top of page
Writer's picturePandranki Subramani

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 1

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

ధారావాహిక ప్రారంభం


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 1 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 17/11/2024 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)




ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసు ప్రతీష్టాత్మక పోటీ పరీక్షల్లో ఉన్నత స్థాయిన విజయ పతాకం యెగురవేసి, అసిస్టెంట్ డైరక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముచ్చట పూడి నరసింహమూర్తికి అదృష్టమూ అవకాశమూ రెండూ కలగలసొస్తే కదలని కాలానికి సహితం అడుగులు వస్తాయన్నట్టు, ఒకటి తరవాత ఒకటిగా ముంగిట రాలుతూన్న పూల పత్రాల్లా శుభప్రద మైన వార్తలు చేరుతూనే ఉన్నాయి. 


జువ్విచెట్టు క్రింద తుమ్మచాప వేసుకుని ఆరగించే వనభోజనంలా అవి మోసుకొచ్చే పారవశ్యాన్ని పూర్తిగా అనుభవించ నీయకుండా, అదృష్ట పద నిర్వచనాన్ని ఆసాంతం అర్థం చేసుకోనివ్వకుండానే ఒకటి తరవాత ఒకటిగా ముప్పిరిగొంటున్నాయి; పూర్వబంధాలే కాదు- కలబోసి వచ్చే అవకాశాలూ పూర్వజన్మ సుకృతాలే అని నిరూపిస్తూ-- ఇదికాదా కాలమహిమ! 


మొదటిది- తను కలలో కూడా ఊహించని రీతిన హైద్రాబాదులోనే పోస్టింగ్ దొరికింది. రెండవది- తను ప్రయాసపడకుండా నే ట్యాంక్ బండ్ కి దగ్గర్లో విశాలమైన మూడవ గ్రేడ్ స్టాఫ్ క్వార్టర్స్ పళ్లెంలో నారి కేళ శ్రీఫలం పెట్టి అందించినట్టు అలాట్ మెంట్ చేతికందింది. దానితో బాటు పువ్వుకి తావి తోడైనట్టు గవర్నమెంటు ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేసి రిటైరయిన అతడి తండ్రి నరసింహులుగారికి ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకునేందుక అనువుగా జనసందడితో అలరారే లిబర్టీకి సమీపంగా ఉన్న బిల్డింగ్ కాంప్లె క్సులో డౌన్ ఫ్లోర్ అందుబాటులోకి వచ్చింది. ఆయన క్లీనిక్ కి వెళ్లి రావడానికి సౌకర్యంగా- మంచి కండీషన్ లో ఉన్న సెకెండ్ హ్యాండ్ కారు కూడా తన కాలేజీ మేటు ప్రమేయంతో తక్కువ ధరకు లభించింది. 


అంతటితో అదృష్ట దేవత మరలి వెళ్లిపోయిందా-- లేదు. అంగణంలో అడుగులు వేస్తూ అక్కడే నిల్చుండిపోయింది-- కదలనంటూ. అతడి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి సచివాలయం దిగువనున్న గురజాడ అప్పారావు హైస్కూలులో ఆఫీసు ఇన్ చార్జీ పోస్టు వెతుక్కుంటూ చేతులు చాచి నిల్చుంది. ఆమె ప్రతిరోజూ స్కూలుకు రానూ పోనూ స్కూల్ మేనేజిమెంటు వాళ్లే కారు పంపే యేర్పాటు చేసారు;మళ్లీ మధ్యా హ్న భోజనం కోసం ఇంటికి వచ్చీ పోయే శ్రమ కలగనీయకుండా గెస్ట్ రూము కేటాయించి- వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేసి, ఆ పట్టుతో టీచర్ ట్రైనింగ్ తీసుకున్న నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ నియామకం. 


ఇప్పుడేమో ముంగిట కట్టిన మాఁవిడి తోరణంలా మరొకటి—అతడికి మూడు నెలల స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాముకి రమ్మన మని పిలుపు!ఎక్కడికని- ఎక్కణ్ణించని –ఊహించడానికి కూడా వీలుకాని ప్రధేశం నుండి- యూ. ఎస్. ఏ.!ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు రావాలని- వచ్చి చూసి పోవాలని- వీలైతే అక్కడికక్కడే స్థిరపడిపోవాలని కలలుకనే అద్భుత అధునాతన అభివృ ధ్ది చెందిన అగ్రదేశం. 

చాలా మంది చూపులో అదొక ఇంద్రలోకం. అవకాశాల కాణాచి. తన ఎరుకలోఈ దేశానికి వెళ్ళడానికి తన కాలేజీ మేట్లు ఎంతమంది అర్రులు చాచి, ఎన్ని సార్లు కన్సలేట్ లో ఇంటర్వ్యూకి హాజరయి, చివరకి వీసా దొరక్క చతికిలబడ్డారని. 

కాని తన విషయంలో అదేమీ ఎదురు చూడకుండానే ఇంటి ముంగిట రెక్కలు కట్టుకుని వచ్చి వాలింది. ఏదో ఎక్కడో ఎప్పుడో జరిగుందంటారు గాని –ఆశల శ్వేత సౌధాలను నలువైపులా విస్తరింపచేసిన అసలైన గోల్డ్ రష్ అంటే ఇదే కదా!


కొడుకు ఎదిగాడని, ప్రయోజకుడయాడన్న తలపుతో ఆనంద పూరిత మనస్కులైన నరసింహులు దంపతులిద్దరూ కొడుకుని అక్కున చేర్చుకుని ఆశీర్వదించి- ఆ కమ్మటి కబురుని రాజమండ్రిలో ఉంటూన్న నరసింహమూర్తి పెదనాన్నకు జాప్యం లేకుండా అందజేసారు. అప్పుడూ యిప్పుడూ అన్న ప్రసక్తికి తావు లేకుండా ఆది నుంచీ వాళ్ల కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు నరసింహులు అన్నయ్య భూషణంగారే!


ఆయన విప్పారిన మనసుతో తమ్ముడి కొడుకుని మనసార దీవించి- అక్కడికె ళ్తూన్న కారణం ఏదైనా, ఐక్య రాజ్యసమితికి ఆయువు పట్టయిన అమెరికా వంటి పెద్ద దేశంలో కొన్నాళ్ళుండి రావడం ఉద్యోగ రీత్యా అన్ని విధాలా అనుకూల గుణాంశమేనని చెప్పి- నరసింహమూర్తి వెళ్లబోయే ప్రాంతం గురించి వాకబు చేసి, కొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుని, అక్కడి ట్రైనింగ్ ఇన్స్టి ట్యూట్ లోచేరిన తరవాత తను తీరిగ్గా మాట్లాడతానని ఫోను పెట్టేయబోయాడు. 


కాని నరిసింహ మూర్తి పెట్టనివ్వ లేదు- “అదేంవిటి పెదనాన్నా!వివరాలు సాంతమూ అడిగి తెలుసుకుంటు న్నారు!మీరెప్పుడైనా అక్కడకి వెళ్ళారా యేంవిటి?”భూషణం టాక్ ని కట్ చేసాడు. “అదంతా చెప్పడానికిప్పుడు సమయం లేదు గాని- ఒకటి మాత్రం చెప్తాను. అక్కడ నీకొక ముఖ్యమైన పని కాచుక్కూర్చుంది. నువ్వక్కడికి వెళ్లింతర్వాత చెప్తాలే! ఈలోపల నీకొక ఉత్తరం పంపిస్తాను. అది చదివి యెల్లప్పుడూ జార విడుచుకోకుండా జేబులో పెట్టుకోవాలి“ అని చెప్పి ముగించి, ఫోను నరసింహులుకి ఇవ్వమన్నారు భూషణంగారు. 


ఫోను తండ్రికి అందిస్తూ మనసున అబ్బురపడ్తూ అనుకున్నాడతను;నక్కకూ నాకలోకానికీ మధ్య ఉన్నంత తేడాగల వాతావరణంలో మనుగడ సాగిస్తూన్నపెదనాన్నకు అమెరికా ఖండంలో ఉన్న చలి ప్రదేశం గురించి అంతలావు ఎలా తెలుసుకోగలిగాడో మరి!అసలాయనకు అమెరికా పట్ల ఆసక్తి యెప్పుడు యెలా కలిగిందో-- 


నరసింహమూర్తికి స్పెషల్ క్యాటగిరీ క్రింద అప్లయ్ చేసిన వారం రోజుల్లోపల ఎటువంటి బాదరా బందీ ఎదురుకాకుండా పాస్పోర్టు చేతికి అందింది. ఆ తరవాత బేగం పేటలో ఉన్న అమెరికన్ కన్సలేట్ కి దరఖాస్తు పెట్టుకున్న మూడ్రోజుల్లోపల ఇంట ర్వ్యూ ఫిక్సయి— ఆరవరోజు అమెరికాకు వెళ్లగలిగే వీసా స్పెషల్ కొరియర్ ద్వారా ఇల్లు చేరింది. 


వీసా అందుకున్న మూడవరోజు- ఆఫీసు వాళ్లు సాదరంగా పిలిచి అందిచ్చిన ప్లేన్ టిక్కెట్టు తీసుకుని సహోద్యోగులు ఇచ్చిన టీ పార్టీకి హాజరయి అదేరోజు రాత్రి శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాడు నరసింహమూర్తి; పెట్టే బేడా- స్వెట్టర్లూ మూడు సూట్లూ ఒక రగ్గూ- వాటితో బాటు తదితర సామానూ నలభై కిలోల బరువు దాటకుండా పదే పదే తూకం వేసుకుని పరీక్షించుకున్నాడు. 


బరువు కొంచెం గాని దాటితే ఎయిర్ లైన్స్ వాళ్లు అదే అదునుగా పెనాల్టీ రూపంలో మోత బాగానే మోగిస్తారని అతడు విన్నాడు. తెలిసీ ఎందుకు తన పిలక వాళ్లకు అందివ్వడం!ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ పూర్తిచేసుకుని లాంజిలోకి ప్రవేశించేముందు అతడు మరచిపోకుండా జేబులో ఉంచుకున్న పెదనాన్న ఉత్తరాన్ని తీసాడు. కళ్లు పెద్దవి చేసుకుని చదవసాగాడు- 


“అయ్యా నహసింహమూర్తి! ఫోనులోమరీ యెక్కువగా వివరాణ్మతకంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇది వ్రాస్తున్నాను. మనం యెప్పుడూ యెదుటివారిలోని సకారాత్మక గుణాంశాలనే గుర్తించాలి. తతిమ్మావన్నీ తుక్కూ తూగరా వంటివే.. సాధారణంగా దుర్యోధణున్ని అహంకారి అత్యాశపరుడనే అంటారు. కాని అతడిలోని సద్గుణాణ్ణి కూడా గర్తించాలి. అతడిలో వెల్లి విరిసిన స్వఛ్ఛమైన స్నేహభావం- చివరివరకూ అతడి మిత్రుడు కర్ణుడి పట్ల చూపించిన విశ్వాసం. అదే విధంగా శుక్రాచార్యుడు. అతడు రాక్షసుల గురువే కావచ్చు. 


కాని మహాజ్ఞాని. ఆయన తన కూతురు దేవయానికి చెప్పిన సూక్తి ఇది— ‘ఇతరులు కోపిస్తే కోపించకుండా ఇతరులు నిందలు పలికితే, మరి వాటిని విననట్లే మారు పలకక, అవమానం పొందికూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమా భూమియందు ధర్మమెరిగిన వాడు‘ 


ఇక దీనిని యెంతవరకు పాటిస్తావో నీ బాధ్యత” ఉత్తరాన్ని చదివి నవ్వుతూ జేబులో పెట్టుకుని పెదనాన్నగారికి ఫోనుచేసి చెప్పాడు; ఆయన మాట ప్రకారమే స్వీట్స్ షాపునుండి స్వీట్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాడని- వాటిలో రెండు కిలోల మైసూరుపాకు- రెండు కిలోల లడ్డూలు- మరో రెండు కిలోల పూతరేకులూ, వాటితో బాటు మిక్షర్ కూడా కొనుక్కుని ఉంచుకున్నా డని. 


అంతా చెప్పిన తరవాత- ‘ఇంతకూ వాటిని ఎవరింటికి వెళ్లి ఇవ్వాలి? వాళ్ళెవరు- ఎక్కడున్నారు?’అని అడిగాడు నరసింహమూర్తి. 


దానికి ఫోనులోనే భూషణంగారి నవ్వు వినిపించింది- “నువ్వు మరీ టెన్షన్ అయిపోకురా అబ్బాయ్! ఇదేమీ పెద్ద కొంపమునిగే పని కాదు. వాళ్లే వచ్చి నిన్ను కలుసుకుంటారు. అన్నీ ఒకళ్లకే ఇవ్వనవసరం లేదు. వాటిలో కొన్నిటిని మీ సహ ట్రైనీలకో మరెవ్వరికో పంచిపెట్టు. ఎంతటి గవర్నమెంటు స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అయినా అక్కడి వాళ్ల పరిచయమూ సహకారమూ నీకు కావల్సి ఉంటుందిగా!” 


“అలాగే పెదనాన్నా!ఇంతకూ ఆ వచ్చేవారెవరో చెప్పనే లేదు పెదనాన్నా!”


“చెప్పాను కదరా! ఆయన నా ఫ్రెండ్. స్కూలుమేటు కూడాను. నిన్ను చూడటానికి రిడ్జ్ మోంట్ విలేజినుండి వస్తాడు“


“మీ చిన్ననాటి నేస్తమేమిటి- విలేజిలో ఉంటున్నారా?”


“అబ్బే!విలేజంటే మనం అనుకునే విలేజీ కాదోయ్. పకడ్బందీగా కట్టిన ఇండ్ల సముదాయాలను అక్కడి వాళ్లు ముచ్చటగా విలేజీ అంటుంటారు. అందుకే అంటున్నాను- నువ్వేమో వినిపించుకోనంటున్నావు. నువ్వుగా వాళ్ల ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేయకని. నువ్వుగాని పనిగట్టుకుని అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించావే అనుకో-- నీకు దొరికే దినభత్యం గాలిలోకి పుసుక్కున ఎగిరిపోతుంది. 


అసలా బాదరీ బందీ నీకు అవసరమే లేదు. ఆయనే వస్తాడు. నీవు చేయవలసింది ఒక్కటే!నన్ను చూసుకున్న ట్టు ఆయనను ట్రీట్ చేయి. ఇక నేనెందుకు ఇక్కణ్ణించి కంఠతా పట్టినట్టు అన్నీ వప్పచెప్పడం! నీకక్కడ కొంచెం సర్ప్ రైజ్ ఎదురవాలనే గ్యాప్ యివ్వడం- ఓకే-- “


అలాగే- అంటూ బదులిచ్చి ఫోను పెట్టేసి మనసులో మిక్కిలి అబ్బురపాటుకి లోనయాడు నరసింహమూర్తి- ‘రెండు మూడు ప్లేన్ లు మార్చి పలు సెక్యూరిటీ చెకింగ్సుకి లోనయి అక్కడకు వెళ్లడమే పెద్ద సర్ప్ రైజ్. ఇది చాలదని మరొక సర్ప్ రైజ్ కూడానా! ‘పెదనాన్నది మరీ ఛాదస్తం కాకపోతే- 


పెదనాన్నంతటి వయసు గల వ్యక్తిని గౌరవభావం తో చూడాలన్నఆపాటి ఇంగితం ఒక సెంట్రల్ గవర్నమెంటు ఈఫీసరుగా ఎదిగిన తనకుండదా!’ఏమో మరి- ఎంతైనా అమెరికా ఫ్రెండు కదా- ఏండ్లుగా అక్కడి పరిసరాలకు ఆనవాయితీలకు అలవాటు పడ్డవాడయి ఉంటాడు కదా-- ఆయనతో కొంచెం జాగ్రత్త గానే మెసలుకోవాలేమో! 


ఇక్కడి వాళ్లు అక్కడి వాళ్ళూ అన్న వ్యత్యాసం లేకుండా ఎక్కడి వాళ్ళయినా వయసు పైబడ్డ వాళ్ళు పెద్దరికం ఎక్కువగానే చూపిస్తారు. మన్నన ఎక్కువగానే ఎదురు చూస్తారు. భారతీయ మూలాలున్న వాళ్లందరూ ఆవిషయంలో టచ్చీ- గానే ఉంటారు. ఎక్కడున్నా యెలా ఉన్నా ఎమోషనల్ టెంపర్మెంటు అనేది ఉంటుంది కదా!అది గుర్తించి మెసలుకోవడం ఉభయ తారకమేగా! 


ఆ కోవన చూస్తే అటువంటి విషయాలలో అతడి తల్లి కూడా తక్కువ తిన్నదేమీ కాదు. డైనింగ్ టేబల్ పైన అన్నం వడ్డిం చడంతో సరిపెట్టుకోదు. కూరల్ని నింపిన గిన్నెల్ని వరసగా పేర్చడంతో ఊరుకోదు. ’అది తీసుకోలేదేం?ఇది మరచిపోయావేం? అది ఆరోగ్యానికి మంచిదని తెలవదా! చిక్కుడు కాయల వేపుడు బాగుంటుంది. ఇదిగో- వంజరం చేప పులుసు. నీకిష్టమని బజా రులో వెతికి తెచ్చాను‘ అంటూ హడావిడి చేసేస్తుంది. 


అప్పుడు తను స్పందిస్తాడు- ‘అమ్మా! నువ్వెళ్లి నాన్నగారిని గమనించు. నాకేది కావాలనిపిస్తుందో నేనదే తీసుకుంటాను. చిన్నప్పట్నించి తింటున్నవాణ్ణి. నువ్వు వండిన కూరల రుచి ఎలాగుంటుందో నాకు తెలియనిదా!‘ 


ఐనా ఊరుకోదు అమ్మ. వీళ్లందరి చూపుల్లో తనింకా చిన్నపిల్లాడిలాగే కనిపిస్తున్నాడేమో! తనొక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరన్నది వీళ్లెప్పుడు గుర్తిస్తారో మరి! అప్పుడు అదను చూసి మాధవి చురకేస్తుంది- ‘వంశోధ్దారకుడికి అడుగ డుగునా రాచమర్యాదలా! రేపో మాపో మెట్టింటికి పోయే ఆడపడుచు పట్ల బింకాలా!‘


అమ్మఅప్పటికీ ఊరుకోదు. పనిగట్టుకుని వెళ్ళి, దానికొక మొట్టికాయ పెట్టి మళ్ళీ తన ధోరణి అదే రీతిన సాగిస్తుంది. తల్లి ధోరణి సరే సరి- మరి పెదనాన్నగారు కూడా తనను చిన్నపిల్లాడిలా చూస్తే ఎలా? ఇక ఎవరికి వారు అలానే తనను ట్రీట్ చేస్తూపోతే తను బ్రతికి బట్ట కట్టవద్దూ! స్కూల్ మేట్స్ ముందూ కాలేజీ మేట్స్ ముందూ పరువు దక్కించుకోవద్దూ!


కళ్ళముందున్న ప్రపంచం వింత వింత శోభలతో కొండలూ కోనలూ దాటి గ్రహాంతర సీమల వేపు ఊహకందని వేగంతో దూసుకు వెళ్లిపోతూంది. కాని ఇచ్చటి ముచ్చటపూడి వాళ్ళు మాత్రం ఇంకా అలాగే మార్పుకి తావివ్వకుండా ఏమీ జరగనట్టే ఎక్కడి వాళ్ళక్కడే ఉన్నారు. 


పాశ్చాత్య యువతీ యువకులు ఎక్కడ ఇష్టపడితే అక్కడే చర్చిలోనో మరెక్కడనో ఎంచక్కా పెళ్ళి ప్రమాణాలు తీసుకుని ఆ తరవాత తీరుబడిగా తల్లి దండ్రుల ముందు వచ్చి నిల్చుంటారు. ఆపైన వాళ్ళేమో బిక్కముఖాలు వేసి కోడలి పిల్లను ఆహ్వానిస్తూ కిక్కురుమనకుండా ఊరుకుంటారు. తనుగాని తెగించి అలా చేస్తే ఇక్కడేమవుతుందో మరి! 


మొదట పెదనాన్నే బెత్తం పట్టుకుని వెంటబడతాడు. ఆ తరవాత నరసింహులు గారు అన్నగారికి వత్తాసుగా యెగబీలుస్తూ వస్తారు-- అందుకే నరసింహమూర్తి ముందు చూపుతో నిగ్రహించుకుంటూ ఆశల అలల్ని దరి చేరనివ్వకుండా పాదాలు తడవనివ్వకుండా చూసుకుంటాడు. పెళ్ళింకా కాని తోటి లేడీ ఆఫీసర్లనుండి సాధ్య మైనంత మేర తొలగి ఉంటాడు. తెలిసీ అడుసు తొక్క నేల- కాలు కడుగనేల! చూడాలి-- మిస్టర్ నరసింహులు మేడమ్ వర్థనమ్మ తన కోసం ఎటువంటి అమ్మాయిని వెతుకుతారో! ఏ ఊరి అమ్మాయిని వెతికి తీసుకువస్తారో!


ఇక మాధవి ఎలాగూ ఉందిగా! అది మాత్రం ఆడపడచు ఆధిపత్యాన్ని విడిచిపెట్టు కుంటుందా? అప్పుడు దాని రోల్ ఎలా ఉంటుందో- అదీ చూడాలి. ఉద్యోగంలో ఎదగ వచ్చు. అనుభవంలో రాటు తేలవచ్చు. కాని-- వీళ్ళ చూపులోనే యెదగడం కష్టం-- అతడలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అనౌన్స్ మెంటు కాల్ వచ్చింది, 


గేటు నెంబరు రెండు వద్ద నిల్చోమని. షర్టు గుండీలు వదులు చేసుకుంటూ లేచి నిల్చుని ఓ విషయం తలంపుకు వచ్చి మనసున అబ్బురప డకుండా ఉండలేక పోయాడు; అంతటి అత్యాధునికమైన అంతర్జాతీయ విమానా శ్రయం యురోపియన్ వాళ్ల స్థాయిని సహితం మించిన రీతిలో కట్టిన విమానాశ్రయం ఒక తెలుగువాడి నిర్మాణ సామర్థ్య ప్రతిబింబమే కదా! ఇది తెలుగువాడికి గర్వకారణమే కదా! తను వెళ్ళబోయేది పాశ్చాత్య దేశం. ప్రపంచ ప్రసిధ్ది పోందిన రాక్ స్టార్లు హడావిడి చేసే నిత్య నృత్యాల నిలయం. తనకు మళ్ళీ తెలుగు నుడికారాల సొబగుల్ని వినగల సువర్ణావకాశం ఎప్పుడు లభిస్తుందో! నరసింహమూర్తికి మనసు మూలన దిగులేసింది. 


“ఏ దేశమేగినా- ఎందుకాలిడినా- ఏ పీఠమెక్కినా- ఎవ్వరేమనిన- పొగడరా నీతల్లి భూమి భారతిని”


రాయప్రోలువారి గేయం అతడి మనసుని ఆర్ద్రతతో నింపింది. మరి కొద్ది సేపట్లో అతడెక్కిన లోహపక్షి నింగిని ఛేదిస్తూ మేఘాలను చెల్లాచెదురు చేస్తూ పైకి ఎగిసింది. 

=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





54 views0 comments

Comments


bottom of page