'Sudha - Episode 6' - New Telugu Web Series Written By Neeraja Hari Prabhala
'సుధ - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక చివరి భాగం
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కధ…..
రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింది సుధ. క్లాస్మేట్ విజయ్ తో పరిచయాన్ని, అతని గతాన్ని గుర్తుచేసుకుంది సుధ. విజయ్ తండ్రి రాఘవరావుకు రేవతి వలన దీప పుట్టింది. విజయ్, దీపలు చక్కగా పెరిగి చక్కగా చదువుకుంటున్నారు. సుధ తన తండ్రిని తలుచుకుంటూ మంచి మార్కులతో డిగ్రీ పాసై ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని మనసులో అనుకుంది.
దీప స్నేహితురాలు మాధవి చెల్లెలు సుమ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే దీప, మాధవిలు కాలేజీ నుంచి అక్కడికి వెళ్తారు. సమయానికి హాస్టల్ వాళ్లు హాస్పిటల్ లో చేర్చగా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దీప ద్వారా విషయం తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి ఆమెను ఓదార్చి వాళ్ల ముగ్గురిని తనింటికి తీసుకువచ్చాక వాళ్లని చాలా ఆప్యాయంగా చూస్తుంది రేవతి.
సుమని స్నేహితురాలు సానుభూతిగా పలకరిస్తే చిన్నబుచ్చుకున్న సుమకి ధైర్యం చెపుతుంది రేవతి. తమను ఆప్యాయంగా చూస్తున్న రేవతికి మాధవి, సుమలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలిపారు. ఆ సాయంత్రం అందరూ కలిసి సంతోషంగా బీచ్ కి వెళ్లి సరదాగా గడిపి ఇంటికి వచ్చారు.
ఈ వారం కధ చదవండి….
ఇంటికి చేరినాక అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి నిద్రపోయారు. ఆ మరుసటి రోజున మాధవి, సుమలు వాళ్ల దైనందిన కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. అందరితోపాటు బ్రేక్ఫాస్ట్ ను పూర్తి చేసి వాళ్లు హాస్టల్ కు వెళ్లదలిచిన విషయాన్ని అందరి ముందూ చెప్పారు మాధవీ, సుమలు.
"ఇప్పుడేం తొందరొచ్చిందమ్మా! ఇంకో నాలుగు రోజులుండచ్చుగా" అన్నది రేవతి. దానికి రాఘవరావు, విజయ్, దీపలు మద్దతు పలికారు.
"లేదు ఆంటీ! వెళతాము. మీ దయ వలన సుమ ఇప్పుడు చాలా కోలుకుంది. తన శెలవులు కూడా అయిపోయాయి. తనని మా కాలేజీలోనే ఇంటరులో చేర్చాలి. అందుకు తగిన అప్లికేషను ఫారమ్ లు, ఏ గ్రూపు లో సీటు వస్తుందో, ఫీజు వగైరా ఏర్పాట్లు చూసి తనని చేర్చాలి. ఆ తర్వాత నా పరీక్షలు కూడా వస్తున్నాయి. అందుకని మేము వెళతాము ఆంటీ" అంది మాధవి.
అందరికీ మాధవి చెప్పింది సబబుగా అనిపించి వాళ్లు వెళ్లటానికి అంగీకరించారు. వెంటనే రేవతి తన గదిలోకి వెళ్లి అంతకు ముందే వాళ్లకోసమని కొని ఉంచిన బట్టలను, కొంత డబ్బును తెచ్చి వాళ్లకు బొట్టు పెట్టి ఇచ్చింది. భార్య చేసిన పనికి మెచ్చుకోలుగా ఆమెవైపు చూశారు రాఘవరావుగారు. విజయ్, దీపలు తల్లిని మనసులోనే మెచ్చుకున్నారు. రేవతి వాటితో పాటు కొన్ని పూవులను, పండ్లను కూడా వాళ్లకు ఇచ్చింది. వాటిని తీసుకుని రేవతికి, రాఘవరావుగారికి నమస్కరించారు మాధవీ, సుమలు.
రేవతి వద్దకు వచ్చి " ఆంటీ! ఇన్నిరోజులు మమ్మల్ని మీ పిల్లలతో సమానంగా ఆదరించి తల్లిలాగా ప్రేమానురాగాలను మాకు పంచారు. మీకు చాలా ఋణపడి ఉన్నాము." అని చెమర్చిన కళ్లతో అన్న మాధవీ, సుమలను దగ్గరకు తీసుకుని మరింత హత్తుకుంది రేవతి.
"మనలో మనకు ఋణాలేంటమ్మా! మాకు మా విజయ్, దీపలు ఎంతో మీరిద్దరూ అంతే! కష్టపడి బాగా చదివి మంచిగా వృధ్ధిలోకి రండి. శెలవులిచ్చినప్పుడల్లా ఈ అమ్మని గుర్తుపెట్టుకుని మా ఇంటికి రండి. ఇదీ మీ ఇల్లే!". అంది రేవతి.
"సరే! ఆంటీ!" అన్నారు వాళ్లు. రాఘవరావుగారు వాళ్లకి తగు జాగ్రత్తలు చెప్పి ఆశీర్వదించారు.
దీప ప్రేమగా మాధవీ, సుమలను హత్తుకొంది. విజయ్ వాళ్లిద్దరికీ తగు జాగ్రత్తలు చెప్పి "మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోండి" అన్నాడు.
"అలాగే అన్నయ్యా!" అన్నారు మాధవీ, సుమలు. ఆ తర్వాత వాళ్లిద్దరినీ తమ కారులో జాగ్రతగా వాళ్ల హాస్టల్ వద్ద దించి వచ్చారు విజయ్, దీపలు.
వాళ్లు వెళ్లాక ఇంట్లో సందడి తగ్గినట్లనిపించింది రేవతికి. కాసేపటికి ఆవిడ మరలా తన పనులకు ఉపక్రమించింది. రోజూ దీప, విజయ్ లు కాలేజీకి వెళ్లివస్తున్నారు. కొన్నాళ్లకు సుమని తమ కాలేజీలో చేర్చించింది మాధవి. ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లి వస్తున్నారు. మరికొన్ని రోజుల తర్వాత విజయ్, సుధలకు పరీక్షల హడావిడి మొదలైంది. వాళ్లు చాలా కష్టపడి చదివి పరీక్షలను బాగా వ్రాశారు.
ఆఖరి పరీక్ష వ్రాసినాక విజయ్ సుధతో "హమ్మయ్య! ఇవాళ్టితో మన పరీక్షలు పూర్తయ్యాయి. ఏదైనా హాటల్ కి వెళ్లి టిఫిన్ చేసి వద్దామా! కాస్త హాయిగా ఉంటుంది" అన్నాడు.
"సరే!" అంది సుధ. ఇద్దరూ దగ్గర్లోని హోటల్ కు వెళ్లి టిఫెన్ చేశారు. ఆ తర్వాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్లారు.
ఇద్దరూ తరచూ ఫోన్లలో తమ క్షేమసమాచారాలను తెలుసుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. దీప, మాధవీల పరీక్షల హడావిడి మొదలైంది. దీప పరీక్షల కంగారుకు రేవతే పరీక్షలు వ్రాసినంత హడావుడి పడింది. ఆవిడకు ఊపిరి సలపనంత పని అయింది.
దీప "పరీక్షలు బాగా వ్రాశాను అమ్మా!" అన్నాక ఆవిడ "హమ్మయ్య!" అనుకుంది. మాధవి కూడా పరీక్షలు బాగా వ్రాశానని చెప్పాక రేవతి మనసు స్ధిమితపడింది.
"విజయ్ అన్నిటికీ నిబ్బరంగా ఉంటాడు కనుక అతనితో నాకు ఏ సమస్యా ఉండదు. బంగారం లాంటి వాడు" అని మనసులో విజయ్ ని మెచ్చుకుంది రేవతి.
రెండు నెలలు గడిచాక దీప పుట్టినరోజు వచ్చింది. ఇంట్లో హడావిడి మొదలైంది. చెల్లెలు పుట్టినరోజు అంటే విజయ్ కు పండగే. దీపని షాపుకు తీసికెళ్లి ఆమెకి నచ్చినవి కొని పెట్టాడు. అన్న వద్ద గారాలు పోతూ తనకిష్టమైనవన్నీ కొనిపించుకున్నది దీప. ఆ అన్నా చెల్లెళ్లని చూసి సంతోషంగా ఉన్నారు రాఘవరావు దంపతులు.
దీపకు నచ్చినవి కొన్నారు రేవతీవాళ్లు. పుట్టినరోజు వేడుకలకు దీప తన స్నేహితురాళ్లతో పాటు మాధవీ, సుమలను కూడా పిలిచింది రేవతి, రాఘవరావుగారు వాళ్లు తమకు తెలిసిన బంధుమిత్రులను ఆహ్వానించారు. విజయ్ సుధని ఆహ్వానించాడు.
దీప పుట్టినరోజు రానే వచ్చింది. రేవతీవాళ్ల ఇంటికి అందరూ వచ్చారు. మాధవీ, సుమలు అందరికి మర్యాదలు చేస్తూ ఇంట్లో రేవతికి సాయంగా తిరుగుతున్నారు. సుధ రాగానే విజయ్ ఆప్యాయంగా ఎదురు వెళ్లి ఆమెని తీసుకొచ్చి తల్లి తండ్రులకు, చెల్లెలికి పరిచయం చేశాడు. సుధ వినయంగా రేవతి దంపతులకు నమస్కరించింది.
దీపని "హాయ్!" అని హత్తుకుంది. మాధవీ, సుమలని దీప పరిచయం చేయగానే వాళ్లని కూడా పలకరించింది సుధ. దీప పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్లందరూ చాలా విలువైన బహుమతులను ఇచ్చి దీపని ఆశీర్వదించారు. సుధ తన చేతితో స్వయంగా వేసిన పెయింటింగ్ చిత్రాన్ని, ఒక చీరను దీపకు బహుమానంగా ఇచ్చింది. అందమైన ఆ చిత్రాన్ని చూడగానే దీప, విజయ్ లు చాలా సంతోషించారు.
అందరికీ విందు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు రాఘవరావు దంపతులు. కాలేజీలో సుధ బాగా పాటలు పాడి చాలా బహుమతులను గెలుచుకుందని విజయ్ రేవతితో చెప్పాడు. రేవతి సుధని పాట పాడమని కోరగా సుధ చక్కగా పాట పాడింది. సుమధురంగా పాడిన ఆమె పాటకు అందరూ ముగ్ధులై 'వన్స్ మోర్' అని అడిగి ఇంకో రెండు పాటలను ఆమెచేత పాడించుకున్నారు. హాలులో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. సుధని అందరూ అభినందించారు.
రేవతి దంపతులు సుధలోని వినయాన్ని, సంస్కారాన్ని, ఆమె గాత్రమాధుర్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. సుధ మాటతీరు, ప్రవర్తన, ఆమె అందం, ఆమె గాత్రం, పెద్దలంటే ఆమెకున్న గౌరవమర్యాదలకు రేవతి ముగ్ధురాలైంది. విజయ్ చాలా సంతోషంగా సుధని అభినందించాడు.
రాఘవరావు దంపతులకు సుధ నమస్కరించి వెళ్లొస్తానని చెప్పింది. రేవతి సుధకు మంచి చీరని, పూలు, పండ్లను బొట్టుపెట్టి ఇచ్చింది. దాన్ని తీసుకుని సుధ దీప, విజయ్ ల వద్ద శెలవుతీసుకుని తన ఇంటికి వెళ్లింది.
అందరూ వెళ్లినాక రేవతి విజయ్ తో "సుధ చాలా మంచిపిల్లలా ఉందిరా! చక్కగా పాడుతోంది. మంచి గాత్రం. పెద్దలంటే వినయము, సంస్కారము ఉన్నాయి. ఆమె నా కోడలయితే బాగుంటుంది విజయ్ " అంది.
తల్లి మాటలను విన్న విజయ్ కొంచెం సిగ్గుపడుతూ "ముందు మా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు రానీ అమ్మా"! అన్నాడు.
కొడుకు మనసులోని ఉద్దేశ్యాన్ని గ్రహించిన రేవతి మనస్సులో చాలా సంతోషించి త్వరలో వాళ్లిద్దరికీ మంచి ఉద్యోగాలు రావాలని, ఆ తర్వాత సుధ తన కోడలవాలనీ మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్ధించింది.
========================================================================
*****సమాప్తం*****
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ వారి తరఫున, రచయిత్రి శ్రీమతి నీరజ హరి ప్రభల గారి తరఫున అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.
========================================================================
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments