#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #TajMahal, #తాజుమహలు, #తేటగీతి, #ఇష్టపది

గాయత్రి గారి కవితలు పార్ట్ 2
Taj Mahal - Gayathri Gari Kavithalu Part 2 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 18/02/2025
తాజుమహలు - గాయత్రి గారి కవితలు పార్ట్ 2 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
తాజుమహలు
(తేటగీతిమాలిక)
**********************
తరుణి ముంతాజుమహలును తల్చుకొనుచు
భవన మొక్కటి కట్టెనా ప్రభువు నాడు
వేల కొలదిగా కూలీలు పెద్దవైన
పాలరాతితో నిర్మించ ప్రభలు మెరిసె.
రమ్యమైనట్టి చిత్రాలు రాళ్ళపైన
స్వేదజలమును చిందించి చెక్కినారు
నాటి శిల్పుల ప్రతిభకు నేటి వరకు
విలువ నిడుచుండిరి జనులు వింత యనుచు.
ప్రాతవౌసమాధుల క్రింద బయలు పడని
వింత లెన్నియో కలవని విబుధవరులు
శోధనల్ సల్పు చుండుట చోద్యమకట!
నెరుక కల్గిన ముక్కంటి యెరుగు నిజము.
భారతంబులో శిల్పుల ప్రాభవముకు
తాజుమహలొక చిహ్నమై తేజరిల్లె
విశ్వమందున భాసించె విభవమెల్ల
ముత్యమై వెలుగొందె నీ భువనమందు
శ్వేతసౌధము పొందెను చిరయశంబు.
కౌముదీరహిన్ జిల్కగ కాంతి యెగసి
మెరిసి పోవునా భవనము మిక్కుటముగ
చూడ చక్కని రమ్యతన్ జూపరులకు
హ్లాద మొసగునీ సుందర హర్మ్యమెపుడు.//

వికలాంగులు
(తేటగీతి పద్యములు )
----------------------------------------
1.
మానసిక వికలాంగులన్ మమత జూపి
పెంచుకొనుచుంద్రు పెద్దలు విడువలేక
కరుణ చూపిన చాలును కరముపట్టి
జీవనపథముల వెలుగు సిరులు నిండు./
2.
అంధులైనట్టి బాలల నాదరించి
చదువు నేర్పింప పాలకుల్ శ్రద్ధతోడ
భారతరథసారథులయిభవ్యరీతి
నడుపుచుందురీ జాతిని నవ్యపథిని./
3.
అవయవంబుల లోపాల నధిగమించి
ఎందరెందరో శాస్త్రము లెరిగియుండి
విబుధవరులయి జాతికి పేరుతెచ్చి
జ్ఞాన భిక్షనొసంగిరి జగతికెపుడు./
4.
దేహమందున్న లోపాలు దిద్దలేము
మానసికమైన వ్యాధులన్ మాన్ప వచ్చు
నోర్పునోదార్పులనువారినూరడించి
బ్రతుకు నిల్పగ వచ్చును భయము బాపి. /
5.
ఎదుటి వారిలో లోపాల నెంచి యెంచి
తరచి చూడంగ నిత్యము తగవులాడి
మందబుద్ధిని చూపించు మనుజులార!
మంచి తనముతో ధరణిలో మసలుకొండు!//

చరితలో ఘనులు
(ఇష్టపది )
----------------------------------------
అంగవైకల్యంబు కర్థమే లేదులే
సంగతిగ నాడుటే సంతోషమౌనులే
మరచిపోదాములే మదిలోని బాధలను
తిరిగి వ్రాద్దాములే ధిషణతో చరితలను
బుర్రలో పసయుంది బుద్ధిలో పదునుంది
కుర్రవాళ్ళము జత కూడితే బలముంది
దీనత్వమెందుకో!దిగులునే వదలుదాం!
మానవత్వముతోడ మసలుకొను చుందాం!
గేలిచేసెడివారి కేకలను వినములే!
శీలసంపదచాలు!శ్రేయంబు కలుగులే!
ధైర్యముగ ధర్మమౌ దారిలో నడిచెదము!
స్థైర్యముగ నిలుచుండి దిశలు వెలిగించెదము!
పరులకుపకారంబు ప్రగతికే తొలిమెట్టు
చిరయశంబుల నిడుచు జీవితము నిలబెట్టు
జాతినే మేల్కొలుపు చైతన్యమును పంచి
భాతిగా వెలుగొందు ప్రాభవమునే పెంచి
భరతమాతకు మ్రొక్కి వందనము చేస్తాము!
చరితలో ఘనులమై సాగిపోతుంటాము! //

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments