top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

సుశ్రవస

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Susravasa, #సుశ్రవస,#TeluguMythologicalStory


Susravasa - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 12/11/2024

సుశ్రవస - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


సునంద సార్వ భౌముల కుమారుడు జయత్సేనుడు. సునంద తన భర్త సార్వ భౌముని మనస్తత్వం ముందుగా తెలుసుకోలేక పోయినా, కాలం గడుస్తున్న కొద్దీ భర్త మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంది. తన భర్తలో తనే సార్వ భౌముడుని అనే గర్వం కించిత్ కూడా లేదని గమనించింది. భర్త నిరాడంబర జీవితాన్ని చూసి తను చాలా అదృష్ట వంతురాలను అని అనుకుంది. శాంతి యుతమైన తన భర్త ప్రజా పరిపాలన ను చూసి సునంద మిక్కిలి సంతోషించింది. 


 సునంద సార్వ భౌములు ఇరువురు కలిసి తమకు పుట్టిన బిడ్డకు జయత్సేనుడు అని పేరు పెట్టారు. వారి కుల గురువు వశిష్ట మహర్షి కూడా జయత్సేనుని నామకరణ విషయం లో సునంద కే అధిక ప్రాధాన్యత ను ఇచ్చాడు. కుల గురువు వశిష్ట మహర్షి తనకిచ్చే ప్రాధాన్యతను కళ్ళార చూసే సునంద, తన జన్మకు సార్థకత లభించిందని మహదానంద పడింది. 


 జయత్సేనుడు, తల్లి సునంద ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెరిగాడు. ఏ వయస్సు లో నేర్చు కోవలసిన విద్యలను ఆ వయస్సులో క్షుణ్ణంగా నేర్చు కున్నాడు. ఉత్తమ పురుషుడు గా ఎదిగాడు. మాతృ దేవోభవ అన్న ధర్మాన్ని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా అనుసరించాడు. కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర సమస్త వేద పురాణేతిహాస విద్యలను అభ్యసించాడు. తండ్రి సార్వ భౌముని దగ్గర యుద్ద విద్యలన్నిటిని నేర్చాడు. 


 సార్వ భౌముడు తన సామంత రాజులందరి వద్దకు జయత్సేనుని పంపాడు. వారి వారి దగ్గర ఉన్న ప్రత్యేక సమర విద్యలన్నిటిని కుమారునికి నేర్పించాడు. 


చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జయత్సేనుడు నానా విధాల సమర విద్యల నిమిత్తం ప్రత్యేక సమర విద్యా నైపుణ్యం కల వారందరి వద్ద శిష్యరికం చేసాడు. 


 జయత్సేనుని వినయ విధేయతలను చూసిన సామంత రాజులు, యోధులు తదితరులందరు మహా మురిసి పోయారు. తలిదండ్రులకు తగిన బిడ్డ జయత్సేనుడు అని అనుకున్నారు.


 "ఇంద్రుని అంశలో నాలుగవ వంతు అంశ మంచి మహా రాజులో ఉంటుంది. మన జయత్సేనుని లో ఇంద్రుని అంశలో నాలుగవ అంశ మించి ఉంది. జయత్సేనుడు కారణ జన్ముడయిన మహారాజు "అని అందరూ అనుకున్నారు. 


 విదర్బ రాజ తనయ సుశ్రవస అందచందాల లోనూ, వినయ విధేయతలలోనూ, ఉన్నత విద్యల లోనూ ఆనాటి రాజ వంశాల యువరాణులలో మిన్న అన్న విషయం జయత్సేనుని చెవిన పడింది. ముఖ్యంగా యుగధర్మం బాగా తెలిసిన మహిళ సుశ్రవస అని జయత్సేనుడు తన గూఢచారుల ద్వారా సుశ్రవస గురించి తెలుసుకున్నాడు. 


జయత్సేనుడు సుశ్రవస యుగ ధర్మ నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి మారు వేషంలో విదర్భ రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నాడు. కుల గురువు వశిష్ట మహర్షి కి, తలిదండ్రులకు తన మనసులోని మాటను చెప్పాడు.

 

"యుగ ధర్మ దేవత భూమి మీద ఆవిర్భవిస్తే, ఎలా ఉంటుందో సుశ్రవస అలా ఉంటుందని అందరూ అంటారు. సుర నర కిన్నెరాదులు కూడా అదే మాట అంటారు. అందుకే నీ చిత్ర పటాన్ని విదర్భ రాజు కు పంపాను. సుశ్రవసకు చూపించి ఆమె మనోభిప్రాయం కనుగొనమన్నాను" అని కుల గురువు వశిష్ట మహర్షి జయత్సేనుడితో అన్నాడు. 


"అన్నీ మంచి శకునములే " అని జయత్సేనుడు మనసులో అనుకున్నాడు. 


సుశ్రవస- మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు మహానుభావులందరి ఆశీర్వాదాలను తీసుకుంది. అనంతరం చెలికత్తెలందరితో కలిసి ప్రజల దగ్గరకు వెళ్ళింది. యుగ ధర్మాన్ని అనుసరించవలసిన రీతిని వారికి తెలియచేసింది. సత్తెకాలపు మనుషులను చైతన్య పరిచింది. కలికాలపు మనుషుల కర్కశత్వాన్ని కాలరాసింది. యుగ ధర్మ జీవన విధానం లోని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందరికీ తెలియ చేసింది. 


యుగ ధర్మాన్ని మనం అనుసరిస్తే, యుగ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పింది. 


 సుశ్రవస 26 వ కలి పురుషుని లక్షణాలను ప్రజలకు తెలియ చేసింది. కలి యుగం లో మానవుడు ఆలోచించే రీతిని తెలియచేసింది. కలియుగంలో తలిదండ్రులు బిడ్డలను ఎంత నిర్లక్ష్యంగా పెంచుతారో తెలియచేసింది. అలాగే బిడ్డలు తలిదండ్రులను ఎంత కౄరంగా శిక్షిస్తారో తెలియ చేసింది. 


కలియుగం లో మనిషి ఆలోచనలు, ఆశలు ఎలా శృతిమించి ఆకాశాన్ని అంటుతాయో తెలియచేసింది. కలి యుగం వచ్చే సరికి భౌగోళిక సంపద ఎలా తరిగిపోతుందో జనభా సమస్య ఎలా చెలరేగి పోతుందో తెలియ చేసింది. ప్రకృతి ఎంత కాలుష్యమైపోతుందో తెలియ చేసింది. 


సుశ్రవస 26 వ కలి యుగం లో జరిగిన అనేకమంది వృత్తాంతాల మాటున ఉన్న రాక్షసత్వాన్ని మించిన కౄరత్వాన్ని ప్రజలకు తెలియ చేసింది. 


 సుశ్రవస ప్రజలకు బోధించే విషయాలను మారు వేషంలో ఉన్న జయత్సేనుడు విన్నాడు.. మనసుకు హత్తుకునేటట్లు ఆమె చెప్పే మాటలను విన్నాడు. 


సుశ్రవస చెప్పే కలి పురుష లక్షణాలు జయత్సేనుని మనసును బాగా ఆకర్షించాయి. యుగ ధర్మం ప్రకారం నడుచుకునే మానవుడే మాధవుడు అవుతాడు అని అనుకున్నాడు. అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న అని అనుకున్నాడు. అదే సమయంలో కలి పురుషుడు సుశ్రవసను చూసాడు. సుశ్రవసను తన స్వంతం చేసుకుంటే మిగతా మూడు యుగాల ముక్కు పిండి కదిలే కాల చక్రం లో తను ముందుగానే ప్రవేశించ వచ్చును అనుకున్నాడు. 


కలి పురుషుడు సుశ్రవసను జాగ్రత్తగ గమనిస్తూ, ఆమెను అనుసరించాడు. అయితే కలి పురుషుడు సుశ్రవస అంతఃపురానికి ప్రవేశించ లేకపోయాడు. సుశ్రవస అంతఃపురానికి ప్రవేశించలేక పోవడానికి కారణం సుశ్రవస అంతఃపురం కృత త్రేతా ద్వాపర యుగ ధర్మాలతో కూడి ఉన్నదన్న యదార్థం కలి పురుషునికి తెలిసింది. సుశ్రవస తనువును ఎలా ఆక్రమించాలా? అని కలి పురుషుడు ఆలోచించాడు. 


 "మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఒక మహర్షి చేసే తపస్సు లో ఆరవ వంతు తపో ఫలం రాజుకు లేదా రాజ్య పరిపాలన చేసే యువరాణి మొదలైన వారికి చెందుతుంది. తమ తఫో ఫలాన్ని రాజుకు ధారపోయని మహర్షులు సంచరించే చోట కలి యుగ ధర్మం విచ్చలవిడిగా సంచరిస్తుంది. కాబట్టి అలాంటి మునుల చేత తపస్సు చేయించాలి. "అని కలి పురుషుడు అనుకున్నాడు. 


 మారు వేషంలో ఉన్న జయత్సేనుడు సుశ్రవస అంతఃపురంలోనికి ప్రవేశించాలని ప్రయత్నించాడు. జయత్సేనుని ప్రయత్నం చాలా సులభం అయ్యింది. అంతఃపురంలో మహర్షుల తపో తేజం జయత్సేనునికి శిరసు వంచి నమస్కరించింది. జయత్సేనుడు విషయాన్ని గమనించాడు. జయత్సేనుడు మారు మాట్లాడకుండా కరవాలాన్ని పక్కన పడేసి మహర్షుల తపో తేజానికి సాష్టాంగ పడి నమస్కారం చేసాడు. 


అప్పుడే అక్కడకు వచ్చిన సుశ్రవస మారువేషంలో ఉన్న జయత్సేనుని చూసింది. అంతకు ముందే సుశ్రవస జయత్సేనుని చిత్ర పటంలో చూసి ఉండటం చేత జయత్సేనుడు మారు వేషంలో ఉన్నప్పటికీ అతని స్వస్వరూపమును పోల్చుకోగలిగింది. 


"జయత్సేన మహారాజ! స్వాగతం సుస్వాగతం. మీరు మహా గొప్ప పరిపాలకులన్న వాస్తవాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం. మీ రాజ ధర్మం అజరామరం. అనిర్వచనీయం.. అమోఘం. 


‘బలం లేనివానికి రాజు బలం, రక్ష కావాలి. బలం ఉందని చెలరేగేవానికి రాజు బలం శిక్ష కావాలి. రాజే అహంకార బలం తో చెలరేగి పోతే ఆ రాజు వంశానికి చెందిన వారు ముఖ్యంగా అలాంటి రాజును ఆ రాజు భార్య శిక్షించాలి. అలాంటి భార్యలే పతివ్రతల కోవకు వస్తారు..’ వంటి మీ రాజ ధర్మాలు అందరూ అనుసరించదగినవి. 


మీరు యుగ ధర్మ మూలాలు తెలుసుకోవడానికి వచ్చారన్న నిజం మా మహర్షుల తపో తేజం మాకు ఇంతకు ముందే తెలియచేసింది. ఇక్కడ మీ ఇష్టం ఉన్నంత కాలం ఉండవచ్చు. మమ్మల్ని ఆజ్ఞాపించండి. మీరు కోరిన సేవలు అందిస్తాం." అని జయత్సేనుడితో అంది సుశ్రవస. 


జయత్సేనుడు తన మారు వేషాన్ని తొలగిస్తూ, " యువరాణి సుశ్రవస.. నేడు అన్ని రాజ్యాలలో మీ యుగ ధర్మం గురించే మాట్లాడుతున్నారు. అదెలా ఉంటుందో చూడాలనిపించింది. మారు వేషంలో వచ్చి చూస్తే నిజం నూటికి నూరు శాతం బహిర్గతం అవుతుంది అనిపించింది. అందుకే మారు వేషంలో వచ్చాను. మీ అంతఃపురాన్ని మీ యుగ ధర్మమే కాపాడుతుంది అని తెలుసుకున్నాను. " అని సుశ్రవసతో అన్నాడు. 


"మీరిక్కడ నాలుగు రోజుల పాటు ఉంటే మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. " అని సుశ్రవస జయత్సేనుని తో అంది. 


 సుశ్రవస మాటలను అనుసరించి రాజ భటులు జయత్సేనుని కి ప్రత్యేక విడిది మందిరాన్ని ఏర్పాటు చేసారు. 


 "నాలుగు పాదాల ధర్మం నడిచే కృత యుగం లో భూమి మీద పుట్టిన మనిషి అసలు తప్పుడు ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. భౌగోళిక సంపద, జీవ ఉత్పత్తి అన్ని సమపాళ్ళలో ఉంటాయి కనుక కనీస అవసరాల నిమిత్తం ఎవరిని ఎవరూ దోచుకోవలసిన అవసరం ఉండదు. అలా దోచుకునే ఆలోచన ఎవరన్నా చేస్తే ప్రకృతే వారి ఆలోచనలను శిక్షిస్తుంది. కర్రే పామై కరుస్తుంది. 


 మూడు పాదాల ధర్మం నడిచే త్రేతా యుగంలో భూమి మీద పుట్టిన మనిషి యుగ ధర్మాన్ని అనుసరించే నేపథ్యంలో సామాన్య మానవునికి తప్పనిపించే కొన్ని పొరపాట్లను చేయవలసి ఉంటుంది. 


అయితే పరుల మాటల గురించి కాక యుగ ధర్మం గురించి ఆలోచిస్తూ ముందడుగు వేసేవారే దైవాలు గా చరిత్రకు ఎక్కుతారు. ఇక ధర్మం రెండు పాదాల మీద నడిచే ద్వాపర యుగ ధర్మం తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఇక ఒంటి కాలి మీద ధర్మం నడిచే కలియుగంలో అన్ని ధర్మాలు మిళితమైపోయి అసలు ధర్మం ఏమిటో తెలియకుండా పోతుంది. అది తెలుసుకున్నవారే పుణ్యాత్ములు. " అంటూ సుశ్రవస చెప్పే ధర్మాలను వంట పట్టించుకుని మసలే ప్రజలను చూసిన జయత్సేనుడు, " సర్వ కాల సర్వావస్తలయందు ప్రజలు యుగ ధర్మాన్ని పాటిస్తే ఎంత బాగుంటుంది?" అని అనుకున్నాడు. 


 కలి పురుషుడు మహా స్వార్థం గల వంద మంది మునులతో కపట యాగం చేయించసాగాడు. అది తెలిసిన సుశ్రవస యాగ శాల దగ్గరకు వచ్చింది. సుశ్రవసను జయత్సేనుడు అనుసరించాడు. 


 సుశ్రవస తన తపోశక్తి తో కపట యాగం చేస్తున్న వంద మంది మునుల నోట మంత్రాలు రాకుండా చేసింది. అది గమనించిన కలి పురుషుడు సుశ్రవసను ఆక్రమించాలని చూసాడు. 


ఒంటి కాలి ధర్మం తో ప్రకాశించే కలి పురుషుని సుశ్రవస తన ధర్మ బలంతో పాతాళానికి తొక్కేసింది. అది గమనించిన జయత్సేనుడు సుశ్రవసను పలు రీతుల్లో అభినందించాడు. ఆపై జయత్సేనుడు సుశ్రవస అనుమతితో, ఆమె పెద్దల అనుమతితో అందరి సమక్షంలో సుశ్రవసను వివాహం చేసుకున్నాడు. సుశ్రవస జయత్సేనుడుల సంతానమే 

అవాచీనుడు. 


 సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








22 views0 comments

Comentários


bottom of page