కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu' Telugu Web Series Part - 1 Written By Srivari Kattu Kathalu' Telugu Web Series Part - 1
రచన : మల్లవరపు సీతారాం కుమార్
రిమోట్ తో టీవీ చానల్స్ వరుసగా మారుస్తోంది సమీర. ఏ ఛానల్ నూ రెండు నిమిషాలకు మించి చూడలేక పోతోంది. అసహనంతో రిమోట్ ను సోఫా లోకి విసిరికొట్టింది. ఒకసారి వాల్ క్లాక్ వంక చూసింది. సమయం ఈవెనింగ్ 4:30 కావస్తోంది. గౌతం రావడానికి ఇంకా అరగంట టైం ఉంది. మొబైల్ చేతిలోకి తీసుకుని 'గౌతమ్! స్టార్ట్ అయ్యావా?' అని మెసేజ్ చేసింది.
'స్టార్ట్ అయ్యాను సమీరా. అరగంటలో నీ ముందు ఉంటాను' అంటూ వెంటనే రిప్లై ఇచ్చాడు గౌతమ్.
‘నేను వచ్చేసరికి రెడీగా ఉండు. ఇద్దరం కలిసి ఐమాక్స్ లో మూవీ కి వెళదాం’ తిరిగి అతనే మెసేజ్ చేశాడు.
'నో గౌతమ్. ఐ వాంట్ టు స్పెండ్ దిస్ ఈవెనింగ్ విత్ యు ఇన్ అవర్ బెడ్ రూమ్' అని టైపు చేసి ఒక్క క్షణం ఆగింది.
'పాపం...డ్రైవింగ్ లో ఉంటాడు. ఎందుకు అతని మూడ్ డైవర్ట్ చెయ్యడం?' అనుకొని ఆ మెసేజ్ తీసేసి, ‘లవ్ యు గౌతమ్’ అని పంపింది.
'గౌతమ్ వచ్చేలోగా ఫ్రెష్ అప్ అయి ఉండాలి' అనుకుంటూ హుషారుగా టవల్ తీసుకొని బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
బట్టలు ఒకటొకటిగా తీస్తూ అద్దంలో తనను తాను చూసుకొని మురిసి పోతోంది సమీర.
' గౌతమ్... యు అర్ సో లక్కీ. ఇంత అందగత్తెను భార్యగా పొందావు' అనుకుంటూ స్నానం ముగించింది.
టవల్ చుట్టుకొని అలాగే బెడ్ రూమ్ లోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలుచుంది. అద్దంలో మరోసారి తన అందాలను చూసుకుంది. గౌతమ్ డోర్ బెల్ నొక్కగానే ఇలాగే వెళ్లి తలుపు తీస్తే... అనే చిలిపి ఆలోచన వచ్చింది సమీర కు.
'అమ్మో! ఇంకేమైనా ఉందా... కనీసం బెడ్రూం వరకూ వెళ్లే టైం అయినా ఇస్తాడా ? అయినా అతను బాగా అలసిపోయి వస్తాడు. ఇలా సెక్స్ మేనియాక్ లాగా మీద పడితే బాగుంటుందా.. అతన్ని రిలాక్స్ కానివ్వాలి' అనుకుంది.
వార్డ్ రోబ్ తెరిచి అతనికి ఇష్టమైన బ్లూ కలర్ గాగ్రా చోళీ, రెడ్ కలర్ ఫ్లోరల్ లెహంగా, క్రీమ్ కలర్ దుపట్టా వేసుకుంది.
మరోసారి టైం చూసుకుంది. ఐదు దాటింది.
'ఇదేమిటి? గౌతమ్ ఇంకా రాలేదు...' అనుకుంటూ అతనికి కాల్ చేసింది.
వెంటనే లిఫ్ట్ చేశాడు గౌతమ్ "సారీ డియర్! నేనే చేద్దామనుకుంటున్నాను. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాను. క్లియర్ కావడానికి మరో గంట పడుతుంది అంటున్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ... నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు అని తెలుసు. కానీ ఏం చేయను...?" బాధగా అన్నాడు గౌతం. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది సమీరను. దుపట్టాను దూరంగా విసిరేసి బెడ్ మీదకు వాలిపోయింది.
నిద్రపోవాలని ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. చటుక్కున లేచి బీరువాలో ఉన్న తమ మ్యారేజ్ ఆల్బం బయటకు తీసింది. హాల్ లోకి వచ్చి టీవీ ఆన్ చేసి, ఆల్బమ్ పేజీలు తిప్పుతూ మధ్య మధ్యలో టీవీ చూస్తోంది. ఆల్బమ్ చూస్తూనే తమ పెళ్లి తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళింది సమీర.
గౌతమ్ సమీరలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. గౌతం హైదరాబాదులో, సమీర బెంగళూరులో పనిచేస్తుంటారు. తన స్నేహితుడి పెళ్లి కోసం బెంగళూరు వెళ్ళిన గౌతమ్ కు సమీర తో పరిచయం ఏర్పడుతుంది . ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. దాంతో ఆ పరిచయం ప్రేమగా మారింది. వాళ్ళ ప్రేమకు ఇరువైపుల పెద్దలూ అంగీకారం తెలిపారు.
సమీర పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి హైదరాబాదులో బ్రాంచి లేదు. ఓ ఆరు నెలల్లో హైదరాబాద్ బ్రాంచ్ ప్రారంభించబోతున్నారు. కానీ అంతవరకూ గౌతమ్ ను విడిచిపెట్టడానికి ఇష్టం లేని సమీర, తన ఉద్యోగానికి రిజైన్ చేసింది. నెమ్మదిగా హైదరాబాదులో వేరే ఉద్యోగం చూసుకుంటాననీ, అంతవరకూ హౌస్ వైఫ్ గా ఉంటాననీ గౌతమ్ తో చెప్పింది. సరిగ్గా పది రోజుల క్రితమే వాళ్ల పెళ్లి సమీర స్వస్థలం విజయవాడలో వైభవంగా జరిగింది. ఇద్దరి పేరెంట్స్ హైదరాబాద్ వచ్చి కొత్త జంట కు కావలసిన వసతులు ఏర్పాటు చేసి, ఉదయాన్నే వెళ్లిపోయారు.
సో.. కొత్త కాపురం పెట్టాక ఇద్దరికీ ఏకాంతం దొరికిన మొదటి రోజు ఇదే కావడంతో సమీర చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అఫ్ కోర్స్ మూడు నిద్రలు విజయవాడలో జరిగాయి కానీ... పూర్తి స్వేచ్ఛగా, ఏకాంతంగా తామిద్దరం గడప బోయేది ఈ రోజే . నిన్నటితో గౌతమ్ లీవ్ ముగిసింది.
ఈ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టమని గౌతమ్ ను బ్రతిమలాడింది సమీర.
బాస్ ఒప్పుకోలేదని చెప్పాడు గౌతమ్. సమీర అలా ఆలోచనల్లో ఉండగానే మరో అరగంట గడిచింది. మరోసారి గౌతమ్ కు కాల్ చేసింది సమీర.
" ట్రాఫిక్ ఇంకా క్లియర్ కాలేదు.మరో గంట పట్టొచ్చని చెబుతున్నారు. ఇంటికి వచ్చాక నీకు వెయ్యి మార్లు సారీ చెప్పుకుంటాను. నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే” అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతుండగానే ఫోన్ కట్ చేసింది. సోఫాలోనే పక్కకు వాలి పడుకుని చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతలో ఎదురు అపార్ట్మెంట్ డోర్ తీసిన శబ్దం వినిపించింది. ఒక్క క్షణం ఆలోచించింది సమీర. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి పేరు ప్రమోద్. అతని ఆఫీస్ కూడా హైటెక్ సిటీ లో గౌతం వాళ్ళ ఆఫీస్ కు దగ్గర్లోనే ఉంది. అతని భార్య పేరు షాలిని. మొన్ననే వాళ్ళిద్దర్నీ టీ కి పిలిచి, పరిచయం చేసాడు గౌతమ్.
అతను వచ్చాడంటే ట్రాఫిక్ క్లియర్ అయిందన్న మాట. అతన్ని కనుక్కోవాలి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఒక్క ఉదుటున వెళ్లి డోర్ తీసింది. అప్పటికే అతను లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటున్నాడు.
సమీర గబగబా అతని అపార్ట్మెంట్ డోర్ దగ్గరకు వెళ్లి "ఎక్స్క్యూజ్ మీ'" అని పిలిచింది.
అతను డోర్ తెరిచి సమీర వంక ఆశ్చర్యంగా చూసాడు.
వేగంగా పరుగెత్తుకొని రావడం వల్ల, ఆమె ఊపిరికనుగుణంగా ఆమె ఎద కదులుతోంది. దుపట్టా లేకపోవడంతో అతని దృష్టి చోళీ వెనకున్న ఆ కదలికల వైపే నిలిచింది.
అదేమీ గమనించని సమీర "ట్రాఫిక్ క్లియర్ అయిందా?" అని అడిగింది.
ఆమె అడిగిందేమిటో అతనికి అర్థం కాలేదు.ఒకవేళ తన చూపులు గమనించి అలా అందా? ఏమీ అర్థం కాక, చూపులు ఆమె ముఖం వైపు తిప్పి, "సారీ! అన్నాడు.
"సారీ చెబుతున్నారా! ఎందుకండీ ?' ఆశ్చర్యంగా అడిగింది సమీర.
ఏం చెప్పాలో తెలీలేదు ప్రమోద్ కి.
"అదే...మీరు అడిగింది సరిగ్గా వినలేదు. అందుకని..." అన్నాడు.
"ట్రాఫిక్ క్లియర్ అయిందా? అని అడిగాను" మళ్ళీ చెప్పింది సమీర.
"అదే అర్థం కావడం లేదు..." అన్నాడు ప్రమోద్.
అప్పుడర్థమయిందామెకు. తన మనసులోని ఆలోచనలు అతనికెలా తెలుస్తాయి?
" మా వారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ట్రాఫిక్ జాం అని చెప్పారు. మీరు కూడా హై టెక్ సిటీ లోనే పనిచేస్తున్నారు కదా. ట్రాఫిక్ క్లియర్ అయిందా ?" అంది సమీర.
విషయం అర్థమయిందతనికి. పాపం భర్త కోసం ఎదురుచూస్తోంది. తాను రాగానే విషయం కనుక్కుందామని పరుగెత్తుకొని వచ్చింది. తనే పొరపాటుగా అసభ్యంగా చూసాడు. నిజానికి అక్కడినుంచి వచ్చే దారిలో ట్రాఫిక్ జాం కాలేదు. గౌతమ్ కి ఏదో ఒక పని తగిలి ఉంటుంది. కానీ ఈ ఆడవాళ్లు ఆ మాత్రానికే చాలా ఫీల్ అయిపోయి గొడవపడతారు.
"నేను అక్కణ్ణుంచి బయలుదేరి చాల సేపు అయింది. వేరే పని చూసుకొని వస్తున్నాను. బహుశా నేను బయలుదేరాక ట్రాఫిక్ జాం అయి ఉండవచ్చు" అన్నాడు లౌక్యంగా.
ఇంతలో లోపల్నుంచి అతని భార్య షాలిని వచ్చింది. గుమ్మం దగ్గర నిలుచొని సమీరతో మాట్లాడుతున్న తన భర్త వంక చూసింది . తరువాత గాగ్రా చోళీలో దుపట్టా లేకుండా తన భర్తతో మాట్లాడుతున్న సమీర వంక పరిశీలనగా, కాస్త అనుమానంగా చూసింది.
అప్రయత్నంగా సమీర చేతులు తన ఛాతీని కప్పుకున్నాయి.
"అయితే మా వారు కూడా వచ్చేస్తూ వుంటారు. థాంక్స్ అండీ!" అని ప్రమోద్ తో చెప్పి, షాలిని వంక చూసి పలకరింపుగా నవ్వింది.
తరువాత తన ఇంట్లోకి వస్తుండగా పక్క పోర్షన్ జయా ఆంటీ తన వంకే కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించింది.
వేగంగా ఇంట్లోకి వచ్చి తలుపు వేసుకుంది సమీర. బెడ్ రూమ్ లోని డ్రెసింగ్ టేబుల్ ముందు నిలుచొని తన ఆహార్యాన్ని పరిశీలనగా చూసుకొంది. చోళీకి పైన దుపట్టా లేకపోవడంతో , తన భారీ అందాలు పైకి పొడుచుకొని వచ్చినట్లుగా తెలుస్తోంది.
అలా తను ప్రమోద్ వద్దకు వెళ్లడం ముమ్మాటికీ పొరపాటే. పైగా అదే సమయానికి అతని భార్య షాలిని కూడా అక్కడకు వచ్చింది.
తను చేసిన పొరపాటుకు చాలా బాధ కలిగిందామెకు.
అసలు దీనికంతటికి కారణం గౌతమ్. అతను లేట్ చెయ్యకుండా వుంటే, ఇదంతా జరిగేది కాదు.
ఇలా ఆమె తనలో తాను మథన పడుతుండగా కాలింగ్ బెల్ మోగింది.
"హమ్మయ్య! గౌతమ్ వచ్చేసాడు' అనుకొని డోర్ తియ్యడానికి బయటకు వెళ్ళబోయి, తమాయించుకుంది.
ఒకసారి గదంతా కలయజూసింది. తను ఇందాక విసిరేసిన దుపట్టా ఓ మూలాన పడుండటం చూసి దాన్ని తీసుకుంది. ఒకసారి ఆ దుపట్టాని విదిలించి, పైన కప్పుకొంది. గౌతమ్ ని చూడగానే కరిగి పోకూడదు అని మొహం సీరియస్ గా పెట్టి తలుపు తీసింది.
ఎదురుగా పక్కింటి జయా ఆంటీ .
"ఆవిడ అదోరకం మనిషిలా అనిపిస్తోంది. కాస్త దూరంగా ఉండు " అని ఊరికి వెళ్లేముందు తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
డోర్ దగ్గరే నిలబడి "ఏం కావాలి ఆంటీ" అని అడిగింది సమీర.
"ఇదేమిటమ్మాయ్ ! లోపలి రానియ్యవా ఏమిటి?" అంటూ ఇంచుమించు సమీరను నెట్టుకుంటూ లోపలి వచ్చింది జయా ఆంటీ.
"అదేం లేదు ఆంటీ. గౌతమ్ వచ్చే టైం అయితేనూ...రండి. కూర్చోండి" అంటూ సోఫా చూపించింది సమీర
సోఫాలో కూర్చుంటూ " అయినా నీ పద్ధతేమీ బాగా లేదమ్మాయ్" అంది జయా ఆంటీ .
"ఏ విషయం లో ఆంటీ? ' అంది సమీర.
సమీరను తన పక్కనే కూర్చోమంది జయా ఆంటీ.
"ఎదురింటి అబ్బాయితో దుపట్టా లేకుండా మాట్లాడతావు. ఈ ఆంటీ తో మాట్లాడేటప్పుడు మాత్రం దుపట్టా కప్పుకున్నావు" అంది ఆమె సమీర వంక పరిశీలనగా చూస్తూ.
"అదేం లేదు ఆంటీ. ఇందాక గౌతమ్ వచ్చాడని తలుపు తీసి ...ట్రాఫిక్ జాం ..." అంటూ ఏదో చెప్పబోయింది సమీర.
"నువ్వేం సంజాయిషీ చెప్పనఖ్ఖర్లేదు. నేను ఆడవాళ్ళందర్నీ నమ్ముతాను. మగవాళ్ళవి మాత్రం పక్క చూపులు, వక్ర బుద్ధులు. ఇందాక చూసావుగా ఆ ఎదిరింటి కుర్రాడు నిన్ను కళ్ళతోనే తినేసేలా చూడటం. అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. నీ అంత నిండైన అందాలు ఈ ఏరియా లో ఎవరికీ లేవు" అంది సమీరను పొగుడుతూ.
సమీర కాస్త మెత్తబడి, "ఆంటీ! మీరు కాఫీ తాగుతారా లేక టీ కావాలా?" అని అడిగింది.
“నీ చేత్తో ఏమిచ్చినా తాగుతాను పిల్లా!” అందామె.
"మీ వారేం చేస్తుంటారు ఆంటీ?" ఆమెకు టీ అందిస్తూ అడిగింది సమీర.
"ఎక్కడున్నాడో , ఏంచేస్తున్నాడో నాకు తెలీదమ్మా" అంది జయా ఆంటీ.
"అంటే అయన మిమ్మల్ని ... వదిలేశారా? ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకండి" వద్దనుకుంటూనే అడిగింది సమీర.
"లేదమ్మా! నేనే ఆయన్ను వదిలేసాను" అంది ఆమె.
"మరి మీరు ఏం చేస్తుంటారు?"
"నాకు కావలసినంత డబ్బుంది. 'జయా మహిళా సంఘం' అని ఒక సంఘం పెట్టాను. మగాళ్ల చేత మోసపోయిన ఆడవాళ్లను చేరదీసి సహాయం చేస్తుంటాను" అంది జయా ఆంటీ.
కానీ తను ఆవిడ గురించి మరోలా వినింది.
కొత్త కదా... ఒక వారం రోజుల్లో అందరి గురించీ తెలిసిపోతుంది.
"ఇంతకీ అబ్బాయి ఇంకా రాలేదేం?" అడిగింది ఆంటీ.
"ట్రాఫిక్ జాం అయిందట' చెప్పింది సమీర.
"మగాళ్లకు వేరే వ్యవహారాలు ఉన్నప్పుడల్లా ఇలా ట్రాఫిక్ జాం అవుతూంటుందిలే" అంది జయా ఆంటీ కాస్త్య వ్యంగంగా.
" గౌతమ్ అబద్ధాలు చెప్పడు ఆంటీ" అంది సమీర నమ్మకంగా.
"కొత్తగా పెళ్ళైన అమ్మాయిలంతా ఇంతే. మొగుడు చెప్పే కాకమ్మ కథలు, సొల్లు కబుర్లు నమ్మేస్తూ ఉంటారు' అంది ఆంటీ.
కాస్త కోపం వచ్చింది సమీరకు.
"ఆంటీ! గౌతమ్ ను మిగతా వాళ్ళతో పోల్చకండి. నాకు కోపం వస్తుంది" అంది.
"నేనూ అంతేనమ్మా! ఒక రోజు ఒకావిడ మా అయన మొదటి భార్యనంటూ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది. కోపంతో జుట్టు పట్టుకొని బయటకు నెట్టేసాను. తరువాత తెలిసింది, ఆవిడ మొదటి భార్య కాదూ, మూడో భార్య అనీ, నా నెంబర్ నాలుగనీ. మా మహిళా సంఘం మీటింగ్ కి ఒకసారి వచ్చి చూడు. ఒక్కొక్కరూ మొగుళ్ళ చేత ఎలా మోసపోయారో..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా సమీర ఆపమని సైగ చేసింది.
"మీరు జుట్టు పట్టుకొని నెట్టేశారేమో . నేను మాత్రం గౌతమ్ ను ఎవరైనా ఏమైనా అంటే పీక పిసికి చంపేస్తాను. మీరు ఇక వెళ్ళవచ్చు." ఆవేశంతో ఊగిపోతూ అంది సమీర.
"చెప్పానుగా. నాకు ఆడవాళ్ళమీద కోపం రాదని. ఏదో ఒకరోజు నువ్వు కూడా మీ శ్రీవారి నిజరూపం తెలుసుకుంటావు. మా సంఘంలో చేరుతావు" అని బయటకు వెళ్ళింది జయా ఆంటీ.
ఆమె వెళ్లగానే విసురుగా డోర్ వేసుకొని సోఫా లో కూలబడింది సమీర. ఆమె మాటల వల్ల కలిగిన ఆవేశం ఒకవైపు, గౌతమ్ ఇంకా రాలేదన్న ఉక్రోషం మరోవైపు ఆమెకు తలనొప్పి తెప్పించాయి. రెండు చేతులతో తలను పట్టుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. ఇంతలో బయట నుంచి జయా ఆంటీ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఏమిటో తెలుసుకోవాలని డోర్ తీసి బయటకు చూసింది. ఇంట్లోకి రాబోతున్న గౌతమ్ ఆపి, ఆవిడ ఏదో మాట్లాడుతోంది. సమీరను చూడగానే ఇంట్లోకి వెళ్లి పోయింది.
గౌతం ఇంట్లోకి వస్తుండగా సమీర డోర్ దగ్గర నిలబడి "నాకు చాలా కోపంగా ఉంది" అంది. "చెప్పానుగా! వంద సార్లు సారీ చెబుతాను" అన్నాడు గౌతమ్.
" అయినా నాకు కోపం తీరదు" అంది సమీర.
పోనీ .. నీ కాళ్ళు పట్టుకోనా?" అన్నాడు గౌతమ్.
ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది సమీర.
చటుక్కున కిందికి వంగి ఆమె కాళ్ళుపట్టుకోబోయాడు గౌతమ్.
అతన్ని ఆపి గట్టిగా హగ్ చేసుకుంది సమీర. ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు.
తనను ఆక్రమించుకోబోతున్న అతన్ని ఆపి, "ముందు ఫ్రెష్ అప్ అవండి. ఈ లోగా మీకు టీ రెడీ చేస్తాను" అంటూ అతన్నుంచి విడిపించుకుంది.
కిచెన్ లోకి వెళ్లి అతని కోసం టీ రెడీ చేసింది.
ఆమె టీ తీసుకొని బెడ్ రూమ్ లోకి వచ్చేటప్పటికి అతను చేతిలో మొబైల్ పట్టుకొని ఏదో చూస్తున్నాడు.
"ఇంకా స్నానానికి వెళ్ళలేదా మహాశయా! ఆలస్యం చేసేకొద్దీ మీకే నష్టం. నాకెందుకో ఈవేళ తొందరగా నిద్ర వస్తోంది" అంది టీ అతనికి అందిస్తూ.
"ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తానన్నాడు. అందుకే వెయిటింగ్" అన్నాడు గౌతమ్.
" ‘ఫోన్ ఏ ఫ్రెండ్’ గా మీ నంబర్ ఇచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారా. బాత్ రూమ్ నుండి వచ్చాక అటెండ్ కావచ్చు. వెళ్ళండి" అంది సమీర.
'అలాగే' అన్నాడు కానీ వెళ్ళలేదు గౌతమ్.
టీ కప్పును కిచెన్ లో ఉంచి తిరిగి వస్తుండగా గౌతమ్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడటం గమనించింది.
" ఇంటికి వచ్చేసాను. ఇక కాల్ చెయ్యకు" అంటూ అతను చెప్పడం వినిపించింది సమీరకు.
సమీర బెడ్ రూమ్ లోకి రాగానే అతను బాత్ రూమ్ లోకి వెళుతూ "నేను స్నానం చేసి వచ్చేసరికి..." అంటూ కొంటెగా కన్ను గిటాడు.
"వచ్చేసరికి??? ఏం చేయాలట?" రెట్టించింది సమీర తను కూడా కన్ను గీటుతూ.
ఆవేశంతో మీదకు రాబోతున్న అతన్ని బాత్ రూమ్ లోకి నెట్టి "ముందు స్నానం చెయ్యండి మహానుభావా" అంది.
అతను వెళ్లిన ఐదు నిముషాలకు అతని ఫోన్ మోగింది.
డిస్ప్లే లో బాస్ కాలింగ్ అని వస్తోంది.
బాత్ రూమ్ తలుపు తట్టి "మీ బాస్ నుంచి ఫోన్ . ఇవ్వనా?" అని అడిగింది.
"వద్దులే. నేను బయటకు వచ్చాక కాల్ చేస్తాను" అన్నాడు గౌతమ్.
మరి కాస్సేపటికి సమీర ఫోన్ రింగ్ అయింది.
లిఫ్ట్ చేసి "ఎవరూ?" అని అడిగింది.
"ఐ యామ్ మోహిత. మీ వారి టీం లీడ్ ను. మీ మ్యారేజ్ కి కూడా వచ్చాను" అందామె.
" మోహిత గారా! బాగా గుర్తున్నారు. పేరుకు తగ్గట్లే సమ్మోహితం చేసే రూపం మీది" అంది సమీర.
"బిస్కెట్ వెయ్యడంలో గౌతమ్ ను మించిపోయినట్లున్నారు మీరు. బట్ ఐ యామ్ సారీ . లీవ్ ఎక్సటెన్షన్ ఈ రోజుకు మాత్రమే ఓకే అయింది. గౌతమ్ రేపటినుండి ఆఫీస్ కు రావలసిందే. తను ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. మీ నంబర్ మా రికార్డ్స్ లో ఉంది.అందుకే మీకు కాల్ చేశాను. నేను మా తాతగారి విలేజ్ కి వెళ్తున్నాను. దార్లో సిగ్నల్స్ దొరక్క పోవచ్చు. మీరే గౌతమ్ కు చెప్పండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది మోహిత.
మైండ్ బ్లాక్ అయింది సమీరకి. కాళ్ళ కింద నేల కంపిస్తున్నట్లు అనిపించింది.
అసలు మోహిత ఏం చెప్పింది? గౌతమ్ ఈ రోజు లీవ్ లో ఉన్నాడా!
మొగుళ్ళు భార్యలతో కాకమ్మ కథలు చెబుతారంటూ జయా ఆంటీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి సమీరకు.
త్వరలో…. శ్రీవారి కట్టు కథలు పార్ట్ - 2
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comentarios