కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu Episode - 7' Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
గౌతమ్ రెస్టారెంట్ నుండి ఒక అమ్మాయితో బయటకు వస్తున్న ఫోటో సమీరకు మెసేజ్ గా వస్తుంది.
ఇంతలో ఒక అపరిచిత యువతి సమీరతో మాట్లాడాలని వస్తుంది.
తను ఎదురింటి షాలిని స్నేహితురాలినని చెబుతుంది.
ఇక చదవండి…
చనువుగా ఇంట్లోకి వచ్చి, తలుపు గడియ పెట్టడమే కాకుండా తననే కూర్చోమని చెబుతున్న ఆ యువతి వంక ఆశ్యర్యంగా చూసింది సమీర.
"సారీ అండీ! మిమ్మల్ని కూర్చోమని కూడా చెప్పలేదు" తను కూడా ఆమె పక్కనే సోఫాలో కూర్చుంటూ అంది సమీర.
"పరవాలేదండీ! ఇంతకీ నన్ను గుర్తు పట్టారా?" అడిగిందామె.
"లేదండీ..." ఆలోచిస్తూనే చెప్పింది సమీర.
"అదేమిటి? నేను, గౌతమ్ కలిసి వున్న ఫోటో మీకు ఈ పాటికే వచ్చి ఉండాలి కదా.." అంది ఆ యువతి.
అప్పుడు అనుమానం వచ్చి, ఇందాక తనకు వచ్చిన ఫోటోను పరిశీలనగా చూసింది సమీర.
రెస్టారెంట్ లో గౌతమ్ తో ఉన్నది ఈ అమ్మాయే.
"మీ ఊహ కరెక్టే. ఆ ఫొటోలో ఉన్నది నేనే. గౌతమ్ తో షేర్ చేసుకున్న కొన్ని విషయాలు మీతో కూడా షేర్ చేసుకోవాలని వచ్చాను" చెప్పింది ఆ యువతి.
'ఏం చెబుతోంది ఈ అమ్మాయి? గౌతంతో ఏం షేర్ చేసుకుంది? తనతో ఏం షేర్ చేసుకోబోతోంది? గౌతమ్ ను షేర్ చెయ్యమని అడుగుతుందా?...' ఆ ఊహ రాగానే సమీర ముఖ కవళికలు మారాయి. అది గమనించింది ఆ అమ్మాయి.
"అన్నట్లు నా పేరు స్నేహ" నవ్వుతూ చెయ్యి చాపిందామె
కానీ సమీర తన చేతిని చాపలేదు.
---
అక్కడ విజయవాడలో ...
వియ్యంకుడు మాధవరావు దగ్గర్నుండి ఫోన్ వస్తుంది గౌతమ్ తండ్రి శ్రీరామ్మూర్తికి.
"నమస్కారం బావగారూ! ఎలా వున్నారు ? చెల్లెమ్మ బాగున్నారు కదా.." కుశల ప్రశ్నలు వేసాడు శ్రీరామ్మూర్తి.
" అంతా క్షేమమే. మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలని ఫోన్ చేసాను.." చెప్పడానికి తటపటాయిస్తున్నాడు మాధవరావు.
ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్మూర్తి.
విషయం ఏమై ఉంటుంది?
పిల్లల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా?
తమకు తెలిసినంతవరకు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం.
అతడలా ఆలోచిస్తున్నంతలో మాధవరావు మాట్లాడుతూ "నాకు ఒక ఫోటో మెసేజ్ గా వచ్చింది. దాన్ని మీకు పంపిస్తున్నాను. ఒకసారి చూడండి. నేను మీకు ఓ పది నిముషాలు ఆగాక కాల్ చేస్తాను" అంటూ ఫోన్ పెట్టేసాడు.
అతడు ఫోన్ పెట్టేసిన కాస్సేపటికి ఒక మెసేజ్ వచ్చింది శ్రీరామ్మూర్తికి.
అది ఒక రెస్టారెంట్ లో గౌతమ్, స్నేహతో కలిసి ఉన్న ఫోటో.
చిన్నగా నవ్వుకున్నాడు శ్రీరామ్మూర్తి.
వెంటనే మాధవరావుకు కాల్ చేసాడు.
"చూడండి బావ గారూ..." అంటూ అతడేదో చెప్పబోయేంతలో ముందు నేను చెప్పేది మీరు వినండి" అన్నాడు మాధవరావు.
"చెప్పండి.." అన్నాడు శ్రీరామ్మూర్తి.
గౌతమ్ మీకు అబ్బాయి.
కాబట్టి అతని మీద మీకు అనుమానం రాదు.ఇలాంటి ఫోటోలు మరో పది వస్తే మీకు ఒక శాతం అనుమానం వస్తుందేమో.
కానీ మరో వంద ఫోటోలు వచ్చినా మేము గౌతమ్ ను ఎంతమాత్రం అనుమానించం.
అయితే ఇక్కడ సమస్య అది కాదు.
ఆ ఫోటోలు ఎవరు పంపిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి.
సరదా కోసం ఎవరూ పంపరు కదా…
వీళ్ళను విడదీయాలని ఎవరో చూస్తున్నారు.
వాళ్లెవరో తెలుసుకోవాలి.
మనం ఫోటోలను పట్టించుకోకుంటే వాళ్ళు మరో రకంగా వీళ్లకు హాని చేయాలని చూస్తారు.
నా ఊహ నిజమైతే మా అమ్మాయి గురించి మీకు కూడా ఏవైనా ఫోటోలు వచ్చి ఉంటాయి.
మీరు పెద్ద మనసుతో వాటిని పట్టించుకొని ఉండరు" అన్నాడు మాధవరావు.
"నిజమే బావగారూ! అమ్మాయి, ఎదురింటి అబ్బాయితో మాట్లాడుతున్న ఫోటో వచ్చింది. 'అందులో తప్పేముంది?' అనుకున్నానే గానీ ఇలా ఫోటోలు పంపించాల్సిన అవసరం ఎవరికుంది అని మీలా ఆలోచించలేదు. ఎంతైనా రిటైర్డ్ IPS ఆఫీసర్ కదా మీరు" అన్నాడు శ్రీరామ్మూర్తి..
అటు వైపు నుండి చెప్పడం ప్రారంభించాడు మాధవరావు.
"బావగారూ! విషయం కాస్త శ్రద్దగా వినండి. ఫోటో నాకు వచ్చిన వెంటనే ఆ అపార్ట్మెంట్ సెక్రెటరీ కి ఫోన్ చేసాను, మా వాళ్ళు ఎలా ఉన్నారంటూ.. అతను నాకు తెలిసిన వ్యక్తే.. వీళ్ళ ఎదురు అపార్ట్మెంట్ లో ఉన్న ప్రమోద్ అనే అబ్బాయికి ఆక్సిడెంట్ అయిందట.
ఆ విషయంగా పోలీసులు ఆయనకు కాల్ చేసి, గౌతమ్ ఎలాంటి వాడు అని ఆరా తీసారట.
ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ పోలీసుల్లో నాకు తెలిసిన వాళ్ళను కాంటాక్ట్ చేసాను. వాళ్ళు కూడా ఫోటోలు పంపిన వాళ్లనే అనుమానించాలని అనుకుంటున్నారట.
గౌతమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది.ఆ ప్రమోద్ అనే అబ్బాయి భార్య ఇంకా హాస్పిటల్ లోనే వుంది.
ముందుగా సమీరకి కాల్ చేసి, తరువాత ఏం చెయ్యాలో డిసైడ్ చేద్దాం"
చెప్పడం ముగించాడు మాధవరావు.
***
తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాచిన స్నేహ వంక కాస్త తటపటాయింపుగా చూసింది సమీర.
అది గమనించిన స్నేహ " నువ్వు గౌతమ్ ను అనుమానించడం లేదు.ఎక్కడ అతను దూరం అవుతాడో అని భయ పడుతున్నావు. కానీ నేను ప్రేమించిన సందీప్ కు దూరం అయ్యేలా చేశారు కొందరు" కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది .
"అలా ఎవరూ చేశారు? " స్నేహతో చెయ్యి కలుపుతూ ఆశ్చర్యంగా అడిగింది సమీర.
"మీ పక్క పోర్షన్ జయా ఆంటీ వాళ్లే అని అనుమానంగా ఉంది" చెప్పింది స్నేహ.
నమ్మలేనట్లు చూసింది సమీర.
మొత్తం విషయాలు చెప్పనారంభించింది స్నేహ.
స్నేహ, సందీప్ లు గాఢంగా ప్రేమించుకున్నారు. సందీప్ తండ్రి కోటీశ్వరుడు.
సందీప్ పెళ్లి, తోటి బిజినెస్ మాన్ తో జరిపించాలని అతని కోరిక.
ఎమ్ ఎస్ చెయ్యడం కోసం అమెరికా వెళ్ళాడు సందీప్.
అతను వచ్చేలోగా స్నేహ మీద ద్వేషం పెరిగేలా చెయ్యాలనుకున్నాడు.
అప్పుడే అతనికి జయా ఆంటీ గ్యాంగ్ గురించి తెలిసింది.
సిటీలో హై టెక్ వ్యభిచారం చేయించే ముఠా వాళ్ళది.
భార్యా భర్తల మధ్య వుండే చిన్నపాటి విభేదాలను ఆసరాగా తీసుకొని ఆడవాళ్ళను రెచ్చగొడతారు. వాళ్లకు సహాయం చేస్తున్న నెపంతో తమ గ్రిప్ లోకి తెచ్చుకుంటారు.
వేరే మగ వాళ్ళతో పరిచయం కల్పిస్తారు.
ఎక్కడా వాళ్ళు బలవంతం చేసినట్లు అనిపించదు.
అంతా భర్తతో విడిపోయిన ఆడవాళ్లను ఆదరించినట్లుగానే ఉంటుంది వాళ్ళ వ్యవహారం.
ఈ క్రమంలో కొన్ని ఫోటోలు తీస్తుంటారు వాళ్ళు.
ఈ రోజుల్లో సిటీల్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు, అవసరాన్నిబట్టి కొలీగ్స్ తో కలిసి రెస్టారెంట్ లకు వెళ్లాల్సి వస్తుంది.
అయితే ఆ సందర్భాల్లో ఫోటో తీసి భర్తకు పంపితే అనుమానం మొదలవుతుంది.
అలాగే భర్తల గురించి భార్యల్లో అనుమానం పుట్టిస్తారు.
సందీప్ కు స్నేహ పైన అనుమానం కలిగించే బాధ్యతను జయా ఆంటీ గ్యాంగ్ కు అప్పగించాడు సందీప్ తండ్రి. అందుకోసం భారీ మొత్తమే ఆశ చూపి ఉంటాడు.
స్నేహ, ప్రమోద్ లు ఒకే ఆఫీస్ లో పని చేస్తుంటారు.
ఇద్దరూ మంచి స్నేహితుల్లా వుంటారు.
సందీప్ తో తన ప్రేమ విషయం ప్రమోద్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది స్నేహ.
ఆమె మీద నిఘా పెట్టిన జయా గ్యాంగ్ ప్రమోద్, స్నేహలు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను వక్రీకరించి సందీప్ కు పంపారు.
దాంతో సందీప్ లో అనుమానం కలిగింది. స్నేహ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు అతను. మెసేజ్ లకు రెస్పాండ్ కావడం లేదు.
తను యూ ఎస్ లో ఉండడం తో డైరెక్ట్ గా కలిసి మాట్లాడే అవకాశం లేదు స్నేహకు.
స్నేహ, ఆమె కజిన్ వినీత్ లు గౌతమ్ కు టెన్త్ లో క్లాస్ మేట్స్.
అనుకోకుండా గౌతమ్ ను కలిసాడు వినీత్ .
గౌతమ్, ప్రమోద్, జయా ఆంటీ లు ఒకే చోట ఉంటున్నట్లు తెలుసుకున్నాడు.
స్నేహ పరిస్థితి చెప్పి సహాయం అడిగాడు.
స్నేహను రెస్టారెంట్ కు తీసుకొని వెళ్లి ఓదారుస్తాడు గౌతమ్.
తన విషయం చూసుకుంటానని భరోసా ఇస్తాడు.
ప్రమోద్ తో సమీర మాట్లాడుతున్న ఫోటో తనకు రావడంతో, జయా ఆంటీని అనుమానిస్తాడు గౌతమ్.
తాను ఇంటికి రావడం లేదని సమీరతో చెప్పమని ప్రమోద్ ను అడుగుతాడు.
మరి కాస్సేపటికి ప్రమోద్ సమీరకు బొకే ఇస్తున్న ఫోటో వస్తుందతనికి.
మొదటి ఫోటో వల్ల తనకు ప్రమోద్ పైన తనకు కోపంరాలేదని తెలిసి, వెంటనే రెండో ఫోటో పంపినట్లు గ్రహించాడు గౌతమ్.
ప్రమోద్ తో మాట్లాడాలని నిర్ణయించుకొని, తనని రమ్మని చెబుతాడు.
వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటే తమ విషయాలు బయటకు వస్తాయని, ప్రమోద్ కు ఆక్సిడెంట్ చేయిస్తారు. ఆ నేరం గౌతమ్ మీదకు వెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు...."
ఇంకా చెబుతూ ఉన్న స్నేహకు అడ్డు వస్తుంది సమీర.
"ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రమోద్ కు ఆక్సిడెంట్ అయిందా? గౌతమ్ ఇప్పుడెక్కడ ఉన్నాడు? తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమిటి?..." ఆందోళనతో అడిగింది.
మీరు జయా ఆంటీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రమోద్ మీతో మాట్లాడాడు కదా. తరువాత గౌతమ్ ను కలవడానికి మా దగ్గరకు బయలుదేరాడు.
అప్పుడే అతనికి ఆక్సిడెంట్ అయింది.
అతని కాల్ లిస్ట్ లో పైనే గౌతమ్ నంబర్ ఉండటంతో పోలీసులు అతనికి కాల్ చేశారు.
హాస్పిటల్ లో షాలిని ని కలిసాడు గౌతమ్.
ఆమెకు కూడా నువ్వు, ప్రమోద్ తో కలిసి ఉన్న ఫోటో పంపారు.
ప్రమోద్ మీద అనుమానంతో గౌతమ్ ఈ ఆక్సిడెంట్ చేయించాడని చెప్పారట. పోలీసులతో గౌతమ్ మీద అనుమానం ఉన్నట్లు చెప్పమన్నారట." చెప్పింది సమీర.
" మై గాడ్! ఇంత కుట్ర జరుగుతోందా..ఆ జయా ఆంటీ సంగతి ఇప్పుడే తేలుస్తాను.." ఆవేశంతో ఊగిపోతున్న సమీరను వారించింది స్నేహ.
(ఇంకా వుంది.... )
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8 అతి త్వరలో…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
.
Comments