సు...ధీర ఎపిసోడ్ 12
- BVD Prasada Rao
- Sep 10, 2022
- 7 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Su... Dheera Episode 12' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
సు...ధీర ధారావాహిక చివరి భాగం
గత ఎపిసోడ్ లో…
సు కోరినట్లు, తన తలిదండ్రుల వద్ద ఆమె ప్రస్తావన తెస్తాడు ధీర.
వాళ్ళు ఆమె నటనను అభిమానిస్తున్నట్లు తెలుసుకొని ఆనందిస్తాడు.
ఇక చదవండి...
వెంకటరావు మాట్లాడలేక పోయాడు.
"మనం ఇంతిదైపోవడమే తప్పా.. వీళ్లేమైనా మనల్ని పట్టించుకుంటారా.. పైగా మనల్ని ఎరుగుదురా." అంది సావిత్రి.
"ఈ అమ్మాయి నన్ను పట్టించుకుంది.. ఈ అమ్మాయి నన్ను ఎరుగును." చెప్పేశాడు ధీర.
ఆ తల్లిదండ్రులు మొహాలు చూసుకున్నారు.
"నేను ఈ అమ్మాయితో మాట్లాడేను.. ఈ అమ్మాయితో కల్సి తిళ్లు.." చెప్పుతున్న ధీరకి అడ్డై..
"ఏమిట్రా నువ్వు అంటుంది." అన్నాడు వెంకటరావు గాభరాగా.
"ఈ అమ్మాయితో నీకు పరిచయం ఉందా." అడిగింది సావిత్రి వింతగా.
"అవును. చాలా ఉంది." చెప్పాడు ధీర.
"మేము నమ్మాలి." అనేశాడు వెంకటరావు.
"నేను నమ్మిస్తానుగా." చెప్పేశాడు ధీర.
ఆ తర్వాత.. తన గది లోకి వెళ్లి పోయాడు.
ఆ తల్లిదండ్రులు విస్మయంలో ఉన్నారు.
"వీడికి తొందరగా పెళ్లి కానిచ్చేయాలండీ." అంది సావిత్రి.
ధీర ఫోన్ తీసుకొని.. సు కి వాట్సాప్ మేసేజ్ పెట్టాడు.
'నిన్ను అర్జంట్ గా కలవాలి. పర్మిషన్ ఇవ్వు.' ధీర పెట్టిన మేసేజ్ ఇది.
షూటింగ్ బ్రేక్ లో.. లంచ్ కై తన కారు లోకి వచ్చిన సు.. అప్పుడు ఆ మేసేజ్ ని చూడగలిగింది.
'లోకేషన్ స్పాట్ పంపుతున్నాను. అర్జంట్ ఐతేనే రా.' అంటూ తను రిప్లై మేసేజ్ పెట్టింది.
ధీర అది చూసుకొని.. వెంటనే బయలు దేరి.. సు సూచించిన స్పాట్ కి వచ్చేశాడు.
"ధీర వచ్చాడని చెప్పండి." అంటూ సు కి కబురు పంపగా.. 'తనని తన కారు వద్ద ఉండమ'ని సు తిరిగి సమాధానం పంపింది.
సు కై ధీర.. సు కారు వద్ద వేచి ఉన్నాడు.
సుమారు అర గంట తర్వాత.. సు వచ్చింది.
"ఏమిటి. అంత అర్జంట్." అడిగింది.
"మా వాళ్లు.. 'నువ్వు నాకు తెలుసు'.. అంటే నమ్మడం లేదు. అందుకే.. నాతో నీ సెల్ఫీ ఫోటో కావాలి. అది చూపి.. వాళ్లని నమ్మించ గలను." చెప్పాడు ధీర.
సు చిన్నగా నవ్వింది.
ధీరతో కల్సి.. సెల్ఫీ ఫోటో.. తనే తీసింది.. ధీర ఫోన్ తోనే.
"దీనికి అర్జంట్ అంటావా. గాభరా అయ్యా. ఎందుకు ఇంత హైరానా." అంది సు.
"మరి మా వాళ్లు.. నీ గురించి అడ్డంగా అంటున్నారు." చెప్పాడు ధీర గందికగా.
"సరే. కూల్. సాఫీగా హేండిల్ చేయ్. ఏ స్థితిలోనూ.. నా మాట లేనిదే నా గతం గురించి వాళ్లకి చెప్పొద్దు. కేవలం నా మీది వాళ్ల ఒపినీయన్ మాత్రమే తెలుసుకొని చెప్పు." అంది సు.
తలాడించాడు ధీర.
"మరి నేను వెళ్తాను. షూటింగ్ బ్రేక్ లో వచ్చాను." చెప్పింది సు.
సు షూటింగ్ కి.. ధీర ఇంటికి కదిలారు.
తిరిగి ఇంటికి వచ్చిన ధీరని చూస్తూ..
"ఏమిట్రా. హడావిడి గా వెళ్లి పోయావు. లంచ్ కి పిలుస్తున్నా పరుగులు పెట్టావు ఏమిట్రా." అడిగింది సావిత్రి గడబిడిగా.
వెంకటరావు అక్కడే ఉన్నాడు.
ఆ తల్లిదండ్రులు ఆతృత పడుతున్నారు.
ధీర తన ఫోన్ లోని.. సు తో తను ఉన్న ఫోటోని చూపాడు.
"చూడండి. ఇప్పుడే కలిశాను. ఫోటో తీసుకున్నాను. తను షూటింగ్ లో ఉన్నా వచ్చి నన్ను కలిసింది." చెప్పాడు ధీర గొప్ప ఇదిగా.
ఆ ఫోటోని చూసి.. "ఏమిట్రా ఇది. ఎందుకు ఇదంతా." అంది సావిత్రి గింజుకుంటున్నట్టు.
"ఏమిట్రా నీ ఆగడాలు. ఏం చేస్తున్నావురా. ఆమె గురించి ఎందుకురా ఇంత హైరానా అవుతున్నావు. తను రంగులు పూసుకొని.." చెప్పుతున్న వెంకటరావు కి అడ్డై..
"ఈమె మంచిది. చులకన చేయకండి." చెప్పాడు ధీర.
"అరె. ఆమెని అంటే మాకేం వస్తుంది. ఊరకనే నువ్వే గడబిడైపోతున్నావు." అన్నాడు వెంకటరావు.
"ఒరే నాన్నా.. వాళ్ల దారి వేరు.. మనం వేరు.. ఈ ఫోటోలు.. ఈ పలకరింపులు.. అన్నీ వాళ్ల పేరు కోసమేరా. నా మాట విను. మనకి ఇట్టివి వద్దురా. మన స్థాయిలో మనం పోవడమే మనకి తగ్గదిరా." అంది సావిత్రి.
"ఆమె మీది పిచ్చి వలన.." చెప్పుతున్న వెంకటరావుకి అడ్డై..
"నాన్నా.. పిచ్చి కాదు.. అభిమానం." అన్నాడు ధీర గోలగా.
సావిత్రి గతుక్కుమంది.
"మీరు ఆగండి." అంటూ భర్తని తగ్గించి..
"చూడు నాన్నా.. నీది అభిమానమే కావచ్చు.. దాని వలన వచ్చేవి అపోహలు.. పోయేవి మనశ్శాంతులు. ఏదీ అతి వద్దురా." చెప్పింది సావిత్రి.
"అపోహలు ఎందుకు.. మనశ్శాంతులు పోవడం ఏమిటి." అన్నాడు చిరాగ్గా ధీర.
"నాన్నా.. ఇప్పుడు నువ్వు వినే స్థితిలో లేవు. రా. మొదట భోంచేద్దాం రా." అంది సావిత్రి.
ఆ వెంటనే భర్తని తీసుకొని.. అక్కడ నుండి నిష్క్రమించింది.
ధీర జోరుగా తన గది లోకి చొరబడ్డాడు.
సాయంకాలం నాలుగు గంటలప్పుడు..
సు నుండి ధీరకి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
లంచ్ చేసేసి.. మంచం ఎక్కేసి.. దాని మీద దొర్లుతున్న ధీర.. చటుక్కున లేచి.. ఆ మెసేజ్ కై ఫోన్ తెరిచాడు.
'ఫోటో చూపావా' ఇది సు పంపిన మెసేజ్.
'చూపాను. వాళ్లు నీ గురించి.. దారుణంగా.. ఏవేవో వాగేస్తున్నారు. ఎందుకు అలా.. సడన్ గా.. రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు.' రిప్లై మెసేజ్ పంపాడు ధీర.
అప్పటికి సు టీ బ్రేక్ లో.. తన కారు లో ఉంది కనుక.. సు వెంటనే ఆ రిప్లైని చూడగలిగింది.
'కూల్ గా ఉండు. నీకు నైన్ పియం తర్వాత.. కాల్ చేస్తాను.' సు రిప్లై మెసేజ్ పెట్టింది.
నైన్ పియం వరకు.. కాలం చాలా భారంగా గడిచినట్టు ఫీలయ్యాడు ధీర.
సరిగ్గా అప్పుడే సు నుండి ధీరకి ఫోన్ కాల్ వచ్చింది.
"హలో." అన్నాడు గబుక్కున.
"ఇంట్లోనే ఉన్నావు కదా.." అంటూనే.. "డిన్నర్ ఐందా." అడిగింది సు.
"ఇంట్లోనే ఉన్నా. డిన్నర్ ఇంకా లేదు." చెప్పి.. "నీది." అడిగాడు ధీర.
"ఆర్డర్ చేశా.. ఆన్ ద వే." అంది సు.
"చెప్పు." అన్నాడు ధీర.
"ఇంత వరకు కాం గానే ఉన్నావుగా. ఇంట్లో ఎలా ఉంది." అడిగింది సు.
"ఇప్పటికి అంతా సవ్యంగా ఉంది. కానీ.. మా వాళ్లు.. 'నీ డ్రస్సింగ్స్' గురించి.. నువ్వు.. 'మరీ విచ్చలవిడి'గా నటిస్తున్నావని అన్నారు.. నాకు.." చెప్పుతున్న ధీరకి..
అడ్డై.. "నీకు ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. రేపు ఉదయం.. టైం చెప్తాను. నువ్వు.. నీ పేరెంట్స్ ని తీసుకొని నా షూటింగ్ కి రా." చెప్పింది సు.
"లోనికి రానిస్తారా." అడిగేశాడు ధీర.
"నేను ఉన్నాగా.. రమ్మంటున్నది నేను.. రా.. మీ ముగ్గురు తప్పక రండి." చెప్పింది సు.
"సరే." అనేశాడు ధీర.
ఆ కాల్ కట్ చేసిన పది నిముషాలకి.. సుకి డిన్నర్ అందింది.
మర్నాడు...
పరిచయాల పిమ్మట.. ధీరని.. అతని తల్లిదండ్రులని తోడ్చుకొని.. తన షూటింగ్ స్పాట్ కి వచ్చింది సు.
ప్రొడక్షన్ వారి సహకారంతో.. ఆ ముగ్గుర్ని షూటింగ్ స్పాట్ కి దగ్గరగా.. ఒక పక్కగా.. కుర్చీలు వేయించి.. కూర్చుండ పెట్టింది.
సు చేస్తున్న సీరియల్ ఎపిసోడ్ షూటింగ్ మొదలయ్యింది.
సమయం టెన్ ఏయం.
హీరో.. హీరోయిన్ ల శోభనం సీన్ షూట్ జరుగుతుంది.
హీరోగా పేరున్న సీరియల్స్ నటుడు.. హీరోయిన్ గా సు నటిస్తున్నారు.
కేవలం షూటింగ్ ఫ్రేమ్ వరకే లైట్లు వెలుతురు ఉండడంతో.. శోభనం మంచం.. దాని దరిన.. హీరో.. హీరోయిన్.. అతి స్పష్టంగా కనిపిస్తున్నారు.
చుట్టూ చాలా మంది.. వాళ్ల వైపు లైట్లు ఆర్పేయడంతో.. వాళ్లంతా చీకట్లో ఉన్నా.. వాళ్ల చూపులన్నీ ఆ వెలుతురు ఉన్న చోటే కేంద్రీకరింపబడ్డాయి.
ఎన్నో కట్స్ తో.. ఎన్నో రీషూట్స్ తో.. ఎన్నో బ్రేకులతో.. డైరక్టర్.. సహాయకుల సూచనలతో.. సర్దుబాటులతో.. మేకప్ టచప్ ల.. కాస్టూమ్స్ సర్దడాల .. హడావిడిల మధ్యన.. ఎట్టకేలకు ఆ శోభనం సీన్ షూట్ పూర్తి చేయబడింది.
సమయం ఒన్ పియం ఐంది.
షూటింగ్ కి లంచ్ బ్రేకప్ చెప్పారు.
ప్రొడక్షన్ వారి అనుమతితో.. సు కోరిక మేరకు.. డైరక్టర్ తనకి లంచ్ బ్రేక్ తో పాటు అదనంగా మరో పావు గంట టైం ఇవ్వడంతో.. ధీరని.. అతడి తల్లిదండ్రులని తీసుకొని.. కారవాన్ లోకి వచ్చింది సు.
మేకప్ మాన్ ని.. కాస్ట్యూమర్స్ ని.. పంపించేసింది సు.
"కొద్ది సేపు బయట ఉండండి." వాళ్లతో చెప్పింది.
వాళ్లు వెళ్లి పోయాక.. సు కారవాన్ తలుపు మూసేసి.. కూర్చుంది. తన శోభనపు డ్రస్.. మేకప్.. చెదిరి పోయి ఉన్నా.. తను అలానే ఉండి పోయింది.
కారవాన్ లో ఆ నలుగురే ఉన్నారు.
అక్కడి ఏసి చల్లతనంకి కూల్ అవుతూ..
"చెప్పండి. షూటింగ్ చూశారా. ఎలా ఉంది." అడిగింది సు కాస్తా నవ్వుతూ.
వాళ్లు మాట్లాడ లేదు.
"నేను కాస్తా సూటిగానే మాట్లాడతాను. ఏమీ అనుకోవద్దు." అంది సు.
వాళ్లు ఆమెనే చూస్తున్నారు.
"తెర మీద సహజం గా కనిపించడానికి మేము ఎన్నెన్ని పాట్లు పడతామో మీకు తెలియడం కోసమే.. పైగా రొమాటిక్ సీన్స్ వ్యవహరం ఎలా ఉంటుందో మీకు తెలియాలనే.. సరిగ్గా అట్టి షూటింగ్ కలిసి రావడంతో.. వెంటనే ఇలా మిమ్మల్ని ఆహ్వానించాను." ఆగింది సు.
ధీర ఏదో అనబోయాడు.
"ప్లీజ్.. పూర్తిగా నన్ను మాట్లాడనివ్వాలి." అంది సు.
ధీర మాట్లాడలేదు.
"తెర మీద కేవలం నాలుగు నుండి నాలుగున్నర నిముషాల పాటు కనిపించే.. శోభనం సీన్ పాట కోసం.. ఎంతసేపు.. ఎలా.. షూటింగ్ జరిగిందో చూశారా. ఆ మొత్తాన్ని ఎడిట్ చేస్తూ.. పాటని జోడిస్తూ.. ఆడియన్స్ కి.. దానిని ప్రజెంట్ చేస్తారు." ఆగింది సు.
ఆమెనే చూస్తున్నారు ఆ ముగ్గురు.
"అక్కడ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజమంటారా. పైగా అంత మంది మధ్య అది జరగడం సాధ్యమంటారా. ప్రతి షాట్ న.. ఎలా మేము కదలాలి.. ఎలా మేము తాక్కోవాలి.. ఎలా రియాక్ట్ అవ్వాలో.. సంబంధిత వాళ్ల పరివేక్షణలో.. ఆ లైట్ల వేడిలో.. అన్ని చూపులు మధ్యన.. ఆ శోభనం తతంగం షూట్ చేయబడింది కదా.. నా వరకు నేను.. ఆడదానిని కనుక.. నా ఇబ్బంది ఎంతో ఉంది. కానీ తప్పదు.. నటన లోకి వచ్చేక.. పాత్రని చూపాలనుకున్నప్పుడు.. అవసరం మేరకు.. అలా నటించక తప్పదు. సాధ్యమైనంత మేరకు సహజత్వం చూపడంకై.. వీలైనంత మేరకు చేయక తప్పదు.." ఆగింది సు.
ఆ ముగ్గురూ వింటున్నారు.
"తెర మీద చూపే.. చేసే.. ప్రతి దాని వెనుక ఈ పాట్లు.. ఫీట్లు ఉంటాయి.. తప్పవు. మీరే చూశారుగా.. రాతలో చదివేటప్పుడు.. భావం ప్రకారం ఆలోచనలు ఒకలా ఉండొచ్చు.. అదే చేతతో చూపినప్పుడు.. భావం ప్రకారం ఆలోచనలు మరోలా ఉండొచ్చు. ఏమైనా.. రాతలోను.. చేతలోను.. ఆ పాత్ర తన పరిథిలో రక్తి కట్టాలి.. కట్టించాలి.." చెప్పడం ఆపి.. వాటర్ బాటిల్ తీసుకొని.. కొద్దిగా వాటర్ తాగింది సు.
తర్వాత.. "ఎంత ఎలర్ట్ గా ఉన్నా.. కొద్ది మార్లు.. తెలియని షాట్లు షూట్ ఐపోతుంటాయి. తెలిశాక నిలదీయలేని నిస్సహాయత.. తెమిలే లోపే.. వాటిలో అర.. ఒకటి తెర మీదికి వచ్చేస్తాయి.. ప్చ్.. వెకిలికి.. వెగటకి పోకుండా.. నా మానంకి చేటు లేకుండా.. నా మనసుకి లోటు రాకుండా.. నా నటనని ఇన్నింటి మధ్య నెట్టుకుంటూ నడుస్తున్నాను." ఆగింది సు. ఆ ముగ్గురు వంక చూస్తుంది.
తల దించుకుంది సావిత్రి. గమనించింది సు.
వెంకటరావు రుమాలుతో మొహం ఒత్తుకుంటున్నాడు. గుర్తించింది సు.
ధీర లోని ఆందోళన సు కి తెలుస్తుంది.
"తెర మీది నా చాలా చలాకీతనం.. నా చాలా చిలిపితనం.. నా చాలా చురుకుతనం.. అలానే.. నా మేకప్.. నా డ్రస్సింగ్.. టోటల్ గా నా పూర్తి ప్రజన్టేషన్.. నా పాత్ర రిలేటెడ్ స్క్రిప్ట్ వర్క్.. సంబంధితుల డైరక్షన్ ప్రకారం.. జరిగేది మాత్రమే.. అంతే." మళ్లీ ఆగింది సు.
ఆ ముగ్గురు వింటున్నారు.
"అలాగే.. నటన అనేది కల్పితం కాదు. సహజం.. సమాజం లోని అన్ని ఏమోషన్స్ ప్రజన్టేషన్.. తెర మీద కావడంతో.. అది చాలా పోకష్డ్ అవుతోంది.. అంతే." మళ్లీ ఆగింది సు.
వాళ్లు వింటూనే ఉన్నారు.
"ఇదంతా.. ఇంతగా.. మీకు నేను చెప్పవలసిన అవసరం నాకు లేదు. అలాగే.. ఇది నన్ను నేను సమర్థించుకోవడం కానీ.. నన్ను నేను సమాధానపర్చుకోవడం కానీ.. కానే కాదు. కేవలం.. నేను.. ధీర అభిమానానికి బాగా లోబడిపోయాను. కనుకనే.. ఇదంతా చెప్పవలసి వచ్చింది నాకు." ఆగింది సు.
ఆ ముగ్గురూ.. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"అలాగే.. పైగా.. ఇదంతా ధీర ఒక్కడికే చెప్పవచ్చు.. చూపవచ్చు.. కానీ.. ధీర.. నా మీద ఏర్పర్చుకున్న అభిమానంలో.. ఎట్టి కల్మషం లేదని గ్రహించిన నేను.. ధీర నా మూలంగా ఇరకాటంలో పడికూడదని.. చాలా విధాలుగా తర్కించుకుని.. చివరికి ఒక నిర్ణయంకి వచ్చి.." సు టక్కున ఆగిపోయింది.. తన ఫోన్ రింగవ్వుడంతో.
కాల్ కలిపి.. "సర్.. మరొక్క టెన్ మినిట్స్.. పర్మిషన్ ఇవ్వండి.. ప్లీజ్." అంది.
కాల్ కట్ చేసి.. "తిరిగి షూటింగ్ కి పిలుస్తున్నారు." చెప్పింది సు.
ధీర చిన్నగా కదిలాడు. "ఏ నిర్ణయంకి వచ్చావు" అడిగేశాడు.
"నీ పేరెంట్స్.. నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో.. నీ ద్వారా ప్రయత్నించి.. ముందుగానే తెలుసుకోవాలనుకున్నాను.. అందుకే నా గురించి వాళ్ల దగ్గర కదపమని నీకు చెప్పాను." ఆగింది సు.
ధీర.. సు నే చూస్తూ ఉన్నాడు.
"నీ ద్వారా.. నా మీద.. నీ పేరెంట్స్ రియాక్షన్ గ్రహించాను.. గుర్తించాను. నిజానికి నీ పేరెంట్స్.. నా పట్ల వ్యక్తపర్చిన విధం తప్పు కాదు. సహజం కూడా. అందుకే.. ఇలాంటి వారు ఎందరో ఉన్నా.. అందరికీ నేను చెప్పే అక్కర నాకు లేదు. కానీ.. ధీర పేరెంట్స్ ఐన మీకు.. నా గురించి అవగాహన కావాలని.. మిమ్మల్ని పిల్చి.. అంతా చూపి.. ఇదంతా చెప్పుతున్నాను." చెప్పడం ఆపేసింది సు.
అర నిముషం తర్వాత.. "మొదట్లో.. తెర మీద నిన్ను చూసి.. ఒక అభిప్రాయంలో ఉన్నా.. ఇప్పుడు తెర బయట నిన్ను చూశాక.. నీ మీద నిజంగా.. అభిమానం.. కాదు.. గౌరవం కలిగిందమ్మా. నిజమమ్మా." చెప్పింది సావిత్రి.
వెంకటరావు 'అవును' అన్నట్టు తలాడించాడు.
ధీర ఎంతో సంబరమవుతున్నాడు.
"ఇక నేను వెళ్లాలి. కనుక.. చకచకా చెప్పేస్తున్నాను. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నన్ను 'ప్రేమిస్తున్నాను' అనే వారు.. నన్ను 'మరో కోణం'లో చూసే వారు.. తగిలారు. కానీ.. ధీర 'ఒకే ఒకడు'.. కేవలం 'అభిమానం' దృష్టితో మాత్రమే.. నా దరి చేరిన వాడు. రియల్లీ గ్రేట్ పర్షన్. ఇట్టి వ్యక్తి.. నా మూలంగా ఏమీ కాకూడదని.. నాతో పాటు ఇతడి తల్లిదండ్రులు ఇతడిని అర్ధం చేసుకోవాలని గట్టిగా తలిచి.. ఈ ప్రయత్నం చేపట్టాను." చెప్పింది సు.
ధీర వంక ప్రేమగా చూశారు అతని తల్లిదండ్రులు.
"దయచేసి.. ధీర లాగే.. మీ ఇరువురి నుండి కూడా.. నాకు అట్టి అభిమానమే లభించాలని కోరుకుంటున్నాను." చెప్పింది సు.
"తప్పకమ్మా." అన్నారు సావిత్రి.. వెంకటరావులు.
"నేను.. ఇప్పటిలాగే కలిసి వస్తుంటే.. మరో రెండేళ్లు మాత్రమే.. ఈ నటనలో ఉంటాను. నాకు ఆశయం ఒకటి ఉంది. అందుకు కావలసినంత కూడ తీసుకోవాలి. తర్వాత.. మీ నుండి అందే అభిమానం పంచన స్వేద తీరాలి. అంతే." చెప్పింది సు.
సు నే చూస్తున్నారు వాళ్లు.
"దయచేసి.. ఇదంతా మన మధ్యనే ఉండనీయండి. తొందరపడి బయటికి రానీయకండి. నాకు జాలి అంటే కంపరం." చెప్పింది సు.
"అలాగే కానీ తల్లీ." అన్నాడు వెంకటరావు.
"నీకు టైం అవుతుంది. మేము వెళ్తాం." లేచాడు ధీర.
అతని తల్లిదండ్రుల్ని సరదాగా కారవాన్ లోంచి సాగ నంపేక..
వెనుగ్గా దిగుతున్న ధీర ని ఆపి..
"నా అసలు పేరు అడిగావుగా.. నా పేరు.. సు.శీ.ల" చెప్పింది సు మెల్లిగా నవ్వుతూ.
ధీర ఉప్పొంగి పోయాడు.
(సమాప్తం)
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
vidya sagar vesapogu • 17 hours ago
Chala bagundi sir Thanks alot