top of page

స్వర్గం 

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #స్వర్గం, #Swargam, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Swargam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 04/04/2025

స్వర్గం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏమండీ! మన పెళ్లి అయ్యి అయిదు సంవత్సరాలు అయ్యింది. చంటాడు పుట్టినప్పుడు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు, ‘మీది పల్లెటూరు, డాక్టర్ ఫెసిలిటీ వుండదు’ అని. అలా అని మా తల్లిదండ్రులని రానివ్వలేదు. అంతా మీరు మీ తల్లిదండ్రులు. నాకాంటో యెవ్వరు అక్కరలేదా” అని గుక్క తిప్పుకోకుండా భర్త రామకృష్ణ ని అడిగేసింది శ్యామల.


“రోజూ వీడియో కాల్ లో తలుపు వేసుకుని గంటల సేపు మీ అమ్మానాన్నలతో మాట్లాడుకుంటున్నావుగా. యింకా బెంగ ఎందుకు నీకు?” అంది అత్తగారు రమణమ్మ. 


“మీకు సాయంత్రం అయిదు గంటలు అవ్వగానే మీ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది కదా, చదువుతున్న రామాయణం పుస్తకం వదిలేసి మరీ మాటలుడుకుంటారు కదా, తప్పేముంది పిల్లలు తల్లిదండ్రుల తో మాట్లాడుకోవడం” అంది శ్యామల.


“అదే అంటున్నాను, ఎలాగో రోజూ మాట్లాడుకుంటో మళ్ళీ బెంగ పెట్టుకోవడం ఎందుకు? అయినా నేను మా అమ్మాయి సంసారం లో కలిపించుకోను. మీ అమ్మగారు అలా కాదు. ప్రతీ నిమిషం మన యింట్లో ఏమి జరుగుతోందో సినిమా చూపించినట్టు చెప్పమంటారు. ఆవిడకి ఎందుకు మన యింట్లో విషయాలు.. యిలాగే పిల్లల సంసారాలు పాడు చేస్తారు అన్ని విషయంలో తలదూర్చి” అంది కొద్దిగా కంఠం పెద్దగా చేసి రమణమ్మ.


“అబ్బబ్బా! మీ అత్తాకోడలు గొడవ భరించలేకపోతున్నాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నా చావుకి వచ్చింది. చేసే పనిలో తప్పులు జరిగి బాస్ చేత తిట్లు.. చచ్చిపోతున్నాను” అని లాప్టాప్ తీసుకుని పక్కన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు సీతారాం. 


కొడుకుకి కోపం వచ్చింది అనుకుని కొడుకు వున్న గదిలోకి వెళ్లి “ఒరేయ్ అబ్బాయి, మీ ఆవిడ నీకు యిష్టం అని ఉల్లి పెసరట్టు వేస్తోంది రా పాపం, వచ్చి తిని పనిచేసుకో. కావాలంటే నువ్వు వచ్చేదాకా మౌస్ నేను కదుపుతో వుంటాను” అంది. 


“అమ్మా! నాకు ఆకలి లేదు యిప్పుడు. నేను ఎక్కడ వుంటే అక్కడకి భూచక్రం లా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు” అన్నాడు. 

“నీ మంచికి చెప్పినా యింత కోపం ఏమిటి రా మీ నాన్న లా? అమ్మాయి శ్యామలా.. వేసిన నాలుగు పెసరట్లు చెరో రెండు తినేద్దాం. వాడికి కావాలంటే అన్నం లో తింటాడులే. బ్రతిమాలుతోంటే చెట్టేక్కి కూర్చుంటున్నాడు” అంటూ వంట గదిలోకి వెళ్ళింది. 


“మీ అబ్బాయి విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీరు ఉల్లిపాయ తినరుగా, ఆయన కోసం ఉల్లి పెసరట్టు వేసాను మరి” అంది శ్యామల. 


“పరవాలేదు అమ్మా, మీ మామగారు పోయిన తరువాత అన్ని తింటున్నాను, పట్టింపులేదు, రెండు అట్లు చాలు, నువ్వు మిగిలినవి తిను. యిటు రా నువ్వుకూడా, ఎలావున్నావో చూడు నీరసంగా” అంది రమణమ్మ.


“ఈవిడకి ఎప్పుడు ప్రేమ వస్తోందో, ఎప్పుడు కోపం వస్తోందో తెలియదు” అనుకుంటూ ప్లేట్ పట్టుకుని వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కూర్చొని, “అత్తయ్యగారూ! పాత సినిమా పెట్టనా.. చూద్దాం కాసేపు” అంది శ్యామల.


“తోడికోడళ్ళు సినిమా పెట్టు, చిన్నప్పుడు మీ మామగారు కూడా నాగేశ్వరావులా వుండే వారు” అంది రమణమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతో. 


“ఏమిటి అత్తాకోడళ్ళు ఏమిటి చెప్పుకుంటున్నారు నా మీద” అంటూ వచ్చాడు సీతారాం. 

“నీ మీద చెప్పటానికి ఏముంది రా, నువ్వు నీ లాప్టాప్ తప్పా ఏముంది” అంది రమణమ్మ.


“పోనిలే అమ్మా! మీరిద్దరూ యుద్ధం చేసుకోకుండా వుంటే చాలు నాకు, ఒక్క ఫోటో తీసి గోడకి తగిలిస్తా. మీకు ఒకరిమీద ఒకరికి కోపం వస్తే ఆ ఫోటో చూసి శాంతించాలి” అన్నాడు నవ్వుతో. 


“చాల్లేరా, శ్యామల కూడా నా కూతురులాంటిదే, నీ చెల్లెలు తో రోజూ ఫోన్లో అరగంట మాట్లాడితే పావు గంట పొట్లాడుకోవడడమే. అలా అని నాకు ఎందుకు విరోధం వుంటుంది.. శ్యామల కి నేను, నాకు శ్యామల. నువ్వు వున్నా పిచ్చాడిలా ఆ ఆఫీసు మీటింగ్స్ లో ఉంటావు రోజంతా” అంది శ్యామల తల నిమురుతో. అత్తగారి ప్రేమకి శ్యామల కంట్లో నీరు తిరిగింది.


అందరు యిహ నుంచి ఆఫీస్ కి రావాలి అని ఆర్డర్స్ రావడంతో, సీతారాం ఆఫీసు కి బయలుదేరుతో తల్లికి నమస్కారం చేసి దీవించమన్నాడు. 


“శ్యామలా! దేవుడి గదిలోనుంచి అక్షింతలు తీసుకుని రా తల్లీ” అని పిలిచింది. 

“అత్తయ్యా! నేను మీ అబ్బాయి కి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను, మీరు వెళ్లి తీసుకోండి” అంది శ్యామల వంటగదిలోనుంచి.


“అయ్యో శ్యామలా! మీ మామగారు పోయిన దగ్గర నుంచి నేను దేముడి గదిలోకి వెళ్ళలేదే. బయట నుంచి ఒక దణ్ణం పెట్టుకుంటున్నాను” అంది రమణమ్మ. 


“పోనిలే అమ్మా! అక్షింతలు లేకపోయినా పర్వాలేదు, నీ ఆశీస్సులే చాలు” అంటూ లాప్టాప్ బ్యాగ్ తీసుకుని భార్య యిచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరాడు.


ఒకరోజు శ్యామల భర్తతో అంది, “పిల్లాడికి రెండు సంవత్సరాలు నిండాయి, మా అమ్మా, నాన్న చూడలేదు. రమ్మని అడిగితే ఒక్క వొర లో రెండు కత్తులు ఇమడవు, మీ అత్తగారు వుండగా మేము వచ్చి ఎలా ఉంటాము అంటారు” అంది. 


ఆ మాట విన్న రమణమ్మ “నేను ఏమైనా బాలా కుమారి నా, మీ నాన్న ఏమన్నా చిన్నాడా సిగ్గుపడటానికి, వాళ్ల కోసం నేను ఎక్కడికి పోతాను” అంది.


“అందుకే అమ్మా నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసి మా మామగారు యింటికి వెళ్ళి పదిరోజులు వుండండి. అప్పుడు మన యింటి విలువ తెలిసి ప్రశాంతం గా ఉంటారేమో” అన్నాడు సీతారాం. 


“బాగానే వుందిరా, తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లినట్టు, నేను ఎందుకు కోడలు పుట్టింటికి, రేపు శనివారం వాళ్ళని తీసుకుని వెళ్ళి మీ మామగారింట్లో దింపు, తల్లిదండ్రుల ని చూడాలి అని ప్రతీ ఆడపిల్లకు వుంటుంది. నాకు కూడా యిప్పటికి మా అమ్మానాన్న లని చూడాలని ఉంటుంది, నేను పైకి వెళ్తే గాని చూడలేను” అంది కళ్ళు తుడుచుకుంటూ.


ఒక మంచి రోజు చూసి భార్యని కొడుకుని అత్తారింటికి తీసుకుని వెళ్లి దించివచ్చాడు సీతారాం. శ్యామల వెళ్ళేటప్పుడు అత్తగారి తో చెప్పింది, “మీ మనవడుకి మీరు అలవాటు, రేపు మా అమ్మా వాళ్ళని చూసి మీ కోసం వెతుకుంటాడేమో అని భయం గా వుంది, మా అమ్మకి అలవాటు కాకపొతే నేను వెంటనే వచ్చేస్తాను, వంటగది నీట్ గా వుంచండి” అంది నవ్వుతూ. 


“చాల్లేవే పిల్లా, నేను వంటగది మొహమే చూడనట్టు మాట్లాడుతావు, యిదిగో ఈ అయిదు వందలు నీ దగ్గర పెట్టుకో” అంటూ శ్యామల చేతిలో పెట్టింది రమణమ్మ.


శ్యామల వాళ్ళ తల్లిదండ్రులు కూతురిని మనవడిని చూసి సంతోషించారు. కొత్త వాళ్ళని చూసి శ్యామల కొడుకు అడగనే అడిగేసాడు “బామ్మ ఏది? ఈవిడ ఎవ్వరూ” అని. 


వాడి మాటలు విన్న శ్యామల వాళ్ళ అమ్మ, “ఒరేయ్! నేను మీ అమ్మ కి అమ్మని, నీకు అమ్మమ్మ ని, నువ్వు నాతో ఆడుకో, నీకు అప్పచ్చులు చేసి పెడతాను” అంది. 


“అమ్మా! మీరిద్దరూ యిక్కడ వుండి చేసేది ఏముంది, మా అత్తగారు కూడా అన్నారు మీరు మాతో వుంటే బాగుంటుంది అని” అంది శ్యామల.


“ఓసి పిచ్చిదానా! ఎక్కడైనా అత్తగారు కోడలు తల్లిదండ్రుల ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటుందే, నిజం చెప్పు.. నీకు నీ అత్తగారికి మాటపట్టింపులు ఉండవా. నిన్ను నేను చూకుంటునట్టు చూస్తుందా” అని అడిగింది శ్యామల తల్లి. 


“ఏమోనమ్మా, ఆవిడా నన్ను అన్నా, నేను ఆవిడ మీద విసుక్కున్నా కొంతసేపే, యిద్దరం మాట్లాడుకోకపోతే ఒక్క క్షణం తోచదు. కొత్త పెళ్లికూతురు గా నన్ను వాళ్ళ యింట్లో వదిలి వెళ్లిపోయారు మీరు, అప్పటినుండి ఆవిడే నాకు తల్లిగా మారింది” అంది శ్యామల. ఆ మాటతో శ్యామల తల్లి మొహం మాడింది.


కొడుకు రోజూ బామ్మ ఏది అని అడుగుతో వుండటం తో శ్యామల తల్లి “ఎందుకురా బామ్మ, అమ్మమ్మ ని ఎదురుగా వున్నా నీకు కనిపించడం లేదా” అని విసుక్కోవడం మొదలుపెట్టింది.


సీతారాం నుంచి ఫోన్ రాగానే బయలుదేరి భర్త దగ్గరికి వచ్చేసింది.


మనవడిని, కోడళ్ళు ని గుమ్మం ముందు ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళింది రమణమ్మ గారు. చిన్న చిన్న గొడవలతో అత్తాకోడళ్లు సీతారాం కి ఏమి యిబ్బంది కలగచేయకుండా కాలం గడుపుతున్నారు.


ఆదివారం సీతారాం సాయంత్రం భార్యని టీ పెట్టమని, తల్లితో టీవీ చూస్తున్నాడు. వంటగదిలోనుంచి కెవ్వున కేక వినిపించడంతో లోపలకి వెళ్ళి చూస్తే టీ డికాషన్ శ్యామల గుండెలమీద పడి చర్మం వూడిపోయింది. అలా ఎలా మీద పోసుకున్నావు అంటూ బయటకు తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి తల్లితో చెప్పాడు, బర్నాల్ ఆయింట్మెంట్ యిచ్చి రాయమన్నాడు.


“ఇదేమిటే తల్లి యింత కాల్చుకున్నావు, ఉదయం నా మొహం చూసావా ఏమిటి ఖర్మ” అంటూ ఆయింట్మెంట్ రాస్తోంది. 


“మీ అబ్బాయిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను పట్టకారు పనిచేయడం లేదు కొత్తది కొనమని, టీ గిన్నె ని దింపుతోవుంటే పట్టువదిలి మీద పడింది” అంటూ మూలుగుతోంది శ్యామల.


గబగబా దేముడి గదిలోకి వెళ్ళి విభూది తీసుకుని వచ్చి కోడలుకి పెట్టి “దేముడిని తలుచుకొ తల్లీ, నొప్పి తగ్గుతుంది” అంది రమణమ్మ. 


“అత్తయ్యా! మామయ్య గారు పోయిన దగ్గర నుంచి మీరు దేముడి గదిలోకి రాలేదు, యిప్పుడు ఎలా వెళ్లిపోయారు” అంది అంత నొప్పిలోనూ శ్యామల.


“నిజమే, నా కోడలు యింత బాధ పడుతోవుంటే పోయిన మీ మామగారి కోసం మానేసాను అనేది నేను ఆలోచించలేదు, నా ఆలోచన నిన్ను ఆ భగవంతుడు కాపాడాలి అనే” అంది తల నిమురుతో. 


సాయంత్రం అయ్యేసరికి శ్యామల కి నొప్పి ఎక్కువ అవడంతో కొడుకుకి చెప్పి శ్యామల ని పెద్ద డాక్టర్ కి చూపించమని పంపించింది. డాక్టర్ గారు యిచ్చిన ఇంజక్షన్, స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుని యింటికి వచ్చారు.


పదిరోజులు కంటికి రెప్పలా కాపడింది శ్యామలని రమణమ్మ గారు. మనవడిని తల్లి దగ్గరికి వెళ్ళానియ్యకుండా తనదగ్గరే ఉంచుకుని చూసుకుంది.


“మీ అమ్మగారికి చెప్పావా” అన్నాడు సీతారాం భార్యతో.


“ఎందుకు? అత్తయ్య గారే నన్ను తల్లి లా చూసుకున్నారు, పెద్ద దిక్కులేని యింట్లో ఎంత డబ్బులు వున్నా రిసార్ట్ లో వున్నట్టే తప్పా మా యింట్లో వున్న ప్రశాంతత వుండదు కదండీ” అంది శ్యామల.


నిజమే కోడలు అత్తగారితో సఖ్యం గా వుంటే తన భర్త సంతోషం గా ఉంటాడు, అత్తగారు కోడలిని కూతురు గా చూసుకుంటే కొడుకు సుఖం గా ఉంటాడు. ఏవిధంగా చూసుకున్నా అత్తాకోడళ్లు సంతోషం గా వుంటే ఆ యిల్లు స్వర్గం లా ఉంటుంది. ప్రయత్నం చెయ్యండి. తప్పేముంది?

 శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















2 Comments


@saipraveenajeedigunta8361

•2 days ago

Good one

Like

kvv.prasad
5 days ago

ఇలా జరిగితే మన దేశంలో సగం మనుషులకు బాధలు తప్పుతాయి.


బాగుంది శ్రీనివాసరావు గారూ, ఈ కథ😀

Like
bottom of page