వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Telusa Manasa' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 16/02/2024
'తెలుసా మనసా' తెలుగు కథ
రచన: L. V. జయ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మంచి కాలేజ్ లో సీట్ వచ్చినందుకు స్కూటీ గిఫ్ట్ గా ఇచ్చారు జాగృతి తల్లితండ్రులు. వాళ్ళ ఇంటి నుండి కాలేజ్ కి బస్సు లేకపోవడం తో స్కూటీ చాలా అవసరం జాగృతికి. మొదటి రోజు చాలా ఆనందంగా తన కొత్త స్కూటీ మీద కాలేజ్ కి బయలుదేరింది.
కాలేజ్ క్యాంపస్ చాలా బాగుంది. మెయిన్ బిల్డింగ్, పక్కనే పెద్ద ప్లే గ్రౌండ్. క్యాంపస్ నిండా చెట్లు. చెట్ల మధ్యలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ, మంచి గాలి ఆస్వాదిస్తూ తనకి దక్కిన అదృష్టానికి చాలా సంతోషింది జాగృతి.
తనకి ఎవరో అడ్డు రావడంతో బండి ఆపింది. "ఫస్ట్ ఇయరా" అడిగాడు అడ్డుగా వచ్చిన అబ్బాయి.
అవునంది జాగృతి.
"పేరు ఏంటి?".
జాగృతి అని చెప్పింది.
"స్కూటీ కొత్తదా? గిఫ్ట్ ఇచ్చారా మీ పేరెంట్స్? " కొంచెం వ్యంగంగా అడిగాడు ఆ అబ్బాయి. అవునని చెప్పింది జాగృతి.
"ఫస్ట్ ఇయర్ వాళ్ళు బండి మీద రాకూడని తెలియదా" అడిగాడు ఆ అబ్బాయి.
తెలియదని చెప్పింది జాగృతి.
"తెలియదు కాదు. తెలియదు సర్ అను. " అన్నాడు ఆ అబ్బాయి.
" నా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పవా "అంటూ కొంచెం దూరంలో కూర్చున్న తన ఫ్రెండ్స్ ని చూపించాడు.
"గుడ్ మార్నింగ్ సర్ " అంది జాగృతి.
"ఇంక వెళ్ళు" అన్నాడు ఆ అబ్బాయి.
‘రాగ్గింగ్ మొదలు అయ్యింది. రేపటి నుండి స్కూటీ మీద రాకూడదంటే ఎలా వస్తాను కాలేజ్ కి’ అనుకుంటూ వెళ్ళింది జాగృతి. వెనక నుండి నవ్వులు వినిపించాయి.
తన క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో వెతుక్కుని వెళ్లి కూర్చుంది జాగృతి. ప్రొఫెసర్ ఇంకా రావటానికి టైం ఉండడంతో, అందరూ తమ పక్కన వున్న వాళ్లతో మాట్లాడుతూ పరిచయాలు పెంచుకుంటున్నారు. జాగృతి పక్కన కూర్చున్న అమ్మాయి పేరు పల్లవి. ఇద్దరు మొదటి రోజే మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
తన బండిని ఆపిన అబ్బాయి వచ్చాడు క్లాస్ రూమ్ లోకి. క్లాస్ మొత్తం లేచి నించొని " గుడ్ మార్నింగ్ సార్ " అన్నారు.
వెనకనే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్లందరికీ కూడా "గుడ్ మార్నింగ్ సార్" అంటూ లేచి నుంచున్నారు క్లాస్ మొత్తం.
అందరి దగ్గరికి వెళ్లి, వాళ్ళ పేర్లు, ఊర్లు తెలుసుకున్నారు ఆ అబ్బాయి ఫ్రెండ్స్. అమ్మాయిలని, అబ్బాయిలని పాడమని, డాన్స్ చెయ్యమని అడిగారు. అందరూ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసారు. రేపటికి ఇంకా బాగా పాటలు, డాన్సులు నేర్చుకోండి అని చెప్పి వెళ్లారు. "ఓకే సర్" అంటూ అందరూ కూర్చున్నారు.
పల్లవి అంది జాగృతితో " అమ్మయ్య నన్ను అడగలేదు పాడమని, డాన్స్ చెయ్యమని. మా అన్నయ్య డ్రాప్ చేసాడు ఇక్కడ. ఎవరా అబ్బాయి అంటూ ఏడిపించారు వీళ్ళు. నిన్ను కూడా ఏమి అడగలేదు వాళ్ళు. ఏం?" అడిగింది పల్లవి.
"నాకు కూడా ఆల్రడీ రాగ్గింగ్ అయిపొయింది ఈ రోజుకి. కాలేజ్ కి నేను నా స్కూటీ మీద వచ్చాను. నన్ను ఆపి ఇంకెప్పుడు రావద్దని వార్నింగ్ ఇచ్చారు " అంది జాగృతి.
మర్నాడు కూడా క్లాస్ కి వచ్చారు ఆ అబ్బాయి, ఆ అబ్బాయి ఫ్రెండ్స్. కొంతమందిని పాడమని, కొంత మందిని డాన్స్ చేయమని అడిగారు. పల్లవి ని లేచి నించోమని క్లాస్ అందరిని చూస్తూ "ఈ అమ్మాయి పేరు పల్లవి, ఇప్పుడు మన కోసం ఒక పల్లవి పాడుతుంది" అని అనౌన్స్ చేసాడు ఆ అబ్బాయి.
పల్లవిని చూస్తూ " పల్లవి, తెలుసా మనసా పల్లవి పాడు " అన్నాడు.
భయపడుతూ పాడినా చాలా బాగా పాడింది పల్లవి. క్లాస్ అందరూ క్లాప్స్ కొట్టారు.
ఆ అబ్బాయి మాత్రం " రేపటి నుండి నేను ఎక్కడ కనపడినా ఈ పాట పాడు" అన్నాడు.
" సరే సర్" అని చెప్పి కూర్చుంది పల్లవి.
తరువాత జాగృతిని లేచి నించోమని "నీ పేరు జాగృతి కదా. దాని అర్ధం ఏమిటి?" అని అడిగాడు.
"అవేర్నెస్" అని చెప్పింది జాగృతి.
"ఓహ్. నువ్వు అవేర్నెస్ ఇస్తావన్నమాట అందరికి. ఇప్పుడు వద్దులే. తరువాత మాట్లాడతా నీతో " అని కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు.
మూడు నెలల తరువాత ఫ్రెషర్స్ డే అనౌన్స్ చేసారు. అమ్మయ్య ఇంక రాగ్గింగ్ అయిపోతుంది అని అనుకున్నారు జాగృతి, పల్లవి.
ఫ్రెషర్స్ డే ప్రోగ్రాంలో కొంతమంది సీనియర్స్ పాటలు పాడారు, కొంతమంది డాన్స్ చేసారు. సీనియర్స్ అందరూ ఫ్రెషర్స్ తో సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ లా కలిసిపోయారు.
అందరూ చక్కగా ప్రోగ్రాం ని ఎంజాయ్ చేస్తున్న టైం లో స్టేజి మీదకి ఇన్నాళ్లు రాగ్గింగ్ చేసిన వాళ్ళ లీడర్ ఎక్కాడు. ఇప్పుడేం చేస్తాడో అని ఫ్రెషర్స్ అందరూ అనుకుంటూ ఉండగా, మైక్ తీసుకుని "వెల్కమ్ ఫ్రెషర్స్. నా పేరు అర్జున్. ఈ రోజు నుండి సీనియర్స్, ఫ్రెషర్స్ అనే తేడా ఏమి లేదు. ఇక నుండి మనం అందరం ఫ్రెండ్స్. మీకు ఏ ప్రాబ్లెమ్ వున్నా, ఏం అడగాలన్నా, ఏం చెప్పాలన్నా మాకు చెప్పచ్చు" అన్నాడు.
"ఈ కొత్త ఫ్రెండ్షిప్ కి గుర్తుగా మీ కోసం నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి పాడతాను" అని " తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో " అంటూ పాడడం మొదలుపెట్టాడు. పాట మధ్యలోనే అందరూ చప్పట్లు కొట్టారు.
జాగృతి పక్కనే కూర్చున్న పల్లవి "కావాలనే అందరూ క్లాప్స్ కొట్టారేమో. ఆపెయ్యమని. వినలేకపోతున్నాం. ఆ పిచ్చి గొంతు వేసుకుని పాడుతున్నాడు. వీడు, వీడి బిల్డ్ అప్. నాగార్జున లాగ పోజ్ లు కొడుతున్నాడు" అంది జాగృతితో.
జాగృతికి కూడా కోపంగానే వుంది. "ఇన్నాళ్లు ఎంత టార్చర్ పెట్టాడు. అవేర్నెస్ కావాలి అన్నాడుగా. ఇస్తానుండు" అంది పల్లవి తో.
అర్జున్ ఇంకా పాడుతున్నాడు. జాగృతి నించుని మాట్లాడబోతూవుంటే పల్లవి భయపడి "కూర్చో. ఏమి అనకు." అంటూ కిందకి లాగింది.
జాగృతి ఇదేమి పట్టించుకోకుండా "తెలుసూ, తెలుసూ. ఇక ఆపు ఈ అపసవ్యమూ " అంటూ పాడింది.
క్లాప్స్ ఈ సారి ఇంకా గట్టిగా వినపడ్డాయి. ఈ సారి క్లాప్స్ అర్జున్ పాటకి కాదు, జాగృతి మాటకి. అర్జున్ కి వినపడలేదో, అర్ధం కాలేదో కానీ మొత్తం పాట పాడి స్టేజి దిగాడు.
కాలేజ్ లో ఏ ప్రోగ్రాం అయినా "తెలుసా, మనసా, ఇది ఏనాటి అనుబంధమో " అంటూ అర్జున్ పాడడం, "తెలుసూ, తెలుసూ. ఇక ఆపు ఈ అపసవ్యము" అంటూ ఆడియన్స్ అందరూ తిరిగి పాడడం, మధ్యలోనే క్లాప్స్ కొట్టి పాట ఆపించేయడం జరిగాయి.
తన పాట నచ్చి, అందరూ తిరిగి పాడారని, క్లాప్స్ కొట్టారని అనుకున్నాడు అర్జున్.
సమాప్తం.
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
Comments