'Thalavalchina Pulu' - New Telugu Story Written By Surekha Puli
'తలవాల్చిన పూలు' తెలుగు కథ
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
దేవకి గుప్పిట నిండా మన్ను తీసుకొని తండ్రి తలపై జల్లి బోసిగా నవ్వుతూంది. ఆ అమాయకమైన నవ్వు సత్తెన్నకు వెలుగులు చిమ్మే కాంతి రేఖ! మిగితా లోకానికి అదొక పిచ్చి నవ్వు!!
ప్రతీ రోజు కూతుర్ని వెంట నిడుకొని తోటపని చేస్తాడు, తోటమాలి సత్యనారాయణ. మంచి పనిమంతుడని అందరి నోళ్ళల్లో సత్తెన్నగా మెప్పు పొందాడు.
“ఇయి చిన్న కలుపు మొక్కలు, ఈటిని యిట్ల చేత్తో పీకాలి. ” తండ్రి చెబుతుంటే ఏదో అర్థమైనట్టు దేవకి చప్పట్లు కొడుతుంది.
“మట్టున్న రాళ్ళు-రప్పలు, మట్టి నెలగ్గొట్టి ఏరాలి.” జ్ఞాన సంస్కారం లేని కూతురికి ప్రతీరోజు దగ్గరుండి తన పనిని బోధపరుస్తాడు. కంటికి రెప్పలా, అల్లారు ముద్దుగా పెంచిన దేవకి బుద్ధి లోపమైనా, కూతురు చేసే అల్లరి, తండ్రికి మహా సరదా!
ప్రతీ చర్యకు కంఠం సాగించి కీచురు అరుపులు అరుస్తుంది. మాటలు రావు. ఏదీ అర్థం కాదు. వెర్రి చూపులు.
సంతోషానికి, దుఃఖానికి తేడా తెలియని అమాయకం. ఇన్ని అవలక్షణాలు వున్నా, శరీర పెరుగుదలలో ఎట్టి లోపమూ లేదు.
“ఏపుగా పెరిగిన గడ్డిని చేత్తో పీకలేము, బాగా పదునైన కొడవలితో సర్రున నరకి పారేయాలి. ”
కొడవలి కావాలని మారాం చేసింది దేవకి. అమ్మో! పదునైన కొడవలి వెర్రి కూతురుకు ఇవ్వకూడదని, వెనకాల దాచేసి, తన రెండు అరచేతులను దేవకి అరచేతులపై చప్పట్లు కొట్టి “చెమ్మ చెక్కా, చారడెసి మొగ్గ, అట్లు పొయ్యంగా..” అని మాట మార్చేసాడు. దేవకీ మంత్ర ముగ్ధతతో పెదాలు కదపాలనే ప్రయత్నం చేసి, చేతులను ఆడిస్తూ, అర్థం కానీ రాగాలు తీస్తూ, తన్మయత్వంతో వూగి పోతుంది.
“పదునైన కొడవలి పట్టుకోవాలి! దాంతో కలుపు కోయాలి!!” దేవకి మదిలో బలీయమైన కోరిక దినదినాభివృద్ది చెందుతుంది.
గోరు ముద్దలు తినిపించే తండ్రి తన చేతికి గాటు పెట్టి, కారిన రక్తాన్ని చూపించి కూతర్ని భయపెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి, బుగ్గన చేతులు పెట్టి భయాన్ని, బాధని వ్యక్తపర్చింది.
“నా తల్లి, నా బంగారం, నన్ను, నా భాసను అర్థం చేసుకుని సునాయాసంగా మాట్లాడ గల్గుతుంది.” అందరిలా మాట్లాడాలి. శరరీ కవళికలు ఎబ్బెట్టుగా వుండకూడదు. ఒక సగటు తండ్రి ఆశ!
సిటీలో బుద్దిమాంధం స్కూల్ వుందని తెల్సింది. కానీ ఆర్థిక స్తోమత లేక తానే తోచిన రీత్యా మాటలు నేర్పి, తృప్తి పడుతున్నాడు సత్యనారాయణ.
*****
తోట యజమాని నుండి కబురు వచ్చింది: ‘చినబాబు మన ఫారం హౌస్లో కొన్నాళ్ళు సరదాగా వుండాలని వస్తున్నాడు. వాడికి ఎలాటి లోపం జరగకుండా చూడు సత్తీ’ అని.
సత్యనారాయణకు కబురు అందిన మొదలు ఒకటే హడావిడి. నౌకరు ఎన్ని పనులు ఎంత శ్రద్ధగా చేసినా, యజమానికి తృపి కలగదు. అయినా, యజమాని కోపానికి తావు యివ్వక, తనవంతుగా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అవుట్హౌస్ శుభ్రం చేయించాడు.
రాజన్ వచ్చాడు. ఐదు వేలు సత్యనారాయణ చేతిలో పెట్టి, “నేను ఐదు రోజులు వుంటాను. నాకు ప్రతీ రోజు మాంఛి నాన్ వెజ్ కావలి సత్తెన్నా!”
“ఇన్ని పైసలు ఎందుకు సార్?”
“నా ఖర్చులు, నీ ఖర్చులు పోను ఏం మిగులుతాయి?”
“సరే సారు” అని వెంటనే మంచి నీరు, భోజనం, టేబల్ ఫ్యాను, మంచం, అన్ని అమర్చాడు. రాజన్ భోజన ప్రియుడు. రెండు రోజుల ఏర్పాట్లకే తోటమాలి అలిసిపోయాడు.
చదువు-సంస్కారం కల్గిన యజమాని కొడుకు పట్ల సత్యనారాయణకు సదభిప్రాయం ఏర్పడ్డది.
పూల తోటలోని విరబూసిన పూల అందం చాలా ఆహ్లాదదాయకంగా వుంది. నేల కనబడకుండా మొక్కలు; మొక్కల నిండా రంగు రంగుల పూలు! వాటి సువాసనలు!!
అదే విధంగా పళ్ల చెట్లు. గుత్తులుగా ద్రాక్ష, సపోటా, అరటి, నిండు గర్బిణిగా దానిమ్మ, మామిడి. యిలా ఎన్నో.. వీటన్నిటికీ ఓనర్ తానే. ఇంతటి అందమైన సృష్టి తన స్వంతం! చినబాబులో సౌందర్య పిపాస మొదలయింది.
*****
“నీ బిడ్డ వెర్రిదని తెల్సి కూడా నీతో ఎందుకు పనుల్లో వెంట బెట్టుకు తిరగుతావు?” రాజన్ ప్రశ్న.
“ఏం చేయాలి చినసారు, నాకు అది, దానికి నేను, మాకు ఈ తోట! మంచి అయినా చెడు అయినా ఇదే నా బతుకు. ” విశ్లేషించాడు తోటమాలి.
“నీ బిడ్డకు మాటలు రావు కదా, మరి ఏ పురుగో, పామొ కరిస్తే ఎట్లా?,
“మన తలరాతలో ఏం రాసుంటే అదే జరుగుతది. మనం మామూలు మనుషులం సారు!”
“అది సరే కానీ మన జాగ్రత్తలో మనం వుండాలి కదా”
“సార్, పుట్టినప్పటి నుండి ఈ చెట్లల్లనే పెరిగింది. నన్ను, నా బిడ్డను యే పురుగు, పాము ఏమి చెయ్యవు. అవీ నా పిల్లలే!”
*****
రాజన్ తన దగ్గర వున్న అత్తరు సీసా, పౌడరు డబ్బా, పేస్ట్ లాంటివి దేవకి ముందర వేశాడు. కొత్తగా కనబడే రంగుల వస్తువులను వింతగా చూసి పసిపాపలా ఆడుకుంటున్నది.
సత్యనారాయణ అనుకున్నాడు: “నా తల్లి అంటే అందరికీ దయ! అందుకే ఆ దేవుడు ఇట్లాంటి దయగల్లోల్లకు సంపాదన ఇస్తడు.”
కాల్కులేటర్ నొక్కుతూ, దానిలో నుండి వచ్చే వెనసొంపు సంగీతానికి తమాషాగా ఆనంద పడుతూ వుంది దేవకి.
“లెక్కలు చేసే మిషను పాడై పోద్దీ సారు.” అని సత్యనారాయణ కాల్కులేటర్ కూతురు చేతినుండి లాక్కో బోయాడు. చాలా గట్టిగా పట్టుకొని కీచురు గొంతుకను హెచ్చించి అరుస్తున్నది.
“ఏమీ పాడవదు, ఆడుకొనీ.”
సత్యనారాయణకు చినబాబంటే ముచ్చటేసింది.
“సత్తెన్నా, సిటీలో స్పీచ్ తెరపీ, ఆకుపేష్నల్ తెరపీ స్కూల్స్ వున్నాయి, నీ బిడ్డకు అక్కడ ట్రైనింగ్ ఇస్తే కొంచంలో కొంచమైన బాగుపడుతుందేమో. పైగా అమ్మాయి, ఎప్పుడో ఒకరోజు పెళ్లి చేయాలి కదా.”
“అవును సారు, కానీ చాలా రూపాయలు కావాలి. ”
“ఎంత కావాలి?”
“ఏమో సరిగ్గా తెల్వదు. ”
“నేను కనుక్కుంటాను. ఇప్పుడు నీ బిడ్డ వయసెంత?”
“పదెను నిండినయి. పెద్ద మనిషి కూడా అయింది.”
“సరేలే, నేను అన్ని విషయాలు కనుక్కోని, నీకు కావలిసిన డబ్బు సర్దుతాను. అందరూ బాగుండాలి.”
సత్యనారాయణకు సంతోషం యింతితై, కొండతై, ఆకాశమంత పెరిగి.. “నా బంగారానికి మాటలు వస్తయి, సదూకుంటది. ఇన్నాల్లు నాకున్న అన్నాయం బదులుకు, నీకు ఇప్పుడు నా మీద దయ కల్గిందా దేవుడా!”
కనబడని దేవుడిని రాతి రూపంలో వున్నాడనుకొని పూజిస్తాము. కానీ మనుషుల రూపంలో దేవుడు కనిపిస్తే; కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటాము.
కన్నప్రేమ, పెంచిన ప్రేమ మిళితమై, దేవి మాట్లాడే మాటల్లోని తీపిదనాన్ని వూహియిస్తున్నాడు. భావనలన్నీ తెలిపే రోజు వస్తుంది. ఆ యేదో ఒక రోజు స్వర్గం అందిన రోజు!
*****
మెల్లిగా వూహలు దారి మళ్లాయి. చినబాబుకు రేపు కమ్మటి భోజనం పెట్టాలి. చేపలా, రొయ్యలా, పీతలా.. ఇన్ని ఆలోచనలతో నిద్ర దూరమైంది.
సూర్యుడు మెల్లిగా వేడిమిని ప్రసరిస్తున్నాడు. స్వామి కార్యార్థమై దాసుడు బజారెళ్ళాడు. వాకిటి అరుగుపైన కూర్చున్న దేవకి ఆకాశం వైపు చూసి, ఆకాశంలో కూడా పూలూ పూస్తాయా? కలుపు మొక్కలు పెరుగుతాయా? అనే తత్వంలో ఆలోచిస్తూ నేలకేసి, ఆకసం కేసి నోరు తెరిచి వెర్రి చూపులు చూస్తుంది.
జీడిపప్పు, ఎండిన ద్రాక్ష పండ్లను తెరిచి వుంచిన దేవకి నోట్లో రెండేసి చొప్పున వేశాడు రాజన్. శారీరిక లోపం లేని దేవకి నోట్లో పడిన పదార్థాలను నమిలి తింటున్నది.
“బాగున్నాయా?” ఔనని జవాబు.
ఇంకా కావాలా? మళ్ళీ ఔనని జవాబు.
“మరి లోపలికి రా” నవ్వుతూ చెప్పాడు. లేచి నిలబడిన దేవకి చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు. మంచం మీద జీడిపప్పు, ఎండిన ద్రాక్ష పండ్లను పోశాడు. అమాంతంగా ఎగిరి, గబగబా ఏరుకుని తింటున్నది, మోసాలేరుగని బాలిక.
ప్రక్కనే కూర్చొని, బాలిక నునువైన చెంపల్ని, చేతుల్ని నిమురుతున్నాడు.
ప్రతీ దినము మొహం కడిగి, స్నానం చేయించి, బట్టలు తొడిగి ముస్తాబు చేసే నాన్న స్పర్శకు; కాంక్షతో, కామంతో శరీరాన్ని తగిలే స్పర్శకు అజ్ఞాని అయినా, తేడా తెలిసి; కళ్ళతో ఎదురు తిరిగింది. కీచురాయి స్వరంతో తిరుగుబాటుకు ప్రయత్నించింది.
శరీర తపన తీర్చుకునే కామాంధుడికి ఇహం-పరం తెలియవు. అనర్థం చేస్తున్నాడు. పైశాచికం గెలిసింది.
ప్రేమ, ఇష్టం, కోరిక, అవగాహన కల్గి వుంటేనే వివాహం చేసుకున్న దంపతుల కలయిక సమంజసం. ఇవి లోపించిన ప్రక్రియ ప్రకృతికి విరుద్దం.
శాంతించిన కాయంతో కదిలాడు రాక్షసుడు.
తనకు జరగరానిదేదో జరిగిందని దేవకి లేచింది.
కలుపును ఎలా తొలగించాలో నాన్న చూపించిన విధానాలు గుర్తుకు వచ్చాయి. రెప్పపాటు కాలంలో కొలిక్కి తగిలించిన పదునైన కొడవలి చేతబూని, చినబాబు పురుషంగాన్ని కలుపుగా అనుకొని కోసేసింది.
“అమ్మా! అబ్బా!!” అంటూ .. కాళ్ల మధ్యలో టవల్ రక్తంతో తడుస్తూ, బాధతో మెలికలు తిరగుతున్నాడు బాధితుడు.
*****
బిడ్డ కనబడుట లేదని సత్యనారాయణ ఆదుర్దాగా లోపలికి వచ్చాడు.
తండ్రికి ఆనందంగా సైగ చేసి కొంత; కొంత వచ్చీ రాని కీచు స్వరంతో చెప్పింది, “నా చేయి తెగ కుండా, నా చేతికి రక్తం అంటుకోకుండా నేను కలుపు కోసాను. ” అంటూ రక్తపు మరకల కొడవలిని గాలిలో తిప్పుతున్నది.
బిడ్డకు జరిగిన అన్యాయం అర్థమై తల బాదుకుని విలపిస్తున్నాడు తోటమాలి.
మనిషి రూపంలోని దేవుడనే భ్రమ, రూపు మాసి పిశాచిగా కనబడుతున్నాడు; పిచ్చి పట్టినట్లు నొప్పితో గెంతు తున్నాడు.
"దేవక్కె కాదు, వేరోల్లకు కూడా పిచ్చి వుంటాది. సిటీలనే వుంటరు, పైసలు కూడా వుండె, ఆ తెరిపి దావాఖానల సూపించు కోని నయం చేసుకోక.. ముండ కొడుకు, వీనమ్మ కడుపు కాల!"
*****
క్షణికమైన శారీరిక సుఖం దొరికిందిని అనుకున్న దౌర్భాగ్యుడికి శారీరిక దుఃఖం శాశ్వయుతంగా లభించింది.
తోట వదిలి తోటమాలి వెళ్ళిపోయాడు. తలెత్తుకున్న పూలన్నీ తల వాల్చాయి.
****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ
ఇంటి పేరు: పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.
స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.
మీ ప్రోత్సాహమే నా బలం 🤝
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
సురేఖ పులి
@rakheevenugopal362 • 49 minutes ago
Innocent girl but she taught him a good lesson