'Thandri Ramachandra' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 25/04/2024
'తండ్రీ రామచంద్రా!' తెలుగు కథ
రచన: L. V. జయ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పాతికేళ్ళక్రితం, జాగృతి ఉద్యోగం లో జాయిన్ అయిన నెలలో, కంపెనీ వాళ్ళు అమెరికా పంపిస్తామని అన్నారు. అక్కడ తెలిసినవాళ్ళు ఎవరూ లేరు. ఒక్కదాన్నే పంపించడానికి భయపడ్డారు జాగృతి ఇంట్లో వాళ్ళు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక, వాళ్ళని కష్టపడి ఒప్పించింది జాగృతి.
వీసా, టికెట్స్ వచ్చి, బయలుదేరే రోజు, జాగృతి వాళ్ళ అమ్మ, రామాయణం పుస్తకం జాగృతి చేతిలో పెట్టి, "జాగ్రత్తగా వెళ్లిరామ్మా. ఇది నేను రోజూ చదువుకునే పుస్తకం, నీకు ఎపుడైనా బెంగ వచ్చినా, భయం వేసినా, ఆ రాముడికి దణ్ణం పెట్టుకుని, ఈ పుస్తకం లో కొంత చదువు తల్లీ. ఆ రాముడే నిన్ను రక్షిస్తాడు. " అని చెప్పారు.
జాగృతి కి కూడా రాముడు అంటే చాలా భక్తి. రామాయణం పుస్తకాన్ని తీసుకుని కళ్ళకి అద్దుకుని, 'రామయ్యతండ్రి, దేశం కానీ దేశం లో నువ్వే నన్ను కాపాడాలి' అని దణ్ణం పెట్టుకుని బయలుదేరింది.
బోస్టన్ చేరేప్పటికే అక్కడ చలికాలం మొదలు అయ్యింది.
జాగృతి ఉన్న ఇంట్లో, ఇంకో ముగ్గురు అమ్మాయిలు వున్నారు. ముగ్గురూ తొందరగానే స్నేహితులు అయ్యారు. అందరూ కలిసి ఆనందంగా గడిపారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏది కొనాలన్నా అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు.
ఆ కాలంలో, అక్కడ అన్నిటి కన్నా ముఖ్యంగా కొనాల్సింది ఫోన్ కార్డు. ఫోన్ కార్డు కొని, టాక్ టైం వేసుకోకపోతే, ఇండియా లో ఉన్న వాళ్లతో మాట్లాడడానికి కుదరదు. ఫోన్ కార్డు తప్పకుండా కొనుక్కునేవారు అందరూ.
నెలరోజులు చాలా సంతోషంగా గడిచాయి. తరువాత, తనతో పాటు ఇంట్లో ఉన్న ముగ్గురూ అమ్మాయిలు ఒకరి తరువాత ఒకరు ఇండియా వచ్చేసారు. ఆ ఇంటి మొత్తానికి ఒక్కర్తే అయిపొయింది జాగృతి. ఒక్కర్తే ఉండడం, వండుకోవడం కష్టంగా అనిపించాయి జాగృతి కి.
మంచుపడి, చలి పెరిగి, బయటకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. టెంపరేచర్ మైనస్ 17 డిగ్రీస్ లోకి వెళ్ళింది. "ఈ సంవత్సరం మంచు చాలా ఎక్కువగా పడుతోంది. 50 ఏళ్ళలో ఇంత మంచు ఎప్పుడూ పడలేదు. అవసరం అయితే తప్ప బయటకి వెళ్ళదు" అని పదే పదే న్యూస్ చానెల్స్ వాళ్ళు చెప్పారు. మనిషి సగం పైగా మునిగిపోయేంత లోతుగా మంచు పడింది. ఆఫీసులు అన్నీ సెలవు ఇచ్చేసారు.
అంత చలి అలవాటులేకపోవడంతో, జాగృతి కి విపరీతమైన జ్వరం వచ్చింది. మంచం మీదనుండి లేవలేకపోయింది. వంట చేసుకోలేని పరిస్థితి అయిపొయింది. ఇండియా లో ఉన్న అమ్మకి ఈ విషయం చెప్తుంటే, ఫోన్ లో మిగిలి ఉన్న టాక్ టైం అయిపొయింది.
తిండి లేక, నిద్ర లేక ఎన్నో రోజులు గడిపింది. తన భయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. తనకి ఏమైనా అయిపోతే, ఎవరికైనా ఎలా తెలుస్తుంది అన్న అనుమానం వచ్చింది జాగృతి కి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇండియా కి వెనక్కి వెళ్లిపోవాలని అనిపించింది. సెలవులు పూర్తి అయ్యి, ఆఫీస్ మొదలు అయిన వేంటనే, 'ఇండియా వెళ్ళిపోతాను' అని ఆఫీస్ వాళ్ళకి చెప్పాలని అనుకుంది జాగృతి.
చుట్టూ మంచు. సాయంత్రం అయ్యేటప్పటికే, చుట్టూ ఏమి కనపడనంత చిమ్మ చీకటి. మాట్లాడడానికి ఎవరూ లేరు. మనుషులు ఎవ్వరూ కనపడలేదు. ఫోన్ లో టాక్ టైం అయిపొయింది. బయటకి వెళ్ళడానికి లేదు. ఎక్కడ నుండి ఏ చిన్న శబ్దం వచ్చినా భయపడిపోయేది. ఇంటికి కొంచెం దూరంలో చాలా చెట్లు ఉండడంతో, ఏ జంతువయినా వచ్చేస్తుందేమో, దొంగలు ఎవరైనా ఇంట్లోకి వచ్చేస్తారేమో అన్న భయం. ఒంటరితనం తో పిచ్చెక్కేటట్టుగా అయిపొయింది జాగృతి కి.
అప్పుడు తీసి చదివింది వాళ్ళ అమ్మ ఇచ్చిన రామాయణం పుస్తకం. చిన్నప్పటి నుండి రామాయణం పుస్తకాన్ని చాలా సార్లు చదివింది జాగృతి. చదివిన ప్రతిసారి ఎదో ఒక కొత్త విషయం తెలుస్తోంది జాగృతి కి. ఈ సారి ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, రాముడు తనతోనే
ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపించింది.
'మనుషులతో మాట్లాడడానికి, ఫోన్లు, టాక్ టైం లు కావాలి గాని దేవుడితో మాట్లాడడానికి అవన్నీ అక్కరలేదుగా. ఇక నేను రాముడితో మాట్లాడుకుంటాను' అనుకుంది మనసులో.
"తండ్రీ, రామచంద్రా, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు ఇక్కడ. నువ్వే నాకు తోడు, నీడ, అండ. తల్లివి, తండ్రివి, స్నేహితుడివి అన్నీ నువ్వే. అన్ని వేళలా నువ్వు నాతోనే ఉండి, నన్ను కాపాడు తండ్రీ. నా సంతోషం, దుఃఖం పంచుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు.
ఇండియా వెళ్లిపోవాలని ఉంది. కానీ, నాకు ఇక్కడ అప్పగించిన పని పూర్తి చెయ్యకుండా వెళ్ళలేను. ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. నా అంతట నేను ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను.
ఎదో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు తండ్రీ. నా చుట్టూ వుండే వాళ్లలో, నువ్వు ఉండి, నన్ను సరియైన దారిలో నడిపించు తండ్రీ. " తను రాముడితో చెప్పాలనుకున్నవి, పుస్తకం ఆఖరు పేపర్ మీద రాసింది జాగృతి.
మర్నాడు ఉదయానికి, జ్వరం తగ్గింది జాగృతి కి. ఏదైనా చేసుకుని తిందాం అనుకుని వంటిట్లోకి వెళ్ళింది. వంటిటి కిటికీ దగ్గర నించుని, లోపలకి చూస్తున్న ఒక మనిషిని చూసి, భయంతో గట్టిగా అరిచింది.
"భయపడద్దు" అంటూ ఆ మనిషి ఇంగ్లీష్ లో చెప్పారు. ఇంతకీ వచ్చింది ఎవరు అని సరిగ్గా చూసింది. ఆయన ఒక ఇండియన్, వయసు అరవై ఉండచ్చు.
"మేము, నీ ఎదురు అపార్ట్మెంట్ లో ఉంటాము. నువ్వు చాలా రోజుల నుండి లైట్స్ వెయ్యటం లేదు. ఒంటరిగా వున్నావు. ఎలా ఉన్నావో చూద్దాం అని వచ్చాను" అని అన్నారు.
ఆయన ఎవరో, ఎలాంటివారో తెలియక, "బాగున్నండి" అని చెప్పి, కిటికీకున్న కర్టెన్ వేసింది జాగృతి.
"ఆగమ్మా. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకి వచ్చి, బెల్ కొట్టి పిలవడానికి చాలా సార్లు ప్రయత్నించాను. మీ బెల్ పని చెయ్యటం లేదు అనుకుంటా" అని అడిగారు ఆయన.
"ఏమో. తెలియదండి" అంది జాగృతి.
"సరేలే. నిన్ను మా ఇంటికి పిలవమని ఆంటీ రోజూ చెప్తోంది. అదుగో చూడు. అక్కడ నుండి ఆంటీ చూస్తోంది" అని చెప్పారు ఆయన. కిటిలోంచి చూస్తే, వాళ్ళ ఆవిడ నవ్వుతూ, రమ్మని చెయ్యి ఊపుతూ కనపడ్డారు. ఆయన చెప్తున్నది నిజమే అని అర్ధం అయ్యి, భయం తగ్గింది జాగృతి కి.
"సరే అంకుల్. కొంచెం సేపట్లో, రెడీ అయ్యి వస్తాను" అని చెప్పింది జాగృతి.
వాళ్ళ ఇంటికి వెళ్ళగానే, వాళ్ళ ఆవిడ వచ్చి, "రోజూ నువ్వు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు చూసేదాన్ని నిన్ను. తెలుగు అమ్మాయిలాగా అనిపించావు. చాలా రోజుల నుండి లైట్స్ కూడా వేసుకోకుండా వున్నావు. ఒంట్లో బాగులేదమ్మా". ఆవిడ అడిగిన విధానానికి, మాట తీరుకి చాలా సంతోషంగా అనిపించింది జాగృతి కి.
"ఇప్పుడు బాగానే వున్నాను ఆంటీ. జ్వరం వచ్చి తగ్గింది. " అని చెప్పింది జాగృతి.
"అయ్యో. పాపం. ఇంత చలి అలవాటు లేదు కదా. ఇవి వేసుకో. తగ్గిపోతుంది" అని టాబ్లెట్ తెచ్చి ఇచ్చారు.
"ఈ రోజు సంక్రాంతి. పండుగ పూట ఒక్కదానివే ఏమి చేసుకుంటావ్? నీ ఫ్రెండ్స్ కూడా వెళ్లిపోయారు. అందుకని, నిన్ను మా ఇంటికి పిలవమని చెప్పి, అంకుల్ ని పంపించాను. " అని చెప్పారు ఆవిడ.
చాలా రోజుల తరువాత మనుషులని చూసింది జాగృతి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళని కలవడంతో, కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి జాగృతి కి. 'రాముడే పంపించాడు వీళ్ళని నా కోసం' అనుకుంది మనసులో.
"ఏమయ్యింది. ఎందుకు ఏడుస్తున్నావు. " అని అడిగారు ఇద్దరూ ఒకేసారి.
"ఏమి లేదు అండి. చాలా రోజులు ఒంటరిగా ఉండి, ఇప్పుడు ఇలా మిమ్మల్ని కలిసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది" అని చెప్పింది జాగృతి.
"అయ్యో. పాపం. ఏవైనా కావాలంటే చెప్పమ్మా. అంకుల్ నిన్ను తీసుకువెళ్తారు. " అని అన్నారు ఆవిడ.
"అమ్మతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది ఆంటీ. ఫోన్ లో టాక్ టైం అయిపొయింది. బెంగపెట్టుకుని ఉండి వుంటారు. " అంది జాగృతి. వాళ్ళ ఫోన్ ఇచ్చారు మాట్లాడమని.
చాలా రోజుల తరువాత, అమ్మతో మాట్లాడి, జరిగింది అంతా చెప్పింది జాగృతి. "ఎంత కష్టపడ్డావు తల్లీ. ఇంక వచ్చేయ్యమ్మ ఇక్కడికి. " అంటున్న తల్లిని, "ఇప్పుడు బాగానే వున్నాను అమ్మా. ఆ రాముడే ఇక్కడ ఒక ఫామిలీ ని కలిపించాడు" అని చెప్పి ఊరుకోబెట్టింది.
రకరకాల పిండివంటలతో, మంచి భోజనం పెట్టారు వాళ్ళు జాగృతి కి. ఆ రోజు నుండి, ప్రతిరోజూ జాగృతి ఎలా ఉందో కనుక్కునేవారు. వీకెండ్స్ లో, జాగృతి ని దగ్గరలో ఆష్ ల్యాండ్ లో ఉన్న శ్రీ లక్ష్మి గుడికి తీసుకువెళ్ళేవాళ్ళు.
"మనం అందరం కలిసి నీకు వేళ్ళు అయినప్పుడు పిట్స్బర్గ్ గుడికి కూడా వెళ్దాం" అన్నారు ఆవిడ.
కొన్ని రోజుల్లోనే, వాళ్ళ ఇంట్లో మనిషిలాగ అయిపొయింది జాగృతి.
"నువ్వు వచ్చి మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా జాగృతి. భయపడుతూ ఒక్కదానివే ఉండడం ఎందుకు?" అని అడిగారు ఆవిడ.
"ఇప్పుడు భయం పోయింది ఆంటీ. అయినా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది కదా. నేను రోజూ వచ్చి మిమ్మల్ని కలుస్తూ వుంటాను. " అని చెప్పింది జాగృతి.
జాగృతి కి, తను అమెరికా వచ్చిన పని పూర్తి చెయ్యడానికి కొన్ని నెలలు పట్టింది.
పని పూర్తి అయ్యి, ఇండియా కి వెళ్లిపోయే రోజు, తనని పంపించలేక బాధపడుతున్న ఆంటీ వాళ్ళని కలిసి, "ఇక్కడ నాకు ఎవ్వరూ లేరు అని బాధ పడుతున్న సమయంలో, మిమ్మల్ని పంపించాడు ఆంటీ ఆ రాముడు. దేశం కానీ దేశంలో నాకు తల్లితండ్రులాంటివాళ్ళని ఇచ్చాడు. " అని కళ్ళలో నీళ్లతో చెప్పింది జాగృతి.
"చాలా సంతోషం తల్లీ. మాకు తల్లితండ్రుల స్థానం ఇచ్చినందుకు. నువ్వు మా అమ్మాయిలాగా కలిసిపోయావు. ఆ రాముడిని నమ్ముకున్న వాళ్ళకి ఏ బాధలు ఉండవమ్మా. అంతా ఆయనే చూసుకుంటారు. " అని చెప్పారు ఆవిడ.
'తండ్రీ రామచంద్రా! అంతా నువ్వే చూసుకున్నావు. నువ్వే ఆంటీ, అంకుల్ రూపంలో వచ్చావు నా కోసం. ' అని మనసులో అనుకొని, ఆంటీ, అంకుల్ కాళ్ళకి దణ్ణంపెట్టి, ఇండియా బయలుదేరింది జాగృతి.
మాతా రామో మత్పితా రామచంద్రహ
స్వామీ రామో మత్సఖా రామచంద్రహ
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే
అని రామరక్షా స్తోత్రం లో వున్నది చదివినప్పుడల్లా, తను రామాయణం పుస్తకం వెనక రాసుకున్నది గుర్తు చేసుకుంటుంది జాగృతి.
'నిజమే. రాముడు ఎదో ఒక రూపం లో వచ్చి మనల్ని కాపాడతాడు'.
***సమాప్తం***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
@lakshminuti7562
• 1 day ago
Jai Sriram: శ్రీరామ రక్ష.