వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Story Pettu Prize Kottu' - New Telugu Story Written By P. Gopalakrishna
Published In manatelugukathalu.com On 30/01/2024
'స్టోరీ పెట్టు - ప్రైజ్ కొట్టు' తెలుగు కథ
రచన: P. గోపాలకృష్ణ
కథా పఠనం: A. సురేఖ
“ఏంటో ఎలాంటి స్టోరీ రాసినా చదివేవాడు లేడు. మెచ్చుకున్నవాడు లేడు. విసుగొస్తోంది” కిచెన్ లో వంకాయలు కోస్తూ తనని తానే తిట్టుకుంటోంది అమల.
“మనం రోజూ రాసే ప్రతిఘటన సైటు లో కొత్తగా కథల పోటీ పెట్టారు, చూసావే లల్లీ, నువ్వేమైనా రాస్తున్నవా?” అంటూ వంకాయలు కోస్తూ ఫోన్ లో మాట్లాడుతోంది తన ప్రాణస్నేహితురాలు లలిత తో.
“ఒసేయ్, నీ మొహం మండా, వంకాయల్లో పుచ్చులు, చచ్చులు ఉంటాయే. చూసి కొయ్యి పురుగులు తగలడతాయి ఆ వంకాయల్లో”. పూజ చేస్తూ భార్యని హెచ్చరించాడు అమల భర్త సుందరం. (ఇక్కడ సుందరం అనకుండా అమల పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ కాలనీ లో అమల భర్త సుందరం అని, కొందరు ముద్దుగా అమల మొగుడు సుందరం అని వాడుకగా పిల్చుకుంటారు తప్ప అతనికి స్వంత గుర్తింపు ఏమీ లేదు. అలా అని అతని ఎదురుగా మాత్రం అలా అనరు కారణం అతని నోట్లోంచి తూటల్లా జారిపోయే వింత వింత తిట్లు కి భయపడి అనుకోవచ్చు).
“పోయిన వారం ఇలాగే కథల పోటీలు అంటూ హడావుడిగా వంటచేసి కూర లో ఏం పడింది చూడలేదు. ఆఫీసు లో లంచ్ చేసేముందు బాక్స్ ఓపెన్ చేస్తే మిడత చచ్చిపడి ఉంది”. పూజ కి మంత్రాలు చదువుతూ, మధ్యలో భార్యని తిట్లతో ఆశీర్వదిస్తున్నాడు సుందరం.
భర్త వైపు కోపంగా ఒక్క చూపు చూసి, “నేను తర్వాత వివరంగా మాట్లాడతానే, ఏమనుకోకు. మీ అన్నయ్యకి ఆఫీసు టైమ్ అవుతోంది” అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేసి వంట లో నిమగ్నమైంది అమల.
హాల్లో మంచం మీద పడుకున్న అత్తగారు, “అమ్మాయ్, ఇవాళ మా తమ్ముడు నన్ను చూడడానికి వస్తాడేమో, వాడికి కందిపచ్చడి ఇష్టం. కొంచెం చేసి పెట్టు” ఆర్డర్ వేసింది ఆవిడ. “ఈవిడొకరు నా ప్రాణానికి తనకి తినాలని ఉంటే చెప్పొచ్చుగా. నా పెళ్లయినప్పటినుండి చూస్తున్నా, అతను వచ్చింది లేదు, ఈవిణ్ణి చూసిందీ లేదు. జబ్బలు పడిపోయేలాగా పచ్చళ్లు రుబ్బలేక చస్తున్నా”, నొట్లొనే సణుక్కుంటోంది.
“అమ్మాయ్ చెప్పడం మరిచిపోయా, వాడికి మిక్సీ లో రుబ్బిన పచ్చళ్లు బొత్తిగా ఒంటికి పడవు. వేడి చేస్తుందని ఒకటే గొడవ పెడతాడు తర్వాత. కూర పొయ్యి మీద పడేసి, రోట్లో పడేసి రెండు సార్లు తిప్పితే అదే పచ్చడైపోతుంది”. నాలుక చప్పరించుకుంటూ కోడలికి ఆర్డర్ పడేశారు సూర్యకాంతం లాంటి కమలమ్మ గారు.
“ఖర్మరా నాయనా, ఈ జన్మానికి నాకు మోక్షం లేదు. ఇంత చదువు చదివి ఇలాంటి వాళ్ళకి బానిసగా పనిచేస్తున్నాను ” అనుకుంటూ, పోటీలకి ఎలాంటి కథ రాయాలో ఆలోచిస్తూ కందిపప్పు పచ్చడి రుబ్బడానికి రోలు ముందు కూర్చొంది అమల.
“ఆ పచ్చడేదో తరవాత తగలెట్టు. నా మొహాన ఇంత టిఫిను, కాఫీ నీళ్ళు తగలెయ్యి”, తగలెట్టడం అనే పదం అలవాటు చేసుకున్న సుందరం గంట వాయిస్తూ, తులసి మొక్కకి హారతి ఇవ్వడానికి దేవుడు ముందు నుండి విసురుగా లేచి, హాల్ బయట ఉన్న తులసి మొక్కదగ్గరకి హడావుడిగా వెళ్లబోయాడు.
అక్కడ వాళ్లమ్మ పెట్టుకున్న కాఫీ గ్లాసు కాలికి తగిలి అమాంతం గాలిలోకి లేచింది. ఏమైందో అర్థం చేసుకునే లోపే అది సుందరం బట్ట తలమీద ఉడుకుతున్న కాఫీని అభిషేకించేసి, ఖాళీ గ్లాసు ఠంగ్ మని శబ్దం చేస్తూ లాండ్ అయ్యింది.
“అమ్మో, చచ్చానే” అంటూ గట్టిగా అరుపు అరిచి హారతి పక్కన పడేశాడు, వెలుగుతున్న కర్పూరం కాస్తా అక్కడే మంచం మీద నడుం వాల్చిన, కమలమ్మ గారి కాళ్ళమీద పడి “ఒరేయ్ నీ మొహం మండా, నీ అమ్మకడుపు కాలా” అంటూ సహజ ధోరణిలో ఆమెకు అలవాటైన తిట్లతో ఆశీర్వదించి, “అమ్మా, చచ్చానే, నేనింకా ఎందుకు బతికి ఉన్నానురా దేవుడా, నన్ను చంపేశారురో దేవుడా, ఈ కష్టాలు నాకెందుకురా దేవుడా” అంటూ దీర్ఘాలు తీసుకుంటూ శోకాలు పెట్టడం మొదలెట్టింది.
ఈ అరుపులకి పెడబొబ్బలకి ఇంకా నిద్ర మేలుకోని పిల్లలిద్దరూ గావు కేకలు పెట్టుకుంటూ హాల్లోకి వచ్చి గట్టిగా ఏడవడం మొదలెట్టారు.
“మీ మొహాలు మండా, మీకేమయ్యిందే ఏడుస్తున్నారు, ఇప్పటిదాకా బాగానే గురక పెట్టారు కదా! బారెడు పొద్దెక్కినా నిద్రలేవరు కదా”! తన సహజ ధోరణిలో సుందర్రావు తిట్లు మొదలెట్టాడు.
ఇద్దరు ఆడపిల్లలు పరుగున వంటగదిలో ఉన్న తల్లి చాటుకు పోయి దాక్కున్నారు. బలవంతంగా నవ్వు ఆపుకుంటున్న అమలని కొరకొరా చూస్తూ బాత్‌రూంలో దూరి మరోసారి తలస్నానం చేయడం మొదలెట్టాడు సుందర్రావు.
“అమ్మా అబ్బా”.. అంటూ మూలుగుతూ కమలమ్మ గారు మంచం మీదే లేచి కూర్చొని, “కాళ్ళు కాలిపోయాయిరా దేవుడోయ్, నా బతుకు ఇలా ఐపోయిందేంట్రా నాయనోయ్ ” అంటూ మళ్ళీ రాగం అందుకుంది.
అమలకి నవ్వు ఆగడం లేదు. తనని వింత వింత చేష్టలతో అత్తగారు ఎలా ఏడిపిస్తుందో తల్చుకుంటే లోపల కూతకుతా ఉడికిపోతుంది. ఏమీ అనలేక భరిస్తూ ఉంది. ఇప్పుడు అత్తగారు మూలుగుతూ ఏడుస్తూ ఉంటే, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర కచేరీ విన్నంత ఆనందంగా అనిపించింది ఆమెకి. వింత వింత చేష్టలతో తనను హింసించే అత్తగారంటే అమలకి ఒళ్ళంతా మంట. అందుకే ఆవిడ కుయ్యో మొర్రో మని మూల్గిన ప్రతిసారీ అమలకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్రం విన్నంత తన్మయత్వం కలుగుతుంది. భర్తని ఆఫీసు కి సాగనంపీ, పిల్లల్ని స్కూల్ లో దింపి ఇంటికి వచ్చింది.
అత్తగారికి టిఫిన్ పెట్టి, ఆవిడ సేవ కి ఒక అరగంట కేటాయించాక స్టోరీ పెట్టు - ప్రైజ్ కొట్టు పోటీ నిబంధనలు చూద్దాం అనుకుంటూ మళ్ళీ చదవడం మొదలెట్టింది. కనీసం వెయ్యి పదాలు ఉండాలి. ప్రేమ, శృంగారం, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కథలకు ప్రాధాన్యం అంటూ ఇంకా ఏవేవో నిబంధనలు చెప్పి, ఏమైనా సందేహాలుంటే ఫోన్ చేయండి అంటూ నెంబర్ ఇచ్చాడు ఆ సైటు అడ్మిన్ నాని.
ఎప్పుడూ ఇచ్చినవాళ్ళకే ప్రైజ్ ఇవ్వడం వీడికి అలవాటు. అదీ ఆడవాళ్ళకే ఇస్తాడు. వీడితో ఇలా కాదు కానీ, మనకి ప్రైజ్ ముఖ్యం. ఎలాగైనా ఈ సారి ఏదో ఒక ప్రైజ్ కొట్టాల్సిందే. లేకపోతే ఇంట్లో కనీసం గౌరవం కూడా లేదు. ఈ నానీ గాడికి కాల్ చేసి అసలు వాడి ఉద్దేశమేంటో తెలుసుకోవాలి” మనసులోనే అనుకుంటూ.. “శెభాష్ అమలా, ఇవాళ నీలో ఆమోఘమైన ఆలోచన వచ్చింది. కీప్ ఈట్ అప్” అనుకుంటూ, ప్లేట్ లో టిఫిన్ పెట్టుకొని తమ బెడ్ రూమ్ లో కూర్చుని అడ్మిన్ నాని కి కాల్ చేసింది.
“నేను ప్రతిఘటన సైటు అడ్మిన్ నాని మాట్లాడుతున్నాను” అంటూ స్టైల్ గా చెప్పాడు అవతలి వైపు నుండి.
“సర్ నా పేరు అమల, నేను రెగ్యులర్ గా మీ సైటు లో కథలు రాస్తున్నాను కానీ నాకు ప్రైజ్ రావడం లేదు. కనీసం గుర్తింపు కూడా రావడం లేదు. పోనీ రీడర్స్ ఎక్కువమంది చదువుతున్నారా అంటే అదీ లేదు. అందరూ రాసినట్లే రాసినా కథలకు రీడ్ కౌంట్ రావట్లేదండీ”, దాదాపుగా జాలిగా ఉంది ఆమె గొంతు.
“ఇప్పుడు స్టోరీ పెట్టు, ప్రైజ్ కొట్టు పోటీలకి కథ పంపిద్దామనుకుంటున్నా. అసలు ముందు మీ సలహా, ఆశీర్వాదం తీసుకొని కథ రాద్దామని ఫోన్ చేశానండీ” అంటూ తనదైన శైలి లో చెప్పుకుంటూ పోతోంది ఆమె.
అతను చిన్నగా నవ్వేసి, “మీరు రాసిన కథలు బాగున్నాయి, ఈసారి ప్రయత్నం చేయండి. ప్రైజ్ రావచ్చు” అంటూ ఉత్సాహపరిచాడు.
“అసలు ఎలాంటి కథలు రాయాలో సలహా ఇవ్వండి” అడిగింది.
“మంచి శృంగార ప్రాధాన్యమున్న ప్రేమ కథని ట్రై చేయండి” అంటూ సలహా ఇచ్చాడు.
“నీ బొందరా.. నీ బొంద. అలాంటి శృంగారకథలు రాయడం వస్తే నీ బోడి సలహా నాకెందుకురా అక్కుపక్షీ”.. , తిట్టుకుంది మనసులో.
ఏంటో ఈ మధ్య తిట్లు అనర్గళం గా వస్తున్నాయి, అనుకుంటూ.. ”ఏదైనా మీలాంటి గొప్పవాళ్ల సలహా లేకుండా నేను రాయగలనని అనుకోవట్లేదు సర్ ఈసారి కథల పోటీలకి” అంది కొంచెం లౌక్యంగా.
“ఇంతకీ మీరెక్కడుంటారు”? అడిగాడు అతను.
అతని మాటల్ని బట్టి పులిహోర కలిపే బాచ్ వాడిలా ఉన్నాడని అనుకుంది. అతను ఏదేదో చెప్తున్నాడు. శృంగార కథలు ఎలా రాయాలో చెప్పడం మొదలెట్టాడు. అమల పరధ్యానంగా వింటోంది. అవతలి నుండి నాని అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు.
“అమలగారూ వింటున్నారా?” అనుమానంగా అడిగాడు అవతలి వైపు నుండి అడ్మిన్ నాని.
“వింటున్నాను సర్, చెప్పండి” అంది.
“నేను చెప్పానని ఏమీ అనుకోకండి, అసలు ఇప్పుడు ట్రెండ్ అంతా హై స్కూల్ స్థాయిలోనే ప్రేమ మొదలవ్వడం, ప్రేమికులు తోటల్లో, వీధుల్లో, పార్కుల్లో, బీచ్ లు ఉంటే అక్కడా.. స్కూల్ కి బంక్ కొట్టేసి విచ్చల విడిగా తిరుగుతూ కాలక్షేపం చేయడం, మధ్య మధ్యలో చిన్న చిన్న చిలక్కొట్టుడు వ్యవహారాలు.. , ప్రేమ విఫలం.. ఇలా రాసుకుంటూ పోతే రీడ్ కౌంట్ పెరిగిపోయి, అమాంతం మీ పేరు మన సైటు లో మార్మ్రోగి పోతుంది” అతను చెప్పుకుంటూ పోతున్నాడు.
అమల కప్పలా నోరు తెరుచుకొని వింటూ ఉండిపోయింది. ఆమె ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవడం వలన మొబైలు బాగా వేడెక్కి, ఆమె చెవి ఎర్రగా వాచి పోయింది. ఇంకాసేపు వెంటే చెవి లోంచి రక్తం వచ్చేలా ఉంది అనుకుంటూ ఫోన్ ఇంకో చెవిలోకి మార్చింది.
“అదన్నమాట విషయం. నువ్వేం రాసినా మంచి మసాలా దట్టించి రాయాలి అమలా, నీకెందుకు నేనున్నాను కదా. ధైర్యంగా కథా రంగంలోకి దూకేయ్.. ” ఉత్సాహ పరిచాడు.
మాటల్లో మీరు నుండి నువ్వు వరకు వెళ్లిపోయారు ఇద్దరూ. ఒకపక్క ఎండ దంచి కొడుతోంది. చెమటలు కక్కుతూ నాని మాట్లాడుతుంటే వింటూ ఏదేదో అడుగుతోంది. “ఈసారి నాకు ప్రైజ్ వచ్చేలా చేయొచ్చు కదా!” గోముగా అడిగింది.
అవతలి వాడు అంత తొందరగా లొంగిపోతాడా. అసలే వాడికి ఆ సైటు లో మంచి శృంగార పురుషుడని పేరు. “సరేలే చూద్దాం. నువ్వు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి, మంచి కథ పెట్టు. కావలసిన సలహాలు ఇస్తాను. నేను చెప్పానని ఎక్కడా అనకు. హేయ్ చెప్పడం మరిచిపోయా నీ వాయిస్ చాలా బావుంది. నువ్వు ఇంకెంత బావుంటావో, నేను మా వాళ్ళ ఇంటికి వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ” అంటూ చెప్పాడు.
ఫోన్ మాట్లాడుతూ డాబా మీద బట్టలు ఆరేస్తూ అక్కడే ఉండిపోయిందేమో, ఒళ్ళంతా వేడికి మండిపోసాగింది. “సర్ ఎందుకులే అమలా, నాని అను.. అప్పుడే మనం దగ్గరగా ఉన్నట్లు ఫీల్ ఉంటుంది” చెప్పాడు.
“నీ బొందరా.. నువ్వు నానీ గాడివేంటి.. పంది గాడివి అని మనసులోనే తిట్టుకుంది.
“హేయ్, అమలా ఈ సారి వీడియొ కాల్ చెయ్యి” అన్నాడు నానీ.
“నా కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు చేస్తానులే” అంటూ కాల్ కట్ చేసి, వంటపనిలోకి దిగింది.
ఉదయాన్నే చాలా వరకు వంట చేసెయ్యడం వలన, అత్తగారు చెప్పిన కందిపప్పు పచ్చడి రెఢీ చేసి, వేడిగా ఉండాలని అన్నం వండింది. అత్తగారి తమ్ముడు ఎప్పటిలాగానే రానే లేదు.
“పచ్చడి చాలా బావుందే” అంటూ, కూర పులుసు పక్కన పెట్టి మొత్తం పచ్చడి అంతా ఒక్క రౌండ్ లో లేపేసింది కమలమ్మగారు. ఆవిడ జిహ్వ చాపల్యం తెలిసి కొంచెం ఎక్కువే వండింది అన్నం కూడా. అయినా కూడా ఆవిడకి రెండో రౌండ్ కి అన్నం అందనేలేదు.
ఎనభయ్యవ ఏట ఉన్న ఆవిడ తిండి చింతకి, అమల కళ్ళు తిరిగిపోయాయి. వండిన అన్నం అంతా ఆవిడ పచ్చడి మెతుకులకే సరిపోయింది. ఉదయం వండినది కొంచెం అన్నం ఉంటే, దాంతో ఆవిడకి పెరుగు వడ్డించి, రాత్రి మిగిలిన అన్నం తో తాను లంచ్ చేశానని అనిపించుకొని, గబగబా పనులు ముగించి కథ(న)రంగంలోకి దిగింది, వీరనారి లాగా. మొదలెట్టిందే తడవుగా ఒక కథ ఆశువుగా ఆమె మెదడు లోకి వచ్చింది. అంతే లేట్ చేయకుండా కథ మొదలెట్టింది.
“ఎంత ఘాటు ప్రేమయో.. ” అంటూ మొదలు పెట్టిన కథ ఇద్దరు స్కూల్ పిల్లల ప్రేమాయణం తో మొదలెట్టి, వాళ్ళ మధ్య శృంగారం వగైరాలు తో రాసింది. ఇటీవల తాను పేపర్ లో చదివిన పసి ప్రేమలు ఆర్టికల్ ని జోడించి నాని చెప్పినట్లు కొంచెం శృంగారం పాళ్ళు పెంచి మరీ రాసింది. రాసిన కథను మూడు నాలుగు సార్లు చదివి ఎడిటింగ్ చేసింది. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయితే కొత్త నెంబర్ చూసి, లిఫ్ట్ చేసింది.
“నేనే, కథ రాసేశావా” అడిగాడు నాని.
“రాసేశా.. నీకు పంపిస్తా అంటూ వాట్సప్ చేసింది.
“కథ చాలా బావుంది, శృంగారం అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు చాలా మందే రాస్తున్నారు మన సైటు లో, సీతా, గీత, వాణీ, రాణీ, సుశీల, సుజాతా లాంటి వాళ్ళకే ఎప్పుడు ప్రైజ్ లు ఇస్తూ ఉంటే నాకూ బోర్ కొడుతోంది. ఈ సారి నీకు ప్రైజ్ పక్కా” అంటూ అమలను ఆకాశానికి ఎత్తేశాడు.
“అయితే నా కథకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా” నవ్వుతూ అడిగింది.
“ఫస్ట్ ప్రైజ్ కాకపోయినా సెకండ్ ప్రైజ్ అయినా గ్యారెంటీ” అంటూ హామీ ఇచ్చేశాడు.
వారాలు గడిచిపోయాయి. స్టోరీ పెట్టు - ప్రైజ్ కొట్టు కథల పోటీల ఫలితాలు రేపే ప్రకటిస్తాం అంటూ సైటు లో పదేపదే పోష్టులు పెడుతున్నారు ఆ సైటు వాళ్ళు. ప్రైజ్ తనకి పక్కా అని డిసైడ్ అయిపోయింది అమల. ఈ సారి నాకథకి తప్పకుండా ప్రైజ్ వస్తుంది అంటూ భర్త దగ్గర చెప్పుకుంది.
“నీ మొహానికి వంట తగలెట్టడమే రాదుకదే, ప్రైజ్ ఎలా తగలడుతుందంటావ్” వెటకారంగా అడిగాడు సుందరం.
భర్త తనని నిరుత్సాహ పరిచినా పెద్దగా పట్టించుకోలేదు. “ఒసేయ్ లల్లీ, నేను కథని నానీ గాడికి చూపించా, బావుంది ప్రైజ్ గ్యారెంటీ అన్నాకే పోటీలకి పంపించా” గర్వంగా చెప్పింది అమల.
“ఓసినీ.. వాణ్ణి ఆ సైటు లోంచి పీకేశారు కదే. ఆడవాళ్ళతో పులిహోర కలుపుతున్నాడని, ఎప్పుడు ఒకరిద్దరికే ప్రైజ్ ఇస్తున్నాడని సైటు వాళ్ళకి కంప్లయింట్ వెళ్ళిందిట నీకు తెలీదా. సైటు అంతా సంబరాలు చేసుకుంటున్నారు” చావు కబురు చల్లగా చెప్పింది లలిత.
“అవునా, నాకు తెలియదు.. ”ముక్తసరిగా జవాబు చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే నానీ నెంబర్ కి కాల్ చేసింది. “చెప్పు అమలా డియర్” అంటూ అవతలి నుండి నానీ మాట్లాడుతుంటే.. “ఛీ వెధవా, నువ్వు సైటు అడ్మిన్ వి అని నా దగ్గర కటింగ్ కోడతావా” అంటూ చెడామడా తిట్టేసింది.
“నేనే మానేశా డియర్, బోర్ కొట్టింది ఆ జాబ్. మనమే కొత్త సైటు పెడదాం. నువ్వు నేను తలచుకుంటే ఏమైనా చేయొచ్చు” అంటూ ఏమేమో చెప్తున్నాడు.
అమలకి వాడి మాటలు వింటూ ఉంటే అసహ్యం వేసింది. “ఇంకెప్పుడూ నాకు కాల్ చేయకు. నేనూ చేయను” అంటూ ఫోన్ కట్ చేసి, వాడి నెంబర్ బ్లాక్ చేసేసింది.
ప్రైజ్ లు ఎవరెవరికి వచ్చాయో చూద్దామని సైటు ఓపెన్ చేయబోతే సైటు ఓపెన్ కావడం లేదు. ప్రతిఘటన సైటు వాళ్ళకి మెయిల్ చేయబోతే మెయిల్ బాక్స్ లో కొత్త మెయిల్ కనిపించింది.
“ప్రియమైన రచయిత్రి గారికి, మీరు స్టోరీ పెట్టు ప్రైజ్ కొట్టు పోటీలకి పంపిన కథ “ఎంత ఘాటు ప్రేమయో” ని ప్రచురించలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దు. కథాంశం లో మితిమీరిన శృంగారం, బాల్య ప్రేమ మొదలైన అంశాలు ఉన్నందున మీ స్టోరీ ని మా సైటు నుండి తొలగించి మీ అక్కౌంట్ ను తొలగించడమైనది”.
“ఒరేయ్ నానీగా, ఎంత పని చేసావురా, నా చేత కథలు రాయకుండా శాశ్వతంగా పగ తీర్చుకున్నావు కదరా నీ మొహం మండా” అనుకుంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యింది అమల.
***
P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna
యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:
నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Ch.v.s prasanna
•1 hour ago
😂😂😂😂😂😂