top of page

సుబ్బిగాడు

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #Subbigadu, #సుబ్బిగాడు, #పల్లెకథలు


Subbigadu - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 09/11/2024

సుబ్బిగాడు - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



తలొంచుకుని రోడ్డెంబడి ఏదో ఆలోచిస్తూ పోతున్న చదిపిరాళ్ళ వెంకటసుబ్బన్నను

 'ఒరేయ్! వెంకటసుబ్బన్న! ఇట్రారా!' అనే పిలుపు వినబడేసరికి తలెత్తి అటువైపు చూశాడు వెంకటసుబ్బన్న.

 

 ఎదురుగా మఱ్ఱి చెట్టు అరుగు మీద కూర్చోని ఉన్నాడు కార్తల సుబ్బారెడ్డి, వెంకటసుబ్బన్న కన్న సుబ్బారెడ్డి ఐదేండ్లు వయస్సులో పెద్దవాడు. అతని చుట్టూ ఓ పదిమంది పెద్ద మనుషులు కూర్చోని టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. 


 'ఎక్కడికి సుబ్బన్నా! పోతాండవ్! తలదించుకొని. ఏయెన్న బండ్లు తగుల్తే ఈ వయస్సులో మనం తెప్పరిల్లుకోలేం! యాడికన్నా పోయేటప్పుడు అటుఇటు చూసుకుంటా జాగ్రత్తగా పోవాలా!' అంటున్న సుబ్బారెడ్డి దగ్గరకు నడిచి అతను జరిగితే తన పక్కన కుర్చున్నాడు వెంకటసుబ్బన్న. ఇంతలో టీ షాపు పిల్లోడు టీ ఇస్తే తాగాడు.


“కాదు సుబ్బన్నా! దిగాలుగా ఏం చింత సేచ్చా యాడికి పోతాండవ్ రా! అంత కట్టం నీకేమోచ్చిందీ” ఆత్మీయంగా అడిగాడు సుబ్బారెడ్డి. 


“ఏంలేదూ సుబ్బాడ్డి! నా దిగులంతా పిల్లోళ్ళ గురించే! ఏ ఉద్దేశంతో ఐతే ప్రొద్దుటూరు వొచ్చానో! అది నెరవేర లేదు సుబ్బాడ్డి”. 


“ఏంది సుబ్బన్నా! ఇంగేం కావాల! ప్రొద్దుటూరొచ్చినందుకు నడూర్లో ఇండ్లు సంపాయిచ్చినావ్, ! సలాలు, బూములు కొన్నావ్. ! పిల్లోళ్ళను బాగా సదివిచ్చినావ్!. ప్రొద్దుటూరు వచ్చిందానికి నెరవేర్చినావు కదా!” ఆశ్చర్యపడుతూ అడిగాడు సుబ్బారెడ్డి. 


“నేను చెయాల్సినవి నేను చేసాను. పిల్లోళ్ళు చదివినారుగాని గౌర్నమెంటు ఉద్దేగాలు తెచ్చుకోలేక పోయినారు. పిల్లోళ్ళ కోసమే కదా! మేము ఆలుమొగలం గాలనక, వాననక, ఎండనక అట్టకట్టాలు పడినాం. పిల్లోళ్ళ కోసమే కదా! మేము తినీ తినక పచ్చులుండి కూడబెట్టినాం. ఇంత శమంతా వ్రుదా ఐంది సుబ్బాడ్డి” తన వేదనంతా వెలగక్కాడు వెంకటసుబ్బన్న. 


“నీ దర్మం పకారం నువు సేసినావ్, పలితాన్ని దేవుడు సూసుకుంటాడు. గౌర్నమెంటు సొమ్ము తినే రాతుండాల రా! ఐనా నా కట్టం నువు పన్యావురా సుబ్బన్నా! ఎన్ని కట్టాలు పన్యాను, ఎన్ని అవమానాలు పన్యాను. కూటికి గుడ్డకు ఎంత నలిగినాను. యనకా ముందూ ఎవరు లేక ఎంత యాతన పడినాను”


 సుబ్బారెడ్డి చెప్పుతుంటే చుట్టూ కుర్చున్నవారు ఆసక్తిగా వింటున్నారు. 

“నీ కట్టం ముందర నా కట్టం ఎంతలే సుబ్బాడ్డి!” నీ కథ చెప్పు అన్నట్లు సుబ్బారెడ్డి వైపు చూశాడు వెంకటసుబ్బన్న. 


అందరి కోరిక మేరకు తన కథ చెప్పడం మొదలు పెట్టాడు సుబ్బారెడ్డి. 


 "మా ఊరు ఉలిమెల్ల. నాకబుడు వయస్సు పదైదు యేండ్లు ఉండొచ్చు. అప్పటి దాకా తెల్లబువ్వ ఎట్టుంటాదో తెల్దు. జోన్నసంగటి, రాగిసంగటి, , కొర్రకూడు, ఆరికబువ్వ, సొద్దరొట్టెలు మాత్రమే తినేటోళ్ళం. అవీ అరకొరగానే దొరికేవి. కూలికిబోయి కట్టం సేస్తేనే ఐదేళ్లు నోట్లోకి పోయేది. పచ్చులున్న రాత్రిళ్ళు మా బతుకులో లెక్కలేనన్ని. నాయిన ఆయేడే ఉన్నట్టుండి సనిపోయినాడు. ఆ యెనకే అమ్మ పోయినాది. యనకా ముందు ఎవురూ లేని అనాదనయ్యాను. ఏ దిక్కుల్యాక, ఓదార్చే వారెవరూ ల్యాక, ఏర్చియేర్చి మొగం వాచి కండ్లు ఉబ్బి పోయినై. 


 ఇరుగు పొరుగు వాళ్ళు 'అయ్యో పాపం సుబ్బిగాడు పచ్చుంటాడు' అని ఇంత తిండి పెట్టేవోళ్ళు. అమ్మ నాయిన పోయినాక నాకు మిగిలింది ఒక తాటాకుల పూరిపాక, నాలుగు మట్టి కుండలు, మూడు సత్తుబోకులు, రెండు జతల పాత గుడ్డలు. 


 నేను మోకాళ్ళ దాకా నూలు నిక్కర, ముతక బాడీతో మిగిలి పోయినాను. ఒంటరి తనాన్ని బరాయించలేక పోయేవాడిని. అర్ద రాతరి బయంతో దిగ్గున లేచి బోరున ఏర్చేవాడిని. దినాలు గడిచేకొద్దీ గుండెల్ను దిట్టపరచుకున్నేను. మొండికి బతకడానికి అలవాటు పడినాను. 


 సాటి కూలోళ్ళు 'వొరే సుబ్బిగ్యా! ఒంటరిగా ఉంటే దిగులుగా ఉంటది. మాతో కలిసి పనికి రా.. రా.. ! పదిమందిలో ఉంటే దిగులు పోతది' అని బలవంతంగా పనికి పిల్చుక పోయేటోళ్ళు. పోంగా పోంగా, పదిమందిలో కల్సడం వల్ల తొందరగానే మామూలు మనిషైనాను. 


 కూలి పనుల్లో గెనాలు చెక్కడం, పంటకాలువలు తయారు చేయడం, కోతకోసిన పంట చెత్తను ఓదెలు (పెద్ద మోపులు)గా కట్టి కల్లంలోకి మోయడం, ఓదెలను బండకేసి బాది గింజల్ను రాలగొట్టడం, వడ్గ గింజల మూటెలను ఎద్దుల బండ్ల కెత్తుకొని టౌన్లోని మండీలకు తోలడం, వరి చెత్తను వాములుగా చెయ్యడం, ఏపని ఉంటే ఆపని చేయడమే నా పని. 


పొద్దన 9 గంటలకు పన్లోకి దిగి సాయంత్రం 5 గంటల వరకు పన్జేస్తే, మద్దేనం సంగటి బెట్టి రెండాణాలు కూలి చేతిలో బెట్టేటోళ్ళు రైతులు. దాంట్లో దమ్మిడీ పొద్దన నాష్టకు, అర్థాణ మాటేల బువ్వకు కర్చైతాది. 


 ఆనాటి లెక్కాచారాల పకారం రొండు దమ్మిడీలు ఒక అర్థాణ, రొండు అర్థాణాలు ఒక అణా, నాలుగు ఆణాలు ఒక పావలా, ఎనిమిది ఆణాలు అద్దరూపాయ. పదారు ఆణాలు ఒక రూపాయ. ఇట్టుండేవి లెక్కలు. 


 గట్టిగా పట్టుపట్టి నెలకు రొండు రూపాయలు వొంతున కూడబెట్టగలిగాను. యేడాదైయేసరికి తిండి గర్చులు బోను ఇరవై నాలుగు రూపాయలు చేతిలో మిగిల్నాయి. 


బెమ్మాండమైన సంతోసం కల్గింది. ఆరోజు పొద్దుటూరొచ్చి ఓటొల్లో బువ్వ తినాలనే ఉబలాటం తీర్చకున్నేను. సిన్మాకు పోయినాను. సిన్మా ఒదుల్తానే టి అంగట్లో టీ తాగి, పాత గుడ్డలు అమ్మే బంక్కుల్లోకి పోయి నాల్గు జతలు వొంతున అడ్డ పంచెలు చొక్కాలు కొన్నాను. తువాళ్ళు, రగ్గులు కొనుక్కొని బస్సులో ఊరికి వచ్చినాను. 


పాత పూరిపాక తీసేసి కొత్త పూరిపాక కట్టుకున్నాను. కొన్ని బోకులు ఒక మూటే జొన్నలు, అర మూటె రాగులు, అర మూటె బియ్యం తెచ్చుకున్నాను. అన్నీ ఐనాక లెక్క సూసుకుంటే పద్నాలుగు రూపాయలు ఐపోయినాయి. ఇంగా పది రూపాయలు మిగిల్నాయి. ఏదో సాదించినట్టు ఉచ్చాహం ఒల్లంతా కమ్ముకున్నాది. 


ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను సూసి

‘ఏంర్రోయ్! సుబ్బిగ్యా! ఉషార్గా ఉండావ్!. మొగమంతా కన్యెగా (శుబ్రంగా) ఉంది. ఏంటి సంగతి' అని ఎగతాళిగా అడిగినారు. 


 కాలం గడిచేకొద్దీ కూల్ల రేట్లు పెర్గుతూ వొచ్చినాయి. నాకు ఇరవై యేండ్లు వచ్చేసరికి కూలికి రూపాయైంది. 


 ఒక రోజు లింగాడ్డి రేపటి పనికి ఈరోజే పిల్చిపోయినాడు. నేను వొచ్చనని మాటిచ్చినాను. పొద్దున్నే సురాడ్డి వొచ్చి 'గెనాలు సెక్కే పనుండాది. సుబ్బిగ్యా! నువైతే సులుగ్గా సూచ్చంగ సేచ్చావు. రేపు పనికి రారా' అన్నేడు.


 'లేదు సురాడ్డి! నిన్ననే లింగాడ్డి పిల్చినాడు. ఆయప్పకే పోవాల!' అన్నేనేను.


 'లింగాడ్డికి ఏదోకటి సెప్పచ్చులే గానీ నువు నాకే రావాల రా! రోంత బరువు పని ఉండాది' పట్టుపట్టి నట్టు గట్టిగా పిల్చినాడు. 


 'అదికాదు సురాడ్డి! నేను ఎవరికీ పనికి వొచ్చానని మాటిచ్చానో! ఎట్టి పరిసితిలోను వాళ్ళకే పోతాను. మాట తప్పను సురాడ్డి' అన్నేను.


 ''ఏంరా సుబ్బిగా! మా మాటే కాదంటావా? ఎంత కొవ్వు పట్టింది రా నీకు. నాల్గు దుడ్లు మిగుల్తానే అబుడే కొండికి నీరెక్కిందా నీకు. నీ కత సూచ్చానురా ' అక్కసుతో అనుకుంటా చిటమటాలాడ్తా పోయినాడు సురాడ్డి.


 ఆడాళ్ళు మొగోళ్ళు కల్సి కూలోళ్ళ గుంపు పెద్దదైంది. సుట్టూ వున్న పల్లెలకు మా కూలోల్లే పని చేసేది. మా గుంపులో తిరుపాలు కూతురు లచ్చిమి ఉండేది. ఆమెది బీద కుటుంబమైనా బో రోసగత్య, అందగత్య కూడా. ఒకరోజు పనికి రోంతా ఆల్చంగా వొచ్చినాది. సేనుగల్లోడు ఇరాడ్డి ఆయమ్మిని నిలేసి దండిచినాడు. 


 'ఏమ్మే! ఇంత ఆల్చంగా పనికి వొచ్చే మేమిచ్చేది లెక్కనుకున్నావా! లేక పెంచిక బిల్లలనుకున్నావా! లెక్క సెట్లకు కాయలెదమ్మే! కూలికి వొప్పుకున్యాక మానంగా మర్యాదగా టయానికి రావాల! వొళ్లు దగ్గిర బెట్టుకొని పన్జేయాలమ్మే! నకరాలు పడ్తే ఊరుకుండేది లేదు సూసుకో!' అన్నేడు. 


 'మాటలు రోంత సూసుకొని మాట్టాడు ఇరాడ్డి! ఈంజాతిగా మాట్టాడ్తే పడే వాళ్లెవరూ లేరు. రోంత ఆల్చంగా వొచ్చే ఇంతింత మాటలు మాట్టాడ్తావా! మేం నీ గండ్లకు మంచ్సులుగా కనపల్లేదా! మంచిగా మాట్లాడేది తెల్సుకో ఇరాడ్డి! మాకు లెక్క ఊరకీయల, మేం పన్జేచ్చాండం మీరు లెక్కిచ్చాండరు. అంతేగానీ ఎక్కువ తక్కువ మాటలు ఔసరం లేదు ఇరాడ్డీ!' దబాయించి మాటాన్యాది లచ్చిమి. 


 'ఏమ్మే! జంబంగా మాట్టాడ్తాండవ్! కూటికి లేకున్యా ఎచ్చులుండామ్మే నీకు!' అన్నేడు మొగమంతా ఎర్రగా చేసుకొని ఇరాడ్డి. 


 'కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదు ఇరాడ్డి!' అంటూ పన్లోకి పొయింది లచ్చిమి. 


 ' పిల్ల జాచ్చిది. లొంగే రకం కాదు. మాటలు జాడించి మాట్టాడ్తాంది. ' అనుకున్నేడు ఇరాడ్డి. 


 లచ్చిమి ఎబుడూ నగుమొగంతో ఉంటాది. కోపమొచ్చే అలివిగాని కోపం. ఆయమ్మీ నాతో శానా మంచిగా ఉండేది. నాతో చారసం (చతురు) పడేది. తమాస్యగా మాట్టాడేది. ఆయమ్మి అంటే నాగ్గూడా మురబ్బిగా ఉండినాది. పనికి పోయినబుడల్లా ఆయమ్మి 'సుబ్బావా! ఒంటరిగా ఎట్టుండావ్ బావా! బయమేయలేదా? నన్ను పెళ్లి చేసుకో! నీకు నోటార వండి పెడ్తాను. నీతో కల్సి పంజేస్తాను. నీకు తోడుగా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకో బావా!' గోముగా అనేడిగేది. 


 ఆయమ్మి యగతాళి చేచ్చాందిలే అనుకున్నేను గానీ కొన్నాళ్ళకు ఆయమ్మి నన్ను నిజ్జంగానే ఇట్టపడ్తాందని తెల్సుకున్నేను. అప్పట్లో నన్ను ఏలనగా మాట్టాడేటోళ్ళు, గేలి సేసేటోళ్ళు, సులకనగా సూసేటోళ్ళు ఎదురు పడేటోళ్ళు. 


 'కాదమ్మి! మీ నాయినా నా యస్మంటోనికి పిల్లనిచ్చి పెళ్లి చేచ్చాడా? నేను దిక్కూమొక్కూ లేని అనాదను. నా కెందుకిచ్చాడూ?. మీ నాయిన కేమన్నా పిచ్చా! పిల్ల నియ్యడానికి, చెప్పు' అన్నేను. 


 దానికి ఆయమ్మి 'మేమేన్నా పెద్దగా ఉన్నోళ్ళమా! ఇయ్యక ఏంజేచ్చాడు. పేదోళ్ళకు ఆడపిల్లంటే తలకాయ మీద బరువే కదా! అడిగి చూడు, ఇచ్చాడో ఇయ్యడో తెలుచ్చాది’ అన్నేది. 


 'మీ నాయినాకు లెక్క లేకున్యా ఊర్లో పరువూ పతిట్ట ఉండాది. తిరుపాల్రెడ్డంటే మంచి పేరుండాది. నేనంటే మీ నాయినకు యట్టాటి ఆలోచన ఉందో తెల్దు. మీ నాయినకు నువ్వే చెప్పు లచ్చిమి' అన్నేను. 


 'సరేలే! నేనే చెబుతాను గానీ నువు మాత్రం మా నాయిన నీతో మాట్టాడుతే దైయిర్యంగా మాట్టాడు. నంగి నంగిగా, బయంగా మాట్టాడకు. ' అన్జెప్పి ఆ పిల్లా ఎళ్ళిపోయింది. 


అప్పునుంచి నా గుండెల్లో ఏదో తెలీని తియ్యని బాద, ఒల్లంతా సన్నని ఒనుకు మొదలైనాది. ఆ పొద్దంతా యాడా ఉండల్యాక పోయినాను. పొద్దున్నే కూలికి పొయ్యినప్పుడు లచ్చిమి నాయిన ఎద్రుపడి 'ఏంరా అబ్బీ! బాగుండావా!' అన్నేడు. 'బాగుండా మామా' బెదరుబెదురుగానే మాట్టాడిన‌. 


 'అమ్మీ అంతా సెప్పినాది నాకు. మీ నాయిన నాకు పిల్ల నిచ్చాడా అన్నెవంట! కాదు సుబ్బయ్యా! నీ కంటే మంచోడు ఎవడుంటాడు. కట్టపడి నాల్గు దుడ్లు మిగల్చుకున్నవ్!. ఏ అల్వాట్లు లేవు. ఇంగేం గావాలా మాకు. పిల్ల నిచ్చి పెళ్ళి జేచ్చాగానీ పెద్దగా కర్చు పెట్లేను. నువు సరెంటే వొచ్చే మూర్తంలోనే రాందేలంలో ఓ ఇరవై మంది మద్దిన పెళ్లి సేచ్చాను. నువు పొద్దుటూరుకు పోయి పెళ్లి కూతురికి పెళ్లి గుడ్డలు, తాళిబొట్టు తెచ్చుకో! మిగతాయన్నీ నేజూసుకుంటా!' అన్నేడు.


 'అట్టనే మామా!, నువు ఎట్ట జేసినా పర్వాలేదు మామా!' అన్నేను జంకుతా. 


అన్నెట్టే పెళ్లి రాందేలంలో సాదాసీదాగా జర్గిపోయినాది. పెళ్ళిలో 'ఈ శుభ దినాన పెళ్లి కుమారుడు సుబ్బారెడ్డికి, పెళ్లి కూతురు లక్ష్మీకి వివాహ మహోత్సవం శ్రీరామాలయం నందు జరుగుతున్న శుభవేళ. అందరికీ శుభాకాంక్షలు' పూజారి అన్జెప్పినబుడు తొల్సూరి సుబ్బారెడ్డి అని విన్గానే నాకు బో కూశాలేసినాది. 


 తొలి రాతిరి లచ్చిమి నా అంచుకు వొచ్చినబుడు శానా సేప్పినాది. 'బావా! పెళ్ళి సేసుకోవడం గొప్పగాదు. మనిద్దరం ఒల్లంచి పన్జేసి నాలుగు రూకలు యనకేసుకోవాల, ఒర్రే తొర్రే, ఒసేయ్ గిసేయ్ అని పిల్చే సాయి నుంచి మనం వూర్లో గరయింపబడే సాయికి ఎదగాల, అంటే మనం బాగా కట్టపడి సొమ్ము కూడేయ్యాల' అన్జెప్పినాది లచ్చిమి. 


 'సరే! నువు సెప్పినట్టే జేచ్చాం' అన్నేను నేను. లచ్చిమి నా యింటికి వొచ్చినప్పుడు యింటికి వెలుగు, నా ఒంటికి ఉచ్చాహం వొచ్చినాది. 


 అబుడ్నుంచి ఎంత బండ కట్టమైనా సేయడం మొదలు బెట్నాం. ఒగిసిలో ఉన్నాం గాబట్టి ఎంత బరువు పనైనా సేసినాం. పొలం పన్లుతోపాటు పెళ్లి పన్లు, ద్యావర్ల పన్లు నేనూ, వొడ్లు దంచడం, రాగులు జొన్నలు విసరడం లచ్చిమీ, ఊర్లో ఏపని పడ్తే ఆపని జేసీ యేడాది తిరిగే సరికి రొండు నూర్ల రూపాయలు మిగిల్చినాం. 


 ఒకరోజు రాతిరి ఇద్దరం కుచ్చోని మాట్టాడుకుంటున్నాం. అబుడు చెప్పినాది లచ్చిమి 'బావా! మనూరి చెర్లో తుమ్మాన్లను రేపు పంచాయతోళ్ళు యాలం ఏచ్చరంట. నువు గూడా పాట పాడు బావా! మనకొచ్చేగినక, మనమే కొట్టుకుందాం. ఏమంటావ్ బావా!' అన్నెది లచ్చిమి. 


 'మన్తో ఐతాదంటావా లచ్చిమీ!. కూలోళ్ళను బెట్టుకుంటే మనకేం మిగల్దు లచ్చిమి. ' అన్నేను. 


 మనకెందుకు కూలోళ్ళు? సిన్నగా, నిదానంగా మనమే తుమ్మాన్లు కొట్టుకుందాం' అన్నేది. 


 ఆమె సెప్పిన దైయిర్యంతో పెసిడెంట్ కిట్టాడ్డిని కల్సి 'అబ్బా కిట్టాడ్డి! ఈయేడు చెర్వులో తుమ్మమాన్లను నాకియండబ్బా! ఆలుమొగలం కొట్టుకుంటాం' వినయంగా అడిగిన. 


 అరే సుబ్బా! కట్టమైన పనిరా! నువు కట్టపడ్తానంటే పంచాయితిలో మీటింగ్ పెట్టి యాలం లెకుండా నీకే ఇప్పిచ్చాలేరా సుబ్బా! ' అన్నేడు.


 'దండాలబ్బా! అడుగుతానే ఒప్పుకున్నేవు' కుతగ్యతలు చెప్పుకున్నేను.. 


 'సుబ్బా! నువు మంచోడివిరా! ఎవరేమి సెప్పినా కాదనకుండా, ఒల్లుదాసుకోకుండా పన్జేసి పెడ్తావ్! నీగాకపోతే ఎవరికి సేచ్చాను. ఇద్దరు అలుమొగలు కల్సి చెర్వులో తుమ్మాన్లు నర్కోండి. ' అన్జేప్పే సరికి ఎక్కడలేని ఉచ్చాహం వచ్చినాది. అదే ఊపున బోయి లచ్చిమికి సెప్పిన. ఆయమ్మి గూడా బో కుశాల పన్నేది. 


 కిట్టాడ్డి మాటిచ్చినట్టుగానే రొండు నూర్లకు చెర్వులోని తుమ్మాన్ల యాలం పాట మాకే వచ్చినాది. దాంతో ఎక్కడా లేని ఉషారు మా ఒంట్లోకి వచ్చినాది. చీకట్లోనే లేచి రొండు గొడ్డెళ్లు, రొండు ఈతపులులు(పొడవైన కొడవళ్ళు) సర్పిచ్చుకున్నేం. (పదును పెట్టుట) నాలుగు బోకులు, నాలుగు దుప్పట్లు, బియ్యం బ్యాల్లు తీస్కొని చెర్లో ఒకపక్క చిన్న గుడిసె ఏస్కొని తెచ్చుకున్నవి అందులో పెట్టుకున్నాం. సద్దికూడు తిని తుమ్మాన్లను ఒకవల్ల నుంచి నరకడం మొదలు బెట్నాం. పెద్ద మొద్దులు, చిన్న కొమ్మలు ఒక సైజుగా నరికి నెట్టు కట్నాం. అంబలి పొద్దుకల్లా ఇద్దరం కల్సి రొండు టన్నులు కొట్టినాం. బువ్వ తిని రోంత సేపు అల్చట తీర్చుకొని మల్లా పన్లోకి వంగినాం. పైటాలకు మరొక టన్ను కొట్టినాం. 


 రొండు ఎద్దుల బండ్లును, బండికి మూడు రూపాయలు వొంతన బాడిక్కు మాట్టాడుకొని బండికి టన్నునర్రా మొద్దల వొంతున రొండు బండ్లకు ఎత్తుకున్నేం. లచ్చిమిని ఈడ్నే ఉండు అన్జెప్పి, పొద్దుటూరులోని చెక్క డిపోకు తోలినాను. చెక్క డిపోలో టన్నుకు పన్నెండు రూపాయల చొప్పున మొద్దులు తూకం ఏస్కోని మూడు టన్నులకు ముప్పైఆరు రూపాయలు ఇచ్చినాడు డిపో ఓనరు. రొండు బండ్లకు మూడు రొండ్ల ఆరు రూపాయలు బాడిగ ఇచ్చి పంపించాను. 


 గుడ్డల షాపుకు పొయి లచ్చిమికి రొండు సీరెలు, రొండు రైకలు, నాకు రొండు పంచెలు రొండు చోక్కాలు కొన్నేను. ఓటల్కు పోయి రొండు బిర్యానీ పోట్లాలు కట్టించుకొని కదుల్తున్న మా వూరు పోయే ఆకరు బస్సును ఎక్కి కూర్చున్నేను. రాత్రి తొమ్మిది గంటలకు యింటికి చేరినాను. లచ్చిమి శానా సంతోస పన్యాది. 


 కర్చు బెట్టిందానికి నువు కోపడ్తావనుకున్న లచ్చిమీ!' లచ్చిమితో అన్నేను.


'కూడపెట్టేటబుడు కూడబెట్టాల, కర్చుబెట్టేటబుడు గర్చుబెట్టాల. నువు కర్చుబెట్టింది కూడుకు, గుడ్డకే కదా బావా! కూడు తినకపోతే పన్జేయలేం. మంచి గుడ్డ కట్టకపోతే ఎవరూ గరయించరు. కాబట్టి నువు మంచి పనే సేసినావులే బావా!' అన్నేది.. 


 మల్లా పొద్దున్నే లేచి సద్దిబువ్వ తిని పన్లోకి దిగినాం. రోజు మూడు టన్నులు కొట్టడం, పొద్దుటూరులో అమ్మడం, అట్టా చెర్లో తుమ్మాన్లు ఐపోయేసరికి నెల్రోజులు పట్టింది. నూరు టన్నులు తూకానికి వొచ్చినాయి. అసలు పోను ఎయ్యి రూపాయలు మిగిల్నాయి. ఆకరు దపా తుమ్మ్సాన్లు డిపోకు తోలేటబుడు లచ్చిమిని గూడా పిల్చకపోయినాను. 


కట్టెలను డిపోలో వేసి లెక్క తీసుకున్నాక ఇద్దరం ఓటలుకు పోయి బువ్వ తిన్నాం. సిన్మాకు పోయినాం. సిన్మా ఇడ్చినాక గుడ్డల షాపుకు పొయి లచ్చిమికి అందమైన నాన్యమైన ఐదు రైకలు ఐదు సీరెలు కొన్నాం. నాకు ఐదు పంచలు ఐదు చొక్కాలు కొన్నాం. ఇంగా బియ్యం బ్యాల్లు, ఉప్పు పప్పు, కూరగాయలు కొనుక్కొన్నాం. మా పల్లెకు పోయే బస్సు కదలడానికి ఇంగా శాన సేపు ఉండాది. 


 'లచ్చిమి! రోంత సేపు పార్కులో కుర్చుందామా! సల్లగా ఆయిగా ఉంటాది" అన్నేను. 


దానికి లచ్చిమి "మనూరు పెన్నేటి ఉసుక దిన్నె మీద కుర్చుంటే పారే నీటి మీదునుంచి వొచ్చే గాలి వొల్లుకు తగిలి గిలిగింతలు పెడ్తాది.. ఇంత కన్నా ఆయిగా ఉంటదిగాని పద బావా పోదాం ఊరికి. ' అన్నేది. 


సరేయని ఓటల్లో రొండు పుల్లు బువ్వ పొట్లాలు కట్టించుకొని బస్సెక్కి యిల్లు సేరినాం. 


 ఆమర్నాడే లచ్చిమి నెల్దప్పిదని తెల్సి బో ఆనంద పన్నేం.. మా పాకకు పక్కనున్న చౌడు మిద్దెలో బాడక్కు సేర్నాం. టౌన్కుబోయి, పరుపు, పట్టెమంచం, తల్దిండ్లు, నాలుగు కుర్జీలు, ఒక సోపాజీటూ, వంటకు బోకులు, శంబులు, బిందెలు కొనుక్కొని ఒంటెద్దు బండి కెత్తుకొని, ఇంటికొచ్చి ఎక్కడికక్కడ సర్దినాను. లచ్చిమి శానా సంతోసపడినాది. 

 అబుడే పెసిడెంటు కిట్టాడ్డి మా యింటికి వచ్చినాడు. 


ఆయన్ను ఆదరంగా తీసుకొచ్చి సోపాసీటు మింద కూర్చోబెట్టి "సేప్పు కిట్టాడ్డి! ఏమైనా పనుందా! సేచ్చాను. " అన్నేను అబిమానంతో. 


లచ్చిమి కిట్టాడ్డికి మంచి నీళ్ళు తెచ్చి యిచ్చినాది. నీళ్ళుతాగి కిట్టాడ్డి


 'సెప్పుతాను, సేచ్చువుగానీ! దానికన్నా ముందు ఒకమాట సెబుతాను సుబ్బా! నువు కట్టజీవివి రా! నీ పెళ్ళాం నీకన్న కట్టజీవి కాక తెలివైది. ఆమె నీ భార్య కావడం నీ అదుట్టం. నీ కట్టాలన్నీ తీర్తాయి. నీ దస ‌మార్తాది. నువు పెద్ద సాయికి వొచ్చావు. నా ఈ మాట గుర్తుపెట్టుకో సుబ్బా!' అన్నేడు. 


 'అయ్యా! మీ నోటి సలువ వల్ల మేం పైకొచ్చే మిమ్మల్ని మర్చిపోమయ్యా' అన్నేది లచ్చిమి. 


 దానికి కిట్టాడ్డి 'లచ్చిమి! నువు నన్ను అయ్యా అని పిల్చకు అన్నా అని పిల్చమ్మా" అన్నేడు కిట్టాడ్డి. అట్టనేసరి బో మురిసిపోయినాది లచ్చిమి. 


 నేనొచ్చిన పనేమంటే, తొలకర్లు మొదలైనాయి కదా!. పొలాలు దున్నుకుంటున్నారు రైతులు. దున్నకాలల్లో రసానిక ఎరువులు త్యాడానికి పతేడు లాగానే యింటికొక రైతు వొంతున విజయవాడ పోతాండరు. నేనూ పోవాల. ఐతే నాకు అర్జంటుగా ఒగ పని పన్నేది. నా బదులు నువు పోయి ఎరువులు త్యావాల సుబ్బూ! నీకు కూళ్ళు, గర్చులు ఇచ్చాను. పోయేచ్చవా?' అన్నేడు. 


'ఏంది కిట్టాడ్డి ! నువు చెప్పితే నేపోనా! పోతాన్ లే ' అన్నేను.


 'ఐతే పొద్దున్నే రాముడి గుడి కాడికి రా! ఎరువులకు పోయే రైతులంతా ఆడ్నే గుమిగూడ్తారు! వాళ్ళెంబడి పోదువు. రెడీగా ఉండు' అన్జెప్పి పోయినాడు కిట్టాడ్డి. 


 అప్పట్లో సల్ఫేట్, నైట్రేట్, యూరియా, అమోనియా, డిఏపి మొదలైన రసాయనిక ఎరువులు దగ్గిర్లో దొరికేవి కావు. 

 పొద్దున్నే రాముడి గుడి దగ్గిర విజయవాడ పోయే రైతులందురూ జమై ఉండారు.


 నేను వొచ్చెంత వరకు కూలికి పోవద్దని లచ్చిమికి జెప్పి ఆగుంపులో కల్సినాను. కిట్టాడ్డి వొచ్చి ఎరువుల లిస్టు, అవసరమైన లెక్క ఇచ్చి 'జాగరత్తాగా పోయిరా!' అన్నేడు. పొద్దుటూరు నుంచి విజయవాడ పోయే బస్సెక్కి మేమందరం బయల్దేరినాం. 


 దోవ మద్దిన రైతులు నాతో మాటలు బెట్టుకున్నేరు. 'వొరే సుబ్బయ్యా! కిట్టాడ్డి తరుపున వొచ్చాండవా! వచ్చేడు నుంచి మా తరుపున గూడా నీవే వొచ్చి ఎరువులు తీసకవొచ్చవా! అన్నీ గర్చులు బోను నీకు ఎరువు మూటెకు రూపాయి వొంతున లాబం ఇచ్చాం. అ టైంలో మేం యింటికాడ ఉండి సేద్యాలు చేస్కుంటాం' అన్నేరు రైతులు.


 'అట్టనే తెచ్చా గాని, ఎట్టా త్యావాలో సెప్పండ్రీ' అన్నేను.


 'విజయవాడలో ఎరువుల అంగట్లో ఎట్ట కొనాలో, ఏఏ ఎరువులు కొనాలో అన్ని సెబుతాం' అన్నేరు. 


 విజయవాడ చేరినాక అంగడి ఓనర్కు నన్ను పరిచయం సేసి" వొచ్చేయేడు నుంచి మాందరి తరుపున వీడు వొచ్చాడు, అవసరమైన ఎరువులు ఇచ్చి, లారి మాట్టాడి, లోడు చేయించి పంపు ఓనరూ" అన్జెప్పినారు.


 'అట్టనే జేచ్చాం, పన్లు మానుకొని అందరూ వొచ్చేకన్నా మీ అందరి తరుపున ఒకడు రావడమే మంచిదిలే' అన్నేడు అంగడి ఓనరు. 

 అది మొదలు ప్రతేటా రైతులు ఎరువుల పట్టి, లెక్క ఇయ్యడం, నేను ఎరువులు తెచ్చియ్యడం జరుగుతాంది. అది జూసిన పక్కూరి రైతులు, దాని పక్కూరి రైతులు అట్టా సుట్టుపక్కల వూర్ల రైతులు లెక్కిచ్చి ఎరువులు తెమ్మన బట్టిరి. నేను బాడిక్కు లారి మాట్టాడుకొని ఆర్నెల్ల పంట కాలమంతా ఎరువులు తొల్తాంటి. 


 అదే యేడు లచ్చిమికి పండొంటి మొగపిల్లోడు పుట్నాడు. అలుమొగలం సంబరంలో మునిగిపోతిమి. కూతురు కాన్పుకు తోడుండడానికి వొచ్చిన లచ్చిమి అమ్మా నాయినలు, కాన్పు ఐనాక వాళ్లింటికి పోడానికి గుడ్డలు సర్దుకుంటా ఉంటే "అత్తా! మామా! మీగాంగ ఎవరుండారూ, లచ్చిమి ఒకటే కదా కూతురు. మాకు పెద్ద దిక్కుగా ఇక్కడే ఉండిపోండ్రీ. నాకు అమ్మానాయిన లేనిలోటు తీరుతాది" అన్నేను నేను. 


ఆమాటతో వోళ్ళు సంతోసంతో కన్నీరు పెట్టుకున్నారు "అట్టనే నాయనా, మాకు మీరు తప్ప ఎవరుండారూ? ఇక్కడే ఉంటాం సుబ్బయ్యా!" ఆనందపడిపోతూ అన్నేరు. లచ్చిమి ఆనందానికి అడ్డుగోడలు లేవు. 


 యేటికేడు లెక్క మిగల్బాటు ఐతావొచ్చె. మాయింటి పక్కిల్లు అమ్మకానికొచ్చే, కొని దాంట్లోకి సేరితిమి. రొండేళ్ళకు ఐదువేలు మిగులుబాటు ఐనాది. బాడిగ లారీలు డిమేండ్ సూసి బాడిగ పెంచుతాండ్రి. మా కొచ్చే లాబం బాడెక్కే సగం పోతాంది. అబ్బుడే పొద్దుటూర్లో రొండు మడ్గాసేపు పాత లారీలు బ్యారానికి వొచ్చినైయని తెల్సినాది. అప్పటికి ఇంగా ఎల్పీసేపు బండ్లు మార్కెట్లోకి రాలేదు. 


 కొందామనుకొంటే, కడాకు లారీలను పద్వేలకైతే ఇచ్చానంటాండడు లారీల ఓనరు. నాకాడ సూచ్చే ఐద్వేలే ఉండాది. యట్ట సెయ్యాలబ్బా అనుకుంటా బోయి లచ్చిమికి సెబుతి. లచ్చిమి కిట్టాడ్డన్నను అడగమని సలహా ఇచ్చే. సరేయని కిట్టాడ్డి యింటికి లెక్క అప్పడగను పోతాంటే కిట్టాడ్డే పెద్దేప్పాను కాడ ఎద్రుపడి

 'ఎంటోయ్! సుబ్బా! నీ యవ్వారం జోరు మీదుందే' అన్నేడు నగుతా. 'అంతా నీ దయ కిట్టాడ్డి!' అన్నేను.

 

 'నాదేం లేదు సుబ్బూ! అంతా నీ కట్టం, దేవుని దయగానీ, ఇప్పుడు నాతో పనేమీ' అన్నేడు.


 'ఏంలేదు కిట్టాడ్డి! పొద్దుటూర్లో రొండు పాత లారీలు బ్యారానికి వొచ్చినయ్. రొండు లారీలు కడాకి పద్వేల మీద కూర్చుండాడు. నా దగ్గిర ఐద్వేలే ఉండాది' అని తల గీరుకున్నె.. 


 'ఆ ఐద్వేలు నన్నిమ్మంటావు. అదడగాడానికి మొహమాట పడతాండవు. ఔవునా సుబ్బడూ!. నా దగ్గిర మొహమాట పడాల్సిన పన్లేదు. నువు ఎదుగుతున్న సూరీడివి. నీకు కొంత ఆపు అందిచ్చే ఇంగ నీ ఎదుగుదలకు ఎదురుండదు. " అన్జెప్పి ఐద్వేలు ఇచ్చి నా వీపు తట్టి దైయిర్యం సెప్పినాడు.


 నేను దండాలు చెప్పుకొని ప్రొద్దుటూరు పోయి రొండు లారీలు కొన్నేను. లారీలు కొన్నె టైమేమో గానీ బోలేక్క సంపాయిచ్చినాయి. ఆర్నెల్లపాటు రైతుల ఎరువులు, ఇంగార్నెల్లపాటు ఇతర బాడిగెలు తోలినాను.. ఆర్నెల్లు తిరక్కుండానే కిట్టాడ్డికి ఐద్వేలు ఇచ్చేసిన. 


 ఊరికి మొగదాల్నె ఐదెకరాల పంటబూమి అమ్ముతాంటే కొంట్టి. భూమి సాగు పన్లు లచ్చిమి, అత్తామామ సూసుకుంట్రాండ్రి. లచ్చిమి బూమికి యజమాండ్లం కావడంతో సంబరపడి శాన కట్టపడి పండిచ్చాండె. అరవై డెబ్బై మంది కూలోళ్ళకు సంగటి ముద్దలు చేసి పొలానికి ఎత్తుకు పోయి కూలోళ్ళకు పెడ్తాండినాది. పొలం మీద రాబడి తోనే పక్క సేను ఐదెకరాలు కొన్నేం. 


 నేను పొద్దు పొడిచినానుంచి పొద్దు గుంకే దాకా పొద్దుటూరులో లారీలకు బాడిగెలు సూసుకుంటా, బాడిగ బ్యారాలు మాట్టాడుకుంటా అసర్సందేలకుగానీ వూరొచ్చేవాన్ని గాదు. లారీలతో వొచ్చిన లాబాల్తో మరో రొండు ఎల్పిసేపు కొత్త లారీలు కొన్నేను. ఆ సమచ్చరమే ఎల్పి బండ్లు మార్కెట్లోకి వొచ్చినాయి. 


 మాకు ఇద్దరి మొగపిల్లోళ్ళ ఎనకాల వొక ఆడపిల్ల పుట్టినాది.. పెద్ద పిల్లోన్ని ఊరి ఎలిమెంటరీ బళ్ళో ఏసినాను. ఊర్లో సదువు ఐపోతానే మా పెద్దోడు రామాడ్డిని, కిట్టాడ్డి కూతురు మాలచ్చిమిని ఇద్దరూ బస్సులో బోయి పొద్దుటూరు హైస్కూల్లో సదువుకొని వొచ్చాండ్రి. 


 అదేడు ఊర్లో గొడోను గట్టి ఎరువుల్తో నింపినాను సుట్టుపక్కల రైతులు ఎద్దుల బండ్లు గట్టుకొచ్చి ఎరువులు తీస్కొని పోతాండిరి. ఎరువుల అమ్మకాలు సంగతి లచ్చిమి సూసుకుంటాండె. పొద్దుటూర్లో ఎకరా సలం కొని చుట్టూ కాంపౌండు గట్టి అందులో ఆపీసు, డ్రైవర్ల, క్లీనర్ల విశ్రాంతి గదులు గట్టినాను, లారీలు నిల్పడానికి సలం ఏర్పాటు చేసినాను. 'శ్రీలక్ష్మి ట్రాన్స్ పోర్ట్ కంఫినీ' అని బోర్డు రాపించి ఆపీసు రూంకు తగిలించ్చినాను. 


ఆపీసు ఓపెనింగ్ రోజు మావూరి జనాల్తోబాటు వొకనాటి నాసాటి కూలోళ్పను గూడా పిల్చి, చియ్యా బువ్వాతో. బెమ్మాండమైన విందు ఇచ్చినాను. 


 కిట్టాడ్డి సమచ్చంలో లచ్చిమితో ఆపీసు రిబ్బన్ కటింగ్ సేయించినాను. అత్తామామా సంబరానికి అడ్డూ ఆపు లేకుండా పోయినాది. పంక్షను కొచ్చినోళ్ళు ' నీ స్టార్ వెల్గి పోతాంది, నీ దెస తిరిగినాది సుబ్బాడ్డి' అనబట్టిరి. 


 యేటికేడు ఊర్లో బూములు పెరుగుతాండె, టౌన్లో లారీల సంక్య పెరుతాండే. ఊరికి టౌన్కు తిరగడానికి జీపు కొన్నేను. ఆజీపులోనే నా కొడుకులిద్దర్ని కూతుర్ని, కిట్టాడ్డి కూతురు కొడుకుని టౌన్కు తీసుస్కబోయి కానుమెంటులో విడిచి ఆపీసు ఐపోగానే. మల్లా సాయంతరం పిల్లోలందరిని జీపెక్కించుకొని ఊరికి వొచ్చాంటి. 


 టౌన్లో శ్రీలక్ష్మి ట్రాన్స్ పోర్ట్ కంపినీకి డ్రైవర్లు క్లీనర్లు, ఆపీసులో ఉద్యోగులు యెక్కవ మంది అవసరం వొచ్చే. పల్లెలో ట్రాక్టర్లు, సేద్యపు పనిముట్లు జీతగాళ్ళు, పనిమనిషులు పెర్గిపోయినారు. ఊర్లో అందమైన బిల్డింగ్, ప్రొద్దుటూర్లో సుందరమైన భవనం కట్టినాను. లచ్చిమి యిప్పుడు అందరి మీదా పెత్తనం సేచ్చా సేద్యపు పనులు సేయిచ్చాండే. పట్టుచీర కట్టుకొని ఖరీదైన ఆభరణాలు ధరించి మహారాణిలా కన్పడ్తాండే.. 


ఎక్కిడికైనా పోవాలంటే కారులోనే పోతాండె. ఐతే ఎంత పెరిగినా తనలో ఉండే కరుణ దయ ప్రేమా అభిమానం ఇతరులంటే గౌరవం చెక్కుచెదర లేదు. 'ఒసేయ్ తసేయ్' అని పిలిటోళ్ళు 'లక్ష్మీ! లక్ష్మీ గారు!' అని పిల్చుతాండ్రి.


 నేను పొద్దున్నే లేచి నీళ్ళు పోస్కొని, తెల్లటి ఖద్దరు చొక్కా ఏస్కొని, పెద్దంచు పొందూరి పంచే కట్కోని, బుజం మీద కండువా ఏస్కొని, కిర్రు చెప్పులు తొడ్గొని, జీపులో ఆఫీసుకు పోతాంటిని. "సుబ్బిగా, సుబ్బిగాడు" అనెటోళ్ళు ఇంగా అట్టా అనలేక పోయిరి. కొంతకాలం పిల్చడం మానేసి మల్లా కొత్తగా పిల్చడం మొదలు బెట్నెబుడు సుబ్బారెడ్డి అనబట్టిరి. ప్రొద్దుటూరులో మా ఆఫీసు పక్కనే ఎరువుల షోరూం కట్టి కిట్టాడ్డితో ఓపెన్ సేయించితి. 


 ఇబ్బడిముబ్బడిగా సొమ్ము వొచ్చి పడుతున్నబుడు ఊరికి ఏదో సెయ్యాలని అన్పించినాది. ఎలిమెంటరీ స్కూల్ను హైస్కూలు సాయికి పెంచిన. సిన్న రాందేలాన్ని నాల్గు గోపరాలు ఉన్న దేవలంగా కట్టిన. కల్యానమండపాన్ని కట్టిన. వొకే కాంపవుండులో ఇంటరు, డిగ్రీకి బవనాలు కట్టించి పల్లె రుణం తీర్చుకున్నా. 


 లచ్చిమి గూడా ఊరకుండలె. పల్లెలో మహిళా సంగం యేర్పాటు సేసి పేద స్త్రీలందరికీ కుటీర పరిశ్రమలో శిక్షణ ఇప్పించి బ్యాంకులో రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించింది. 

 ఇంత సాఫీగా సాగిపోలేదు నా జీవితం. కట్టాలు నట్టాలు, బాదలు ఏదనలు గూడా ఉండాయి. 


 వొక నాటి హీన దీన స్థితిలో ఉన్నోడు, మనతో 'అర్యే తొర్యే' అనిపించుకున్నోడు అందనంత సాయికి ఎదిగితే సూడల్యాక ఈర్ష్య, అసూయ, ద్వేషంతో రగిలిపోయినారు కొందరు. అట్టా కడుపు రగిలినోళ్ళు వొక నాటి రాతిరి నూరు మామిడి సెట్లు నరికినారు. మరో ఆరు నెల్లకు బాగా పండి, రేపు కోత కోచ్చామనంగా ఈరోజు రాతిరి పదిఎకరాల సేన్ను గబ్బు నూనె సల్లి, అగ్గి పెట్టి బూడిద చేసినారు. 


అప్పిటికే నాకు నట్టాన్ని బరాయించే శగితి వొచ్చి నందున పెద్దగా బాద పల్లేదు. వాళ్ళను గుర్తించి, వొకనికి కూతురి పెళ్లికి సాయం సేసిన. ఇంకోకనికి అప్పులు తీర్చేకి లెక్క ఇచ్చిన. మరొకని కొడుక్కు ఉద్యోగం ఇప్పించిన. అప్పుడి నుంచి కడ్పుకుట్టు పన్లు ఎవరూ చేయలేదు. 


 ఒక తూరి లచ్చిమికి తీవ్రంగా విషజరం వొచ్చినాది. శానా పెద్ద ఆసుపత్రిలో సేర్చినాను. సూచ్చా సూచ్చాండంగానే బలఈనమైపోయినాది. డాక్టర్లు లాబం లేదన్నేరు. నా గుండెలు పగిలిపోయినై. లచ్చిమిని బట్టుకొని తనుకులాడిపోయిన. బోరున ఏర్చిన. 

‘లచ్చిమి.. నన్ను ఒంటరివోన్ని సేసిపోతావా! నువు లేకుండా నేను బతకలేను లచ్చిమి! నా ఊపిరి, నా ఆలోచన, నా బలం, అన్నీ నువ్వే లచ్చిమి! నువు లేకుంటే వొక చనం బతకలేను లచ్చిమి’ అని గోడుగోడన ఏర్చిన. 


 'అట్ట మాట్టాడకు బావా! ఎవరి వొంతోచ్చే వాళ్ళు పోవాల్సిందే గదా బావా! నువు ఎట్టా వొంటరోడివి ఐతావూ, మన పిల్లలు నీకు తోడుంటరు. నువు వోళ్ళ కోసరమైనా ఉండాల బావా!. ' అని వోదార్చినాది. 


 ఇంతలో ఎట్టా కొనుక్కున్నాడో ఏమో! మా పక్కూరు నాటు వైద్యుడు దేవుడాల మిమ్మల్ని వెతుక్కుంటా ఆసుపత్రికి వొచ్చినాడు. ‘రెడ్డీ! ఈ జబ్బుకు ఇంగ్లీష్ వైద్యం అంతగా పని చేయదు. ఆకు పసరు కషాయం మూడు పూట్లా వొంతున మూడు రోజులు తాప్తే బాగైతది. ఇది డాక్టర్కు తెలియకుండా జరగాల. తెలిస్తే పెద్దగా రదణ (గొడవ) సేచ్చరు’

 అన్జెప్పి కషాయం కడుపులోకి ఇచ్చినాడు నాటు వైద్యుడు.


 అంతే, చావు అంచుల్దాక పోయిన లచ్చిమి బతికి బట్టకట్టింది. నాకు నా పిల్లోళ్ళకు చలనం వొచ్చినాది. మొహాళ్ళో వెలుగొచ్చినాది. 


 అట్టా శాన్నాళ్ళైనాక నేను హైదరాబాద్ నుంచి కొత్త లారీల డెలివరీ సేస్కొని వొచ్చాంటే నాకు పెద్ద యాక్సిడెంట్ ఐనాది. కర్నూల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చినారు. ఇంటిల్లిపాదితో పాటు జనం సముద్రంలా సూడ్ను వొచ్చినారు. నాకు సుహ వొచ్చేసరికి లచ్చిమి నామీద పడి అలవి కాకుండా ఏర్చాంది.. ఆపడం ఎవరి తరం గావడంల్యా. 


 'నీకేమైనా ఐతే నేనిక్కడ ఉండును బావా! నీతో వొచ్చా బావా!' అంటాంది వొనుకుతున్న గొంతతో. 


 'లచ్చిమీ! నువు బూమీద ఉన్నెంతవకు నేనూ ఉంటాను! మనల్ను ఎవరూ వేరు చేయలేరు లచ్చిమీ' అని ఓదార్చినాను. అట్టా మూనెళ్ళకు తేరుకొని యింటికి వొచ్చినాను. కిట్టాడ్డి అంచునుండీ అన్నీ సూసుకున్నేడు. 

 పదైదేండ్ల వొయస్సబుడు మా పెద్దోడు రామాడ్డికి డెంగు జబ్బొచ్చినాది. అప్పట్లో ఆ జబ్బుకు సరైన మందులు ఉండేవి కావు. పిల్లోడు తబ్బిబ్బులైనాడు. ఆలుమొగలం విలవలలాడినాం. చెన్నైకి తీస్కొని బోయి లచ్చలు కర్చుబెట్టి బయట పడేసుకున్నాం.. 


 ఇక మా లారీల ట్రాన్స్ పోర్టు కంపినీ యాపారంలో ఇప్పటిదాకా దాదాపు ఇరవై ముప్పై యాక్సిడెంట్లు జర్గింటై. శానా మందే డ్రైవర్లు క్లీనర్లు సనిపోవుంటరు. వోళ్ళ కుటుంబాలందర్నీ ఆదుకొని పైకి తెచ్చానాను. ఇలా నా జీవితంలో కట్టాలు, నట్టాలు, బాదలు, ఏదనలు దాటుకుంటా యిక్కడి దాకా వొచ్చినాను. 


 నా కబుడు అరవై యేండ్లు. పిల్లలు డిగ్రీ పూర్తి సేశారు. పెద్దోడు రామాడ్డి ఊర్లో బూములు సూసుకుంటా వుండినాడు. సిన్నోడు నర్సింహాడ్డి టౌన్లో ఉండి లారీలను మెయింటైన్ సే‌స్తుండేటోడు. మేం ఇట్టా ఎదుగుతాంటే కిట్టాడ్డి పంచాయతీ ప్రెసిడెంటుగా, మండలాధ్యక్షుడిగా, జెట్పిచైర్మనుగా, ఎంల్ఎగా రాజకీయంగా ఎదగినాడు. ఈయేడు మంత్రి పదవి కూడా వొచ్చాదని అనుకుంటా ఉండేవోళ్ళు.. కిట్టాడ్డికి అవసరమైనప్పుడల్లా లెక్క ఎదిగిచ్చా వుంటి. 


 వొక రోజు నేను లచ్చిమి పొద్దుటురుకు పోతాంటే బుడ్డోడి బాయి కాడ కిట్టాడ్డి ఎద్రుపడి మా కారు ఆపి 'సుబ్బాడ్డి కారు దిగు, నీతో రోంత మాట్లాడాల!. అమ్మా లచ్చిమి! నువు గూడ' అన్నేడు. 


'ఏందబ్బా' అనుకుంటా కారు దిగి రోడ్డు పక్కన జీగిమాను కింద అరుగులుంటే ఆడ కుర్చుంటిమి. 


 'సుబ్బాడ్డి!, సెల్లెమ్మా! నేను తాస్కారం (తాత్సారం) చేయకుండా సూటిగా చెబుతున్నా!. మీ పెద్ద కొడుక్కి నా కూతుర్ని సేసుకోమని అడుగుతున్నా! మీరేమంటారో చెప్పండ్రి' అన్నేడు. 


 మేం వొకరి మోకాలు వొకరం సూసుకుంటిమి. 'కిట్టాడ్డి నువు మా ఎదుగుదలకు ఎంతో సాయపన్యావ్. దైయిర్యం చెప్పి ముందుకు పొమ్మన్యావ్. అట్టాటోడు పిల్లనిచ్చాంటే కాదంటామా?" అన్నేను. 


 లచ్చిమి ఉండి "అన్నా! నన్ను అన్నా అనమన్నావ్. ఆమాట కోసమన్నా నీ కూతుర్ని సేసుకోవాల కదన్నా! తప్పకుండా సేసుకుంటామన్నా!" అనేసింది లచ్చిమి. 

 నేనుండి " ఐతే నా దొక మాట కిట్టాడ్డి. నా కూతుర్ని గూడా నీ కొడుక్కి చేసుకోవాల. " అన్నే నేను. 


దానికి కిట్టాడ్డి "అంతకన్నా మాకేంగావాల. మా అదుట్ట మనుకుంటాను. " అన్నేడు కిట్టాడ్డి. అదే సమయంలోనే మాసిన్నోడికి గూడా పొద్దుటూరుకు సెందిన వొక గొప్పయింటి సమందం కుదిరింది. పిల్ల బాగా సదువుకుంది. 


 ఆ నెల్లోనే మా ముగ్గురి పిల్లోల్ల పెండ్లిళ్ళు అతి వైబోగంగా జర్గిపోయినై. పెండ్లికి మా సుట్టూ ఉన్న ఇరవై నాలుగు పల్లెల ప్రజలు, ఒకనాటి నాతోటి కూలోళ్ళు, రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు అందరూ వొచ్చినారు. పెండ్లిళ్ళు పొద్దుటూర్లోని వొక పేరున్న పెద్ద కల్యాన మండపంలో జర్గినాయి. 


 అటు కొన్నాళ్ళకు నా షష్ఠి పూర్తి కూడా కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు పట్టుబట్టి శాల గొప్పగా సేసినారు. లచ్చిమికైతే అనాటి ఇరవై మంది మద్దిన జర్గిన మా పెళ్లిని, ఈనాటి వేలాది జనం మద్దిన జర్గుతున్న మా షష్ఠిపూర్తిని బేరీజు ఏస్కొని మానంద పన్నాది. 


 ఈ కార్యక్రమానికి వొచ్చిన వొకనాటి సాటి కూలోళ్ళు, నా స్నేహితులు దూరంగా చేతులు కట్టుకుని నిల్బడి ఉండడం గమనించి, మేనేజరును పిల్చి వొల్లందర్ని తోట్లోకి రమ్మని సెప్పేను. అందురూ సాయంత్రం తోట్లో జమ కూడ్నొక, 

నేను వొళ్ళతో- ‘మీరు నాతో అంటీ అంటనట్టు దూరంగా ఉండడం, పరాయివోన్ని సూసిట్టు సూడడం నాకు బాదగా ఉండాది. 


ఇబుడంటే నాకు బూములు బుట్టలు, కార్లు బంగళాలు లారీలు ఉండోచ్చ, కానీ ఎంత ఎదిగినా మనం నడిచొచ్చిన దోవను, మన మూలాన్ని మర్చిపోకూడదు. ఒకబుడు మీరూ, నేనూ సాటి కూలోళ్ళం. అబుడు మీరందిచిన సాయం, దైయిర్యం శానా గొప్పవి. వాటిని నేనేబుడు మరిచిపోలేను. మరిచిపోతే వోడు మనిషే కాడు. 


నేను ఈరోజు 'సుబ్బిగా, సుబ్బిగాడు' అని పిల్చే సాయి నుంచి ' సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గారు ' అనే సాయికి ఎదగడానికి మీ సాయకారం, అబిమానం ఎంతో ఉంది. కాబట్టి మనం ఎప్పటిలాగే ఏ తేడా లేకుండా కలిసి మెలిసి ఉందాం. ఒకరి సమస్యలు ఒకరం పరిస్కరించుకుందాం!’ అన్జెప్పి భార్యాభర్తలం ఇద్దరం అందరికీ సీరెలు, పంచెలు కొత్త గుడ్డలు పెట్టి మాంచి విందు ఇచ్చి పంపినాం. 


వోళ్ళు పోతా ‘సుబ్బాడ్డి ఎంత ఎదిగినా మార్లేదు రా, సుబ్బాడ్డి ఎప్పటికీ మనోడే రా’ అనుకుంటా ఎల్లి పోయినారు. 


 ఇబుడు నాకు ఎనబై ఏండ్లు. పల్లెలో వందల ఎకరాల మాగాణి బూములు, వందల ఎకరాల పండ్లు తోటలు పెర్గినాయి. వాటిని సూసుకుంటా పెద్దోడు రామాడ్డి పల్లెలోనే కాపురం ఉండాడు. టౌన్లో వందల లారీలు, సిటి సిటీలో ట్రాన్స్ పోర్ట్ కంఫినీ'బ్రాంచీలు పెర్గినాయి. వీటితోపాటు టౌనులోని ఎరువుల షాపును సిన్నోడు నర్సింహాడ్డి సూసుకుంటాండడు. మన లారీలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, బొంబాయి నుంచి కలకత్తా వరకు తిర్గుతాండాయి.

 

 ‌కాలం గడిచే కొద్దీ పల్లెలో రామాడ్డి ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు, జ్యూస్ ఫ్యాక్టరీ, ఏరౌస్ గోడౌన్ కట్టినాడు. , వీటి అన్నిటిలో వందల మంది కార్మికులు పని జేచ్చాండరు. 


 టౌనులో నరసింహాడ్డి లారీ బాడీ బిల్డింగ్ అండ్ మెకానికల్ యూనిట్టును, స్పేర్ పార్ట్స్ షోరూంను, షాపింగ్ కాంప్లెక్సును, అపార్ట్మెంటును కట్నాడు. వీటిల్లో వందలాది వర్కర్లు పన్జేచ్చాండరు. 


 కిట్టాడ్డి కూడా రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పన్జేసి తన కొడుకును రాజకీయాల వారసునిగా నిల్పి తాను రాజకీయాలుంచి రిటైర్ అయి పెన్నానది వొడ్డున గెస్టౌవుసును కట్టుకొని విశ్రాంతి తీసుకుంటా ఉండాడు. 

 నా మనవళ్ళు, మనవరాళ్లు అమెరికా లాంటి విదేశాల్లో చదువుకుంటా ఉండారు. ఎంత ఎదిగినా నాకు మాత్రం మీ అందరితో కల్సి, సెట్టు కిందా, అరుగు మీద కూచ్చోని 'టీ' తాగడమే యిష్టం. 


 'ఇది నా కత'. సుబ్బిగాడు నుంచి సుబ్బారెడ్డి వరకు' సాగిన నా జీవిత పయానం. కలిమి ఆదారంగా మనిషిని విలువ కట్టడం దురదుట్టం కదా!” అన్నాడు సుబ్బారెడ్డి చెప్పడం ముగిస్తూ. 


 అక్కడ ఉన్న అందరూ విని ఆ ప్రభావం నుంచి బయట పడలేకున్నారు.


 విన్న వెంకట సుబ్బన్న “నీ జీవిత కత ఎందిరికో వెలుగు బాట అగుతాది సుబ్బాడ్డి” అన్నాడు తృప్తిగా.


 -------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.

---------

53 views2 comments

2 Comments


mk kumar
mk kumar
Nov 10

prodduturu yasa valla katha chadavadam kontha kastamayundi. idi katha ku peddadi, navalaki chinnadi anipinchindi. kathalo antha mache vundi. nijaniki ila jarigite bagunnu. rachayuta ku silpam, vastuvu mida manchi pattu vundani telustundi. bagundi.

Like


@himabindusworld1383

1 hour ago (edited)

నిజాయితీతో ఉండడంవల్ల సమాజానికి కూడా హితం చేకూరుతుంది. స్వార్థ బుద్ధి ఏ రోజు కు మంచిది కాదు అని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించారు ఈ కథరచన అద్వితీయం.

Like
bottom of page