స్వర్గము
- Sudarsana Rao Pochampalli
- Aug 30, 2023
- 4 min read

'Swargam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'స్వర్గము' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అనంత కాలము శుఖ శాంతుల జీవన విధానమే స్వర్గము అనబడుతుంది.. నిఘంటువులో స్వర్గానికి పర్యాయ పదాలు చాలానే ఉన్నాయి. అమరలోకము, దివి, ధరుణము, దేవలోకము, సురలోకము, వేల్పుబ్రోలు మున్నగునవి చాలా ఉన్నావి. ఇవి ఎవరి నమ్మకాన్ని బట్టి వారు నుడివే పదాలు.
మానవులు ఎవరు ఏది చెప్పినా నమ్మే మనస్తత్వము గలవారే అధికము.
ఇక్కడ గిరిధర్. విజయ్ మంచి స్నేహితులు అయినా గిరిధర్ చెబితేనే నమ్మే మనిషి విజయ్. విజయ్ భార్య సీత. ఇద్దరు కొడుకులు దివామణి. కళానిధి. విజయ్ కు ఆవేశము ఎక్కువ ఆలోచన తక్కువ. సదా భార్యతొ, పిల్లలతొ పేచీలు పెట్టుకుంటు. చీ ఛీ ఈ ఇల్లు ఒక నరకము అంటుంటాడు విజయ్.
గిరిధర్ భార్య ఇందిర. ముగ్గురు ఆడపిల్లలు- వరుసగా భవ్య, దివ్య, రమ్య. గిరిధర్ శాంత స్వభావుడు, ఆలోచనాపరుడు. ఒకసారి గిరిధర్ విజయ్ ఇంటికెస్తె వాళ్ళింటి గొడవలు జుగుప్సాకరంగా ద్యోతకమౌతాయి గిరిధర్ కు.
గిరిధర్ తమ యింటి ప్రవర్తన చూసినట్టున్నదని గిరిధర్ ముందుకు రావడానికి జంకుతాడు విజయ్.
అది గమనించిన గిరిధర్ ‘నేను తరువాత కలుస్తాను’ అని వేగంగా వెడలి పోతాడు.
విజయ్ కు తల తెగినంత బాధ కలుగుతుంది గిరిధర్ వెడలి పోవడము చూసి. ఎటూ తోచక ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి, లోపల తన అర్రలో పక్కమీద తనువు వాల్చి కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు విజయ్.
అక్కడ గిరిధర్ కూడా ఆలోచిస్తుంటాడు- విజయ్ ను దారికి తెచ్చెదెట్లా అని. రెండు రోజులు స్నేహితులు ఒకరినొకరు కలుసుకోరు.
సౌమ్యుడు కనుక గిరిధరే ధైర్యము చేసి విజయ్ ఇంటికి పోతాడు. గిరిధర్ను చూసి బెల్లం కొట్టిన రాయి అను సామెతలా విజయ్, గిరిధర్ ఎదురుగా వచ్చి “మొన్నటి మా యింటి సంఘటన నిన్ను బాధించి ఉండవచ్చు. నన్ను క్షమించు” అంటాడు తలదింపుకొని.
“ఛా ఛా.. అదేమిలేదు. ఈ రోజు నువ్వు ఒక్కడివే మాఇంటికి భోజనానికి రావాలి. కాస్త తీరికగా మాట్లాడుకోవచ్చు” అంటాడు గిరిధర్. సరేనంటాడు విజయ్. గిరిధర్ ఏదో అనునయించే మాటలు చెబుతాడు అనుకుంటూ.
సహజంగా విజయ్ భార్య సీత, కొడుకులు దివామణి, కళానిధి సౌమ్యులే కాని చిన్నప్పటినుండి దుడుకు స్వభావము గల విజయ్, వాళ్ళను ఏదో కారణముపై రెచ్చగొడుతుంటాడు. వాళ్ళు తిరుగుబాటు చేస్తె రెచ్చి పోతుంటాడు. దీనితో నిరంతర గొడవలకు దారితీస్తుంది.
ఆ రోజు సాయంత్రము గిరిధర్ ఇంటికి పోతాడు విజయ్. ఇతని కొరకే ఎదిరి చూస్తున్న గిరిధర్, విజయ్ ను లోనికి ఆహ్వానించి ముందుగా ఫలహారము, చాయ తీసుకవస్తాడు ఇద్దరికని.
ఫలహారము చేస్తూ,
"ఒకతికి జగములు వణుకున్
అరయంగా ఇద్దరైన అంబుధి వణుకున్.
ముగురాడవారు గూడిన సుగుణాకర పట్టపగలు చుక్కలు బొడుచున్"
అని ముగిస్తూ గిరిధర్, “ఈ పద్యము ఎవరినీ పోల్చి చెప్పడము లేదు. సందర్భము కూడ కాదు. అయినా నేను చెప్పేదేమిటంటె ఇంట్లో యారాండ్లు గాని, సవతులు కాని కలిసి మెలిసి సాధారణంగా ఉండలేరు. ఇది లోకము తీరు” అంటాడు గిరిధర్.
“ఈ కాలములో సవతులూ లేరు, యేరాండ్లు కూడ కలసి ఒకే ఇంటిలో ఉండడము లేదు. అందుకొరకు గొడవలకు ఆస్కారముండదు. ప్రశాంతంగా ఉండ ఓపిక కొరవడి, చిన్న చిన్న సంఘటనలనే భూతద్దములో చూచిన విధంగా రెచ్చి పోయి, ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు కోల్పోతారు. అటు భార్యగాని, ఇటు భర్తగాని లేదా ఎదిగిన పిల్లలు గాని” అంటాడు గిరిధర్.
గిరిధర్ మాటలలోని అంతరార్థాన్ని వెదికే పనిలో ఉంటాడు విజయ్ ఫలహారము చేస్తూనే.
విజయ్ మౌనము భంగము చేస్తూ “విజయ్! నేను ఇంత సేపు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా?” అని గిరిధర్ అంటాడు.
‘ఛ.. అదేమిలేదు. కొన్ని తెలియని విషయాలు తెలుస్తున్నాయి గదా’ అనుకొని “మౌనంగా వింటున్నాను, అంతే” అంటాడు విజయ్.
ఫలహారము ముగించుకొని “మాపొలము చూసి వస్తాము పద” అని విజయ్ ను తోడ్కొని పోతాడు గిరిధర్.
పొలములో అడుగు పెట్టి పోయినంత దూరము పండ్ల చెట్లు, పూల మొక్కలు వాటి పరిమళాలు. పక్షులు గూటికి చేర బోయే విధానము అవన్ని చూస్తుంటె విజయ్ కు స్వర్గ మంటే ఇదేనేమో అనే అనుభూతి కలిగి అంటాడు “గిరిధర్! మీ పొలము నాకు స్వర్గముగా తోస్తున్నది” అని అనగానె. “సరె.. నరకము కూడా చూపించుత పద” అని పడావపడిన చెలుక లోనికి తీసుక పోతాడు విజయ్ను గిరిధర్.
తోవలో రాళ్ళు రప్పలు, ముండ్ల చెట్లు, గుంతలు.. దారిలో నడవడానికే దుర్లభంగ తోస్తది విజయ్ కు.
“మొదట నీవు చూసిన పొలము దీనిలోని భాగమే! మేము ఎంతో శ్రమపడి దాన్ని చూడగానే కవులు వర్ణించిన విధంగా స్వర్గమోలె తోస్తున్నది. శ్రమకోర్వక పడావ పెట్టడము చే ఇది నీకు నరకంగా తోస్తున్నది. ఒక పద్యము చెబుతాను విను” అంటూ గిరిధర్..
“ఏకాశి మరణ మేకంగ స్వర్గమని
ఏటిలో దునుకంగ నరునకు నరకంబు
ఉర్విలో అననె కలుగు ఉచిత రీతి
స్వర్గ నరకములు రెండు స్వంత చేష్టల బట్టుండు”.
అని చెబుతూ స్వర్గము నరకము ఉన్నవో లేదో కాని
మన కష్ట సుఖాలను వాటితో పోల్చుకోవడము పరిపాటి అంటాడు గిరిధర్.
స్వర్గము నరకము మనము వ్యవహరించే తీరుమీద ఆధారపడి ఉంటది అంటాడు గిరిధర్.
“ఇక నీవు అనుకుంటున్న స్వర్గములో కూడా అధికారము దాస్యము ఉంటాయి. తాగే అమృతమైనా ఒకరికి ఒకరు తెచ్చి పోయాలి. అప్సరసలు ఎప్పుడు నాట్యము చేస్తూ ఉండాలి. ఎవరికీ తీరిక అనునది ఉండదు. కాకపోతె వాళ్ళు శాశ్వితంగా స్వర్గములోనే ఉండవలసి వస్తుంది. పొరపాటుకు శాపాలు కూడా ఉంటాయి” అంటుంటె ఆశ్చర్య పోవుడు విజయ్ వంతు అయితది.
అలా మాట్లాడుకుంటు ఇంటికొచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు ఇద్దరు స్నేహితులు.
ఇక గిరిధర్, స్నేహితుడు విజయ్ ను అడుగుతాడు- “మీ ఇంట్లో రోజూ గొడవ పడుటకు కారణమేమిటి?” అని. దానికి సరియైన సమాధానము చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు విజయ్.
“నువ్వు చెప్పకున్నా పరిష్కారము నాకు ఇప్పుడే నీద్వారానే తెలిసివచ్చింది” అంటాడు గిరిధర్. తెల్లముఖమేసి చూస్తాడు విజయ్.
“చూడు విజయ్! నేను ప్రశ్నిస్తుంటే నీవు మౌనము దాలుస్తున్నావు. అదే మౌనము మీ ఇంట్లో పాటిస్తె గొడవలకు ఆస్కారముండదు. ఇది గుర్తెరిగి వ్యవహరిస్తే సమస్యే ఉండదు. నేను మీ యింటి విషయాలలో జ్యోక్యము చేసుకున్నాను అని నీవు తలచినా ఒక స్నేహితునిగా చొరవతో కల్పించుకోవలసి వచ్చింది” అంటాడు గిరిధర్.
“ఛ అదేమి లేదు. కాకపోతె నీ మాటలతో నేను అర్థము చేసుకున్న దేమిటంటె తప్పంతా నాదేనని” విజయ్ అంటుడగానే “ముమ్మాటికి” అంటాడు గిరిధర్ ధైర్యము చేసి.
“నీళ్ళేకదా అని నీటిపై కొడితె చిళ్ళక తప్పదు.
చలన చిత్రము చూస్తూ హాస్య సన్నివెశానికి ఎంతైతె నవ్వుకుంటమో విషాద సంఘటనలకు అంతే స్పందించాలె. అదే మానవత్వ లక్షణము.
అసలు నన్నడిగితె మనిషికి ఇల్లే స్వర్గము, భార్యే దేవత. పిల్లలు మనకు ఆనందాన్ని కలిగించే రూపాలు. ఇక మనిషి సహనమే పూలబాట. ఇది గుర్తెరిగితె ఇంట్లో సమస్యే ఉత్పన్నముకాదు” అని వివరంగా చెబుతాడు గిరిధర్ విజయ్ కు.
ఇంతలో అన్నము వడ్డించినానని గిరిధర్ భార్య ఇందిర పిలుస్తుంది లోనికి. ఇద్దరూ పోయి సలక్షణంగా భోజనము చేస్తారు.
భోజనము చేసి బయటికి వస్తూ “నేను ఒకటే మాట చెబుతాను విజయ్! సహనమే మందు అనుకొని వ్యవహరించు. ఇక ఏలాంటి పేచీలకు, గొడవలకు ఆస్కారముండదు. ఇంకొక మాటేమిటంటె కుటుంబ మనుగడ సాఫీగా సాగుటకు సింహభాగము నీదే ఉంటుంది” అని వివరంగా చెబుతాడు గిరిధర్.
ఇంకొకటి కొడుకుల విషయానికొస్తె-
"రాజవత్ పంచ వర్షాని. దశ వర్షాని దానవత్
ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్ర వదారచేత్"
అంటె కొడుకులను ఐదు ఏండ్ల వరకు దేవునిగా చూడాలి.
పది ఏండ్ల ప్రాయములో చదువుటకై శిక్షించాలి.
పదహారు ఏండ్లు నిండితె స్నేహితునిగా చూడాలి” అంటాడు గిరిధర్.
“అయ్యా! ఒక్క పూటకే ఇన్ని విషయాలు చెప్పావు. నీతి శాస్త్రమేమైనా చదివావా?” అంటాడు విజయ్.
“అదే చెప్పబోతున్న విజయ్! పుస్తకము కూడా మనకు స్నేహితుడు లాంటిది. అది చదువుతూ ఉంటె బయటి ప్రపంచము మీద ధ్యాసే ఉండదు. ఇంకొకటి ఓపిక ఉంటె నీవూ ఏదేని వ్రాయబూనుకో” అంటాడు గిరిధర్.
“ఇక భార్య అనునది మూడు ముళ్ళ బంధముతో మన యింటికి వస్తూ తనకొక నూతన స్నేహితుడు దొరికాడు అను భావనతో ఉండాలి. కాని ఆమె సేఛ్చకు భంగము కలిగించే తీరుగా మెలుగగూడదు. అప్పుడే ఇరువురికి ఇల్లంటే స్వర్గము అను భావన స్ఫురిస్తుంది” అంటాడు గిరిధర్.
ఇక గిరిధర్ కు చెప్పి ఇంటిబాట పడుతాడు విజయ్.
మరునాడు కొన్ని పుస్తకాలు తెచ్చుకొని చదువనారంభిస్తాడు. ఆ రోజు ఇంట్లో గొడవలేమి జరుగవు. గిరిధర్ చెప్పిన మంత్రము బాగుందని భార్యా పిల్లలతో ముక్తసరిగా మాట్లాడుతు సదా పుస్తక పఠనములో మునిగి పోతాడు విజయ్.
కొన్నాళ్ళకు కొడుకుల చదువులో అభివృద్ధి. భార్య మర్యాదగా పాటించే విధానము విజయ్ ను సంతృప్తి పరుస్తది. అందరూ సంతోషంగా ఉండసాగారు. అప్పుడు విజయ్ అనుకుంటాడు "స్వర్గము" అనునది తన ఇల్లే కాని వేరు లేదు అని.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments