top of page
Writer's picturePandranki Subramani

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 10

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 10 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 15/01/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. 

ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నరసింహ మూర్తి, షేక్ అహ్మద్ ల మధ్య చర్చ నడుస్తుంది. 


పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, ఆమె చెల్లెలు మోహనాలతో ఔటింగ్ వెళ్లే అవకాశం వస్తుందతనికి. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. 


ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 10 చదవండి.. 


సుజాత కారునాపి పార్కింగ్ స్పాట్ లో నిలిపి, వెనుక సీట్లో కూర్చున్న నరసింహమూర్తి దిగడానికి వీలుగా వెళ్ళి తలుపు తీసి నిల్చుని అంది- “మంచుగాలులు వీస్తున్నట్లున్నాయి. మఫ్లర్ బిగించి చుట్టుకోండి“. 


అతడు దిగీ దిగడంతోనే అన్నాడు మెచ్చుకోలుగా- “వండర్ ఫుల్ డ్రైవింగ్! ”అన్నాడు. 


ఆలోపల అక్కడికి చేరుకున్న మోహన చురుక్కున నవ్వుతూనే అంది- “ఇందులో మా అక్కయ్య ఘనకార్యమేదీ లేదండీ బాబూ! ఇక్కడి రోడ్లు అంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయి మరి. రహదారుల్ని అంత పకడ్బందీగా చూసుకుంటారు. ఎంతైనా మీరు ఇండియా నుండి వచ్చిన వారు కదా- అలానే అంతా వింతగా కొత్తగా కనిపిస్తుంది!” 


సుజాత చెల్లి మాటకు రియాక్టయింది- “అలాగే అనుకోవే— మరి నన్ను మెచ్చుకుంటే మధ్య నీకేమొచ్చిందే ?”


“నాకేమీ కాలేదు. బాగానే ఉన్నాలే! మీ ఇద్దరి మధ్య ఇంతలోనే ప్లీజింగ్ మెరమెచ్చులు మరీ ఎక్కువ కాకుండా హెచ్చరించాలని-- “అంటూ స్వెట్టర్ని సర్దుకుంటూ ముందుకు నడిచింది. 


సుజాత ఊరుకోదలచలేదు. ”నాకు నువ్వు బాడీ గార్డుగా ఉండన వసరం లేదులేవే! ” 


అప్పుడు అక్కయ్య వేపు తిరిగి చూసి మోహన పక్కున నవ్వేసింది- “ఇంత చిన్నదానికి అంతటి కోపం ఎందుకే అక్కాయ్? ఐనా నాకెందుకులేవే తల్లీ మీ మధ్య పానకంలో పుడకలా--” అంటూ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ వేపు నడక వేగం పెంచింది. 


అప్పుడు సుజాత నరసింహమూర్తి ప్రక్కన నడుస్తూ మాటలు కలుపూనే అంది- “ఔను నరసింహమూర్తి గారూ! మా చెల్లి రోడ్ల విషయంలో అన్నమాటల్లో వాస్తవం ఉంది. ఎలాగంటే- అమెరికాలో ఇన్ని మంచి మంచి రోడ్లు ఇన్ని పచ్చదనాన్ని పుణికి పుఛ్చుకునే రోడ్ల డివైడర్లూ ఉన్నాయంటే అదంతా అమెరికన్ సైనికుల చలవే! రెండవ ప్రపంచ యుధ్దం పూర్తయిన తరవాత చాలా మంది యుధ్ధ సైనికులు సర్ప్ లెస్ గా మిగిలిపోయారు. కాని యు- ఎస్. ఏ చట్టం ప్రకారం సైనికుల్ని ఉద్యోగాల నుండి తొలగించి స్వఛ్ఛంద ఉద్యోగ విరమణ ఇప్పించే ప్రసక్తి లేదు. అంచేత వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో చాలావరకు ఇన్ఫ్రా స్టక్చర్ నిర్మాణాన్ని ముగించారు”

అది విని- “వినడానికి ఈ చారిత్రాత్మక అంశం చాలా బాగుంది” అన్నాడు నరసింహమూ ర్తి. నిజానికి అదే చారిత్రక అంశాన్ని అతడు విన్నాడు కూడాను. కాని వాటి నిర్మాణాన్ని స్వయంగా చూడటం అదే మొదటిసారి- 


కాని అలా రివ్వు రివ్వున నడచి వెళ్ళిన మోహన నిజానికి మార్కెట్ కాంప్లెక్సులోకి ప్రవేశించలేదు. అక్కయ్య అక్కడకు వచ్చేంత వరకూ ఆగి, చేయి పట్టకుని ప్రక్కకు తీసుకెళ్లి గుసగుసలాడినట్టు అడింది- “నన్ను బాడీ గార్డుగా ఉండనవసరం లేదుంటున్నావే- మరి నీకు నీవుగా ఎవరినైనా బాడీగార్టుగా ఎంపిక చేసుకున్నావేమిటి?”


ఆ మాటకు సుజాత కోపంగా చూసింది గాని ఏమీ అనలేదు. ‘ఈ కొంటె కోణంగితో మాటలు కలపడం ఎందుకులే!’ అనుకుంటూ తన వద్ద ఉన్న మెంబర్ షిప్ కార్డుని అక్కడి ఎంట్రీ స్టాఫ్ కి చూపించి లోపలకు నడిచింది. 


అక్కడి సూపర్ మార్కట్లలో వాళ్లనీ వీళ్ళనీ వెతికి పట్టుకుని ఏ భోగట్టా అడగనవసరం లేదు. కంప్యూటర్ మోనిటరింగ్ సిస్టమ్మే మార్గదర్శకం చేస్తూ తీసుకెళ్తుంది. 


నరసింహమూర్తి అంతా పరకాయించి చూస్తూ నడుస్తున్నాడు. వాళ్ళు వెళ్తూన్న సూపర్ మార్కెట్ చాలా విశాలంగా పుస్తకాల బీరువాలా తీరుగా కుదురుగా ఉంది. అక్కడ కార్లు నడిపే తీరులో— అకారణంగా హారన్లు హోరెత్తించకుండా పాదాచారులను మన్ననతో రోడ్డు దాటనిచ్చే విధానం— హైరోడ్డు మలుపు వద్ద కార్లు వరుసగా నిల్చుని ట్రాఫిక్ నియమాలను పొందికగా పాటిం చే పధ్ధతీ— రద్దీలో కూడా ఒకరినొకరు ఒరుసుకోకండా ఒడుపుగా నడచుకునే జాగ్తత్త— నరసింహమూర్తికి మనసా వాచా కర్మణ: నచ్చాయి. 


ఇక్కడ రోడ్డు ప్రమాదాలు తక్కువగా సంభవించడానికి వాళ్ళకు వాళ్లు పాటించే స్వఛ్ఛంచ కట్టుబాట్లు కారణమేమో! మరి ఇంత తీరుగా పకడ్బందీగా భారతదేశంలో ఎందుకు లేదూ?అక్కడ జన సందోహం ఎక్కువ కావడం వల్లనేగా! మరి ఇప్పు డిప్పుడే వచ్చిన కేంద్రం ప్రభుత్వం యెటువంటి మార్పులు తెస్తుందో చూడాలి- ఓపిక పట్టి గమనించాలి. 


అతడలా ఆలోచనా తరంగాల మధ్య తేలుతూ ప్యాంటు జేబుల్లో రెండు చేతుల్నీ జొనిపించి నడుస్తున్నవాడల్లా చటుక్కు న ఆగి సుజాత వేపు తిరిగి- “చాలా చలిగా ఉంది సుజాతగారూ!” అన్నాడు వేసుకున్న స్వెట్టర్ ని బిగుతుగా సర్దుకుంటూ. ఆమె అతడి వేపు తిరిగి ఆశ్చర్యంగా చూసి ఆ తరవాత ఉన్నపళంగా నవ్వేసింది. 


“మీకింకా తెలియదన్మమాట! మీరిప్పుడు మితమైన వెచ్చదనాన్నిచ్చే మూడు నెలల గడువు కాలంలో ఉన్నారు- ఇది మాకు అమృత ఘడియలన్నమాట. - ఆగస్ట్- సెప్టంబర్- అక్టోబర్. ఇప్పుడంతగా చలిలేని అందమైన సెప్టంబర్ నెలలో ఉన్నారు మీరు. ముందున్నది మొసళ్ల పండగంటారే- అది నవంబర్ నెలనుంచి ఆరంభమవుతుంది. అప్పుడు మంచు కురవదు. పేరుకుపోతుంది. స్టాండర్డ్ టైముని వెనక్కి లాగుతారు. 

అంతే కాదు- ఇప్పుడిక్కడ కస్టమర్ల కోసం రెగ్యులేటడ్ ఏ సీ పెట్టారు. ఐనా మీకింకా చలివేస్తుందంటే- మీకు నార్త్ కరోలినా వాతావరణం అలవాటు కాలేదన్నమాట”


“అబ్బో! ఇంకా ముందున్నదన్నమాట హిమపర్వత శిఖరాల తాకిడి! ఇక పైన హాస్టల్ జిమ్ లోనే అచ్చిబుచ్చి వ్యాయామాలతో సరిపెట్టుకుని చలిపులి వాతన పడకుండా బైటకు రాకుండా చూసుకోవాలి”


“అబ్బే! మరీ భయపడిపోకండి రాజమండ్రి బావగారూ! మీరు ఇండియా వెళ్ళేలోపల మీ అమ్మానాన్నలూ మీ పెద్దమ్మ పెదనా న్నగారూ కలసి మీకు నిజంగా వెచ్చదనం ఇచ్చే సంబంధం చూసి ఉంచరూ?”


ఈసారి నిజంగానే సుజాతకు కోపం వచ్చింది. చెల్లెలి నెత్తిపైన మొట్టికాయ పెట్టి- “ఏమిటే ఆ హద్దు మీరుతూన్న మాటలు! అదీను ఇండియా నుంచి వచ్చిన మూడో మనిషి తోనా! ఆయనేమిటి మనలా అమెరికాలో పుట్టిపెరిగిన వారనుకుంటున్నావా! నీ చేష్టలన్నీ నీ అమెరికన్ ఫ్రెండ్సుతో పెట్టుకో”


అప్పుడు నరసింహమూర్తి కలుగచేసుకున్నాడు- “మీరు ఫీల్ అవకండి సుజాతగారూ! మోహన నన్ను ఉద్దేశించేగా అ న్నారు. అదీను సరదాగానేగా అన్నారు. మీ జోలికి రానేరాలేదు”


“ఐతే మాత్రం! స్వంత మేనత్త కొడుకులా స్వంత మేనబావలా ఆ సరసాలేమిటి ఆడా మగాతేడా లేకుండా?”


“ఐతే నేమి సుజాత గారూ! నన్ను స్వంత మేనబావనే అనుకోనివ్వండి. ఐ డాంట్ మైండ్! నేనుండేది మూడు నాలుగు నేలలేగా! నన్ను ఆటలు పట్టిస్తూ హాయిగా నవ్వుకోనివ్వండి. మీరూ కలసి నవ్వండి. మాటల్లో పడి మరచిపోకుండా నన్నుకూడా నవ్వించండి” 


సుజాత నిదానంగా నరసింహమూర్తి ముఖంలోకి తేరిపార చూసి మృదువుగా మెల్లగా అంది- “మీరిక్కడి అమెరికన్ అమ్మాయిలతో యురోపియన్ అమ్మాయిలతో మరీ మెతగ్గా ఉండకండి మూర్తిగారూ!”


ఆ మాటకతడు విస్మయంగా చూస్తూ- “మరి మీరు కూడా అమెరికన్ అమ్మాయేగా!” అన్నాడు. ఆమె నవ్వి ఊరకుంది. కాని సీమ టపాకాయి చెల్లి ఊరుకోదుగా! 


మోహన అక్కయ్య ముఖంలో కదిలాడే బావరేఖల్ని చదవడానికి ప్రయత్నిస్తూ పక్కున నవ్వేసింది- ‘ఇప్పుడేమంటావు?’ అని అడుగుతున్నట్టు కనుబొమలు ఎగుర వేస్తూ-- 


ఇద్దరివీ సైకత గుళ్ళవంటి దాగుడు మూతలే. పెదనాన్నగారి మిత్రుడైన శ్రీరామ్ గారికి తెలవదా-- ఆ మాటకు వస్తే ఇక్కడి అక్కాచెల్లెళ్ళద్దరికి మాత్రం తెలవదా-- భూషణంగారు తన తమ్ముడి కొడుకుని పనిగట్టుకుని తమింటికి ఎందుకు పంపించారో! ఇక ఎటొచ్చీ సుజాత అభిప్రాయాన్ని మాత్రమేగా చివరి దశన తెలుసుకుని తేల్చాలి. 


చెప్పాల్సి వస్తే తన అక్కయ్య తనలాగే అమెరికాలో పుట్టి పెరిగినదయినా అచ్చు ఇండియన్సులా బోలెడంత పనికిరాని మొహమాటాలు బాగానే అలవర్చుకుంది. ఎంతైనా రఁవణమ్మ గారి ముద్దుల మనవరాలు కదూ మరి! ఆమె నీడన వెలసిన అలవాట్లూ ఆనవాయితీలూ ఎక్కడికి పోతాయి గనుక. ఇండియన్స్ లాంఛన ప్రాయమైన కుడ్యాల నుండి మోహన అక్కయ్య యెప్పుడు బైట పడుతుందో మరి! 


విషయం అనుమానపు అంచున తొంగి చూస్తూన్న వైనం వాస్తవమైనా, ఇంటిల్లిపాదీ అంతటి మన్నన తన పట్ల ఎందుకు చూపిస్తున్నారో మూర్తి ఊహకు అందనిదా! నరసింహమూర్తి ముఖ కవళికల్ని గమనిస్తూ కదలిన సుజాత అంది- “దాని మాటల్ని ఎక్కువగా పట్టించుకోకండి. చిన్నప్పట్నించీ దానికి మా ఇంట్లో గారం ఎక్కువే లెండి. రండి! షాపింగ్ చేద్దాం”


అతడు చిన్నగా నవ్వి ఆమె వెనుక నడిచాడు. కాని నోరు మెదప లేదు. ఎక్కడ తెలుగు గడ్డ! ఎక్కడ అమెరికన్ గడ్డ! ఇప్పుడతను ఊరుకాని ఊరులో ఇద్దరు అందమైన తెలుగమ్మాయిల వెంట నడుస్తున్నాడంటే అతడికే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంతకూ వీళ్ళను అమెరికన్ అమ్మాయిలనాలా లేక తెలుగుమ్మాయిలనాలా! ఎటూ కాకుండా రఁవణమ్మగారి ముద్దుల మనవరాళ్ళంటే బాగుంటుందేమో! 


మొత్తానికి అతడికి ఒక్కటి మాత్రం బాగా అవగాహనకు వస్తూంది. తన గురించి తను అమెరికా గడ్డ చేరుకోకముందే వీళ్ళ ఇంట్లో పెద్దభాగోతమే జరుగి ఉంటుంది. అదేమిటన్నది అతడికి ఇప్పటికిప్పుడు పూర్తిగా అంతు చిక్కడం లేదు. అదెంత కాలంలే! ఎవరైనా సరే- ఎటువంటి వారైనా సరే- పిడికిలి ఎప్పుడూ మూసుకుంటూ ఉండలేరుగా! ఈ వ్యవహారం గురించి పెదనాన్నకు తెలుంటుంది. కాని ఆయన బిగించిన పిడికిలి అంత త్వరగా విప్పరు. అప్పుడు అతడిలో మునుపటి దిగులే మళ్ళీ పొడ సూపింది. తను మాత్రం ఇక్కడ ఎన్నాళ్ళుంటాడని! మూసిన కనులు తెరిచే లోపల వీసా గడువు ముగిసి పోదూ! తను యథా తథంగా భారత దేశపు గడ్డపైన పాలపిట్టలా వాలడూ! ఇంత దానికోసం తనకెందుకిన్ని తర్జన భర్జనలు. 


కాని— కాని- వెండి మబ్బులా తళుక్కున మెరుస్తూ మనసుని అదేపనిగా మురిపిస్తూ ముప్పిరిగొంటూ కళ్ళెదుట కదిలే సుజాత వంటి సౌందర్యవతిని, వరూధిని వంటి గాంధర్వకన్యను మరవడం యెలా! మనసు మౌనంగా నిట్టూర్చింది. సాధారణంగా ఇక్కడి అమ్మాయిలు ఫ్రెండ్లీగా కలుపు గోలుతనంతో మెసలుతారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లూ ఇక్కడ పుట్టి ఇక్కడి వాళ్ళమధ్య పెరిగిన వాళ్లేగా! విషయం త్వరలోనే బైటకు వచ్చేస్తుందన్న విశ్వాసం కలగ సాగిందతడికి; కనీసం తన తిరుగు ప్రయాణం ఆరంభమయే లోపల- . 


కాసేపటికి తనను తను తమాయించుకున్నాడు నరసింహమూర్తి. మనుసుని తేలికపర్చుకుంటూ నవ్వుతూ అన్నాడు- “ఇదేమిటి సుజాతగారూ! సూపర్ మార్కెట్ అంటూ మళ్ళీ దీనిని సామ్స్ క్లబ్బంటారేమిటి? సిటీ ఆఫ్ క్యారీ వాళ్లకు అన్నీ ఒక్క లాగే కనిపిస్తాయేమిటి?”


దానికి ఆమె కూడా నవ్వుతూనే బదులిచ్చింది- “అర్థం ఉందండి నరసింహమూర్తిగారూ! అదిగో- అటుచూడండి- వాల్ మార్ట్ సూపర్ మార్కెట్! ”


“ఔను. అది ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన వాణిజ్య సంస్థ. ఇండియన్ రిటైల్ మార్కెట్ లోకి రెక్కలు విప్పిపూర్తిగా వ్యాపించడానికి తెగ తంటాలు పడుతూంది. సోవాట్!”


“దాని అనుబంధ సంస్థే ఇది. ఇక్కడ వస్తువుల్నిదాదాపుగా టోకు లెక్కన కొనుక్కోవాలి. అంచేత కాస్తంత చౌకగా దొరుకు తాయి. మరైతే ఇక్కడ అందరికీ ప్రవేశం ఉండదు. క్లబ్ మెంబర్ షిప్ కార్డ్ ఉన్నవాళ్ళకే ప్రవేశం. దీని కోసం-- ఏడాదికొకసారి నూరు డాలర్ల రుసుము చెల్లించు కోవాలి” 


అతడు తలూపుతూ వాళ్ళను అనుసరించాడు. వ్యాపార మెలకువలు తెలుసుకోవలసింది, వాటిలో కొన్నిటిని స్వయాన నేర్చుకోవలసింది చాలానే ఉన్నట్లున్నాయి. 


అతడలా నడుస్తున్నాడే గాని, చుట్టు ప్రక్కల వస్తూపోతూన్న వారిని గమనిస్తూనే ఉన్నాడు. అక్కడక్కడ తెల్లవాళ్ళతో బాటు విదేశీయులు కనిపించారు. కొన్ని చోట్ల భారతీయులు పిల్లా పాపలతో సామానుల ట్రాలీలతో రావడం కూడా గమనించాడ తను. మొత్తానికి ఎక్కువ మంది యూరప్ దేశస్థులూ నల్ల అమెరికన్లు, లాటిన్ అమెరికన్లే-- సామాను ఎంపిక చేసుకుని స్టాల్స్ నుండి తీసుకుంటున్నప్పుడు, మూవింగ్ ట్రాలీలో వేసుకుని వెళ్తున్నప్పుడూ ఒకరి బండికి మరొకరు దారిచ్చే పధ్ధతి- ఎక్కడైనా తెలియక ఒరసుకుంటే వెంటనే క్షమాపణలు చెప్పుకునే తీరు అతణ్ణి ఆకట్టుకుంది. 


అటువంటి నమ్రత హైద్రాబాదు స్టోర్లలో చూడటం అరుదేమో! అక్కడంతటా ర్యాష్ డ్రైవింగే—హార్డ్ పుషింగే-- 


“ఈ లాంగ్ కోటు యెలాగుందో చెప్పండి నరసింహమూర్తి గారూ!” 


సుజాత గొంతు విని ఆగాడతడు. దానిని చేతులోకి తీసుకుని బాగుందన్నాడు. కాని నిజానికి అతడికి ఆ లాంగ్ కోటుకంటే సుజాత కంఠ స్వరంలోని మార్దవం నచ్చింది. ఆమెను చూస్తూ అలాగే ఆమె ప్రక్కనే నిల్చుండి పోవాలనిపిస్తూంది. ప్రవరాఖ్యుణ్ణి వశపర్చుకోవాలని ఉబలాట పడ్డ గాంధర్వ కన్య వరూధిని ఇలానే ఉంటుందేమో! 


తను మాత్రం ప్రవరాఖ్యుడిలా దూర దూరంగా జరిగే ప్రసక్తే లేదు. ఆమె మాట్లాడుతుంటే— ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. మలయ మారుతం వీస్తున్నట్టు- ఇంద్ర సభలో దేవకన్య వాయించిన చిత్రవీణలోని మృదు స్వరాలు తరంగాలుగా తేలి వస్తున్నట్టు ఓ మధుర భావన. ఇప్పుడ తని మనసు అతడి స్వాధీనంలో లేదేమో! మరులు మరలును వయసు తోడనే- అన్నాడే మహానుభావుడు- తననావరించింది అది కాదు కదా! కాదు- కచ్చితంగా కానేకాదు. తనలో లేచిన మధుర భావన దానికి అతీతమైనది. మాటలకందని హృదయంగమది. 


అప్పుడు మళ్లీ వివిపించింది సుజాత గొంతు- “మీకది నచ్చలేదేమో! ఇది చూడండి. క్రీమ్ కలర్ లాంగ్ కోటు“అంటూ మరొక టి తీసి అందిచ్చింది. 


దానిని అందుకుని అడిగాడతను- “ఇంతకూ ఏ సైజ్ ఎంపిక చేస్తున్నారు?ఎవరికోసం ఎంపిక చేస్తున్నారు?”


“మీ కోసమే! అదిగో అక్కడ ప్రైవేట్ రూముంది. వేసుకు చూడండి”


అతడు వేసుకు చూడలేదు. కోటుకున్న ప్రైస్ ట్యాగ్ చూసాడు. అరవై రెండు డాలర్లు, . అతడి మనీ పర్సులో డాలర్ల నోట్లు లేకపోలేదు. కాని వాటినిప్పుడిప్పుడే ఖర్చుపెట్టే స్థితిలో లేడు. అన్నీ సమకూర్చి అతడికి దిన భత్యంగా అందే డైలీ అలవెన్సు ముప్రై డాలర్ల లోపే. వాటిని ఇప్పుడిప్పుడే ఖర్చుచేసేస్తే రేపటి సంగతి? వాటి అవసరం నిజంగానే వాటిల్లితే అప్పుడేమి చేస్తాడు తను! ఇక వాస్తవ లోకంలోకి వచ్చి చూస్తే అటువంటి లాంగ్ కోటు అవసరం తనకు కలగదు; యెప్పుడైనా పనితగిలి సిమ్లాకోకాశ్మీర్ లోయలోకో- లేక తీర్థయాత్రలకని అమర్ నాధ్ వంటి మంచుకొండల వేపు వెళ్లేటప్పుడు తప్ప-- మిగతా రోజుల్లో దానిని అటకపైకి ఎక్కించేయడమే! 


ఆ తీరున ఆలోచిస్తూ అతడు అటూ ఇటూ లెక్కలు చూసుకుంటూ ముఖం అదోలా పెట్టుకుని- “సారీ! నాకొద్దండి. వీటి అవసరం నాకు కలుగుతుందని తప్పనిసరిగా తోచినప్పుడు అప్పుడు వచ్చి తీసుకుంటాను లెండి” 


సుజాత అతడి కళ్లలోకి నిదానంగా చూసి అంది- “అదేంవిటండీ అలా ఏక స్వరాన వద్దుంటున్నారు! మేమా మీకు కొనిస్తామని తీసుకుచ్చిందీ! మా నాన్నగారు మీ పెదనాన్నగారితో మాట్లాడి మీకు ఇది కొనివ్వమని చెప్పారు. మీరు వద్దంటున్నారు. వీటి ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. సరే! మీకిష్టం లేదంటే మేమేమి చేస్తాం. ఇప్పుడే ముబైల్ లో చెప్తాను”


“ఆగండి! కొంచెం ఆగండి. ఇప్పుటికి వద్దన్నానే గాని ఎప్పటికీ వద్దనలేదుగా! ఇంత చిన్న విషయాన్ని పెద్దవాళ్ల వరకూ తీసుకెళ్ళడం దేనికి? నాకిప్పుడు రెండు కావాలి. ఒకటి నాకు, మరొకటి నా రూమ్ మేటుకి. రెండదానికి నేను డబ్బులిచ్చుకుంటాను”


అప్పుడు మోహన కలుగజేసుకుంది- “అయ్యా రాజమహేంద్రం బావా! మీరు డాలర్ల విలువ గురించి ఇండియన్ కరెన్సీతో జోడించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. మేమేమిటి తెలుగు గడ్డనుంచి ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లమనుకుంటున్నారా! వ్యాపార రంగంలో ఉంటూ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ స్థిరపడిన వాళ్ళం. డాలర్ల విలువను మేం యూరోలతో పోల్చుకుంటాం గాని ఇతర కరెన్సీలతో ఎక్కువగా బేరీజు వేసుకోం. మీరు అప్పుడో ఇప్పుడో సెటిల్ చేయబోయే ఈ ఖర్చుల గురించి మీరు మీ పెదనాన్నగారితోనూ ఆ తరవాత మా పెదనాన్నగారితోనూ మాట్లాడుకుందురు గాని. సరేనా? ఇప్పటికి ఇష్యూ సెటిల్డ్. మీకు నచ్చినవి రెండు తీసుకుని మా అక్కాచెల్లెళ్ళిద్దరికీ విమోచనం కలిగించిండి మహాప్రభూ!” 


గట్లు తెగిన చెరువు కట్టలా వచ్చిన చెల్లి మాటల ప్రవాహం సుజాతకు నచ్చలేదు. ”అదేమిటే మోహనా అంత దూకుడు గా మాట్లాతావు! దూర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి పట్ల కొంచెం నిదానం చూపించడం నేర్చుకో! ”అంటూ ఈసారి నరసింహమూ ర్తి వేపు తిరిగింది- “ఔనండీ! మీరు మరీ మొహమాట పడుతున్నట్టున్నారు. రాజమండ్రిలోని మీ పెదనాన్నగారూ ఇక్కడ మా నాన్నగారూ మాట్లాడుకుని తేల్చుకున్న వ్యవహారం. వాళ్ళ ఆదేశానుసారమే మీకు లాంగ్ కోటు ఇప్పించే ఏర్పాటు జరిగింది. ప్లీజ్ ట్రై- టు అండర్ స్టేండ్! ”


అతడు ఆశ్యర్యంగా చూసాడు ఆమె వేపు. ఆమె కంఠస్వరం వింటుంటే అచ్చు తన పెద తల్లి మందారమ్మ గొంతు విన్నట్లే ఉంది. అనుపమ అనురాగ ధారను అతి సహజంగా కురిపించగల ఆర్ద్రత స్వతస్సిధ్దంగా స్త్రీకి మాత్రమే వస్తుందేమో! అతడిక మాట్లాడకుండా సుజాత చేతుల మీదుగా రెండు లాంగ్ కోటుల్ని అందుకుని- “థేంక్స్!” అన్నాడు. 


అప్పుడు మోహన అందుకుంది- “అదేంవిటండోయ్ రాజమండ్రి సారూ! ఉదయనుంచీ చూస్తున్నాను మీ చూపంతా అటే ఉన్నట్లుంది. ఇటు కాస్తంత కన్నెత్తి చూడరా?థేంక్సంతా మూడగట్టుకుని సుజాతమ్మగారికే ఇవ్వాలని కంకణం కట్టుకున్నారా! ”


“సారీ! కావాలనికాదు. మరచిపోయాను. థేంక్సు మీకు కూడాను. మీ పెదనాన్న శ్రీరామ్ గారికి కూడా సగం థేంక్సు ఇచ్చేయిండి! మరచిపోరు కదూ! ”


ఈసారి సుజాతకు విసుగు పుట్టుకొచ్చింది. ”అదేఁవిటే మితిమీరు పోతూన్న నీ ఆగడాలూ నువ్వూనూ! నీకె న్ని సార్లు చెప్పానని-- ఆయన మన ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారని. నువ్విలా ఆగడాలు చేస్తూ ఉంటే రేపు మనింటి వేపు తలెత్తి కూడా చూడరు” 


అక్కయ్య మాట విని మోహన తలపైకి యెగరిసింది. “అంతలోనే మీ మధ్య దగ్గరితనం కొండంత పెరిగిపోయి నట్లుందే! ఇంతవరకూ మాటవరసకి మాటలు కలపడానికి ఆడలాడుతున్నాను గాని-- నేను నిజంగానే నరసింహ మూర్తి గారికి మరదలు పిల్లనయిపోతానేమో! ఎవరు చెప్పొచ్చారు? ఐనా అంతకంతకూ దూరం తరిగిపోతూన్న మీ మధ్య నాకేమి పనిలే-- ”


“కొంచెం ఊరుకుంటావా! ప్లీజ్! ”


“సరే! నేనూరుకుంటాను. మరి దీనికి బుదులియ్యి. మొదటున్న చిరాకుతనం ఇప్పుడు కనిపించడంలేదే! కారణం తెలుసుకో వచ్చా?” 


ఈసారి సుజాత నవ్వాపుకోలేక పోయింది. పక్కున నవ్వేసింది. పువ్వునుండి మరో పువ్పు పుట్టదు. ఆకునుండి ఆకు పుట్టదు. మరి సుజాత నవ్వు నుండి ఎన్ని రంగుల మతాబులో! ఆణి ముత్యాల్లాంటి ఎన్ని మధుర భావనలో! 


మోహన పైకి ఆటలు పట్టిస్తున్నా అవన్నీ సరదాకి మాత్రం కాదని నరసింహమూర్తికి మరొకసారి తోచింది. నిజంగానే అది వాస్తవమైతే ఎంత బాగున్ను! జీవన ప్రాంగణంలో నిత్యమూ ఘల్లు ఘల్లున రాలే మేలి ముత్యాలను అలుపెరగకుండా అల్లుకుపోడూ! అలా ఆలో చిస్తూ జెంట్స్ ప్రై వేటు డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి లాంగ్ కోటులు రెండూ తనకు కుదురుతాయో లేదోనని సరిచేసుకున్నాడు. షేక్ అహ్మద్కున్న పొడవు శరీర సౌష్ఠవం దాదాపు తనదే అయుంటుంది. 


అతడు జంకుతూనే ఓరగా సుజాత ముఖంలోకి చూసాడు. అతడి బెరుకు చూపుల్ని చూసి సుజాత మరోసారి గట్టిగా న వ్వింది. అతడు కూడా పక్కున నవ్వేసాడు. నవ్వులూ నవ్వులూ కలిస్తే ఏమవుతుంది? గుళాబీ పువ్వుల పరిమళమేగా! 


అసలే ఆటలు పట్టించడానికి అర్రులు చాచే ఆకతాయి మోహన- ఊరుకుంటుందా! ”అబ్బ! ఎట్టకేలకు గట్టెక్కాను. కనులూ కనులూ కలసిన వేళ- నవ్వులు వసంతాలను రప్పించిన వేళ- తనువు తనువూ విరులై పరిమళ భరితములై పరవశించిపోదూ! ” మోహన గీతాలాపన--

 

సామ్స్ క్లబ్బు వాణిజ్య మండపమంతా హీటర్ తో రెగ్యులేట్ చేసారామో- బైటకొచ్చేటప్పటికి నరసింహమూర్తికి అంతగా చలి తగల్లేదు. మరి ప్రతిచోటా ఇంతటి హాయిని అనుభవిస్తూ ఉండాలంటే విద్యుత్ ఎనర్జీ కావాలి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే గ్యాస్ లో సగం అమెరికన్లే ఖర్చు చేసేస్తున్నారంటే వాస్తవం కాదూ! 

=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 11 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





33 views0 comments

Comments


bottom of page