top of page

సుదేవ

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Sudeva, #సుదేవ


Sudeva - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 23/01/2025

సుదేవ - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



ప్రతిష్టాన పురానికి మర్యాద దేవతీతి ల కుమారుడు ఋచీకుడు రాజయ్యాడు. ఋచీకుడు రాజవ్వగానే ప్రజల మనో భావాలను గమనించ సాగాడు. ప్రజలందరూ తన తండ్రిని దైవాంశ సంభూతుని గా చూస్తున్నారన్న సత్యాన్ని గమనించాడు. తనుకూడ దైవాంశ సంభూతుని గా పేరు తెచ్చుకోవా లనుకున్నాడు. అందుకు యజ్ఞ యాగాదులను భక్తితో నిర్వహించడమే సక్రమ మార్గం అనుకున్నాడు. అంత వనాలలో మరియు రాజ్యం లోని దేవాలయాల దగ్గర యింకా పవిత్రమైన పలు ప్రదేశాల్లో వివిధ రకాల యజ్ఞయాగాదులను నిర్వహించసాగాడు. 


ఋచీకుని అతి భక్తిని, అనుచిత మార్గం ను గమనించిన కుల గురువు వశిష్ట మహర్షి "రాజ! దేశ క్షేమం కోసం యజ్ఞ యాగాదులను చేయించడం తప్పుకాదు. కానీ కేవలం యజ్ఞ యాగాదులను చేయించడం వలన ఏ రాజ్యం అభివృద్ధి పథంలో ముందుకు సాగదు. ధర్మార్థ కామ మోక్షాలు బాగా తెలిసిన మహారాజు రాజ్యాభివృద్ధి నిమిత్తం వ్యవసాయవ్యాపారవిద్యారంగాది అన్ని వృత్తుల మీద సమ దృష్టి పెట్టాలి. వాటి అభివృద్ధి నిమిత్తం నిరంతరం నిజ పథాన ఆలోచించాలి" అని ఋచీకుని తో అన్నాడు. 


 కుల గురువు వశిష్ట మహర్షి మాటలను విన్న ఋచీకుడు, " కుల గురోత్తమ వశిష్ట మహర్షి! మీరు చెప్పింది అక్షర సత్యం. ప్రతి రంగ అభివృద్ధి నిమిత్తం మంత్రులను నియమించాను. నేను తండ్రిని మించిన తనయుడు ను కాకున్నా తండ్రంత వాడిని కావాలన్న సత్సంకల్పం తోనే ఈ యజ్ఞ యాగాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. " అని వశిష్ఠ మహర్షి తో అన్నాడు. 


 ఋచీకుని మాటలను విన్న వశిష్ట మహర్షి ఋచీకుని అభిప్రాయాన్ని అతని తలిదండ్రులు మర్యాద దేవతీతి లకు వివరించాడు. " కుమారుడు రాజ్యాభివృద్ధి మీద ఎలా దృష్టి పెడతాడో మీరే సెలవివ్వండి మహర్షోత్తమ!" అని వశిష్ఠ మహర్షి తో దేవాతీతి అన్నాడు.

 

"నాయన దేవాతీతి నువ్వు పుట్టుకతోనే దైవాంశ సంభూతడవు. దైవాంశ సాధన నిమిత్తం నువ్వు ఎలాంటి కృషి చెయ్యలేదు. నీ పూర్వజన్మ కర్మ ఫలం వశాత్తు నువ్వు అలా జన్మించావు. నీ సుపుత్రుడు ఋచీకుడు అలా కాదు. అతగాడు పుట్టుకతో దైవాంశ సంభూతుడు కాదు. అతను తన పాకశాస్త్ర ప్రావీణ్యం తో మంచి పేరు తెచ్చుకుంటాడు. అటు పిమ్మట గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటాడు. అటు పిమ్మట రాజర్షిగా మారతాడు. ఆపై దైవాంశ సంభూతుడు అవుతాడు. ఇవన్నీ జరగాలంటే ముందుగా మీరు మీ 

కుమారుడు ఋచీకునికి తగిన సంబంధం చూసి వివాహం చెయ్యండి. " అని వశిష్ట మహర్షి మర్యాద దేవతీతి లకు చెప్పాడు. 


వశిష్ట మహర్షి మాటలను అనుసరించి మర్యాద దేవతీతి లు ఋచీకునికి తగిన భార్య కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అనేక మంది రాజ కుమార్తెల గురించి తెలుసుకున్నారు. 


మహా శివుడు మన్మధుని మదం అణచి, వానిని భస్మం చేసిన ప్రాంతం లో అంగరాజు కుమార్తె సుదేవ మహా తపస్సు చేసి దేవతలను మెప్పించింది. సుదేవ తపస్సు కు మెచ్చిన దేవతలందరూ ఆమె అడిగిన వరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 


దేవతల మనో గతం అర్థం చేసుకున్న సుదేవ, "దేవతలారా! మీరంతా నన్ను దీవించండి. కర్మాను సారం నా రాజ్య ప్రజలు, నా మిత్ర రాజుల రాజ్య ప్రజలందరూ ఆనందంగా జీవించేటట్లు దీవించండి. శత్రు రాజులు వారి తప్పును వారు తెలుసుకునేటట్లు చేయండి. శత్రు రాజ్యాలలోని ప్రజలందరూ ఆనందంగా జీవించేటట్లు వరం ఇవ్వండి. అందరూ చల్లగా ఉండాలి. కర్మానుసారం, యుగ ధర్మాను సారం ప్రాప్తించే చెడును ఆయా వ్యక్తులు తెలుసుకుని మసలేటట్లు అందరిని చల్లగా చూడండి" అని సుదేవ దేవతలను వేడుకుంది. 

దేవతలు సుదేవ పరోపకార తత్వానికి మురిసిపోయారు. సుదేవకు దేవతా కళను ప్రసాదించారు. ఆమె కోరిన కోర్కెలు అన్నీ తీర్చారు. సుదేవ అంగ రాజ్య రాజధాని చంపా ను మహోన్నతంగా తీర్చిదిద్దింది. తన సుర కళతో ప్రజలందరిని ఆకట్టుకుంది. 


మర్యాద దేవతీతి లు సుదేవ గురించి తెలుసుకున్నారు. తమ మనసులో మాట తెలియ చేస్తూ అంగ రాజుకు వశిష్ట మహర్షి ద్వారా విషయం తెలియచేసారు. 


"ఆడపిల్ల తండ్రి తన కూతురు కు మంచి సంబంధం చూడాలి ‌. అల్లుని కొడుకుగా భావించి గౌరవించాలి" అన్న సదాలోచనతో అంగ రాజు మర్యాద దేవతీతి లతో సంబంధ బాంధవ్యాలు కలుపు కోవడానికి ఇష్టపడ్డాడు. అందరి సమ్మతితో అంగ రాజు కుమార్తె సుదేవ ను ఋచీకునికి ఇచ్చి వివాహం చేసారు. సుదేవ ఋచీకుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


 సుదేవ రాజ్య పరిపాలనా విషయం లో, యజ్ఞ యాగాదుల విషయంలో తన భర్త ఋచీకునికి సహకరించసాగింది. సుదేవను చూసిన జనం, ఆమె దైవాంశ సంభూతురాలని అనుకోసాగారు. నాటినుండి జనం ఏ పని చేసినా సుదేవ ముఖం చూసే పని చేసేవారు. 


తన భర్త ఋచీకుడు రాజ్య పరిపాలన పక్కన పెట్టి, నిరంతరం చేసే యజ్ఞ యాగాదులను చూసిన సుదేవ, " నాథ! భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ప్రసాదిస్తాడు. ఆ సామర్థ్యం ను అభివృద్ధి చేసుకుంటూ దైవాంశను చేరేవారే నిజమైన మనుషులు. ప్రతి పనిలో ఓ కళ ఉంటుంది. ఆ కళలో దైవాంశ ఉంటుంది. అది గమనించి, మన ధర్మాన్ని మనం అనుసరిస్తూ దైవాంశ ను చేరుకోవాలి" అని భర్త ఋచీకునితో అంది. 


సుదేవ చెప్పిన మాటలను విన్న ఋచీకుడు ఆలోచనలో పడ్డాడు. లలాట లిఖితం ను అనుసరించినవాడే మహాత్ముడవుతాడు అని అనుకున్నాడు. అనంతరం ఋచీకుడు తన ఎదలో కదలాడు పాకశాస్త్ర ప్రావీణ్యం ను ప్రదర్శించసాగాడు. 


అనతి కాలంలోనే పాకశాస్త్రంలో ఋచీకుని కీర్తి ప్రతిష్టలు దిగ్దిగంతాలు వ్యాపించాయి. ఋచీకుడు తన పాకశాస్త్ర ప్రావీణ్యం తో అనేక మంది రాజుల మన్ననలను పొందాడు. దుర్మార్గులైన రాజులను తన చెప్పు చేతలలోకి తెచ్చుకున్నాడు. 


రాజ్య పరిపాలన లో గొప్ప నైపుణ్యం చూపించాడు. ఆపై రాజర్షి గా పేరు తెచ్చుకున్నాడు 

సుదేవ తన భర్త లో వచ్చిన మార్పును చూసి మహదానంద పడింది. సుదేవ ఋచీకుల సుపుత్రుడు 

ఋక్షకుడు. 


ఋచీకుడు తన కుమారుడు ఋక్షకుడు రాజైన పిదప వనాలకు వెళ్ళి అనేక యజ్ఞయాగాదులు చేసి దైవాంశ సంభూతుడు అయ్యాడు. దైవాంశ సంభూతుడైన భర్తను చూసి సుదేవ మహదానంద పడింది. 


సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








Comments


bottom of page