కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube link: https://youtu.be/dAhTSiTmwes
'Tankasala Varintlo Kasula Koratha' Written By Ayyala Somayajula Subrahmanyam
రచన: అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం
నృసింహ కవి మాంధాత చరిత్రను కవివర్ణ రసాయనం అనేపేరుతో రచించాడు.
తన రచనను మహారాజుకు అంకితం ఇవ్వాలనుకున్నాడు.
కానీ ధూర్జటి కవి బోధతో శ్రీ రంగ నాథునికి అంకితం ఇచ్చాడు.
ఈ చక్కటి కథను ప్రముఖ కవి అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యముగారు రచించారు.
సాహితీసమరాంగన సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయలు అవిచ్చంన్నంగా దక్షిణా పథాన్ని యేలుతున్న కాలము.
ఆ నాటి మహాకవులలో టంకసాల నృసింహకవి ఒకరు. ఇతడు పాండిత్య, కవిత్వమములలోనే కాక , శిల్పవిద్య యందును దిట్ట. సంతానవంతుడు. అయిననేమి, నోటి
లో నాలుక లేని వాడు. నివురుగప్పిన నిప్పు. ఇతరుల నాశ్రయించి పని సాఫల్యము చేసికొను శక్తియుక్తులు లేవు. ఇతడు ' మాంధాతచరిత్ర' యను కావ్యమును రచిం
చెను. వారి తండ్రి అందలి కవిత్వగుణమునను బట్టి కవికర్ణ రసాయనము యను పేరు పెట్టినాడు. ఆ నాటి కవులు కూడ ఆ పేరు సార్థకనామమే యని మెచ్చుకొనిరి. వారు ఎన్ని ముద్రలు వేసిన యేమి ప్రయోజనము. వారనధికారులు కదా! పదవులలో నున్న కవుల ముద్ర పడిన ప్రభు ప్రశంసకు పాత్రులగుదురు. ఏ నాడైనను అధికారముద్ర కా
ప్రభావమున్నది.
నృసింహకవి తన కావ్యమును తీసికొని పెద్దనను దర్శించుటకు వెడలెను. ఆ సమయమున భట్టుమూర్తికి మేఘదూతము పాఠము చెప్పుచుంఢెను. తన యింటికి వచ్చిన నృసింహకవికి ఆసనము, అర్ఘ్యము నిచ్చి గౌరవించెను. పెద్దనగారి పాఠ ప్రవచన రీతి నృసింహకవినెంతో తన్మయమెనర్చినది. శ్లోకమును పెద్దనగారి ముందొకసారి చదివెను. ఆ చదువు రీతియే వినసొంపుగ నున్నది. పిమ్మట శిష్యునిచే రెండు మారులు చదివించినాడు. లోపములను సరిదిద్ది, చదువవలసిన రీతిని వివరించినాడు. భట్టుమూర్తి సంగీతములో నిధి కదా! గురువు చెప్పిన శ్లోకమును అద్భుతముగా చదివినాడు.
ఆ నాటి పాఠ విషయము " తన్వీశ్యామా శిఖరిదశనా"అను శ్లోకము. అది మేఘదూతము లోని యక్షపత్నీవర్ణనము. శ్లోకము లోని ఒక్కొక్క పదమునందలి సారస్యమును
పెద్దన వివరించిన రీతి నృసింహకవికి ఆనందపూర్వకముగా తోచినది.
కొందరు కవులు , పండితులు కాలేరు. పండితులు , ఉత్తమోత్తమ ఉపాద్యాయులు, ఉపన్యాసకులు కాలేరు. పెద్దనగారిలో ఈ మూడు శక్తులు ఇమిడియున్నందులకు నృసింహకవి అబ్బురపడినాడు. భువనవిజయమున అగ్రపీఠము నధిష్టించు నర్హత పెద్దనకు పూర్తిగా కలదని యెంచినాడు. ఎందు కెంచడు? అతడు గుణ
గ్రహణ పారీణుడు గదా! పాఠము చెప్పిన పిమ్మట వారిరువురు మాట్లాడుకున్నారు.
నృసింహకవి:
" మనమున గొన్న నెవ్వగలు మాన్పి ఘంటింతురు కావ్యసమ్మదం
బనఘ కథా ముఖంబున హితా హితబోధ మొనర్తు రింపుగా
గనుగొనుకంటె నద్భుతముగా నెఱిగింతు రతీంద్రియార్థముల్ ,
ఘనమతు లెల్లవారికి నకారణబంధులు గారె సత్కవుల్!"
ఇట్టి మహాకవులను తమ్ము దర్శించి ధన్యుడనయ్యాను.
పెద్దన : ఈ పద్యము నిప్పుడే చెప్పినారా? లేక, తమ కావ్యములో నిదివరకే వ్రాసికొన్నారా.
నృసింహ: ఇది నా కవికర్ణరసాయన కావ్యములోనిది. తమవంటి వారి విషయమున
సార్థకమగునని యిప్పుడు చదివినాను.
పెద్దన: కవుల మహిమ నీ పద్యమున నెంత చక్కగా వర్ణించినారు. తమకు కవులపై నెంత విశ్వాసము ! కాని , ఎల్లరికీ నిష్కారణ బంధువులైన కవులు , తమలో పరస్పరము బాంధవ్యము కలుపుకోవలసి వచ్చునప్పటికి వెనకబడుచున్నారు. తమలో తాము కలహించుకుని సమయము వృధా చేయుచున్నారు.
నృసింహ: అది తమ బోంట్ల విషయమున కాదు.
పెద్దన : కృతజ్ఞుడను. తమ కావ్య ఇతి వృత్తాంతము మేమో సెలవిత్తురా!
నృసింహ: ఇక్ష్వాకువంశజుడైన మాంధాతుని చరిత్ర.
పెద్దన: అందలి ప్రధాన రసము?
నృసింహ: మొదట శృంగారమును , పిమ్మట శాంతమును. ఆ సంగతి నే యిట్లు సూచించినాము.
" యతి విటుడు గాకపోవు టెట్లస్మదీయ
కావ్య శృంగార వర్ణ నా కర్ణనమున
విటుడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున !"
పెద్దన: గొప్ప ప్రతిజ్ఞ చేసినారే!
నృసింహ : తమ దయవలన . తామొకసారి నా కావ్యమును విని సంతసించినచో, నేను ధన్యుడనగుదును.
పెద్దన: అట్లే, తామింకొకసారి దయచేసిన విందును. తమ కభ్యంతరము లేని యొడల , కావ్యమును నావద్ద నుంచినను తీరిక యైనపుడెల్ల చదువుదును.
ఈ సంభాషణము వలన పెద్దనమీద సదభిప్రయము కలిగినది. కవులలో ఐక్యత లేమికి ఎంత చింతించుచున్నారో యని యతనికి తోచినది. పెద్దన యెంత మత్సరము లేని వాడు అనుకుని తన గ్రంథమును పెద్దన వద్దే యుంచి వెడలి పోయెను.
పెద్దన బహుకార్యధురందరు డయినందున కవికర్ణ రసాయనము నామూలాగ్రముగా చదువునప్పటికి మూడు నాలుగు నెలలు పట్టినది. తాను చేసిన ప్రతిజ్ఞకు
దగినట్లుగానే రచించినాడని పెద్దనకు కవికర్ణ రసాయనము మీద గౌరవము కలిగి నది.
కవి యందు మొదటి నాలుగాశ్వసములలోని మాంధాత పూర్వజీవితమును అనగా గార్హస్థ్యధర్మముల నభివర్ణించినాడు. ఈ సందర్భమున అతడు చేసిన శృంగార వర్ణనము యతిని విటుడుగా మార్చజాలునట్టిదే. ఈ నాలుగాశ్వసము లందును- యుద్దము , వివాహము , ఋతువులు, వనవిహారము, జలక్రీడలు, పుష్పాపచయము, సూర్యోదయ సూర్యస్తమయములు, అంధకారము, నక్షత్రములు , చంద్రోదయము, మధుపానము , వార వనితా దూషణము - మొదలగు నష్టాదశవర్ణనములు చేసినాడు. మిగిలిన రెండాశ్వసములందును పారమార్థికాంశములను వర్ణించినాడు. మాంధాత, వసిష్టాదుల వలన తన పూర్వ జన్మవృత్తాంతము తెలిసికొని యిహముపై విరక్తుడగుట, గురువుల వలన కర్మ, ఉపాస్యకోపాసకుల స్వరూపమును గ్రహించుట, భగవద్విగ్రహ స్వరూప , భగవదవతార రహస్యముల నెఱుంగుట, ప్రసన్నభక్తియోగము ల లక్షణములు , సంసార జంజాటములు, పొందదగిన మోక్షమును తెలిసికొని అష్టాక్షరీ మహామంత్రోపదేశము పొంది తపస్సునకేగుట , ఇత్యాది విశిష్టద్వైత వేదాంతపరములగు నానా విషయములను వర్ణించినాడు.
ఇట్టి అతీంద్రియాంశములను వర్ణించుటంబట్టియే నృసింహకవి " అద్భుతముగా నెరిగింతు రతీంద్రి యార్థముల్ " అని చెప్పగలిగినాడని పెద్దన గ్రహించెను.
నృసింహకవి , తాను కవిగా లోకమునకేమి చేయదలంచెనో , దానినే కవివర్ణన నెపమున " మనమున గొన్న నెవ్వగలు. . . " అను పద్యమున చెప్పినాడు. కావ్యము తుదికి
వచ్చునప్పటికి పెద్దన కీ పద్యము అగుపడినది. --
" కవితా విచక్షణత గల
కవికంఠ విభూషణముగ గైకొనవలయుం
గవివర నృసింహ విరచిత
కవికర్ణ రసాయన మను కావ్యము దీనిన్".
ఆహా: తన కావ్యము కవికంఠాభరణము కాగలదనియు నృసింహకవి విశ్వాసము.
ఇట్లు తలంచి పెద్దన, నృసింహకవిపై సదభిప్రాయము నేర్పరచుకొనెను.
ఈ మూడు నాలుగు నెలలును నృసింహకవి పెద్దన యింటికి రాకపోకలు చేయుచునేయున్నాడు. అతడు కొంచెము విసిగినాడు కూడాను.
పెద్దన యెకనాడు నృసింహకవి నుద్దేశించి " తమ కావ్యమద్భుతముగా నున్నది .
తమ ప్రతిజ్ఞ కనుగుణముగానే కావ్యమును నిర్వహించినారు. " అని మెచ్చుకోలు నందించెను. అంతట నృసింహకవి తన కావ్యమును రాయలవారికంకిత మీయవలెనని సంకల్పమున్న దనియు, అందుకు సాయపడవలసినదనియు కోరెను.
" అట్లయిన తాము మరికొంతకాలము వేచియుండవలయును. రాయలవారి దర్శన
మునకు తగిన సమయము చూచి నేను తమకు కబురంపుదును. " అని పెద్దన యనెను. అంతట నృసింహకవి తన యింటికి వెడలెను.
అతడు పోయిన పిమ్మట పెద్దన కొక సందేహము కలిగినది. "నృసింహకవి చూచుటకు మెత్తగా కనబడుచున్నాడు. కాని తన కావ్యమును గూర్చి కొంత అహంకారమును ప్రదర్శించుచున్నాడు.
"యతి విటుడు గాక యుండునే... "అను పద్యము
నుగాని , కవితావిచక్షణతగల... "అను పద్యమునుగాని రాయలవారు చూచిన నేమనకొందురు. అంతటివాడు , కవికులశిరోమణి సంస్తుతులందినవాడు - కాళిదాసే,
" మందబుద్దినై కవియశస్సును గోరి అపహాస్యము పాలగుదునేమో" యనియు
" విద్వాంసులు మెచ్చువరకు నా ప్రయోగ విజ్ఞానమును శ్రేష్ఠమనుకొన" ననియు వినయనును ప్రదర్శించిరి గదా! అట్లనుకొన్న తాను చేసినదేమి?
అలనాడు రాయలవారు గండపెండెరమును పళ్ళెరమున బెట్టి సభలోని కవుల నుద్దేశించి , "సృస్కృతాంధ్రముల సమముగా కవిత చెప్పగల వారిద్దానిని స్వీకరింపు" మని కోరినను, ఎవ్వరును ముందుకు రాలేదు.
అప్పుడు రాయలవారు-
" ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా
నొద్దిక నా కొసంగుడని యొక్కరు గోరగ లేరు, లే రొకో"!
అనినారు.
అంతటతాను లేచి--
" పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే,
పెద్దన కీ దలంచినను పేరిమి నా కిడు కృష్ణరాణ్ణృపా !"
అని దానిని స్వీకరించినాడు గదా! అది యహంకారము కాదా! కవులు తమ ప్రతిభను గూర్చి అవసరమైన పట్టున నిట్లు చెప్పుకొనుచుందురు. అది యంతగా దోషము లో లెక్కకాదు. అది యొకవిధమున ఆత్మవిశ్వాసము కాని వేరు కాదు.
దానిని సాత్వికాహంకార మనవచ్చును. ఈ సాత్వికాహంకార మనునది యోగులకు గూడ నుండును.
ఇట్లు తలంచి పెద్దన నృసింహకవికి రాయలదర్శనము చేయింత మనియే నిశ్చయించు కొనినాడు.
నృసింహకవి పెద్దన యింటికి రాకపోకలు చేయుచునే యున్నాడు. ఒకసారి పెద్దన నృసింహకవి ని గూర్చి యనినాడు.
" తాము తొందరపడవలదు. విశిష్టాద్వైత రహస్యములను తెలుపు తమ కావ్యమును రాయలవారు తప్పక స్వీకరింతురనియే నా నమ్మకము. మనమింక కొంతకాల మోపికబట్టి వేచియుండుము. మిగిలిపోయినదేమి? తమకు దినబత్తెమున కిబ్బందిగా నున్నచో , నేను నా సొమ్ముతో వలసిన యేర్పాటులు చేయింతును. సందేహము
వలదు. మనము కవికులము, కవిగోత్రులము గదా! మనలో మనకు నీ, నా అని భేదము లుండకూడదు. "
పెద్దన ఔదార్యమునకు నృసింహకవి చలించిపోయి, కరిగిపోయినాడు.
ఇంతటిఔదార్యముండుట చేతనే పెద్దనగారింతటి పేరు ప్రతిష్టల నందినారని తలంచి---
" తాము చేయు ధనసహాయ మక్కర లే" దని సవినయముగా చెప్పి వెడలి పోయినాడు.
-------------------------
ఈ నాడింట బియ్యము నిండుకున్నాయి(లేవు). పిల్లలు అన్నమునకు అలమటించుచున్నారు. పెద్దవానికి దగ్గు, చిన్నవాడు జ్వరపడి నేటి కెనిమిది దినములు. ఈ జ్వరము సన్నిపాతము లోనికి దింపవచ్చునని కూడా అనుకొనుచున్నారు. ఆ వైద్యుడు సాక్షాత్తు అపర ధన్వంతరీగనుక సరిపోయింది. లేకున్న నేమయ్యెడిదో యోచింపుడు.
మందులు, మాకులు ఉచితముగా నిచ్చుటయే గాక ఉపరసములకు కావలసిన అల్లము, మిరియాలు, శొంటి , పిప్పళ్ళు మున్నగు దినుసులు కూడ ఆ మహానుభావు
డే ఇచ్చుచున్నాడు. ఇదంతయు మీ రేదో కవీశ్వరులని ఆయనగారు గౌరవముతోచేయుచున్నారు. లేకున్న డబ్బు లేకుండ మందులిచ్చు వైద్యలెక్కడుందురు. మన మాయన కెట్లు కృతజ్ఞత చూపగలమో తెలియకున్నది. ఇక ఈడేరిన ఆడపిల్లకు సంబంధముల మాట యెట్లున్నను , కనీసము ఒడలు దాచుకొనుటకు సరియైన గుడ్డలు లేవు గదా! ఒంటి నిండా చీరయుండి ఒడలు దాచుకొనవలసిన స్త్రీ , అతుకుల, బొతుకుల గుడ్డలో ఎట్లు వుండగలదో విచారింపుడు. ఈ కుచేల దారిద్య్రమెట్లు ప్రోవునో ఆలోచించరా!
" మీరు మహాకవులు, పండితులు, పౌరాణికులు గదా! ఎవ్వరి నాశ్రయించినను నింతసొమ్ము పుట్టదు! ఏ దేవాలయములో కూర్చుండి పురాణము చెప్పుకున్నచో నాలుగు వరాలు చేతికిరావు. చిన్ననాట నేర్చిన శిల్పవిద్య యున్నది కదా! ఆ టెంకణాచార్యులవారి శిల్పవిద్యాలయమున కేగి , ఏదో యొకపని చేసికొనగూడదా!
అదియొక మహాశిల్ప గురుకులము కదా! అచ్చట మిమ్మొక ఆచార్యునిగానైనను నియమింపవచ్చునే! పోనీ, ఏ దేవాలయమందో , కంచువిగ్రహములు చేయుటకో, శిలా ప్రతిమలను చెక్కుటకో పూనుకొనవచ్చును కదా! సారస్వత విద్యలనే గాక , కర్మవిద్యలను గూడ కైవసము చేసికొన్న రెండంచుల కత్తిగదా మీరు!
" రాజదర్శనము చేసికొనవలెను. వారి మన్నలనే పొందవలెను , వారికే కావ్యము అంకితమీయవలెను అని మీకేల పట్టుదల? రాజాస్థానము లెంత దుష్ప్రవేశములో ఎరుగరా? అందలి కవి, పండితులకు కవితా పాండిత్యము లున్నంతగా హృదయము లుండవు గదా! వారు తమ స్వార్థమును విడనాడి , మీవంటివారి కేల ప్రవేశమిప్పింతురు. అలనాడు శ్రీనాథ కవి సార్వభౌముడే ప్రౌఢదేవరాయల యాస్థానములో ప్రవేశింప నెన్ని ఇబ్బందులు పడెనో, మీరే చెప్పితిరి గదా! ఆ సహృదయ శిఖామణి ముమ్మనార్యుడుండుట వలన ఆయన దయచేత ఆ కవిసార్వభౌమునకు ప్రవేశము చిక్కినదిగానీ , లేకున్న నేమయ్యెడిదో? శ్రీనాథునికా ముత్యాలశాలలో కనకాభిషేక గౌరవము జరిగెడిదేనా! గుణము గ్రహించువారు గ్రహించినను, మత్సరము వీడి దానిని
లోకమునకు జాటువారు లేకున్నను, ఎంతటిగొప్పవారైనను అడవిబూచిన పువ్వులుకాక తప్పదు.
ఇది యంతయు నేను మీకు చెప్పగల దాననని చెప్పుట లేదు. నేటి మన కుటుంబ స్థితి యట్లున్నది గనుక, ఈ దీర్ఘ సంభాషణము చేయవలసి వచ్చినది. క్షమించి ఇట్టి దుర్దశ లోనైనను కర్తవ్యమును నిర్ణయించుకొందురనియు ,
బిడ్డలను బ్రతికింతురనియు వేడుకొనుచున్నాను. "
నృసింహకవి భార్య ఆండాళమ్మ ఈ మాటలనుచుండగనే వైద్యుడు వచ్చి మంచము పైనున్న రోగిపిల్లవానిని పరీక్షించెను.
" ఇది సన్నిపాతజ్వరము. ఇకనుండి విషజ్వర
లక్షణములు గూడ ప్రవేశించు సూచనలున్నవి. రోగికి సేవలు బాగుగా జరుగుచుండ వలెను. ఒకవేళ రాత్రికి పిచ్చిపిచ్చి మాటలవీ ప్రారంభము కావచ్చును. రోగి గుడ్డలు పీకి
వేసుకుని బయటకు పరుగెత్త యత్నించ వచ్చును. మీరు మిక్కిలి మెలకువతో బిడ్డను కాపాడు కొనవలయును. ఈ రెండు మందు కుప్పెలను అరగదీసి , జీలకర్ర ధనియాల
రసముతో కలిపిపోయుడు. ! నాలుగు గడియల కొకసారి ఈ మాత్రలను వాడతూండండి. ! ఇవిగో ధనియములు, జీలకర్ర యని రెండు పొట్లముల నామె చేతికిచ్చి ఇంకను ఇట్లనినాడు.
" అమ్మా। మీరు అధైర్యపడవలదు. నాకు రాజవైద్యులే గురువులు. నేను వారితో గూడ సంప్రతించి , ఎంత విలువగల మందులైనను వాడి మీబిడ్డను బ్రతికింపగలను. మీ వంటి విద్యావంతమైన కుటుంబమునకు సేవ చేసెడి భాగ్యము కలిగినందుకు ఎంతయో సంతసించుచున్నాను. " అని వెడలిపోయెను.
ఇది యంతయు చూచుచున్న నృసింహకవి గుండె నీరైనది. అతడు కన్నుల నీరు గ్రుక్కుకొనినాడు. ఇట్టి ఘట్టములలో పురుషుల కన్న స్త్రీలే ధీరమంతులుగా నుందురాయేమి? ఏమోగాని, ఆండాళమ్మ మాత్రము గుండె చెదరనీయక , ఆ యాపద నెదుర్కొనుటకు సిద్దమయినట్లు ఆమె వైఖరియే స్పష్టము చేసినది.
రోగి కంటెను చిన్నపిల్లలు " అమ్మా, అన్న కేమిటమ్మా! పిచ్చ, పిచ్చేమిటి?" అని వెంటబడుచున్నారు.
ఆ యిల్లాలా బిడ్డలను ఒడిలోకి పొదుపుకొని " ఏమియు లేదు. అన్నయ్యకు ఇక రెండుమూడు రోజులలో తగ్గిపోవును . వాడు మీతో ఆడుకొనును. మీకు పాఠములవీ చెప్పును". అని యూరడించినది.
భార్య పలుకులు, వైద్యుని పలుకులు నృసింహకవి హృదయమును కదలించి వైసినది. హరిశ్చంద్రుడాయన హృదిలో మెదలినాడు. ఆండాళమ్మ ఆయనకు మేనమామ కూతురే. ఆ మేనమామయే , నృసింహకవిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి ఇంతవానిని జేసినాడు. మేనల్లుని కవితాచాతురికి మెచ్చుకుని , తన కూతురినే యిచ్చి పెండ్లి చేయుటయే గాక , తన ఏకైక పుత్రికతో బాటు తనకున్న ఆస్తిలో భాగము కూడ కుమార్తెకు పంచి యిచ్చినాడు.
ఆండాళమ్మకున్న నగలుకూడ అమూల్యమైనవి. అవి యన్నియు ఆ తండ్రి యౌదార్యమువలన నేర్పడినవే. ఆ నగలు కూడ విద్యానగరమునకు వచ్చిన పిమ్మట దినక్రమమున వణిజుల యింటికి నడిచినవి. ఇంకొక్క
నగ మిగిలియుండునని నృసింహకవి భావన. దానిని నగయందురో లేదో తెలియదు. అది యామె మాంగళ్యము. అదియును ఆమె పుట్టించివారు చేయించినదే. దానిపై
నవరత్నములు గూడ పొదగబడియున్నవి. దాని నమ్మినచో చాల ధనము రాగలదు.
దరిదాపొక రెండు నెలలైనను అ ధనముతో జీవింపవచ్చును. ఇప్పటి కష్టముల నుండి యది గట్టెక్కించగలదు. నృసింహకవికి రోగిని చూచినకొలది గుండె చెఱువగుచున్నది. ఆతడిక చేయునదేమియు లేక భార్యతోననినాడు.
" నీ మాంగల్యమున్నది కదా! దాని నమ్మి వెచ్చములు తేగూడదా! దానికి బదులుగా పసుపుకొమ్ము కట్టుకొనవచ్చును గదా! ఇట్లనుచున్న నాధౌర్భాగ్యమునకు నేను బాధ
పడుచునే యున్నాను. అయినను స్థితిగతులిట్లున్నవి. ! నేనేమి చేయుదును. ! నేటితోఏదో మార్గము త్రొక్కుదును. ఈ ఆపదను దానితో గడుపుము".
భర్త యీమాట లనునప్పటికి ఆండాళమ్మకి దుఃఖము ఆగలేదు. దుఃఖము ముంచుకొనివచ్చినది. అయినను మగని నియమశీలతకును, " కడుపుకూటికి ఒరులను వేడబోవ" నను దీక్షకును ఆమె లోలోన సంతోశ మందినది.
" ఆ మాంగల్యమును మూడు నెలలనాడే విక్రయించి డబ్బుతెచ్చుటయైనది. ఇంత కాలమదియే మన ప్రాణములు నిలిపినది. ఆ మాంగళ్యస్థానమున కట్టుకొన్న పసుపు కొమ్ము ఇదిగో!" అని ఆ యిల్లాలు పయ్యెద లోపలి నుండి మంగళసూత్రమునకు గట్టిన పసుపుగొమ్మును వెలికి దీసి చూపినది. ఇక నృసింహకవి యెడద ఎట్లు నీరైనదో
చెప్పలేము. ఆ యిల్లాలు కుటుంబ నిర్వహణ దీక్ష కాతడెంతగనో సంతసించినాడు.
తన మేనమామ, తన బిడ్డ నీయల్లుడెంతగనో సుఖపెట్టగలడని తన కిచ్చి చేసినాడు. తాను సుఖపెట్టురీతి ఇట్లున్నది. ఇకనాతడక్కడ ఒక్క క్షణమైనను నిలువలేక
పోయినాడు. భారము నంతయు ఆ శ్రీరంగనాథునిపై వేసి ఆతడీవలకు వచ్చినాడు.
నృసింహకవి లౌకికుడే యైనచో , తిమ్మకవీంద్రునో, రుద్రకవినో ఆశ్రయించి కార్య సాఫల్యము చేసికొనెడివాడే! అదికూడ అతనికి చేతకాదు. అయినను, పెద్దన కాదన
లేదు గదా! " కొంచెమోపికపట్టిన చూతు" నన్నాడాయెను. కాని , నృసింహకవికి మరల పెద్దన వద్దకు పోవుటకు మనసొప్పలేదు. ఇప్పటి కెన్నిసార్లో ఆయన చుట్టును
తిరుగుట అయినది. ఇంకను వెంటబడుట కాతని కిష్టము లేకపోయినది.
అతడు, దూర్జటి కవీంద్రులు అంతర్ముఖుడై యేవేవో భక్తసాధనలు చేయుచున్నాడని విన్నాడు. ఆయన కడకు పోయినచో పని కాగలదేమో యని అతనికి తోచినది. నృసిం
హకవి దూర్జటిగారింటి కేగి తన రాకకు గల నిమిత్తమును ఎఱుక పరిచినాడు.
దూర్జటి తానప్పుడే వ్రాసిన పద్యముగల తాటియాకును నృసింహకవి చేతి కిచ్చినాడు. అందిట్లున్నది.
"రాజుల్మత్తులు, వారిసేవ నరక ప్రాయంబు , వారిచ్చు నం
భోజాక్షి చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్ , తదపేక్ష చాలు , బరితృప్తిం బొందితిన్ , జ్ఞాన ల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహాస్తీశ్వరా!"
దూర్జటికవి తన సంస్కారములకును ప్రవృత్తికిని దగినట్లు నృసింహకవి నుద్దేశించి------
" శ్రీకృష్ణదేవరాయలవారు, నేను వర్ణించిన రాజకోటిలోనికి రారు. అందుకనియే నేనింకను వారికొలువును వీడలేదు. అసలు రాయలవారు మెచ్చనంత మాత్రాన , ఆయన కంకితమీయనంత మాత్రాన కవుల కావ్యములు గుణహీనములగునా?
"సన్తఃపరీక్షాస్యతర ద్భజన్తే" అను సూక్తిని మరచినారా? సత్పురుషులు గుణమున్న దానిని వీడలేరు. మీ గ్రంథము విశిష్టద్వైత తత్వప్రతిపాదక మంటిరిగదా! అట్టి దానిని శ్రీరంగనాథునికే అంకితమిచ్చిన మీ జన్మతరించునే! ఇంతటి భక్తశిఖామణివి , మరల నీ యైహిక జంఝాటములోనికి దిగనేల!" అని చెప్పుటయే కాక , కాళ
హస్తీశ్వర శతకమునుండి కొన్ని వైరాగ్య బోధకములైన కొన్ని పద్యములను గూడ చదివినాడు.
నృసింహకవి మీద దూర్జటి యుపదేశము పనిచేసినది. అసలిదివరకే అతని తండ్రి కవికర్ణ రసాయనమును భగవంతున కంకితము చేయుమని చెప్పినాడు.
నృసింహకవి పితృవాక్యము నప్పుడు పాటింపజాలక యీ యిబ్బందుల నన్నింటిని కొని తెచ్చుకున్నాడు. అతని కిప్పుడు " పెద్దలవారి మాట , పెరుగన్నపుమూట" అని
తెలిసి వచ్చినది. ఏనాడో మరణించిన తండ్రి స్థానములో నుండి దూర్జటికవీంద్రుడీ సదుపదేశమును చేసినాడని నృసింహకవికి తోచినది. అతడు దూర్జటికి భక్తితాత్ప
ర్యమున కృతజ్ఞత లర్పించుకొని యింటికి చేరుకొన్నాడు.
వైద్యుడు చెప్పినట్లు రాత్రికి పిల్లవానికి సన్నిపాతలక్షణములు ప్రవేశించినవి. అతడు వెర్రిచూపులు చూచును. పిచ్చిపిచ్చిగా మాట్లాడును. గుడ్డలు పీకివేసుకొనును.
మంచముపై నిలువక, పరుగెత్తబోవును. వైద్యుడు తన గురువైన రాజవైద్యుని గూడ తీసుకునివచ్చి చూపినాడు. ఆతడును తన శక్తికొలది ప్రయత్నించినాడు. ఎంత గొప్ప వైద్యుడయినను , మందుపోయునే గాని, ఆయువు పోయలేడు గదా! పదునొకండవ రాత్రి గరళముకూడ పోసినారు. ఆయుర్వేదములో గరళము పోయుట తుది వైద్యము. దానితో రోగము కుదిరిన కుదురును! లేకున్న యమదర్శనము తప్పదన్నమాట. గరళము పోసిన పిమ్మట , పిల్లవాడు బాగుగా తేరుకొనినాడు. తల్లిదండ్రులకు, అన్న
దమ్ములకు చక్కగా మాటలు చెప్పినాడు. కవికర్ణరసాయనము లోని పద్యములను పెక్కింటిని చదివినాడు. తండ్రి చెప్పుచుండగా ఆ కావ్యములోని కొంతబాగమునువ్రాసిన దా చిరుపాపడే. ! అందుచే వాని కందలి పద్యములనేకములు కంఠస్థమయినవి. ఇక కుమారుడు బ్రదుకునని తల్లిదండ్రులాసపడినారు. కాని ఇది యంతయు రోగచర్యయు, గరళము యొక్క ప్రభావము మాత్రమే. రోగము తగ్గుటకాదు. ఆరిపోయెడి
దీపము చివరి కెక్కువగా వెలుగులు విరజిమ్మును గదా! కొంత సేపటికి పిల్లవాని కాలుసేతులు చల్లబడినవి. మరుక్షణముననే ఆ యిల్లు రోధన ధ్వనులతో నిండిపోయినది.
----------------------------------
ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు , తన కూతురు మోహనాంగితో చదరంగమాడు చుండెను. ఆటలో మోహనాంగి తడబడుచున్నది. ఓటమి తప్పదన్న నిశ్చయంలో నున్నది. ఇట్టిసందర్భములలో చదువుకొన్నవారికి సమయోచిత పద్యములు , పద్య పాదములు జ్ఞప్తికి వచ్చుచుండును. ఆమె చాలసేపాలోచించి తనకు గలిగిన సంకటమును గూర్చి -----
"ఉద్దతుల మధ్యమున బేద కుండ దరమె"
అంతట రాయలా కవితాసౌభాగ్యమునకును, వర్ణనాచాతురికిని ఆశ్చర్యమునొంది
" ఈ పద్యము నే సందర్భమున వ్రాసితివమ్మా!" అని అడిగెను. అందుకు మోహనాంగి-" ఈ పద్యము నేను వ్రాసినది గాదు నాన్నగారూ! ఒకనాడు మన నాగిని తెచ్చి
నా కిచ్చినది. సందర్భమునకు సరిపడగా నేను చదివినాను" అని జవాబిచ్చినది.
రాయలు వెంటనే నాగిని ని పిలిపించి " నీ కీ పద్యమెక్కడిది? దీని వృత్తాంతమేమి? అని యజిగెను.
" ప్రభువులు సావదానముగా వినవలయును. ఆయన దే యూరో నాకు తెలియదు.
ఆయన పేరు టంకసాల నృసింహకవి యట. మాంధాతచరిత్రమును "కవికర్ణరసాయన" మనుపేర ఆరాశ్వముల కావ్యముగా రచించినాడట. దానిని దేవరవారి కంకిత మీయదలంచి నగరానికి వచ్చినాడట. తమ్ము దర్శింపవీలు చిక్కలేదట.
అంతట బహు కుటుంబమును నిర్వహింపజాలక , తన పద్యముల నమ్ముకొని జీవితము చేయనారంభించినాడట. నేనీ వృత్తాంతమును రాజవీధిలో విని, కొన్ని పద్యములను
పరిశీలించి ఆయనకు కొంత ధనమిచ్చి రెండు పద్యములను తెచ్చినాను. అందొకటి అమ్మగారికి కానుకగా యిచ్చినాను.
" రెండవ పద్యమేది?"
" యతి విటుడుగాక టెట్ల స్మదీయ
కావ్యశృంగార వర్ణనాకర్ణనమున!
విటుడు యతి గకపోరాదు వెస మదీయ
కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున!"
ఇది, రెండవ పద్యము. "
ఈ పద్యము విన్నపిమ్మట రాయలు ఆట చాలించినాడు. ఆతని హృదయములో నృసింహకవి ప్రవేశించెను. రాయలిట్లు తలపోయసాగెను. -------
" నృసింహకవి యెంతవాడు కాకున్న ఇట్టి ప్రతిజ్ఞ చేయజాలును. ఈ పద్యమున వర్ణన ఎంత చక్కగా నున్నది. వర్ణనమున ఇంకెంత చాతుర్యమును ప్రదర్శించియుం
డును. వర్ణనమునే ఇంత సొంపుగ చేసిన కవి , కావ్యము నింకెంత రమణీయముగా వ్రాసియుండును. ఇట్టికవి తన పద్యములను అమ్ముకొని బ్రదుకవలసివచ్చినదా!
ఈ పద్యవిక్రయము , తన యేలుబడిలోని విద్యానగరమందే - తాను జీవించి యుండగనే జరిగినదా!"
ఇట్లుతలచి చారులను పిలిచి నగరమంతయు వెదికి నృసింహకవిని తనకడకు తీసికొని రావలసినదని యాజ్ఞాపించెను. వారు రెండు మూడు వారములు పట్టణమంతయు గాలించి వచ్చి" ఆ కవి కొంతకాలము క్రిందటనే విజయనగరమును వీడి శ్రీరంగక్షేత్రమున కేగినాడట" అని చెప్పినారు.
ఆ మాటవిన్న రాయలు పడిన బాధ యింతింత గాదు. " ఒక మహాకవికి తన ఆసరా దొరకకపోవుట, అది కారణముగా నాతడు పద్యవిక్రయము చేసి జీవించుటయే గాక , కడకు
నగరపరిత్యాగము కూడ సేయుట- తీరనట్టి సరస్వతీ ద్రోహముగా రాయలకు తోచినది. రాయలకు అంతర్వాణులేమి, కవులేమి సాక్షాత్తు సరస్వతీ స్వరూపులే! శిల్పులు అపర విశ్వకర్మదైవతములే! ఇట్టిస్థితిలో ఒక కవికి కలిగిన నష్టమున కాయన చింతించుటలో నాశ్చర్యమేమి? ఆయన శ్రీరంగమున కేగి నృసింహకవిని దీసికొని
రావలసినదని చారుల కాదేశించెను.
---------------------------
ఒకనాడు పెద్దన రాయలను సందర్శింప వచ్చి నృసింహకవిని గూర్చియు , ఆయన కావ్యమును గూర్చియు చెప్పినాడు. ప్రభు దర్శనమునకు తీసికొని రాదలచి , తాను నృసింహకవికి కబురు పంపగా , ఆతడప్పుడే శిల్పివాడలోని తన బాడుగ యింటిని వదలి శ్రీరంగక్షేత్రమునకు వెడలిపోయినట్లు భృత్యుడు చెప్పినాడని పెద్దన రాయలకు విన్నవించుకొని విచారపడినాడు.
ఆ సమయమున , అచటనే యున్న రాజవైద్యుడు సంగతిని గ్రహించి నృసింహకవి కుటుంబ విషయములను, ఆయన భార్య యోగ్యతను , వారి పుత్రుడు సన్నిపాత జ్వరముచే మరణించుటయు, కడకు నృసింహకవి దూర్జటి కవీంద్రుని బోధచేత విరక్తుడై శ్రీరంగమున కరుగుటయు మొదలగు సంగతులను రాయలకు నివేదించెను. దూర్జటి బోధ నృసింహకవి కూఱట గల్పించియుండ వచ్చునని రాయలు
భావించెను.
ఇంతలో శ్రీరంగమున కేగిన చారులు వచ్చి" నృసింహకవి శ్రీరంగములో శ్రీరంగేశ్వరుని సేవలో మునిగి తేలుచున్నాడనియు , ఆయన ఆ దేవాలయ శిల్పకార్యములలో తలమునకలై యున్నాడనియు , ఆయనకు ప్రపంచవిషయము లేవియు పట్టనట్లు లేవనియు , " ప్రభువులు తమ కభ్యంతరము లేనిచో శ్రీరంగధాముని సేవల కొక్కసారి దయచేసి , తానొనర్చు శిల్పకార్యములను దర్శించి తన్ను ధన్యునిజేయ గోరుచున్నాడని కృతజ్ఞతాపూర్వకముగా మనవి చేసికొన్నట్లు నివేదింపు" మని చెప్పారని మనవిచేసిరి.
రాయలు , నృసింహకవి యోగ్యమార్గమునే యెన్నుకొన్నాడని సంతసించెను. పెద్దనయు తృప్తిపడెను. ------
------ శుభంభూయాత్-------------------//--------------------------
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
BALA KAMESHWARA RAO • 12 days ago
Wonderful story Excellent