top of page
Writer's pictureYasoda Pulugurtha

తప్పు నాది కాదు


'Thappu Nadi kadu' New Telugu Story

Written By Yasoda Pulugurtha

'తప్పు నాది కాదు' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


‘'ఏమిటి నీహార్, తప్పంతా నాదే అన్నట్లు, నేనేదో మీ చెల్లెలు హర్షిత కు అన్యాయం చేసినట్లు నీవూ, మీ అమ్మగారు పదే పదే నన్ను బ్లేమ్ చేయడం బాగుందా?” భర్తతో అంది ఆనంది. “నేనేమైనా మిమ్మలని బలవంతంగా ఒప్పించానా? మీకందరికి నచ్చాకనే, హర్షిత కూడా నచ్చిందని చెప్పాకనే కదా మా కజిన్ బ్రదర్ అలోక్ ని మీ ఇంటి అల్లుడిగా చేసుకున్నారు? పైగా అలోక్ కుటుంబం ఎంతో నచ్చిందని పదే పదే అందరితో చెప్పేవారు కూడా” అంది. “నిజమే కాదనను ఆనందీ, అలోక్ కి కోపం ఎక్కువని, స్నేహితులతో తిరిగి ఏ రాత్రికో వస్త్తూ ఉంటాడని, అప్పుడప్పుడు డ్రింక్ కూడా చేస్తాడని 'హర్షీ' ప్రతీరోజూ ఫోన్ లో ఏడుస్తూ మా అమ్మకు చెపుతోందిట. మాకు ఎంత బాధగా ఉంటుంది? అలోక్ నీ కజిన్, నీకు బాగా తెలుసున్న వాడు, మంచివాడనుకుని తొందరపడ్డామేమో, అతని గురించి సరిగా వాకబు చేయలేదేమో అనుకోవడం సహజం కదా” అన్నాడు నీహార్. “అలోక్ మంచివాడని ఇప్పటకీ అంటాను నీహార్. వాడికి ఏ బేడ్ హేబిట్ లేదు. బాగా చదువుకున్నాడు, ముంబై లో మంచి జాబ్ చేస్తున్నాడని హర్షితకు ఏ సంబంధమూ కుదరక పోతుంటే నేనే చెప్పాను, ఒప్పుకుంటాను. మీ అందరికీ అలోక్ ప్రొఫైల్ నచ్చే కదా అత్తయ్యా మామయ్యగారూ మా పిన్ని బాబాయ్ ని కలిసి మాట్లాడారు. అలోక్, హర్షితా కూడా మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు అలోక్ ను చేసుకుని హర్షిత బాధపడుతోందంటూ, నా మూలానే ఇలా అయిందనే అర్ధాన్ని స్పురిస్తూ అత్తయ్యగారు నన్ను దోషిగా నిలబెట్టి మాటలనడం సబబా?” అనేసరికి భార్యకు ఏమి సమాధానమివ్వాలో తెలియక మౌనం వహించాడు నీహార్. రంగనాధ్, శోభన దంపతులు హైద్రాబాద్ లో ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు 'నీహార్', కూతురు 'హర్షిత'. నీహార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. హర్షితకు పెద్ద పెద్ద చదువులమీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో డిగ్రీ పూర్తి అవగానే చదువాపేసింది. ఇంట్లో అందరికీ హర్షితంటే గారాబం. ఆ అమ్మాయి ఏదంటే అది జరిగిపోవాల్సిందే. ఫాషన్స్ మీద మోజు. చూడడానికి బాగుంటుంది. దానికితోడు రక రకాల ట్రెండీ డ్రెస్స్ లు వేసుకుని స్నేహితులతో జాలీగా గడిపేస్తుంది. చిన్న మాటంటే సహించదు. హర్షితను చూడడానికి వచ్చిన పెళ్లికొడుకులందరూ హర్షిత ఇంజనీరింగ్ ఎందుకు చదవలేదని, మాకు సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అమ్మాయే కావాలంటూ తిరస్కరించేవారు. అప్పటికి ఏడాది క్రితమే నీహార్ కి వివాహమవడం, ఆనంది ఆ ఇంటి కోడలుగా రావడం జరిగింది. ఆనంది ఎమ్.ఎస్.సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా యూ.జీ.సీ గ్రేడ్ లో ఉద్యోగం చేస్తోంది. ప్రొఫెషన్ పట్ల విపరీతమైన ఇష్టంతో పెళ్లైనా ఉద్యోగాన్ని కొనసాగిస్తోంది. హర్షితను ప్రైవేట్ గా పి.జి చేయమని ఎంకరేజ్ చేసేది మొదట్లో. కానీ వదిన మాటను వినీ విననట్లుగా ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడంతో చెప్పడం మానేసింది. ఆనందికి ఎవరైనా అలా ఖాళీగా కూర్చుని టైమ్ పాస్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఆనంది చెల్లెలు నందిని మెడిసన్ మూడవ సంవత్సరం, తమ్ముడు హర్ష ఐ.ఐ.టి ఖర్గ్ పూర్ లో మొదటి సంనత్సరం చదువుతున్నారు. హర్షితను చూస్తూ అనుకునేది, ‘పోనీ చదువు ఇష్టం లేకపోతే ఈ అమ్మాయికి దేనిమీద ఆసక్తి అని’. లేట్ గా లేవడం, ఫోన్ లో ఫ్రెండ్స్ తో చిట్ చాట్, సినిమాలు, షాపింగ్స్ తప్పించితే మరే విషయం మీద ఆసక్తి లేదని గ్రహించింది. తను తిన్న కంచం కూడా సింక్ లో పెట్టని హర్షిత మనస్తత్వం ఏమిటో గ్రహించింది. అత్తగారు కూడా హర్షితకు ఏ పనీ చెప్పేవారు కాదు. ‘పెళ్లైతే తనే నేర్చుకుంటుందని అందరితో చెప్పడం తను వింది’. ఉద్యోగాలే చేయాలా, మా హర్షిత ఒక మంచి హోమ్ మేకర్ అవుతుందని వెనకేసుకొచ్చేవారు. అ సమయంలోనే ఆనంది కజిన్ ‘అలోక్’ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అలోక్ కెమికల్ ఇంజనీరింగ్ గా ఏషియన్ పెయింట్స్ ముంబై లో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి జాబ్ చేయనవసరం లేదనుకుంటూ సంబంధాలు వెతుకుతున్న తరుణంలో...... ఆనంది ఏదో సందర్భంలో అలోక్ గురించి నీహార్ కి చెపితే అతనికి అలోక్ సంబంధం పట్ల ఇంట్రస్ట్ కలిగింది. "ఓకే ఆనందీ, మన హర్షిత మీ అలోక్ కి సూట్ అవుతుందన్న నమ్మకం ఉంది". ముందు మీ పిన్నీ బాబాయితో హర్షిత విషయం మాట్లాడమన్నాడు. వాళ్లకి అభ్యంతరం ఏమీ లేదని తెలుసుకున్న నీహార్ తరువాత తల్లీతండ్రిని అలోక్ ఇంటికి పంపించాడు మాట్లాడమని. వాళ్లు అలోక్ కి ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదనేసరికి, అలోక్ హర్షితను చూడడానికి రావడం ఒకరినొకరు ఇష్టపడడం ఆ తరువాత పెళ్లి అయిపోవడం జరిగింది. ఇద్దరికీ అలా జరగాలని ఘటన ఉన్నపుడు ఇందులో తన తప్పు ఏముంది? అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా కూతురు ఫోన్ లో ఏడ్చేస్తూ అలోక్ పై చాడీలు చెప్పేసరికి ఇక్కడ అత్తగారు లబ లబ లాడిపోతూ అందరికీ చెప్పేస్తూ ‘నీవు చెప్పావని ఈ సంబంధం చేసాం అంటూ తప్పంతా నీదే సుమా అన్నట్లుగా’ తనని సూటీపోటీ మాటలు అనడంతో తను చాలా బాధపడింది. అలోక్ కి ఫోన్ చేసి కనుక్కుందామా అనుకునేంతలో మర్నాడు పొద్దునే ఫస్ట్ ఫ్లైట్ లో హర్షిత బాంబే నుండి ఉఱుములేని పిడుగులా వస్తూనే తల్లి ని కౌగలించుకుంటూ ఏడ్చేయడం మొదలుపెట్టింది. ‘'ఏమైందే హర్షీ, ఎందుకేడుస్తున్నావ్, అలోక్ ఏమైనా అన్నాడా అని అడిగింది ఆవిడ’'. '‘అవునంటూ వెక్కుతూ జవాబిచ్చింది". "అంత కాని మాట ఏమన్నాడే తల్లీ"? "ఆదివారం హొటల్ కి వెళ్లి సరదాగా లంచ్ చేద్దామంటే, నా ఫ్రెండ్స్ ని పిలిచాను, లంచ్ కి వస్తున్నారు ఇంట్లో వంట చేయమన్నాడుట. నేను చేయనంటే కోపం వచ్చి తనమీద ఎగిరాడని, ఎందుకంత కోపం అన్నందుకు తన చెంపమీద కొట్టాడని, ఇంకా ఏవో చాలానే చెపుతోంది". అక్కడే నిలబడి వింటున్న తనవైపు అదోలా చూస్తున్న అత్తగారి చూపుల్లోని ఆంతర్యం అర్ధం చేసుకోలేని అమాయకురాలుకాదు తాను. అసలు తనవైపు కన్నైత్తైనా చూడని, తనని పలకరించని ఆడపడుచు సంస్కారాన్ని మొదటిసారిగా అసహ్యించుకుంది ఆనంది. సంసారమన్నాకా ఏవో చిన్న చిన్నగొడవలొస్తాయి. వాటిని పెద్దవి చేసుకుంటూ ఏడుస్తూ పుట్టింటికి వచ్చేసి తన కాపురాన్ని నలుగురిముందు ప్రదర్శన చేసుకోవడం ఎంత సిల్లీ? ఒక తల్లి గా కూతురికి మంచి చెడ్డలు చెప్పాల్సిన అత్తగారు ఆగ్రహావేశాలతో అలోక్ ను నిందించడం భరించలేకపోతోంది. ఇందులో హర్షిత తప్పేలేదా? ఎందుకులేదు? ‘తప్పంతా తన ఆడపడుచుదే'. ఇంక తను మౌనంగా ఊరుకుంటే లాభంలేదనుకుంది. దీనికంతటకూ కారణం నీవేనంటూ ముఖ్యంగా అత్తగారు తనను దోషిగా చూపులతో తినేయడం బాధ కలుగుతోంది. ‘అలోక్ కి మెసేజ్ చేసింది వెంటనే రమ్మనమని'. మర్నాడు ఫస్ట్ ఫ్లైట్ కి అలోక్ వచ్చాడు. అతను మామూలుగానే ఉన్నాడు. అందరితో నవ్వుతూ ఫ్రీగా మాట్లాడేడు. సంస్కారం అంటే అదీ. హర్షిత అయితే బయటకు రానేలేదు. ముఖం చూపించడానికి చెల్లడం లేదు మరి. అలోక్ కి పెళ్లైనాకా అప్పుడప్పుడు బాంబే నుండి ఆనందికి ఫోన్ చేసేవాడు. ' ఎలా ఉన్నావక్కా అంటూ'? ఏనాడూ హర్షిత గురించి ఒక్క కంప్లైంట్ చెప్పగా వినలేదు తాను. అత్తగారితో, మామగారితో తన భర్తతోనూ అప్పుడప్పుడు మాట్లాడతాడు. చాలా సరదాగా హర్షిత బాగుందని హేపీగా ఉందనే చెపుతాడుకానీ మరో విధంగా చాడీలు చెప్పడు. అటువంటి అలోక్ తనని బాధపెడ్తున్నాడని హర్షిత చెప్పడం వీళ్లంతా జాలిపడుతూ ఆ అమ్మాయి తరపునే మాట్లాడడంతో హర్షితకు ప్రోత్సాహకరంగా ఉంది. పెళ్లై ఒకరికి ఇల్లాలైనా చిన్న పిల్లల మనస్తత్వం పోని హర్షిత మీద జాలిపడాలో లేక కోప్పడాలో అర్ధంకాని పరిస్తితి. ‘తప్పు హర్షితది అయితే అలోక్ ని బ్లేమ్ చేయడం', దీని కంతటికీ కారణం తనదే అన్నట్లుగా మాట్లాడడం ఎంత విచిత్ర మనుకుంది. కొంతమందికి వయస్సు పెరిగినా సంస్కారం పెరగదు. ఆ కోవలోకే వస్తారు తన అత్తగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తరువాత అలోక్ అందరినీ సమావేశ పరిచాడు. హర్షితను కూడా తన పక్కనే కూర్చోమన్నాడు. తను హర్షితను ఎందుకు కోప్పడ్డాడో చెప్పాడు. అసలు వంట చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపదని, నెలలో ఇరవైరోజులు బయట ఫుడ్ తింటామని, వంట చేయమంటే హర్షితకు కోపం వస్తుందని చెప్పాడు. ఒక ఆదివారం ఫ్రెండ్స్ వస్తున్నారు, వంట చేయమంటే నేనేమైనా నీకు వంటమనిషినా అన్నందుకు కోపంలో చెయ్యి చేసుకోవడం తప్పేనని అన్నాడు. ''మీరు చెప్పండి అత్తయ్యా, ఎవరింట్లో వాళ్లు పనిచేసుకున్నా వంట చేసుకున్నా వాళ్లు పనిమనుషులూ, వంటమనుషులూ అయిపోతారా''? మా కంపెనీ డెలిగేట్స్ వచ్చినపుడు మీటింగ్స్ జరుగుతాయి. అప్పుడప్పుడు కాస్త డ్రింక్ తీసుకోవలసి వస్తుందని ముందరే హర్షితకు చెప్పాను కూడా. అలా ఒకటిరెండుసార్లు జరిగినందుకు హర్షిత నన్ను తాగుబోతంటూ బిరుదిచ్చిందని నవ్వుతూ చెప్పాడు. ప్రొఫెషనల్ గా స్నేహితులు ఎక్కువ. ఎప్పుడో ఒక్కోసారి ఇంటికి లేట్ గా వస్తే సత్యభామలా అలుగుతుందని చెప్పాడేగానీ హర్షితను కొంచెంకూడా నిందించలేదు. '‘అత్తయ్యగారూ, మీ అమ్మాయంటే మీకు మరీ అంత ముద్దా? నేనసలే తిండిపుష్టి కలవాడిని. పొద్దుట ఆఫీస్ లో కేంటిన్ ఫుడ్ ఎలాగూ తప్పదు. ఎందుకంటే హర్షిత పొద్దుట నిద్రలేచే సమయానికి నేను ఆఫీస్ కి వెళ్లిపోతాను. కాఫీ కూడా ఆఫీస్ కెఫ్టిరియాలోనే. రాత్రి ఇంటిభోజనం చేద్దామని హర్షిత చేతివంట రుచి చూద్దామని ఆవురావురమని ఆకలితో వస్తే ఈ సత్యభామ వంట చేసి పెట్టదు సరికదా స్విగ్గీ ఆర్డరిద్దామంటుంది. ఏమి పెంచారండీ మీ కూతురిని, ఒక్క పని నేర్పకుండా" అని నవ్వుతూ అనేసరికి ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది. '' మరి మా ఆనంది అక్క పొద్దుటే లేచి ఇంట్లో అన్ని పనులూ చేసి బావగారికి టిఫిన్, లంచ్ బాక్స్ కట్టి ఇస్తుంది కదా"? అల్లుడు నవ్వుతూనే చిన్న చురక అంటించేసరికి ఆవిడ జవాబివ్వలేక సిగ్గుతో తలదించుకుంది'. అత్తగారు కూతురికి ఏమి నీతిబోధ చేసారో తెలియదుగానీ రెండురోజుల తరువాత భర్తతో నవ్వుతూ బయలదేరుతున్న హర్షిత ఆనంది దగ్గరకు వచ్చి, ‘వదినా ఐయామ్ సారీ’ అనేసరికి హర్షితను దగ్గరకు తీసుకుంటూ 'ఆల్ ది బెష్ట్' అంటూ సాగనంపింది. వాళ్లు వెళ్లిపోయాకా ఆనంది అత్తగారి దగ్గరకు వచ్చి నెమ్మదిగా ''చూడండత్తయ్యా, వివాహాలు దైవనిర్ణయాలనే విషయం మీలాంటి పెద్దలకు నేను చెప్పగలిగేటంత గొప్పదాన్ని కాదు. హర్షిత ఏడుస్తూ మీకు ఫోన్ చేసిన ప్రతీసారీ దీనికంతటకూ కారణం నేనేనన్న తలంపుతో నన్ను చూసేవారు. నేను అలోక్ సంబంధాన్ని సూచించడం పొరబాటైనట్లుగా. మీ అమ్మాయే గోరంత విషయాన్ని కొండంతలగా చేసుకుంటూ తన సంసారాన్ని నలుగురి ముందు నగుబాటు చేసుకుంటోంది. తప్పు తనదైతే మీరు హర్షితకు నచ్చచెప్పకపోవడం పోయి ఇదేదో అంతా నా మూలానే జరిగిందని నన్ను ఒక అపరాధిలా చూడడం నన్ను చాలా బాధిస్తోంది. పెళ్లైన కూతురు తెలిసీ తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ అమ్మాయికి సర్ది చెప్పాలేగానీ ఆ అమ్మాయిని సమర్ధిస్తుంటే మీరు తనకి సపోర్ట్ గా ఉన్నారని మరింత అహాన్ని పెంచుకుంటూ తన సంసారాన్ని తానే పాడు చేసుకుంటుంది". "మీ స్తానంలో మా అమ్మే ఉంటే నా చెంప పగలకొట్టి మరోసారి నీ సంసార విషయాలు నా ముందు తేవద్దంటూ హెచ్చరించేది. పెళ్లైన ఆడపిల్లలు తమ పొరపాట్లను సరిదిద్దుకునేలా మీలాంటి తల్లులు నచ్చచెపితే అసలు ఏ ఒక్కరి సంసారాల్లోనూ ఏ సమస్యలు రావత్తయ్యా". కుటుంబ వ్యవస్తలు ఎంతో శాంతిగా ముందుకు సాగుతాయి. "పెద్దవారైన మీతో కొంచెం పరుషంగా మాట్లాడినందుకు క్షమించరూ" అనేసరికి శోభన ఆనంది ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. అత్తగారి కళ్లు చెమ్మగిల్లడం చూసిన ఆనంది ఆప్యాయంగా ఆవిడ కళ్లు తుడించింది. ***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









84 views0 comments

Comments


bottom of page