కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu Episode - 10' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
స్నేహ ఇచ్చిన ఫోన్ నుండి గౌతమ్ కు కాల్ చేస్తుంది సమీర. గౌతమ్ తో పాటు, తన తల్లిదండ్రులు, అత్తమామలతో మాట్లాడాక కాస్త కుదుట పడుతుంది.
స్నేహను తన ఇంట్లో ఉంచి, జయా ఆంటీ, పర్వీన్ లతో కనకారావు ఇంటికి బయలుదేరుతుంది.
ఇక చదవండి…
" ఏసీ పెంచరా ప్రవీణ్. చెమటలు పట్టినా సమీర అందం తగ్గదనుకో.. కానీ మేమే అసహ్యంగా తయారవుతాము" అంది జయా ఆంటీ.
"నిజం చెప్పావు పెద్దమ్మా!" అన్నాడు ప్రవీణ్.
"ఏది నిజం? సమీర అందంగా ఉందన్న విషయమా లేక మేము ముసలివాళ్ళమయ్యామన్న విషయమా?" అంది ఆంటీ.
"మేము అంటూ మధ్యలో నన్ను కూడా కలుపుతారెందుకు అంటీ.." అంది పర్వీన్.
'అబ్బో.. రోషం పొడుచుకొచ్చిందండీ పడుచు పిల్లకి" అంది జయా ఆంటీ.
"ఎంతైనా నీకు కూతురి వరసో, కోడలి వరసో అవుతాను ఆంటీ" సంభాషణను పొడిగిస్తూ అంది పర్వీన్.
"కోడలి వరస ఎందుకు మొదలెట్టావ్? ప్రవీణ్ నాకు కొడుకు అవుతాడనా? తొందరగా ఉద్యోగం తెచ్చుకోరా ప్రవీణ్. లేకుంటే పర్వీన్ లాంటి ఆంటీలే దిక్కు నీకు" అంది జయా ఆంటీ.
"సమీర అక్కా! డొనేషన్ విషయం తో పాటు కాస్త నా ఉద్యోగం సంగతి కూడా కనకారావు బావను అడగవా ప్లీజ్!" అన్నాడు ప్రవీణ్.
సమీర జయా ఆంటీ వైపు తిరిగి, " చూడండి ఆంటీ.. ఏదో పర్వీన్ కు సాయం చెయ్యడానికి వస్తానన్నానని, నన్ను మీ పనులన్నింటికీ వాడుకోవాలని చూడొద్దు. అంతే కాదు. మీరు మాట్లాడే ధోరణి మీకు సరదాగా, సరసంగా ఉందేమోగానీ, నాకైతే ఎబ్బెట్టుగా ఉంది. పైగా మీకు కొడుకు వరసయ్యే కుర్రాడి ముందు ఈ మాటలేమిటి ..." కాస్త కటువుగానే అంది సమీర.
"అయ్యో! పొరపాటుగా మాట్లాడానే సమీరా! " నొచ్చుకున్నట్లుగా అంది జయా ఆంటీ. మరి కొద్ది నిముషాలకే తిరిగి తన ధోరణిలోకి వెడుతూ.. "అయినా నేనేం తప్పు మాట్లాడానని అంత కోపం వచ్చింది నీకు? భర్తలకు దూరంగా ఉన్న ఆంటీలం మేము..." అంటూ ఇంకా చెప్పబోతుండగా పర్వీన్ ఆమెను ఆపి, "ఆంటీల లిస్ట్ లో నన్ను చేర్చవద్దు ఆంటీ.. సారీ.. అత్తయ్యా.." అంటూ ముందుకు వంగి డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్ భుజం మీద తట్టింది.
"ఒసే పర్వీన్! నీ కళ్ళు పెళ్లికాని నా కొడుకు ప్రవీణ్ మీద పడ్డాయేమిటే.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయి, సమీర ముఖంలో కోపం చూసి ఆగిపోయింది జయా ఆంటీ.
"సారీ సమీరా! నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఈ ఒక్క రోజుకు సర్దుకో. తరువాత మాకు నీ అవసరం, నీకు మా ఇబ్బంది ఉండవు" అంది అనునయింపుగా.
ఆమె మాటల్లో ఏదో నిగూడార్థం ఉన్నట్లుగా అనిపించింది సమీరకు.
అది గ్రహించిన జయా ఆంటీ, "ఈ రోజు డొనేషన్ సంపాదించి ఈ పర్వీన్ కి సహాయం చెయ్యగలిగితే ఆ పుణ్యం నీదే సమీరా. అయినా ఒక విషయం అడుగుతాను చెప్పు. మనలాగే ఓ నలుగురు మగాళ్లు ఒకచోట చేరితే ఆడాళ్ళ గురించి మాట్లాడుకోరా? అది సరదా అని, మనం మాట్లాడితే ఎబ్బెట్టు అనీ మగాళ్లే మనకు నేర్పించారు. నువ్వెప్పటికి తెలుసుకుంటావో.. అయినా నాకెందుకులే. ఇంకేం మాట్లాడను" అంది.
'ఇలాంటి వాళ్ళతో ముఖ పరిచయం కూడా పెట్టుకోగూడదు. అవతలి వాళ్ళని మాటలతోనే తమ వైపుకు తిప్పుకుంటారు. దేవుడి దయవల్ల ఈ రోజు ఏ ఇబ్బందీ లేకుండా గడిస్తే, ఇక జన్మలో ఇలాంటి వారితో మాట్లాడకూడదు' అని మనసులోనే నిశ్చయించుకుంది సమీర.
మరి కాస్సేపటికే వాళ్ళ కారు కనకారావు ఉంటున్న విల్లా వద్దకు చేరుకుంది. అధునాతనంగా కట్టబడ్డ ఆ విల్లా చాలా ఆకర్షణీయంగా ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్, లోపల అందంగా పెంచబడ్డ పూల మొక్కలతో అక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది. 'బహుశా కనకారావు భార్య చాలా చక్కటి అభిరుచి ఉన్న ఆవిడ అయివుంటుంది. వీలుంటే ఒకసారి ఆవిడను కలవాలి' అనుకుంది సమీర.
కారును ఆ విల్లా ముందు ఆపి, ప్రవీణ్ వేగంగా నడుచుకుంటూ వెళ్లి సెక్యూరిటీ తో ఎదో మాట్లాడాడు. తరువాత వెనకే వస్తున్న ఆడవాళ్ళతో వెనక్కి వెళ్లిపొమ్మని సైగ చేసాడు. ఒకవేళ కనకారావు ఇంట్లో లేడేమో.. అనుకుంటూ ముగ్గురూ తిరిగి కార్ ఎక్కారు.
ప్రవీణ్ కూడా వేగంగా వచ్చి కార్ ఎక్కి, వెనక్కి పోనిచ్చాడు.
"ఏమిటి విషయం? కనకారావు గారు లేరా? మనం వస్తున్న సంగతి ఆయనకు తెలుసు కదా! మరి ఎక్కడికి వెళ్ళాడు?.." ఆశ్చర్యంగా అడిగింది జయా ఆంటీ.
"నీకు ఇప్పుడే ఫోన్ చేస్తాడట పెద్దమ్మా!" అన్నాడు ప్రవీణ్..
మరి కొన్ని క్షణాలకే జయా ఆంటీ ఫోన్ మోగింది.
ఫోన్ లిఫ్ట్ చేసిన ఆంటీ కోపంగా మాట్లాడుతూ "స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. మీ దగ్గర నాకు ఎంతో పరపతి ఉన్నట్లు మా వాళ్లకు బిల్డ్ అప్ ఇచ్చాను. గేట్ దగ్గర్నుంచే తరిమేసావు. పరువు పోయింది. ముఖ్యంగా మా పక్క అపార్ట్మెంట్ సమీర.. అదే.. ఇందాక కళ్ళార్పకుండా చూశావే.. ఆ అమ్మాయి ముందు తలెత్తుకోలేక పోతున్నాను" అంది ఆవేశంగా.
అటువైపు నుండి కనకారావు మాట్లాడుతూ "బయట హాల్లో ఇంటవ్యూ కోసం టివి ఛానల్ వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇలా ముగ్గురు ఆడవాళ్లు ఈ సమయంలో ఇంటికి రావడం బాగుండదనిపించింది. ముఖ్యంగా ఆ అందమైన అమ్మాయి సమీరను చూస్తే కెమెరాలన్నీ ఆమెవైపు తిరుగుతాయి. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆరాలు తీస్తారు. ఆమె భర్త ఏదో కేసులో అరెస్ట్ కాబోతున్నాడని తెలిసింది.
ఈ సమయంలో ఆమెను ఇక్కడ చూస్తే టీవీలలో స్క్రోలింగ్ ఖాయం. అందుకని ఇంటి వెనక వైపునుండి వచ్చి, మేడ మీద రిలాక్స్ కండి. వాళ్ళను పంపించి, నేను మీ దగ్గరికి వస్తాను. విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి సమీర మన మాటలు వింటోంది కదా. భయపడవద్దని చెప్పు.
నాకు మినిస్టర్లు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసు. సులభంగా ఆ అమ్మాయి భర్తను ఆ కేస్ లోంచి బయట పడేస్తాను. బదులుగా ఏమిస్తుందో ఆ అమ్మాయి ఇష్టం. అన్నట్లు చెప్పడం మరిచాను. మా ఆవిడ ఇంట్లో లేదు. పుట్టింటికి వెళ్ళింది. రేవు ఉదయానికి గానీ రాదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నా ననుకుంటున్నావా? నీతో వచ్చిన వాళ్ళకి ఫలహారాలు ఏవైనా అరేంజ్ చెయ్యి. మా పనివాళ్ళందరూ నీకు తెలుసు కదా! అందుకని చెప్పాను” అంటూ చెప్పడం ముగించాడు.
సమీర గుండె వేగంగా కొట్టుకొంటోంది. తను పూర్తిగా ట్రాప్ లో ఇరుక్కుంది.
కనకారావు ఇంటి ముందున్న సిసి కెమెరాల్లో తను గేట్ దగ్గర్నుండే తిరిగి వెళ్లినట్లు రికార్డ్ అవుతుంది. వెనుక వైపు నుండి జరిగే రాకపోకలు ఎవరికీ తెలియవు. ఇప్పుడేం చేయాలి?
ఆలోచిస్తూ ఉండగానే కార్ పక్క సందు దగ్గర ఆగింది.
"ఈ సందులో కార్ పట్టదు. ఇటు నుండి వెడితే కనకారావు ఇంటి వెనుక గేట్ వస్తుంది. వెళ్ళండి. నేను కారుని ఎక్కడన్నా ఖాళీ చూసుకొని పార్క్ చేస్తాను" అన్నాడు ప్రవీణ్.
"నీకు వేరే పని ఉందిలే.." అంటూ అతనితో రహస్యంగా ఏదో చెప్పింది జయా ఆంటీ.
ప్రవీణ్ సరేనన్నట్లు తలాడించి, కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.
"ఏం లేదు సమీరా! ఈ మధ్య మన అపార్ట్మెంట్ లో సిసి కెమెరాలు పెట్టారు. అపార్ట్మెంట్ సెక్రటరీతో పాటు ఇంకొకరెవరైనా మానిటర్ పెట్టుకోవాలన్నారు. సరేనని మా ఇంట్లో పెట్టమన్నాను. అన్నానేగాని ఈ మధ్య ఈ డొనేషన్ గొడవల్లో పడి, ఎవరొస్తున్నారో, ఏం జరుగుతోందో పట్టించుకోలేదు. అందుకని ప్రవీణ్ కి మా ఇంటి కీస్ ఇచ్చి పంపాను. ఎవరింటికైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారేమో చూడమని చెప్పాను. ఇక్కడ మన పని పూర్తి అయ్యేలోగా ప్రవీణ్ అక్కడి పని పూర్తి చేసుకొని వస్తాడు. వాడు వయసులో చిన్నవాడేకానీ ఏ పని చేయడానికైనా వెనుకాడడు" అని చెప్పింది జయా ఆంటీ.
సమీర టెన్షన్ మరింత పెరిగింది. సిసి కెమెరా ఫుటేజ్ చూస్తే స్నేహ తన ఇంటికి రావడం తెలిసిపోతుంది. ఆమెకేదైనా హాని చేస్తారా! ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే, వాళ్ళు స్నేహ ఫ్రెండ్ సందీప్ వాళ్ళ నాన్న దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసుకొని ఉన్నారు.
ఒకవేళ సిసి కెమెరా ఫుటేజ్ లో స్నేహ తన ఇంటికి రావడం గమనిస్తే ఏంచేస్తారు? తన ఇంటి తాళాలు పగలగొట్టి స్నేహాకు హాని చేస్తారా? 'ప్రవీణ్ అక్కడి పని పూర్తి చేసుకొని వస్తాడు' అన్న మాటకు అర్థం అదేనా.. ఇప్పుడు తనేం చెయ్యాలి?
కనకారావు తన భార్యను కావాలనే పుట్టింటికి పంపాడా? పరిస్థితి చెయ్యి దాటి పోతున్నా ఇప్పటి పరిస్థితిలో తను డొనేషన్ కోసమో లేక వాళ్ళు చేసే పనుల గురించి ఆధారాలు సేకరించడం కోసమో కనకారావు ఇంట్లోకి వెళ్లడం మూర్ఖత్వం. ప్రమోద్ స్పృహలోకి వస్తే గౌతమ్ ఎలాగైనా కేస్ నుండి బయట పడతాడు. కన్ను పోయే కాటుక పెట్టుకోవడం, పర్వీన్ కోసమంటూ రిస్క్ చేయడం పొరపాటు...
ఇలా ఆలోచిస్తున్న సమీర భుజం తట్టి, "ఇలా రోడ్ లో ఎందుకిలా ఉండడం? ఈ సందులో వెళ్లి కనకారావు ఇంటి వెనక వైపు నుండి లోపలి వెడదాం. అక్కడ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. గౌతమ్ ఏదో కేసులో ఇరుక్కున్నట్లు కనకరావుగారు చెప్పారు కదా.. ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. నువ్వెందుకో బాగా టెన్షన్ పడుతున్నావ్. నన్ను నమ్ముకో. నీకు ఏ ఇబ్బందీ ఉండదు" అంది.
'ఇక ఈమె మాటలకు లోబడకూడదు. ఆమెతో గొడవైనా సరే, తను ఇక్కడినుండి వెళ్ళిపోవాలి' అని సమీర అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వేగంగా బండి నడుపుకుంటూ వచ్చి వీళ్లకు అడ్డంగా బైక్ ఆపాడు.
తలపై ఉన్న హెల్మెట్ తీసిన అతన్ని చూసి ముగ్గురూ నోటా మాట రాక నిర్ఘాంతపోయారు.
ఇంకా వుంది…
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 అతి త్వరలో…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comentarios