#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Supushta, #సుపుష్ట,#TeluguMythologicalStory
Supushta - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 10/12/2024
సుపుష్ట - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
రాజా ప్రసేన జిత్ రాజ్యంలో గో సంపద సంవృద్దిగా ఉండేది. ప్రసేన జిత్ రాజ్యంలోని నిరు పేదలందరికి గోదానం చేసి, వారికి బతుకు తెరువు కల్పించాడు. ప్రసేన జిత్ భార్య మహా భామ కూడా గోపూజ చేయడం అంటే మిక్కిలి మక్కువ చూపించేది.
సంతానం కోసం ఆ పుణ్య దంపతులు అనేక నోములు నోచారు. క్రమం తప్పకుండా గో పూజలు జరిపించారు. అన్నదానాలు చేసారు. ధన కనక వస్త్ర దానాలు చేసారు. యజ్ఞ యాగాదులను చేయించారు. మహర్షుల సభలను, సుకవుల సభలను, కళాకారుల సభలను ఏర్పాటు చేసి వారిని తగిన విధంగా సత్కరించారు. వారి సత్కార్యాల ఫలంగా వారికి శ్రీవాణీగిరిజల తేజం తో ఒక ఆడ శిశువు పుట్టింది. ఆడ శిశువు ను చూసి ఆ పుణ్య దంపతులు మహా మురిసి పోయారు. జ్యోతిష్య పండితులను పిలిచి శిశువు జాతకం చూపించారు. జ్యోతిష్య పండితుల సూచన మేర శిశువుకు సుపుష్ట అని నామ ధేయం చేసారు.
మహా భామ, ప్రసేన జిత్ పుణ్య దంపతులు సుపుష్టను అల్లారు ముద్దుగా పెంచసాగారు. సుపుష్ట గురువుల దగ్గర వేదవేదాంగాది సమస్త విద్యలను అభ్యసించింది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ధర్మాన్ని అనుసరించి తను ఆరోగ్యం గా ఉంటూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి తన వంతు సహాయం నిరంతరం అందించసాగింది. తన రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూసింది. యుద్ద విద్యలందుకూడ మంచి నైపుణ్యాన్ని సంపాదించింది.
సుపుష్ట అశ్వగజరథాదుల మీద నిలబడి శత్రువులను చీల్చి చెండాడటం లో ఆమెకు ఆమే సాటి అనిపించుకుంది. అశ్వం మీద, గజం మీద నిలబడి యుద్దం చేసే విద్యలో ఆ రోజుల్లో సుపుష్ట ఒక్కతే మహా నైపుణ్యం గల వీరనారి అని సుపుష్ట శత్రువులు సహితం అనుకునేవారు.
సుపుష్ట అనేక రకాల గోపూజలు చేసింది. గోలోకం సందర్శించి వచ్చింది.
సుపుష్ట పరుల శక్తి సామర్థ్యాలను, మంచి చెడులను ధృవీకరించడంలో ఎప్పుడూ తప్పటడుగు వేసేది కాదు. ఆమెను మంచి మాటలతో మోసం చేయాలని ప్రయత్నించే వారే కడకు మోసపోయేవారు.
ఒకసారి నిగమ కంఠుడు అనేవాడు సుపుష్ట దగ్గరకు వచ్చి, "అమ్మా సుపుష్ట, నేను వేదాలన్నిటిని ఔపాసన పట్టాను. ఉదరవ్యాది తో బాధ పడుతున్నాను. నిరుపేదను. నన్ను ఆదుకుని నా ప్రాణాలను రక్షించు. " అని అన్నాడు.
నిగమ కంఠుని వాలకం గమనించిన సుపుష్ట నిగమ కంఠుడు పని దొంగ అని గమనించింది. అంత నిగమ కంఠుని వేద పాఠశాల లో ఉండమంది. నిగమ కంఠుడు అలాగేనని వేద పాఠశాల లో ఉన్నాడు.
వేద పాఠశాల లోని విద్యార్థులు నిగమ కంఠుని వేద మంత్రాల గురించి అడగసాగారు. అప్పుడు నిగమ కంఠుడు "వేద మంత్రాలన్నీ చచ్చు మంత్రాలు. వాటిని చదివితే అనారోగ్యం మెండుగా దండిగా వస్తుంది. ఫలితం ఇసుమంతైనా రాదు. దేవుడు లేడు. గీముడు లేడు. నాలాంటి వారిని దేవునిగా కొలిచేవారికే మేలు జరుగుతుంది. ఇవి దొంగ మాటలు కావు. జ్యోతిష్య శాస్త్ర మాటలు. ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు. ముందు జాగ్రత్త తో మెలగాలి. రేపటిని తలచుకుని భయంతో మరింత అధికంగా సంపాదించాలి " అని అన్నాడు.
నిగమ కంఠుని గురించి విద్యార్థులు చెప్పిన మాటలను విన్న సుపుష్ట తను ఊహించినట్లుగానే నిగమ కంఠుడు వేదం కూడా చదవలేదని గ్రహించింది. అనంతరం సుపుష్ట నిగమ కంఠుని గోశాలలో ఉండమంది. అలాగే అని నిగమ కంఠుడు గోశాల కు వెళ్ళాడు. అక్కడ నిగమ కంఠుడు గోవులను కాసే గోపాలుర వృత్తిని కించపరిచాడు..
అప్పుడు గోపాలురు నిగమ కంఠుని చేతికి ముల్లుకర్రను ఇచ్చి, “మీకు ఇష్టమైన వృత్తిని నీతి తప్పకుండా మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చేయండి” అని అన్నారు.
నిగమ కంఠుడు “నాకు ఉదర సంబంధ వ్యాధి ఉంది. నేను ఏ పనీ చేయలేను” అన్నాడు.
అప్పుడు గోపాలురు "అయ్యా! ఎన్ని చిన్న చిన్న వ్యాధులు తన శరీరానికి సోకినా గోమాత గడ్డి మేసి పాలు ఇస్తుంది. ఆ పాలను మనం తాగుతున్నాము. యజ్ఞ యాగాదులలో ఉపయోగిస్తున్నాము. ఇంకా రకరకాలుగా గో క్షీరాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇలా గోమాత మనకు ఉపయోగపడుతుంది. మరి నేను ఎలా ఎవరికి ఉపయోగ పడతాను? అని మీరు ఆలోచించరా? మన యువరాణి సుపుష్టమ్మ గారు మీకు ఏ వ్యాధీ లేదు. మీరు పనిదొంగ అని ఏనాడో ధృవీకరించారు. మీలో మార్పు కోసం వారు మిమ్మల్ని ఇక్కడకు పంపారు. మీరు ఇక్కడ కూడా మారకుంటే, తదుపరి మీకు వరాహ సంరక్షణ బాధ్యతను అప్పగిస్తారు. "అని అన్నారు.
గోపాలుర మాటలను విన్న నిగమ కంఠుడు భయపడ్డాడు. సుపుష్ట గోపాలురను కలిసి నిగమ కంఠుని మాటల గురించి తెలుసుకుంది. అలాగే నిగమ కంఠుని తో గోపాలురు అన్న మాటలను కూడా తెలుసుకుంది. అనంతరం నిగమ కంఠుని కలిసింది.
"నిగమ కంఠ, నీలో అనుమానం, భయం అధికం. కారణం నువ్వు పని దొంగవు కావడం. తన శక్తి మేర ఏదో ఒక పని చేసేవానికి అనుమానం, భయం ఉండవు.
తన మీద తనకు నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలం దక్కలేదని అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. అసలు పని చేయకుండా అసంతృప్తి తో సమాజాన్ని నిందించేవారి వలననే సమాజంలో హింస, మోసం, దుర్మార్గం, కపటత్వం, నయవంచన, దైవనింద వంటి జాడ్యాలు పెరుగుతాయి. నువ్వు ఆ మార్గాన సంచరించకు" అని నిగమ కంఠుని తో సుపుష్ట అంది.
నిగమ కంఠుడు బుద్ది తెచ్చుకుని గోసంరక్షణ చేస్తూ సుపుష్ట మన్ననలను అందుకున్నాడు. సుపుష్ట కీర్తి ప్రతిష్టల గురించి ఆంగి అరిహుల కుమారుడు మహా భౌమునికి తెలిసింది. మహా భౌముడు సుపుష్ట చిత్ర పటమును తెప్పించి చూసాడు.
మహా భౌముని కి సుపుష్ట నచ్చింది. చిత్ర పటమును తలిదండ్రుల కు చూపించాడు. సుపుష్ట రూపం అందరికి నచ్చింది.
అరిహుడు మహా భౌముని చిత్ర పటమును ప్రసేన జిత్ కు పంపాడు. మా కుమారుడు మీకు నచ్చితే మీతో వియ్యమందడానికి సంసిద్ధంగా ఉన్నామని వర్తమానం పంపాడు. ప్రసేన జిత్ వర్త మానం తీసుకు వచ్చినవానికి వివిధ రకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి నూతన వస్త్రాదులతో సన్మానించాడు. త్వరలోనే శుభ సందేశం పంపుతామని అరిహ మహా రాజు కు చెప్పండి అని అన్నాడు. అనంతరం ప్రసేన జిత్ ముద్దుల కుమార్తె సుపుష్టకు, తన భార్యకు మహా భౌముని చిత్ర పటం చూపించాడు.
సుపుష్ట మహా భౌముని చిత్ర పటం చూసింది. మహా భౌమునిలోని సాత్విక రాజసం ఆమెకు నచ్చింది. ఆ రాజసంలోని మంచి చెడులన్నిటి గురించి చెలికత్తెలతో చర్చించింది.
సుపుష్ట తండ్రి ప్రసేన జిత్ తో, "తండ్రీ.. కాబోయే మహా భౌమ రాజు నాకు తెలిసి అన్ని విషయాలలో నాకు తగిన వాడే అని అనిపిస్తుంది. అయితే మహా భౌమునిలో కించిత్ యాగ తేజం స్వల్పం గా ఉందని నాకు అనిపిస్తుంది. వారిని ముందుగా సుపుష్ట యాగం చేయమని వర్తమానం పంపండి" అని అంది.
ప్రసేన జిత్ సుపుష్ట అభిప్రాయాన్ని అరిహునికి తెలియ చేసాడు. అరిహుడు సుపుష్ట యాగం గురించి సంపూర్ణ సమాచారం తెలుసుకు రమ్మని కుల గురువు వశిష్ట మహర్షిని సుపుష్ట దగ్గరకు పంపాడు.
వశిష్ట మహర్షి ప్రసేన జిత్ ను సుపుష్టను కలి సాడు. వశిష్ట మహర్షి ని ప్రసేన జిత్ తగిన రీతిలో సత్కరించాడు. అనంతరం సుపుష్ట, వశిష్ట మహర్షి సుపుష్ట యాగం గురించి చర్చించుకున్నారు. సుపుష్ట యాగం వలన రాజ్యానికి, రాజుకు జరిగే పుష్టి ఫలితాల గురించి కూడా ముచ్చటించు కున్నారు. వారి ముచ్చట్ల లో గోలోక ప్రస్తావన వచ్చింది. వివిధ రకాల గోవులిచ్చే క్షీర ప్రస్తావన కూడా వచ్చింది.
కుల గురువు వశిష్ట మహర్షి ఆధ్వర్యంలో అరిహ మహారాజు సుపుష్ట యాగం జరిపించాడు. ఆ యాగానికి ప్రసేన జిత్ మహారాజు, అతని భార్య, సుపుష్ట, ప్రసేన జిత్ బంధువులు, తదితరులందరూ వచ్చారు.. ఆ యాగంలో గోవులు కూడా ప్రధాన పాత్ర వహించాయి.
యాగ అనంతరం అరిహ మహారాజు తన కుమారుడు మహా భౌమునికి పట్టాభిషేక మహోత్సవం కూడా జరిపించాడు. ఆ రెండు శుభ కార్యాల్లో సుపుష్ట ప్రధాన పాత్ర వహించింది. శుభ కార్య సమయంలో సుపుష్ట మహా భౌముని తో గోవులను పరిశుభ్రం చేయించింది. సురభి మార్తాండ సంతానమైన గోవుల సంరక్షణలో మెలకువలు గురించి. ముచ్చటించింది. శాస్త్రోక్తంగా గో పూజ చేయించింది.
మహా భౌముడు సుపుష్ట చేయించిన గో పూజ ప్రభావాన, గోవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుని, మూపురం లో శివుని, పాదాలలో దేవతలను, కడుపులో అగ్ని దేవుని, పాల పొదుగు లో సరస్వతీ దేవినీ, పాలలో బ్రహ్మ దేవుని, కన్నులలో సూర్య నారాయణుని గోవు తదితర అవయవాలలో లక్ష్మీ దేవిని, పార్వతీ దేవుని, భృగుని, సిద్దులను, యమ ధర్మరాజు ను, మహా విష్ణువు ను తదితర దేవతలందరిని చూసాడు.
మహా భౌముని రాజ్యంలోని ప్రజలందరూ సుపుష్టను సుపుష్ట అని కాకుండా. సుయజ్ఞ అని పిలవ సాగారు. మంచి శుభ ముహూర్తాన సుపుష్ట మహా భౌముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మహా భౌముని రాజ్యంలోని ప్రజలు మాత్రం సుపుష్టను సుయజ్ఞ మహారాణి అనే పిలవ సాగారు.
ఆ పుణ్య దంపతుల కుమారుడు ఆయుతానీకుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments