
'Thappu Thelisindi' - New Telugu Story Written By Padmavathi Divakarla
'తప్పు తెలిసింది' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కోమలికి కోరికలెక్కువ. కోటీశ్వరుడ్ని పెళ్ళాడి దర్జాగా బతకాలన్న ఆశయం అమెకి ఉన్నా తల్లితండ్రులు తమ శక్తి మేరకు ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం వెలగబెడుతున్న కామేష్కిచ్చి ఆమె పెళ్ళి చేసేసారు. అప్పట్నుంచి పాపం అసంతృప్తితో రగిలిపోతోందామె. తన కోర్కెలు తీర్చలేని కామేష్కి ఇచ్చి పెళ్ళిచేసి తల్లితండ్రులు తన గొంతు కోసారని ఆమె బాధ పడుతూ ఉంటుంది ఎప్పుడూ.
కామేష్ ప్రభుత్వ రంగ సంస్థలో మంచి నిజాయితీ పరుడైన ఉద్యోగి. కామేష్ అంటే అందరికీ గౌరవం. అతని జీతం తక్కువమీ కాదు. ఇంట్లో కావలసిన అన్ని హంగులు ఉన్నా, లేని వాటి కోసం వెంపర్లాడుతూ కోమలి అసంతృప్తితో రగిలిపోతోంది రోజూ. తమ ఇంట్లో స్మార్ట్ టివి ఉన్నా ఎదురింట్లో ఉన్నంత పెద్ద టివి లేదని ఆమె బాధ. అలాగే పొరుగింటి మీనాక్షి ఏవైనా బంగారం నగలు కొంటే అలాంటివే తనకీ కొనమని భర్తని పోరుతుంది. పక్కింటి పరిమళ కొత్త పట్టుచీర కొంటే అంతకంటే ఖరీదైన పట్టుచీర కొని అందరికీ చూపాలని ఆమె ఉద్దేశ్యం.
అందుకు ఆమె కామేష్ని పోరని రోజే లేదు. ఇరుగు పొరుగు అందరితో ఆమెకి ఎప్పుడూ పోటీయే! పాపం అప్పటికీ కామేష్ తన శక్తి మేరకు ఆమె కోరికలు తీరుస్తూనే ఉన్నాడు. అయినా ఆమెకి ఎప్పుడూ ఏదో మూల అసంతృప్తి ఉండనే ఉంటోంది.
"ఏమండీ!..." గోముగా కోమలి అనేసరికి కామేష్ ఉలిక్కిపడ్డాడు. ఆమె అలా గోముగా మాట్లాడిందంటే తన కోర్కెల చిట్టా విప్పుతుందని అతని భయం మరి.
"ఏమిటి?" అన్నాడు కాఫీ తాగుతూ.
"నా కోసం రవ్వల నెక్లెస్ కొనరూ!..." మరింత గోముగా అడిగింది కోమలి.
అప్పటివరకూ తీపిగా ఉన్న కాఫీ ఎందుకో హఠాత్తుగా చేదుగా ఉన్నట్లు తోచింది. మొహం అదోలా పెట్టి, "కోమలీ!...మొన్న నీ పుట్టిన రోజుకు నా ఏరియర్స్ అంతా పెట్టి నువ్వు కోరావని మంచి డైమండ్ రింగ్ కొన్నా కదా! ఇప్పుడే మళ్ళీ ఇంకో వస్తువు కొనాలంటే చాలా కష్టం. వచ్చే సంవత్సరం బోనస్ రానీ తప్పక కొనిస్తాను." అన్నాడు ఆమెను అనునయిస్తూ.
కోమలి బుంగమూతి పెట్టింది. మరొకప్పుడు అయితే ఆమెని చూసి చాలా ముచ్చటపడేవాడు కామేష్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
"మీరెప్పుడూ అంతే! ఏది కొనమని అడిగినా దాట వేస్తారు." అంది కినుకగా.
"అలా కాదు కోమలీ! నేను మాట ఇచ్చాను అంటే నీకు తప్పకుండా కొంటాను, కొద్దిగా ఓపిక పట్టు. బోనస్ రానీ!" అన్నాడు.
"పొరుగింటి మీనాక్షి కోరగానే ఆమె భర్త క్షణాలమీద కొని తెచ్చాడు తెలుసా! గర్వంగా మా అందరికీ చూపిస్తూ తెగ నీలిగింది. మీరు నాకు రవ్వల నెక్లెస్ కొంటానని మాటిచ్చి రెండేళ్ళు దాటిందిగానీ ఇంతవరకూ ఆ మాటే ఎత్తడం లేదు. మీనాక్షి వాళ్ళ ఆయనకి భార్యంటే ఎంత ప్రేమో తెలుసా! ఆమె ఏ చిన్న కోరిక కోరినా వెంటనే తీరుస్తాడు. మీరూ ఉన్నారు ఎందుకు?" భర్తని ఈసడిస్తూ చూస్తూ అంది కోమలి.
"ఆమె భర్త పాపారావు అవినీతిపరుడు. ఆ పాపపు సొమ్ముతో కొంటాడు. దండిగా లంచాలు దండుకుంటాడు, మరా డబ్బులేం చేసుకుంటాడు? లంచాలు తీసుకొని భార్యకి రవ్వల నెక్లెసేమి ఖర్మ, ఏడంతస్థుల మేడ కూడా కొనగలడు. అవినీతి నిరోధక శాఖకి చిక్కి ఉద్యోగంలోంచి సస్పెండ్ కూడా అయ్యాడొకసారి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! అలాంటి పాపారావుతో నన్ను పోల్చకు." అన్నాడు కామేష్ చిరాగ్గా.
"ఉద్యోగం నుండి సస్పెండ్ అయితే మాత్రం! మన నియోజకవర్గం ఎం.ఎల్.ఏ.ని పట్టుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరలేదూ? మీరూ ఉన్నారు ఏం లాభం? చేతకాని వాళ్ళే నీతులు చెప్తారు. భార్య కోరిన చిన్న కోరిక తీర్చడం కూడా చేతకాదు మీకు!" అంది కోమలి భర్తని చిన్నబరుస్తూ.
ఆమె మాటలకి ఖిన్నుడైయ్యాడు కామేష్. అయినా వెంటనే తేరుకొని, "అలా లంచం తీసుకోవడం నేరం. అవినీతి చేయడం దేనికి, మళ్ళీ తిరిగి ఉద్యోగం సంపాదించడంకోసం ఎవరో రాజకీయ నాయకుడ్నో, ఇంకెవర్నో పట్టుకోవడం దేనికి?
నాకు అత్మాభిమానం ఉంది, నేనలాంటి పని ఎన్నడూ చేయలేను. అయినా మనకిప్పుడు తక్కువేంటి? బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నందుకు నిజాయితీగా పనిచేయాలి. అంతే! ఈ సమాజంలో గౌరవంగా బతకాలి అంటే నీతి నిజాయితీ ముఖ్యం. అయినా నీకు రవ్వల నెక్లెస్ కొనడానికి లంచం తీసుకోవాలా ఏమిటి? నీకు మాట ఇచ్చిన నాటినుండి నేను బ్యాంకులో నెలనెలా అయిదువేలు చొప్పున దాస్తున్నాను. వచ్చేనెల బోనస్ కూడా వస్తుంది. ఆ డబ్బులతో నెక్లెస్ తెస్తాను సరేనా! అంతేకాని మరెప్పుడూ నన్ను అవినీతిలోకి దించడానికి ప్రోత్సహించవద్దు." అన్న కామేష్ మాటలు ఆమెకి చేదుగా తోచాయి.
అలా భర్త అనునయించినా ఆమె శాంతించలేదు. "చేతకాని వాళ్ళే ఇలాంటి కబుర్లు చెప్తారు. ఆ వచ్చే డబ్బులుతో ఇంకో వస్తువు చేయించుకోవచ్చు. పాపారావైతే ఇప్పుడు పోష్ ఏరియాలో ఓ విల్లా కొనబోతున్నాడు తెలుసా! మీరు మడి కట్టుకొని కూర్చుంటే మనం ఈ జన్మకి విల్లా కాదుకదా కనీసం ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కూడా కొనుక్కోలేము." అంది కోమలి రోషంగా.
ఆమె మాటలకి కోపం ముంచుకొచ్చింది కామేష్కి. "నాతో ఎలాగోలా తగువు పెట్టుకోవడమే నీ ధ్యేయం అయినట్లు ఉంది. ఎవరినా భర్త నిజాయితీ పరుడైతే సంతోషిస్తాడు. నువ్వేంటీ, నన్ను అవినీతివైపు, అడ్డదార్లు వైపు ప్రోత్సహిస్తున్నావు, నీ కేమైనా బుద్ధి ఉందా?" అన్నాడు కాస్త గట్టిగా.
భర్త మాటలకి కోమలికి మరికొంత మండింది. "పోనీ పాపారావు, అతని అవినీతి సంగతి వదలండి. ఆ అప్పారావుని చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకొండి. భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడు తెలుసా! భర్య చెప్పిన మాటంటే అతనికి వేదం తెలుసా?" అంది మళ్ళీ భర్తని రెండిళ్ళ అవతల ఉండే అప్పారావుతో పోలుస్తూ.
ఆ మాటలతో అప్పటి వరకూ శాంతంగా ఉన్న కామేష్కి కోపం నాసాళంకి అంటింది. ఉన్న సహనం అడుగంటింది. "అప్పారావుకి ఊరి నిండా అప్పులే! వాడి పేరు తలచుకుంటే తిండి కూడా పుట్టదు. వాడికి లేని దురలవాటు లేదు. వాడికి సెకండ్ సెటప్ కూడా ఉందని నీకు తెలుసు కదా. ఉదయం ఎలా ఉన్నా భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసినా, రాత్రైతే మందు వేసుకొచ్చి భార్యని చితక బాదుతూ ఉంటాడు.
అలాంటి పనికి మాలిన వాళ్ళతో నన్ను పోలుస్తావా నువ్వు. ఉండు, ఆ అప్పారావులా నిన్ను చితక బాదితే కానీ నీకు బుద్ధి వచ్చేట్లు లేదు. దెబ్బకి దయ్యం కూడా జడుస్తుంది. చూస్తే, నీకు పట్టిన దయ్యం అలా మాత్రమే వదిలేట్లు ఉంది!" ఆగ్రహం హద్దులు దాటిన కామేష్ అన్నాడు.
అయితే తన కోపం ఆమెపై ఎలా చూపాలో అర్థం కాక, చిరాకుగా వీధిలోకి అడుగుపెట్టాడు. రోజూ తనకు భార్య నుండి ఇలాంటి వేధింపులు ఎదురవడంతో ఏమి చేయాలో అర్థం కావడంలేదు. అమెకెలా బోధపర్చాలా అన్న అలోచనతోనే తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరాడు. కామేష్ కోపం చూసేసరికి ఒకసారి ఆలోచనలో పడింది కోమలి.
'అవును తనకేం తక్కువ? మంచి భర్త! వారానికో సారి సినిమాకో, షికారుకో తీసుకెళ్తాడు. ఏ దురలవాటు లేదు. లంచం తీసుకోమని అతన్ని రెచ్చగొట్టి తనే తప్పు చేస్తోంది. తన భర్త అంటే చాలా మందికి మంచి గౌరవం ఉంది. ఇక నుండి తను అతన్ని ఎప్పుడూ వేధించకూడదు.' మనసులో అనుకుంది జ్ఞానోదయం అయిన కోమలి. అతన్ని క్షమాపణ అడగాలని నిర్ణయించుకుంది. భర్త కోసం ఎదురు చూస్తూ గుమ్మం వద్దే నిలబడింది.
తల వంచుకొని ఇంట్లోకి రాబోతున్న కామేష్ని చూసి, "మీకు తలవంపులు తేవడానికి రెచ్చగొట్టిన నన్ను క్షమించండి. నా తప్పు తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇలాంటి మాటలనను." అంది మనఃస్పూర్తిగా. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"ఛ...ఊరుకో! మన మధ్య క్షమాపణలేమిటి? నీ తప్పు తెలుసుకున్నావు, అంతే చాలు! మనం సుఖంగా బతకడానికి కావలసింది డబ్బు ఒక్కటే కాదు. ఆత్మ సంతృప్తే సుఖమయ జీవితానికి ఉత్తమమైన సాధనం." అన్నాడు ఆమెని అనునయిస్తూ.
అతన్ని ఆపేక్షగా చూస్తు ఉండిపోయింది కోమలి.
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
కథ బాగుంది అభినందనలు