top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

స్వర్గానికి దారి



'Swarganiki Dari' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 23/07/2024

'స్వర్గానికి దారి' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కృష్ణమూర్తి ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రధాన ఆఫీసర్ కి పర్సనల్ సెక్రటరీ గా పనిచేస్తున్నాడు. ప్రధాన ఆఫీసర్ తరువాత కృష్ణమూర్తికి ఎంతో అధికారం వుంది. అతని ఆర్డర్ ప్రధాన ఆఫీసర్ చెప్పినట్టుగా భావించి మిగిలిన ఉద్యోగులు కృష్ణమూర్తిని గౌరవంగా చూసుకునే వారు. కృష్ణమూర్తి కూడా అందరితోను గౌరవంగా వుండేవాడు. అతనికి అప్పగించిన పని అయ్యేవరకు వదిలిపెట్టేవాడు కాదు. 


దానితో ఎమ్మెల్యే ల నుంచి ఎంతో మంది కృష్ణమూర్తికి చెప్పితే చాలు అనుకునే వాళ్ళు. అసలే గవర్నమెంట్ ఆఫీసు, ఎవ్వరికైనా పేరు వస్తోంది అంటే చాలు వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా వుంటారు. ఆ విధంగానే కృష్ణమూర్తికి వున్నారు. అయితే ప్రధాన ఆఫీసర్ కి కృష్ణమూర్తి అంటే ఏమిటో తెలుసు. తనకంటే వయసు లో పెద్ద, అతను కృష్ణమూర్తిని తను సర్వీస్ లో చేరినుంచి చూస్తున్నాడు. కృష్ణమూర్తి నిప్పులాంటి వాడు. 


తన దగ్గరకి ఏదైనా రెప్రెజంటేషన్ వస్తే ముందుగా వాళ్ళకి సహాయం చెయ్యేడానికి ఏముందో చూసేవాడు. రూల్స్ అన్నీ తెలుసు కాబట్టి, అర్హులైన వాళ్ళకి సహాయం చేసేవాడు. ఈ విషయం క్రింద ఆఫీసర్స్ కి, క్లర్క్ లకి గిట్టేది కాదు. మేము రాసిన నోట్ ఫైలు కి వ్యతిరేకం గా 

కృష్ణమూర్తి ప్రధాన ఆఫీసర్ తో ఆర్డర్స్ వేయించుతున్నాడని అభిప్రాయం.


అయితే ఏ ఫైల్ వచ్చినా ఆఫీసర్ కృష్ణమూర్తి కి యిచ్చి అభిప్రాయం అడిగేవాడు. అది తెలియక చాలా మంది కృష్ణమూర్తి మీద కోపం పెంచుకున్నారు.


ఒకరోజు కృష్ణమూర్తి ఆఫీస్ లో వుండగా ఒక వ్యక్తి ఒక మూట భుజం మీద పెట్టుకుని వచ్చాడు. ఆఫీస్ అటెండర్ అతనిని బయటకు పొమ్మని అరుస్తుండటం చూసి, కృష్ణమూర్తి ఆ వ్యక్తి ని దగ్గరికి పిలిచి విషయం ఏమిటి అని ఆడిగాడు. 


అతను మూట ని క్రింద పెట్టి “అయ్యా! నేను ఆఫీసులు చుట్టూ తిరిగి బట్టలు అమ్ముకుంటాను. నా దురదృష్టం.. నా మతం నా బట్టల అమ్మకానికి అడ్డం వస్తోంది. ఈ నెలలో ఒక బట్ట కూడా అమ్మలేదు. నాకు ముగ్గురు పిల్లలు, ఆకలితో అలమటించి పోతున్నారు” అన్నాడు.


అతని మాటకి కృష్ణమూర్తికి జాలి వేసింది. ‘ఏవీ బట్టలు చూపించు’ అని, ‘నేను వేసుకునేవి టీ షర్ట్స్, నీ దగ్గర వున్నవి చొక్కాలు, లుంగీలు, చీరలు.. యివి కొని నేను ఏమి చెయ్యాలి’ అన్నాడు. 


దానికి ఆ బట్టలు అమ్మే అతను “సార్! మీరు కొని ఎవ్వరికైనా ఇవ్వచ్చుగా” అన్నాడు.


అతనిమాటలకు ఆలోచనలో పడి, “సరే రెండు చొక్కాలు, రెండు లుంగీలు, రెండు చీరలు యివ్వు, ప్రతీ నెల రెండవ తారీకు న రండి, యిలాగే తీసుకుంటాను” అని బట్టలు తీసుకుని అటెండర్ కిచ్చి ఆల్మరలో పెట్టమన్నాడు. 1500/= బిల్లు బట్టల అతనికిచ్చి పంపించాడు.


సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు అటెండర్ బట్టలు తీసుకుని వెళ్ళమని గుర్తు చేసాడు. ‘యిక్కడ ఉండని, తరువాత తీసుకుని వెళ్తా’ అన్నాడు కృష్ణమూర్తి. 


ఒక రోజు ప్రధాన ఆఫీసర్ గారు కృష్ణమూర్తి ని రమ్మని పిలిచారు. అటెండర్ “కృష్ణమూర్తి గారు బయటకు వెళ్లారు సార్” అని చెప్పాడు. 


అదే అవకాశం గా అక్కడే వున్న ఒక ఆఫీసర్, “సార్! కృష్ణమూర్తి మీరిచ్చిన చనువు తో తనే ఈ ఆఫీస్ కి ఆఫీసర్ అని తన యిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. సడన్ గా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడు, అతను వచ్చే వరకు అతని టేబుల్ మీద ఫైల్స్ మీకు పంపటానికి వీలులేదు” అని చెప్పాడు.


ఆ మాటలు విన్న ప్రధాన అధికారి, “కృష్ణమూర్తి అటువంటి వాడు కాదండి, చాలా నిక్కచ్చిగా ఉంటాడు, అందువలన నాకు కూడా సౌకర్యం గానే వుంది” అన్నాడు. 


అనటం అయితే అన్నాడు గాని, నిజంగానే కృష్ణమూర్తి తనని లోకువ చేసి తన యిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడా అని అనుమానం వచ్చింది.


ఇంతలో సెల్ ఫోన్ లో మెసేజ్ రావడం చూసి, వెంటనే కారులో బయటకు వెళ్ళిపోయాడు. మనసంతా పాడైపోయింది. తనతో చిన్నప్పుడు చదువుకున్న తన స్నేహితుడు డబ్బు లేక పై చదువులు చదవకుండా ఆగిపోయి చిన్న ఉద్యోగం లో చేరి గంపెడు సంసారం తో బాధ పడేవాడు. తను డబ్బు సహాయం చేస్తాను అన్నా తీసుకునే వాడు కాదు, అలాంటి అతను చనిపోయాడు అన్న మెసేజ్ రావడం తో ప్రధాన అధికారి కి దిక్కు తోచలేదు.


స్నేహితుడు యిల్లు అడ్రస్ చెప్పడంతో డ్రైవర్, కారు ని ఆ ఇంటికి తీసుకొని వెళ్లి ఆపాడు. యింటి ముందు పది మంది వరకు నుంచుని వున్నారు. అయ్యో అనుకుంటూ కారు దిగి స్నేహితుడు శవం దగ్గరికి వెళ్లి ఆశ్చర్యపోయాడు. అక్కడ కృష్ణమూర్తి తన స్నేహితుడి అంతిమ యాత్ర కి కావలిసిన పనులు చేస్తున్నాడు.


ప్రధాన అధికారి, “కృష్ణమూర్తి! నువ్వేమిటి యిక్కడ వున్నావు, మా స్నేహితుడు నీకు చుట్టమా”: అని ఆడిగాడు.


ఆఫీసర్ ని చూసి కొద్దిగా కంగారు పడి సద్దుకుని, “సార్! ఈ పని అయిన తరువాత మీకు ఆఫీసులో అన్ని విషయాలు చెప్తాను సార్, మీరు అలా కూర్చోండి” అన్నాడు కుర్చీ వేస్తో. చలనం లేని స్నేహితుడి చెయ్యి పట్టుకుని కళ్ళు తుడుచుకున్నాడు ప్రధాన అధికారి. కృష్ణమూర్తి అనుకున్నాడు బహుశా ఈ చనిపోయిన వ్యక్తి సార్ చుట్టం ఏమో అని.


కృష్ణమూర్తి కూడా ఒక వైపు పాడె పట్టుకుని స్మశానం వైపుకి వెళ్ళిపోయాడు.


ప్రధాన అధికారి జేబులో నుంచి కొంత డబ్బు తీసి ఏడుస్తున్న స్నేహితుడి భార్య కి యిచ్చి ‘ఖర్చులు కి ఉపయోగించండి’ 

అని చెప్పి బయటకు వచ్చి కుర్చీలో కూర్చుని వున్నాడు.


అక్కడే వున్న ఒక పెద్దాయన అంటున్నాడు, “స్వంత కొడుకు లేడు, దిక్కులేదు అన్నవాళ్ళకి ఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు దేముడి లా 

సహాయపడుతున్నారు. ఏ బంధుత్వం అక్కర్లేదు, యిబ్బంది లో వున్న వాళ్ళు అతనికి ఫోన్ చేస్తే చాలు నిమిషాలలో వచ్చి సహాయపడతాడు. పాపం ఎదురు ఖర్చు పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే చేతులెత్తి దణ్ణం పెట్టాలి” అన్నాడు.


ఈ మాటలు విన్న ప్రధాన అధికారికి కృష్ణమూర్తి అప్పడప్పుడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఈ సహాయం చెయ్యడానికా అనుకుని, అక్కడ నుంచి ఆఫీసు కి బయలుదేరాడు.

కారులో కూర్చొని, డ్రైవర్ ని ఆడిగాడు, కృష్ణమూర్తి విషయం నీకు ఏమైనా తెలుసా అని.


“సార్! ఆయన ఒక దేముడు సార్, పిల్లలు సెటిల్ అవ్వడంతో సగం జీతం బీద, బిక్కి ల కోసం ఖర్చు చేస్తాడు. రెడ్ క్రాస్ లాంటి సంస్థల లో పేరు వ్రాయించి, ఎవ్వరికైనా రక్తం అవసరం అయితే వెళ్లి డొనేట్ చేస్తాడు సార్. నాకు తెలిసి నెలకు ఒక్కొక్కసారి రెండు సార్లు రక్తం యిచ్చిన రోజులు వున్నాయి. మా నాన్నకి గుండె ఆపరేషన్ కి రక్తం కోసం మన ఆఫీస్ లో తెలిసిన వాళ్ళని అడిగితే ఒక్క కృష్ణమూర్తి సార్ మాత్రమే తను రక్తం యివ్వడం కాకుండా వాళ్ళ అబ్బాయి తో కూడా యిప్పించాడు.. 


ఈ మధ్య ఒక ముస్లిం అతని దగ్గర బట్టలు కొని, గుడి దగ్గర దిక్కులేని వాళ్లకు పంచి పెడుతున్నారు.


సార్! కృష్ణమూర్తి సార్ తప్పకుండా స్వర్గం కి వెళ్తారు సార్” అన్నాడు ఆవేశం తో.


ఆఫీస్ కి వెళ్లిన గంటకి కృష్ణమూర్తి నుదుట విభూతి రేఖల తో లోపల కి వచ్చి “సార్! మిమ్మల్ని అడగకుండా ఆఫీసు వదిలి వెళ్లినందుకు క్షమించండి. అయితే సహాయం కోసం అలమటిస్తున్న వాళ్ళ కోసం నేను వారం లో రెండు సారులు అయినా వెళ్ళాలి. ప్రతీ సారి తమరిని అడిగితే మీకు చిరాకు రావచ్చు, వెళ్ళద్దు అనవచ్చు, అటువంటి సమయంలో నా ప్రయత్నం దెబ్బ తింటుంది అని, ఆఫీస్ పని రాత్రి పదిగంటల వరకు ఉండి పెండింగ్ లేకుండా చూసుకుంటాను.


నాకు మిగిలిన సర్వీస్ నాలుగు సంవత్సరాలు, యింతవరకు నేను పనిచేసిన ఆఫీసర్స్ అందరూ సహకరించారు. మీరు కూడా దయగలవారు అని నాకు తెలుసు, లేదంటే యింత పెద్ద ఉద్యోగం చేస్తో కడు బీదవాడు చనిపోతే ఎంత స్నేహితుడైనా రాని కాలం” అన్నాడు.


“మూర్తి గారు! మీ సేవా కార్యక్రమాలు మీరు చేసుకోండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే నాది ఒక కోరిక. భారం అంతా మీరే భరించకుండా ప్రతీ నెల నేను కొంత సొమ్ము యిస్తాను, వాటిని కూడా సేవా కార్యక్రమంలో ఉపయోగించి నాకు కూడా తృప్తి కలిగించండి” అన్నాడు. 


రక్తదానం, అనాధ ప్రేత దహనం లాంటి కార్యక్రమాలు నిజంగానే మనిషికి స్వర్గ ద్వారాలు. తపస్సు అక్కరలేకుండా ముక్తి పొందే మార్గం.


                                      ... శుభం.....


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













49 views0 comments

Comments


bottom of page