శ్రీరామనవమి శుభాకాంక్షలు
- Sudha Vishwam Akondi
- Apr 6
- 5 min read
#SudhavishwamAkondi, #SriramaNavamiSubhakankshalu, #శ్రీరామనవమిశుభాకాంక్షలు, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticleOnHoli, #తెలుగువ్యాసం

శ్రీరామనవమి శుభాకాంక్షలు
��������������������
Srirama Navami Subhakankshalu - New Telugu Article Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 05/04/2025
శ్రీరామనవమి శుభాకాంక్షలు - తెలుగు వ్యాసం
రచన: సుధావిశ్వం ఆకొండి
రామచరణం - విశిష్టత
శ్రీరామనవమి నాడు శ్రీరాముడు అవతరించిన రోజు! అంతేకాకుండా ఆనాడు సీతారామ పట్టాభిషేకం అయోధ్యా నగరంలో వశిష్టాది మహర్షుల చేతుల మీదుగా వేదప్రోక్తం గా మహా వైభవంగా జరిగిందట! దేవతలు సైతం పైనుంచి పుష్పవర్షం కురిపించి ఆనందం పొందారు. మానవులపై కించిత్తు అసూయ కూడా చెందారేమో!
'ఏమి ఈ మానవుల భాగ్యము! స్వామి మానవునిగా జన్మ తీసుకుని సమస్త భూమండలాన్ని పాలిస్తూ, ఈ మానవులకు ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగిస్తున్నారు!' అని అనుకుని వుంటారు. ప్రజలు అందరూ ఎంతో ఆనందాంబుధిలో మునిగి పోయారు. మనుషులేంటి! సమస్త జీవరాశులు ఈ జగత్తుకు తల్లిదండ్రులైన వారు కట్టెదుట కనిపిస్తుంటే మాకూ ఇక ఏ కష్టాలు లేవు అని సంతోషపడ్డాయట.
భద్రాచలంలో సీతారామ కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా, అద్భుతంగా జరుగుతుంది. తిలకించడానికి రెండు కళ్ళూ చాలవు!
మానవుడు జీవితంలో ఎలా నడుచుకోవాలో చూపించిన అవతారం ఇది! ఈ మాట అనగానే 'భార్యను వెళ్లగొట్టాడు ఇదేం ధర్మం?' అని దురాలోచనలు చేస్తుంటారు!చిన్నప్పుడు నాకు కూడా వచ్చింది ఈ అనుమానం. అది మా అమ్మానాన్న నివృత్తి చేశారు.
ఇదే ప్రశ్న తరతరాలనుంచి సినిమాలలో తెలిసీ, తెలియక డైలాగులు రచించిన రచయితల ద్వారా అందరిలో ఉదయించింది! కానీ ఆయన ఇంట్లోంచి బయటకు గెంటి, వెంటనే ఇంకో స్త్రీ ని పెళ్లి చేసుకున్నాడా? లేదే! ఈ చిన్న ఆలోచన రాకపోవడం దౌర్భాగ్యం!
ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నారు సీతారాములు! ఈ సృష్టి అంతా వాళ్ళ పిల్లలేగా మరి! పిల్లల అభివృద్ధి కోసం కష్టపడే తల్లిదండ్రులు, అలసటతో ఇంటికి రాగానే, వాళ్ళను పిల్లలు అనుమానించి హేళన చేస్తే ఎలా ఉంటుంది? ఆ పిల్లల వద్ద వుండగలరా? వెంటనే పిల్లల్ని వదిలి వెళ్ళిపోతారు కదా!
అలాగే ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు కనుక పిల్లలను రక్షించడం కోసం అవతారం తీసుకుని, మానవుల లాగే జీవిస్తూ, తాము కష్టపడి, రాక్షసులను సంహరించి, పిల్లలకు వచ్చిన ఆపదను తొలగించారు!
కానీ ధూర్తులైన పిల్లలు తల్లిని శంకించి, ఆ తల్లిని ఆదరించిన తండ్రిని తప్పుపడితే అటువంటి పిల్లలకు శిక్ష పడాలా? వద్దా? శిక్ష పడాల్సిందే బుద్ధిరావడానికి! శిక్ష పడాలంటే అమ్మ అవతారం చాలించాలి, ఆ తర్వాత తండ్రి. అందుకు మార్గం వేసుకున్నారు.
అందుకు సగౌరవంగా సీతమ్మని లక్ష్మణునితో ఆశ్రమానికి పంపించాడు అమ్మ కోరగా. అమ్మ వెళ్లిన తక్షణం అడ్డమైన కూతలు కూసిన ప్రజలు క్షామంతో అష్టకష్టాలు పడ్డారు మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాప పడేవరకూ.
దీపం లేకుండా కాంతి ఉండదు అలాగే కాంతి రాని దీపం ఉండదు. అలాగే సీత లేని రాముడు, రాముడు లేని సీత కూడా. ఒకరి మనసు ఒకరికి తెలుసు ఎదురుగా నిలబడి మాట్లాడు కోకుండానే. ఒకరి కోసం ఒకరు పరితపిస్తారు. రాముడు పురుషులకే మోహం కలిగించే అందమైన రూపం కలిగినవాడు. అటువంటప్పుడు ఎందరు ఆడవాళ్లనైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఏకపత్నివ్రతుడు!
సీతారాముల ఫోటోతో సహా శ్లోకం లేకుండా ఒకప్పుడు పెళ్లి పత్రిక లేదు. బాపుగారి సీతారామ కల్యాణం సినిమా వచ్చినప్పటి నుంచి "సీతారాముల కళ్యాణం చూతము రారండి" అనే పాట వినపడని పెళ్లి మండపాలు లేవంటే అతిశయోక్తి కాదు. సీతారాములు అంతగా మన జీవితాల్లో మమేకమై పోయారు. రామాయణం అంతగా మన జీవితాల్లో భాగం అయి ఉండేది.
సీతారాములు అంటేనే ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం! ఎవరో అడిగారు నన్ను 'సీత అనే పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయట కదానని!'
ఎంత మూర్ఖత్వం! వేరే పేర్లు ఉన్న వాళ్లకు కష్టాలు రావా? కష్టసుఖాలు మన ప్రారబ్దాన్ని బట్టి నిర్దేశించబడి ఉంటాయి. కానీ మన మాట, నడవడిక మనం నిర్దేశించుకోవచ్చు మనసు ద్వారా.
"శ్రీరామ" అనేది తారకమంత్రం. అత్రి, విభీషణాది భక్తులకు తారకమంత్రమైన నీ నామము నిరంతరం నా స్మరణలో వుండేట్టుగా అనుగ్రహించవయ్యా దాశరథి కరుణా పయోనిధి అన్నారు రామదాసు. "శ్రీరామ" లో సీతారాములు ఇద్దరూ వుంటారు. అమ్మయే కరుణ, వాత్సల్య రూపిణి అమ్మతో కలిసిఉంటే తన కరుణారస దృష్టిని మనపై నిరంతరం ప్రసరింపజేస్తాడు.
శ్రీరామాంజనేయయుద్ధం వంటి వాల్మీకి రామాయణంలో లేని ఘట్టాలు తీసుకుని భక్తిరసాన్ని అద్భుతంగా ఆవిష్కరింపజేసిన బాపూగారు నిజంగా ధన్యులు. రామనామ విశిష్టతను చాటిచెప్పారు.
చిన్నప్పుడు శ్రీరామనవమి తొమ్మిది రోజులూ ఒకరోజు కీర్తనలు, హరికథ, బుర్రకధలు పెట్టేవారు కామారెడ్డిలో. రైల్వేస్టేషన్ వెనక పెద్ద స్టేజీ వేసి చేసేవారు. ఆ స్టేజీ పైన సీతారాముల మూర్తులు పెట్టి, పూజాదికాలు చేయించేవారు. వడపప్పూ, పానకం ప్రసాదంగా పంచేవారు. సాయంత్రం హరికథ మొదలైన కార్యక్రమాలు ఉండేవి. మానాన్న మమ్మల్ని తప్పకుండా తీసుకెళ్లేవారు ఆ తొమ్మిది రోజులూ కూడా. అందరం వెళ్లి వినే వాళ్ళం. ఎంతో ఆనందంగా గడిచేది. సరదాగా అనిపించేది. ఈ హరికథలు, బుర్రకధలు అంతగా అర్ధం అయ్యేవి కావు అప్పట్లో. కానీ ఇంట్రెస్ట్ ఉండేది.
ఇక లవకుశ క్యాసెట్ టేప్ రికార్డర్ లో, ఆ తర్వాత టీవీ లో కూడా పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళం. సంక్రాంతికి పిండివంటలు చేస్తూ వినేవాళ్ళం. ఆ డైలాగులు, పాటలు విని విని నోటికొచ్చేవి. రేడియోలో పాటలు వింటూ షార్ట్ హ్యాండ్ వాళ్ళలా టకటకా రాసేసేది మా చెల్లి. మాకు ఓ సినిమా థియేటర్ లో పాత సినిమాలు వేసేవాడు. ఓ సారి లవకుశ వస్తే మా అమ్మానాన్న మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ సినిమా చూసి నిజంగా ఎదురుగా జరుగుతున్నట్టుగా ఫీల్ అయి బాగా ఏడ్చాము. మా చెల్లికి అయితే తలనొప్పి వచ్చింది ఏడవడం వల్ల.
అప్పట్లో రేడియోలో భక్తిరంజని కార్యక్రమం ప్రతిరోజూ వచ్చేది. ఒక్కోరోజు ఒక్కో దేవుడి పాటలు వచ్చేవి. రామదాసు కీర్తనలు ఇలా ఎన్నో. కానీ ఎవరు రాశారనేది తెలియదు మాకు అప్పట్లో. అమ్మ ఉదయమే లేచి, స్నానం పూజ అవ్వగానే వాళ్ళు కాఫీ తాగుతూ ఇది పెట్టేవారు. మేము కొంచెం ముందే లేచేవాళ్ళం ఒక్కోసారి. లేదంటే ఇది మొదలవ్వగానే లేచేవాళ్ళం. ఫ్రెష్ అయి చదువుకునేవాళ్ళం. పొద్దునే చదివితే బాగా గుర్తుంటుంది అని చెప్పేది అమ్మ.
అలా ఆ భక్తిరంజని లో వచ్చిన పాట ఇది. రచించింది ఎవరో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు నచ్చిన వాటిలో ఇది కూడా ఒక అపురూపమైన పాట.
శ్రీరామ చరణాలు పట్టుకుని ఎందరో భక్తులు తరించారు. శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేసి, ఆ పాదాలే స్మరిస్తూ భరతుడు తరించాడు. హనుమకు నిరంతరం శ్రీరామ పాద సేవనమే ఆనందదాయకం. విభీషణుడు మొదలైన వారూ తరించారు. ఆయన పాదాలు పట్టుకుని శ్రీరామ నామ స్మరణతో తరించవచ్చు.
శ్రీరామచరణం :
రామ చరణం రామ చరణం
రామ చరణం మాకు శరణం. II 2 II
మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం
II రామ చరణం II
రాగయై ఈ బతుకు చెడి రాయైన వేళల
రామ చరణం
మూగయై పెంధూళి పడి మ్రోడైన వేళల రామ చరణం II 2 II
ప్రాణమీయగ రామ చరణం
పటిమనీయగ రామ చరణం II 2 II
మాకు చాలును నెరయు మరణం
రాకపోతే రామ చరణం
II రామ చరణం II
కోతియై ఈ మనసు నిలకడ కోలుపోతే
రామ చరణం
సేతువై భవజలధి కారణ హేతువైతే
రామ చరణం II 2 II
ఏడుగణ శ్రీరామ చరణం
తోడుపడ శ్రీరామ చరణం
మాకు చాలును
ముక్తిసౌధ కారణం శ్రీరామ చరణం
II 2 II
II రామ చరణం II
నావలో తానుండి మము నట్టేట నడిపే
రామ చరణం
త్రోవలో కారడవిలో
తొట్టోడ నడిపే రామ చరణం II 2 II
నావ అయితే రామ చరణం
త్రోవ అయితే రామ చరణం
మాకు చాలును వికుంఠ మందిర తోరణం శ్రీరామ చరణం II 2 II
II రామ చరణం II
దారువునకును రాజ్యపూర్వహ దర్పమిచ్చే రామ చరణం
భీరువునకును అలవితీర్చే వీరమిచ్ఛే
రామ చరణం II 2 II
ప్రభుతనిచ్చే రామ చరణం
అభయమిచ్చే రామ చరణం
మాకు చాలును మహేంద్ర వైభవ కారణం శ్రీరామ చరణం II 2 II
II రామ చరణం II
స్వామీ! శ్రీరామా! ఎప్పుడూ కూడా నీ చరణాలే మాకు శరణం గా ఉండాలి.
మునులు, యోగిపుంగవులు నీ శ్రీచరణాలను తమ తలపైన పెట్టుకున్న కిరీటాలుగా భావిస్తారు.
అటువంటి నీ శ్రీచరణాలు సదా మమ్మల్ని రక్షించాలని శరణాగతిని వేడుతున్నాము.
రకరకాల కారణాలతో కష్టనష్టాలు పడి, రోగాలతో ఈ బ్రతుకు అధోగతికి చేరుకునే సమయంలో కూడా మాకు నీ చరణాలే గతి!
ప్రాణాలు నిలబడినా, బలపరాక్రమాలు కలిగినా నీ చరణాలే మాకు గతి!
అనాయాస మరణం లభించడానికి కూడా మాకు నీ చరణాలే గతి.
కోతిలా చిందులు తొక్కిన మనసు స్థిరత్వాన్ని కోల్పోతే నీ శ్రీచరణాలే మాకు దిక్కై స్వాంతన కలిగించాలి.
నీ శ్రీచరణాలే మమ్మల్ని ఈ భవ సాగరాన్ని దాటించే వంతెన లాంటివి.
ఏది, ఎలా జరిగినా మాకు ముక్తి అనే భవనాన్ని ఇచ్చే నీ శ్రీచరణాలే చాలు.
నడి సముద్రంలో నావలా, భయంకరమైన అడివిలో దారి చూపి నడిపేవి నీ శ్రీచరణాలు. అటువంటి నీ పాదాలే మాకు దిక్కు.
ఒక చెట్టునుంచి వచ్చే దారువుకు రాజ్యపాలన చేసే అధికారం ఇచ్చింది నీ పాదాలే! ఒక పిరికివాడికి కూడా ధైర్యాన్ని ఇచ్చేది నీ శ్రీ చరణాలే!.
మహేంద్రునికి వచ్చిన వైభవానికి కారణం నీ శ్రీ చరణాలే!
అటువంటి అభయాన్నిచ్చే నీ శ్రీచరణాలు మాకు చాలు. నిరంతరం నీ చరణ సేవా భాగ్యం మాకు కలిగించు తండ్రీ!
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
����������
శ్రీరామ జయరామ
శ్రీరామ శరణం మమ
����������
సుధావిశ్వం
###
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comentarios