#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Sunanda, సునంద,#TeluguMythologicalStory
Sunanda - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 08/11/2024
సునంద - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కేకయ మహారాజు సునందకుని ముద్దుల కుమార్తె సునంద. చదువు సంధ్యలలో, అందచందములలో సునందకు సాటి సునందయే అని ఆమెను చూసిన వారంతా అనుకుంటారు. ఆమె అందాన్ని చూసి అప్సరసలు కుళ్ళు కుంటారు. దేవతలు సునంద అందంలో సుర కళ దాగి ఉంది అనుకుంటారు. సునంద ఎక్కడ ఉంటే అక్కడ అందమైన ఆహ్లాదం సుందరంగా నర్తిస్తుందని కొందరు అంటారు.
అందం ఉన్నచోట మానవత్వం ఉండదు. మానవత్వం ఉన్నచోట అందం ఉండదు. అందం అహంభావాన్ని తెచ్చి పెడుతుంది అని అనుకునేవారు సునందను చూసాక వారి అభిప్రాయాలను మార్చుకుంటారు. అందం మానవత్వం సశాస్త్రీయ విజ్ఞానం కలబోసిన సురసుమకళిక సునంద అని ఆమె గురించి తెలిసినవారంతా అనుకుంటారు.
కేకయ రాజు, సునందకు వేద పురాణేతిహాసాల తో పాటు క్షత్రియోచిత విద్యలను కూడ నేర్పాడు. రాజుల వలే కత్తి తిప్పడం, ధనుస్సు ను ప్రయోగించడం, గదను పట్టడం, సుదర్శన చక్రాల్లాంటి చక్రాలను ప్రయోగించడం, త్రిశూల ప్రయోగం వంటి విద్యలలోనూ, అశ్వం మీదన ఉండి యుద్దం చేయడం, గజం మీదన ఉండి యుద్దం చేయడం, రథం మీదన ఉండి యుద్దం చేయడం, భూమి మీదన ఉండి యుద్దం చేయడం వంటి వివిధ యుద్దాలలో సునంద మంచి ప్రావీణ్యం పొందింది. ముఖ్యంగా సునంద ఎగిరే ఏడు తలల గుర్రం మీదన ఉండి, గరుత్మంతుని మీదన ఉండి యుద్దం చేసిందంటే విజయ లక్ష్మి ఆమెను వరించినట్లే అని ఆనాటి వీరులు అనుకునేవారు.
కేకయ రాజ వంశంలో పుట్టిన కైక లా అనేకానేక దేవాసురుల సమరంలో సునంద దేవతల తరుపున తండ్రితో కలిసి పోరాడటానికి సమర రంగంలో కాలు పెట్టింది. పలు అస్త్ర శస్త్రాలతో యుద్దం చేసింది. ఎగిరే ఏడు తలల గుర్రం మీదన, ఎగిరే రథం మీదన ఉండి యుద్దం చేసి, విజయ పతాకం ఎగర వేసింది. రారాజు లలో తన తండ్రిని ఉన్నత పథాన నిలబెట్టింది. కేకయ రాజ్యం మీదకు యుద్ధం అంటే తన శత్రువులు భయపడేటట్లు చేసింది.
కేకేయ రాజు, కుమార్తె సునంద సహాయ సహకారాలతో గాంధార రాజ్యాన్ని జయించాడు. ఇంకా అనేకమంది దుర్మార్గ భావనలు ఉన్న రాజులను ఓడించాడు.
సునంద కేకయ రాజ్యాన్ని ఆనుకుని ప్రవహించే సుధామ నదిని పరిశుభ్రం చేయించింది. సుధామ నది నీళ్ళు కేకయ రాజ్యంలోని పల్లెటూర్లకు ప్రవహించేటట్లు చేసింది. ప్రతి పల్లెటూరు కు పుష్కలంగా మంచి నీళ్ళు అందేలా చూసింది.
సునంద కృషి ఫలితంగా కేకయ రాజ్యం పాడిపంటలతో కళకళలాడ సాగింది. వ్యవససాయ దారులకు నీరు పుష్కలంగా లభించడంతో ఆయా కాలాల్లో వేయవలసిన పంటలను వేసారు. అన్ని రకాల పంటలను పుష్కలంగా పండించసాగారు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సునంద కాలంలో కేకయ రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో ప్రకాశించింది.
సునంద సరోవర తీరాన చక్కని పర్ణ శాలను నిర్మించుకుని అంతఃపురంలో కంటే అక్కడే ఎక్కువ గా ఉండసాగింది. భానుమతి అహంయాతి ల పుత్రుడు సార్వ భౌముడు తన పట్టాభిషేకం జరిగిన అనంతరం వివిధ రాజ్యాల రాజుల ఆహ్వానాల మేర ఆయా రాజ్యాలకు వెళ్ళాడు. ఆయా ప్రాంతాల రాజులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
సార్వ భౌముడు ఆతిథ్యాన్ని స్వీకరించే ముందు, రాజు స్వీకరించే ప్రతి పదార్థమును అతని అనుచరులు నలుగురు స్వీకరించేవారు. కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం ఈ పని జరుగుతుంది అని సార్వ భౌముడు ఆయా రాజులకు చెప్పేవాడు.
సార్వ భౌముని మాటలను విన్న ఆయా రాజులు కుల గురువు వశిష్ట మహర్షి ముందు చూపు అమోఘం అని అనుకునేవారు. అలా సార్వ భౌముడు అనేక మిత్ర రాజ్యాల ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
అలా సార్వ భౌముడు కేకయ రాజ్యానికి వచ్చాడు. కేకయ రాజు, సార్వ భౌముని తగిన రీతిలో సత్కరించాడు. సార్వ భౌమునికి పెట్టిన ఆహారం ముందుగా అతని అనుచరులు రుచి చూసారు.
దానికి గల కారణాలను సార్వ భౌముడు కేకయ రాజుకి వివరించాడు. సునందకు సార్వ భౌముడు చెప్పిన కారణాలు నచ్చలేదు. అయినప్పటికి యింటికి వచ్చిన అతిథిని గౌరవించాలని మౌనంగా ఉండి పోయింది. సార్వ భౌముని తో ముక్త సరిగా మాట్లాడిన సునంద తన పర్ణశాలకు వెళ్ళిపోయింది.
పది రోజుల పాటు తమ ఆతిథ్యం స్వీకరించమని కేకయ రాజు సార్వ భౌముని ప్రార్థించాడు. సార్వ భౌముడు అందుకు అంగీకరించాడు.
సార్వ భౌముడు కేకయ రాజ్యాన్ని పరిశీలించాడు. అక్కడి సిరిసంపదలను చూసి కేకయ రాజును ప్రశంసించాడు. అక్కడి వ్యవసాయాభివృద్ధి గురించి రైతులను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం లో తాము అంత అభివృద్ధి చెందడానికి తమ యువరాణి సునందయే కారణమని రైతులందరూ సార్వ భౌమునికి ముక్త కంఠంతో చెప్పారు. సార్వ భౌముడు అక్కడి చిరు ధాన్యాలు అన్నిటినీ పరిశీలిస్తూ, సునంద పర్ణశాలకు వెళ్ళాడు. అక్కడి వాతావరణం సార్వ భౌమునికి బాగా నచ్చింది. సునంద సార్వ భౌమునికి స్వాగతం పలికింది.
పర్ణశాలలోని రకరకాల పళ్ళను పక్షులు రుచి చూసాక వాటిని సునంద సార్వ భౌమునికి ఇచ్చింది. సునంద ఇచ్చిన పళ్ళన్నిటిని సార్వ భౌముడు మనఃపూర్వకముగా ఆరగించాడు. సార్వ భౌముడు రకరకాల వ్యవసాయ పంటల దిగుబడి గురించి, చిరు ధాన్యాలు గురించి సునందను అడిగి తెలుసుకున్నాడు. సునంద వ్యవసాయం మీద సార్వ భౌమునికి ఉన్న ఆసక్తిని గమనించింది.
సార్వ భౌముని మనసు సునంద మీదకు మళ్ళింది.
నాలుగు రోజుల అనంతరం అదే విషయాన్ని సార్వ భౌముడు కేకయ మహారాజు కు చెప్పాడు. తన కుమార్తె కు ఇష్టమైతే తమని అల్లునిగా చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కేకయ మహారాజు సార్వ భౌమునితో అన్నాడు.
సార్వ భౌముడు, "రాజ! బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, రాక్షసి, పైశాచిక " అని వివాహాలు అనేక పద్దతులు ఉన్నాయి. మీరు ఏ వివాహాన్ని ఆమోదిస్తారు?" అని కేకయ మహారాజు ని అడిగాడు.
సార్వ భౌముని మాటలను విన్న కేకయ మహారాజు, "రాజ! మా రాజ్యం లో అనేక బ్రహ్మ వివాహాలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. కట్న కానుకలకు అతీతంగా పెద్దలందరి అంగీకారం తో వధూవరులు ఒకటవ్వడం బ్రహ్మ వివాహం. ఇవి ఇప్పటికీ యథేచ్ఛగా జరుగుతున్నాయి.
ఇక మా రాజ్యం లో దైవ వివాహాలు కూడా కొన్ని జరిగాయి. ఈ వివాహం లో తండ్రి తన కుమార్తెను దక్షిణ రూపంలో ముందుగా పురోహితునికి ఇస్తాడు. ఆపై ఆ స్త్రీని మరొక వ్యక్తి మనువాడతాడు.
మా రాజ్యం లో దైవ వివాహాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. వర్ణ అహంకారం వలన ఈ మార్పు వచ్చింది. పురోహితులు తమ ఉదర పోషణార్థం ఈ సంప్రదాయాన్ని పెట్టారు. తర్వాత తర్వాత సమాజంలో వచ్చిన మార్పు వర్ణ అహంకారం ఈ పద్దతి నశించడానికి కారణం అయింది.
ఇక అర్ష వివాహం కూడా మా రాజ్యం లో నేడు పూర్తిగా తగ్గిపోయింది అనే చెప్పాలి. అర్ష వివాహం లో వధువు తండ్రి తన కుమార్తెను ముందుగా ఒక ఋషికి ఇవ్వవలసి ఉంటుంది. ఆపై రెండు తక్కువ కాకుండా ఆవులను ఋషికి ఇచ్చి వధువును తీసుకోవలసి ఉంటుంది. ఋషులు తమ జీవనాధారం కోసం ఈ పద్దతిని ప్రవేశ పెట్టారు. అయితే ఈ సంప్రదాయం నేడు పూర్తిగా తగ్గు ముఖం పట్టింది.
పురోహితులు, ఋషులు చేసే ధర్మ కార్యాలకు కావల్సిన సమస్తం రాజులమైన మేమే చూస్తున్నాం. అయినా అక్కడక్కడ కొందరు స్వార్థ పరులైన పురోహితులు, ఋషులు సంప్రదాయాల పేరుతో కొందరు మనుషులను మోసం చేస్తూనే ఉన్నారు. వారి గురించి మాకు తెలిసిన వెంటనే మేము వారిని కఠినంగా శిక్షిస్తున్నాము.
ఇక కన్యాదానం లేని ప్రజాపత్య వివాహం మా రాజ్యం లోని అధిక శాతం మంది జనం ఆచరిస్తారు. అయితే ఇందులోని అనాచారాలను తొలగించి అనుసరిస్తారు.
ఇక కన్యను కొనుగోలు చేసే అసుర వివాహం, కామం నుంచి పుట్టిన గాంధర్వ వివాహం, వధువును అపహరించి వివాహం చేసుకునే రాక్షస వివాహం, వరుని అపహరించి వివాహం చేసుకునే రాక్షసి వివాహం, మగువ, మత్తులో ఉన్నప్పుడు ఆమెను అత్యాచారం చేసి వివాహం చేసుకునే పైశాచిక వివాహం లు అప్పుడప్పుడు మా రాజ్యంలో జరుగుతూనే ఉంటాయి.
అందరి బుద్ది ఒకే విధంగా ఉండదు కదా? అందుకే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా వివాహం చేసుకున్నవారికి ఇక్కడ కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. " అని అన్నాడు.
సార్వ భౌముడు కేకయ మహారాజు అభిప్రాయం తీసుకున్న పిమ్మట తన మనసులోని మాటను సునందకు చెప్పాడు. సునంద సార్వ భౌముని ప్రేమను తిరస్కరించింది. అందుకు ప్రధాన కారణం సార్వ భౌమునికి తనే సార్వ భౌముడుని అనే అహంకారం అధికంగా ఉందన్నట్లు తనకు అనిపించింది అంది. అది నిజం కాదని సార్వ భౌముడు సునందతో అన్నాడు. అయినా సునంద సార్వ భౌముని నమ్మలేదు.
సార్వ భౌముడు సునంద మనసులోని మాటను కేకయ మహారాజు కు చెప్పాడు. కేకయ మహారాజు బాగా ఆలోచించి తన తోటలోని తులసి చెట్టు తో సార్వ భౌముని వివాహం జరిపించాడు. అనంతరం సార్వ భౌముని తో, "రాజ, సార్వ భౌమ! మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నేను నీకు తులసి చెట్టు ను ఇచ్చి వివాహం చేసాను. ఇక నువ్వు నా కుమార్తె సునందను రాక్షస వివాహం చేసుకున్నను తప్పులేదు. అయితే నా కుమార్తె మీద పైశాచికత్వం ప్రదర్శించమాకు" అని అన్నాడు.
కేకయ మహారాజు మాటలను విన్న సార్వ భౌముడు చిరునవ్వుతో సునంద పర్ణశాలకు వెళ్ళాడు. తన మనసులోని మాటను సునందకు చెప్పాడు. సునంద సార్వ భౌముని మాటను మన్నించలేదు. సార్వ భౌముడు సునందను పలు విధాలుగా బతిమిలాడాడు.
"నీమనసులో ఇంకవరన్నా ఉన్నారా? వారిని తీసుకు వచ్చి నీ చరణాల ఉంచుతాను" అని సునందను సార్వ భౌముడు అడిగాడు.
"నా మనసులో ఎవరూ లేరు " అని సునంద అంది.
సార్వ భౌముడు బలవంతంగా సునందను తన రథం లో ఎక్కించుకున్నాడు. సార్వ భౌముడు సునందను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి బలవంతంగా రాక్షస వివాహం చేసుకున్నాడు.
భానుమతి అహంయాతులు సునందను దగ్గరకు తీసుకున్నారు. ఆమె ఆవేశాన్ని తగ్గించారు. తన కుమారుని పేరు సార్వ భౌముడు యే కాని అతనిలో నేనే సార్వ భౌముడు ని అనే అహంకారం అణుమాత్రం కూడా లేదన్నారు. కొంత కాలం ఓపిక పట్టి నిజం తెలుసుకో అన్నారు . సునంద మనసు సార్వ భౌముని మీదకు మళ్ళేటట్లు చేసారు.
కాలం గడుస్తున్న కొద్దీ సునందలో మార్పు వచ్చింది. సార్వ భౌముని లోని మంచిని గమనించింది. రాజకీయ విషయాలలో కూడా సునంద సార్వ భౌమునికి సహాయ పడసాగింది. వారిరువురికి పుట్టిన సంతానమే జయత్సేనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
malli chandamama kathalu chadivinatuu vundi