top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






'Srivari Kattu Kathalu Episode - 4' Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

గత ఎపిసోడ్ లో...

అనుకోకుండా జయా ఆంటీ అపార్ట్మెంట్ లోకి వెళుతుంది సమీర. అక్కడ ఆమె బెడ్ రూమ్ లో వుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడికి వస్తాడు. భయపడుతుంది సమీర.

ఇక చదవండి...



పొద్దున్నే కాఫీ తాగి వరండాలో ఈజీ చైర్ లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు శ్రీరామమూర్తి. హాల్లో ఛార్జింగ్ లో ఉన్న అతని ఫోన్ మోగడంతో పేపర్ పక్కన పెట్టి, పైకి లేవ బోయాడు. బయట మొక్కలకు నీళ్లు పడుతున్న అతని భార్య జానకీ దేవి, "మీరు ఉండండి. నేను వెళ్లి ఫోన్ తీసుకొని వస్తాను. మన అబ్బాయి గౌతమ్ చేసి ఉంటాడు" అంది.

"వద్దులే. నీ పని కానివ్వు. నేనే లేస్తాను" అంటూ హాల్ లోకి వెళ్లి ఫోన్ తీశాడు శ్రీరామ్మూర్తి.

తన మరదలు ప్రసన్న ఫోన్ చేస్తోంది.

ఫోన్ లిఫ్ట్ చేసి "చిత్రంగా ఉందే! ఇదే మొదటిసారి అనుకుంటా నువ్వు నా నెంబర్ కు కాల్ చేయడం" అన్నాడు నవ్వుతూ.

"అదేం లేదు బావగారూ! అంతా బాగున్నారు కదూ. ఇక్కడ హైదరాబాద్ లో మా ఆడబడుచు కూతురి సీమంతం ఉంది కదా. అందు కోసం మొన్ననే ఇక్కడికి వచ్చాము. మీరు మొన్నే ఇక్కడ్నుంచి రిటర్న్ అయ్యారట కదా.అక్కయ్య చెప్పింది" అంది ప్రసన్న.

తరువాత కాసేపు కుశల ప్రశ్నలు వేసింది.

"మీ అక్కయ్య తోట పనిలో ఉంది.ఫోన్ తనకి ఇవ్వనా లేక ఓ పది నిముషాలు ఆగి చేస్తావా?" అని అడిగాడు శ్రీరామ్మూర్తి.

"ఫోన్ ఎక్కడినుండి అండీ? అబ్బాయి దగ్గర్నుండేనా?" అడిగింది జానకీ దేవి.

“కాదు జానకీ! మీ చెల్లాయి ప్రసన్న చేసింది" చెప్పాడు అతను.

"వస్తున్నాను. లైన్ లో ఉండమనండి" అంటూ చేతులు, కాళ్ళు కడుక్కొని, అతని దగ్గరకు వచ్చి ఫోన్ అందుకుంది జానకీ దేవి.

"నీ నంబర్ కి కాల్ చేస్తే తియ్యలేదు. అందుకని బావకి చేశాను' అటు వైపు నుండి చెప్పింది ప్రసన్న.

"ఫోన్ బెడ్ రూమ్ లో ఉంది. నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. విషయాలు చెప్పు. అక్కడ సీమంతం బాగా జరిగిందా?" అడిగింది జానకీ దేవి.

"బాగానే జరిగింది గానీ కాస్త గదిలోకి రాకూడదూ! ఒక విషయం చెప్పాలి. అలాగని మరీ గాబరా పడే విషయం కాదు. బావ పక్కనుండగా ఎందుకనీ..." అంది ప్రసన్న.

“మీరు పేపర్ చదవడం కానివ్వండి. ఈ లోగా నేను ఫోన్ మాట్లాడి, టిఫిన్ రెడీ చేసి తీసుకుని వస్తాను” అంటూ బెడ్ రూం లోకి వెళ్ళింది జానకీదేవి.

ఆశ్చర్యంగా చూశాడు శ్రీరామమూర్తి. వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు ఉండవు. ఎవరికి ఫోన్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి అవతలివాళ్లు వినేలా ఉంచుతారు. ఇప్పుడేమిటిలా?.. అని ఆశ్చర్యపోతూ భార్య చెప్పినట్లే తిరిగి పేపర్ అందుకున్నాడు అతను.

ఫోన్ తీసుకొని బెడ్ రూం లోకి వెళ్లి మంచం పైన కూర్చుని, “ఇప్పుడు చెప్పవే ప్రసన్నా! ఏమిటి విషయం?? అని అడిగింది జానకీదేవి.

“చెప్తానక్కా! కానీ నువ్వు మరోలా అనుకోకూడదు. బావ పక్కన లేడుగా…” అన్న ప్రసన్న మాటలకు జానకీదేవి లో ఆతృత పెరిగింది.

“ఆయన వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారులే. ఆట్టే నాన్చక విషయం తొందరగా చెప్పు” అంటూ చెల్లెల్ని తొందర పెట్టింది.

“ముందే చెప్తున్నాను అక్కయ్యా! నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు తెలిసిన విషయం మీ దగ్గర దాచలేను. అందుకే చెబుతున్నా. మా ఆడపడుచు కూతురి సీమంతానికి హైదరాబాద్ వచ్చాను కదా. నిన్న మా ఆడపడుచుతో కలిసి సరదాగా ఒక రెస్టారెంట్ కు వచ్చాను.

అక్కడ టిఫిన్ చేస్తూ ఉండగా మా ఆడపడుచు, కాస్త దూరంగా కూర్చుని ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తూ 'అతను మీ అక్కయ్య కొడుకు గౌతం కదూ' అంది. ఆ కుర్రాడు అటువైపు తిరిగి కూర్చుని ఉన్నాడు. ముఖం పూర్తిగా కనపడటం లేదు. వెంటనే అటు వైపు చూశాను. ఆ అబ్బాయి మన గౌతమే. కానీ అతని పక్కన మరెవరో అమ్మాయి కూర్చొని ఉంది. మా ఆడపడుచు, గౌతం పెళ్లికి వచ్చింది కదా! కాబట్టి సులభంగానే గుర్తు పట్టింది. గౌతంని పిలుద్దాం అని అనుకున్నాను. కానీ ఎందుకులే అని ఊరుకున్నాను. ఇంతలో గౌతం మమ్మల్ని చూశాడు కాబోలు.. ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని, ఆ అమ్మాయితో కలిసి హడావిడిగా బయటకు వెళ్లిపోయాడు” అని చెప్పింది ప్రసన్న.

విషయం అంతా విని చిన్నగా నవ్వింది జానకీ దేవి. “ఇందులో విచిత్రమేముందే ప్రసన్నా! ఈ రోజుల్లో.. అందునా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఫ్రీగా కలిసి మెలిసి తిరుగుతూ ఉంటారు. పట్టపగలు రెస్టారెంట్ లో కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అయినా మన గౌతమ్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అప్పుడే పిలిచి పలకరించి ఉంటే విషయం మీకే అర్థమయ్యేది” అంది.

నిజమే అక్కా! నేనేమీ గౌతమ్ ని అనుమానించ లేదు. నా కంట్లో పడ్డ విషయం నీకు చెప్పాలి కాబట్టి ఫోన్ చేశాను. అంతే! ఈ విషయం బావతో చెప్పవద్దు. నేను చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నానని బావ అనుకుంటాడు” అంది ప్రసన్న.

“అలాగే!” అంటూ ఫోన్ పెట్టేసి బయటకు వచ్చింది జానకీ దేవి.

“ఏమిటోయ్ అంత రహస్యం?” అని అడిగాడు శ్రీరామమూర్తి.

“రహస్యమని మీరే అంటున్నారుగా! మరి ఎలా చెప్పమంటారు? అంది జానకీదేవి.

“మీ దగ్గర ఏదీ దాచను అంటూ గొప్పలు చెబుతూ ఉంటావుగా. అందుకని అడిగాను. అంతే! నువ్వేం చెప్పనక్కర్లేదులే” నిష్ఠూరం నటిస్తూ అన్నాడు శ్రీరామమూర్తి.

“మీకు చెప్పకుండా ఎలా ఉంటానండీ? విషయం ఏమిటంటే మన అబ్బాయి గౌతమ్ మరో అమ్మాయితో ఒక హోటల్ రూమ్ లో మా వాళ్లకు కనిపించాడట” అని చెప్పింది.

“అవునా! ఏదైనా మీటింగ్ లేదా కాన్ఫరెన్స్.. హోటల్ రూమ్ లో అరేంజ్ చేసి ఉంటారు” సింపుల్ గా చెప్పాడు శ్రీరామమూర్తి.

“అందుకే మీకు చెప్పలేదు. హోటల్ రూమ్ లో అమ్మాయితో కనిపించినా తప్పుగా ఆలోచించరు మీరు. ఇక 'రెస్టారెంట్లో ఒక అమ్మాయి తో కలిసి టిఫిన్ చేస్తున్నాడు' అనే విషయం ఒక కంప్లైంట్ లా ఎలా చెప్పను?” అంది జానకీదేవి.

“విషయం అర్థమైందిలే! కొత్తగా పెళ్లి అయిన వాడు కదా! ఈ మధ్య ఆఫీస్ స్టాఫ్ అందరికీ ట్రీట్ ఇచ్చి ఉంటాడు. ఆరోజు మిస్సయిన వాళ్లకు విడివిడిగా ఇస్తూ ఉండవచ్చు. అదీ విషయం” విషయాన్ని తన దివ్యదృష్టితో చూసినట్లుగా చెప్పాడు శ్రీరామమూర్తి.

“ఎంత నమ్మకం అండీ మీకు మీ కొడుకు మీద?" అంది జానకీదేవి.

“అది వాడి మీద నమ్మకం కాదే. మన పెంపకం మీద నమ్మకం” నమ్మకంగా చెప్పాడు శ్రీరామమూర్తి.

***


గది బయట నిలుచుని ఉన్న యువకుడి వంక భయంగా చూస్తోంది సమీర. ఇంతలో జయా ఆంటీ అక్కడికి వచ్చింది. ఆమెను చూసాక కాస్త ధైర్యం వచ్చి, ఊపిరి పీల్చుకుంది సమీర.

ఆ కుర్రవాణ్ణి భుజం పట్టుకుని, గదిలోకి తీసుకొని వస్తుంది జయా ఆంటీ.

“భయపడ్డావా సమీరా? చెప్పానుగా.. నా గురించి నీకు ఎవరో చాలా చెడ్డగా చెప్పారు. ఈ అబ్బాయి నా చెల్లెలి కొడుకు. పేరు ప్రవీణ్. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. కార్పొరేటర్ గారితో చెప్పి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగాలనుకున్నాను. అందుకే ఈ అబ్బాయిని రమ్మని ఫోన్ చేశాను. సమయానికి వచ్చాడు కదా. ఇక ఆ నిచ్చెన ఎక్కే పని నీకెందుకు అని ఇక్కడికి పంపించాను. నువ్వు కంగారు పడి కేకలు పెడతావేమో అని నేను వెంటనే వచ్చాను” అని చెప్పింది జయా ఆంటీ.

ఇంతలో హాల్లోంచి కార్పొరేటర్ ‘జయా.. జయా..’ అంటూ మళ్లీ పిలిచాడు.

“ఇదిగో చూశావుగా.. నేను వెళ్లకపోతే ఆయన ఇక్కడకు వచ్చేస్తాడు. నువ్వు ఆయన కంట్లో పడడం మంచిది కాదు. నువ్వు ఇక్కడే ఉండు. ఆ అబ్బాయి నిచ్చెన ఎక్కి ఆ బ్యానర్ తీసుకొని వచ్చేస్తాడు. ఈలోగా నువ్వు భయపడి కేకలు పెట్టవద్దు” అని చెప్పి ఆ గది తలుపులు దగ్గరకు మూసి, హాల్ లోకి వెళ్లి పోయింది జయా ఆంటీ.

ఏం చేయాలో పాలు పోలేదు సమీరకు. జయా ఆంటీ చెప్పినట్లు అపరిచితుడితో ఒక గదిలో ఒంటరిగా ఉండటం ఆమెకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు.

‘ఏమైతే అది జరుగుతుంది. తను వెంటనే తన అపార్ట్మెంట్ కి వెళ్లి పోవాలి’ అనుకొని ఆ గది తలుపు తెరవబోయింది సమీర.

నిచ్చెన పైకి ఎక్కబోతున్న ఆ యువకుడు ఒక్కసారిగా కిందకు దూకి, డోర్ పూర్తిగా మూసి, అడ్డంగా నిలబడ్డాడు.

"అడ్డులే" అని గట్టిగా అరవబోయింది సమీర.

కానీ భయంతో ఆమె అరుపు బయటకు రాలేదు.

***

కార్లో ఇంటికి వస్తున్నాడు గౌతమ్..

ఒక కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది.

"భార్యను గాలికి వదిలేసి నీ పాటికి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా?" అడిగాడు అవతలి వ్యక్తి.

కారును రోడ్ పక్కన ఆపి, "ఎవరు నువ్వు?" అని ఆవేశంగా అడిగాడు గౌతమ్.

"శత్రువునైతే కాదు. భార్యను మరీ గుడ్డిగా నమ్మొద్దని చెప్పడానికే కాల్ చేశాను. వాట్స్ అప్ లో ఒక ఫోటో పంపాను. చూసి, తరువాత నువ్వే కాల్ చెయ్యి" అంటూ ఫోన్ పెట్టేసాడతను.

వాట్స్ అప్ చూసాడు గౌతమ్. ఎదురు అపార్ట్మెంట్ ప్రమోద్ తో సమీర మాట్లాడుతున్న ఫోటో...

ఆవేశంతో అతని దవడ కండరం బిగుసుకుంది. ఏం చెయ్యాలో క్షణాల్లోనే ఒక నిశ్చయానికి వచ్చేసాడు.

***ఇంకా ఉంది ***

(శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 5 అతి త్వరలో....)

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



0 views0 comments
bottom of page