టెక్నిక్
- Lakshmi Chivukula
- Dec 26, 2022
- 3 min read

'Technique' New Telugu Story
Written By Lakshmi Chivukula
రచన: లక్ష్మి చివుకుల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ఏమండీ! ఈరోజు మా కాంతం కక్కి కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్లాం కదా.." భర్తకు ఏదో చెప్పాలని ఆరాటంగా మొదలు పెట్టింది ఉమ.
"అవును వెళ్లారు. నన్ను రమ్మని పిలిస్తే నేను రాలేదు. ఇంతకీ ఏమయింది.. పిల్ల నచ్చిందా.. మీ కాంతం కక్కి కొడుక్కి?" భార్య చెప్పేది పూర్తిగా వినకుండానే మధ్యలోనే అడిగాడు రాంబాబు.
"ఫరవాలేదు. పిల్ల బానే వుంది కానీ మరీ బొత్తిగా ఏమీ లేని వాళ్లండీ. కనీసం కూర్చోడానికి సరి అయిన కుర్చీలు కూడా లేవు. మమ్మల్ని చూసి, పక్కింటికి వెళ్లి కుర్చీలు తెచ్చి వేసి, కూర్చోబెట్టారు." నిష్టూరంగా చెప్పింది ఉమ.
"నేను అప్పటికీ మొత్తుకుంటూనే వున్నా, పెళ్లి చూపులకి అంతమంది ఎందుకు వెళుతున్నారు.. పెళ్లి కొడుకు, తల్లి, చెల్లెలు వెళితే చాలు అని. పటాలం అంతా కట్ట గట్టుకుని పోయారు. పాపం వాళ్లెంత ఇబ్బంది పడ్డారో.." బాధ పడ్డాడు రాంబాబు.
"వాళ్లు ఏమీ ఇబ్బంది పడిపోలేదు కానీ మీరు ఆట్టే బాధ పడకండి. ఏదో కాస్త టీ నీళ్లు పోసారు కానీ ఎవరికీ స్వీట్ హాటు ఏమీ పెట్టలేదు లెండి. పైగా 'కతికితే అతకదండీ' అని ఒక సామెత కూడా ఉపయోగించారు.
ఎంత లేని వాళ్లు అయితే పెళ్లి చూపులకి గుమ్మం లోకి వచ్చిన మగపెళ్లి వారికి ఒక స్వీట్ హాటు పెట్టరుట అండీ" మూతి మూడు వంకర్లు తిప్పుతూ మాట్లాడింది ఉమ.
"సరేలే. మీరు ఏమైనా తినడానికి వెళ్లారా ? ఏమిటీ ? ఇంతకీ సంబంధం విషయం ఏమయింది?"
"నేను వెళితే ఆ పని సక్సెస్ కాకుండా వుంటుందా ? ఏమనుకుంటున్నారు నా గురించి” పనిలో పని ఉమ తన గొప్ప చెప్పుకోవడం మొదలు పెట్టింది.
మా కాంతం కక్కి ఏది అడిగినా కూడా 'మా వల్ల కాదండీ! మేము తూగలేమండీ!' అంటూ దేనికీ ఒప్పుకోలేదు ఆడపెళ్లి వారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్ట పడ్డారని పెళ్లికి ఒప్పుకున్నారు మా కాంతం కక్కి వాళ్లు."
"అదేమీ కాదు కానీ ఇప్పటికే మీ కాంతం కక్కి కొడుక్కి చాలా సంబంధాలే చూసారు. కట్నాలు కానుకలు దగ్గర ఎన్ని సంబంధాలు వదిలెయ్య లేదు? ఇప్పటికే ఆ అబ్బాయికి పెళ్లి ఆలస్యం అయిపోతోంది. ఇప్పుడు అబ్బాయి పట్టు పట్టాడని ఏమీ అనలేక కాంప్రమైజ్ అయ్యారు మీ కాంతం కక్కీ వాళ్లు. నాకు తెలియదా..”
***
ఎటువంటి ఆడంబరాలు కట్నకానుకలు ఇచ్చి పుచ్చు కోవడాలు ఏమీ లేకుండా పెళ్లి సింపుల్గా గుడిలో చేసారు.
ఒక నాలుగు నెలలు తరువాత ఉమ అన్న కొడుక్కి పెళ్లి కుదిరితే, పెళ్లి పిలుపులకు ఉమ బంధువులను తీసుకుని వాళ్లింటికి వెళ్లింది. ఆ ఇల్లు చూసి ఆశ్చర్య పోయారు అందరూ. పొరపాటున వేరే ఇంటికి వెళ్లలేదు కదా అని సందేహం కూడా వచ్చింది.
ఎందుకంటే ఆ ఇంట్లో సోఫా సెట్, రౌండ్ గా మధ్యలో పెద్ద టీపాయి, పెద్ద టివి, డబల్ డోర్ ఫ్రిజ్, ఇంటి ముందు కొత్త బండి..
ఇదేమి విచిత్రం.. నాలుగు నెలల క్రితం ఇంట్లో ఇవేమీ లేవు. కూర్చోడానికి కనీసం కుర్చీలు కూడా లేవే.. ఇప్పుడు ఇవన్నీ ఏమిటీ?
అంటే అమ్మాయి పెళ్లి అయ్యేవరకూ ఏమీ లేని వాళ్లలా నటించారా? కట్నాలు కానుకలు ఇవ్వవలసి వస్తుందని డ్రామా లాడారా?
ఇంటికి వచ్చాక చాలా సార్లు పదే పదే ఆ విషయమే తలుచుకుంటూ ఉమ ఆశ్చర్య పోయింది.
"తాటిని తన్నేవాడు ఒకడు వుంటే వాడి తల తన్నేవాడు మరొకడు వుంటాడని' సామెత చెప్పి నట్టుగా వాళ్లు ఆ రోజు అలా ప్రవర్తించి నందువలనే మీ కాంతం కక్కి వాళ్లు అన్నింటిలోనూ అలా సద్దుకుని పెళ్లి చేసుకున్నారు. లేకపోతే వాళ్లని పూర్తిగా అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరేవారు.
మా చెల్లెలు పెళ్లిలో మేము బాధ పడలేదూ. వాళ్లు అడిగిన కట్నకానుకలు ఇచ్చి కూడా మమ్మల్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారు.
మీ కాంతం కక్కి లాంటి వాళ్లకి అలా జరిగితే గానీ దారిలోకి రారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ మాత్రం కొత్త టెక్నిక్ లు నేర్చుకుని వుండాల్సిందే." రాంబాబు ఉమని సమాధాన పరిచేడు.
##-----------##
లక్ష్మి చివుకుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు - లక్ష్మి చివుకుల
నా మొదటి కథ 1984 వ సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక లో ప్రచురించారు. ఆనాటి వార, మాస పత్రికలలో నా కథలు దాదాపు ప్రచురితం అయ్యాయి. సంసార సాగరంలో కొట్టుకు పోయి కొంత కాలం విరామం తీసుకుని పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుని ఈమధ్యనే మళ్లీ రచనలు మొదలు పెట్టాను.
నేను నివసించేది హైదరాబాద్ లో.
😄😄 మంచి టెక్నిక్. కానీ అబ్బాయి వాళ్ళమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడని తెలిసినప్ఫుడే ఉపయోగపడుతుంది లేకపోతే బెడిసికొట్టే ప్రమాదముంది.