనపడలేదు. హసీనా అక్బర్ మక్కా, రామసేన ప్రజారాంలు కాశీ, అయోధ్యలు వెళ్ళారని కొందరు అనుకుంటే కాదు కాదు వారు బొందితో కైలాసం కు వెళ్ళారని ఎక్కువమంది అనుకోసాగారు. 


 సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు









37 views0 comments

Comments


bottom of page