#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 11 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 22/01/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. సూపర్ మార్కెట్ దగ్గర సుజాత, నరసింహ మూర్తిలను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 11 చదవండి..
అప్పుడు కారువేపు నడుస్తున్నప్పుడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ఆగిపోయాడు నరసింహమూర్తి. సుజాత ఏమిట న్నట్టు తిరిగి చూసింది.
“సుజాత గారూ! ఇంట్లో అడగడం అంత బాగుండదని మానుకున్నాను. ఇద్దరమ్మాయిల్ని చూసాను. ఒకరు బ్లాక్ లేడీ. హోమ్ అసిస్టెంటని తెలుసుకున్నాను. మరి నేను మరొక వైట్ అమ్మాయిని కూడా చూసాను. మీనాన్నగారి కంపెనీలో స్టాఫ్ అసిస్టెంటా! ”
“కాదు. ఆమె కూడా హోమ్ అసిస్టెంటే! “
“అబ్బో! చాలా కాస్ట్లీ వ్యవహారమే మరి. బేబీ సిట్టర్ జీత భత్యాలను భరించడమే కష్టమట ఈ ఊళ్ళో! ఇద్దరు హోమ్ వర్కర్లా? వీళ్ళ జీతభత్యాల వ్యవహారంలోనే కదా- దౌత్య వర్గానికి చెందిన మన భారతీయ స్త్రీ ఒకామె చిక్కుల్లో పడింది”
“నిజమే! మరి ఆ భారతీయ స్త్రీ వ్యవహారంలో రూల్స్ కంటే పోలిటిక్సు ఎక్కువగా ఇమిడి ఉందండీ. ఇక నిజం చెప్పాలంటే- నేను మా బామ్మగారి వారసురాలిని కాబట్టి అందునా ఇంతమంది ఆడాళ్లున్న ఇంట్లో పనివాళ్ళను పెట్టుకోవడమంటే విడ్డూరమనే అంటాను. కాని విషయం అది కాదు. దీనిని ఒక షేడ్ లో చూస్తే సోషియల్ అబ్లిగేషన్.
ఎలాగంటే- మానాన్నా చిన్నాన్నా పెంపొందించిన వ్యాపారం బాగా వృధ్ది చెందింది. రాబడి కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అలాంటప్పుడు చుట్టుప్రక్కల వారికి అవకాశం ఇవ్వాలి కదా! వాళ్ల మనుగడ గురించి కూడా ఆలోచించాలి కదా! ఇద్దరూ ఇంటి పనుల్లోనే కాక తోటపనుల్లోనూ మాకు సహాయ పడ్తుంటారు. అందులో మరొక విషయం కూడా ఉంది. మనం అనుకుంటున్నట్టు- ఇక్కడి వాళ్లందరూ డబ్బున్నవాళ్లు కారు. లేని వారూ ఉన్నారు. వాళ్ల గురించి కాస్తో కూస్తో ఆలోచించడం మన కర్తవ్యం కదండీ!
ఇక మా ఇంటి హోమ్ మేకర్ల గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరూ డైవర్సీలు. మరో సారి వెడ్ లాక్ లోకి వెళ్ళేంతవరకూ వాళ్లు ఇక్కడే మాయింట్లోనే మనుగడ సాగిస్తారు”
“యూ ఆర్ రైట్! హన్డ్రెడ్ పర్సెంట్ రైట్! ఐ రియల్లీ లైక్ యువర్ వే ఆఫ్ థింకింగ్. అచ్చు మా అమ్మలాగే ఆలోచిస్తున్నారు” అంటూ అతడు అక్కా చెల్లెళ్లిద్దరూ ఎదురు చూడని విధంగా చటుక్కున సుజాత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
అప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తూన్న మోహన చురుక్కున కదలించింది- “అయ్యా అయ్యా! రాజమండ్రి నవాబూ! మా అక్కయ్య పెళ్లి కాని అమ్మాయి. తెలుగమ్మాయి. దాని చేతులు విడిచి పెట్టండి. మేము అమెరికాలో పుట్టి పెరిగినా-- కాస్తో కూస్తో అమెరికన్ ఆనవా యితీలకు అలవాటు పడ్డా మేము తెలుగింటి ఆడపడుచులం. రఁవణమ్మగారి మనవరాళ్ళం. అదీను నా ముందేనా? అవ్వ! ”
అప్పుడు సుజాత నరసింహమూర్తికి వత్తాసు పలికింది- “మరీ ఓవర్ యాక్ట్ చేయకే రంగుల రాట్నమా! ఆయన నన్ను కావాలనా ముట్టుకున్నారూ? ఏదో మన కుటుంబంపట్ల సదభిప్రాయం యేర్పడి ఉద్వేగానికి లోనై మెచ్చుకోలుగా చేతులు కలిపారు. దానికా ఇంతటి సీన్ క్రియేట్ చేస్తున్నావు!”
అది విని మోహన తగ్గలేదు. ఆమెకు ఎదుటి వారిని ఏడిపించి ఉక్కిరి బిక్కిరి చేయడం మొదట్నించీ కొట్టిన పిండే కదా! “ఔనవును. ఇప్పుడేమో మెచ్చుకోలు కోసం ఎమోషనల్ ఐపోయానూ అంటాడు. రేపేమో ఇంకేదో జరిగిందని ముచ్చట పడిపోతూ నడుం చుట్టూ చేతులు వేస్తాడు. అప్పుడేమి చేస్తావు? ఎప్పుడూ నేను నీ ప్రక్కనుండను కదా నిన్ను కాపాడుతూ ఉండటానికి! ”
“నువ్వు నాకేమీ బాడీ గార్డుగా ఉండనవసరం లేదు. ఐనా మధ్య నీకెందుకంట అంతటి మంట! వేస్తే వేసారు. నీకేమిటంట?”
ఆ మాట అనేసి సుజాత చటుక్కున నాలికి కరుచుకుంది; తనకు తెలియకుండానే తనను తను ఎక్ప్ పోజ్ చేసుకున్నానేమానని. కాని నరసింహమూర్తి నవ్వాడు. కృతజ్ఞతా పూర్వకంగా నవ్వాడు- తనను త్రోసిపుచ్చకుండా ఆసరాగా నిల్చున్నందుకు...
అప్పుడు మోహన- ‘అమ్మదొంగా! దొరికావు కదూ! ’అన్నట్టు అక్కయ్య వేపు ఎగతాళిగా చూసి, సంభాషణకు మలుపు తిప్పింది- “మీ అనుమానాన్ని పూర్తిగా నివృత్తి చేసేలా మా అక్కాయ్ వివరించలేదు రాజమండ్రీ బావా! ఇప్పుడు నేను మీ అనుమానాన్ని పూర్తిగా నివృత్తి చేస్తాను. ముందు కారులో కూర్చోండి. సరేనా!”
తలూపాడు ఇంకా చెదరని నవ్వు ముఖంతో నరసింహ మూర్తి. రిమూట్ కంట్రోల్ సిస్టమ్ తో కారు తలుపులు వీడిన తరవాత అతడు కారు వెనుక సీట్లో కూర్చున్నాడు.
కారు స్టార్ట్ అయింది. మోహన చెప్పసాగింది. మోహన సంభాషణ ఆరంభించింది-
“మీరు మా కరోలినా చేరేముందు న్యూయార్కులో దిగారు కదూ! ”
మళ్ళీ తలూపాడతను.
“ఆ తరవాత రెలీ ఎయిర్ పోర్టులో దిగారు కదూ! ”
ఉఁ అన్నాడతను.
“అక్కడ కొన్ని చిన్నవీ పెద్దపెద్దవీ రంగు రంగుల నేమ్ బోర్టులు ఫ్లక్సీలు కనిపించి ఉంటాయి - బోల్డుగా- శ్రీరామ్ అండ్ శ్రీలక్ష్మణ్ కంపెనీ అని. కొంచెం గుర్తుకు తెచ్చుకుని చెప్పండి” మోహన సూటిగా అడిగింది.
అతడు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు మోహన ముక్తాయింపుగా ముందుకు సాగింది- “మళ్లీ ఇక్కడ దిగుతున్నప్పుడు కూడా అదే రంగులోని నేమ్ బోర్డుల్ని చూసుంటారు. మరి అంతటి పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీకి యజమానులైన ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అమెరికన్ స్త్రీలకు బ్రతుకు తెరువు చూపించ లేరా? ఇంతదానికే మా వాళ్ల బిజినస్ బ్యాలెన్సు షీటు తరిగిపోతుందా?
అంతే కాదు. మా పెదనాన్నా మానాన్నా చారిటీలకు కూడా ఊతమిస్తుంటారు. అమెరికన్ ఇండియన్ అనే వ్యత్యాసం లేకుండా పలు స్వఛ్ఛంద సేవా దళ సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుంటారు. ఈజిట్ క్లియర్ నౌ! ”
అతడు మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరకుండిపోయాడు. కాని మోహన మాత్రం ఊరుకోలేదు. “మరొకటి చెప్తే మీరు ఇసుమంత విస్తుపోతారేమో!”
ఏమిటన్నట్టు చూసాడతను.
“మాకు బోస్టన్ లో కూడా పెద్ద బ్రాంచీ ఉంది. దాని ఫుల్ కంట్రోల్ మాపెద్దమ్మ చేతిలోనే ఉంటుంది”
అతడు నమ్మలేనట్టు చూసాడు. పట్టుచీర కట్టుకుని నుదుట గుండ్రటి బొట్టు పెట్టుకుని మంగళకరంగా సాత్వికంగా తనకెదురుగా కూర్చున్న సుగాత్రమ్మగారు అచ్చు తన పెదతల్లిలాగే కనిపిస్తూ కళ్ళముందు మెదిలింది. ఆమెగారి రూపాన్ని తలపోస్తూ అతడు కొన్ని క్షణాల వరకూ ఆశ్యర్యం నుండి తేరుకోలేక పోయాడు.
అప్పుడు మళ్ళీ కొనసాగించింది మోహన- “అప్పుడప్పుడు మా అక్కయ్యే బోస్టన్ వెళ్లి పెద్దమ్మకు చేదోడు వాదోడు గా ఉండి వస్తుంటుంది. మా అక్కయ్య చూడటానికి యేదో విద్యారంగంలో ఉన్నట్టు సౌమ్యంగా కనిపిస్తుందేగాని, నిజంగా వ్యాపార దక్ష దీక్షతలు మెండుగా ఉన్నాయి దానికి. ఇక నేనేమి చేస్తున్నానంటరా- చదవుకోవడం- స్నేహితులతో హాయిగా తిరగడం అవ్యాయి చువ్వలా. అన్నట్టు రాక్ మ్యూజిక్ షోలంటే మీదు మిక్కిలి ఇష్టం. ఇంకేమైనా అడగాలా? ”
ఆ మాట విని అతడు ఖంగుతిన్నట్టు చూసాడు. తనెక్కడడిగాడని తనిప్పుడు ఆపుచేయడానికి? అంతా తానేగా చెప్తూ వచ్చింది. అతడి కళ్లలోని భావార్థాన్ని గ్రహించిన మోహన నవ్వుతూ అంది- “ఓకే ఓకే! మీ చూపులోని ప్రశ్న అందుకున్నాను రాజమండ్రి బావగారూ! పెద్దమనిషి తరహాలో మీరేమి అడక్కుండానే నాకు నేనుగా చెప్పుకు పోతున్నప్పుడు మధ్యన ఈ అడ్డగోలు ప్రశ్నేమిటన్నదేగా మీ ఆశ్చర్యార్థానికి అసలు మెట్టు? ఓకే! ఇక నాది ఆఖరి ఊహాగానం. మీరు ఆంధ్రా యూనివర్సిటీలోనే కదూ డిగ్రీ తీసుకున్నది? ”
“ఔను. రాజండ్రిలో ఇంటర్ చేసి ఏ యూలో డిగ్రీ పూర్తి చేసాను. బట్ వాటిజ్ ది మేటర్? ”
“మేటర్ ఉంది బావగారూ! ఇఫ్ ఐ యామ్ నాట్ అదర్ వైస్ ర్యాంగ్- మీరీపాటికి మమ్మల్ని ర్యాంక్ క్యాపటిస్టులుగా బ్రాండ్ ముద్ర వేసుంటారు. ఔను కదూ! ”
“అలాగెందుకనుకుంటున్నారు? ”
“అక్కడ ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ అలికిడి ఎక్కువేనటగా! ఇక్కడకొచ్చే మన తెలుగు వారు కొందరు చెప్తుంటారు. మీరూ ఎ. యూ స్టూడెంటటగా! మీపైనా లెఫ్టిస్టుల తీవ్రవాద ప్రభావం ఉంటుందేమో! ”
అది విని నరసింహమూర్తి నవ్వేసాడు. ”వాళ్ళ తీవ్ర వాద ప్రభావం లేదు గాని—ఒకప్పటి దేశ కాల మాన పరిస్థితులను బట్టి తోటి స్టూడెంట్ల పరిచయంతో కొందరి ప్రచారవాదం వల్ల లెఫ్టిస్టుల భావజాలంతో కొంత ప్రభావితుణ్ణి అయిన మాట వాస్తవ మే. ఆ తరవాత క్రమ మంగా నాకంటూ స్వంత అభిప్రాయాలు ఏర్పడిన తరవాత భారత విద్యార్థి సంఘంలో సభ్యుడిగా చేరాను”
“మరిప్పుడు? ”
ఆ ప్రశ్నకు మళ్ళీ నవ్వాడతనడు. “మిమ్మల్ని ఏమో అనుకున్నాను. కొన్నిటిని సీరియస్ గానే తీసుకుంటారన్న మాట! సరే చెప్తాను. గవర్నమెంటు ఉద్యోగిని. ఏ రాజకీయ పక్షానికీ చెందని వాణ్ణి. నాకున్న స్వంత అభిప్రాయాలను పదిలప ర్చుకుంటూ ఆలోచనా ధారను పదును చేసుకుంటూ మనుగడ సాగిస్తూన్నసగటు భారత పౌరుణ్ణి”
ఆ మాటతో పూర్తి సమ్మతిని తెలుపుతూ అందుకుంది సుజాత- “భలే బాగా బదులిచ్చారు నరసింహమూర్తిగారూ!”
అప్పుడు అక్కయ్యమాటకు అడ్డుతగుల్తూ అంది మోహన- “కొంచెం ఆగు టీచరమ్మా! నువ్వు మూర్తిగారిని మెచ్చుకోవడమూ మూర్తిగారేమో నిన్ను మెచ్చు కోవడమూ-- ఈ రోజంతా చూస్తూనే ఉన్నాగా! ఇప్పడు మరొక ప్రశ్న. అడిగేదా బావగారూ? ”
ఉఁ- అన్నాడతను.
“మీకు లెఫ్టిటిస్టు స్టూడెంటుల భావాలు నచ్చలేదా? ”
“కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు“
“మీకు నచ్చినవి- నచ్చనివి క్లుప్తంగా చెప్తారా? ”
అప్పుడతను కాసేపాగాడు. పైకి సరదాగా కనిపించే అబ్బాయిలైనా అమ్మాయిలై నా ఎప్పుడూ అలాగే సరదాగా ఉంటూ తేలిపోతారనుకోవడం సహేతుకం కాదనుకున్నాడు నరసింహమూర్తి. నిలకడగా నిదానం గా ప్రవహించే సెలయేరులో సహితం నీటి వలయాలు లోలోన విస్తరిస్తూనే ఉంటాయి కదా!
అతడు చెప్పసాగాడు- “అప్పట్లో నాకు నచ్చినది ఒకటి చెప్తాను. ఒక పూటకు కూడా అన్నానికి నోచుకోని తాడిత పీడితుల పట్ల వాళ్ళు చూపించే ఆక్రోశం నాకు నచ్చేది. ఇక నచ్చనిది కూడా ఉండేది. విషయమంతా వాళ్ళకే తెలుసని- బీదసాదల పట్ల వాళ్ళకు తప్ప ఇతరులెవ్వరికీ నిజమైన ఆవేదన ఉండదని వాళ్ళకున్న అతి విశ్వాసం నాకు నచ్చేది కాదు.
ముఖ్యంగా మీన్స్ షుడ్ బి యాజ్ గుడ్ యాజ్ ది ఎన్డ్స్. ఇది వాళ్ళకు వంటపట్టని విషయంలా నాకు తోచేది. మరొక రెండు విషయాలు నాకు వాళ్ల పట్ల విముఖతను కలుగజేసాయి. ఒకటి- ధనిక పేదల మధ్య ఉన్న తారతమ్యాలకు అతీతంగా అట్టడుగున తారట్లాడే భారతీయుల మానసిక ప్రవృత్తి పట్ల వాళ్ళకు చాలి నంత అవగాహన లేకపోవడం.
ఇక పోతే- ఆద్యాత్మిక చింతన గల అధిక సంఖ్యాకులకు ఆక్రోశపు వాతావరణం- దూకుడు భావజా లం నచ్చదు. ఇక రెండవది- నాస్తికుడైన మేధావి- చింతనా పరుడైన బెట్రండ్ రస్సల్ వెలిబుచ్చిన అభిప్రాయం నాకు నచ్చింది. నన్నుబాగా ఆకట్టుకుంది”
అప్పుడు కారు తోలుతూనే ఆసక్తిగా అడిగింది సుజాత- “ఏమిటది మూర్తిగారూ? ”
“నేనెప్పుడు కూడా నా ఆదర్శాల కోసం ప్రాణాలర్పించను. ఎందుకంటే- అప్పుడప్పుడు నేను పాటించే ఆదర్శాల విష యంలో నేను తప్పటడుగు వేయవచ్చు కదా! ”
ఆ మాటతో అక్కాచెల్లెళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు.
కాసేపటికి సజావుగా డ్రైవ్ చేస్తూ వచ్చిన కారుని ఆపింది సుజాత. అప్పుడు అడిగాడతను- “కారు ట్రబల్ ఇస్తుందా! ”
“అదేమీ లేదండీ. భోజనాలకు టైముంది. మనం ఈ పైన్ చెట్ల మధ్య కాసేపు గడుపుదాం కాఫీ తాగుతూ--
“అతడు చుట్టు ప్రక్కల కలయచూసాడు. అక్కడెక్కడా కాఫీ హౌస్ కనిపించలేదు. అతడికి కూడా కాపీ తాగాలనిపిస్తూంది. అప్పుడు అచ్చు శ్రీలక్ష్మణ్ గా రిలాగే సుజాత కూడా డాష్ బోర్డు అరనుంచి థర్మోప్లాస్క్ తీసి పేపర్ కప్పుల్లో కాఫీ పోసి మొదటిది అతడికి అందిచ్చింది. కాఫీనుంచి ఎగజిమ్మిన కమ్మటి ఫ్లేవర్ తగలగానే అతడికి ప్రాణం పూర్తిగా కుదటపడినట్లనిపించింది.
జీవితమంటే ఇలా కదూ ఉండాలి! చలిగాలుల మధ్య పచ్చటి పైన్ చెట్ల నడుమ వేడి కాఫీ పోసుకుని తాగితే ఇక చెప్పాలా హాయి గురించి! దీని గురించి కాఫీ పిపాసకులైన దక్షిణా భారతీయులను కదూ అడిగాలి--
మానవ మనుగడలో జీవిత రహస్యం ఒకటుంది. చిన్న చిన్నవి కూడా అవసరానికి కలిసొచ్చినప్పుడు మానవ జీవితం మహదానందంతో నిండిపోతుంది. సరాసరి కుబేరుడి నందన వనంలోకి తీసుకెళ్లిపోతుంది. ఆ ఆనందానికున్న మరొకపార్శ్వం యేమంటే- మనిషికి కలిగే అసలు ఆనందానికి అసలు ఆస్కారం చిన్న చిన్న విషయాలనుండే ఉద్భవిస్తుంటుంది. ఉత్తేజ పరు స్తుంటుంది.
అలా ఎటో చూస్తూ అకారణంగా మధన పడ్తూ అన్యమనస్కంగా తలపోస్తూ వంటరిగా సాగిపోతున్నప్పుడు ఒక చిన్నపాటి మాట- స్నేహపూర్వకమైన ఒక చిన్నపాటి నవ్వు ఎడారిలోని చినుకులా ఎంతటి ఆనందాన్నిస్తుందని!
అలా ఆలోచనలలో తేలుతూ నరసింహమూర్తి ఉన్నపాటున అన్నాడు- “మనం కారుదిగి చెట్లమధ్య నిల్చుని కాఫీ తాగు దామా! ”
అప్పుడు సుజాత ఆశ్చర్యంగా తిరిగి చూసింది. “చలిగాలులు వీస్తుంటాయి. పర్వాలేదా? ”
నవ్వుతూనే- ఉఁ- అన్నాడతను.
అదొక శౌర్యోపేతమైన ఆనందోద్రేకం- ప్రతి మనిషికీ అప్పుడప్పుడు అటువంటిది అవసరం కూడాను! ఆమె బిస్కట్ ప్యాకెట్టు తీసి రెండేసి చొప్పున ఇద్దరికీ ఇచ్చి తను కూడా రెండు తీసుకుని కారు దిగింది.
వాతావణం ఇంకా చలి చలిగానే ఉంది. చురుక్కుమనేలా గాలులు వీస్తూనే ఉన్నాయి. కాని నిర్వచనానికి అందని అదొక వింతైన ఆనందంలో ఉన్నారు వాళ్ళు. ఆ మాటకొస్తే ఆనందానికి ఎప్పుడూ కారణం ఉండాలన్న అవసరం లేదు కదా!
బిస్కట్లు తిని మిగతా కాఫీ కడుపులోకి వెళ్ళేసరికి నరసింహమూర్తికి మరింత హుషారు పుంజుకొచ్చింది. చలిగాలులు కబురందుకన్నట్టు ఎక్కడికి ఎగిరిపోయాయో మరి.
=======================================================================
ఇంకా వుంది
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 12 త్వరలో
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Commentaires