#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #Thallikani Thalli, #తల్లికాని తల్లి, #TeluguHeartTouchingStories
Thallikani Thalli - New Telugu Story Written By - Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 07/01/2025
తల్లికాని తల్లి - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"మర్చిపోయావా సమీరా, ఇవాళ మన పెళ్ళి రోజు. గుడికి వెళ్దాం పద!" అన్నాడు సందీప్.
అన్యమనస్కంగా ఉన్న సమీర సోఫాలోంచి లేచింది తయారవడానికి. ఈమధ్య భార్య ఉదాసీనంగా ఉండటం సందీప్ గమనిస్తూనే ఉన్నాడు. ఆమె అలా ఉదాసీనంగా ఉండటానికి కారణం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి అతనిది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న సందీప్, సమీర దంపతులకు లోటేమీ లేదు. ఇద్దరివీ మంచి ఉద్యోగాలే! డబ్బుకు కొదవలేదు. అన్యోన్య దాంపత్యం వాళ్ళిద్దరిదీ. ఉన్న లోటల్లా సంతానలేమి మాత్రమే! పెళ్ళై అయిదేళ్ళు పూర్తైనా సమీర తల్లి కాలేకపోయింది. అక్కడికీ ఇద్దరూ డాక్టరు వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. లోపం సమీరలోనే ఉండటంతో ఆమె మనసు అల్లకల్లోలం అయింది. సందీప్ కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. తనకీ అంతే!
మాతృమూర్తైయ్యే అదృష్టానికి నోచుకోలేకపోయినందుకు ఆమెలో చురుకుదనం తగ్గింది. అప్పటికీ ఎన్నోసార్లు సందీప్ నచ్చచెప్పాడు, ఎన్నో విధాల బోధపరచాడు. ఈరోజుల్లో లభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సంతానం పొందవచ్చని చెప్పినా ఆమెలో ఏ మార్పు రాలేదు. కృత్తిమ పద్ధతులేవీ ఆమెకు నచ్చలేదు. అనాథ పిల్లల్ని పెంచుకుందామని కూడా చెప్పి చూసాడు. దానికీ ఆమె ఒప్పుకోలేదు. తనకు పిల్లలు కలిగే యోగం లేదని మానసిక వ్యధతో నలిగిపోతోంది. ఎంత ప్రయత్నం చేసినా సందీప్ ఆమె మనసులోని వ్యధను దూరం చెయ్యలేకపోయాడు.
అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ కార్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. మొదటి పెళ్ళి రోజు గుర్తుకు వచ్చింది సందీప్ కి. అప్పుడు సమీర ఎంత చలాకీగా, హుషారుగా ఉండేది! ఈ అయిదేళ్ళలో ఎంత మార్పు? సమీర గురించి ఆలోచిస్తూనే, ఆమెతో గుళ్ళోకి ప్రవేశించాడు సందీప్. పెళ్ళిరోజు సందర్భంగా గోత్రనామాలతో అర్చన చేయమని పూజారితో చెప్పాడు సందీప్.
పూజ చేసి, సమీర చేతిలో ప్రసాదం, పువ్వులు పెట్టి, "పిల్లాపాపలతో నిండు నూరేళ్ళూ సుఖంగా జీవించండి. " అని ఆశీర్వదించాడు అతను.
ఆ ఆశీర్వచనం వింటూనే సమీర పెదవులపై శుష్కమైన నవ్వు విరియడం సందీప్ దృష్టిని దాటిపోలేదు. నిజమే మరి! మూడేళ్ళకు పైగా దర్శించని గుడి లేదు, మొక్కిన మొక్కులూ లేవు, అయినా తమ కోరిక తీరలేదు. ఎవరి ఆశీర్వచనాలూ ఫలించలేదు. సాయంకాలం వేళ, ఆ ప్రశాంత వాతావరణం సమీర మనసుకు ఏ మాత్రం ప్రశాంతత చేకూర్చ లేకపోయింది. ఆమెను ఏదో విధంగా మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సందీప్.
"ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూసావా? కాసేపు ఇక్కడ కూర్చుందామా!" అంటూ ఓ అరుగు మీద కూర్చున్నాడు.
సమీర మౌనంగా తలూపి అతని పక్కనే కూర్చుంది. గుడిలో ఇచ్చిన ప్రసాదం తను సేవించి, ఆమె చేతికి కూడా అందించాడు. అక్కడ దూరంగా గుడి మెట్ల వద్ద కూర్చున్న ఒకామె మీద సమీర దృష్టి పడింది. పాతికేళ్ళ వయసు ఉంటుందామెకు. ఆమె కట్టుకున్న చిరుగుల చీర ఆమె ఆర్థిక స్థితిని చెప్పకనే చెప్తోంది. చేతిలో ఓ చిన్న పాప, నేలపై ఓ బాబు ఉన్నారు. వాళ్ళందరి మొహాల్లో దీనత్వం గోచరించిందామెకు. ఆమె దృష్టి సారించిన వైపు సందీప్ చూపు కూడా మళ్ళింది. అతన్నీ ఆ దృశ్యం కలచివేసింది.
"పాపం ఎవరో చాలా బీద మనిషిలా ఉంది. ఎంతో కొంత డబ్బులు ఇచ్చిరా!" అన్నాడామెతో.
"అలాగే!" అని లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది సమీర. పది రూపాయల నోటు అందించి యధాలాపంగా కింద పడుక్కున్న పిల్లడివైపు చూసింది. జ్వరంతో మూలుగుతున్నాడా చిన్న పిల్లడు. జాలి కలిగిందామెకు. "ఏమైంది, ఆ చిన్నవాడికి?" అడిగింది.
"ఏం చెప్పనమ్మా, రెండు రోజుల నుండీ తీవ్రమైన జ్వరం పిల్లవాడికి. డాక్టర్ కి చూపిద్దామంటే చేతిలో డబ్బులు లేవు. ఇంతకుముందు ఎప్పుడూ యాచించలేదు. ఇదే మొదటి సారి ఇలా ఇక్కడ కూర్చోవడం. " అందామె సిగ్గుతో చితికిపోతూ.
జాలితో కరిగిపోయింది సమీర. రెండువందల నోటు ఆమెకు అందించి, "తీసుకో, ఈ డబ్బులతో నీ కొడుక్కి వైద్యం చేయించుకో!" అంది.
"వాడు నా తమ్ముడు తల్లీ, కొడుకు కాదు. " అందామె.
నిర్ఘాంతపోయింది సమీర. "నీ తమ్ముడా!" అంది ఆశ్చర్యంగా.
"అవునమ్మా! నా తల్లి చిన్నప్పుడే నన్ను, మా అయ్యని వదిలేసి మారు మనువు చేసుకొని వెళ్ళిపోయింది. మా అయ్య తాగితాగి చనిపోయాడు. అప్పటినుండి వంటరిదాన్నైపోయాను. ఈ మధ్యే నా తల్లి చనిపోవడంతో, ఈ చిన్న తమ్ముడు, చిట్టి చెల్లెలు బాధ్యత కూడా నా మీద పడింది. వాళ్ళ అయ్య ఈ చిన్నవాళ్ళని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. పాపం వాళ్ళనెవరు చూస్తారు? ఎంతైనా వాళ్ళు నా తమ్ముడూ, చెల్లెలే కదా? అందుకే నేను వాళ్ళను చూసుకుంటున్నాను. నేను పని చేస్తున్న ఫాక్టరీ మూతపడి ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోయింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా చిన్న పని కూడా దొరక లేదు. " అందామె కళ్ళలో నిస్పృహ ప్రతిఫలిస్తూండగా.
ఒక్కక్షణం ఆలోచించింది సమీర. వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్న ఆ తల్లికాని తల్లిని చూస్తూంటే ఆమె గుండె తరుక్కుపోతోంది. సందీప్ ని అడగకుండా క్షణంలో ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆచరణకు భర్త ఆమోదం తప్పకుండా ఉంటుందని ఆమెకు నమ్మకముంది. "చూడూ.. నీ పేరేమిటి?" అని అడిగింది సమీర.
"మంగి. " అందామె.
"ఆ.. చూడు మంగీ! నిన్ను చూస్తూంటే నాకు చాలా జాలి కలుగుతోంది. ఇంత చిన్న వయసులోనే ఈ చిన్న పిల్లల్ని సాకుతూంటేనే నీ గొప్పదనం అర్ధం అవుతోంది. నీకో మాట చెప్పనా? నీ వళ్ళో ఉన్న చిన్న పాపను నాకు ఇచ్చెయ్యకూడదూ! నాకు పిల్లలు లేరు. కంటికి రెప్పలా పెంచి, పెద్ద చదువులు చదివిస్తా. అందుకోసం నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బులతో ఏదైనా పని చేసుకొని, నువ్వు, నీ తమ్ముడూ జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. " అందామె.
ఒక్కక్షణం సమీర ఏమంటోందో మంగికి అర్ధం కాలేదు. అర్ధమైన మరుక్షణం ఆ చిన్నపాపను మరింతగా గుండెలకు హత్తుకుంది భయంభయంగా.
"అమ్మో! మీరెంత డబ్బులిచ్చినా వాళ్ళను నేను వదులుకోలేను. అయినా డబ్బులున్నాయి కదా అని మీరు ఏమైనా మాట్లాడవచ్చు. నేను మాత్రం నా తమ్ముడ్ని, చెల్లెల్నీ డబ్బులకు అమ్ముకొనే నీచురాల్ని మాత్రం కాదు. " నిరసనగా అంది మంగి దూరంగా జరుగుతూ.
ఆ మాటలకి మాన్పడిపోయింది సమీర. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నిజమే!
ప్రేమాభిమానాలు డబ్బులతో కొనలేము కదా! వెంటనే హాండ్ బ్యాగ్ తెరిచి చేతికి అందినంత డబ్బులు తీసి మంగి చేతిలో కుక్కింది.
"అబ్బే.. అబ్బే.. చెప్పాను కదా, నేను నా పిల్లల్ని అమ్మనుగాక అమ్మను. " గట్టిగా అంటూ డబ్బులు విదిలించేస్తూ అక్కణ్ణుంచి వెళ్ళబోయింది.
"లేదు మంగీ! తల్లికాని తల్లివైన నీ వేదన నాకర్ధమైంది. తీసుకో! ఈ డబ్బులతో ఏదైనా పని చేసుకొని నీ తమ్ముడ్ని, చెల్లెల్నీ పెంచు. " అని ఆ డబ్బుల్ని మంగి చేతులో కుక్కి వెనుతిరిగి సందీప్ కూర్చున్న చోటుకు తిరిగి వచ్చింది.
దూరం నుండి సందీప్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. నవ్వుతూ సమీర వైపు చూసి, "పది రూపాయలు ఇస్తానని వెళ్ళావు, ఇప్పుడు ఎంత ఇచ్చావేమిటి?" అని అడిగాడు.
"పాపమండీ! ఎంతో కొంత ఇచ్చాను. ఎంతిచ్చానో లెక్కయ్యలేదు. పిల్లలు ఆ అమ్మాయి తమ్ముడు, చెల్లెలు అంట! తల్లి మారుమనువు చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత, వాళ్ళ బాధ్యత వహిస్తోంది. జాలివేసి డబ్బులు ఇచ్చాను. " అంది సమీర.
"మన పెళ్ళి రోజున మొత్తం మీద మంచి పని చేసావు. ఇంక బయలుదేరుదామా! అలా సినిమాకెళ్ళి, హోటల్లో భోజనం చేసి ఇంటికెళ్దాం. " అన్నాడు సందీప్ లేచి నిలబడుతూ.
"అలాగే వెళ్దాం, కానీ సినిమాకు, హోటల్ కూ కాదు. నేను దీర్ఘంగా ఆలోచించాను. మీరు చెప్పిందే సబబుగా తోస్తోంది. ఇక్కణ్ణుంచి తిన్నగా అనాథాశ్రమంకి వెళ్దాం. మన ఈ పెళ్ళి రోజు వాళ్ళ మధ్య జరుపుకుందాం. పళ్ళు, స్వీట్స్, బిస్కెట్లు తీసుకెళ్దాం.. " అంది సమీర భర్త మొహం వైపు చూస్తూ.
"అంతేనా.. " సమీర వైపు చూసాడు అతను.
"అంతేకాదు.. ఇంతకు ముందు మీరు చెప్పినట్లు అక్కణ్ణుంచి చిన్న పాప గానీ, బాబునుగాని మనింటికి తెచ్చుకొని వాళ్ళకో కొత్త జీవితాన్ని ప్రసాదిద్దాం. అనాథలందరికీ 'మంగి' వంటి తల్లి కాని తల్లి దొరకదు కదా!" మనస్పూర్తిగా చెప్పింది సమీర.
ఆమె నిర్ణయానికి తన ఆమోదం తెలిపాడు సందీప్. అతను ముందుకు సాగుతూంటే, రెట్టించిన ఉత్సాహంతో అతన్ని అనుసరించింది సమీర.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments