#తనకోపమేతనశత్రువు, #ThanaKopameThanaSathruvu, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Thana Kopame Thana Sathruvu- New Telugu Story Written By Karlapalem Hanumantha Rao Published In manatelugukathalu.com On 01/04/2025
తన కోపమే తన శత్రువు - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
బాలు వయసు పదేళ్ళు. అంత చిన్నతనంలో కూడా కోపం బుస్సుమని వచ్చేస్తుంది. కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడు. పెద్దా చిన్నా చూసుకోడు. అంత దురుసుతనం భవిష్యత్తుకు మంచిది కాదని వాళ్లమ్మ ఎన్ని సార్లో చెప్పి చెప్పిచూసింది. కాస్సేపటి వరకే అమ్మ మాటల ప్రభావం. మళ్లీ కోపం యధాతధం.
ఆ సారి పుట్టిన రోజు పండుగకు తనకు కొత్త వీడియో గేమ్ కావాలని అడిగాడు బాలు. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి. ఆటల రంధిలో పడి చదువు మీద ధ్యాస తగ్గుతుందని అమ్మానాన్నల బెంగ. పరీక్షలు అయి వేసవి సెలవులు మొదలయితే గానీ ఏ ఆటలూ వద్దని అమ్మ నచ్చచెప్ప బోయింది. వినకపోగా అమ్మ మీద ఇంతెత్తున ఎగిరి గభాలున ఒక బూతు పదం కూడా వాడేసాడు.
షాకయ్యాడు అక్కడే ఉండి బాలు వీరంగం అంతా చుస్తున్న నాన్న. అప్పటికి ఏమీ అనలేదు. మర్నాడు పుట్టినరోజు బాగానే జరిగింది. ఫెండ్స్ రకరకాల ఆటవస్తువులు బహుమానంగా ఇచ్చారు. పరీక్షలు అయిన దాకా వాటిన తెరవకూడదన్న షరతు మీద నాన్నగారు ఒక పెద్ద రంగుల పెట్టె బహుమానంగా ఇచ్చారు. తెరిచి చూస్తే అందులో బోలెడన్ని మేకులు, ఒక సుత్తి, బాలుకి చాలా ఇష్టమయిన తన ముఖం అచ్చొత్తించిన పెద్ద చెక్క ఫ్రేము ఫొటో.
నాన్నగారు ఇలా చెప్పారు 'బాలు! కోపం మంచిది కాదు అని ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కావడంలేదు. ఎందుకు మంచిది కాదో నీకై నువ్వే తెలుసుకోవాలి. అందుకోసమే నీకు ఈ చిన్న పరీక్ష. ఇందులో వంద మేకులు ఉన్నాయి. నీకు కోపం వచ్చిన ప్రతీసారీ ఒక మేకు ఈ పటం మీద ఈ సుత్తితో కొట్టాలి. మేకులన్నీ అయిపోయిన తరువాత ఇంకా కావాలంటే కొని ఇస్తాను’ అన్నాడు.
బాలుకు ఈ ఆట బాగా నచ్చింది. మొదటి రోజు ఏకంగా 37 మేకులు పటం మీద సునాయాసంగా కొట్టేసాడు. అంటే 37 సార్లు కోపం వచ్చిందని అర్థం. రెండో రోజు ఆ ఊపు కొంత తగ్గింది. 21 మేకులు మించి పటంలోకి దిగలేదు. సుత్తితో మేకును కొడుతున్నప్పుడు బాలు మనసు మెల్లిగా ఆలోచనలో పడడం మొదలుపెట్టింది.
ఈ మేకులు కొట్టే తంటా కన్నా అసలు కోపం తెచ్చుకోకుండా ఉంటే గోలే ఉండదు కదా! అని కూడా అనిపించింది. రోజు రోజుకూ ఆ భావన బాలులో పెరుగుతున్న కొద్ది పటం మీద మేకులు దిగడం తగ్గిపోయింది. అంటే బాలుకు కోపం వచ్చే సమయం క్రమంగా తగ్గిపోయిందనేగా అర్థం!
కోపం వచ్చిన ప్రతీసారీ మేకులు, సుత్తితో వాటిని పటం మీద కొట్టే బాదరబందీ గుర్తుకు వచ్చి చల్లబడిపోయేవాడు. మేకులు కొట్టడానికి ఇప్పుడు పటం మీద చోటు వెతుక్కోవడం కూడా కష్టంగా ఉంది. పటం నిండా మేకులు నిండిపోయే వేళకు బాలుకు అస్సలు కోపం రావడం పూర్తిగా మానేసింది. కోపం తగ్గిన తరువాత అమ్మానాన్నా వీడియోగేమ్ ఇప్పుడు ఎందుకు కొనివ్వడం లేదో అర్థమయింది. నెల రోజుల కిందట అమ్మతో తాను దురుసుగా మాట్లాడిన సంగతీ గుర్తుకు వచ్చింది. కళ్ల వెంబడి ఇప్పుడు నీళ్లు వచ్చాయి.
తప్పు తెలుసుకున్న బాలు కొట్టలేక మిగిలిపోయిన మేకులు, సుత్తి తండ్రి ముందు పెట్టి 'నాన్నా! కోపం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు అర్థమయింది. ఇక ఈ మేకులు కొట్టే పని నా వల్ల కాదు . నేను అమ్మ మీద ఇక నుంచి ఎప్పుడూ కోపమే తెచ్చుకోను' అని చెప్పాడు.
తండ్రి 'కోపం వల్ల ఇబ్బంది ఏమిటో నీకు తెలిసి వచ్చిందే! కానీ నాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. నీకు ఈ పాఠం నేర్పడానికి మేకులు, సుత్తి, పటం ఫ్రేము కట్టించడానికి 500 రూపాయలు అవసరమయ్యాయి. సమయానికి నా దగ్గర అంత డబ్బు లేకపోతే ఒక ఇనుప కొట్లో అరువు మీద తిసుకువచ్చాను. ఇప్పుడు మనకు వాటితో అవసరం లేదు కదా! అతని మేకులు, పటం తిరిగి అతనికి ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేస్తే సరి. నువ్వు రోజుకో మేకు చొప్పున మేకులన్నీ పీకి పారేయ్! కాకపోతే మళ్లా ఒక షరతు. నీకు కోపం వచ్చిన రోజున మేకు తీయడానికి లేదు. గుర్తుంచుకో!' అన్నాడు.
బాలుకు ఆ రోజు నుంచి రోజుకు ఒక మేకు పటం నుంచి తీయడం మీదనే ధ్యాసంతా. అందుకోసం కాను కోపాన్ని ఆమడ దూరం పెట్టవలసిన అగత్యం మరింత గట్టిగా అర్థమయింది. మొత్తానికి పటం మీది మేకులన్నీ తీసి మేకులు, సుత్తి, పటం తండ్రికి ఇచ్చే సమయానికి బాలు పూర్తిగా శాంత స్వభావుడిగా మారిపోయాడు.
'మేకులు పీకడానికి నీవు కోపాన్ని ఎట్లా నిగ్రహించుకున్నావో గమనించాను. కోపం తెచ్చుకోకపోవడమే కాదు.. అది వచినప్పుడు దానిని నిగ్రహించుకోవడం కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. తన కోపమే తనకు శత్రువు అని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో ఇప్పుడు బాగా అర్థమయింది అనుకుంటా. కోపం తెచ్చుకొని ఏదో ఒక దురుసుమాట అని ఎదుటి వాళ్ల మనసును గాయ పరచడంలాటిందే మేకుతో పటం మీద సుత్తితో బాదడం. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని మేకు మళ్లీ తీసినా పటం మీది చిల్లులు పోవు కదా!
ఆ వికారం పోగొట్టడం మన తరం కాదు గదా! నోటికొచ్చింది తిట్టి ఆనక 'సారీ' అన్నా ఎదుటి వాళ్ల మనసు మీద గాయమూ ఇట్లాగే ఎప్పటికీ చెరిగిపోకుండా మిగిలిపోతుంద'ని గుర్తుంచుకో చాలు.' అన్నాడు తండ్రి.
బాలు బుద్ధిగా తలుపాడు. పరీక్షలు అయి వేసవి రాగానే తండ్రే బాలును వెంటబెట్టుకుని ఎలక్ట్రానిక్ షాపుకు తీసుకువెళ్లి అతగాడికి కావలసిన వీడియోగేమ్సు కొనిపెట్టాడు. ఎన్ని గేమ్సు కొనిపెట్టాడో అన్ని పుస్తకాలు కొని ఇస్తూ.. ఒక పుస్తక చదవడం పూర్తయిన తరువాతే ఒక వీడియా గేమ్ ఆడుకోవడానికి పర్మిషన్' అన్నాడు తండ్రి నవ్వుతూ.
బాలుకు ఈ సారి కోపం రాలేదు.సంతోషంగా గేమ్సూ పుస్తకాలూ అందుకొన్నాడు.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
ความคิดเห็น