'Subbarao Ugadi Pachhadi' - New Telugu Story Written By D V D Prasad
Published In manatelugukathalu.com On 05/04/2024
'సుబ్బారావూ.. ఉగాది పచ్చడి' తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
తనని ఎవరో గట్టిగా తట్టిలేపడంతో నిద్రలో మంచి మంచి తీయని కలలు కంటున్న సుబ్బారావుకి హఠాత్తుగా మెలుకువ వచ్చి తుళ్ళిపడి లేచాడు. కళ్ళు తెరిచి చూసిన సుబ్బారావుకి ఎదురుగా ఎవరో భద్రకాళి రూపంలో కనిపించేసరికి జడిసిపోయాడు. కళ్ళు నులుముకొని చూసిన తర్వాత తన ఎదురుగా ఉన్నది తన భార్య సుబ్బలక్ష్మే అని గుర్తించి కొంచెం స్థిమితపడ్డాడు.
"బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రేమిటండీ! లెండి వేగం లేచి తయారవండి!" కసిరినట్లే చెప్పింది ఆమె.
వెంటేనే తలతిప్పి గోడగడియారం వంక చూసాడు. ఇంకా ఏడు గంటలు కూడా కాలేదు, మూరెడు మాత్రమే పొద్దెక్కితే బారెడు పొద్దెక్కిందంటుందేమిటి అని ఆమెవైపు వింతగా చూసాడు.
"ఎన్నిసార్లు చెప్పాలి మహానుభావా! నాకవతల బోలెడు పనులున్నాయి. ఇవాళ ఉగాది. అదైనా గుర్తుందా లేదా? లేచి వేగం తెమలండి!" అని మరోసారి హెచ్చరించి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
ఉగాది మాట వింటూనే సుబ్బారావుకి గుండెల్లో గుబులు మొదలయింది. కిందటి సంవత్సరం ఉగాది పండుగ, ఉగాది పచ్చడి మనసులో మెదిలి కడుపులో తిప్పింది. పెళ్లైన మొదటిసారి సంక్రాంతి పండుగకి సెలవు దొరకని కారణంగా నేరకపోయి ఉగాదికి భార్యతో పక్క ఊళ్ళోనే ఉన్న అత్తవారింటికి వెళ్ళాడు. భార్య సుబ్బలక్ష్మి, అత్తగారు తాయారమ్మ తినను మొర్రో అంటున్నా వినిపించుకోకుండా తనకి జబర్దస్తీగా ఉగాది పచ్చడి తినిపించారు. దెబ్బకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నక్షత్రం మండలం మొత్తం కళ్ళముందు ప్రత్యక్షమైంది. ఆ మసకలో మామగారు తనవైపు జాలిగా చూడటం కనిపించింది.
ఆ జాలిలో ఎన్నోభావాలు ఉన్నా, 'బుక్కైపోయావు అల్లుడూ!' కనులతో అన్నట్లు అనిపించింది. అంత భయంకరమైన టేస్ట్ ఎప్పుడూ ఎరగడు సుబ్బారావు. ఆరు రకాల రుచులేకాక, తనకే కాదు ఎవరికీ తెలియని ఏడో రుచి కూడా అందులో మేళవించి ఉంది మరి! ఆ రుచేంటో మాత్రం అంతు బట్టలేదు. ఆ రుచి తనకే కాదు, కడుపుకి కూడా నచ్చినట్లు లేదు మరి! ఆ మరుసటి రోజు ఒకటే వాంతులు, విరోచనాలు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయిందని తేల్చిచెప్పి ఓ రెండు డజను టాబ్లెట్లు రాసి తన జేబులు నింపుకున్నాడు.
ఆ ఏడో రుచి పేరేంటో తెలియకపోయినా దాని ఫలితమేమిటో మాత్రం ఆ దెబ్బకి మా బాగా తెలిసొచ్చింది సుబ్బారావుకి. ఇప్పుడు ఆ సన్నివేశాలన్నీ గుర్తుకువచ్చి మనసుని కలవర పెడుతున్నాయి. ఈసారి కూడా ఉగాదికి రమ్మని పిలిపించినా సెలవులు లేవని, ఆఫీసుపనుందని తప్పించుకున్నాడు. అయితే ఇంట్లో భార్యతో కూడా ముప్పు పొంచిఉందని మర్చిపోలేదు, ఎందుకంటే మొదటిసారికూడా ఆ ఉగాది పచ్చడి తయారీలో భార్య హస్తం ఉందని గ్రహించాడు గనుక.
ఎలా ఉగాదిపచ్చడి బారినుండి తప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తూనే లేచి రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేసాడు. అన్యమనస్కంగానే సుబ్బలక్ష్మి అందించిన కాఫీ తాగాడు.
చివారాఖరికి ఓ నిశ్చయానికి వచ్చి, "ఆఫీసులో పెండింగ్ పని ఉంది రమ్మని నిన్న రాత్రి అప్పారావు కబురు చేసాడు. వెళ్తాను. " అని చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు.
"ఏమిటీ అప్పారావు చెప్పాడా? అబద్ధమైనా అతికినట్లు ఉండాలి కాని అతకనట్లు కాదు. అప్పారావు ఊళ్ళోనే లేడు. వాళ్ళావిడతో ఊరికి వెళ్ళాడు. ఇప్పుడే ఉగాది శుభాకాంక్షలు తెలుపడానికి ఫోన్ చేస్తే ఆమె చెప్పింది. " అంది సుబ్బలక్ష్మి.
వెంటనే నాలిక కర్చుకున్నాడు సుబ్బారావు. "నిజమే! ఆ అప్పారావు పని దొంగ, నాకు పని అంటగట్టి తను మాత్రం ఊరెళ్ళిపోయాడా!" కవర్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు కవరింగ్ కనిపెట్టింది ఆమె. అసలే సుబ్బలక్ష్మి అవలించకుండానే పేగులు లెక్కపెట్టే రకం.
"మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మను నేను. అప్పారావు లేదు, పాపారావు లేదు, ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొండి మీరు. " అంది సుబ్బారావుని కసురుతూ.
"సరే!" అని డీలా పడిపోయాడు ఒక్కసారి సుబ్బారావు. భార్య గదమాయించేసరికి ఊరుకున్నాడు కాని స్థిమితంగా ఒకచోట కూర్చోలేకపోయాడు. ఓ రెండు నిమిషాల తర్వాత, "పోనీ! అలా వాకింగ్ చేసి వస్తాను, సరేనా!" అన్నాడు సుబ్బారావు ఎలాగోలా బయటకి వెళ్ళాలని తలపోస్తూ.
ఏ కళనుందో సుబ్బలక్ష్మి షరతులేవీ విధించకుండా ఒప్పుకుంది. బ్రతుకుజీవుడా అని సోఫాలోంచి లేచాడు. వీధిలోకి వెళ్తున్నవాడల్లా సుబ్బలక్ష్మి కేకలు విని ఆగిపోయాడు. "ఎక్కడికెళ్ళినా త్వరగా వచ్చేయండి. పూజ అవగానే ఉగాది పచ్చడి తిందురుగాని. " అందామె.
ఆ మాట వినగానే సుబ్బారావు వంట్లోంచి చలి పుట్టుకొచ్చింది. "అలాగేలేవే!" అని పైకి అన్నా లోపల గుండెలు పీచుపీచు మంటున్నాయి. వీధులో నడుస్తున్నంత సేపూ ఒకటే ఆలోచన, సుబ్బలక్ష్మి చేతి ఉగాది పచ్చడి నుండి తనని తాను ఎలా రక్షించుకోవాలా అనే.
అలా అన్యమనస్కంగా వెళ్తున్న సుబ్బారావుకి, "ఏమిటోయ్! సుబ్బారావూ.. అంత పరధ్యానం!" అన్న మాట వినపడగానే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి చూసాడు. ఎదురుగా తన అఫీస్ కోలిగ్, స్నేహితుడు అయిన అవతారం.
సుబ్బారావు తనను పీడిస్తున్న విషయం చెప్పగానే నవ్వాడు అవతారం.
"ఓ.. ఈ చిన్న విషయానికి ఇంత పరేషాన్ అయిపోతున్నావా?" అన్నాడు చాలా తేలికగా.
"ఇది చిన్నవిషయమా! నా ప్లేస్లో నువ్వుంటే నీకు తెలిసేది. " అన్నాడు ముఖం మాడ్చుకుంటూ.
"నువ్వేంటి, నేనేంటి ప్రతిఒక్కరి అనుభవంలో ఉన్నదే కదా!" అన్నాడు అవతారం.
"అయితే నీకూ ఈ బెడద తప్పలేదా? మరెలా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నావు?" అడిగాడు సుబ్బారావు ఆత్రంగా.
"అదే చెప్తున్నా! ఉగాది ఉదయమే ఉదరంలో ఉబ్బరంగా ఉందని మెలికలు తిరిగా! అంతే!.. " అంటూ ఇంకా ఏదో చెప్పబోతూంటే, "ఆఁ.. బాగా అర్ధమైంది! నటనలో నాకు నేనే సాటి. ఇక తగ్గేదేలే! ఉగాది పచ్చడి తినేదేలే! థాంక్యూ అవతారం! ఇక వస్తా!" అంటూ ఈలవేసుకుంటూ యమహుషారుగా వేగంగా అక్కణ్ణుంచి బయలుదేరాడు వెనకనుండి అవతారం "నే చెప్పేది పూర్తిగా వినరా!" అన్నా వినిపించుకోలే!
ఇంటికి వెళ్తున్నదారిలో హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది. కడుపునొప్పి అని ఉగాదిపచ్చడికి చెక్ పెట్టొచ్చేమోగాని, మరి ఆత్మారాముడి ఆకలికి చెక్ పెట్టేదెలా? రోజంతా పస్తులు ఉండవలసివస్తే ఎలా! ‘తనసలు ఆకలికి ఆగలేడే' ఇలా ఆలోచించి ఎదురుగా కనిపించిన కల్పనా కేఫ్లోకి దారితీసి కడుపు నిండా తనకి ఇష్టమైనవన్నీ తిన్నాడు.
భుక్తాయాసంతో నిజంగానే కడుపు భారంగా మారింది, ఇంకేం.. తన నటన ఇంకా బాగా రక్తికడుతుంది, ఉగాదిపచ్చడి బెడద తప్పుతుందని బోలెడు సంతోషపడిపోతూ ఇంటిదారి పట్టాడు.
వీధిలోనే తనకోసం ఎదురు చూస్తున్నట్లుంది సుబ్బలక్ష్మి, సుబారావు కనపడగానే, "ఎక్కడికెళ్ళారండీ ఇంతసేపు చేసారు? పూజ ముగించి ఉగాదిపచ్చడి చేసి మీకోసమే ఎదురు చూస్తున్నాను. " అందామె.
వెంటనే నటనలో జీవించేసాడు సుబ్బారావు. "కడుపులో నొప్పిగా ఉందే!" అన్నాడు మెలికలు తిరిగిపోతూ.
"ఏం! పండుగపూట హోటల్కెళ్ళి బాగా మెక్కివచ్చారా ఏంటి?" అనుమానంగా అడిగింది సుబ్బలక్ష్మి.
నటనలో సహజత్వం ఉట్టిపడేలా మొహంపెట్టి, "అయ్యో రామరామ! లేదే! ఉదయం నుండి అలాగే ఉంటే మందులు తెచ్చుకోవడానికి వెళ్ళానే. " అన్నాడు సోఫాలో కూర్చొని మెలికలు తిరిగిపోతూ. భుక్తాయసం బాగా పనికివచ్చింది సుబ్బారావుకి ఈ విషయంలో.
"అయ్యో! ఉండండి మంచినీళ్ళు తెస్తాను తాగి మాత్ర వేసుకొని విశ్రాంతి తీసుకోండి. " అంది సుబ్బలక్ష్మి.
"అమ్మయ్య, ఉగాదిపచ్చడి గండం ఈ ఏడాదికి గడిచినట్లే!' అనుకొని మనసులోనే అవతారంకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాడు.
కాని సుబ్బారావు ఆనందం ఒక గంటలోనే ఆవిరైపోయింది. పక్క ఊళ్ళో ఉన్నసుబ్బలక్ష్మి తల్లి తాయారమ్మ గాబరాగా ఇంట్లోకి అడుగెట్టడం చూస్తూనే సుబ్బారావు పైప్రాణాలు పైనే పోయాయి. ఇద్దరూ కలసి తనని ఏ డాక్టర్ వద్దకో తీసికెళ్ళరుకదా! అలా అయితే తన బండారం బయటపడిపోతుంది. లేక ఏ కషాయమో తాగించదుకదా అని ఓ మూల బెంబేలెత్తిపోతూనే మెలికలుతీరిగిపోతూ సోఫాలోంచి లేచి ఆమెని పలకరించబోయాడు.
"ఆగండి అల్లుడుగారూ! లేవకండి! అసలే కడుపునొప్పి. " అందామె తన భారీకాయాన్ని ఇంట్లోకి చేరవేస్తూ. ఆమె మాటల్లో శ్లేష ఎమైనా ఉందా అని ఆలోచించసాగాడు బాధ నటిస్తూనే.
ఇంతలో వంటగదిలోంచి సుబ్బలక్ష్మి వచ్చి, "రా అమ్మా! చూడు అతను ఎలా లుంగలు చుట్టుకుపోతున్నారో. అందుకే నిన్ను పిలిచాను. " అందామె.
'అమ్మో! నువ్వు పిలిపించావా ఈ భూతాన్ని. నేను నీకేం ద్రోహం చేసానే?' మనసులోనే అనుకున్నాడు, పైకి అంటే ఇంకేం కొంపమునుగుతుందో అని. ఏడ్వలేక నవ్వు ముఖం పెట్టి వారిద్దరినీ చూడసాగాడు.
"చూసావా! అల్లుడుగారికి నన్ను చూడగానే కొంత నెమ్మదించినట్లుంది. " అందామె ఆయాసంగా కుర్చీలో కూలబడుతూ.
ఆమె బరువుకి కుర్చీ కుయ్యోమొర్రో అంది. సుబ్బారావుకూడా మనసులో కుయ్యోమొర్రో అంటూనే ఉన్నాడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక. ఆయాసం తగ్గిందోలేదో మరి, "సుబ్బులూ నువ్వు చేసిన ఉగాదిపచ్చడి ఇలా పట్రా!"
అన్నదే తడువుగా సుబ్బలక్ష్మి వంటింటికెళ్ళి అరనిమిషంలో చేతిలో ఉగాదిపచ్చడి గిన్నెతో ప్రత్యక్షమైంది. మరో సమయంలో అయితే ఆమె చేతిలో అమృతంపాత్రతో మోహినిలా కనిపించేదేమోగాని, ఇప్పుడు మాత్రం కాలకూట విషంపాత్రతో రాక్షసిలా మాత్రం కనిపించింది సుబ్బారావుకి.
ఉగాదిపచ్చిడి గిన్నె తాయారమ్మ అందుకుంటే ఆమె తనకోసం కాబోలు అనుకున్నాడు మొదట. అయితే ఆమె ఆ గిన్నె పట్టుకొని సరాసరి సుబ్బారావువద్దకు వచ్చేసరికి అతని పైప్రాణాలు పైనేపోయాయి.
'ఇప్పుడేం దారి!' అని బెంబేలెత్తిపోతున్న సుబ్బారావువద్దకు తల్లికూతుళ్ళిద్దరూ వచ్చారు.
"అల్లుడూ ఈ ఉగాదిపచ్చడే అన్ని రోగాలకు దివ్యమైన ఔషధం. అందుకే ఏడాదికోసారైనా తినాలంటారు. కడుపునొప్పేం ఖర్మ! దీని ధాటికి కరోనా గిరోనా కూడా భయపడి పారిపోతాయి. ఒమిక్రాన్, డెమిక్రాన్, సెమిక్రాన్ ఇలా ఎన్ని క్రాన్లొచ్చినా ఉగాది పచ్చడి దెబ్బకి పారిపోవాల్సిందే!" అంటూ తాయారమ్మ కూతురు సుబ్బలక్ష్మి సహాయంతో ఆ పచ్చడిని సుబ్బారావుకి బలవంతంగా పట్టించింది.
ఆ దెబ్బకి నిజంగానే కడుపునొప్పొచ్చి విలవిలలాడసాగాడు పాపం సుబ్బారావు! ప్రపంచ ఆరోగ్యసంస్థ సలహాదారుగా ఉండవలసిన తాయారమ్మ తనకి అత్తగారైనందుకు తనపై తనే జాలిపడ్డాడు సుబ్బారావు. కాకపోతే తనమీద జాలిపడేవారెవరూ కనిపించలేదు సుబ్బారావుకి. తనకి అలాంటి చచ్చుపుచ్చు సలహా ఇచ్చిన అవతారంమీద పీకలవరకూ కోపం వచ్చింది.
ఆరోజంతా అల్లాడిపోయి తిండికి నిద్రకీ కరువైన సుబ్బారావు ఆ మరుసటిరోజు అవతారంని నిలదీసాడు.
"ఆగరా మగడా..పూర్తిగా విను అన్నా వినిపించుకోకుండా పరుగెత్తావు. అందుకే అనుభవించావు. నేను కూడా అలాగే చేసేసరికి నాకూ మా అత్తగారూ, భార్య కలసి సర్వరోగ నివారిణి అని ఉగాదిపచ్చడి బలవంతంగా తినిపించారు. ఆ సంగతే నీకు చెప్తాననుకుంటే తొందరపడ్డావు. " అన్నాడు అవతారం తన తప్పేమీలేదన్నట్లు.
మరేమీ అనలేక మౌనంగా ఉన్న సుబ్బారావుని చూసేసరికి అవతారంకి జాలికలిగింది.
"అసలు నీకు ఇంకో ఉపాయం చెబుతాననుకున్నా! నేను ఓ సారి ఈ ట్రిక్కే విజయవంతంగా ప్లే చేసాను. సరిగ్గా ఉగాది ముందురోజు ఆఫీసుపనిమీద క్యాంప్ కెళ్ళాలంటూ బ్యాగ్ పట్టుకొని స్నేహితుడింటికి వెళ్ళా!" అన్నాడు అవతారం.
"ఓహ్! వచ్చేసారి ఈ ఉపాయం పనికివస్తుందిలే!" హుషారుగా అన్నాడు సుబ్బారావు.
"జాగ్రత్తరోయ్! ఆ స్నేహితుడు కూడా బ్రహ్మచారో, లేక అతని భార్య పుట్టింటికో వెళ్ళుండాలి. లేకపోతే అక్కడకూడా తిప్పలు తప్పవు సుమా!" హెచ్చరించాడు అవతారం.
'నిజమే సుమీ!' అనుకున్నాడు సుబ్బారావు.
ఈ ఉగాది ఎలాగూ ఓ పీడకలలా మిగిలింది, వచ్చే ఏడు ఉగాదికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలే ఆలి, అత్తగారు యమా డేంజర్ అనుకున్నాడు మనసులోనే పాపం సుబ్బారావు.
*************
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
Comments