'Sudha Episode 5' - New Telugu Web Series Written By Neeraja Hari Prabhala
'సుధ - ఎపిసోడ్ 5' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కధ:
రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింది సుధ. క్లాస్మేట్ విజయ్ తో పరిచయాన్ని, అతని గతాన్ని గుర్తుచేసుకుంది సుధ. విజయ్ తండ్రి రాఘవరావుకు రేవతి వలన దీప పుట్టింది. విజయ్, దీపలు చక్కగా పెరిగి చక్కగా చదువుకుంటున్నారు. సుధ తన తండ్రిని తలుచుకుంటూ మంచి మార్కులతో డిగ్రీ పాసై ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని మనసులో అనుకుంది. దీప స్నేహితురాలు మాధవి చెల్లెలు సుమ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే దీప, మాధవిలు కాలేజీ నుంచి అక్కడికి వెళ్తారు. సమయానికి హాస్టల్ వాళ్లు హాస్పిటల్ లో చేర్చగా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దీప ద్వారా విషయం తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి ఆమెను ఓదార్చి వాళ్ల ముగ్గురిని తనింటికి తీసుకువచ్చాక వాళ్లని చాలా ఆప్యాయంగా చూస్తుంది రేవతి. సుమని స్నేహితురాలు సానుభూతిగా పలకరిస్తే చిన్నబుచ్చుకున్న సుమకి ధైర్యం చెపుతుంది రేవతి.
ఈ వారం కధ చదవండి..
సుమకి బిస్కెట్లు, టీ ఇచ్చి తనూ చేతిలోకి తీసుకుని హాల్లోకి వచ్చింది రేవతి. ఆవిడను అనుసరించింది సుమ. ఇద్దరూ సోఫాలో కూర్చుని బిస్కెట్లు తిని, టీ త్రాగుతూ కాసేపు గడిపారు. ఈలోగా రాఘవరావు నిద్ర లేచి హాల్లోకి రాగానే "నిద్ర లేచారా! కూర్చోండి! మీకు బిస్కెట్లు, టీ తెస్తాను" అని లేవబోతున్న రేవతిని ఆపి "మీరు కూర్చోండి ఆంటీ! అంకుల్ కి నేను తీసుకొస్తాను. మీరు కాసేపన్నా విశ్రాంతి తీసుకోండి ఆంటీ!" అంది సుమ.
ఆ మాటలకు నవ్వుతూ "అయ్యో! వద్దు సుమా! నీవు కూర్చో! టీవీ పెడతాను. ఏదన్నా సినిమా చూస్తూ ఉండు. అంకుల్ తో ఏదన్నా మాట్లాడు ! భయం పోతుంది. ఆయన అలా పైకి గంభీరంగా కనబడతారు కానీ చాలా మంచిమనిషి. ఈలోగా నేను టీ, బిస్కెట్లు తెస్తాను. ఇంట్లో పనులు నాకు రోజూ అలవాటేకా! అయినా నేనేం కష్టపడుతున్నాను? ఈ మాత్రం పని కూడా లేకపోతే నాకు బద్దకం వస్తుందమ్మా!" అని లేచి వంటింట్లోకి వెళ్లబోతూ "సుమతో ఏదన్నా మాట్లాడండి. ఆ అమ్మాయికి మొహమాటం, బిడియము ఎక్కువ. " అంది నవ్వుతూ భర్తతో రేవతి.
భార్య మాటలను విన్న రాఘవరావు సుమ వేపు చూస్తూ " ఏమ్మా! సుమా! భయం ఎందుకమ్మా! మాకు దీప, విజయ్ ఎంతో నీవు, మీ అక్క కూడా అంతే!. ఇది మీ ఇల్లే అనుకో! సంతోషంగా ఉండు. " అన్నాడు చిరునవ్వుతో.
ఆ మాటలకు మనసులో కాస్త జంకు తగ్గి "ధాంక్స్ అంకుల్!" అంది సుమ.
ఆ తర్వాత ఇద్దరూ ఏవో సినిమాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో రేవతి టీ, బిస్కెట్లను తీసుకొచ్చి భర్త చేతికందించి కూర్చుంది. ఆయన అవి తిని టీ త్రాగి కాసేపు బయటకు వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. రేవతి, సుమలు ఏవో పిచ్చాపాటీ కబుర్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో గలగలలాడుతూ దీప, మాధవి, విజయ్ లు కాలేజీనుంచి వచ్చారు. వస్తూనే సుమ నవ్వుతూ రేవతితో మాట్లాడుతూ ఉండడం చూసి మనసులో చాలా సంతోషించారు వాళ్లు.
"హమ్మయ్య! సుమ చక్కగా నవ్వుతూ ఆంటీతో మాట్లాడుతోంది. చెల్లెలు చేసిన అఘాయిత్యానికి ఈ ఇంటికి రాకముందు తను ఎంత భయపడింది? ఆ పరిస్థితుల్లో హాస్టల్ లో సుమని ఒంటరిగా ఉంచి తను కాలేజీకి వెళ్లడం ఎలా ? తను లేని సమయంలో సుమ ఏమన్నా మరలా అలాంటి పనిచేస్తుందేమోననే భయం మనసులో ఉంది. అలాంటి పరిస్థితుల్లో విజయ్, దీపలు తమను ఈ ఇంటికి తీసుకుని వచ్చారు.
కానీ దేవాలయం వంటి ఈ ఇంటికి వచ్చాక వీళ్ల ఆదరణ, ఆప్యాయతలను చూశాక తన మనసు చాలా తేలికపడింది. విజయ్, దీపలతో పాటు తామిద్దరినీ కూడా ఎంతో ప్రేమాప్యాయతలతో చూస్తున్నారు ఆంటీ. కల్మషం లేని ఆవిడ అంతరంగం ఎంతో గొప్పది. " అని మనసులోనే ఆవిడకు నమస్కరించింది మాధవి.
రేవతి లేచి వాళ్ల ముగ్గురికీ వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యాహ్నం రజనీ, ఇంకో స్నేహితురాలు తనకి ఫోన్ చేసి పలకరించి సానుభూతిని తెలపడం, తను చిన్నబుచ్చుకుంటే ఆంటీ తనకి ధైర్యం చెప్పడం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది సుమ.
అది విన్న మాధవి లేచి రేవతి వద్దకు వెళ్లి "చాలా ధన్యవాదాలు ఆంటీ! దేవతలాంటి మీ అంతరంగం ఎంతో గొప్పది. మమ్మల్ని కూడా మీ పిల్లలతో సమానంగా ప్రేమగా ఆదరిస్తున్నారు. ఎవరికైనా ఏదన్నా జరిగితే వాళ్లని సూటీపోటీ మాటలతో బాధపెట్టి కుళ్లబొడిచే ఈ సమాజంలో మీలాంటి దేవతలు ఉండడం చాలా అరుదు. మీ మంచిమనస్సుకు నా జోహార్లు. " అని రెండు చేతులూ జోడించి నమస్కరించింది.
సుమ కూడా ఆమెకు ధన్యవాదాలను తెలిపి నమస్కరించింది. విజయ్, దీపలు తల్లిని అభినందించి ఆమెకు ముద్దిచ్చారు.
అందరినీ దగ్గరకు తీసుకున్న రేవతి
"చూడండి మాధవీ, సుమా! నేనేం గొప్ప పని చేశానని నన్ను దేవతని చేశారు? నేనూ ఇద్దరి పిల్లలకు తల్లిని. మా పిల్లలెంతో మీరూ అంతేనమ్మా! ఇంక మీరు శెలవులిచ్చినప్పుడల్లా ఇక్కడికి రండి. సరదాగా మా అందరితో గడపచ్చు. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మ ఉందని మరిచిపోవద్దు. " అంది.
ఆవిడ మాటలకు మాధవి, సుమల కళ్లు ఆవిడ పట్ల ప్రేమాభిమానంతో చెమ్మగిల్లాయి. అది గమనించిన రేవతి వాళ్లను మరింతగా దగ్గరికి తీసుకుని వాళ్ల కళ్లను తుడుస్తూ "ఛ! ఊరుకోండి పిల్లలూ! ఈ కన్నీళ్లేమిటి? పదండి! అందరం ఏదైనా బీచ్ కి వెళ్లి కాసేపు సరదాగా గడిపివద్దాం" అంది నవ్వుతూ వాళ్లని మరింత ఉత్సాహపరుస్తూ.
ఇంతలో బయటనుంచి రాఘవయ్యగారు వచ్చారు. బీచ్ కి వెళదాం అనేటప్పటికి ఆయనకు ఎక్కడ లేని హుషారు వచ్చింది. అందరూ హుషారుగా రెడీ అయి బీచ్ కి వెళ్లారు. ఎగిసిపడుతున్న సముద్రపు కెరటాలను చూసి దీప, విజయ్, మాధవి, సుమలు చిన్నపిల్లలైపోయి చాలా సంతోషంగా కేరింతలు కొట్టారు. సముద్రపు ఒడ్డున ఇసుకలో ఒకచోట కూర్చున్న రాఘవయ్య దంపతులు వాళ్లని తృప్తిగా చూస్తూ సంతోషించారు. అందరూ కాసేపు సరదాగా గడిపి హాయిగా ఇంటికి వచ్చారు.
========================================================================
ఇంకా ఉంది...
========================================================================
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments