#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
![](https://static.wixstatic.com/media/acb93b_b092a03672584485992a8389b43987a2~mv2.jpg/v1/fill/w_500,h_500,al_c,q_80,enc_auto/acb93b_b092a03672584485992a8389b43987a2~mv2.jpg)
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 12 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 28/01/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. సూపర్ మార్కెట్ దగ్గర సుజాత, నరసింహ మూర్తిలను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన. నరసింహ మూర్తి కాలేజీ రోజుల భావోద్వేగాల గురించి అడుగుతుంది మోహన.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 12 చదవండి..
“ఇప్పటికీ నేను నమ్మలేకుండా ఉన్నాను సుజాతగారూ! ”
ఏమిటది- అన్నట్టు నవ్వుతూ చూసిందామె. అక్కయ్య నరసింహమూర్తి చెప్పే ప్రతి పలుకుకీ మెరిసే ముఖంతో నవ్వడం మోహన గమనించకపోలేదు. ఎందుకంటే సుజాత లోతైన మ నిషి- ఎప్పుడూ గంభీర వదనంతో ఉంటుంది. అరుదుగా పెదవి విప్పుతుంది. దానికి తోడు పిల్లల్ని గదమాయించే టీచరమ్మాయె!
అప్పుడు నరసింహమూర్తి అందుకున్నాడు- “ఇన్నేళ్ళుగా ఇక్కడుంటున్నా మీరు తెలుగు మరచిపోకుండా ఇంత చక్కగా ఇంత స్వఛ్ఛంగా మాట్లాడటం నాకు వింతగానే తోస్తూంది”
“కాని ఇక్కడుంటూన్న చాలా మంది తెలుగు వారు చాలా చక్కగానే తెలుగు మాట్లాడతారు నరసింహమూర్తి గారూ! ”- సుజాత.
“కాని అందరూ మీలా అమెరికన్ గడ్డపైన పుట్టి పెరగలేదుగా!”
సుజాత తలూపుతూ మౌనం వహించింది. నిజమే! అందరూ తమ లా ఇక్కడ పుట్టి పెరగలేదుగా! మంచి పాయింటు.
అప్పుడు మోహన కలుగజేసుకుంది. ”అబ్బ! మళ్లీ ఆరంభించారన్నమాట ఇద్దరూ కలసి మెచ్చుకోవడాల్ని వల్లె వేస్తూ మాలలు గుదిగుచ్చడం! సరే- అదంతా ఎందుకుగాని, ఈసారి వివరణ నేను ఇచ్చు కుంటాను.
మేం పుట్టినప్పట్నించీ- ఇంకా చెప్పాలంటే మేము సరిగ్గా కళ్లు తెరవకముందే అనుకుంటాను- మా బామ్మా మా పెద్దమ్మా కలసి ఒక విచిత్రమైన పని చేసేవారు. అదేంవిటంటే, మా వయసుతో నిమిత్తం లేకుండా ఇంట్లో వాళ్ళు ప్రొద్దుటే నాకు మా అక్కయ్యకూ తెలుగు జానపద గేయాలు- త్యాగయ్య అన్నమాచార్యులు శ్యామా శాస్త్రులవారి కీర్తనల్ని-
ఆ తరవాత ఘంటసాలవారి మధుర గీతాల్నీ క్యాసెట్లు పెట్టి వినిపించేవారు. క్రమక్రమంగా ఒక వయసు వచ్చేటప్పటికి వాటిలోని చక్కదనా న్ని మేలి ముత్యాలవంటి నుడికారాల్ని మా ఇద్దరు అక్కాచెల్లెళ్ళకూ విశదపర్చేవారు. మేము కాస్తంత పెద్దయిన తరవాత మాచేత పెద్దబాల శిక్ష చదివించడం— ప్రతి ఉదయమూ వేమన పద్యాలతో బాటు రెండేసి భగవద్గీత శ్లోకాలను మాచేత చదివించడమూ చేసేవారు. ఇంతటి టైట్ షెడ్యూల్ లో మాకు తెలుగు చదవడమూ వ్రాయడమూ ఎలా రాకుండా పోతుంది?”
“మరి డే స్కూలులో పాఠాలన్నీ ఇంగ్లీషులోనేగా-- ఆ పాఠాల సంగతి? ”- నరసింహమూర్తి.
“వాటికవే సాగిపోయేవి, మార్కులు కూడా వాటికవే వచ్చేసేవి, తలుపు తట్టి ఉత్తరాలు అందించే కొరియర్ లా-- ఎందుకో మరి మా తమ్ముడికి మాత్రం ఇవన్నీ అబ్బలేదు. దాదాపు అన్నిట్లోనూ వాడు అమెరికన్ టేస్టులకు అలవాటు ఐపోయాడు. చెప్పడు గాని, వాడికి ఈపాటికి ఎక్కడో వైట్ గార్ల్ ఫ్రెండు ఉంటుందనే మా అనుమానం. ఇక మళ్ళీ విషయానికి వస్తే—మా యిల్లు చుట్టూ తిరిగి చూసారు కదా- ఎక్కడైనా ఏమూలనైనా పాశ్చాత్య సాంస్కృతి ప్రభావం కనిపించిందా— చివరకు ఫర్నిచర్ అమర్చడంలో కూడా--
మరొకటి- ఇప్పటికీ మా పెద్దమ్మా-- మా అమ్మా ‘హృదయరాగం’ అనే కర్ణాటక సంగీత ప్రోగ్రాము ఇండియన్ టీవీలో తప్పి పోకుండా వింటుంటారు. పలుపాటల పోటీలు తెలుగు టీవీలో వీక్షిస్తుంటారు. నాకు తెలిసిందంతా చెప్పేసాను. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నయా రాజమండ్రి బావా! ”
అంతవరకూ తన్మయత్వంతో విన్న నరసింహమూర్తి చప్పట్లు కొట్తూ సుజాత ప్రక్కకు చేరి- “ఒకటడుగుతాను చెప్తారా సుజాతగారూ! ”అని అనిగాడతను.
“ఉఁ అడగండి” అందామె.
“మీరు తెలుగు పాటలు పాడతారా?”
ఆ మాటకు మోహన ఖంగున కలుగచేసుకుంది- “జయ విజయీ భవ! దిగ్విజయీ భవ! నేనప్పుడే అనుకున్నాను దారులు వెతుక్కుంటూ ఆ రూట్ కే వస్తారని. ఇంకేం? పాడివినిపించవే అక్కాయ్! మరొక రెండు మెచ్చుకోలు మాలలు మెడన వేసుకోవే! నేనిక మీ జోలికి రానంటే రాను. సరేనా?” అంటూ కాఫీ చప్పరిస్తూ దూరంగా జరిగిందామె.
“ఏం పాట పాడేది? ”- సుజాత.
“ఏపాటైనా సరే! తెలుగుతనం ఉట్టిపడేది“
“మల్లీశ్వరి సినిమాలో గుడివద్ద నూతినీళ్ళు చేదతో పట్టుకుంటున్నప్పుడు గ్రామీణ ఆడాళ్లు ఆలపించిన జానపద గేయాన్ని పాడేదా! ఇది మా బామ్మకు చాలా యిష్టం”- సుజాత బదులిచ్చింది.
అలాగే అన్నట్టు తలూపాడు నరసింహమూర్తి.
“నోమీన మన్నాల, నోమన్నలాలో
చందమామ! చందమామ!
మల్లెపూల సోనపైన
మబ్బుల దోనెపైన
చల్లంగ రావోయి చందమామ! ”
ఆ జానపది గేయాన్ని విని నరసింహమూర్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. అలా చప్పట్లు కొట్తూనే మళ్ళీ అడిగాడు- “మేడమ్! రఁవణమ్మగారికి ఇష్టమైన గ్రామీణ పాట పాడారు. మరి మీకంటూ ఇష్టమైన పాట ఒకటుంటుందిగా! అది పాడి వినిపించరూ? ”
ఆమె నవ్వుతూ అతడి ముఖంలోకి కొన్ని క్షణాల పాటు తేరిపార చూసి స్వర్గీయ నాగయ్య స్వర్గీయ భానుమతి కలసి పాడిన ‘మధుర వెన్నెల రేయి’ గీతాన్ని పాడి వినిపించింది. అతడు వెంటనే తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చా డు. “చాలా బాగుంది మీ కంఠ స్వరం. మీ ఉఛ్ఛరణలో ఎంతటి చక్కటి స్వఛ్చదనమని. భానుమతి గారు గాని బ్రతికుంటే మీ గొం తు విని ఆశ్చర్యపోయేవారనుకో--”
అతడామాటను పూర్తిచేయకముందే మోహన వాళ్ల మధ్యకు వచ్చి నిల్చుంది- “చాలు చాలు మీ పొగడ్తలు! పరవశించి పోయానంటారు- ఆ తరవాత ఆవేశప డిపోయానంటారు. అటుపిమ్మట మీరేమి చేయబోతున్నారో ఊహించగలను. అక్కయ్య రెండు చేతులూ మీ చేతుల్లోకి తీసుకుంటారు. తెగ మురిసిపోతారు. ఆ తరవాతి సంగతి నేను చెప్పను-- అంతేకదండీ రాజమండ్రి బావగారూ!”
“అదేమీ జరగదులే! ఏదో ఒకసారి అలా జరిగిందని మళ్ళీ మళ్లీ చేస్తారేమటి? ముందు అడ్డుతొలగు” అంటూ ముందుకు వచ్చి నరసింహమూర్తిని ఉద్దేశించి అంది సుజాత- “మీకు సంగీతమంటే ఇష్టమని తెలుస్తూనే ఉంది. మీరూ ఒక పాటగాని పద్యంగాని పాడి వినిపించరూ! ”
“నాకు వినడమే గాని పాడటం రాదు. మీరడిగారు కాబట్టి పద్యం పాడతాను- ‘ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు— చూడ జూడ రుచులు--’ అని పాడి వినిపించేంతలో మళ్లీ మోహన అడ్డువచ్చింది. ”మీరు మాకు నీతులు నేర్పడానికి వచ్చారా! లేక సరదాగా మాతో మాటా మంతీ మాట్లాడడానికి వచ్చారా! పాట పాడవచ్చు- లేక కవిత పాడి వినిపించ వచ్చు. ఇప్పుడు నీతి బోధనలు వినే వాతావరణం మాత్రం లేదు సుమా!"
“మీరిప్పుడు కవిత అన్నారు కదా! జ్ఞాపకం వచ్చింది. కవిత- అనే కవితను చదివి వినిపిస్తాను మరి మీరు అడ్డురారు కదూ!”
“మేమెందుకు అడ్డు వస్తామూ! మీనోట ఆ కవితా పాట విని మైమరచిపోమూ! ”
అప్పుడు నరసింహమూర్తి స్కూలు రోజుల్లో కంఠతా పట్టిన శ్రీశ్రీగారి కవిత పాడనారంభించాడు-
"కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో,
నిను నేనొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో, నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిముషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కానరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా? ”
అని అక్కడితో గీతాలాపన చేయడం ఆపాడు నరసింహమూర్తి. అప్పుడు సుజాత ఆనందంతో అంది- “నిజంగా చాలా బాగా పాడి వినిపించారు మూర్తిగారూ! మీ గొంతు ఎంత బాగుందంటే- మళ్లీ మళ్ళీ వినాలనుంది“
“నిజంగానా! రియల్లీ? ’అంటూ అతను పారవశ్యంతో క్షణకాలం స్వాధీనం కోల్పోయాడు- మోహన గమనించే లోపల సుజాత కుడి చేతిని అందుకుని కళ్లకద్దుకున్నాడు.
అది చూసి మోహన అందుకుంది- “ఆహా! మొత్తానికి ఘటికుడైన ఇండియన్ అనిపించు కున్నారయ్యా బాబూ! అదను చూసి పదునుగా ఉపయోగించారు బుధ్ది కుశలత. ఎంతైనా వాత్యాయనుడు పుట్టిన నేల నుండీ కదూ వచ్చారు! ఆ జీవన రస సల్లాపాలు ఎక్కడికి పోతాయిలే మరి? “
“ఇప్పుడు నేనేమి చేసానండీ! అభిమానంతో మీ అక్కయ్య చేతిని అందుకుని దేవతను తాకినట్టు కళ్ళకద్దుకున్నాను. అదీను మనస్పూర్తిగా శ్లాఘిస్తూ! “
“పైకి చూస్తే—అదంతా అంతే మరి! తాకితే తంటా వస్తుందని- ముట్టుకుంటే ముప్పు వాటిల్లు తుందని- ఎంత నాజూకుగా ఎంత సున్నితంగా కార్యసాధన ముగించారో! ”
ఈ సారి సుజాత కళ్ళు పెద్దవి చేసుకుని చెల్లి వేపు చూసింది. ”మోహనా! నువ్వూరుకుంటావా! చిన్నచిన్న విషయాన్ని పెద్ద సీనుగా మార్చకు. క్షణకాలం స్వాధీనం తప్పి ఉంటారు. ఆయన కావాలనుకుని ప్లాను వేసుకుని చేయలేదు. గుర్తుంచుకో! మన అదుపులోకి రాని కొన్ని సహజ సిధ్దమైన ఎమోషన్స్ ఉంటాయి. వాటిని గౌరవించడం నేర్చుకో”
“ఔనవును పాపం! ఆయన ఏది కావాలని చేస్తారని? అంతా గుట్టు చప్పుడు లేకుండానే ముగిస్తారు. ఇంకానయం- పారవశ్యంలో పడి స్వాధీనం తప్పిపోయానని—నా ముందే నిన్ను ఆ పైన్ చెట్లమధ్యకు లేవనెత్తుకు పోలేదు. బ్రతుకు జీవుడా! ఇంట్లో వాళ్ళకు నేను కదా బదులివ్వాలి!"
“ఇక నీ ఆగడాలు చాలిస్తావా లేదా? ఊరు కాని ఊరుకి వచ్చినతణ్ణి ఎందుకలా సతాయిస్తావు?"
“ఎందుకు చాలించనూ! చాలిస్తానే తల్లీ! నాకంటే పెద్దదానివి. రఁవణమ్మ గారి ముద్దుల మనవరాలివి. నీకు లేని పట్టింపులు నాకెం దుకూ?” అని నవ్వుల దొంతర్లను లోలోన ఆపుకుంటూ వేగ వేగంగా కారు వేపు నడిచింది మోహన.
చెల్లి పోకడను వేరొక విధం గా అర్థం చేసుకున్న సుజాత వెనుక నడుస్తూనే అంది- “అంటే— ఇదంతా ఇంటికెళ్ళి చెప్తావు. అదేనా నీ ప్లాను? ”
మోహన బదు లివ్వకుండా తిరిగి చూసి—చూపుడు వ్రేలిని పెదవులకడ్డంగా ఉంచుకుని—తల అడ్డంగా ఆడిస్తూ వెనుక సీట్లో వెళ్లి కూర్చుంది నిశ్శబ్దంగా. అదంతా గమనిస్తూన్న నరసింహ మూర్తి ఒక విధమైన ఇబ్బందికి గురయాడు. వాస్తవానికి ఇంతవరకూ— అమెరికా వచ్చి ఇద్దరు ముగ్గురు లేడీ క్యాండిడేట్లతో తప్పని సరిగా చేతులు కలపడం మినహా— తన జీవితంలో ఏ ఇతర స్ర్రీనీ ముట్టుకు ని ఎరగడు. మధ్యన తను అకారణంగా వివశుణ్ణవుతూ సుజాతను ఇబ్బంది పాలు చేస్తున్నాడేమో!
అప్పుడు నడుస్తున్నవాడల్లా ఆగి పిలిచాడు- “సుజాత గారూ! ఒక మాట”
ఆమె ఆగింది.
“మీ చెల్లి కావాలనే రియాక్టు ఔతుందో- లేక ఆగడాలు పట్టించడానికే అలా సూటిగా మాట్లాడుతుందో నాకు తెలియదు. కాని ఒకటి మాత్రం ఖాయం. నేనలా చేసుండకూడదు, అదీను రెండవసారి. నిజం చెప్పాలంటే ఎందుకో తెలియదు మిమ్మల్ని చూస్తుంటే చాలా రోజులుగా పరిచయం ఉన్నవారిలా పొరుగింటి అమ్మాయిలా అగుపిస్తున్నారు. అంచేతే కాబోలు పారవశ్యంతో వశం తప్పిపోతున్నాను. కారణం ఏదైనా తప్పు తప్పే కదా! ఐ యామ్ సారీ!”
ఆమె అతణ్ణి సమీపించి కళ్ళలోకి చూసి నవ్వింది. “మీరు నిజం చెప్తున్నారని నమ్ముతున్నాను. మరి నేనొక వాస్తవం చెప్తాను, నమ్ముతారా?”
“ఉఁ చెప్పండి సుజాతగారూ!”
“యు మే గో ఆన్- ఐ డోంట్ మైండిట్!” అంటూ కారు సీటులోకి వెళ్లి కూర్చుంది సుజాత.
ఇద్దరూ వచ్చి కూర్చున్న కొద్ది సేపట్లో కారు ఫ్రిక్షన్ అందుకుని నిదానంగా కదిలింది. ఎందుకో అక్కడ భళ్ళున మసకబారినట్టు మౌనం చోటు చేసుకుంది. రెడ్ సిగ్నల్ దగ్గరకు వచ్చేటప్పటికి కారు ఆపుచేసి, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మాట కదిపింది సుజాత- “బుధ్ధిగా మూతి బిగించి కూర్చుందే మా బంగారు చెల్లి- దాని గురించి ఒకటి చెప్తే మీరు నమ్మలేరేమో! ”
“ఎందుకు నమ్మనూ! ఈ నిశ్శబ్దాన్ని ఎప్పుడెవరు చీలుస్తారానని ఎదురు చూస్తున్నాను” - నరసింహమూర్తి.
“చెప్పు తల్లీ! నువ్వేమి చెప్పినా వినడానికి రెడీగా ఉన్నానని చెప్పారుగా రాజమండ్రి బావ! ఇంకెందుకా తడబాటు? ”- మోహన.
“నువ్వు ముందు నోర్మోసుకోవే. నేనాయనతో మాట్లాడు తున్నాను. అడ్డుతగలకు”
అలాగే అన్నట్టు మూతి బిగించి ముఖం అటు తిప్పుకుంది మోహన.
“నిజం చెప్పాలంటే మోహన ఇటువంటి టెన్స్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఆ ఎంజాయ్మెంటుని ఎదుటి వాళ్ళకు తెలియనివ్వకుండా దాస్తుంది. ఎలుకకు ప్రాణసంటమైతే పిల్లికి చెలగాటమే కదా! ”
మోహన ఇంకా అటే ముఖం తిప్పుకొని ఉండటం చూసి సుజాత చెప్పసాగింది- “వాస్తవానికి నా కంటే అదే చాలా డేషింగ్ గా—బోల్డుగా ఉంటుంది నరసింహ మూర్తి గారూ! ఇప్పుడేమో అదేమీ ఎరగనట్టు మిమ్మల్లి తెగ ఆటలు పట్టించేస్తుంది. నేనేమో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎటువంటి గెట్ టు గేదరింగుకి వెళ్ళినా—చాలా వరకు సౌత్ ఇండియన్స్- నార్త్ ఇండియన్స్- లాటిన్ అమెరికన్స్- వియట్నామీస్- బంగ్లాదేశ్- శ్రీలంకన్ దేశస్థుల చెంతనే చేరుతుంటాను.
వాళ్లతో తోటి ఇండియన్సులా కలసిపోతుంటాను. కాని మోహన అలా కాదు. చూసి- సెలెక్ట్ చేసుకుని వైట్స్ పక్కకు చేరుతుంది”
అంటే అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడతను.
“అంటే- ప్రక్కలకు వచ్చి నిల్చున్న ఆసియన్స్- హిస్పోనిక్సిని మనసార పట్టించుకోదు. విధిలేకన్నట్టు మాటలు కలుపుతుంది”
“అదే! ఎందుకంట సుజాతగారూ! ”
“చెప్తాను” అంటూ ఒక చోట ఆగి ఆ తరవాత గ్రీన్ లైటుకి కారు స్టార్ట్ చేస్తూ చెప్పనారంభించింది-
“దానికున్నది మాకున్నట్లు ఒంటి కాంప్లె క్స్ ఐనా- దాని కలర్ కొంచెం వేరుగా ఉంటుంది. అంచేత అటు వైట్ అమ్మాయిలు వైట్ అబ్బాయిలూ దీనితో కలుస్తారు. ఇదేమో వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి నీళ్ళలో పాలలా వాళ్ళతో కలసిపోతుంది. ఇది గమనించి మా చిన్నమ్మ రెండు మూడుసార్లు మందలించింది కూడాను- ‘అదేమిటే వాళ్ళతో అంత చనువూ! ’అని.
కాని వినిపించుకోదు. ఏమో- ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం గాని - రేపు దీనికి అమెరికన్ బాయ్ ఫ్రెండో- కెనాడియన్ బాయ్ ఫ్రెండో- ఇటీలియన్ బాయ్ ఫ్రెండో చేరువయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. పైకి మాత్రం తపోవనంలోని కన్యలా మాటలు అల్లుకుపోతూ గిల్లికయ్యం పెట్టుకుంటుంది”
అప్పుడు మోహన స్పందించింది- “ఇందులో తప్పేముందే అక్కాయ్! మన ఇండియన్సులా కాకుండా అమెరికన్స్- జర్మన్సు- కెనేడియన్స్- ఇటాలియన్స్ చాలా ఫ్రాంకుగా ఉంటారు. ఎమోషన్సు అణచుకుంటూ లోలోన ఉడికిపోతూ, బిగుతుగా ఉక్కిరి బిక్కిరిగా గడపరు. ఓపెన్ గా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ఇవన్నీ నువ్వు కావాలని ప్రక్కనపెట్టి అదేదో కీడు కార్యంలా నాకెవడో వైట్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడేమోనని తెగ ఊహించేస్తూ దెప్పి పొడుస్తున్నావు.
మీరందరూ చూస్తూనే ఉండండి- ఏదో ఒక రోజు మిమ్మల్నందరినీ ముక్కుపైన వ్రేలేసుకునేలా చేసి చూపిస్తాను”
అదంతా విన్నతరవాత నరసింహమూర్తి నిజంగానే విస్తు పోయాడు. అక్కాచెల్లెళ్ళిద్దరి మధ్యా ఇంతటి వ్యత్యాసమా! చివరికిలా పైకి అనకుండా ఉండలేకపోయాడు- “ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన ఇద్దరి మానసిక దృక్పథంలో ఎంత వ్యత్యాసం! మానవనైజం అటువంటిది మరి”
“ఉందంటే ఉండదూ మరి! పరలోక ప్రాప్తి చెందిన రఁవణమ్మగారి ఏకైక వారసురాలిది. నేనైతే సగం సూర్యకాంతమ్మ గారిలా తయా రయానేమో గాని- మా అక్కాయ్ మాత్రం పూర్తిగా కన్యాశుల్కంలోని బుచ్చమ్మలాగే తయారయింది. కొంగున తాళాల గుత్తి ఒకటి లేదు గాని- దానికంతా పెద్దరికం చూపించాలన్న తాపత్రయమే” అని యిటు తిరిగి అక్కయ్యనీసారి సూటిగానే ఉద్దేశించి అంది మోహన - “చూడవే అక్కాయ్! నీకు నీవు రఁవణమ్మ గారి అవతారంలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. వింటావా? ”
నవ్వుతూనే వింటున్నానని బదులిచ్చింది సుజాత డ్రైవ్ చేస్తూనే--
“నువ్వు ఒప్పుకున్నా— ఒప్పుకోకపోయినా— మనూరు కొత్తగా వచ్చిన ఈ రాజమండ్రి బావగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం యేమంటే- నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఇక నేనుండబోయేది కూడా ఇక్కడే-- హిమాలయాలవేపో, కృష్ణా గోదావరి గట్టుల వేపో చూస్తూ ఊహాగానంలో తేలుతూ గడపడం నాకిష్టం లేదు. అమెరిక న్ వేల్యూస్ తో బాటు-- రఁవణమ్మగారు నేర్పిన తెలుగు వేల్యూస్ కూడా సమతుల్యంగా పాటిస్తూ అమెరికన్ లాగుంటాను. ఎనీ ప్రోబ్లెమ్? ”
సుజాత ఏమీ అనలేదు. నవ్వి, గియర్ తిప్పుతూ ఓసారి చెల్లివేపు తిరిగి చూసి-- సజావుగా బండి తోలసాగింది. అప్పుడు నరసింహమూర్తి అటూ ఇటూ తిరక్కుండానే అన్నాడు- “నాకొక చిన్న అనుమానం. అక్కా చెల్లెళ్లిద్దరూ ప్రాత సినిమాల గురించి ప్రాత క్లాసికల్ పాటల గురించే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రాత తెలుగు సినిమాలలోని నటీ మణుల పేర్లు పెట్టుకుని సంబోధించుకుంటున్మారు. దీనికి కారణమేమిటో! ”
దానికి మోహనే బదులిచ్చింది. ”కారణమేముంది నరసింహమూర్తి గారూ! అంతా ఆ రఁవణమ్మగారి సందడే. నేను ముందే చెప్పినట్టు ఆమెగారు మొదట్నించీ మాకు ప్రాత సినిమాల వీడియోలు వేసి చూపించే వారు. అప్పటి పాటలలోని సాహిత్యం బహు చక్కనిదని తనకు తాను మిక్కిలి మురిసిపోతూ మా అక్కా చెల్లెళ్ళిద్దరి బుర్రలనూ తెలుగు విలువలతో నింపేసారు. అటు పైన మా అమ్మా పెద్దమ్మలూనూ-- ఆ ప్రభావం మా నుండి అంత త్వరగా వీడుతుందా చెప్పండి!”
ఈ సారి ఉద్యేగపూరితమైన తన తెలుగు భాషాభిమానాన్ని ఆపుకోలేకపోయాడు నరసింహమూర్తి- “హేట్సాఫ్ టు మేడమ్ రఁవణమ్మగారికి! ఆమెనూ ఆమె పవిత్ర ఆత్మనూ మనసార తలపోస్తూ మరొకసారి నమస్కరిస్తున్నాను”
“మీ మెచ్చుకోలు గురించి తరవాత గమనిద్దాం. మీరు మాబామ్మగారి ప్రియశిష్యులవుతారని నేను ఊపించినదే! ఇప్పుడు దీని కి బదులివ్వండి మహాశయా! నేను అమెరికన్ కల్చర్ గురించి వాళ్ళ అభిరుచుల పట్ల నాకున్నమక్కువ పట్ల మీకేమైనా అభ్యంతరమా? ”
అతడు నవ్వు ముఖంతో మోహన వేపు తిరక్కుండా సుజాత వేపు ముఖం తిప్పి అడిగాడు- “ఇది కాస్తంత సెన్సిటివ్ విషయం కాబట్టి నేను ఫ్రాంక్ గా చెప్పేదా సుజాతగారూ! ”
“ఇందులో నా పర్మిషన్ ఎందుకండీ? నిరభ్యంతరంగా దానినుద్దేశించే చెప్పండి మూర్తిగారూ!”
నరసింహమూర్తి చెప్పసాగాడు-
“మోహనగారికి తన అభిప్రాయం ప్రకారం, తన జీవన నేపథ్యం ప్రకారం చెప్పడానికి తనకిష్టమైన రీతిన జీవించడానికి నూరు శాతం స్వేఛ్ఛ ఉంది. దానిని మనం ప్రశ్నించకూడదండీ! ఎంతైనా ఇది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ప్రదేశమన్నది మనం మరవకూడదు కూడా-- ”
“అబ్బ! ఎన్నాళ్ళకు! ఎన్నాళ్ళకు ఓ మంచి మాట చెప్పారండీ మా చక్కటి రాజమండ్రి బావగారూ! “ మోహన దాదాపు పొంగిపోతూ అంది.
సుజాత మౌనంగా ఉండి పోయింది; కారు సజావుగా నడుపుతూనే అనుకుంది కాదంటే మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందేమిటి ఈ రంగుల రాట్నం!
ముగ్గురూ ఇల్లు చేరేటప్పటికి డైనింగ్ టేబల్ పైన భోజనాలు సిద్ధంగా అమర్చి ఉన్నాయి.
వెచ్చటి నీళ్ళలో ముఖమూ చేతులూ కడుక్కొచ్చి సీట్లోకి వచ్చి కూర్చున్నాడు నరహసింహమూర్తి. వైదేహి వచ్చి హాట్ ప్యాక్ ల మూతలు తీసింది. గిన్నెల్లోకి చూసిన అతడికి తెలియకుండానే నోరూరింది. ఘుమఘుమలాడే ఆ వాసనలకు కడుపు ఆకలికి కెవ్వుమంది. తన కోసం చేసిన తెలుగు వంటకాలు ఆవురావనేలా చేస్తున్నాయి.
ఆవిరి లేస్తూన్న వేడి వరిఅన్నం- జిహ్వను గిల్లే గోంగూర పప్పు- దోరగా వేయించిన బంగాళా దుంపల వేపుడు- టమోటా చారు- పెరుగులో వేగించిన ఎండు మిరప కాయలు- గడ్డ పెరుగు- వాటి ప్రక్కన ఆవకాయ పచ్చడి—అంతేనా- కాదు-- ఒక ప్లేట్ నిండా కోడిమాసం కూర- మరొక ప్లేటులో చేపల వేపుడు. ఇటు వంటివేవీ హాస్టల్ ప్యాంట్రీలో దొరకవు కాక దొరకవు. అసలు అక్కడి వాళ్ల వంట తీరే వేరు. అతడు లోలోన లొట్టలు వేసుకుంటూనే తన పెద నాన్నను మరచిపోలేదతడు.
‘అంతా మీ చలవే పెదనాన్నా!’ అనుకుంటూ మనసున దైవ ధ్యానం చేసి అందరిలాగే తను కూడా తన ప్లేటు నింపుకున్నాడు. ఆకలి రాముడికి శాంతి కలిగించాడు.
అప్పుడు కూడా తల్లి తనకు బోధించిన న్యాయ సూత్రాన్ని అతడు తు చ తప్పకుండా పాటించాడు- ‘ఒకరింటికి వెళ్ళి భోజనం చేయకూడదని భావిస్తే వెళ్ళకు. కాని ఒకసారి విస్తరి ముందు కూర్చున్నాక కడుపార తిని లేవాలి. లేక పోతే అన్న పూర్ణను అలక్ష్యం చేసిన వాడివవుతావు!’
అప్పుడు అనుకోకుండా తన పోర్షన్ రూమ్మేట్ షేక్ అహ్మద్ కళ్ళముందు మెదిలాడు.
అతడెప్పుడైనా యిటువంటి తెలుగింటి రుచులు యెక్కడైనా చవి చూసి ఉంటాడా! కాదు- కాని మేటర్ అదికాదు. షేక్ అహ్మద్ కి యేదో ఒకలా తెలుగు రుచులు తినిపించే తీరాలి. ఇక్కడకు రప్పించి తినిపించాలి.
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_f5bff61d51c142f6b3f590e34e656ca5~mv2.png/v1/fill/w_100,h_131,al_c,q_85,enc_auto/acb93b_f5bff61d51c142f6b3f590e34e656ca5~mv2.png)
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
![](https://static.wixstatic.com/media/acb93b_b3c5f8bac18d4083a277b66c105dc778~mv2.png/v1/fill/w_290,h_427,al_c,q_85,enc_auto/acb93b_b3c5f8bac18d4083a277b66c105dc778~mv2.png)
Comments