top of page

తెలుగు పద విన్యాసం

Writer: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #తెలుగుపదవిన్యాసం, #TeluguPadaVinyasam, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 42

Telugu Pada Vinyasam - Somanna Gari Kavithalu Part 42 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/03/2025

తెలుగు పద విన్యాసం - సోమన్న గారి కవితలు పార్ట్ 42 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


తెలుగు పద విన్యాసం

----------------------------------------

అల్పబుద్ధే చెరుపు

బాధ పెట్టే కురుపు

వదిలిపెడితే మేలు

దూరముంటే చాలు


దిద్దుకుంటే మలుపు

కష్టపడితే గెలుపు

ఊబిలాంటిది అప్పు

తెచ్చిపెట్టును ముప్పు


ముఖ్యమెంతో పొదుపు

మదిని చేయుము అదుపు

జీవితాల్లో జయము

పారిపోవును భయము


కాదు మంచిది బలుపు

మనసుకుండదు అలుపు

వినయశీలత ఘనము

గౌరవింతురు జనము









నిప్పుల కొలిమి పుడమి

----------------------------------------

ఎండాకాలం వచ్చింది

ఎండలు మెండుగా తెచ్చింది

జీవులుండే భూలోకాన్ని

నిప్పుల కొలిమిగా మార్చింది


ఉష్ణోగ్రతలే పెంచింది

మేనులను మాడ్చి వేసింది

గరిష్ట స్థాయికి చేరుకుని

వెన్నులో వణుకు పుట్టించింది


బయటికెళ్ళాలంటే భయము

వృద్ధులకు ప్రాణసంకటము

వడదెబ్బ కొట్టిందంటే

విలవిలలాడేను ప్రాణము


గ్రీష్మ ఋతువా!కోపమా!

స్వార్థ మానవుల తప్పిదామా!

పచ్చని చెట్లను నరికినందుకు

ప్రకృతి మాత ఉగ్రరూపమా!















అద్దాల సౌధము జీవితము

----------------------------------------

అద్దాల సౌధమే

అందాల జీవితము

చేసుకో! భద్రము

లేక అగును ఛిద్రము


పొరపాట్లు రాళ్లు గనుక

తాకితే ముక్కలగును

నిర్లక్ష్యపు నీడన

ఉంటే పతనమగును


జీవితమే గొప్పది

నీ చేతిలో ఉన్నది

మెళకువలు పాటిస్తే

ఎంతైనా మంచిది


నాశనం అయ్యాక

చింతిస్తే వ్యర్ధము

మనిషి జన్మ ఉన్నతము

ఉండాలోయ్! అర్థము











నాలుగు మంచి మాటలు

----------------------------------------

మాట్లాడే ప్రతి మాట

అవ్వాలి పసిడి మూట

గుండె చెదిరిన వారి

బ్రతుకులోన కంచుకోట


పేరు తెచ్చేది మాట

మచ్చ తెచ్చేది మాట

నోరు జారితే ముప్పు

పోరు కోరితే తప్పు


మాటెంతో శక్తిగలది

రాజ్యాలను కూల్చగలదు

పదునైన ఆయుధమది

కాపురాలను చీల్చగలదు


జర జాగ్రత్త! నోటితో

మాట్లాడే మాటతో

ఆచితూచి అడుగేయి!

ఇక బ్రతుకు వెన్నెల రేయి!












చెప్పుడు మాటలు చెరుపు!

----------------------------------------

చెప్పుడు మాటలతో

చెడిపోకు మిత్రమా!

పనికిరాని వాటితో

ఆపద అవసరమా!


కొండెగాళ్ల మాటలు

తేనె పూసిన కత్తులు

అలకిస్తే గనుక

ఆగమగును బ్రతుకులు


చెప్పుడు మాటలతో

కూలును కాపురాలు

కలుషిత మనసులతో

చీలును కుటుంబాలు


ఎప్పుడు వినకూడదు

చెప్పుడు మాటలను

అప్పుడే మేలగును

వాస్తవమే తమ్ముడు!


-గద్వాల సోమన్న


Comments


bottom of page