top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

 శుభాంగి



'Subhangi' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 27/08/2024

'శుభాంగి' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


యదువంశంలో ఎందరెందరో రాజులు, మహా రాజులు, రాజర్షులు, మహానుభావులు మరెందరో అవతార పురుషులు, అంశావతార పురుషలు ఉన్నారు. వారంత యుగ ధర్మాన్ని పాటిస్తూ వారి వారి రాజ్యాలను విస్తరించారు. ప్రజలను కన్న బిడ్డలవలే కాపాడారు. ప్రజల శక్తి యుక్తులను, మంచి చెడులను గమనించి వారిని తగిన విధంగా ఆదరించారు. వారి వారి ధర్మాలను వారు ధర్మ బద్ధంగా నిర్వర్తించారు. అనేక మంది మహానుభావులను, ఋషులను, మహర్షులను, బ్రహ్మర్షులను సేవించారు. 


రాజసూయాది రకరకాల యాగాలను చేసి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాల వరాలను పొందారు. అనేకమంది అసురులను అంత మొందించారు. అవనిమాతకు ఆనందాన్ని కలిగించారు. అలాంటి యదువంశ రాజులలో దశార్హ మహా రాజు ఒకడు. అతని మహోన్నత పరిపాలన కారణంగానే అతని పేర దశార్హ మహా రాజ్యం ఏర్పడింది. దశార్హ మహా రాజు సుపరిపాలనలో రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా జీవించేవారు. 


 దశార్హ మహారాజ పుత్రిక శుభాంగి. పేరుకు తగిన ఆకారం కలది. ఏ పని చేసేటప్పుడైన ఆమె ఎదురు వస్తే చాలు అన్నీ శుభాలే జరుగుతాయి అని రాణి మందిరంలోని వారేకాదు ఆ రాజ్యంలోని చాలా మంది అనుకునేవారు. ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు సహితం వారు యజ్ఞయాగాది శుభకార్యాలను చేసేటప్పు డు శుభాంగినే తమకు ఎదురురమ్మనేవారు. వయసు తో నిమిత్తం లేకుండా ప్రతి శుభ కార్యంలో శుభాంగికే ప్రథమ తాంబూలం ఇచ్చేవారు. 


 శుభాంగి ఋషుల సేవన, మహర్షుల సేవన, బ్రహ్మర్షుల సేవన వేదపురాణేతిహాసాలన్నిటిని చక్కగా వంట పట్టించుకుంది.. వేద మంత్రాలలోని విజ్ఞాన అంశాలను, వేద మంత్రోచ్ఛారణలోని శారీక విజ్ఞాన అంశాల ను తనకు తెలిసినంత మేర తన స్నేహితురాళ్ళకు, రాజ మందిరాలలోని పరిచారికా సమూహంనకు చక్కగా వివరించి చెప్పేది. శుభాంగిని సందర్శిస్తే చాలు సమస్త రోగాలు మటుమాయం అవుతాయి అని దశార్హ రాజ్యం లోని ప్రజలు అనుకునేవారు. ఆమెలో అశ్వనీదేవతల అంశ ఉందనుకునేవారు. 


 శుభాంగి సంప్రాప్తయౌవనవతి అయ్యింది. శుభాంగిని చూడగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రెండు చేతులెత్తి నమస్కరించేవారు. 


 హస్తినాపురం ను పరిపాలించే మహారాజు సంవరుణు. అతని ధర్మపత్ని తపతి వారి ముద్దుల కమారుడు కురువు. వేద పురాణేతిహాసాల విద్యలను, అస్త్రశస్త్ర ప్రయోగాది విద్యలను, రాజనీతి విద్యలను, భవబంధ సంబంధ విద్యలను సమస్తం శాస్త్రోక్తంగా అభ్యసించాడు. అటుపిమ్మట తన రాజ్యం లోని అన్ని ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించాడు. ప్రతి ప్రాంతంలో నివసించే ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూసాడు. వారి కష్టాలను చూడటమేగాక వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. 


 రాజ్యప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంలో కుమారుడు కురువు చూపించే ఆసక్తిని గమనించిన సంవరణ మహారాజు పుత్రునికి మకుటాభిషేకం చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన ధర్మపత్ని తపతి కి చెప్పాడు. అందుకు తపతి, "నాథ! మీ ఆలోచన మహా శ్రేష్టంగా ఉంది. ఈ విషయం లో మన కుల గురువు వసిష్ట మహర్షిగారిని కూడా సంప్రదించండి. వారి దివ్య ఆలోచన మేరకు ముందడుగు వేయండి. " అని అంది. 


 తపతి మాటలను విన్న సంవరణ మహారాజు, " దేవీ మన మూల గురువు, కుల గురువు అయిన వసిష్ట మహర్షి నేను ఏ పనిని చేసేటప్పుడయిన ముందుగా నీ ధర్మపత్ని సలహా తీసుకో అని అంటారు. 


 ఈ హస్తినాపురం కు నీ వలన జరిగిన మేలు అంతా యింత కాదు. ఒకప్పుడు వాతావరణ కాలుష్య ప్రభావం తో హస్తినాపురం లో సూర్యుని రశ్మి ప్రవేసించడమే కష్టమైపోయింది. అప్పుడు ప్రజల దేహాలు మంచు గడ్డల్లా మారి పోసాగాయి. అప్పుడే సూర్య పుత్రిక వైన నిన్ను నేను వివాహం చేసుకుని హస్తినాపురం తీసుకు వచ్చాను. అశ్వనీ దేవ తేజంతో ప్రకాశించే నువ్వు హస్తినాపురం రాగానే నీ శరీర తేజస్సును విస్తరింపచేసావు. 


నీ శరీర తేజస్సులోని విపరీతమైన వేడి ప్రభావంతో హస్తినాపురం లోని మంచుదనం కరిగిపోయింది. వాతావరణ సమతుల్యత ఏర్పడింది. నాటినుండి ప్రజలు ఆనందంగా జీవించసాగారు. అందుకే వసిష్ట మహర్షి నువ్వు ఈ రాజ్య సంరక్షణ దేవతవు అని అంటారు. " అని అన్నాడు. 

 

 సంవరణుడు వసిష్ట మహర్షిని, హితులను, పురోహి తులను తదితరులను సంప్రదించి ఒక శుభ ముహూర్తాన కురువుకు మకుటాభిషేకం చేసాడు. సూర్య భగవానుని అనుగ్రహంతో, వసిష్ట మహర్షి అనుగ్రహంతో, నీ తల్లి తపతి అనుగ్రహంతో హస్తినాపురం ను పరిపాలించమని కుమారునికి చెప్పాడు. కురు మహారాజు అలాగే అన్నాడు. 


 కురు మహారాజు వసిష్ట మహర్షి ఆదేశానుసారం తన తండ్రి సంవరుణుడు మీద కత్తి కట్టిన పాంచాల రాజు మీదకు యుద్దానికి వెళ్ళాడు. పాంచాల రాజు కురు మహారాజు ల నడుమ కనీవినీ ఎరుగని రీతిన సమరం జరిగింది. కురు మహారాజు గజ బలం చూసి పాంచాల రాజు భయపడ్డాడు. సమరావనిలో ఏనుగులన్నీ ఒక్కసారి ఘీంకరించాయి. ఆ శబ్దానికి పాంచాల రాజు సైన్యంలో వణుకు పుట్టింది. 


మత్య్స, వరాహ, కూర్మాది ఆకారాల రథాలతో, గుర్రాల సకిలింపులతో సమరాంగణం విచిత్ర శోభను సంతరించుకుంది. శత్రువుల ఊహలకు అందకుండా రకరకాల వ్యూహ నైపుణ్యాలతో కురు మహారాజు కదనరంగంలో చెలరేగిపోయాడు. పాంచాల రాజు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. చివరకు పాంచాల రాజు కాళ్ళ బేరానికి వచ్చాడు. 


 కురు మహారాజు పాంచాల రాజు ను క్షమించాడు. తనకు సామంత రాజు గా ఉండమని కురు మహా రాజు పాంచాల రాజును కోరాడు.. పాంచాల రాజు అందుకు సమ్మతించాడు. సామంత రాజ ధర్మాన్ని అనుసరించి పాంచాల రాజు వసిష్ట మహర్షి తో తన రాజ్యంలో మహా యాగం చేయించాడు. 

 ఒకనాడు శుభాంగిని దర్శించిన మహర్షులు "అమ్మా శుభాంగి. అశ్వనీ దేవ తేజోవిలాసిని! వేద పురాణే తిహాసాలను సమస్తం చక్క గా అభ్యసించావు. సుపరిపాలనకు దశ అర్హతలను సంపాదించుకున్న దశార్హ మహారాజు సుపుత్రికగ పదికి మించి అనేక శుభార్హతలను సంపాదించుకుని శుభాంగి వయ్యావు.. 


 గగనానికి వెలుగునిచ్చేవాడు శ్రీ సూర్య నారాయణుడు అయితే ఈ దశార్హ దేశానికి వెలుగునిచ్చే దానివి నువ్వు. నువ్వు శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం కూడా పొందావంటే నిన్ను మించిన వారు భువిలో, దివిలో మరెక్కడా ఉండరు. కావున శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం పొందడానికి నువ్వు తపస్సు చెయ్యి. నీ చరిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. " అని అన్నారు. 


 శుభాంగి మహర్షుల మాటలను అనుసరించి శ్రీ సూర్య నారాయణ మూర్తిని ధ్యానిస్తూ తపస్సు చేయసాగింది. 


ఒకనాడు వశిష్ట మహర్షి కురు మహారాజు మందిరానికి వెళ్ళాడు. కురు మహారాజు వశిష్ట మహర్షి ని తగిన విధంగా సత్కరించాడు. 


అంత వశిష్ట మహర్షి, " కురు మహారాజ! మీ పూర్వీకులు హస్తి మహారాజు పేరు మీద హస్తినాపుర రాజధాని ఏర్పడింది. నీ తల్లి సాక్షా త్తు సూర్య నారాయణుని పుత్రిక. నువ్వు నీ చిన్న తనం లోనే సూర్య మండలాన్ని సందర్శించావు. తండ్రిని మించిన తేజస్సు తో ప్రకాశిస్తున్నావు. నీ తలిదండ్రులు వివాహం చేసుకున్న కొత్తలో వారెక్కువ కాలం దేవలోకాల లో, పవిత్ర వనాలలోనే గడిపారు. నువ్వు ఓ పవిత్ర వనంలోనే వారికి పుట్టావు.

 

నీ తండ్రి సంవరుణుడు పవి త్ర వనంలో ఉన్నప్పుడు నేనే హస్తినాపురంలో అనేక శాంతి యాగాలను జరిపించాను. అలా హస్తినాపురం పవిత్ర పురం గా మారింది. అలాంటి పవిత్ర పురమును నువ్వు మరింత పవిత్ర పురంగ మార్చు. సుపరిపాలన చేసి వంశ కర్తగా పేరు తెచ్చుకో. " అని అన్నాడు. కురు మహారాజు వశిష్ట మహర్షి మాటలను శిరసా వహిస్తానని మహర్షికి మాట యిచ్చాడు. 


 కురు మహారాజు రాజ్యంలోని దుర్గపరిఖాదుల ను మరింత పటిష్టం చేసాడు. హస్తినాపురంలో గొప్ప గొప్ప హర్మ్యాదులను నిర్మించే ప్రజలకు సహకరించా డు. రథగజతురగభటాదుల సంఖ్యను పెంచాడు. హస్తినాపురం ను అందంగ తీర్చిదిద్దాడు. తాతగారైన సూర్య భగవానుని సేవలో కాలం గడపసాగాడు. 

 శుభాంగి పర్ణశాలల నడుమన ఉన్న పర్వత ప్రాంతాన తపము చేయసాగింది. ఆమె తపో ప్రభావాన సూర్య మండలం అతలాకుతలం అయ్యింది. సూర్య భగవానుడు శుభాంగి ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్య భగవానుని చూచిన శుభాంగి సూర్య తేజాన్ని తట్టుకునే శుభదేహాన్ని తనకివ్వమని కోరింది. 


సూర్య భగవానుడు తథాస్తు అంటూ "శుభాంగి, నువ్వు నా కుమార్తెకు బంధువు అవుతావు. నా కుమార్తె పుత్రుని వంశ కర్తవు చేస్తావు. అశ్వనీ దేవతల తేజస్సు తో మరియు నా తేజస్సు తో ప్రకాశించే నీ శుభ అంగమైన తనువును మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఎవరు తాకిన వారు సర్వ రోగాలనుండి విము క్తి పొందుతారు.. ‌ ‘అశ్వినీ తేజో విలాస శ్రీసూర్య నారాయ ణ రూప శుభాంగీ తనూలత..’ అంటూ నీ పేర ఓ విజ్ఞానాత్మక మంత్ర తేజం ఆవిర్భవిస్తుంది. " అని ఆశీర్వ దించాడు. 


 కురు మహారాజు కలలో శుభాంగి దివ్య రూపము కనపడింది. కురు మహారాజు చిత్ర కారులను పిలిపించి తన కలలో కనపడిన వనిత రూపురేఖలను వివరించాడు. సూర్య మండలంలో ప్రకాసిస్తున్న శుభాంగి చిత్ర పటాన్ని ఒక చిత్ర కారుడు చక్కగ చిత్రించాడు. 


ఆ చిత్ర పటాన్ని చూసిన వసిష్ట మహర్షి "కురు మహా రాజ, ఈ సుందరి దశార్హ మహారాజు కుమార్తె శుభాంగి. తపో మార్గాన సూర్య భగవానుని ప్రత్యక్షం చేసుకున్న పుణ్య స్త్రీ. దశార్హ మహారాజుకు మన హస్తినాపురం రాజులన్నా, మన హస్తినాపురం అన్నా మహా గౌరవం. నీ వివాహ విషయం మాట్లాడటానికి దశార్హ మహారాజు దగ్గరకు నేనే ప్రత్యేకంగా వెళతాను.", అని అన్నాడు. 


కురు మహారాజు తన మూల పురోహితుడు, తన వంశ సంరక్షకుడైన వసిష్టుని మాటలను విని మహదానంద పడ్డాడు. 


 వశిష్ట మహర్షి దశార్హ మహారాజు ఆస్థానానికి వె ళ్ళాడు. దశార్హ మహారాజు వశిష్ట మహర్షిని తగిన రీతి లో సత్కరించాడు. పేము బద్దలతో తయారు చేయబడిన ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. 


అప్పుడు వశిష్ట మహర్షి " దశార్హ మహారాజ! నేను ఇక్కడకు ఒక శుభ కార్యం నిమిత్తం వచ్చాను. అదేమిటో చెబుతాను విను. చంద్రవంశ రాజులలో సంవరణ మహారాజు కు గొప్ప పేరు ఉంది. సంవరణ మహారాజు హస్తినాపురం ను పరిపాలిస్తున్నాడు. అతని ధర్మపత్ని తపతి సూర్య భగవానునికి కుమార్తె. ఆ పుణ్య దంపతులకు పుట్టిన వాడే కురు మహారాజు. 


 యదు వంశ రాజులలో నీవెలా ప్రజానురంజక పాలన చేసి దశార్హ వంశ కర్తవయ్యావో అలాగే కురు మహారాజు వంశ కర్త గా మారాలని పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. కురు మహారాజు నీ కుమార్తె శుభాంగిని యిష్ట పడుతున్నాడు. నువ్వూ, నీ కుమార్తె శుభాంగి యిష్టపడితే కురు మహారాజు తలిదండ్రులు ప్రత్యక్షంగా మి మ్ములను కలిసి వివాహ మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. " అని అన్నాడు. 


 వశిష్ట మహర్షి మాటలను విన్న దశార్హ మహారాజు మహర్షిని ఆ రోజు విశ్రాంతి తీసుకోమని మహర్షికి రాజ మందిరంలోని ప్రత్యేక పర్ణశాలను విడిది మందిరంగా ఏర్పాటు చేసాడు. వశిష్ట మహర్షి పర్ణశాల లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శుభాంగి వశిష్ట మహర్షి ని కలిసి సాష్టాంగ ప్రణామాలర్పించింది. 


వశిష్ట మహర్షి శుభాంగిని ఆశీర్వదించాడు. అనంతరం కురు మహారాజు గుణగణాలను, రాజ్యాన్ని పరిపాలిస్తున్న విధానాన్ని శుభాంగికి తెలిపాడు. అనంతరం "అమ్మా ! శుభాంగి, నీ దివ్య తేజో యశస్సు ప్రభావాన నీ తండ్రి దశార్హ వంశ కర్త అయ్యాడు. అలాగే నీ ధర్మపతి కురు మహారాజు కురువంశ కర్త కావాలి" అన్నాడు. 


"మీ ఆశీర్వాద బలమే సర్వ శుభాలకు మూలము" అని శుభాంగి వశిష్ట మహర్షి కి మరోమారు నమస్కరించింది. 

 మహారాజుల, మహర్షుల, శుభాంగి బంధువుల, కురు మహారాజు బంధువుల సమక్షంలో శుభాంగి కురు మహారాజు ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుభాంగి, కురు మహారాజులను శ్రీ సూర్య నారాయణుడు ఆశీర్వదించాడు. 


శుభాంగి మాటలను అనుసరించి కురు మహా రాజు ప్రజల ఐశ్వర్యాభివృద్ది నిమిత్తం మహర్షులతో అనేక యాగాలు చేయించాడు. నిరుపేదల జీవనానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాడు. 


శుభాంగి కురు మహారాజు తో కలిసి తన రాజ్యాన్నంత సందర్శించింది. రాజ్యంలోని అనేకానేక పవిత్ర ప్రదేశాలన్నిటిని గుర్తించింది. శుభాంగి సూచించిన ప్రదేశంలో శ్రీ సూర్య నారాయణుని ఆశీర్వాదంతో కురు మహారాజు దివ్య తపస్సు చేసాడు. పతిదేవుని తపస్సుకు శుభాంగి తగిన విధంగా సహకరించింది. 


కురు మహారాజు తపస్సుకు మెచ్చిన పంచ భూతాలు, తదితర దేవతలు కురు మహారాజు పరిపాలనలో అతని రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుందని వరాలను ఇచ్చారు. కురు మహారాజు తపస్సు చేసిన ప్రాంతానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ కురుక్షేత్రం ను మరింత పవిత్రం చేసే నిమిత్తం కురు మహారాజు, ధర్మపత్ని శుభాంగి మాటలను అనుసరించి ఆ భూమినంత తనే స్వయంగా దున్నాడు. 


అతనికి ఇంద్రుడు సహాయంగా వచ్చాడు. శుభాంగి కురుక్షేత్రం లో అమృత ధాన్యం పండించమని భర్త కు చెప్పింది. కురు మహారాజు భార్య మాటలను అనుసరించి అమృత ధాన్యం పండించాడు. ఆ ధాన్యాన్ని నిరుపేదలకు పంచాడు. కురు మహారాజు నిరుపేదల, వసిష్టాది మహర్షుల సహాయసహకారాలతో అనేక యజ్ఞయాగాదులు చేసాడు. కురు మహారాజు కాలంలో సకాలంలో వర్షాలు పడ్డాయి. పాడిపంటలతో రాజ్యం సుభిక్షంగా వర్థిల్లింది. 


శుభాంగి ప్రజలను విద్యావంతులను చేయడంలో తనవంతు సహాయం తను అందించింది. ప్రజలలో సాహిత్య జిజ్ఞాసను కలిగించింది. అందరికీ ఉపయోగపడే నూతన వస్తు రూపకల్పన చేయమని ప్రజలను ప్రోత్స హించింది. ప్రజలలో సహృదయతను పెంచింది. 


 కురు మహారాజు సుపరిపాలనలో హస్తినాపురం పాడి పంటలతో, సిరిసంపదలతో తులతూగింది. చంద్ర వంశ రాజులలో కురు మహారాజు వంశ కర్త అయ్యాడు. 


శుభాంగి కురు మహారాజు దంపతులకు పుట్టిన పుత్రుని పేరు విదూరధుడు. 


                     శుభం భూయాత్ 


 వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

 



41 views0 comments

Comments


bottom of page