'Swayamkrushi' New Telugu Story
Written By G. Varalakshmi
'స్వయంకృషి' తెలుగు కథ
రచన: G. వరలక్ష్మి
తదేక దీక్షతో న్యూస్ పేపరు చదువుకుంటోన్న రంగారావు గారికి, ఇంతలో.. 'పోస్ట్' అన్న కేక వినిపించినట్లయితే, పేపరు మీద నుంచి దృష్టిని మరల్చి పోస్ట్ మాన్ వద్దనుంచి అతడిచ్చిన కవరును ఆతృత గ అందుకున్నారు. చటుక్కున ఆయన దృష్టి ఫ్రమ్ అడ్రసు పై పడింది. 'ఆఁ.. ‘ అంటూనే.. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఒకింత విభ్రాంతికి లోనుకాసాగారు. మనసులో ఓ విధమైన ఉద్వేగం - నుదిటిమీద కొద్దిగా చిరు చమటలు పట్టసాగాయ్. అయితే, ఆయన ముఖంలో మాత్రం ఆనందం ప్రస్ఫుటంగా ద్యోతకమవుతుంది.
అప్పుడే అక్కడకు వచ్చిన ఆయన భార్య వర్ధనమ్మగారు, భర్త చేతిలోఉన్న కవరును చూసి “ఎక్కడనుంచండీ.. ?” అనంటూ కుతూహలంగా అడగటముతో “చూసావంటే.. వర్ధనం.. వీడు.. అదే.. నా మేనల్లుడు.. గోపి రాశాడు.. ఇన్నేళ్లకు మనము గుర్తు వచ్చామా.. వాడేమయి పోయాడోనని.. ఇన్నాళ్లు నేననుభవించిన బాధ ఆ భగవంతుడికి తెలుసు” మాట్లాడుతున్న ఆయన గొంతు జీరపోసాగింది. భర్త మనసులోని ఆవేదనను అర్ధం చేసుకున్న ఆవిడ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. కాసేపటికి తేరుకున్న వర్ధనమ్మగారి ఆలోచనలు గోపి వైపు మళ్లాయి.
పద్నాలుగేళ్ల తరువాత ఉత్తరం రాశాడంటనే ఆమెకు సంభ్రమాశ్చర్యాలతో నోటమాట రావటములేదు. తర్వాత.. వాస్తవం లోకి రావడంతో.. గోపి.. ఏం రాశాడోనని.. లోలోపల మాత్రం మహా ఆరాటంగా ఉందామెకు. అప్పటికే కవరు విప్పుతున్న రంగారావు గారు చేతులు అప్రయత్నంగానే వణికాయి. మెల్లగా అందులోని విషయాలు చదవసాగాడు.
"పూజ్యులైన మావయ్య, అత్తయ్యలకు, మీ మేనల్లుడు గోపి నమస్కరించి వ్రాయునది. ఇక్కడ నేను క్షేమము. అక్కడ మీరు క్షేమమని తలుస్తాను. జీవితంలో ఒక గమ్యం చేరాలన్న తలంపుతో.. ఇన్నేళ్లూ నా ఉనికిని తెలియజేయనందుకు.. మీరు అన్యదా భావించరని, అందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. మామయ్యా.. ఒక దయామయుని చల్లనినీడలో బ్రతుకును వెళ్లదీస్తున్న నాకు, సంఘంలో నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చి.. బ్రతుకు తెరువును చూపించాడా మహనీయుడు.
భవిష్యత్తు అంధకారం కాకూడదని.. జీవితంలో పైకి రావాలన్న తపన - ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి, ఆశయసాధనతో గెలిచితీరాలన్న పట్టుదల నాలో కలుగు జేసింది ఆయన హితవచనాలే! మావయ్య! నా చిన్నతనంలో నాకు ఊహ తెలిసిన నాటినుంచి అమానుషంగా ప్రవర్తించిన నీ వైఖరి- అది ఎంతవరకు దారితీస్తుందో నీవూహించలేదు. ఒక విధంగా తిట్లతోను - దెబ్బలుతోనూ.. అలసిపోయిన నా శరీరం - మనసు కూడా కష్టమంటే ఏమిటో తెలియ చెప్పింది. ఇదొక పాఠం కదూ మావయ్యా.
నేను చేసే ప్రతిపనిలోనూ ఆఖరికి చదువులో కూడా నన్ను.. నిరుత్సాహపరుస్తూ.. అన్నింటికీ నన్ను తప్పుపట్టి నన్నొక అప్రయోజకుడిలా చూసావ్! నామీద అంత ద్వేషం పెంచుకోవటానికి కారణం.. మా అమ్మ కదూ.. ! ఓరోజు అత్తయ్యతో కోపంగా అమ్మ గురించి చెప్పి మాట్లాడుతుంటుంటే అనుకోకుండా విన్నాను..
"మావయ్యా! నన్ను తిట్టే హక్కు నీకుంది. అభిమానంతో తిడితే ఆ ధోరణి వేరు. అంతర్లీనంగా నాలో ఉన్న ప్రతిభను గుర్తించినా - తెలియనట్లుండేవాడివి. 'మావయ్య' గా కాకపోయినా కనీసం ఒక మాష్టారుగానయినా - నన్నొక ప్రయోజకుడిగా దిద్దేవారేమో కదా ! నా లేతమనసు ఎంత వ్యధ చెందేదో.. ! ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. మావయ్యా' నిన్నేదో నిందించాలని.. నా అభిమతం కాదు’. మావయ్యా! ఓ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటూ రాస్తున్నాను సుమా!
ఓరోజు, నేను.. మన చంద్రం లెక్కలు చేస్తున్నప్పుడు సరియైన సమాధానం రాకపోయేసరికి.. నా మీద చిరాకు పడుతూనే.. ప్రతిభ ఉన్నవాడెవడూ వెనుకంజ వేయలేడు. ఒక్క చదువులోనే కాదు..చేసే ప్రతిపనిలోనూ విజయం సాధించితీరాలంటే.. అందుకు కార్యదీక్ష కూడా అవసరం - అన్న సూక్తి గుర్తొచ్చినపుడల్లా. ఒకవిధంగా నీకు తెలియకుండానే.. పరోక్షంగా నన్ను ఎంకరేజ్ చేసేవాడివి.
ఈ సూక్తి నా గుండెల్లో బలంగా నాటుకుపోయింది. వందమంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా- ఒక నిర్దోషికి మాత్రం ఉరిశిక్ష పడకూడదు. ఈ ఉపమానం ఎందుకు చెబుతున్నానంటే.. నా ఆశల ఆరాటంలో పట్టుదలతో ఏదో సాధించాలన్న తపన నాలో కొత్త ఊపిరిని పోశాయి! అహర్నిశలు నా శాయశక్తులా కృని చేసిన ఫలితమే ఒక బాధ్యత కలిగిన, సబ్ఇన్స్పెక్టరుని కాగలిగాను.
అయితే చిత్రంగా ఈ గుంటూరు నుంచి మన వూరు కాకినాడ అక్కడికే వేశారు.. సరాసరి నేను అక్కడికే వస్తున్నాను. ఈ చేదు అనుభవాలతో నామనసును బాధపెట్టి పదేపదే గుర్తుచేసుకునేకన్నా ఒక మంచి నిజాన్ని చెప్పటమే మేలు కదూ! ఏదో గొప్పకోసం సాధించానని, నా పోస్ట్ గురించి మరోలా అనుకోరని భావిస్తాను. నా మనోవేదన అర్థం చేసుకుంటారన్న భావనతో రాసానంతే. ఎంతసేపూ నా గురించే చెబుతూ రాశాను కదూ ! మన చంద్రం, హిమబిందు ఏం చేస్తున్నారు.. ఎలా ఉన్నారు.. ? నన్నెప్పుడైనా.. తలచుకుంటున్నారా!
అన్నీ జవాబులేని ప్రశ్నలే! నాకు మాత్రం ఎవరున్నారు మావయ్యా.. ! మీ అందరి ఆదరాభిమానాలను నేను పంచుకోవాలి. మనిషికి ఎన్ని అర్హతలుండి ఏమి ప్రయోజనం మావయ్యా ! 'బంధం' అన్నది ముడి పడి ఉండాలి. ఇప్పుడు నా మనసుకు ఎంత ఉల్లాసంగా ఉందో.. ఎంతో తేలికగా నా మనను దూదిపింజలా గాలిలో ఎగిరిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నిజం సుమా!
ఇట్లు,
గోపి
అన్ని విషయాలు తెలుసుకుని చదివిన రంగారావు గారు ఆనందబాష్పాలు రాల్చారు. గోపి వ్రాసిన విషయాలతో ఆయన మనసు చెదిరి ఒక్కసారిగా విచలితుడిని చేయసాగాయి! అంతరాత్మ మాత్రం ఆయనను ఘోషిస్తూనే ఉంది.
“నేను, దోషిని కావటానికి, నువు సబ్ ఇన్స్పెక్టర్ వే కానక్కర్లేదురా! నేనెప్పుడూ.. నీ ముందు.. దోషి నే.. రా.. !” మనసులోనే గొణుక్కో సాగారు మెల్లగా. ఏ సమయంలో వచ్చారో కానీ.. రంగారావుగారి పిల్లలు చంద్రం, హిమబిందు ఇద్దరూ కూడా బొమ్మల్లా కూర్చుని తండ్రి చదివినదంతా విన్నారు. ఇక, వర్ధనమ్మ గారి సంగతి సరేసరి.
అప్రయత్నంగానే..వారందరి కళ్లల్లోనూ గిర్రున నీళ్లు తిరుగసాగాయి. ఎవ్వరికీ నోట మాట రాక, కాసేపు నిశ్శబ్దం అక్కడ తాండవించింది. తర్వాత, ముందుగా రంగారావుగారే తేరుకుంటూ మెల్లగ భార్య వైపు చూసి, ఆమె నుద్దేశించి ఇలా అన్నారు.
" వర్ధనం ! మనవాడు ఎంతవాడయ్యాడో చూసావా.. ! వాడు రాసిన ప్రతి అక్షరం వెనుక నా దుర్మార్గం కనబడి.. నా గుండెల్ని పిండేస్తుంది. నా చెల్లెలు, తల్లి, తండ్రి లేని పిల్ల అని, ఎంతో గారాబంగా పెంచాను. అది ఎంత పనిచేసిందో చూసావ్ కదూ! నా పరువు ప్రతిష్ఠలను మంటగలిపి తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిందని తెలిసి నా మనసు ఎంత భగ్గుమందో.. ! నాలోని అహం దెబ్బతింది. తరువాత, కొన్నేళ్లు కాపురం చేసిన దంపతులు యాక్సిడెంటుకి గురయ్యి నా చేతుల్లో పెట్టిన నా మేనల్లుడిని ఎలా శిక్షించేవాడినో ..తలచుకుంటున్న కొద్దీ నాపై నాకే ఏవగింపుకలుగుతోంది.
’మావయ్య’ గా కాకపోయినా - కనీసం ‘మాష్టారు’ గా అయినా..వాడి ప్రతిభను గుర్తించినా వాడి మీదున్న ద్వేషంతో- గుర్తించలేని గుడ్డివాడినయ్యాను. ఓ! పైగా.. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే గురువుని! వాడు నన్ను క్షమించినా -నన్ను ..నేను .. క్షమించుకోలేకపోతున్నాను, క్షమార్హుణ్ణి. అందుకే ఆ పసివాడి లేత మనసు విరిగిపోయిు - మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నా పాపానికి నివృత్తి లేదు.. !" అనంటూనే గద్గద స్వరంతో మాట్లాడుతూ, ఉన్నటుండి ఒకటే ఆయాసపడిపోసాగారు.
హిమబిందు, చటుక్కున మంచినీళ్లు తీసుకువచ్చి- తండ్రి నోటికి గ్లాసందించింది. పిల్లలిద్దరినీ దరికి చేర్చుకున్నారు. గోపి వస్తున్నాడంటే.. వారందరికీ మహా ఆనందంగానూ - రాబోయే పండుగలా ఎంతో సంతోషంగా ఉంది. గోపిని తలచుకోగానే అందాల హిమబిందు ఆమె ఊహల్లో తేలిపోసాగింది.
వర్ధనమ్మ గారి చేయి ఆమె భర్త రంగారావు గారి మీద పడటముతో బరువెక్కిన గుండెలతో వాస్తవంలోకి రాసాగారు. మనిషిలో పరివర్తన రావటానికి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదని నిరూపించారు.
అనుకున్నట్టుగానే, గోపి రావటంతో - అతడిని చూడగానే అందరి సంతోషం వర్ణనాతీతం. ఇక, రంగారావుగారైతే.. మేనల్లుడు గోపిని హృదయానికి హత్తుకుంటూ- ఆర్తిగా ఆదరాభిమానాలతో తనివితీరా చూసారు.. పులకించిపోతూ రంగారావు గారి దంపతులు, గోపి చేయి పట్టుకుని.. అతడి తల్లి, తండ్రికి ఆ పక్కనే ఉన్న ఓ పెద్ద ఫోటోకి దణ్ణం పెట్టించారు. చెమర్చిన కళ్లతో మన స్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని నమస్కరించాడు.
తరువాత, తను తీసుకు వచ్చిన స్వీట్స్, పళ్ళు తన అత్తయ్య చేతిలో పెట్టి ఆవిడ వంక ఆరాధనగా చూసి, ఆ దంపతులిరువురుకూ పాదాభివందనం చేసాడు నిండు మనసుతో. వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఒక్కక్షణం.. రంగారావుగారు, కొత్తగా పోలీసు డిపార్టుమెంటులో జాయిన్ కాబోతున్న మేనల్లుడి గోపిని.. సబ్- ఇన్స్పెక్టరుగా ఊహించుకుంటున్న ఆయనకు, గోపి రూపం మనోనేత్రం ముందు కదల సాగింది.
అప్రమత్తంగా అలా ఉండిపోయిన రంగారావుగారికి, మావయ్యా.. !" అన్న గోపి పిలుపు అమృతధార వలె ఆయన చెవులకు సోకి, వీనులవిందుగా వినిపించసాగింది. తెప్పరిల్లిన రంగారావుగారు ఎంతో అబ్బురపడుతూనే.. ఆబ్బె మరేమి లేదురా.. ఇంతటి వాడవయ్యావంటే.. నీమంచిమనసుకు.. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో.. ఆ..పెద్దాయన సహాయసహకారాలు - నీ తల్లితండ్రుల దీవెనలు-నీకు శ్రీరామరక్షగా నిలిచాయి. 'అనంటూనే 'పాలీసు యూనిఫాములో.. నీవెలా ఉంటావోనని.. ! మరల చెమర్చిన కళ్లతో ఆనందబాష్పాలు రాలుస్తూ అన్నారు.
'బాబూ! గోపీ.. ! మన చంద్రం ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. హిమ బికాం సెకండియర్ చదువుతోంది అని చెప్పిన తర్వాత అందరూ తృప్తిగా భోజనాలు చేసి.. హాలులో కూర్చున్నారు. కాసేపటికి, గలగలమని పారే సెలయేరులా వారి మాటల ప్రవాహం కొనసాగింది. నవ్వులతో సహా గోపి, తన వైపు చూసే చిలిపి చూపులు, అతని సంస్కారం - హుందాతనం హిమబిందు మనసులో చెఱగని ముద్రవేసాయి.
***
G. వరలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/varalakshmi/profile
శ్రీమతి వరలక్ష్మీ గున్నయ్యచారి
విశాఖ పట్నం
Commenti