top of page

స్వామీజీ మందు

Writer: Srinivasarao JeediguntaSrinivasarao Jeedigunta

'Swamiji Mandu' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“ఏమండీ వదినగారూ.. ఎలా ఉన్నారు? ఒకసారి ఇటు వస్తారా” అన్నారు పక్కింటి పిన్ని గారు ఆమె గోడ వెనక నుంచి.


“ఆ, వస్తున్నా వదిన గారూ!” అంటూ చేయి తుడుచు కుని సీతమ్మగారు “ఆ చెప్పండి వదిన గారు.. విశేషాలు ఏమిటి” అంది.


“విశేషాలు ఏమున్నాయ్ వదిన గారూ! మీ అన్నయ్య గారు ఒక పని చేస్తారా.. పొద్దున్నే లేచి బజార్ వెళ్తే ఆయన ఫ్రెండ్ ఒకతను కనిపించి స్వామీజీ కనిపించాడు. తాను హిమాలయాల నుంచి హైదరాబాదు నడచి వచ్చాడుటా.. ఎందుకంటే కరోనా కి మంచి మందు పచ్చి కాకరకాయ కరకరా నమిలి మింగాలిట అని సెలవిచ్చాడు.


దానితో ఈ పిచ్చ జనమంతా బజార్ వెళ్లి బుట్టలు బుట్టలు కాకరకాయలు కొనేశారు. ఈయనకి ఒక్క కాకరకాయ కూడా మిగలలేదు. దాంతో ఇంటికి వచ్చి ఒకటే చిందులు. ‘ఎలాగైనా సరే ఈ రోజు రెండు పచ్చి కాకర కాయలు నమలాలిసిందే.. లేదంటే నాకు కరోనా వచ్చేటట్లు ఉంది. అసలే నా ముందు వాడు తుమ్ములు తుమ్మాడు’ అని ఒకటే గొడవ పెడుతున్నారు.


ఇంట్లో చూస్తే ఒక్క కాకరకాయ కూడా లేదు సీతమ్మ తల్లి.. మీ మీ ఇంట్లో రెండు కాకరకాయలు ఉంటే ఇస్తే ఆయన్ని శాంతింప చేస్తాను.” అన్నారు పక్కింటి పిన్ని గారు.


“అలాగే వదినగారూ! ఈ విషయం మా ఆయన దాకా వచ్చినట్టు లేదు. కాకరకాయ కేమి భాగ్యo.. యిప్పుడే తెస్తాను వుండండి” అని సీతమ్మ గారు లోపలికి నడిచింది.


తన శ్రీవారు లేచినట్లులేదు అనుకుంటూ ఫ్రీజ్ తీస్తోవుంటే ‘కర్ కర్ కర్’ అని చప్పుడు వచ్చింది. అప్పుడే ప్రిజ్ పాడైంది ఏమిటి అనుకుంటూ కూరల బాస్కెట్లో వున్న కాకరకాయలు బయటికి తీసి ఫ్రిజ్ తలుపు వేస్తోవుంటే మళ్ళీ ‘కర్ కర్’ చప్పుడు వస్తోంది. వున్న కాయలలో మంచివి ఒక పదికాయలు తీసి టేబుల్ మీద పెట్టి, మిగిలిన కాయలు పక్కింటి వదిన గారికి యిచ్చి, లోపలకి వస్తోవుంటే, అప్పుడు కనిపించారు ఆయన చేతిలో రెండు పొడుగు కాకరకాయలు పట్టుకొని, ఒకటి నములుతూ కనిపించారు. ఆయన పేరు రాఘవ రావు.


‘అయ్యో లేవటం అయింది.. నమలడం కూడా మొదలుపెట్టేశారా!’ అనుకున్నాను.


“యిటువంటి సలహాలు మీ దగ్గరికి ముందే వస్తాయని తెలుసు. కర్ కర్ అని వినిపిస్తే ప్రిజ్ ప్రాబ్లెమ్ అనుకున్నాను. ఆ కర కర మీరా” అంటుండగానే, రాఘవరావు ఒక్కసారిగా బళ్ళు మంటూ వామిటింగ్ చేసుకున్నాడు .


అంతకుముందు అంతే.. ఎవరో చెప్పారని "పునరానవ ఆకు కషాయం తాగితే కిడ్నీస్ కి మంచిది అని, పునర్నవ అనుకుని దురదగుంటాకు తెచ్చుకుని కషాయం చేసుకుని తాగి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు.


“పారేయండి ఆ వెధవ కాకరకాయలు, అలవాటు లేనప్పుడు ఎందుకొచ్చిన గొడవ” అంది సీతమ్మ గారు.


“నువ్వు ఊరుకో.. స్వామీజీ మాట అబద్ధం కాదు. ఎలాగైనా ఈ కాకరకాయలన్నీ నమిలి మింగాలిసిందే” అన్నాడు రాఘవరావు.


“సరే మీ ఇష్టం, నా మాట ఎప్పుడు విన్నారు గనుక..” అంటూ లోపలికి వెళ్లి పోయింది.


పెద్ద పెద్ద అరుపులతో డోకుంటూ, మళ్లీ కరకర అని నములుతున్నాడు రాఘవరావు.


ఐదు నిమిషాల తర్వాత బయట నుంచి ఏమీ చప్పుడు వినిపించక పోవటంతో, బయటికి వచ్చి చూసింది సీతమ్మ గారు.


వాష్ బేసిన్ దగ్గర నాలుక బద్దతో పరా పరా అని గీక్కుంటు కనిపించిన భర్తని చూసి, “సరిపోయింది వరస! ఇంతవరకు కరా కరా, యిప్పుడు బర బరా” అంది.

‘అసలే నోరంతా కాలకూటవిషం లాగా వుంటే దీని దెప్పుపొడుపులు ఏమిటి’ అని కోపం తో “నువ్వు లోపలికి పో” అంటూ సీతమ్మ గారిని కసిరాడు.


“సరే!ముందు మీరు యింట్లో కి రండి, బయట జనం నిజంగానే మీకు కరోనా వచ్చింది అని పోలీసులు కి రిపోర్ట్ యిస్తారు” అంది.


దానితో “నిజమే.. రోజులు అలాగే వున్నాయి” అనుకుని ఒక్క అంగ లో ఇంట్లోకి వచ్చి, టేబుల్ మీద వున్న పది కాకరకాయలు రోడ్డు మీదకి విసిరేసాడు.


“యిదిగో యిప్పుడే చెపుతున్నాను.. మన యింట్లో కాకరకాయ కాయ కనిపించడం కానీ, దాని మాట వినిపించడం గాని జరగటానికి వీలులేదు జాగ్రత్త. ఈ సారి కాకరకాయలని కాశీలో వదిలేద్దాం. నోరు అంతా చేదు మయం. టేస్ట్ బడ్స్ నాశనం అయినట్టు ఉన్నాయి” అంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి నాలిక బద్దతో గీక్కోవటం మొదలుపెట్టాడు.


“యింక ఆపండి. నాలుక ఊడి పడేటట్టుగా పీకోకండి. కొద్దిగా జీలకర్ర వేయించి పౌడర్ చేసి, దానిలో రెండు గరిటలు మాదిఫల రసాయనం వేసి ఇస్తాను,. కొద్ది కొద్దిగా నాలుక్కి రాసుకోండి, చేదు విరుగుతుంది” అంది.


ఈలోపుగా పెరటి లో పిందెలతో వున్న కాకరపాదుని పీకబోతున్న రాఘవ రావు ని చూసి సీతమ్మ గారు, “అయ్యో పీకకండి, పాపం కూడాను. మీరు తినకపోతే నేను తింటాను” అని నచ్చచెప్పి లోపలికి తీసుకువచ్చి మాదీఫల రసాయనం గిన్ని చేతికి ఇచ్చింది.


భార్య ఇచ్చిన గిన్నె చేతితో తీసుకుంటూ, “ఒకసారి ఆ పక్కింటావిడను కనుక్కో.. వాళ్ళ ఆయన పరిస్థితి ఏమిటో” అన్నాడు రాఘవరావు.


“ఏవండి వదిన గారు.. మీ ఆయన కాకరకాయలు తిన్నారా? ఎలా ఉన్నారు ఏమిటి?” అంది సీతమ్మ గారు.


“ఎక్కడ తిన్నారు వదినగారు, మీ ఆయన చేసే గొడవ చూసి ఈయనకి భయమేసి కాకర కాయలు తినడం మానేశారు. పాడు చేయడం ఎందుకని ఆ నాలుగు కాకరకాయలు కు కొన్ని ఉల్లిపాయలు వేసి వేపుడు వేయించాను” అంది నవ్వుతూ.


“సరే.. ఏదో విధంగా వాడుకున్నారు కదా” అంటూ సీతమ్మగారు లోపలికి వచ్చేసారు.


లోపలికొచ్చి జరిగిందంతా భర్తకి చెప్పింది.


“వాడి అసాధ్యం కూలా, మొత్తానికి జాగ్రత్తపడ్డాడు అన్నమాట. సరేలే.. ఈ రోజు నాకు ఆకలిగా లేదు. ఏమీ తినను” అన్నాడు రాఘవరావు.


స్వామీజీ సలహా తన స్నేహితులకు కూడా ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు రాఘవరావు.


ఫోను తీసిన ఫ్రెండ్ " ఛీ దరిద్రుడా" అంటూ ఫోన్ పెట్టేసాడు. సరే అని రెండు వాడికి ఫోన్ చేసాడు.

అటునుంచి " ఒరేయ్.. బయట కరోనా ఉన్నా లెక్కచేయకుండా మీ ఇంటికి వచ్చి నీ పీక పిసుకుతా, వెధవ సలహా చెప్పి నా నోరంతా పాడు చేసావు” అని ఫోన్ పెట్టేసాడు.


ఇంకా ఎవరికీ చేసేనా ఇదే జవాబు వస్తుందని భయపడి రాఘవరావు సైలెంట్ గా కూర్చునాడు.


తాను ఎలాగూ అన్నం తినను అన్నారు కదా అని సీతమ్మ గారు కూడా ఇప్పుడేం వండుకుంటానులే నా ఒక్కదాని కోసం అనుకుని, బెడ్రూమ్ లోకెళ్ళి నడుము వాల్చింది.


ఒక గంటన్నర మా టీవీ లో పాత సినిమా చూసి బోర్ కొట్టిన రాఘవరావు కి మాదీఫల రసాయనం పని చేసినట్టు ఉంది కడుపులో కొద్దిగా ఆకలిగా ఉన్నట్టుండి వంటగది వైపు చూసాడు.


భర్త లేవడం చూసి సీతమ్మ గారు లేచి వచ్చి “ఏంటి ఆకలిగా ఉందా.. వంటగది వైపు వెళ్లారు?” అంది.


“అవునే.. కొద్దిగా నీరసంగా ఉంది. అన్నం వండావా?” అన్నాడు.


“అయ్యో మీరు తిననన్నారు కదా అని వంట చేయలేదు, ఒక్క నిమిషంలో వండుతా. అలా కూర్చోండి” అంది సీతమ్మ గారు.


“ఇప్పుడు ఏం వండుతావు లే! అలా రెస్టారెంట్ కి వెళ్లి రెండు భోజనాలు తెస్తా” అన్నాడు రాఘవ రావు.


“రెండు ఎందుకు? ఒక్కటి చాలు మన ఇద్దరికీ. జాగ్రత్తగా వెళ్లి రండి, కంగారు పడకుండా” అంది భర్తతో.


భర్త వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద రెండు కంచాలు, రెండు గ్లాసులు, తెచ్చినవి సర్దడానికి మూడు నాలుగు గిన్నెలు రెడీ చేసి పెట్టింది.


10 నిమిషాల్లో రాఘవరావు రావటం, గబగబా చేతిలోని సంచి లో నుంచి పొట్లాలు అన్నీ బయటికి తీసి మొదటి పొట్లము విప్పి కెవ్వు మన్నాడు.


“మళ్ళీ ఏమైంది?” అంది సీతమ్మ.


“ఈ దరిద్రుడు కూడా కాకరకాయ వేపుడు ఇచ్చాడేంటో.. అంటూ ఆ పొట్లాన్ని పక్కన పెట్టాడు.

రెండో పొట్లం విప్పి మళ్ళీ యింకో కెవ్వు..

ఈసారి దానిలో తాము కాశీలో వదిలేసిన దొండకాయ కూర, చివరి పొట్లం లో మెంతి కూర పప్పు వుంది.


“పోనీలే.. ఈ ఒక్కటి అయినా తినటానికి వుంది” అంటూ కంచంలో వేసుకోబోతున్న రాఘవ రావు చెయ్యి పట్టుకొని ఆపి, “అయ్యో రామా, ఆకుకూర వదలమంటే మెంతి కూర వదిలేసాము గుర్తు లేదా, యింకా తిన్నారు కాదు, పాపం చుట్టుకునేది” అంది.


“అయితే యిహ తినటానికి ఏముంది నా మొహం” అంటూ కుర్చీలో కూలబడ్డాడు.


“కంగారు పడకండి. ఒక్కనిమిషం లో వస్తాను” అంటూ లోపలికి వెళ్ళి, అలమారా లోంచి కందిపొడి డబ్బా, నెయ్యి గిన్ని తీసుకుని వచ్చి, యింత కందిపొడి వేసి అన్నం వడ్డించి, నాలుగు గరిటెల నెయ్యి పోసి, “యిహ తినండి ఈ పూటకి. అయినా కందిపొడికున్న రుచి దేనికి వుండదు” అంటూ తన కంచంలో కాకరకాయ వేపుడు, యింత కందిపొడి వేసుకుని కూర్చుంది సీతమ్మ గారు.


మొదటి ముద్ద అసహనం తో నోట్లో పెట్టుకుని తిన్న రాఘవ రావు కి రుచి బాగుండి మొత్తం అన్నం లో యింకో రెండు చెంచాల కందిపొడి వేసుకుని కలుపు కుంటున్నాడు. తను వేసుకున్న కాకరకాయ వేపుడు కూర బాగా ఉండటంతో రెండు ముక్కలు భర్త కంచం లో వేసి, “చేదుగా లేదు, తినండి” అంది.

కాకరకాయ ముక్కలు చూడగానే నోరు చేదు ఎక్కినట్లయి, “ఒక్కసారి చెప్పితే అర్ధం కాదా నీకు, ఆ దరిద్రపు కాకరకాయ వేపుడు నాకు వేయద్దంటే వినవే” అని అరిచాడు పెళ్ళాం మీద రాఘవ రావు.


“అదివరకు అరకిలో కాకరకాయల ఉల్లికారం కూర ఒక ముక్క కూడా మిగల్చకుండా తినే వారు యిప్పుడు ఏమైందిట. ఎవరు లెమ్మన్నారు పొద్దున్నే, లేచి ఎవరు నమలమన్నారు పచ్చి కాకరకాయలని. చేసుకుంది మీరు, తిట్లు నాకునా, మీ యిష్టం వచ్చింది తినండి. నాకెందుకు మధ్య లో” అంటూ నాలుగు మాటలు అనేసింది సీతమ్మ గారు.


భార్య ఆలా దులపరిస్తోవుంటే తెల్లబోయి, ఏం తింటున్నాడో కూడా చూసుకోకుండ, కాకరకాయ వేపుడు ని కందిపొడి ముద్ద తో తినేసాడు. అరే చేదుగాలేదేమిటి అనుకుని, యింకో రెండు ముక్కలు వట్టి అన్నం లో కలుపుకుని తిన్నాడు. బావుందే, అనవసరం గా కంగారు పడ్డాను అనుకుని, “సారి నోయి, నువ్వు చెప్పినట్టు చేదు లేదు కదా చాలా రుచిగా వుంది కూర” అన్నాడు.


“అమ్మయ్య.. మొత్తానికి కాకరకాయ అంటే భయం పోయింది గా. అంతే చాలు. యింకా ఎంత సేపు, లేవండీ.. లేచి చెయ్యి కడుక్కోండి. నేను ఈ గిన్నెలు సర్దుకోవాలి” అంది సీతమ్మ గారు.


“సరేలే” అంటూ నీళ్ల గ్లాస్ పట్టుకుని పెరటిలోకి వెళ్ళి బాగా వత్తు గా పిందెలతో వున్న కాకర పాదులో నీళ్ల గ్లాస్ గుమ్మరించి, 'యింకా నయ్యం.. పీకేయలేదు' అనుకుంటూ లోపలకి నడిచాడు.


“ఏమండోయ్ విన్నారా, అతను స్వామీజీ కాదుట,. కరోనా వల్ల, పండిన కాకరకాయల పంట అంతా అమ్ముకోవడం కోసం స్వామీజీ లాగా వేషం వేసుకుని కాకరకాయ కరోనా కి మందు అని చెప్పటం, మీలాంటి అమాయకులు, వున్న కాకరకాయ లు అన్నీ కొనేయటం జరిగింది. పిన్నిగారు యిప్పుడే చెప్పారు” అంది సీతమ్మ గారు.


‘యిలా కూడా మోసం చేస్తారన్నమాట, బ్రతకటానికి రకరకాల మోసాలు చేస్తున్నారు, ఏం చేస్తాం.. మనమే గుడ్డిగా అనుకరించ కూడదు’ అంటూ ఒక కునుకు తీయటానికి మంచం ఎక్కాడు.

....... శుభం...

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









 
 
 

1 Comment


Narasimha Murthy • 1 day ago

చాలా బాగుంది

Like
bottom of page