top of page

 తడిసిన రాత్రి

#MachirajuKameswara Rao, #మాచిరాజుకామేశ్వర రావు, #ThadisinaRathri, # తడిసినరాత్రి, #TeluguKathalu, #తెలుగుకథలు


Thadisina Rathri - New Telugu Story Written By - Machiraju Kameswara Rao

Published In manatelugukathalu.com On 22/04/2025

తడిసిన రాత్రి - తెలుగు కథ

రచన: మాచిరాజు కామేశ్వర రావు

 



ఆ రాత్రి చాలా సేపటి వరకూ నిద్ర పట్టలేదు నర్మద కి. సాయంత్రం ఫోన్ లో రాజేశ్వరి పిన్ని అన్న మాటలే గుర్తు కు వస్తున్నాయి. 


“మీ చెల్లెలు పెళ్లికి నువ్వు ఏలాగైనా నాలుగు రోజుల ముందే రావాలి. నీ కన్నా పన్నెండేళ్ళు చిన్నది అది. దాని పెళ్లికి నిన్ను రమ్మని పిలవడం బాధ గానే ఉంది నాకు! కానీ ఏం చేయను? అనుకోకుండా చూసిన మొదటి సంబంధమే కుదిరి పోయింది. నీ పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏమో ?అప్పుడే మనశ్శాంతి నాకు” 


ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న పిన్ని మాటలకు బ్రేక్ వేస్తూ, “ పని లో ఉన్నాను పిన్నీ. మళ్ళీ మాట్లాడతాను” అంటూ ఫోన్ కట్ చేసింది నర్మద. 


 పిన్ని ఎప్పుడు తన పెళ్లి విషయం ఎత్తినా తన మనసు చివుక్కమనేలా మాట్లాడుతుంది. నిజమే, ఇప్పుడు తను ముప్పై ఆరేళ్ల అవివాహిత.!


బయట పెద్ద పెట్టున వర్షం మొదలవడం ఆలస్యం, కరంట్ పోయింది. ! చుట్టూ చిమ్మ చీకటి. 

నిద్ర పట్టని నర్మద గతాన్ని నెమరు వేసుకుంటూ, మంచం మీద అటూ, ఇటూ దొల్లు తోంది అశాంతిగా. 


నిజానికి నర్మద బ్యాంక్ లో క్లర్క్ గా చేరిన ఏడాది నుంచే తండ్రి ఆమె కు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆమెకు ఇరవై మూడేళ్లు. నర్మద మీద చిన్నప్పటి స్నేహితురాలు నందిని ప్రభావం ఎక్కువ. ఇద్దరూ ఆరో తరగతి నుంచీ బీకాం దాకా కలిసే చదువు కన్నారు. 


నందిని పచ్చటి పసిమి తో సన్నగా, జాజి మల్లె తీగ లా వుంటుంది. బీకాం పూర్తి అయిన ఏడాది లో నే ఏదో పెళ్లి లో ప్రవీణ్, నందినిని చూసి మనసు పారేసుకున్నాడు. తను సాఫ్టువేర్ ఇంజనీర్. పైగా కోటీశ్వరుల ఒక్క గానొక్క బిడ్డ. సామాన్య కుటుంబీకులైన నందినీ వాళ్ళు పెళ్లి ఘనం గా చేయలేరని, ఖర్చలన్ని వాళ్ళే పెట్టుకుని అంగరంగ వైభోగం గా పెళ్లి చేసు కున్నారు. 


పెళ్లయిన నెల తరువాత తనను కలవడాని కి వచ్చిన నందినిని చూసి ఆశ్చర్య పోయింది నర్మద. బెంజి కారు లోంచి హుందా గా దిగిన నందిని, దివి నుంచి భువి కి దిగివచ్చిన అప్సరస లా వుంది. ఖరీదైన చీర, ఒంటి నిండా నగలు!


 తన అత్తింటి వైభోగం అంతా నర్మదకు వివరం గా ఏకరువు పెట్టాక, “ నా మాట విని పెళ్లి కి తొందర పడకు నర్మదా! ఇప్పుడు పెళ్లి కూతుళ్ళ కొరత వుంది. స్వంత ఇల్లు, కారు, కనీసం పాతిక లక్షల జీతం వుండాలి. అటువంటి వాడు తగిలే దాకా పెళ్లికి తల వూపకు. నెట్ లో నీ వివరాలు పెట్టు. రోజుకి పాతిక ఫోన్ లు వస్తాయి. మీ నాన్న మెతక. పెళ్లి వారితో గట్టిగా మీ అమ్మని మాట్లాడ మని చెప్పు “


“అందరికీ నీలా సులభం గా, అన్ని విధాల బావున్న సంబంధం దొరక వద్దూ!” తన చేతుల వెైపు చూసుకుంటూ నిరాశ గా అంది నర్మద. 


“ఎందుకు దొరకదే ! ఇప్పుడు ఆడవాళ్ళకి వున్న డిమాండ్ నీకు తెలియదు. నా మాట నమ్ము. నువ్వు చూస్తూ కూర్చో! కోటీశ్వరులు నీ కాళ్ళ దగ్గిర కి వస్తారు”


నందిని మాటలు నర్మద మీద బాగా పని చేశాయి. 

ఆ రోజు రాత్రి ఆమె తల్లి తో నందిని చెప్పిన కనీస అర్హతలు అన్నీ వివరం గా చెప్పింది. “ఇలా అన్ని విధాల బావున్న సంబంధం మాత్రమే నా కోసం చూడండి. అడ్డ మైన వాళ్ళ ముందూ నన్ను కూర్చో మంటే నేను కూర్చునేది లేదు”


“అలాగే, నా పెళ్లి అయ్యాక అత్త గారికి, మామ గారికి, ఇద్దరు ఆడ పడుచులకి అడ్డమైన చాకిరీ చేశాను. అటువంటి తద్దినాలు కూడా ఏమీ లేని వాళ్ళ నే చూద్దాం” అంది తల్లి కల్యాణి. 


అనుకున్నట్లు గానే మాట్రిమనీ లో రిజిస్టర్ అయిన మర్నాటి నుంచీ రోజుకు పది, పన్నెండు ఫోన్లు వస్తున్నాయి. కల్యాణి యక్ష ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేస్తోంది. 


“పదిహేను లక్షలేనా జీతం, బొత్తిగా తక్కువ“


“అబ్బాయి పేరు మీద ఇల్లు లేదా? కనీసం ఫ్లాట్ అయినా వుండాలి కదా!”


“ఏమిటీ, ఒక్కడే కొడుకు కాబట్టి వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యాక తల్లి తండ్రీ వచ్చి కొడుకు దగ్గిరే వుంటారా, అలా అయితే కుదరదు.”


“ఒక చెల్లి, ఒక తమ్ముడు వున్నారా? పెద్ద కుటుంబాలు అయితే వద్దను కున్నామండి”


ఇలా రక రకాల కారణాలు చెప్పి, తల్లి వచ్చిన అన్ని సంబంధాలు తిరగ కొట్టేస్తోంది. 

కొన్ని చూపుల వరకూ వచ్చాయి. అయితే నర్మద కి పెళ్లి కొడుకులు నచ్చడం లేదు. 


 ఎట్టకేలకి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి ఆకాశ్. పాతిక లక్షల ప్యాకేజీ లో వున్న సాప్ట్ వేర్ ఇంజనీర్. ఒక్కడే కొడుకు. తండ్రి టాటా స్టీల్ ప్లాంట్ లో చేస్తాడు. మరో పదేళ్ల సర్వీస్ వుంది. ఇప్పట్లో కొడుకు దగ్గరకు వచ్చి వుండే ప్రసక్తే లేదు. నోమా కళ్యాణ మండపం లో పెళ్లి. అన్ని ఏర్పాట్లు చక చక జరిగి పోతున్నాయి. పెళ్లి రెండు రోజుల్లో పడింది. దగ్గర చుట్టాలు వచ్చేశారు. 

ఆ రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి నందిని తో కబుర్లు చెబుతోంది నర్మద. ఇంతలో మొబైల్ మోగింది. 

అవతల ఆకాశ్. 


“హాల్లో, ఎలా ఉన్నావ్?”


”బాగానే ఉన్నాను, నువ్వు?” ఆ గది లో నుంచి వెళ్లి పోబోతున్న నందిని చేయి పట్టుకుని, పర్వాలేదు కూర్చో అన్నట్లు గా సైగ చేసింది నర్మద. 


నందిని కూర్చుంది. 

“నేను బాగానే ఉన్నాను. పెళ్లి పనులు అయిపోయాయా?”


“అవుతూనే వున్నాయి. మీవి?”


“అయిపోయాయి. నీతో ఒక విషయం చెప్పాలి!”


“ ఏమిటి?”


“నిజానికి నేను ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కుదరలేదు. రేపు పెళ్లి కొడుకును చేశాక బయటకు వెళ్లకూడదని అంటున్నారు. ఈ రోజు ఇద్దరం లంచ్ కి బయటకు వెళదాం, ప్రేమికులలా! నాకు ఈ కోరిక అయినా తీర్చు కోవాలి అనిపిస్తోంది. వస్తావా?”


“ఇప్పుడా, ఇంటి నిండా చుట్టాలు…. ” నీళ్ళు నమిలింది నర్మద. 


“ నా కోసం”


వెళ్ళమన్నట్లు గా కళ్ళ తోనే సైగ చేసింది నందిని. 

“సరే!”


ఆకాశ్ కోరు కున్నట్లు గా ఆ మధ్యాహ్నం ఇద్దరూ జూబ్లీ హిల్స్ లో ఒక రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్నారు. 


“నేను చాలా అదష్టవంతుడిని” హఠాత్తుగా గా అన్నాడు ఆకాశ్. 


“ఎందుకు?”


“నీ లాంటి అందమైన భార్య ను పొంద బోతున్నాను”


నర్మద నవ్వేసింది. 


“మరి నువ్వు?” ఆసక్తి గా నర్మద కళ్ళల్లోకి చూస్తున్నాడు ఆకాశ్. 


“ప్రత్యేకం గా ఎటువంటి భావాలు లేవు. నీకన్నా అందం గా వున్న వాళ్ళని, డబ్బున్న వాళ్ళని కూడా వద్దను కున్నాను నేను”


ఆకాశ్ మొహం లో ఆశాభంగం! వెంటనే తనని తాను సర్డు కుని, “ఇంతకీ మన హనీమూన్ గురించి నువ్వేమీ మాట్లాడటం లేదు” అన్నాడు మొహం మీద నవ్వు పులుము కుంటు. 


“ఆ ఏర్పాటు చేయ వలసింది నువ్వు”


“ఏం, మీ బాబు చేయలేడా?”నవ్వుతూనే అన్నాడు ఆకాశ్.


“ఏం అన్నావ్?”


నర్మద మొహం జేవురించి వుండటం చూసి. “అదే మీ నాన్న…”


“నాన్న అనలేదు నువ్వు” అరచినట్లు గా అంది నర్మద. 


“మా స్నేహితుల మధ్య మేం అలాగే మట్లాడుకుంటాం”


“నీ మాటలు నాకు అస్సలు నచ్చలేదు” తింటున్న పళ్ళెం పక్కకు తోసి, లేచి పోయింది నర్మద. 


“పెళ్లి కి ముందే మా నాన్న ను చులకన చేసి మాట్లాడే నువ్వు, పెళ్లి అయ్యాక ఇక ఎలా ప్రవర్తిస్తా వో!”


నర్మద కోపం చూసి హడలి పోయాడు ఆకాశ్. 


“అందరూ మననే చూస్తున్నారు, దయచేసి కూర్చో! ఏదో ఫ్లో లో అలా అనేశాను. ఇంత చిన్న విషయానికి……” అంటూ ఇంకా ఏదో చెప్ప బోతున్నాడు ఆకాష్. 


“ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను. ఈ పెళ్లి జరగదు ఆకాశ్ చేతిలో వున్న తన చేతిని విసురుగా లాక్కుని, చర చర బయటకు వెళ్లి పోయింది నర్మద. 


నర్మద ఇల్లు చేరేసరికి హాల్లో ఆడవాళ్ళందరూ పెళ్లికి ఎవరు ఏ చీర కట్టుకోబోతున్నారో చూపించు కుంటున్నా రు. 


“చీరలన్నీ పెట్టె ల్లో సర్దేసు కోండి. ఈ పెళ్లి జరగదు” విసురుగా తన గది లో కెళ్ళి పోయింది నర్మద. 


“అదేం మాటే?” కూతురి వెనకే గదిలోకి వచ్చింది కల్యాణి. “మతి కానీ పోలేదు కదా!”


“నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగొద్దు. ఈ పెళ్లి నేను చేసుకోను, అంతే!” ఖచ్చితంగా చెప్పేసింది నర్మద.


పది నిముషాల్లో ఈ వార్త చుట్టాలందరి లో పాకి పోయింది. 

“ఇదెక్కడి చోద్యం? రెండు రోజుల్లో పెళ్లి పెట్టు కొని, బంధువులందరూ పొల్లో మంటూ వచ్చాక, ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటుందా?ఎంత పొగరు!” ఒక దూరపు చుట్టం. 


“దాని పొగరు సంగతి తెలిసి వుండీ, ఈ పెళ్లి కి వచ్చిన మనకి బుద్ధి లేదు! ఆరేళ్లుగా గా వచ్చిన సంబంధాలు అన్నీ తిరగ కొట్టేస్తున్నారు. పెళ్లి కుదిరింది అనగానే ఇటువంటి దేదో జరుగు తుందని అనుమాన పడ్డాను సుమా! అనుకున్నంతా అయ్యింది” వంత పాడింది మరో చుట్టం. 


“అయినా ఆడదాని కి అంత అహం పనికి రాదు. ”


ఇలా అందరూ తలో మాట అంటూ వుండగా, పెళ్లి కొడుకు తల్లీ తండ్రి వచ్చి పెద్ద గొడవ చేసి వెళ్ళారు. 

మొత్తానికి నర్మద పెళ్లి ఆగి పోయింది. 


“పోనీలే, అన్నీ మన మంచికే అన్నారు! దీని బాబు లాంటి సంబంధం వస్తుంది” అంటూ కూతురిని వెనకేసుకు వచ్చింది కల్యాణి. 


అయితే ఆ తరువాత రెండేళ్లు గడిచినా, ఆ ఇంటి కి పెళ్లి వారి ఫోన్ లు ఏవీ రాలేదు. చుట్టాలు కూడా నర్మద పెళ్లి గురించి అడగడం మానేశారు.. కూతురి పెళ్లి గురించి బెంగ పడిన కల్యాణి ఎన్నో పూజలు చేస్తూ, ఉపవాసాలు వుంటోంది. 


మొగుడూ పెళ్ళాలు క్షేత్ర దర్శనాలు చేస్తున్నారు. అలా ఒక సారి షిరిడీ నుంచి తిరిగి వస్తూ, నర్మద తల్లి తండ్రులు ఇద్దరూ కారు ప్రమాదం లో కాలం చేశారు. 


ఒంటరి అయిపోయిన నర్మద కి ఒక ఏడాది పాటు ప్రపంచం అంతా చీకటి అయి పోయినట్లు గా తోచింది. పిన్ని, అత్తలూ ఎవ రూ నర్మద కి సంబంధాలు చూడడానికి ముందుకు రాలేదు. నర్మద అందరికీ పేర్లు పెడుతుంది అని, సంబంధం కుదిర్చినా పెళ్లి చేసు కుంటుందని నమ్మకం లేదని, ఎందుకు వచ్చిన తల నొప్పి అని, ఎవరికి వారు తప్పు కున్నారు. 


అప్పుడప్పుడు రాజేశ్వరి పిన్ని ఫోన్ చేసి మాట్లాడేది, ” ఇంకా ఎన్నాళ్లు ఇలా ఒంటరి గా వుండి పోతావు? ఇక నువ్వే నీ గురించి ఆలోచించు కోవాలి! “ మంచి గా అన్నా ఆ మాటలు పొడిచి నట్లు గా వుండేవి నర్మదకి. 


ఇలా ఒంటరిగా, నిస్సారంగా నర్మద జీవితం గడిచి పోతోంది. ఇలా ఇంకా ఎంత కాలం?

గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టడం తో, ఉలిక్కి పడి ఈ లోకం లో కి వచ్చింది నర్మద. 

వెంటనే ఏదో నిశ్చయానికి వచ్చి నట్లుగా మంచం దిగి, ల్యాబ్ టాబ్ ముందు కూర్చుంది. 

మేట్రి మొనీ సైట్ లో రిజిస్టర్ అయి తన వివరాలు అన్నీ వ్రాసి చివర లో “నలభై ఏళ్లు వుండి ఉద్యోగం చేస్తున్న రెండవ సంబంధం వాళ్ళు కూడా సంప్రదించ వచ్చు. పిల్లలు వున్నా అభ్యంతరం లేదు!” అంటూ ముగించింది. 


ఆ చీకటి రాత్రి మంచం మీద వాలి దిండు లో మొహం దాచుకుంది నర్మద. హోరున కురుస్తున్న వర్షం లో బయట ప్రకృతి తో పాటు నర్మద దిండు కూడా తడిసి ముద్దయింది. 

 *****************


మాచిరాజు కామేశ్వర రావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: మాచిరాజు కామేశ్వర రావు  

పుట్టిన వూరు.. పత్తిపాడు, తూర్పు గోదావరి జిల్లా. 

ఎప్పటి నుంచి కధలు వ్రాస్తున్నారు?  మొదటి కథ సెప్టెంబరు 1969 లో చందమామ లో ప్రచురితం 

 ఇప్పటి వరకూ వ్రాసినవి.   

1. పిల్లల కథలు. 400 పైగా( ఇందులో 256 కథలు చందమామ లో వచ్చాయి) 

2. పెద్దల కథలు.. వందకు పైగా   ఆంధ్ర ప్రభ, పత్రిక  ,  జ్యోతి, భూమి. స్వాతి, విపుల వగైరా, వగైరా  దాదాపు అన్ని పత్రికలలో  

3. నవలలు… స్వాతి మాస పత్రిక లో 4, చతుర లో 2, సహారి లో పిల్లల నవల ఒకటి సీరియల్ గా. 

4. మొత్తం వెలువరించిన కథా సంపుటాలు 5 

5. గుర్తింపు తెచ్చినవి..   చందమామ లో ప్రచురితం అయిన ‘ పారి పోయిన  దొంగ ‘ కథ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తీసుకున్నారు. చందమామ లో వచ్చిన “ విధి నిర్వహణ “ కథను మహారాష్ట్ర గవర్నమెంట్ వారు  6 వ తరగతి పాఠ్యాంశం గా తీసుకున్నారు. “ అడుగు కో ఆపద “ నవలకి బాలల అకాడమి వారు నిర్వ హించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇవి కాక కొన్ని పత్రికల వాళ్ళూ, సంస్థల వాళ్ళు నిర్వహించిన కథల  పోటీల్లో  5 బహుమతులు. 

6. సాహిత్యకృషి.   . మాచి రాజు భాల సహిత్య పీఠం స్థాపించి ఏటా 6 నుంచి 10 వరకూ చదివే బడి పిల్లలకు కథల పోటీలు,  వారికి నగదు, పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం.ప్రతి ఏటా ఇద్దరు బాల సాహితీ వేత్తలకు మాచి రాజు సీతా రామయ్య, రత్న కుమారి దంపతులస్మారక పురస్కారం గా ₹ 6000/- నగదు  ,  జ్ఞాపిక, శాలువా తో సన్మానం 


Kommentare


bottom of page