top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Srivari Kattu Kathalu Episode - 12' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…


కనకారావు ఇంట్లోకి వెడతారు సమీర, పర్వీన్.

సమీరను ఒక గదిలో ఉంచి బయట గడియ పెడుతుంది పర్వీన్.

జయా ఆంటీని కలిసిన వ్యక్తి, తన పేరు సందీప్ అనీ, తనను మోసం చేసిన స్నేహను తన కళ్ళ ముందే చంపెయ్యమనీ చెబుతాడు.

గతంలో తనకు సుపారీ ఇచ్చిన విల్సన్ కు ఫోన్ చేసి,

అతను చెప్పింది నిజమని నిర్ధారణ చేసుకొని,

ఒప్పుకుంటుంది జయా ఆంటీ.

ఇక చదవండి...


"మరి నేను కార్ తీసుకొని వచ్చేశానుగా! మళ్ళీ అక్కడికి రానా లేక క్యాబ్ బుక్ చెయ్యనా?" అడిగాడు ప్రవీణ్.


“ఒద్దులే! బైక్ లో వెనక కూర్చొని చాలా రోజులైంది. ఈ అబ్బాయితో వస్తానులే" అంటూ సందీప్ వంక చూసి 'సరేనా' అన్నట్లు కళ్ళెగరేసింది.

అంగీకారంగా తల ఊపాడు సందీప్.


ప్రవీణ్ ఫోన్ పెట్టేసాక పర్వీన్ కి కాల్ చేసింది జయా ఆంటీ.

"నేను అర్జెంట్ పనిమీద వెళ్తున్నాను. వివరాలు మళ్ళీ చెబుతాను. అక్కడి విషయాలు నువ్వే చూసుకోవాలి. గౌతమ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారని సమీరను బాగా భయపెట్టు. ముందు ఉద్యోగం పోతుందని, రోడ్డున పడాల్సి వస్తుందని ఊదరగొట్టు" అని చెప్పింది.


"నాకు భయంగా ఉంది అక్కా! ఇక్కడి పని చూసుకొనే వెళ్ళు ప్లీజ్" అంది పర్వీన్.

"ఆ సమీర పక్కనే ఉందా?" చిన్నగా అడిగింది ఆంటీ.

"లేదులే! గదిలో కూర్చోబెట్టి, బయట గడియ పెట్టాను" అంది పర్వీన్.


"మంచిపని చేసావు. ఎన్నాళ్లని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాం? ఆ అమ్మాయి కాదంటే బలప్రయోగం చెయ్యాల్సి ఉంటుంది. అందుకే ప్లాన్ చేసి వెనక డోర్ గుండా వచ్చేలా చేసాము. సిసి కెమెరాల గొడవ ఉండదు. కానీ ఆ అమ్మాయేమో నాగుపాములా బుసలు కొడుతూ ఉంటుంది. మన బావగారేమో వానపాములా ఉంటాడు. నువ్వు, ఆ శిల్ప కూడా సహాయం చెయ్యాల్సి ఉంటుంది. అన్నట్లు మసాజ్ చెయ్యడానికి ఒక కుర్రాణ్ణి తీసుకొని వస్తానంది శిల్ప. వచ్చాడా?" అడిగింది జయా ఆంటీ.


"వచ్చాడు ఆంటీ. అవసరమైతే అన్ని పనుల్లో సహాయం చేస్తాడని చెప్పింది శిల్ప" చెప్పింది పర్వీన్.


"గుడ్! ఈ రోజు చాలా మంచి రోజులా ఉంది మనకు. పనులన్నీ అనుకున్నట్లు జరిగితే నీకు మంచి బహుమానం ఉంటుందిలే" అంటూ కాల్ కట్ చేసి, సందీప్ బైక్ ఎక్కింది. వెంటనే బైక్ ను ముందుకు దూకించాడు సందీప్.

***

సమీర ఇంట్లో ఒంటరిగా ఉంది స్నేహ. ఆమెకు ఏమీ తోచడం లేదు.

హాల్లోకి వచ్చి టివి పెట్టుకుందామంటే, ఆ శబ్దానికి ఇంట్లో ఎవరో ఉన్నట్లు బయటి వాళ్ళకి తెలిసిపోతుంది.


బెడ్ రూమ్ లోనే అసహనంగా దొర్లుతోంది.

గోడమీద గౌతమ్, సమీరల ఫోటో తగిలించి ఉంది.

కొంతసేపు కన్నార్పకుండా ఆ ఫోటో వంకే చూసింది స్నేహ.

ఎంత చక్కటి జంట…


చూస్తుంటే తన దిష్టే తగిలేలా ఉంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లున్నారు. పైగా ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం...

కానీ తన విషయంలో అలా కాదు.


తనను సందీప్ అనుమానించాడు. కనీసం తన వాదన వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే సమీర చెప్పినట్లు సందీప్ అమెరికాలో ఉండటం వల్ల తమ మధ్య గ్యాప్ పెరిగింది. అదే తను అతన్ని నేరుగా కలిస్తే తనతో బ్రేక్ అప్ చెయ్యలేడు. తను అతని ఎదురుగా నిలుచుంటే అతను ఖచ్చితంగా కరిగిపోతాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్న స్నేహ, సందీప్ ఏం చెయ్యబోతున్నాడో ఊహించలేదు.


స్నేహ ఆలా ఆలోచనల్లో ఉండగానే మెయిన్ డోర్ ను ఎవరో కదిలిస్తున్న శబ్దం వినిపించింది. సమీర వెళ్ళగానే తను లోపలి వైపు గడియ పెట్టుకున్నట్లు గుర్తు. ఎందుకైనా మంచిదని బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చి చూసింది.


బయటినుంచి ఎవరో డోర్ కీ తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. లోపల గడియ వేసే ఉంది. కాస్త ఊపిరి పీల్చుకుంది స్నేహ. కానీ కీ తీసాక కూడా డోర్ తెరుచుకోక పోతే లోపల ఎవరో గడియ పెట్టుకొని ఉన్నారని బయట ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది.


ముందు బయట ఉన్నదెవరో చూడాలి. ఏదైనా అద్భుతం జరిగి బయట సందీప్ వుంటే తనంత అదృష్టవంతురాలు ఉండదు.

బయటకి చూద్దామంటే డోర్ వ్యూయర్ లేదు.


బయట ఉన్న వ్యక్తి కీ హోల్ నుండి కీ తియ్యగానే కిందికి వంగి అక్కడ తన కన్ను ఉంచి బయటకు చూసింది.


అదే సమయంలో బయటనుంచి ఎవరో అక్కడ కన్ను ఉంచి లోపలికి చూస్తున్నారు.

తన ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నట్లు అనిపించింది స్నేహకి.

***

తన అపార్ట్మెంట్ దగ్గర పడుతుండగా ప్రవీణ్ కు కాల్ చేసింది జయా ఆంటీ.

"సిసి కెమెరా వైర్ కట్ చేయించాను" చెప్పాడు ప్రవీణ్.


సందీప్ ను తీసుకొని తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. లోపల ప్రవీణ్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. డోర్ వేసి సందీప్ ను కూర్చోమంది జయా ఆంటీ.


తరువాత ప్రవీణ్ ను పరిచయం చేస్తూ.."వీడు నా చెల్లెలి కొడుకు. పేరు ప్రవీణ్. మంచి ధైర్యం. ఎంతకైనా తెగిస్తాడు" అని చెప్పింది.


సందీప్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ "నా పేరు సందీప్" అని చెప్పాడు.

"సందీప్ అంటే..." అంటూ ఆంటీ వైపు చూసాడు ప్రవీణ్.


“ఈ అబ్బాయే.. స్నేహ అనే అమ్మాయిని గుడ్డిగా ప్రేమించాడు. ఇంత అందగాడిని, కోటీశ్వరుడిని మోసం చేసిందా అమ్మాయి. ప్రమోద్ తెలుసుగా.. వాడితో తిరిగింది. చేసిన పాపానికి వాడు యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉన్నాడు.


ఆ స్నేహ ఇప్పుడు మన పక్కింట్లోనే.. అంటే సమీర వాళ్ళ ఇంట్లోనే ఉంది. తననే నువ్వు ఇప్పుడు నువ్వు చంపబోయేది.. అది కళ్లారా చూస్తేగానీ ఈ బాబుగారికి మనసు శాంతించదు" అంది జయా ఆంటీ.


"మరి డెడ్ బాడీని ఏం చెయ్యాలి?" అడిగాడు ప్రవీణ్.


"అక్కడే వదిలెయ్యొచ్చు. నేరం గౌతమ్ మీదకు నెట్టేద్దాం" అంది జయా ఆంటీ.


"ఎందుకైనా మంచిది.. మన కుర్రాళ్ళని ఒకరిద్దరిని రమ్మంటాను" అన్నాడు ప్రవీణ్.


"వద్దు. నేను, సందీప్ హెల్ప్ చేస్తాములే… సందీప్ బాబూ! మీకేం సంకోచం లేదుగా.." సందీప్ వంక చూస్తూ అంది ఆంటీ.


"ఆ అమ్మాయి ఏడిస్తే మీ మనసు మారిపోదుగా?' సందేహంగా అన్నాడు ప్రవీణ్.


"మారదు. వీలైతే చిత్రహింసలు పెట్టి చంపు. అన్నీ ఆలోచించే కదా, కోటి రూపాయల సుపారీకి ఒప్పుకున్నాను" అన్నాడు సందీప్.


కళ్ళు బైర్లు కమ్మాయి ప్రవీణ్ కి.


పెద్ద మొత్తం అని ఉహించాడు కానీ కోటి రూపాయలని అనుకోలేదు.

ఆంటీ తనకు ఎంత ఇస్తుందో..


కనీసం పాతికైనా ఇస్తుంది. ఈ సందీప్ బాబుతో పరిచయం పెంచుకొని ఏదైనా మంచి ఉద్యోగం అడగాలి.. ఇలా ఆలోచిస్తూ సందీప్ ను ఒక సెలెబ్రిటీని చూసినట్లు చూసాడు.


“ఇప్పుడు ప్లాన్ నేను చెబుతాను, వినండి. ముందుగా సందీప్ వెళ్లి తలుపు తడతాడు. స్నేహను పిలుస్తాడు. సందీప్ గొంతు విన్న స్నేహ ఆనందంతో తలుపు తీస్తుంది. వెంటనే మనమిద్దరం లోపలికి దూరుదాం. గౌతమ్ ఇంట్లోనే ఏదో ఒక వెపన్ వెతుక్కుందాం. " అంటూ తన ప్లాన్ చెప్పింది జయా ఆంటీ.


"ఒకవేళ డోర్ బయటనుండి లాక్ చేసుకొని వెళ్లి వుంటే..." అనుమానంగా అడిగాడు సందీప్.


"మారు తాళాలతోనో హెయిర్ పిన్ తోనో మా ప్రవీణ్ తీసేస్తాడులే.." అంది జయా ఆంటీ.


తరువాత అక్కడే ఒకసారి 'రెక్కీ' నిర్వహించారు. పక్కా ప్లాన్ తో బయటకు వచ్చారు.


ముందుగా సందీప్ డోర్ తట్టాడు.

ప్రవీణ్, జయా ఆంటీ ఒక పక్కగా నిలుచొని ఉన్నారు.

ఎవరూ డోర్ తెరవకపోవడం, కనీసం ఎవరు వచ్చారని అడగక పోవడంతో

కీ హోల్ లోంచి లోపలికి చూసాడు సందీప్.

***

సమీరను అతను లోపలికి గుంజుకున్న వెంటనే తలుపుకు బయటనుండి గడియ పెట్టింది పర్వీన్.


అంతా చూస్తున్న శిల్ప , "పెళ్లికూతురిని శోభనం గదిలోకి నెట్టేశావా.." అంది నవ్వుతూ.


" జన్మలో కొన్నైనా మంచి పనులు చెయ్యాలిగా.." అంది పర్వీన్, తను కూడా నవ్వుతూ.


ఇంతలో జయా ఆంటీ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.

శిల్ప ఉన్న గదిలోకి వెళ్లి, స్పీకర్ ఆన్ చేసి, మాట్లాడింది పర్వీన్.

ఆమె ఫోన్ పెట్టేసాక శిల్ప ఆమెతో "నాకెందుకో భయంగా ఉంది. అన్ని పనులూ అనుకున్నట్లుగా జరుగుతాయా.." అని సందేహంగా అడిగింది.


"సందేహమే లేదు. నువ్వు మసాజ్ చెయ్యడానికి పిలిపించిన వాడు ఆరడుగుల బుల్లెట్. ఈ పాటికే సమీరను..." అంటూ శిల్ప వంక చూస్తూ కన్ను గీటింది. ఇంతలో సమీర ఉన్న రూమ్ లో పెప్పర్ స్ప్రే వాడినట్లుగా బయటికి ఘాటైన వాసన వచ్చింది.


ఇంకా ఉంది…


శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 త్వరలో...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



106 views0 comments

Comments


bottom of page