'Story Screen Play Direction' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao
'స్టోరీ.. స్క్రీన్ ప్లే .. డైరెక్షన్' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చిన నిర్మాత చింతపిక్కల జగన్నాథం అంత గడుసువాడు కాదు. అలాగని మరీ అంత అమాయకుడు కాదు. అదృష్టదేవత వరించి అతను వరుసగా తీసిన మూడు సినిమాలు అనుకోకుండా పెద్ద హిట్ అయ్యాయి. ప్రస్తుతం అతని దగ్గర 200 కోట్లు ఉన్నాయి. దానితో అతడు బడా నిర్మాతల జాబితాలో చేరిపోయాడు.
ఇప్పుడు ట్రెండ్ కు అనుగుణంగా ఈసారీ 200 కోట్ల తో పాన్ఇండియా మూవీ తీయాలని 500 కోట్లు కలెక్షన్లు రాబట్టాలని ప్లాన్ సిద్ధం చేశాడు.
వెంటనే తన తొలి చిత్రం దర్శకుడు ప్రహ్లాదరావుని ఫోన్ చేసి రప్పించాడు. వచ్చాక విషయం అంతా వివరించి చెప్పాడు.
ప్రహ్లాదరావు సీనియర్ దర్శకుడు. రమారమీ 100 చిత్రాలకు దర్శకత్వం చేశాడు 50 చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయినా ఇప్పటికీ ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయాడు. అందుకు కారణం నిర్మాతగా రెండు సినిమాలు తను కూడా తీసి చేతులు కాల్చు కొని ఉన్నదంతా పోగొట్టుకోవడమే.
నిర్మాత చెప్పినది అంతా విన్న ప్రహ్లాదరావు ఇలా చెప్పాడు.. '' జగన్నాథంగారూ! మిమ్మల్ని నేను నిరుత్సాహ పరచను. కానీ మీ నిర్ణయం నాకు ఎందుకో నచ్చటం లేదు. సినీ పరిశ్రమ మాయాప్రపంచం అన్న విషయం అందరికీ తెలుసు కదా. నాలుగు సంవత్సరాల క్రితం 10 కోట్లతో మీరు ఇక్కడికి వచ్చారు. మీ అదృష్టరేఖ బాగుంది. ఈరోజుకి 200 కోట్లకు అధిపతి అయ్యారు. మీరు వచ్చేటప్పటికి నా పని ఈ కృష్ణా నగర్లో రోడ్డు పక్కన నిలబడే స్థితికి వచ్చింది. మీరు పరిశ్రమకు వచ్చిన మొదటి రోజులలో సీనియర్ ని అని తెలుసుకుని మీ తొలి చిత్రానికి నాకు మీరు ఇచ్చిన దర్శకత్వపు అవకాశం వల్ల మళ్లీ నేను నిలబడ గలిగాను.
పరిశ్రమలో ఉన్న 24 శాఖలకు ప్రాణం పోసే నిర్మాత ది దేవునితో సమానమైన శాఖ. నిర్మాత బాగుంటేనే మిగిలిన వాళ్ళు బాగుంటారు. ఇది జగమెరిగిన సత్యం. మీ వంటి నెంబర్ వన్ నిర్మాతలు ప్రస్తుతం పరిశ్రమలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాబట్టి మీరు అడగకపోయినా నేను ఒక ఉచిత సలహా ఇవ్వాలను కుంటున్నాను మీ మీద ఉన్న చనువుతో చెప్పమంటారా. '' అన్నాడు.
జగన్నాథం నవ్వుతూ చెప్పమని సైగ చేశాడు.
''జగన్నాథంగారూ! ఈ పరిశ్రమలో నేను 50 సంవత్స రాలు నుండి ఉంటున్నాను. ఇక్కడ 24 శాఖలలో కార్మికుల అష్టకష్టాలు నాకు మొత్తం తెలుసు. సినీ పరిశ్రమలో వాళ్లంటే ఇంద్రలోకంలో ఉండే మనుషులు అన్నట్టు అందరూ భావిస్తారు. కానీ వాళ్ళల్లో చాలా మంది అన్న వస్త్రానికి లోటుతో బ్రతుకుతున్నారని తెలుసుకోలేకపోతున్నారు. నేను మిమ్మల్ని కాళ్లు పట్టు కుని ప్రార్థించేది ఏమిటి అంటే.. అలాంటి అభాగ్యులు కోసం శాశ్వతంగా మీరు ఏదైనా ఒక మంచి పని చేసి ఆ తర్వాత మిగిలిన డబ్బుతో సినిమా చేయండి.
నా బాధ్యతగా నేను మీకు అన్ని విధాల మీరు తీయబోయే సినిమాకి ఉచితంగా సహాయపడతాను. మిగిలిన వాళ్లను కూడా సహాయపడమని కోరుతాను. సీనియర్ గా ఈ ఇండస్ట్రీలో అందరూ నా మాట వింటారు. ఇవి చేతులు కాదు దయచేసి నా మాట వినండి. ఇలాగే గతంలో లీడ్ లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు నిర్మా తలను రిక్వెస్ట్ గా అడిగాను. ఎవరూ నా మాట విన లేదు. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలి యదు.
పేకముక్కల ఆట లాంటి ఈ మాయా ప్రపంచంలో మీ పేరు శాశ్వతంగా నిలబడేలా సినీ కార్మికుల కోసం ఒక నిత్య అన్నదాన సత్రం లాంటిది కట్టించి మీ పేరు శాశ్వతం చేసుకోండి. నా మాట వినండి సార్. ఇది నా స్వార్థం కాదు. ఈ పరిశ్రమలో నాతో పనిచేసిన చెయ్య క పోయినా అందరు కార్మికులు నాకు బిడ్డల్లాంటి వారే. వాళ్లు కడుపునిండా అన్నం తినడం గురించి నా బాధ్య తగా.. మీ పేరు ప్రఖ్యాతలు కూడా ఇనుమడిస్తాయి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను'' అంటూ కాళ్లు పట్టుకునే అడిగాడు ప్రహ్లాదరావు.
నిర్మాత జగన్నాథం కి అతను చెప్పింది ఏ మాత్రం నచ్చలేదు ‘యో.. ప్రహ్లాదూ ఇన్నిసంవత్సరాల నుండి నుండి ఈ పని ఎవరు ఎందుకు చేయలేక పోయారయ్యా. 50 కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు ఆ పని నేనే చేయాల’.. అని అందామనుకున్న మాటలు మనసు లోనే అనుకుంటూ మంచిమాటలతో అతనిని పంపించేశాడు.
***
ఇకమీదట పాత రచయిత, పాత హీరో, పాత దర్శకులను పెట్ట కూడదని నిర్ణయించుకున్నాడు. కొత్త దర్శకులు, కొత్త రచయితలతో, కొత్త హీరోలతో తీసిన సినిమాలు కూడా 200 కోట్లు సాధించిన దాఖలాలు పరిశ్రమలో ఉన్నాయి కదా. అందుచేత ప్రస్తుతం కొత్త వాళ్ళతో 2 వందల కోట్లతో గొప్ప జానపద సినిమా తీస్తే బాగుంటుంది అన్న ఐడియా వచ్చింది నిర్మాత చింతపిక్కల జగన్నాథం కి.
వెంటనే తన ఆఫీసుకు వచ్చి తనను కలవమని పేపర్లలోనూ టీవీ చానల్స్ లోనూ ప్రకటన ఇచ్చాడు నిర్మా త చింతపిక్కల జగన్నాథం.
**
టీవీ చానల్స్ లో స్క్రోలింగ్ చూసి కొత్తగా దర్శకుడు అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తి ఇదేదో బేరం బాగుందే అనుకుంటూ ఎగిరి గంతులు వేశాడు.
వస్తూ అతను ఒక రచయితను తీసుకొని వచ్చాడు.
ఏసీ రూమ్ లో అందరూ కూర్చున్నారు. కథ చెప్పడం ప్రారంభించాడు.
''సార్ జానపదాలు, పౌరాణికాలు చారిత్రాత్మకాలు వద్దు సార్. అవి ఫట్ అవుతాయి.
ప్రస్తుత ట్రెండ్ కు పనికొచ్చే సరదా హాస్య కథ చెబుతాను. గ్యారెంటీ నాది. '' అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు కొత్త రచయిత రంగస్వామి.
''కట్ చేస్తే.. తప్పకుండా చేయాలి సార్.. లేకపోతే సినిమా మొదలవ్వదు.. '' అన్నాడు .
నిర్మాతకు కొంచెం అనుమానం వచ్చింది అతని ధోరణి. కొత్త దర్శకుడు కోటేశ్వరరావు ‘కంగారు పడకండి’ అన్న ట్టు సైగ చేయడంతో కథ వినడానికి సిద్ధమయ్యాడు నిర్మాత.
సరే మౌనంగా కథ వింటున్నాడు.. నిర్మాత జగన్నాథం.
''కథ పేరు.. కోతులు బాబోయ్ కోతులు!
వినండి.. సీను ఒకటి చెప్తాను వినండి. డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి సార్. అద్భుతం, హౌస్ ఫుల్.. వినండి..
ఆ ఊరిలోకి పక్క అడవి నుండి ఒక పెద్ద కోతి వస్తుంది.
అది ఎవర్ని ముట్టుకుంటే వాళ్ళు కోతులు అయిపో తుంటారు. చాలామందిని ముట్టుకుంది. కోతులు అయిపోయారు. ఒక ఇంట్లో తండ్రి కోతి, మరొక ఇంట్లో భార్య కోతి, మరొక ఇంట్లో చిన్న పిల్లాడు కోతి, బడిలో మాస్టారు కోతి, ఆఫీసులో ఆఫీసర్ గారు కోతి.. వాళ్లు మామూలుగానే తెలుగు భాషలో మాట్లాడుతుంటారు. పనులన్నీ మనుషులు చేసినట్టే చేస్తూ ఉంటారు.
ఒకచోట పెళ్లి జరుగుతుంటుంది. ఆ పెద్ద కోతి వచ్చి పెళ్ళికొడుకును ముట్టుకుంటుంది. పెళ్ళికొడుకు కోతి అయిపోతాడు. అయినప్పటికీ పెళ్లి ఆగదు. ఆ కోతి తోనే పెళ్లి జరిగిపోతుంది. కోతితోనే అమ్మాయి కాపురం చేస్తుంది.
క్లైమాక్స్ సీక్రెట్ సార్.. అత్యంత అద్భుతం. రిలీజ్ డే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. '' కథ చెప్పడం ఆపాడు రంగస్వామి.
''ఎట్టా.. చూస్తే ఇది చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది.
పూర్వం ఎప్పుడో వచ్చిన జంబలకడిపంబ సినిమా కన్నా 100 రెట్లు గొప్పగా ఉన్నట్టు తోస్తుంది. ''ఆశ్చర్య పోయాడు నిర్మాత జగన్నాథం.
''అబ్బబ్బ.. ఇప్పుడు ఇలాంటి కథలే కావాలి. నిర్మాత గారు.. ఈ కథ ఓకే. అబ్బా చాలా బాగుంది. సూపర్ సూపర్. చాలా బాగుంది.. చాలా బాగుంది.. మొత్తం భారం నా మీద పెట్టేయండి. మీరు హాయిగా పడుకోండి. పాన్ ఇండియా మూవీ సూపర్ గా డైరెక్షన్ చేసి పడేస్తాను. మీ 200 కోట్లు 500 కోట్లు చేసే బాధ్యత నాది. అలా జరగకపోతే ఫీల్డ్ నుంచి వెళ్లిపోతాను. ''
శపథం చేశాడు కొత్త దర్శకుడు కోటేశ్వరరావు.
''ఈ కథ వర్కవుట్ అవుతుందా?'' అనుమానం గా అడిగాడు నిర్మాత.
''పరిశ్రమలో మా దర్శకత్వపు శాఖ వారితో సహా మిగి లిన 23 శాఖల వారిని సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత నాది. మీరు నమ్మాలి, నమ్మకం తోనే బండి ముందుకు వెళుతుంది. నమ్మాలి సార్ మీరు.. ప్రశ్నించకూడదు. మొట్టమొదటిగా మంచి హీరో హీరోయిన్స్, కెమెరామెన్, ఫైటింగ్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా చాలామందికి అడ్వాన్స్ ఇవ్వడానికి బాహుబలి ని మించిన అతి భారీ సెట్లు వేయడానికి టోటల్గా 50 కోట్లు నా అకౌంట్లో వేయండి.
అంతా రెడీ చేసి ఒక నెల రోజుల్లో షూటింగ్ మొదలు పెడతాను. అమితాబ్బచ్చన్ గారిని సినిమా మొదటిరోజు షూటింగ్కు పెద్దలుగా తీసుకువద్దాం. దానితో మన సినిమాకు హైకే హైకు. '' చాలా నమ్మకంగా చెప్పాడు కొత్త దర్శ కుడు కోటేశ్వరరావు.
డీల్ ఓకే అయ్యింది.
**
''నిర్మాతగారు పాన్ఇండియా మూవీ తీస్తున్నారట కదా.. తెలిసింది సార్. నేను సార్.. మీ మొదటి చిత్రం డైరెక్టర్ ప్రహ్లాదరావుని. ఆల్ ద బెస్ట్ సార్. మీరు పెట్టుకున్న దర్శకుడు కోటేశ్వరరావు, రచయిత రంగస్వామి ల గురించి ఎంక్వయిరీ చేశాను సార్. టాలెంట్ ఉన్న వారే అని మన వాళ్ళు చెప్పారు. ఫాలో అవ్వండి సార్! షూటింగు ప్రారంభం రోజున నన్ను పిలవండి నమస్తే సార్ ఉంటాను. ''
ఓకే అలాగే అన్న మాట కూడా అనకుండా సెల్ ఆఫ్ చేసి టేబుల్ మీద గిరాటు పెట్టాడు నిర్మాత జగన్నాథo.
''స్కౌండ్రల్.. గీ పెద్దమనిషి మనకు సినిమా చెయ్యకపోతే ప్రపంచం గొడ్డు పోయిందా. తీస్తా.. రెండు వందల కోట్లతో పాన్ ఇండియా మూవీ తీసి 500 కోట్లు సంపాదించి అతనికి చూపెడతా.
ఇదో ప్రహ్లాదరావు.. నువ్వు రిజైన్ చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపో అని చెబుతా. ''
అనుకుంటూ మరో సెల్ రింగ్ అవటంతో ఆన్ చేసాడు.
అదే తన రెండవ సినిమా డైరెక్టర్ నుండి. తర్వాత రెండవ సినిమాలో హీరో, హీరోయిన్, రచయితల నుండి అభినందనలు ఫోన్లు.
రెండు రోజులు పోయాక తను గతంలో తీసిన మూడవ సినిమా యూనిట్ నుండి అభినందనల ఫోన్లు.
ఆ తర్వాత తర్వాత ఇండస్ట్రీలో పెద్దల నుండి కూడా అభినందనల ఫోన్ కాల్స్ ..
ఉక్కిరి బికిరి అయిపోతున్నాడు నిర్మాత జగన్నాథం.
నెల గడిచింది. ఇప్పుడు తీయబోయే పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది.
''సార్ ఏర్పాట్లు అన్నీ చాలా ఘనంగా జరుగుతు న్నాయి. మన స్టోరీ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ గా తీసుకుంటున్నాం కనుక ఫారెస్ట్ లోనే పెద్ద పెద్ద సెట్లు వేస్తున్నాం.
పని అంతా పూర్తి అయ్యాక మిమ్మల్ని హెలికాప్టర్లో తీసుకొచ్చి అన్ని చూపిస్తాం సార్. అనవసరంగా మీరు అటు ఇటు తిరగవద్దు. వయసు భారం కదా. మొత్తం టెక్నీషియన్ అందర్నీ సెట్ చేసేశాను సార్. నేను మిమ్మల్ని కలిసినప్పుడు వివరాలు చెబుతాను.
తరచూ ఫోన్ చేయటం లేదని మిమ్మల్ని కలవడం లేదని ఏమీ అనుకోవద్దు. చాలా దూరంలో ఉండి చాలా కష్టపడు తున్నాం. 200 మంది యూనిట్స్ సభ్యులు చాలా కష్టపడుతున్నాం. మీరు ఇచ్చిన 50 కోట్లు సరిపోతున్నాయి సార్. ఉంటాను సార్ థాంక్యూ సార్. '' అంటూ చెప్పాడు కొత్త దర్శకుడు కోటేశ్వరరావు.
''యో.. కోటేశ్వరావు డబ్బుకు లోటు లేదు. పెద్దబ్బాయి ఫారెన్ లో 1000 కోట్లు సంపాదించాడు. రెండో అబ్బాయి ఏకంగా 1500 కోట్లు సంపాదించాడు. నా మటుకు నా ఆస్తులు పాస్తులు 1000 కోట్లు ఉంటాయి. కంగారు పడకు. సినిమా పాన్ ఇండియా కన్నా అదిరి పోవాల''''.. మాట్లాడి సెల్ ఆఫ్ చేశాడు జగన్నాథం.
అలా ఫోన్ ఫోన్ కాల్స్ మీదే రెండు నెల గడిచి పోయాయి
**
ఒకరోజు శుభముహూర్తాన సీనియర్ డైరెక్టర్ ప్రహ్లాద రావు మరి కొంతమంది సినీపెద్దలతో కలిసి వచ్చాడు.
''ఎట్టా.. 24 క్రాఫ్ట్స్ పెద్దలందరూ ఇలా వచ్చారు ఏంటి కథ?'' ప్రశ్నించాడు జగన్నాథం.
''మన కృష్ణానగర్ శివారులో 10 ఎకరాల స్థలం కొని అతిపెద్ద నిత్య అన్నదాన సత్రం ప్రత్యేకంగా సినీ కార్మి కుల కోసం కట్టించాను సార్. ఇదంతా ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల జరుగుతుంది ప్రతిరోజు మూడు వేలమంది ఉచితంగా భోజనాలు చేయవచ్చు. ఆ భవనం ప్రారంభోత్సవం మీరే చేయాలి సార్. '' అంటూ వినయంగా అడిగాడు ప్రహ్లాదరావు.
''ఎట్టా.. మొత్తానికి సాధించావు. వస్తాను కానీ.. మన పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ కోటేశ్వరరావు నెల రోజులు నుండి సెల్ ఎత్తటం లేదు . నా డబ్బు 50 కోట్లు పట్టుకొని ఉడాయించాడంటావా? విలేకరులను అడిగితే ఆ ఫారెస్ట్ లో షూటింగ్ హడావిడి ఏమీ లేదని చెప్తున్నారబ్బా. కూతంత ఎంక్వయిరీ చేసి చెప్పు. లేకుంటే పోలీస్ కేసు పెడత''.. చాలా కోపంగా అన్నాడు జగన్నాథం.
''సరే సార్! ఆ కుర్రోడు మంచివాడే. నేను ప్రయత్నించి చెప్తా'' అంటూ వెళ్లిపోయాడుప్రహ్లాదరావు.
**
అన్నదాన భవనం దగ్గర కారు దిగాడు జగన్నాథం.
5వేల మంది జనంతో రంగ రంగ వైభవంగా కళకళ లాడుతుంది ఆ ప్రదేశం.
అతిరథ మహారధులు అందరూ ముందుకు వచ్చి నిర్మాత జగన్నాథం ని ఆహ్వానించారు. చామంతుల దొంతర్ల మీద నడిపించుకుంటూ తీసుకు వెళుతున్నారు జగన్నాధాన్ని.
ప్రారంభ ఫలకం సిల్క్ కర్టెన్ తొలగించిన జగన్నాథం ఆశ్చర్యపోయాడు.
జగన్నాథ రథచక్రాలు.. నిత్య అన్నదాన మహానిలయం అన్న పేరు పెట్టారు భవనానికి.
జగన్నాథం మనసులో నవ్వుకున్నాడు తన పేరు భవనానికి పెట్టినందుకు.. సినీ ప్రముఖులు చిన్న పెద్ద రాజ కీయ నాయకుల మధ్య సభ ప్రారంభమైంది. సినీ పరిశ్రమ 24 విభాగాలకు చెందిన 3 వేల మంది తెర వెనుక వాళ్ళు, టెక్నీ షియన్స్ జగన్నాథం గారికి జై అని జై జై నినాదాలు చేస్తున్నారు. ఓ పక్క మహాసభ జరుగుతుండగా భవనంలోని పెద్దపెద్ద పది హాల్స్ లో వేలాది మంది భోజనాలు చేస్తున్నారు.
తిరునాళ్లు మించిన మహా వైభవం అక్కడ తాండవిస్తోంది. సినీ పరిశ్రమ కార్మికులు పిల్లలు పెద్దలు ఆడవాళ్లు అందరూ కడుపు నిండా భోజనం చేసి దూరం నుండే జగన్నాథం గారికి చేతులు రెండు పైకెత్తి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కి ముక్కినట్లు మొక్కుతున్నారు మహదానందంతో తాండవం నాట్యం చేస్తున్నారు.
'' ప్రహ్లాదు.. ఇట్టారా సంక్రాంతి, దీపావళి ని మించిన ఈ కనుల పండుగ అంతా చూస్తుంటే జీవితంలో నేను ఏం కోల్పోయానో ఇప్పుడు బాధ కలుగుతుండాదయ్యా.
నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ అవకాశం ఉపయోగించు కోమని కాళ్లు పట్టుకొని అడిగితే నిన్ను కాలితో తన్నినట్లు సమాధానం చెప్పకుండా అవమానించాను. నా కోట్లు అన్ని నిండా ఒక్కరోజులో చెద పట్టి పోవచ్చు. ఇంతటి మహా గొప్ప నిత్య అన్నదాన కార్యక్రమం శాశ్వతమైంది. నేను బ్రతికున్నా లేకపోయినా నా పేరు ప్రతిరోజు తలుచుకునేలా ఉండును. వేలాది కోట్లు ఉన్న ఉపయోగించుకోలేకపోయాను.
ఇంత గొప్పగా భవనం కట్టించి సినీ కార్మికులకు నిత్యా న్నదానం చేస్తున్న ఆ మహాపురుషుడు నిజంగా దేవుడు. ఒక్కతూరి చూపిస్తావా. కనీసం ఫోటో అయినా సరే. చేతులెత్తి దండం పెట్టుకుంటాను. '' ఆనందంగా అన్నాడు జగన్నాథం.
''అదేమీ లేదు సార్. స్థలం కొనడానికి భవనం కట్టడానికి ఈ మొత్తం ఏర్పాటుకు ఇప్పటికీ 50 కోట్లు ఖర్చు అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు సార్ ఆ డబ్బు ఎవరి ఇస్తే వారికి ఒక్క నిమిషంలో ఈ ప్రాపర్టీ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయే ఎలక్ట్రానిక్ సిస్టం మనకుంది. ఎలాగూ భవనం మీ పేరునే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అలాగే అన్నదాన ప్రారంభోత్సవం మీరే చేశారు కనుక మీరు ఓకే అంటే ఒక నిమిషంలో ఆ ఏర్పాట్లు జరిగిపోతాయి. మీకు ఆ డౌట్ అక్కర్లేదు. ఇప్పటి వరకు వ్యవహారాలన్నీ డాష్ డాష్ పేరుని జరుగుతున్నాయి.. '' ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు ప్రహ్లాదరావు.
''అట్టగా..ఇదేదో చానా బాగుండాదయ్యా. ఇదో ప్రహ్లాదు.. తీసుకో 50 కోట్లరూపాయల చెక్కులు. తీసుకో. నా కన్న పిల్లకాయలు లాంటి పరిశ్రమ కార్మికులందరూ కడుపు నిండా అన్నం తినడమే నాకు కావాల్సింది. ఇక్కడ ఈ కార్మికుల ఆనందం చూత్తా ఉంటే నాలో కొత్త శక్తి ప్రవేశించి ఎక్కువ కాలం బతకాలని ఆశ కలుగుతుండాది. సినిమాలు తీసుకుంటూ తీసుకుంటూ పోవడం కాదని నాకు అర్థం అయింది.
ఎక్కడో ఒకచోట ఆగి ఇలాంటి మంచి పని చేసి మన పరిశ్రమ కార్మిక పిల్ల కాయల అభిమానం అనే ఆక్సిజన్ గుండె ల్లో నింపుకోవాలని అర్థమయింది. ఎన్ని సినిమాలు తీసిన వచ్చినదంతా ఒకేసారి పోవచ్చు అన్నట్టు ఆయాల నువ్వు చెప్పినది పెడచెవిని పెట్టాను.
ఈ పని నేనే ఎందుకు చేయాలి అని మూర్ఖుడిగా ప్రశ్నించానయ్యా ప్రహ్లాదూ.. 24 విభాగాలు బ్రతకడం కోసం దేవుడితో సమానమైన మాలాంటి నిర్మాతలలో ఎవరో ఒకరు ఇలాంటి ముందడుగు వేస్తేనే కదా మిగతా వాళ్ళు వేస్తారు అని ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. '' మహదానందంగా మాట్లాడుతున్నాడు నిర్మాత జగన్నాథం.
''జగన్నాథం గారు.. మీరు మాట్లాడుతుండగానే మీరు ఇచ్చిన చెక్కులతో మొత్తం ఈ ప్రాపర్టీ మీ పేరున మారి పోయింది సార్. ఇప్పుడు దీనికి మీరే యజమాని. ''
ఓ పక్క సభ జరుగుతుంది. పెద్దలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రహ్లాదరావు అందించిన బాండ్ పేపర్లు అందుకున్న జగన్నాథం సంతోషించాడు. మరో గంటకు ప్రశాం తంగా సభ ముగిసింది.
''యో ప్రహ్లాదూ.. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ పాన్ ఇండియా కోటేశ్వరరావు పని పట్టాలి.. పోలీస్ స్టేషన్ కు వెళ్దాం పద. ''
''అవసరం లేదు సార్. అతను నా టచ్ లోనే ఉన్నాడు.
ఈరోజు ఉదయమే మీ దగ్గరకు రావడానికి భయపడి, నా దగ్గరకు వచ్చి తన ఆరోగ్య రీత్యా సినిమా తీయలేక పోతున్నానని 50 కోట్లు మీకు తిరిగి ఇచ్చేయమని నాకు చెక్కులు ఇచ్చి వెళ్ళాడు సార్. తీసుకోండి. '' అంటూ ప్రాపర్టీ కోసం జగన్నాథం ఇచ్చిన చెక్కులే జగ న్నాథనికి అందించాడు. '''
''ఎట్టా.. ఇవి నీకు నేను ఇచ్చిన చెక్కులే కదా. ''
''ఎలాగైతేనేం సార్! మీరు నాకు ఇచ్చిన చెక్కులతో ఈ ప్రాపర్టీ మీకు వచ్చింది. ఆ విషయం కంప్లీట్ అయింది అనుకోండి.
పోతే రెండవ విషయం.. కోటేశ్వరరావు మీకు ఇవ్వవలసిన 50 కోట్లు నేను మీకు తిరిగి చెక్కులు ఇస్తున్నాను కదా. మీ చెక్కులే. ఇది కూడా కంప్లీట్ ఫినిష్. ''
''ఎట్టా.. అటు ఇటు మనమే లాభపడినట్టున్నాం. ఈ స్క్రీన్ ప్లే ఏదో కొత్తగా రాసినట్టున్నావయ్యా. నాకు కొంచెం అర్థం కావడం లేదు.
యో ప్రహ్లాదూ.. మన పాన్ ఇండియా సినిమాకు ఇంక నువ్వే డైరెక్టర్. షూటింగ్ రేపే మొదలుపెట్టు. ఈ భవనం విషయంలో జరిగిన కంటెంట్ ని కథగా మార్చి పడేసి జగన్నాథ రథచక్రాలు టైటిల్ పెడితే బాగుంటుందేమో ఆలోచించు. ఇదిగో స్క్రీన్ ప్లే ఇంతకన్నా పగడ్బందీగా ఉండాలి. సరే.. పాన్ ఇండియా మూవీకి గొప్ప గొప్ప ఏర్పాట్లు చేయాలి కనుక ఈ 50 కోట్లు చెక్కులు నీ దగ్గరే ఉండనియ్. '' అంటూ ప్రహ్లాదరావు కు అవే చెక్కులు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు.
జగన్నాథం సభ ముగియడం తో డయాస్ దిగి నడుస్తుండగా అతని వెనుక 24 క్రాఫ్ట్ కు సంబంధించిన వేలాది మంది జనం జై జై నాదాలు చెబుతుండగా వెళ్లి తన కారులో కూర్చున్నాడు.
కానీ అతను ఇంకా తల గోక్కుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు. నేను మొత్తం100 కోట్లు ఖర్చు పెట్టా.
50 కోట్లు.. ఈ నిత్య అన్నదాన బిల్డింగ్ విషయంలో
మరో50 కోట్లు.. తీయబోయే పాన్ ఇండియా సినిమాకు ప్రహ్లాదరావుకు ఇచ్చిన అడ్వాన్సు. సరిపోయింది కదా.. నేను నష్టపోయింది ఏముంది చెప్మా.. పప్పులో కాలు వేయలేదు కదా. అనుకుంటూ తల గోక్కుంటూ జగన్నాథం ఆలోచిస్తున్నాడు.. ఆలోచిస్తూనే ఉన్నాడు.. అతను కూర్చున్న కారు చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోతోంది.
*****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments