top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 13

Writer's picture: Pandranki SubramaniPandranki Subramani

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 13 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 02/02/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 


పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. సూపర్ మార్కెట్ దగ్గర సుజాత, నరసింహ మూర్తిలను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన. నరసింహ మూర్తి కాలేజీ రోజుల భావోద్వేగాల గురించి అడుగుతుంది మోహన. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహ మూర్తికి. 


ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 13 చదవండి. 


ఆరోజు సాయంత్రం అతడు హాస్టల్ కి బయల్దేరేముందు సుజాత వచ్చి అడిగింది- “మా ఇంటి భోజనం బాగుందా మూర్తి గారూ! ”


అప్పుడు మోహన చటుక్కున వాళ్ళమధ్యకు దూసుకు వచ్చింది; ‘ఏదో అడుగుతున్నట్లున్నావు అక్కాయ్’ అంటూ--


 ‘అందుగలడిందు లేదన్నసందేహమే వలదు ఈ మహాతల్లి విషయంలో-- ’ అనుకుంటూ మోహన వేపు తేరి చూసాడతను; ఇంకేమంటుందోనని తలపోస్తూ-- 


“ఇంత మంది మధ్యా ఆదమరచి ఈ ప్రశ్న వేస్తున్నావు! ఆయన గురించి తెలిసీ ఆ ప్రశ్న వేయవచ్చా? ”


అర్థం కానట్టు చెల్లి వేపు తలెత్తి చూసింది సుజాత. 


“ఇంకా తెలుసుకోలేదా టీచరమ్మా! జాగ్రత్త పడమంటున్నాను. ఆవేశంగాని పారవశ్యం గాని వస్తే రాజమండ్రి బావ ఆపులేకండా ఏం చేస్తాడో ఇంకా ఊహించలేవా? ”


ఆమాట విని నరసింహ మూర్తీ సుజాతా గట్టిగా నవ్వేసారు. 

ఆ తరవాత సుజాత వేపు కళ్ళు పెద్దవి చేసుకుని చేస్తూ అన్నాడతను- “నిజంగా చాలా బాగుంది సుజాత గారూ! మాఇంట్లో మాఅమ్మ వడ్డించినట్లుందంటే నమ్మండి“ అంటూ కదలబోయాడు నరసింహమూర్తి. 


కాని మోహన ఆపిందతణ్ణి- “ఒక్క మాట విని వెళ్ళండి రాజమండ్రి బావగారూ! ఇదంతా మా పెద్దమ్మ చేసినదే. ఇలా ఇంత ఘుమఘు మలాడేలా వంటచేయగల వంటలమ్మ మా ఇంట్లో ఇంకెవరున్నారో తెలుసా! ”


అతడు తల అడ్డంగా తలాడించాడు తెలియదన్నట్టు. 

సుజాత వేపు కళ్ళెత్తి చూపిస్తూ చటుక్కున వాళ్లిద్దరి మధ్యకూ అడ్డుగా వచ్చి నిల్చుంది మోహన. మరొక సారి ఇద్దరూ ఫెళ్ళున నవ్వేసారు. 


హాలులో కూర్చున్న శ్రీరామ్ దంపతులకు ఆ మాటలూ ఆ చిలిపి నవ్వులూ వినిపిస్తూనే ఉన్నాయి. 

మొదటి సారి వాళ్ల వాకిటంతా వసంత మండపంలా కళకళగా మారుతున్నట్లనిపించింది. 

------------------------------------------------------------------------------------- 

అతణ్ణి రామ్ మోహన్ రాబర్టే హాస్టల్ వద్ద దింపి వెళ్ళాడు. హాస్టల్ రూములోకి ప్రవేశించిన తరవాత అతడు చేసిన మొదటి పని; తన రూమ్ మేట్ శరీరఛాయకు అనువైన బ్లాక్ లాంగ్ కోటుని తీసి అందివ్వడం. అది అందుకుని నరసింహమూర్తి వేపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి షేక్ అహ్మద్ ఒక మాట అన్నాడు. ఆ ఒక్కమాటా శిలాక్షరాలతో లిఖించదగ్గది- “నిన్నకాక మొన్న కలుసుకున్న మనం ఎంత త్వరగా స్నేహితులమై పోయాము! మనసులు విప్పి ఎంత హాయిగా మాట్లాడుకుంటున్నాం! మరి ఒకే భూఖండం నుంచి పుట్టిన మన ఇరు దేశాలు— ఆ ఇరుదేశాల ప్రజలూ ఎందుకు దగ్గరవలేక పోతున్నారు? అప్పటి తరం వాళ్ల సంగతేమిటో గాని-- ఈ తరం వాళ్ళకు చివరి వరకూ ఇదొక అంతు తెలియని ప్రశ్నగానే మిగిలిపోతుందేమో! ”


నరసింహమూర్తి ఏమీ అనలేదు. నవ్వి బట్టలు మార్చుకుని బాత్ రూములోకి వెళ్లి వేడి నీళ్ళతో స్నానంచేసి వచ్చి పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడయాడు. అతడెప్పుడు ధ్యాన నిమగ్నుడయినా అతడి మనో నేత్రం ముందు ముక్కంటి ప్రత్యక్షమవుతాడు. 


“వందే శంభు ముమాపతిం సురగరుం వందే జగత్కారణం— వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాం పతిమ్- వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం- వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్”


అతడలా కాసేపటికి ధ్యానం ముగించి లేచీ లేచిన వెంటనే ఆలోచనలు అతడి చూట్టూ తుమ్మెదల్లా చుట్టు ముట్టాయి. అతడి అవగాహన మేర పాకిస్థానీయులు మనస్తత్వ రీత్యా బొగ్గువంటివారు. మరీ దగ్గరగా ఉండకూడదు. అదే సమ యాన మరీదూరంగా కూడా ఉండకూడదు. చల్లగా ఉంది కదానని ముట్టుకుంటే మసి అంటుకుంటుంది. ఎర్రగా ఉందికదానని- చలి కాయవచ్చు కదానని తాకితే భగ్గున మండుతుంది. 


మితంగా మాట్లాడితే ఇద్దరికీ ఉభయతారకమన్న ఆలోచనతోనే అతడు మంచం పైన ఉపశమనం పొందుతూ మేను వాల్చాడు; మొన్న మొన్న వారణాశిలోని హనుమాన్ మందిరంలో ఎవరో పాకిస్థాన్ గాయకుడిచ్చిన సంగీత కచ్చేరీని గుర్తుకి తెచ్చుకుంటూ-- 

***

హోటల్ స్వాగత్ వద్ద స్కూటర్ పార్క్ చేసి, రిసెప్షన్ కౌంటర్ వాళ్ళకు ఓ మాట చెప్పి, మాధవి కోసం ఎదురు చూస్తూ బైటకు వచ్చి నిల్చున్నాడు శంకరం. ఫుట్ పాత్ పైన చాలా మందే వచ్చి పోతున్నారు గాని ఆమె మాత్రం కనుల కానడం లేదు. నిజంగా వస్తుందో రాదో! వస్తానని రాకుండా పోతుందేమో! ఆఖరు క్షణాన మనసు మార్చుకుని తనిక రానని రింగ్ ఇవ్వబోతుందేమో! క్షణ క్షణ భంగురమ్ముల్ ముదితల్ చిత్తముల్. లేత ఆశలు సముద్ర ఉపరితలం నుండి లేచిపడే అలలు వంటివి. అవి ఊరిస్తూనే ఉంటావి. కాని అందవు. ఎగిసిపడవు. 


కాని అలా జరగలేదు. కొద్ది సేపటికి అటు వేపు తదేకంగా చూస్తూన్నఅతడి కళ్ళు తళుక్కున మెరిసాయి. క్యాబ్ నుండి దిగి నడచి వస్తూంది మాధవి. పచ్చటి నెమలీక రంగు చీర కట్టుకుని, చెపులకు వంకీల దుద్దులు పెట్టుకొని, మెడన రవ్వల నెక్లస్ వేసుకుని— చిర్నవ్వు తెలికాంతుల్ని చిలికిస్తూ వయ్యారంగా నడచి వస్తూంది. అతడి కళ్ళకు ఆమె అప్సరసలా కనిపించింది. ఎంతటి అందం! ఎటువంటి పొంగులారే యవ్వనం! 


తన వంటి పెళ్ళికాని బ్రహ్మచారులు స్కూలు ఆవరణలో కొందరుండనే ఉన్నా రు. వాళ్ళింకా ఆమెను చూపులతో గిల్లుతూ మాటల తేరుతో తెగబడలేదంటే కారణం- స్కూలు వాతావరణం మాత్రమే కాదు. మాధవి తల్లి వర్థనమ్మగారి గాంభీర్యత ఉట్టిపడే ఆమె ఉనికి కూడా ఒక కారణం. వర్థనమ్మగారి ఉనికి గాని లేకపోతే-- ఇంతటి సొగసు లు చిమ్ముతూ నడవమ్మట నడుస్తూ పోతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటారా- అదీను ఈ రోజుల్లో! 


ఉన్నపాటున అతడికి తెలుగు మహా నటీమణులు సావిత్రమ్మగారు- వహిదా రెహ్మాన్ గారు కళ్ళముందు మెదిలారు. మాధవిలో వాళ్ళిద్దరి ముఖఛ్ఛాయలు సమపాళ్ళలో ఉన్నట్లే తోచిందతనికి. మరొకటి కూడా అతడి ఊహకు అందకుండా పోలేదు. సీనియర్ స్కూలు టీచర్ మాధవి అంత నిండుగా పండువెన్నెలలా అలంకరించుకుని స్కూలుకి రావడం అతడెప్పుడూ చూడలేదు. అంతటి అరుదైన అనుపమ సోయగాలను ఆమె గూఢంగా ఏదో కారణంతోనే దాచుకుంటుందన్నమాట! 


అతడు ఆలోచనలనుంచి తేరుకుంటూ నవ్వుతూ ఎదురెళ్ళి- “సంధ్యారాగ సుమాళ స్వాగతం! ”అని పలకరించాడు. అలా పలకరిస్తూనే తనకు తాను సబాళించుకున్నాడు- “సౌందర్య పిపాసకుడను- అతిగా పలుకులు పలికి ఉంటే క్షంతవ్యుడను!”


ఆ సమయాన ఆమె వర్థనమ్మగారి కుమార్తె అన్నది మరచిపోయాడేమో! నిజానికి తనా మరచి పోయాడు? వెన్నెల వెలుగుతో అంద చందాలను కురిపించే ఆమ సోయగాలు కదా తనను మరపింప చేసింది. అప్పుడామె గొంతు వీణలా వినిపించింది- “ఇందులో క్షమాపణకి తావెక్కడిది? బాగానే అన్నారు. మనసార పలికారు. మరి నేను కూడా స్పందించాలిగా-  ‘హృదయపూర్వక ధన్యవాదాలు! ఈజిట్ ఓకే! ”అందామె. 


శంకరానికి మాటలు కరువయాయి. మౌనంగా సాదరంగా ఆమెను లోపలకు తీసుకెళ్ళాడు. అలా నడిపిస్తూనే మయూరిలా వయ్యారంగా కదులుతూన్న ఆమె నడుం చుట్టూ చూపులు పోనిచ్చి అనుకున్నాడు- “నడుమొంపులతో తళుకులీనుతూన్న ఆమె చుట్టూ తను యెప్పుడు చువ్వల్లాంటి చేతుల్ని పోనిస్తాడో కదా!"


ఇద్దరూ వెళ్ళి డైనింగు హాలు చివరన మందకొడి కాంతి ప్రతిఫలిస్తూన్న చోట కూర్చున్నారు. 

కూర్చున్నవెంటనే ఆమె ఎదురు చూడని విధంగా అన్నాడు శంకరం- “పర్సనల్ విషయాల జోలికి వెళ్తున్నాననుకోండి మేడమ్- సారీ మాధవి గారూ- ఇప్పడు గాని పెళ్ళి చూపులకని వచ్చిన ఏ మగాడైనా సరే- మిమ్మల్ని చూసిన మరుక్షణం గిర్రున బొంగరంలా తిరిగి పడిపోవలసిందే! అక్కడికక్కడే పెళ్ళి ముహూర్తం పెట్టించమని అడగవలసిందే! ఇది నిజం- ముమ్మాటికీ నిజం” 

“నిజంగా నేనంత బాగున్నానా!"


“మా అమ్మపైన ఒట్టు. నా ఎట్టెదుట ఇంతటి సౌందర్య రాశిని ఇలా చూడటం నా ఎరుకలో ఇదే మొదటి సారి! ఇంతటి అదృష్టం ఇంద్రుడికి గాని చంద్రుడికి గాని లభించి ఉండలేదేమో! ” 

ఆమె వెంటనే స్పందించ లేదు. రెండడుగులు ముందుకు వేసి మృదువుగా నవ్వి అంది-- “అలాగైతే మీరే నన్ను చూడటానికి రావచ్చు కదా!”


ఆ మాటకతడు అవాక్కై చూసాడు. మాటా పలుకూ లేకుండా కొన్ని క్షణాలు ఊరకుండిపోయాడు; మంచి నీళ్ళ గ్లాసు చేతిలోకి తీసుకుంటూ. 


“అదేంవిటి అలా మ్రాన్పడి చూస్తున్నారు! తమాషాకి అన్నానండీ బాబూ! బెదరిపోకండి సార్! “

“ఒక కుడుమిస్తే ఆ రోజంతా అతడికి పండగే అంటారే- అటువంటి స్థాయికి చెందిన వాణ్ణి. అంతటి పెద్ద జోకులు వేయకండి మాధవి గారూ! మీరు నా కోరిక మన్నించి నాతో కలసి భోజనానికి రావడమే గొప్ప ఉత్సవం. ఇప్పుడామాట ఎందుకు గాని- మొదట మనం టమోటా సూప్ తీసుకుందాం- విత్ ప్రైయిడ్ పొటాటో చిప్స్ తో. సరేనా! ”


దానికామె తలూపుతూ అంది- “అంతా తీసుకుంటాను. మీకు సంతోషం కలిగించేంత వరకూ ఆరగిస్తాను. ఐతే ఒక షరతు- వింటారా! ”


సెలవివ్వండన్నాడతను. 

“నిజం చెప్పాలి- అంతే”


ఆ మాటకతడు నవ్వేసాడు- “భలేవారండీ మాధవిగారూ! మీముందు అబద్దం చెప్పేంత ధైర్యం నాకుంటుందా! “


“మీరు చాలా రోజులుగా నన్ను తప్పించుకు తిరుగు తున్నారు- కావాలనే-- ఔనా కాదా! ”

అతడు అప్రతిభుడై చూసాడు. చేతిలోని మంచిగ్లాసు ఉందన్నది జ్ఞప్తికి వచ్చి గడగడా తాగాడు. ఈమెవి ఎక్స్ రే కళ్లు గాని కావు కదా! ఇక ఇప్పుడతడు తప్పించుకోలేడు. నిజమే తప్ప- మరొకటి చెప్పనని వాగ్దానం చేసాడుగా! ఎట్టకేలకు అతడు- ఉఁ అని ముఖం తిప్పుకున్నాడు. 


“ఎందుకు?”


“ ____”

అతడు బదులివ్వకుండా కళ్లు మిటకరిస్తూ చూడాసాగాడు. 


ఆమె మళ్ళీ అంది- “మీరు గాని సరైన బదులివ్వకపోతే నేనేదీ ముట్టను. మీ జవాబు కోసం ఎదురు చూస్తూనే కూర్చుంటాను”


“జవాబిస్తే మీరు కాదనకుండా అన్నీ తీసుకుంటారు కదూ! ” 


తలూపుతూ బదులిచ్చిందామె- “ఓ! యస్“అని. 


“ఇటీజ్ ఎ డీల్- మ్యూచ్వల్ డీల్” అంటూ బేరర్ ని పిలిచి టమాటో సూప్ పొటాటో చిప్స్ కోసం ఆర్డరిచ్చి మాధవి వేపు తిరిగాడతను. “నేను రెండు మూడు సార్లు గమనించానండీ- మీరు నన్ను ఓర చూపులతో చూడటం-- ”


దానికామె చట్టున స్పందించింది- 

“ఔను. చూసాను. ఇందులో విడ్డూరమేముంది? నాకు చూడాలనిపించింది చూసాను. ఎనీథింగ్ రాంగ్ వితిట్! ”


“లేదు. కచ్చితంగా లేదు. కాని అసలు విషయం అది కాదండీ! మీకు తెలియదేమో గాని- మీరీ స్కూలులో చేరినప్పుట్నించీ మీ రూపం నా కళ్ళనిండా ధవళ కాంతిలా పేరుకుపోతూనే ఉందండీ. కళ్ళకు నిద్రరానివ్వడం లేదండి. మీరు వర్థనమ్మగారి కూతురు కదండీ- నాకు నిజంగా తలెత్తి చూడటానికి జంకు పుట్టిదండి. చివరకు మీరు నన్ను ఎంతగా ఆకట్టుకున్నారంటే- కలలో వచ్చి కలతలు రేపుతూ కథలు చెప్పనారంభించారండీ! అదండీ అసలు కారణం నేనలా తప్పుకు తిరగటానికి--”


“అంటే- మీరు బిడియంతో ఆశల అలల్ని అదుపులో ఉంచుకుంటూ గుండెగూట్లో దాచుకోసాగారన్నమాట! ”


“అబ్బే బిడియంతో కాదండీ! గౌరవంతో- వర్థనమ్మగారి పైన ఉన్న అభిమానంతో--”


“అంటే- వర్థనమ్మగారి కుమార్తెకు రేపు ఎవరూ తోడే రాడంటారా లేక ఉండకూడదంటారా! ”


“మీతో వాదించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు మాధవి గారూ! ఒక విషయం చెప్తాను ఏమీ అనుకోకండి“ 


తలూపిందామె. 


“మీరు నాకు పూజ్యురాలైన వర్థనమ్మగారి కూతురన్నది నేను మరవలేనండి! ఇప్పటికీ ఎప్పటీకీను”

“అంటే— వయసు మళ్ళిన ముత్తయిదువులా ఒదిగి ఒదిగి నడుచుకోమంటారా? రోడ్డు ఓరన అటు ఇటూ కదలకుండా బిగుతు గా ఒంటి నిండా చీర కప్పుకుని నడవమంటారా- మా రాజమండ్రి మాడవీధిలో తారసపడే మాడ వీథలోని ముత్తయిదువుల్లా- ! ”


“అబ్బే నేనలా అనడం లేదండీ! మీరింత డేషింగ్ గా సూటిగా తెలుగు సినిమాలలో నటించే ఉత్తరాది సినీ స్టార్లలా మాట్లాడతారని నేనెప్పుడూ ఊహించలేదు మాధవిగారూ! ”


“అంటే నన్నింకా స్కూలు టీచరమ్మలాగే ఊహించుకుంటూ మాట్లాడుతున్నారన్నమాట! అది విద్యాలయం. ఇది జీవనప్రాంగ ణం- వాస్తవాలనూ- బైటి ప్రపంచాన్నీ- నేనిలాగే బోల్డుగా ఎదుర్కుంటాను. నేనే కాదు. అమ్మాయిలందరూ ఇలాగే ఉండాలంటాను” 


“నేను మిమ్మల్ని అప్పటి స్త్రీలలా ఉండాలనుకోవడం లేదండి. కాని ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోతున్నాను. తీరాన విసరి వేయ బడ్డ చేపలా ఉంది నా పరిస్థితి” 


మాధవి కాస్తంత విరామం ఇచ్చి నిదానంగా అంది- “మీ ఆశ్చర్యాన్ని కొంచెం ఆపుకుంటారా అపర ఆంజనేయా! కొన్నివిషయాలు మరీ జాప్యం చేస్తే అమృతం కూడా విషంగా మారుతుందంటారు- అందుకే ఈసారి సూటిగానే అడుగుతున్నాను. నేను మీకు నచ్చానా? ”


తేరిపార చూస్తూ శంకరం గొంతు సవరించుకుని జవాబిచ్చాడు- “ముందే చెప్పాను కదండీ.. మీరు బాగుంటారని- కలలోకి కూడా వస్తుంటారనీ! అంతగా చెప్పిన తరవాత నాకు నచ్చడమూ నచ్చకపోవడమూ అంత ముఖ్యమా చెప్పండి? ”


“అలా కొరమీను చేపలా జారిపోకండి- ప్రవరాఖ్యుడిలా తొలగిపోకండి. పెళ్ళి సంబంధానికై నన్ను చూడటానికి వచ్చిన అబ్బాయి లా ధీటుగా మాట్లాడండి శంకరం! డూ యూ లైక్ మీ? ”


అప్పుడతడు ఆగిపోయాడు. అది ఏ. సీ. హాలైనా అతడికి ముచ్చెమటలు పట్టాయి. “నాకిష్టమే! కాని--”

“కాణీ బేడా ఆ కాలపు కాసులు. డాలర్స్ యూరోస్ డౌన్ పేమెంటులా చెప్పండి”


“మీరింత సూటిగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా సూటిగానే బదులిస్తాను. మీ పొందు కోసం పూజ్యురాలైన వర్థనమ్మగా రి మనసుని నొప్పించలేను. ఆమెగారి దయా ప్రేమా నాకు చాలా అవసరం. ఇదే నా చివరి మాటగా తీసుకోండి. ఇకపైన ఈ ఊసు ఆపేయండి. మన డీల్ ప్రకారం హాయిగా భోంచేయండి. నన్నుకూడా భోంచేయ నీయండి” అంటూ బేరర్ తెచ్చిన సూపు బౌల్ ని చిప్స్ ప్లేటునీ ఆమె ముందుకు జరిపాడు. 


మాధవి ఈసారి మాటల రాపిడికి పాల్పడలేదు. అప్పటికప్పుడు శంకరాన్ని గోడకు పుష్ చేయకూడదని తీర్మానించింది. 


కొన్ని క్షణాల పాటు శంకరం ముఖంలోకి చూస్తూండి పోయింది. దారికి వచ్చినట్టే వచ్చి తప్పుకుంటున్నాడు అపర ప్రవ రాఖ్యుడు. ఆమె సూపుని స్పూనుతో తీసుకుంటూ అంది- “చూడండి శంకరం! ఇది మీకు మామూలుగా బాయ్ మీట్స్ గార్ల్ వ్యవ హారంలా తోచవచ్చు. కేవలం సోషియల్ ఇంప్లికేషన్స్ ఉన్న సమస్యలా కనిపించనూ వచ్చు. కాని ఇది నా మనసుకి సంబంధించినది. సున్నితమైన మనోరాగానికి ముడివేసుకున్న విషయం. 


టార్గట్ పాయింటు వద్దకు రాకుండా చుట్టూ గిరికీలు తిప్పకండి. ఆ తరవాత మీరూ బాధపడవలసొస్తుంది. నేనూ అశాంతికి గురికావలసొస్తుంది. ఈజిట్ క్లియర్? ”


అతడు ఆలోచనల్ని కుదుట పర్చుకుంటూ అన్నాడు- “ముందు సూపు తీసుకోండి. చల్లారి పోతుంది”


“బహు పసందుగా సెలవిచ్చారు! ప్రేమ కుడా అంతే. చల్లారి పోతే హృదయావేశం అణగారిపోతుంది”


ఆమె టెన్షెన్ కి తావివ్వకుం డా మామూలుగా కనిపించడానికి ప్రయిత్నిస్తూ అందామాట. అతడు కూడా అదే రీతిన మామూలుగా కనిపంచడానికి ప్రయ త్నిస్తూ అన్నాడు- “మీరు భళే చమత్కారంగా మాట్లాడతారండీ! మీరు లేడీ అడ్వకేట్ గా వెళ్ళాల్సింది”


“థేంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఇప్పుడు మనం మాట్లాడేది నా వృత్తి ఉపాధి గురించి కాదు. మన మనసులోని తపన గురించి”


అలా అంటూ ఆమె అతడి కళ్లలోకి అసంకల్పితంగా చూసింది. అతడి కనురెప్పలు తడిసి ఉన్నాయి. ఆమె పెదవి విప్పి చెప్పేలోపల అతడు ఆర్ద్రత నిండిన కళ్ళతో చూస్తూ ఆమె చేతి మీద చేయి వేసాడు. ఆమె చేతిని వెనక్కి తీసుకోలేదు. అతడలాగే చేతి పైన చేయి వేసి నిదానంగా అన్నాడు- “మీరంటే నాకు చాలా రెస్పెక్టు ఉంది మాధవీ!”


“ఆడదానిగా నాకు కావలసింది మీ రెస్పెక్టు కాదు- మీ మనసు”


“అలాగే! దయచేసి తొందర పెట్టేయకండి. ఇక విషయానికి వస్తున్నాను. మీరు నన్ను ఇష్టపడి పొరపాటు చేస్తున్నారు మాధవీ! మాది నిజంగానే వెనుకబడిన కుటుంబం. ఎంత వెనుకబడిన కుటుంబమంటే, మాటలతో చెప్పలేను. మా అమ్మ తప్ప మాఇంట్లో వాళ్లందరూ తిప్పసారాయం తాగుతారు. 


మా బాబు మునుపులా యెడాపెడా తాగడం లేదంటే— బుద్ధి వచ్చి కాదు. ఆయన తప్పీ జారీ మా వీధి పోలమ్మ వారి గుడి ట్రస్టీగా ఎన్నికయారు. ఆ పోస్టుతో ఆయనకు ఎన్నడూ యెదురు చూడని గౌరవ ప్రపత్తులు లభించాయి. ఆ స్థానాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆయన ఉదయం నుంచీ సాయంత్రం వరకూ బుధ్దిగా ఒళ్ళు దగ్గర పెట్టు కుని గుడి ప్రాంగణం లో గడుపుతాడు. రాత్రి అయేటప్పటికి పులిలా మారిపోతాడు. మంచం క్రిందనుంచి సారాయి బాటిల్సు ఒకటి తరవాత ఒకటిగా ఖాలీ చేస్తుంటాడు. 


అమ్మేమో భర్త పరువు బజారు పాలు కాకుండా ఉండాలని గుట్టుగా మాంసం కూర వండిపెట్తుంది. ఎందుకంటే- సమాజంలో ఎంతటి గొరవ ప్రపత్తులు వచ్చినా మద్యం సేవించడం ఆయన పూర్తిగా మానలేక పోయాడు”


అప్పుడు మాధవి అడ్డు వచ్చింది- “ఇందులో పెద్ద ప్రోబ్లెమ్ ఏముంది శంకరం? చాలా మంది ఇండ్లలో సాగుతున్నదేగా! ఇంకా చెప్పాలంటే మీ నాన్న కాస్తంత న్యాయంగానే ప్రవర్తిస్తున్నారు. కనీసం తనను తను అదుపులో పెట్టుకోగలగుతున్నారు”


“అసలు విషయం అది కాదు మేడమ్- సారీ- మాధవీ! ఆ చుట్టు ప్రక్కల పొలిమేర్ల వద్ద మాకు చాళ్ళలో గింజలు చల్లినట్టు మా అమ్మకూ మా బాబుకీ దగ్గరయిన వాళ్ళూ ఉన్నారు. కొందరు మాకు రక్త సంబంధీకులు కూడాను. ఆదివారాల పూట- పండగల పూట- వాళ్ల వాళ్ళ ఆడాళ్లతో పొలోమని వచ్చేస్తారు. ఎలా వస్తారనుకున్నారు? 


ఒక సంచీలో కల్లు సీసాలు- సారాయి సీసాలూను. మరొక సంచీలో పచ్చి కోడు మాంసం. మేక తలకాయ మాంసమూను. పెద్ద పండగలప్పుడు మా వాళ్లు అడవుల్లోకి వెళ్ళి అడవి పందిని కొట్టుకొచ్చి ఆ మాంసాన్ని మాఇంటికి తీసుకువస్తారు. అన్నీ మాఅమ్మే వండి పెట్టాలి”

అప్పుడు మాధవి అడ్డువచ్చింది- 


“ఇప్పుడు-- ఆపైన ఏమి జరగబోతుందో నేను చెప్తాను వినండి. మద్యం సేవిస్తూ గుంపు గుంపుగా ఊసులాడుకుంటూ భుజిస్తా రు. ఆ తరవాత మత్తుగా ఊగుతూ వాళ్లవాళ్ల ఇండ్లకు వెళ్లిపోతారు. అంతేగా— ఇందులో సామాజిక పరమైన వెనుకబాటుతనం యెక్కడుంది శంకరం? ఇంకా చెప్పాలంటే అది మీ వాళ్ల జీవితానందంలో ఒక భాగం. 


కష్టజీవులు— కొందరలాగే ఉంటారు. మీరు గాని మెల్లమెల్లగా పూనుకుంటే చాలా వరకు చక్కబెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడు మీ నాన్నగారు దారికి రావడం లేదూ! ”


“అబ్బా! మీరు నన్ను పూర్తిగా చెప్పనివ్వడం లేదు. దయచేసి దీనిని మామూలు విషయంగా తీసుకోకండి. సరే- ఈ సంగతి వినండి. మా సామాజిక వర్గానికి చెందిన ఒక హెడ్మాష్టారు గారున్నారు. ఆయన నాగురించి తెలుసుకుని తన పెద్ద కూతురైన మిడిల్ స్కూల్ టీచర్ని నాకివ్వాలని తానుగా తీర్మానించారు. కాని మా యింట్లో జరిగే ఈ హంగామా గురించి తెలుసుకుని సంబంధాన్ని తెగ్గొట్టారు”

“ఈ విషయాన్ని వాళ్లు అంత సీరియస్ గా తీసుకున్నారా? ”


“మా ఆడాళ్లు కొందరికి మగాళ్ళలా పూటుగా తాగే అలవాటుంది. అది వాళ్లకు ససేమిరా నచ్చలేదు. అందుకే నేను నేనుగా ముందుకు వచ్చి చెప్పాను, ఒకప్పుడు మాది కాటికాపర్ల వంశమని. ఇక అటు చూస్తేనేమో- మీరు ప్రసిధ్ద సర్జన్ డాక్టర్ నరసింహులు గారి ఏకైక కూతురాయె. ఇటు చూస్తేనేమో—నాకు సహితం అందని విద్యాధికురాలాయె-- ఇప్పుడు చెప్పండి మీకూ మాకూ మధ్య పొంతన యెలా కుదురుతుందో! “


ఆమె మౌనంగా ఉండిపోయింది శంకరాన్ని చూస్తూ-- అప్పుడు మళ్ళీ అతడు ముందుకు వచ్చి మరింత వివరణ ఇచ్చా డు. ”నాకు తెలుసు మీరు నా గురించి కంటే మాకుటుంబ నేపథ్యం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని. ఔను కదూ!”


ఆమె చిన్నగ నవ్వి ఔనంది. అతడు మళ్లీ చెప్పసాగాడు-  “ఔను. వాళ్ళకూ నాకూ మధ్య వ్యత్యాసం ఉంది. దానికి కారణమూ ఉంది. పూర్వ జన్మ సుకృతం వల్ల బృహస్పతి వంటి పంతులుగారు నాకు గురువుగా దొరికారు. మంచీ మన్ననా- సభ్యతా సంస్కారమూ ఆయనే నాకు నూరిపోసారు.

దివంగతులైన ఆయన మాటను శిరాసా వహిస్తూ ఉండబట్టే ఒక్కరోజు కూడా విడువకుండా రెండు పూటలా భగద్గీత, శివపురాణం పఠిస్తుంటాను. భౌద్ధ ధర్మ సూత్రాలను మననం చేస్తూనే ఉంటాను. 

ఆ రీతిన ఎంత కాదనుకున్నా సూర్యుడి వెలుగు చంద్రుడిపైన పడకుండా ఉండదుగా! అదే విధంగా ఆ మహానుభావులిచ్చిన హితోపదేశాల ఒరవడి నాకు తాకకుండా ఉండదుగా! ” అప్పుడామె అతణ్ణి ఆపింది. “ఇంతకీ మీరేమంటారు శంకరం? ”


“నేననడం ముఖ్యం కాదు. నా మనసేమంటుందో తెలుసుకోమంటున్నాను”


“సరే—అదే చెప్పండి.”


“మావంటి సాధారణ కుటుంబంతో సంబంధం పెట్టుకుని మీరు వడగండ్లవానకు లోనవడం నేను చూడలేను”


కొన్ని క్షణాల పాటు మాధవి నిశ్శబ్దంగా తల వంచి సూపు తాగడంలో నిమగ్నమైంది. ఆ తరవాత హ్యాండ్ షీటుతో పెద వులు తుడుచుకుంది. నిదానంగా చూస్తూ అతడి రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుంది. ”ఇప్పుడు నా నిర్ణయం చెప్పేదా శంకరం!”


అతడామె కళ్ళలోకి అయోమయంగా చూస్తూ తలూపాడు.

“మీతో మాట్లాడిన తరవాత నాలోని సంకల్పం మరింత ధృడపడింది. నా జీవన మార్గం సుగమమైంది. మనిద్దరం కలిసే జీవిస్తాం. మీ ఇంటి వాతావరణాన్ని మనిద్దరమూ కలిసే చక్కదిద్దుదాం. ఇక మీరేమీ మాట్లాడబోకండి. ఇంకేదేదో మాట్లాడి మిమ్మల్ని మీరు లేనిపోని భ్రమలో పడేసుకోకండి”.


ఈ సారి శంకరం దీర్ఘంగా నిట్టూర్చాడు. నిట్టూరుస్తూ అన్నాడు- 

“కొందరున్నారు. వాళ్ళు కష్టాల్ని కొని తెచ్చుకోవడానికే పుట్టినట్టు తెగ సరదాపడుతుంటారు. ఇక నా వంటి అర్భకుడు చేసేదేముంది చెప్పు! “


“కష్ఠాలు తెచ్చుకోవడానికి కాదు. మీతో కలసి ఏడడుగులు వేయడానికి వస్తున్నాను. మీ ఇంటి కష్టాలను తగ్గించడానికే రాబోతు న్నానని తెలుసుకోండి. అంతే కాదు. నేను వర్థనమ్మగారి కూతుర్నన్నది మరచిపోకండి. కాని పనికి పూనను. పూనిన పనిని మానను” అంటూ మిగతావి ఏమేమి కావాలో దగ్గరకు వచ్చి నిల్చున్న బేరర్కి ఆమే ఆర్డరిచ్చింది. 


ఇద్దరూ భోజనాలు కానిచ్చి బైటకు వచ్చేటప్పటికి వాతావరణం మసకబారింది. కాసేపు అలా ఫుట్ పాత్ ఓరమ్మట నడుస్తూ వచ్చారు. అలా నడుస్తూ మాధవి చటుక్కున ఆగింది- “మిమ్మల్ని ఒకటి అడగాలనుకూంటూనే అడగడం మరచిపోతున్నా ను శంకరం! ఇక అడుగుతాను. రెడియేనా?”


అతడు తలాడిస్తూ ఆమె ముఖంలోకి చూసాడు. ఇద్దరూ దగ్గరయిన తరవాత తన వేపు రాబోయే మొదటి షాట్ ఇదేనేమో! 


“నేను మా అమ్మతో అలా కారులో వెళ్తూ, రెండు సార్లు చూసాను మిమ్మల్ని- సాయంత్రం దీపాలు పెట్టేవేళ దాటింతర్వాత స్కూలు రోడ్డు మలుపు వద్ద. అంత సేపు స్కూలులో ఏమి చేస్తున్నారు? నాకు తెలియకుండా ఎవరినైనా సైట్ కొట్టడం లేదు కదా!”


 ఆ మాటకతడు నవ్వాడు. “నేను దానికి సూటిగా జవాబిచ్చేముందు నేనొక పద్యం పాడతాను వింటావా మాధవీ? ” 


ఆమె తలాడించింది. 

అతడు నవ్వుతూ నడుస్తూనే చెప్పసాగాడు- ‘వంకాయ వంటి కూరయు- పంకజముఖి సీతవంటి భామామణి యున్- శంకరుని వంటి దైవము- లంకాధిపు వైరివంటి రాజును కలడే!’అని చెప్పడం ముగించి ‘అర్థమైందా’ అని అడిగాడు. 


“ఏమర్థం కావాలంటారు శంకరం? ” కళ్లను చక్రాల్లా తిప్పుతూ అడిగిందామె. 


జాణ- నెరజాణ- తన చేత చెప్పించాలని చూస్తుంది. ఇక ఎలగూ తప్పదుగా! అంచేత ఆమె కోరికను తీరుస్తూ చెప్పాడతను- ”నిండు పౌర్ణమి నాడు వెన్నెల కాచినట్టు నువ్వు నా ముందు నడయాడుతుంటే ఇక నాకు వేరొకరి ధ్యాస ఎలా కలగుతుందీ! సరే- ఇక నువ్వడిగిన విషయానికే వస్తున్నాను. వారానికి కనీసం నాలుగురోజులైనా నేను జిమ్ కి వెళ్తాను. మన స్కూలుకి ప్రక్కనే ఉన్న కోడి రామ్మూర్తి వ్యాయామశాలకు వెళ్ళి వస్తుంటాను. ఇక తీరిందా తమ అనుమానం! ” 


“నాది అనుమానం కాదు మహాశయా! తెలుసుకోవాలన్న ఆసక్తి” అంటూ మాధవి శంకరం చేతిని తన చేతిలోకి తీసుకుంది. 


=======================================================================

                                                ఇంకా వుంది


========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





25 views1 comment

1 Comment


తరంగాలు తీరం దాటి పోతే: పాండ్రంకి సుబ్రమణి  

Modern & interesting ... ఆసక్తికరం గా పరిగెడుతుంది.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page