#BandariSujatha, #బండారిసుజాత, #తగ్గేదేలే, #Thaggedele, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Thaggedele - New Telugu Story Written By Dr. Bandari Sujatha
Published In manatelugukathalu.com On 13/12/2024
తగ్గేదేలే - తెలుగు కథ
రచన: డా. బండారి సుజాత
కాలేజి నుండి బయటకు వస్తున్న శృతిని అల్లరి పెడుతున్న రౌడీలకు బుద్ధి చెప్పి బట్టలు సవరించుకుంటుంటే చూస్తూ.. చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతుంటే అందరికీ నమస్కరించింది చందన.
తనతో పాటు స్నేహితులందరూ రౌడీలపై తలా ఒక చేయి వేయగానే పలాయనం చిత్తగించారందరూ.. అలా పరుగెడుతున్న వాళ్ళను చూస్తూ నవ్వుకుంటూ.. అక్కడున్న బెంచి మీద కూర్చున్నారు, చందనతో పాటు స్నేహితులందరు.
"ఏమే చందన! నీకురాని విద్యలేదా? మొన్న పాట ఎంత బాగాపాడావో, క్రికెట్ కూడా బాగా ఆడుతావు. ఈ విద్యలన్నీ ఎక్కడ నేర్చుకున్నావే" అన్నది స్మిత.
"నాకు చిన్నప్పటినుండే అన్నీ నేర్పించారు మా అమ్మ నాన్న" అన్నది చందన.
"అది కాదే, మీరు ఉండేది సిటీలో కాదు కదా! ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు".
"పల్లెటూర్లో మాది చాలా పెద్దిల్లు. మా నాన్న ఆఫీసుకు వెళ్లి వచ్చేవాడు. మా అమ్మా, నాన్నమ్మ, తాతయ్య, అన్నయ్య అందరం అక్కడే ఉండేవాళ్ళం.
పిల్లల పెరుగుతున్నారని, కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారని, పసిపిల్లలనుండి పండు ముసలి వరకు జరిగే అఘాయిత్యాలను వింటున్న మా నాన్నమ్మ, మా అమ్మ నాకు ఈ విద్యలు నేర్పించడానికి శ్రీకారం చుట్టారు.
నేను పెరిగి పెద్దయితే నన్ను నేను రక్షించుకోవడమే కాదు, పదిమందిని రక్షించేలా ఉండాలంటూ మా నాన్నను ఒప్పించారు.
మా అన్నయ్యకు కరాటే, నేర్పడానికి మాస్టారును పెట్టాడు. మగ పిల్లవానికి అన్ని ఇంట్లోనే నేర్పిస్తున్నావు కదా! వాడితో పాటు చందన కూడా నేర్చుకుంటుందని మా నాన్నమ్మ, తాతయ్య చెప్పగానే నాన్న ఒప్పుకున్నారు. అలా నాకూ సంగీతం, నాట్యం నేర్పడానికి టీచర్ ను పెట్టారు. మా అన్నయ్యని చూసి నేను అవన్ని చేయాలని అనుకునే దాన్ని, నాన్న జాగ్రత్తలు చెప్పేవాడు. అమ్మ సంప్రదాయంగా ఉండాలి పెద్దలు చెప్పినట్లు వినాలి కష్టమొస్తే మనల్ని మనం రక్షించుకోవాలి అని చెప్పేది.
మా ఊర్లో పదవ తరగతి వరకు ఉంది. నేను మా అన్నయ్య పదవ తరగతి వరకు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాము.
‘ఆస్తి ఉంది, గవర్నమెంట్ బడికి ఎందుకు పంపుతావయ్యా’ అనీ మా నాన్నను ఎవరైనా అడిగితే ‘ఎక్కడైనా విద్య విద్యే. పిల్లలకు నేర్చుకోవాలన్న ఇష్టం ఉండాలి. చదువు అదేవస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా బాగానే చెబుతారు. నేను కూడా అదే పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకోవడం లేదా! మన ఊరు విడిచి పొరుగూరుకు పంపాల్సిన అవసరం లేదు కదా! మన ఊర్లో లేని చదువు బయట చదువుకుంటారు. ఆ బయట హాస్టల్లో వేయాలి కదా! ఇక్కడ ఉన్నంతవరకు చదువు కుంటారు. తరువాత ఎలాగైనా పట్నం పంపాలికదా!’ అని చెప్పేవాడు మా నాన్న.
మీకు ఒకటి చెప్పనా.. మా నాన్నమ్మకూడా చిన్నప్పటినుండే కర్ర సాము నేర్చుకున్నదట. ఇప్పుడు కూడా చేసి చూపెడుతుంది. అందుకే మా నాన్న ఏమి మాట్లాడలేదు. అందుకే సంగీతం, నాట్యం, కరాటే తో పాటు కర్రసాము కూడా నేర్చుకున్నా”నన్న చందనను అందరూ అభినందించారు.
“ఏమోనే చందన.. ఇవాళ నువ్వు కనుక రాకుంటే ఆ రౌడీల చేతిలో నేను ఏమయ్యే దాన్నో” అన్నది శృతి.
తనను అల్లరి పెట్టిన వాళ్లను చందనే కాక అందరూ తలా ఒక దెబ్బ కొట్టి వాళ్లకు బుద్ధి చెప్పారని అందరూ నవ్వుకున్నారు.
“శృతి, స్మిత, రమ్య.. మీరందరూ ఏమనుకోవద్దు. నేను ఒక మాట చెప్పనా..”
అనగానే ‘చెప్పవే’ అన్నారందరు.
“మనందరం డిగ్రీ కొచ్చాం మన వేష భాషలో మర్యాద ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉండాలని నేనంటాను. మాటలతో
కాలక్షేపం చేయవద్దు. ఎవరితోనైనా హుందాగా ఉంటే ఎవరు మన జోలికి రారంటు చెప్పింది ఎవరో తెలుసా.. మా నాన్నమ్మ. అందుకే నా పని నేనే చేసుకుంటూ ఉంటాను. దేంట్లో జోక్యం చేసుకోను” అన్నది చందన.
“అంతేకాదు.. పార్టీలు, షికార్లు, సినిమాలంటూ, ఎవరైనా అడిగినా సున్నితంగా రాలేనని చెప్పాలి. ఒకవేళ బలవంత పెడితే నా స్నేహితురాలు కూడా నాతోపాటు వస్తుందని చెప్పాలి. అలా చెప్తే అప్పుడు ఏదైనా దురుద్దేశం ఉన్నవాళ్లు బయటపడతారు. మనందరం హాస్టల్ లో ఉంటున్నాము. ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరం కలిసి పరిష్కరించు కుందాం.
అంతేకాదు. ఇందులో ఎంత మందికి కరాటే వచ్చో, రాదో తెలియదు. కానీ ఈ రోజు నుండి మనం కాలేజీ నుండి వెళ్ళగానే అందరికి కరాటే నేర్పుతాను. మనల్ని ఎవరైనా ముట్టుకుంటే బ్రహ్మ జెముడు, నాగ జెముడులను ముట్టుకున్నట్లు బాధపడాలి.
ఇప్పటివరకు నాకు కరాటే వచ్చని ఎవరికి తెలియదు. శృతిని రక్షించాము కనుక నా విద్య బయటపడింది. నాతో పాటు మీరందరూ కూడా తలా ఓ దెబ్బ వేశారు కదా! ఇప్పుడు మన గురించి అందరికీ తెలిసిపోతుంది.
ఇప్పటినుండి మనల్ని ఏమన్నా అనాలి అంటే కొంత ఆలోచిస్తారు. అంతేకాదు మనం ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, మగువ మాంచాల, మల్లమ్మ, చాకలి ఐలమ్మ పుట్టిన నేల మీద పుట్టాం. ఆడపిల్లలను ముట్టుకుంటే మూడిందే అనే విధంగా మనం తయారవ్వడమే కాదు, మనలాంటి ఆడపిల్లలను కూడా తయారు చేద్దాము” అన్నది చందన.
“మనం నేర్చుకుంటూ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు వెళ్లి సెలవు రోజుల్లో ఆత్మ రక్షణ విద్యలు నేర్పిద్దాం. అక్కడున్న ఉపాధ్యాయులతో కలిసి మంచి, చెడుస్పర్శల గురించి తెలియజేస్తూ ఆడపిల్లల్ని రక్షించుకుందాం” అన్నది స్మిత.
“అబ్బా! స్మితా.. ఇప్పటికే చాలా పాఠశాలలు, తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవన్నీ నేర్పిస్తున్నారు. సరే మనం కూడా మన వంతు పనులను నిర్వహిస్తూ ఆడపిల్లల్లో మనోధైర్యాన్ని పెంచుదాం” అన్న చందన మాటలతో అందరూ ఏకీభవించారు.
చందన ముందుకు చాచిన చేతిపై అందరూ చేయి వేసి సంఘటితం తెలుపుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా చిరునవ్వులు చిందిస్తూ ఆత్మస్థైర్యంతో హాస్టలుకు బయలుదేరారు ఆడపిల్లలంతా.
.. సమాప్తం ..
డా.బండారి సుజాత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : https://www.manatelugukathalu.com/profile/bandari
Dr.Bandari Sujatha
పేరు : డా.బండారి సుజాత
(ప్రభుత్వ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని)
విద్యార్హతలు : M.A(adm), B.ed, M.A (Tel), M.phil, P.hd.
తల్లిదండ్రులు: కీ.శే : బండారి లక్ష్మి,సమ్మయ్య.
సహచరుడు: ఆకుతోట ఆశయ్య
(రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ )
D.O.B :18-08-1958
వృత్తి: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విశ్రాంత ఉపాధ్యాయిని.
ప్రవృత్తి : కవితలు ,కథలు , వ్యాసాలు, వివిధ ప్రక్రియలలో సాహిత్యం రాయడం, చదవడం, అవసరార్ధులకు సహాయ మందించడం.
Comments