top of page

తమ్ముడా లక్ష్మణా


'Thammuda Lakshmana' - New Telugu Story Written By Ch. C. S. Sarma

'తమ్ముడా లక్ష్మణా' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మన సువిశాల భారతదేశానికి పడమట పాకిస్థాన్‌, ఉత్తరాన చీనా విరోధ దేశాలు. ఆ ప్రాంతపు సరిహద్దులలో మన వీరజవానులు రాత్రింబవళ్ళు రక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చీనా అప్పుడప్పుడూ తూర్పుఈశాన్య అరుణాచలప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ను దాట ప్రయత్నిస్తున్నారు. వారిని మన వీరజవానులు ఎదుర్కొంటున్నారు. కొందరు పోరులో మరణించారు. మరణించిన ప్రతి వీరజవాన్‌ అమరజీవులు. దేశంలో సురక్షితంగా వున్న మనం, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థించాలి. వారి కుటుంబాలకు మనం చేయగలిగిన సాయం చేయాలి. అది మన ధర్మం.


జైజై జయహో వీరజవాన్స్‌.


అరుణాచాల ప్రదేశం (తూర్పు ఈశాన్య మూల) లో 2022 డిశంబర్‌ 13, 14 తేదీలలో చీనాసైన్యం లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ను దాట ప్రయత్నించింది. మన వీరజవానులు వారిని ఎదిరించారు. ఇరుపక్షాల సైన్యం కాల్పులు ప్రారంభించారు. మన సైన్యధాటికి తట్టుకోలేని చీనా సైన్యం వెనక్కు వారి భూభాగంలోకి పారిపోయింది.


మన సైన్యంలో ఇరవైమంది మరణించారు. చీనాసైన్యం నూటికి పైగా నేలకూలారు. పోరాటం జరిగినది గాల్‌వన్‌వ్యాలీ ప్రాంతంలో. మన కమాండర్‌ లక్ష్మణ్, చీనా సైన్యంలో ఇరవై రెండు మందిని కాల్చి చంపాడు. చివరగా చీనా సైనికుడి కాల్పుకు గురై అతన్ని కాల్చి చంపి, తాను మరణించాడు. యుద్ధం ఆగిపోయింది.


* * *

మన సైన్యాధికారులు లక్ష్మణ్‌ శరీరాన్ని అతని స్వస్థలమైన నెల్లూరులోని వారి ఇంటికి చేర్చారు.

లక్ష్మణ్‌కి ఒక అన్న రాము, సోదరి భారతి, తల్లి సుశీల వున్నారు.


వీరమరణం పొంది ఇంటికి శాశ్వతనిద్రావస్థలో చేరిన లక్ష్మణ్‌ను చూచి, అన్నా, తల్లీ, చెల్లి అవధులులేని దుఃఖంలో మునిగిపోయారు.


ఆ కుటుంబాన్ని ఎరిగిన వూరిజనం, బంధుమిత్రులు ఎందరో వచ్చి కన్నీటితో లక్ష్మణ్‌ కమాండర్‌ను చూచి వాపోయారు.



రాజమర్యాదలతో సైన్యం వాహకులుగా, ముందు కొంత మంది జవానులు నడిచి లక్ష్మణ్‌ శవాన్ని పెన్నానది ఒడ్డుకుచేర్చారు.

ఫిరంగులు మ్రోగాయి. హైందవ సాంప్రదాయం ప్రకారం.. లక్ష్మణ్‌ శరీర దహన సంస్కారాలు జరిగాయి. ఆగని దుఃఖంతో భోరున ఏడుస్తూ కన్నీటితో అన్న రాము లక్ష్మణ్‌ అంత్యక్రియలను సశాస్త్రంగా చేశాడు.


తన్ను తాను సమాణించుకొని తల్లిని, చెల్లిని ఓదార్చాడు. పది, పదకొండు పన్నెండవ రోజులలో జరగవలసిన విధులన్నింటినీ రాము ఎంతో శ్రద్ధతో నిర్వహించాడు.

లక్ష్మణ్‌ అస్తికలను కాశీలో గంగానదిలో కలుపడానికి విమానం ఎక్కాడు.

రెండున్నర గంటల్లో ఆ సర్వేశ్వర సామ్రాజ్యమైన వారణాసికి చేరాడు. సోదరుని అస్తికలను భోరున ఏడుస్తూ గంగలో కలిపాడు రాము.


ఆ క్షణం, అతని లక్ష్మణ్‌ ఆరునెలల క్రింద ఇంటికి వచ్చినప్పుడు వారి ఇరువురి మధ్యన జరిగిన చివరి సంభాషణ జ్ఞప్తికి వచ్చింది.


* * *

‘‘అన్నా!..’’ లక్ష్మణ్‌ పిలుపు.


‘‘ఏం తమ్ముడూ!’’ రాము జవాబు.


‘‘అన్నా! నీవు పెండ్లి ఎప్పుడు చేసికొంటావు?’’


‘‘వివాహా విషయంలో నాకో అభిప్రాయం ఉందిరా!..’’


‘‘అదేమిటన్నా!..’’


‘‘మన ఇరువురి వివాహాలు ఒకేసారి జరగాలిరా!..’’


‘‘అన్నా!..’’ ఆశ్చర్యంతో నవ్వుతూ అడిగాడు లక్ష్మణ్‌.


‘‘అవున్రా!..’’


‘‘మరి.. పెద్దవాడివి నీవు.. ముందు నీ వివాహం జరిగితే బాగుంటుంది కదా అన్నా!’’


‘‘ఏం.. మన ఇరువురి వివాహాలు ఒకేసారి ఒకరోజు అటూ ఇటుగా మంచి ముహూర్తాన జరిగితే బాగుండదా!..’’


‘‘అన్నా!.. నీవు స్వస్థలంలోనే కాలేజీ తెలుగు లెక్చరువు. నేను దేశ సరిహద్దుల్లో సిపాయిని. నన్ను చేసికొనేదానికి ఎవరూ ఇష్టపడరు. అంతేకాదు నాకు ఇప్పట్లో వివాహం చేసికోవాలనే అభిప్రాయం లేదు. కనుక ముందు మన మామయ్య సీతారామ్‌ గారి కూతురు జానకితో నీ వివాహం జరిగితే.. అది నాకు, అమ్మకు, చెల్లికి ఎంతో ఆనందం అన్నా!..’’ నవ్వుతూ చెప్పాడు లక్ష్మణ్‌.


‘‘ఆ.. లక్ష్మణా! ముందు మనం మన చెల్లి భారతి వివాహాన్ని జరిపిద్దాం అది మన ధర్మం.’’


‘‘ఓకే అన్నయ్యా!.. మీ అభిప్రాయం సూపర్‌. నాలుగు నెలల్లో భారతి బి.యస్సీ కూడా అయిపోతుంది. మామయ్యగారికి చెప్పి భారతికి మంచి సంబంధాన్ని చూడండి. నేను ఆ వివాహానికి వస్తాను.’’


‘‘ఎప్పుడు వెళ్ళాలిరా నీవు!..’’



‘‘వారం రోజుల తర్వాత..’’


ఆ నిర్ణయానికి వచ్చిన అన్నాతమ్ములు, ముందు తల్లితో, తరువాత మేనమామ పాండురంగశర్మను కలసి భారతికి మంచి సంబంధం చూడమని చెప్పారు.


వారం రోజుల తరువాత లక్ష్మణ్‌ బార్డర్‌కు బయలుదేరాడు. అతని ప్రయాణం సాయంత్రం.

అల్లూరు నుండి మేనమామ పాండురంగశర్మ ఉదయాన్నే వచ్చాడు.


‘‘ఒరే అల్లుళ్ళూ! మీ చెల్లికి మంచి సంబంధాన్ని చూచాను. అబ్బాయి వాళ్ళది కావలి. మీలాగే వారు ఇద్దరు అన్నాదమ్ములు. పెదబ్బాయి విజయ్‌, చిన్నబ్బాయి విక్రమ్‌. తండ్రిగారు రిటైర్‌ హైస్కూలు హెడ్‌మాస్టర్‌ రంగనాధశర్మ. విజయ్‌కి పోయిన సంవత్సరం వివాహం అయింది. అతను హైస్కూలు టీచర్‌.


విక్రమ్‌ తాలూకా ఆఫీస్‌లో గుమస్తా. మనం చూడవలసింది అతన్నే. నేను చూచాను. అబ్బాయి మంచి అందగాడు, సౌమ్యుడు. మన భారతికి తగిన జోడి. మంచి కుటుంబం. మనకు అన్నివిధాలా తగినది. అతిగా కట్నకానుకలు ఆశించేరకం కాదు. మీరు సరే అంటే అమ్మాయిని చూడటానికి వారికి రేపే రమ్మంటాను. తీసికొనివస్తాను’’ నవ్వుతూ చెప్పాడు పాండురంగశర్మ.

అన్నాతమ్ములిరువురికి వారి తల్లి సుశీలకు పాండురంగశర్మగారి మాటలు మహదానందాన్ని కలిగించాయి.


లక్ష్మణ్‌ తన బాస్‌తో మాట్లాడి, విషయం చెప్పి ప్రయాణాన్ని రెండు రోజులకు వాయిదా వేశాడు.

రెండవరోజున విక్రమ్‌, భారతీల పెండ్లిచూపులు జరిగాయి. ఇరుపక్షాల వారికి సమ్మతం. మహదానందం. ముహూర్తం రెండునెలల తర్వాత కుదిరింది.


ఆ సాయంత్రం లక్ష్మణ్‌ బయలుదేరాడు.

తల్లి, అన్నా, చెల్లికి చెప్పాడు.

ఆ ముగ్గురు వదనాల్లో వేదన. లక్ష్మణ్‌ ప్రయాణం వారికి ఇష్టం లేదు. కానీ.. అతను వెళ్ళక తప్పదన్న విషయమూ వారికి తెలుసు.

కన్నీటితో సాగనంపారు తల్లి చెల్లి.


‘‘అమ్మా!.. చెల్లీ!.. బాధపడకండమ్మా!.. రెండు నెలలలోపు పెండ్లికి పదిరోజులు ముందుగా వస్తానుగా!.. మీరు అలా వుంటే నా మనస్సు ఏదోలా వుంది. నవ్వుతూ బై చెప్పండి’’ తల్లిని సమీపించి ఆమె కన్నీటిని తుడిచాడు.


‘‘దీవించమ్మా!’’ వంగి పాదాలు తాకాడు.


ఆ తల్లి ‘‘నా ఆయువును పోసికొని నీవు నిండునూరేళ్ళు చల్లగా వర్థిల్లాలి నాన్నా!’’ భుజాలు పట్టుకొని పైకి లేపి తన హృదయానికి హత్తుకొంది.


లక్ష్మణ్‌.. చెల్లిని సమీపించి ఆమె కన్నీటికి తుడిచాడు.


‘‘రెండునెలలు.. ఎనిమిది వారాలు.. నేను ఆరువారాల తరువాత నీ పెళ్ళిపనులు చేసేదానికి వస్తానమ్మా! బాధపడకురా అమ్మ కదూ! నా చెల్లి నా మాటలను ఎప్పుడూ వింటుంది’’ తన చేతుల్లోకి సోదరి భారతి ముఖాన్ని తీసికొని ప్రీతిగా నొసటన ముద్దు పెట్టాడు. అన్నను సమీపించి పాదాలు తాకాడు.


రాము అతన్ని లేపి తన హృదయానికి హత్తుకున్నాడు.

‘‘రెండు వారాలు ముందుగా రావాలి లక్ష్మణా!’’


‘‘తప్పకుండా అన్నయ్యా!’’


ఇరువురూ ఆటోలో స్టేషన్‌కు చేరారు. ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చారు. రైలు రాకను గురించి ఎనౌన్స్‌మెంట్‌ వినబడిరది. లక్ష్మణ్‌ అన్నను సమీపించాడు. అతని కుడిచేతిని తన చేతిలోకి తీసికొని..

‘‘అన్నా!..’’


‘‘ఏం లక్ష్మణా!’’


‘‘ఒకవేళ ఏదైనా బలమైన కారణంతో.. నేను చెల్లి వివాహానికి రాలేకపోతే నీవు బాధపడకుండా వారిని ఓదార్చి చెల్లి భారతి వివాహాన్ని ఘనంగా జరిపించు అన్నయ్యా!’’ రెండు చేతులను తన చేతుల్లోకి తీసికొన్నాడు.


‘‘లక్ష్మణా! ఏమిట్రా ఆ మాటలు నీవు తప్పక రావాలి!’’


‘‘అలాగే అన్నయ్యా!..’’ తలాడిరచాడు లక్ష్మణ్‌.


రైలు వచ్చింది కంపార్ట్‌మెంటులో లక్ష్మణ్‌ ప్రవేశించాడు. రైలు కదిలింది. కిటికీగుండా చేతిని వూపుతూ అన్నకు బై చెప్పాడు లక్ష్మణ్‌.


గతం మనస్సున చెదిరిపోయింది. రాము వర్తమానంలోకి వచ్చాడు.


* * *


ఆ రోజు భారతి వివాహం..


రాము, తల్లి సుశీల, భారతి మేనమామ పాండురంగశర్మల కళ్ళు సత్రం వీధివాకిటి వైపు పదేపదే.. లక్ష్మణ్‌ రాకకోసం..


బోర్డర్‌లో..

చీనా.. భారత్‌ సైన్యం మధ్యన బోర్డర్‌లో కాల్పులు. లక్ష్మణ్‌ మనసున చెల్లి పెండ్లికి పోలేకపోయాననే బాధ, శత్రువులపై కోపం, ద్వేషం, తుపాకీ కాల్పులు.. ఇరుపక్షాల వారి మధ్యన అక్కడ నెల్లూరులో వరుడు విక్రమ్‌ భారతి మెడలో మాంగళ్యధారణ చేశాడు.



ఇక్కడ.. యుద్ధభూమిలో కసికసిగా లక్ష్మణ్‌ ఇరవై రెండు మందిని కాల్చిచంపాడు.

వైరివర్గం.. లక్ష్మణున్ను కాల్చింది. ‘‘అమ్మా!..’’ అంటూ లక్ష్మణ్‌ నేలకు ఒరిగాడు. అతని జీవుడు దేవుడై ఆకాశం వైపుకు ఎగిరాడు.


* * *

ఢిల్లీ నుండి రెండు నెలల తరువాత రాముకు ఒక కమ్యూనికేషన్‌ వచ్చింది. దాన్ని పంపినవారు భారత్‌ ప్రెసిడెంట్‌. తేదీని కూర్చి అమరజీవి వీర కమాండో శ్రీ లక్ష్మణ్‌శర్మ పేర మహావీరచక్ర బహుమతి ప్రధానం చేయనున్నారని వచ్చి స్వీకరించవలసినదిగా సందేశం.


రామశర్మ ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంటు వారి కార్యాలయంలో బహుమతుల ప్రధాన విభాగంలో దేశ ప్రధాని గారు, త్రిదళాల నాయకులు తదితర ముఖ్యుల సమక్షణంలో అమరజీవి లక్ష్మణ్‌ పేర.. ప్రెసిడెంట్‌ గారి చేతుల మీదుగా ‘‘మహావీరచక్ర’’ బహుమతిని అందుకొన్నాడు.


తిరుగుప్రయాణం విమానంలో.. రాత్రి ఎనిమిదిగంటల ప్రాంతం. భూమినుండి పదిహేడువేల అడుగుల ఎత్తున్న విమానం ఢిల్లీనుండి చెన్నై వైపు పరుగిడుతోంది.


కిటికీ ప్రక్కసీట్లో కూర్చున్న రామశర్మకు ఆకాశంలో నవ్వుతూ లక్ష్మణశర్మ కనిపించాడు. ఆశ్చర్యపోయాడు. మదిలో పారవశ్యం.


‘‘తమ్ముడా! లక్ష్మణా!?’’ అరిచాడు రామశర్మ.


ప్రక్కన నిద్రపోతున్న ప్రయాణికుడు ఉలిక్కిపడి రామూ ముఖంలోకి తీక్షణంగా చూచాడు అరవైఏళ్ళ ఆ పెద్దమనిషి.


రాము తొట్రుపాటుతో ‘‘ఓ సారీ సార్‌! సారీ!..’’ అన్నాడు విచారవదనంతో. అతని కళ్ళనుండి అశ్రువులు కిందికి జారాయి.


సమాప్తి


* * *

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.



43 views1 comment

1 Comment


Pitta Gopi

కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి మరో కథలో రచయిత సీహెచ్. సీఎస్.శర్మ గారు సవరించగోరుతున్నాను. కథ బాగుంది. పార్ట్ 2 ఉంటే బాగున్ను.

Like
bottom of page