'Sudha Episode 4' - New Telugu Web Series Written By Neeraja Hari Prabhala
'సుధ - ఎపిసోడ్ 4' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కధ:
రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింది సుధ. క్లాస్మేట్ విజయ్ తో పరిచయాన్ని, అతని గతాన్ని గుర్తుచేసుకుంది సుధ. విజయ్ తండ్రి రాఘవరావుకు రేవతి వలన దీప పుట్టింది. విజయ్, దీపలు చక్కగా పెరిగి చక్కగా చదువుకుంటున్నారు. సుధ తన తండ్రిని తలుచుకుంటూ మంచి మార్కులతో డిగ్రీ పాసై ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని మనసులో అనుకుంది. దీప స్నేహితురాలు మాధవి చెల్లెలు సుమ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే దీప, మాధవిలు కాలేజీ నుంచి అక్కడికి వెళ్తారు. సమయానికి హాస్టల్ వాళ్లు హాస్పిటల్ లో చేర్చగా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దీప ద్వారా విషయం తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి ఆమెను ఓదార్చి వాళ్ల ముగ్గురిని తనింటికి తీసుకువచ్చాడు.
ఈ వారం కధ చదవండి..
దీప గురించి కంగారు పడుతున్న రాఘవరావు దంపతులకు ఇంట్లోకి వస్తున్న విజయ్, దీపలను చూసి మనసు కాస్త ఊరట చెందింది. లోపలికి వచ్చిన విజయ్, దీపలతో కూడా ఉన్న అమ్మాయిలను చూసి ఎవరన్నట్లు కళ్లతోనే ప్రశ్నార్థకంగా చూశారు రాఘవరావు దంపతులు.
"అమ్మా! నేను, నా స్నేహితురాలు మాధవి హాస్టల్ లో ఉండి నాతోపాటుగా చదువుకుంటోందని నీకు లోగడ చెప్పాను. గుర్తుందా? ఈమే మాధవి. ఈమె తన చెల్లెలు సుమ" అని వాళ్లిద్దరినీ తల్లికి పరిచయం చేసింది దీప.
గుర్తుందని తలూపి నవ్వుతూ వాళ్లని పలకరించి కూర్చోమని సోఫా చూపించి లోపలికి వెళ్లింది రేవతి. ఆవిడ వెనకాలే విజయ్ వెళ్లాడు.
"అమ్మా! ఇందాక నేను దీపవద్దకు వెళ్లాను ఎందుకో తెలుసా! సుమ తనకు పరీక్షలలో రాంకు రాలేదని నిద్ర మాత్రలను మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే సమయానికి హాస్టలు వాళ్లు ఆమెని హాస్పిటల్లో చేర్చారుట. అతికష్టం మీద డాక్టర్లు బ్రతికించారుట. నేను హాస్పిటల్ కు వెళ్లే సమయానికి దీప, మాధవిలు సుమతోనే ఉన్నారు. ఆమెకు స్పృహ రాగానే ఆమెకు ధైర్యం చెప్పి డిశ్చార్జి చేసి వాళ్లని మనింటికి తీసుకొచ్చాను. తల్లీతండ్రి లేని వాళ్లను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనింట్లో రెండు రోజులు వాళ్లని ఉంచుకుని కాస్త నయమయ్యాక వాళ్లని హాస్టల్ కు పంపుదామమ్మా " అన్నాడు విజయ్.
విజయ్ చెప్పింది విన్న రేవతి చాలా బాధపడుతూ "అయ్యో! ఎంత గండం గడిచింది? ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుమ క్షణికావేశంలో ఈపని చేసుంటుంది. ఈ కాలం పిల్లలందరూ అంతే! ఆవేశం ఎక్కువ - ఆలోచన తక్కువ. అన్నింటికీ తొందరపాటే. రెండు రోజులు ఏంటిరా? నాకు మన దీప ఎంతో వాళ్లు అంతే! నయమయ్యేదాకా ఉండమను. నాలుగు రోజుల పాటు ఇక్కడి నుంచే వాళ్లు దీపతో కాలేజీకి వెళ్తారు. వాళ్లకు నేను చెప్తాలే! నీవు ఈ మంచినీళ్లు తీసుకెళ్లి వాళ్లకివ్వు. అందరికీ నేను టిఫిన్ చేసుకుని తీసుకుని వస్తాను. పాపం ఎప్పుడు తిన్నారో ? ఏమిటో? " అంది రేవతి.
"అమ్మా! ఇంకో మాట. జరిగింది నీకు తెలీనట్లే ఉండు. ఏదన్నా అడిగితే వాళ్ల మనసు బాధపడుతుంది" అన్నాడు విజయ్.
"ఆమాత్రం నాకు తెలీదా బాబూ! నేనడగనులే!" అంది రేవతి.
"మా మంచి అమ్మ" అన్నాడు విజయ్. నవ్వుతూ విజయ్ వేపు చూసింది రేవతి.
విజయ్ వెళ్లాక రేవతి కమ్మని జీడిపప్పు ఉప్మా వేడివేడిగా చేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరినీ పిలిచింది. రాఘవరావుతో సహా అందరూ వచ్చారు. అందరికీ ప్లేట్లల్లో వడ్డించి వాళ్లకిచ్చి తనూ తీసుకుంది.
మొహమాటపడుతున్న మాధవి, సుమలను చూసి “మొహమాటం ఎందుకమ్మా? నేను మీ అమ్మలాంటి దాన్నే. ఇదీ మీ ఇల్లే. ఎప్పుడు తిన్నారో? చూడండి, ఎంత నీరసంగా ఉన్నారో? త్వరగా తినేయండి. " అన్నది రేవతి. తల్లి మాటలకు, విజయ్, దీపలు చాలా సంతోషించారు. ఆవిడ మాటలతో మాధవి, సుమలకు కాస్త మొహమాటం తగ్గింది. వాళ్లకు ప్రేమగా కొసరి వడ్డించింది రేవతి. అందరూ తృప్తిగా తిన్నాక వేడీవేడి ఫిల్టరు కాఫీ ఇచ్చింది రేవతి.
"చూడండమ్మా!. మీరు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండండి. మీకే లోటూ ఉండదు. ఇక్కడి నుంచే దీపతో పాటు నీవు కాలేజీకి వెళ్లచ్చు. సుమకు ఇప్పుడు శెలవులే కనుక నాతో పాటే ఉంటుంది. సాయంత్రాలు ఎక్కడికైనా అందరం హాయిగా బయటకు వెళ్లచ్చు. ముందు మీరు దీప గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి" అంది రేవతి మాధవీ, సుమలతో. ఆ మాటలకు వాళ్లు చాలా సంతోషించారు. తల్లి మంచి మనస్సుకు మెచ్చుకోలుగా ఆవిడ వంక చూశారు విజయ్, దీపలు.
ఆరాత్రి అందరూ హాయిగా నిద్రపోయారు. తెల్లవారాక తమ తమ పనులు పూర్తిచేసుకుని రేవతి పెట్టిన టిఫెన్ తిని కాలేజీకి వెళ్లారు విజయ్, దీప, మాధవిలు. సుమకు ఏంతోచదని తనతో పాటే వంటింట్లో ఉంచి సుమ స్కూలు కబుర్లను, సినిమా కబుర్లను రేవతి అడిగితే ఉత్సాహంగా చెప్పింది సుమ. ఇంతలో తనకి ఫోన్ రాగా వేరే గదిలోకి వెళ్లింది సుమ.
"హలో! సుమా! నేను రజనీని. ఎలా ఉన్నావు? నిన్న నీవు ఆత్మహత్యకు ప్రయత్నించావుట కదా! అయ్యో! ఎందుకలా చేశావు? రాంకు వస్తుందని మా అందరితో చెప్పావుగా! రాలేదని బాధపడకు. మరలా కలుద్దాం" అని సానుభూతిగా పలకరించి ఫోన్ పెట్టేసింది రజనీ. విన్న సుమ మ్రాన్పడిపోయింది.
ఇంకా కాసేపట్లో ఇంకో ఇద్దరూ ఇలాగే సుమకు ఫోన్ చేసి సానుభూతిని చూపిస్తూ మాట్లాడారు. అందరికీ తెలిసిపోయిందని బాధపడుతూ వాళ్ల సానుభూతిని తట్టుకోలేక సుమ చిన్నబుచ్చుకున్న ముఖంతో రేవతి వద్దకు వచ్చింది. సుమ మొహం చూడగానే ఏదో జరిగిందని అర్ధమై సుమని అడిగింది. వాళ్లు తనతో ఫోనులో మాట్లాడిందంతా బాధపడుతూ చెప్పింది సుమ.
"సుమా! ఈపరిస్ధితిలో నీకు ధైర్యం, ఆత్మనిబ్బరం కావాలి. సానుభూతి కాదు. మనం దేనినైనా తట్టుకుంటాం కానీ సానుభూతిని మాత్రం తట్టుకోలేము. ధైర్యంగా ఉండు. " అంది రేవతి. తలూపింది సుమ.
========================================================================
ఇంకా ఉంది...
========================================================================
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments