top of page

సూరిగాడి కథ


'Surigadi Katha - New Telugu Story Written By P. Gopalakrishna

Published In manatelugukathalu.com On 13/10/2023

'సూరిగాడి కథ' తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ

కథా పఠనం: A. సురేఖ

"ఒరేయ్ సూరీ, సినబాబుగారు వత్తన్నారు. బస్సు కాడికెళ్ళు, బాబుగారు బాగా అలసిపోయి ఉంటారు" ఇల్లు ఊడుస్తూ అరుస్తోంది పనిమనిషి మునెమ్మ.


"టైం ఎంతయినాదేటి"... , మెట్లు మీదినుండి కదలకుండానే పుస్తకం చదువుతూ అడిగాడు పన్నెండేళ్ల సూరిగాడు.


"నీకు శానా ఎక్కువైనాదిరో, అమ్మగారు సూస్తే ఇయ్యాల నీ పని ఖతం. ముందు బస్సు కాడికెళ్ళి అబ్బాయిగార్ని తీస్కరా పో".. అంటూ పనిలో నిమగ్నమైంది.


"ఇయ్యాల్టికి నువ్వెళ్ళి తీస్కరా పో. నేను సదువుకుంటన్నా, ఈ పాఠం అప్పసెప్పమని అమ్మగారు ఉదయం సెప్పారు. ఇంకా పూర్తిగా రాలా" చెప్పాడు సూరిగాడు.


"ఒరేయ్ సూరీ నాకు శానా పనుందిరా. నీకేం పనుంది సెప్పు. బాబుగారి పని కోసమే కదరా నువ్వున్నది" అంది మునెమ్మ.


"నేనెళ్ళను, పోవే" అన్నాడు సూరిగాడు.


మునెమ్మకి పన్నెండేళ్ల కిందట రోడ్డుపక్కన ఎవరో గుడ్డల్లో చుట్టి మూట కట్టి పడేస్తే దొరికాడు సూరిగాడు. పనిలోకి వెళ్తూ పసిబిడ్డ ఏడుపు వినేసరికి జాలి కలిగి తనతో పాటూ ఇంటికి తీసుకెళ్లి, తల్లీ తండ్రీ తానే అయ్యి పెంచింది.


వాడూ తనలాగే అనాధగా బతకకూడదని చిన్నప్పుడే బడికి పంపించాలని ఎన్నో కలలు కన్నది. కానీ తన ఆర్థికపరిస్థితి అంతంత మాత్రం కావడం, జబ్బు చేసిన సూరిగాడు చచ్చిపోతాడేమో అని భయమేసి బళ్లోకి పంపకుండా తనతోపాటు పనిదగ్గరకి తీసుకొచ్చేది మునెమ్మ. సూరిగాడి వైద్యానికి చేసిన అప్పు తీర్చడానికి వాడిని కూడా పనిలో చేర్చక తప్పలేదు మునెమ్మకి.


"అమ్మగారూ నేను బళ్లోకి వెళ్లి సదువుకుంటానండీ" అంటూ ఇంటి యజమానురాలు సరళని నోరు తెరిచి అడిగాడు సూరిగాడు. ఆవిడ దగ్గర ఉన్న చనువుతో వాడు అలా అడిగాడు.


"నువ్వు సదువుకోనక్కర్లేదు. ఇప్పుడు సదివి ఏం సేత్తావురా" అడిగింది మునెమ్మ.


"నేను బాబుగారిలాగా సదువుకుంటానే అమ్మా, ఉజ్జోగం సేసి నీకు మంచిగా బువ్వెట్టి, బట్టలు కొంటానే" అడిగాడు ఆశగా.

వాడి చూపులు అమ్మగారి మీదా, తల్లిమీదా ఉన్నాయి.


అమ్మగారు చిన్నగా నవ్వి "ఒరేయ్ సూరీ, నీకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది కదరా, నేను నీకు కొంచెం చదువు నేర్పిస్తాను. బాబు దగ్గర ఉన్న పుస్తకాలు అవీ నీకు ఇస్తాను. చక్కగా ఇక్కడే ఇంట్లో చదువుకుంటూ అమ్మకి చిన్నచిన్న పనులు సాయం చేస్తూ ఉండు. సరేనా" అన్నారు అమ్మగారు.

"అమ్మగారు నిజంగా దేవత" అంటూ సూరిగాడు అక్కడే చిందులు వెయ్యసాగాడు.


వాడికి కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ చెప్పినరోజు మునెమ్మతో పాటు యజమానురాలు సరళ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.


సరళ భర్త రాజశేఖర్ మాత్రం "ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఒడ్డెక్కదు కదా, పెద్దవాడయ్యాకా ఆపరేషన్ చేయిద్దాం నాది బాధ్యత" అంటూ మునెమ్మకి ధైర్యం చెప్పాడు.


పనిలో చేరిన ఎనిమిదేళ్లలో జీతం పెంచమని లేదా ఏమైనా ఇవ్వమని ఎప్పుడూ మునెమ్మ నోరు తెరిచి అడిగింది లేదు. ఎప్పుడు ఎంత జీతం ఇవ్వాలో, సూరిగాడి పేర ఎంత డబ్బులు దాచాలో అన్నీ ఆ భార్యాభర్తలే చూసుకునేవారు.


ఇంకో రెండు మూడిళ్లల్లో పని చేసేసి, మునెమ్మ మిగిలిన సమయమంతా సరళమ్మ గారింట్లోనే ఉంటుంది. ఇంటికి కొంచెం దూరంగా ఒక రేకుల గది వేసి, మునెమ్మా, సూరిగాడు ఉండడానికి సౌకర్యంగా ఏర్పాటు చేసారు ఆ దంపతులు. సరళ వాళ్ళబ్బాయి విజయ్ ని స్కూల్ బస్సు ఎక్కించడం, తిరిగి ఇంటికి తీసుకురావడం సూరిగాడు చేసే పని. వాడి ఆరోగ్యం బావుండదని బరువులు మోసే పనులేవీ వాడికి చెప్పరు. సరళ, రాజశేఖర్ దంపతుల దగ్గర తమ జీవితం చాల హాయిగా గడిచిపోతుందని మునెమ్మ కి ధీమాగా ఉండేది.


"మునెమ్మా, సూరి చాల బాగా చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు ఇంట్లో పూర్తి చేయించి నేరుగా పెద్ద బడికి పంపిద్దాం. అయ్యగారు దగ్గరుండి చేర్పిస్తానని రాత్రి చెప్పారు". ఇంట్లో గిన్నెలు తోముతున్న మునెమ్మకి చెప్పింది సరళ.


"తమరు వయసులో సిన్నవారైనా సేతులెత్తి దణ్ణం పెట్టాలమ్మా. కన్నబిడ్డలు కూడా ఇంత బాగా సూసుకోరేమో. తమరు, బాబుగోరూ నన్ను, సూరిగాణ్ణి శానా బాగా సూత్తున్నరు" అంట్లు తోముతున్న చేతులతోనే సరళకి చేతులెత్తి మొక్కింది మునెమ్మ.


"తప్పు మునెమ్మా, నువ్వు పెద్దదానివి. అలా దణ్ణం పెట్టకూడదు" అంటూ వారించింది సరళ.


"అమ్మగోరూ, సూరికి బాగవుతాది కదమ్మా"! బేలగా అడిగింది మునెమ్మ.


"నువ్వు అధైర్యపడకు. బాబుగారు అన్నీ చూసుకుంటారు. నీకిచ్చే జీతంలో దాచిన డబ్బులు ఇప్పటికే లక్ష రూపాయలు వరకు అయ్యాయి. వాటిని వడ్డీలకి ఇచ్చి అయ్యగారు నీ డబ్బు రెట్టింపు చేశారు. ఇంకో మూడేళ్లు ఆగితే వాడికి ఆపరేషన్ కి వయసొస్తుంది. నువ్వేం దిగులు పడకు మునెమ్మా" అంటూ ఆమె తోమిన గిన్నెలు, పళ్లేలు లోపల సద్దేసి, "నువ్వెళ్ళి పడుకో" అంటూ పంపించేసింది.


"అమ్మా".... అంటూ ఏదో ఆలోచిస్తున్నవాడిలా పిలిచాడు సూరిగాడు.

"నువ్వింకా పడుకోలేదా" అడిగింది మునెమ్మ.


"అమ్మా నేను బాబుగారిలాగా పెద్ద స్కూల్ లో సదువుకుంటానే" ఆశగా అడిగాడు.


"ఒరేయ్ సూరీ, మనం అంత డబ్బు కరుసు పెట్టలేమురా. అయ్యగారు నిన్ను గవురమెంట్ బడికి ఏద్దాం అన్నారుట. అమ్మగోరు సెప్పారు. ఇంకా బాగా సదువుకో నాన్నా" అంది.


"అమ్మా.. అమ్మగారూ, బాబుగారూ శానా మంచోరు కదా! నాకు ఇంట్లోనే బాగా సదువు సెప్తున్నారు" అన్నాడు.


వాడు నిద్రమత్తులో ఏదేదో చెప్తూనే ఉన్నాడు. మునెమ్మా "ఊఁ.... "అంటూ ఎప్పుడో గురకపెట్టడం మొదలెట్టింది. వాళ్ళిద్దరికీ అది అలవాటే.


***


"అమ్మా, వర్షం పడుతోంది ఇవాళ స్కూల్ కి వెళ్ళను" అంటూ విజయ్ అడుగుతున్నాడు.


"చదువుకోకపోతే ఎలారా? ఇవాళ్టి వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతుంది. బుద్ధిగా లేచి రెడీ అవ్వు నాన్నా" కొడుకుని బుజ్జగిస్తోంది వాళ్ళమ్మ సరళ.


"పోనీలే సరళా ఇవాళ ఒక్కరోజేగా, రేపు ఎల్లుండి ఎలాగూ సెలవే కదా. ఇంట్లో ఆడుకుంటాడులే" బెడ్ దిగకుండానే చెప్పాడు రాజశేఖర్.


“మీరిలా వాణ్ణి గారాబం చేస్తే వాడికి చదువెలా వస్తుంది” అంది సరళ.


“ఒక్కరోజుకి ఏమీ కాదులే” అంటూ తండ్రి సమర్థించడంతో విజయ్ ఆడుకోడానికి వెళ్ళిపోయాడు.


"ఒరేయ్ సూరీ, ఇవాళ హోటల్ నుండి టిఫిన్ తీసుకువస్తావా?” అడిగారు రాజశేఖర్.


"అలాగే అయ్యగారూ" అన్నాడు సూరి.


"వర్షం హోరున పడుతూ ఉంటే ఇప్పుడు బయటి నుండి టిఫిన్ తెప్పించడం అవసరమా" అంది సరళ.


"పోనీలే సరళా, పిల్లాడు కూడా ఇంట్లోనే ఉన్నాడుగా. నేను ఎలాగూ సెలవు పెట్టాను. అందరికీ టిఫిన్ తెప్పించుదాం" అన్నాడు రాజశేఖర్.


'నేను కూడా వస్తాను" అంటూ వెంటపడ్డాడు విజయ్.


"ఒద్దు బాబూ, వర్షం పడుతోందిగా. నువ్వు తడిసిపోతావు. నేను వెంటనే వస్తానుగా" అంటూ గొడుగు తీసుకొని బయల్దేరాడు.


"ఏరా సూరీ, ఎక్కడా కనపడ్డం లేదు" అడిగాడు హోటల్ లో పనిచేసే సుందరం.


"లేదురా, ఇంట్లోనే ఎక్కువసేపు సదువుతున్నాను. మా అమ్మగారు చదువు చెప్తారు నాకు” కబుర్లు మొదలెట్టాడు సూరి.


"ఈ ఏడాది ఇంట్లో చదువయ్యాక వచ్చే ఏడాది పెద్దబళ్ళో నా పేరు వేస్తారుట", సూరిగాడు. కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. వర్షం ఎక్కువగా ఉండడంతో హోటల్ లో బేరాలు పెద్దగా ఏమీ లేవు. వర్షానికి తోడు గాలి కూడా పెరిగిపోయింది.


"ఒక్క పదినిమిషాలు ఆగి వెళ్ళు. గాలి తగ్గనీ" అన్నాడు సుందరం. సుందరం సూరిగాడికంటే ఒక ఏడాది పెద్దవాడుంటాడేమో.


"నేను సదువుకుంటానంటే, యాపారం ఎవురు సేత్తారంటూ మా నాయన మొన్న గొడ్డుని బాదినట్లు బాదేశాడు". విచారంగా చెప్పాడు సుందరం.


సాయంత్రంపూట హోటల్ అయిపోయాక సుందరం అప్పుడప్పుడు సూరి తో కలిసి ఆడుకోవటానికి వాళ్ళింటికి వచ్చేవాడు. ఆటల్లోనే కాకుండా నోటితో లెక్కలు కట్టడంలో సుందరం ఎప్పుడూ ముందే ఉండేవాడు.

"టైమవుతున్నాది, తొందరగా టిఫిన్ పార్సెల్ సెయ్యి సుందరం" హడావుడి పెట్టసాగాడు సూరి.


“లోపల నీ పనే సూస్తున్నారు. ఇంకేటి ఇసేసాలు" తీరిగ్గా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు సుందరం.


వాడికి కబుర్లంటే మహా ఇష్టం. తిండి తినకపోయినా పరవాలేదు కానీ, కబుర్లు లేకపోతే అస్సలు బతకలేడు. అంత వర్షంలోనూ రివ్వున క్వారీ లారీ దూసుకుపోతూ రోడ్డు మీద గుంతలో నీటిని సుందరం హోటల్ మీదికి చిమ్ముకుంటూ ముందుకు సాగిపోయింది.


"ఎదవనాకొడుకులు... ఈళ్ళకి బుద్ధి లేదు" అప్పుడే పొయ్యిదగ్గరనుండి బయటికి పార్సెళ్లతో వస్తూ తిట్లు అందుకున్నాడు సుందరం వాళ్ళనాన్న నాగభూషణం.


"ఒరేయ్ సూరీ, కొంతసేపు సూసి అప్పుడెళ్లు. వాన జోరు తగ్గలేదు" చెప్పాడు నాగభూషణం.


"పరవాలేదు పెద్దయ్యా, అయ్యగారు సెప్పక, సెప్పక పని సెప్పారు. టయానికి ఎల్లకపోతే బాగోదు" గొడుగుని ఒక్కసారి విదిలించి తెరిచాడు సూరిగాడు.


"రోడ్డుమీద సూసుకొని ఎళ్ళు, " చెప్పాడు సుందరం.


గొడుగు సరిగా పట్టుకొని, ఇంకో చేత్తో సంచి పట్టుకొని అడుగులు వెయ్యడం మొదలెట్టాడు సూరి. ఇంకో ఐదు నిమిషాలు నడిస్తే మెయిన్ రోడ్డు నుండి తమ వీధిలోకి వెళ్ళిపోతాడనగా బయ్ మంటూ హార్న్ కొడుతూ క్వారీ లారీ దూసుకొచ్చింది. వెనక్కి చూసి తప్పుకొనేలోపు సూరిగాడు మీదినుండి దూసుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న సెలూన్ లోకి దూసుకొని వెళ్ళిపోయింది.


క్షణాల్లో వర్షాన్ని లెక్కచేయకుండా జనాలు హాహాకారాలు చేసుకుంటూ రోడ్డు మీదికి దూసుకొచ్చారు. చేతిలో టిఫిన్ సంచి చేతిలోనే ఉంది. సూరిగాడి తల నుజ్జు నుజ్జయిపోయి, కనీసం కదలనైనా కదలకుండా పడిపోయాడు. సెలూన్ లో ఉన్నవాళ్ళల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, ఇంకో ఇద్దరు కొనఊపిరితో మిగిలారు.


సూరిగాడి మొండెం మీద పడి గుండెలవిసేలా ఏడుస్తోంది మునెమ్మ. అపరాధుల్లా నిలబడ్డారు రాజశేఖర్ దంపతులు. తాగేసి, విపరీతమైన వేగంతో లారీ నడిపిన డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి లారీతో సహా తరలించారు పోలీసులు. ‘ప్రమాదం కి గల కారణాలు తెలియరాలేదు’ అంటూ తమదైన శైలిలో ఎప్పటిలాగే బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు టీవీ ఛానెళ్ళవారు.


తన సూరిగాడు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడని గుండెలవిసిపోయేలా ఏడుస్తూనే, అక్కడే చలనం లేకుండా పడిపోయింది మునెమ్మ. వర్షంలో వాణ్ణి బయటికి పంపించడం ఎందుకు అని భార్య చెప్పినా విననందుకు తనని భగవంతుడు కూడా క్షమించడనే అపరాధ భావంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు రాజశేఖరం.


(ఒక నిజ సంఘటన ఆధారంగా రాసిన కథ. మద్యం సేవించి వాహనాలు నడపడం, అటువంటి వారికి కఠిన శిక్ష లేకపోవడం చట్టం తప్పైతే, వేగానికి నియంత్రణ లేని వాహనాలను అనుమతించడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేవలం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదని, ఎదుటి వాహనదారులూ, జాగ్రత్తగా ఉండి వాహనాల వేగాన్ని నియంత్రణలో ఉంచితేనే క్షేమంగా గమ్యం చేరగలమని గ్రహించాలి. ఏ సంబంధం లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్న సూరిగాడిలాంటి అమాయకులకు ఈ కథ అంకితం)

***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.




Comments


bottom of page