#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
![](https://static.wixstatic.com/media/acb93b_5c771b0b3e0441a88528adb9a3235cf1~mv2.jpg/v1/fill/w_500,h_500,al_c,q_80,enc_auto/acb93b_5c771b0b3e0441a88528adb9a3235cf1~mv2.jpg)
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 14 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 09/02/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. సూపర్ మార్కెట్ దగ్గర సుజాత, నరసింహ మూర్తిలను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన. నరసింహ మూర్తి కాలేజీ రోజుల భావోద్వేగాల గురించి అడుగుతుంది మోహన. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహ మూర్తికి.
శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 14 చదవండి..
మరునాడు శంకరానికి నోట్ ఆఫ్ అప్రిసియేషన్ చేరింది; తన సర్వీసు రికార్డులో రెడ్ ఎంట్రీ ఇచ్చామని స్కూలు మేనేజి మెంటు అధికారపూర్వకంగా తెలియజేస్తూ-- అదృష్టం కాసుల రాశి వంటిది. వస్తే— ఇంటి కప్పుని విడగొడుతూ వస్తుంది. వేసవి కాలంలో అనుకోని విధంగా కురిసే కుంభవృష్టిలా దూసుకువస్తుంది. అతడికి ఆ నోట్ ఆఫ్ ఎప్రీసియేషన్తో బాటు అకౌంటెంటుగా ప్రమోషన్ ఆర్డర్ కూడా వెన్నంటి వచ్చింది; ఆవును వెతుక్కుంటూ ఏతెంచిన లేగదూడలా-- ప్రమోషన్ ఆర్డర్ అందుకున్న శంకరం నిమిషం పాటు ఉక్కిరి బిక్కిరి ఔతూ ఉన్న చోట ఉన్నట్లే ఉండిపోయాడు. అప్పుడప్పుడు ఆనందాన్ని అనుభవించడాని కి కూడా మనిషికి శక్తి కావాలి. మానసిక పరమైన సంసిధ్ధత ఉండాలి.
శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన సహోద్యోగులకు ధన్యవాదాలు చెప్పి, డ్యూటీలో వాళ్ళిచ్చిన సహకారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పేరు పేరున చేతులు కలిపి వాళ్ళందరకూ టీలు- బిస్కట్లు వచ్చేటట్టు యేర్పాటు చేసి స్కూటరు వేసుకుని వేగం గా రోడ్డుపైకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెళ్లినట్టుగానే స్వీట్స్ బాక్సుతో వచ్చి, తిన్నగా వెళ్ళి స్కూలు ప్రిన్స్ పాల్ గారికి ఒకటి సమ ర్పించి- మరింత బాగా కష్టించి పని చేస్తానని ఆయనకు మాటకూడా ఇచ్చి, ఆ తరవాత ఆఫీసు ఇన్చార్జి వర్థనమ్మగారి చేంబర్ లోకి ప్రవేశించి- ఆమెకు రెండు స్వీట్ బాక్స్ అందిచ్చి ఆమె చేసిన సహాయానికి తన పట్ల చూపిన అక్కరకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరించాడు.
ఆమె నిండుగా నవ్వుతూ- “యు డిజర్వ్ ఫర్ ది ప్రమోషన్ శంకరం” అంటూ ఒకటి మాత్రం తీసుకుని మరొకటి అతడికి తిరిగిచ్చేసింది.
కాని అతడు ఊరుకోలేదు. “ఇంటికి తీసుకెళ్ళండి మేడమ్! మీది పెద్ద కుటుంబం కదా మేడమ్. మళ్ళీ నాకు మరొక ప్రమోషన్ ఎప్పుడొస్తుందో! మళ్ళీ మీకు స్వీట్స్ ఇచ్చే అవకాశం ఎప్పుడు లభిస్తుందో! ప్లీజ్”
ఆమె నవ్వుతూ రెండవ బాక్సు కూడా అందుకుంది.
“మెనీ మెనీ థేంక్సు మేడమ్“ అంటూ అతడు వెనుదిరాగాడు.
అప్పుడతణ్ణి వర్థనమ్మ పిలిచింది.
“ఎస్ మేడమ్! ” అంటూ ఆమెను సమీపించాడు.
“ఆ షర్టు మీకు బాగుంది. మంచి కళ వచ్చింది. ఎక్కడ కొన్నారు? ప్యాంటలూస్ లోనా? షాపర్స్ స్టాప్ లోనా?”
అతడు ఆశ్చర్యంగా చూసాడు- “అప్పుడే మరచిపోయారా! నేను ట్రైనింగ్ పీరియడ్ ముగించుకుని వచ్చి నేనిచ్చిన యాక్షన్ టేకన్ రిపోర్టు చూసి దానిని మెచ్చుకుని మాధవి మేడమ్ ద్వారా నాకు మీరేగా ఈ కొత్త షర్టు పంపించారూ!”
ఆమె బదులివ్వలేదు. అతణ్ణి నిదానంగా చూస్తూండి పోయింది. ఆమె అంతరంగాన ఆలోచనలు అలల్లా గోదావరి పాయల్లా లేచాయి. ఆ లోపల శంకరం మరింత భోగట్టా అందివ్వడానికి సిధ్ధమయాడు- ! “మొన్న శుక్రవారం నాడు నాకు గిఫ్టుగా పంపించలేదూ! వెంటనే మీకు థేంక్స్ చెప్పడానికి బయల్దేరితే మాధవిగారు ఆపారు- ‘ఇటువంటి చిన్న చిన్న విషయాలకు పనిగట్టుకుని థేంక్స్ చెప్పడానికి వెళ్తే మేడమ్ గారికి నచ్చదూ- అని“
“ఔనవును. గుర్తుకొస్తూంది. వయసు మళ్లి పోతూంది కదూ! కొన్నిటిని ఈమధ్య పట్టు పట్టున మరచిపోతున్నాను”
“అబ్బే! ఏమంత వయసు వచ్చేసిందని? మీకు తెలియదేమో గాని- లేడీ మిలిటరీ డాక్టర్ లా ఎంత ఠీవిగా ఉంటారని. మీరేమీ అనుకోకపోతే నేనొక సలహా ఇస్తాను. స్వీకరిస్తారా మేడమ్! ”
“ఉఁ చెప్పండి శంకరం“
“మీరు ఒంటరిగా పెరటి వేపు ఉన్న చెట్లమధ్య కూర్చొని భోజనం చేస్తున్నారని మీ పర్సనల్ అసిస్టెంట్ చెప్పారు. మీకు గాని ఆ క్షేపణ లేకపోతే— మీకు టీచర్ల రెస్టు రూములోనే విడిగా ఒక సీటు వేసే ఏర్పాటు చేసేదా మేడమ్? వాళ్ళలో చాలా సీనియర్ టీచర్లు కూడా ఉన్నారు మేడమ్. వాళ్లతో కబుర్లాడుతూ తినవచ్చు. అక్కడే మీ అమ్మాయి కూడా ఉంటారండీ!”
ఆమె ఏమీ అనలేదు. సీట్లో నుంచి లేచి వెళ్లి అతడి కుడిభుజంపైన చేయి వేసింది. “మావారు నరసింహులు గారిలాగే నా పట్ల అక్కర తీసుకుంటున్నందుకు థేంక్స్! కాని నాకు ఆ చెట్ల క్రింద కూర్చుని మధ్యాహ్న భోజనం ముగించడమే ఇష్టం”
“ఎందుకు మేడమ్? నేను తెలుసుకోవచ్చా మేడమ్! ”
“నేనేం చెప్పాలి? ఎలా చెప్పాలి? నాకు మాటలు అందడం లేదు. మీరు కూడా నాలాగే ముప్ఫై ఐదు సంవత్సరాలు టీచర్ గా— ఆ తరవాత హెడ్ మిస్ట్రెస్ గా స్కూలు జీవితం గడిపి ఉంటే బాగున్ను. అప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థం అయేది. ఐనా– మీ వయసుకి తగ్గట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు పెళ్ళి కాకముందూ— డాక్టర్ నరసింహులు గారితో పెళ్ళయిన తరవాతా— ఇద్దరు బిడ్డల తల్లినయిన తరవాత కూడా రాజమండ్రి స్కూలులో నేను ప్రతి రోజూ మధ్యహ్న భోజనం నా కొలీగ్స్ తో కలసి ఉసిరి చెట్ల క్రింద- వేప చెట్ల క్రింద కూర్చునే తినేదానిని.
నావద్ద చదువుకున్న కొందరు టీచర్లు ట్రైనింగు తీసుకుని అదే స్కూలు లో టీచర్లుగా చేరి సీనియర్ టీచర్లుగా ఎదిగి నాతో కలసి నాలాగే పిల్లలకు చదువు నేర్పించేవారు. కాని విచిత్రం ఏమంటే నాకు ఎదురవడానికి జంకే వారు. నన్నక్కడ గాని చూస్తే ఇక్కడ తొలగిపోయేవారు.
నేను ఊరుకునే రకమా! వాళ్లకు అడ్డంగా వెళ్లి— ‘ఇప్పుడు మనం కొలీగ్స్‘ అంటూ వాళ్ళతో చేతులు కలిపి నాతో కలసి భోజనం చేయడానికి లాక్కొచ్చేదానిని. మా సీనియర్ టీచర్లందరమూ వాళ్లతో కలసి సమపంక్తిలో కూర్చుని— ఇటువంటి పచ్చటి చెట్ల నీడనే కబుర్లాడుకుంటూ పసందుగా భోజనాలు ముగించేవాళ్ళం. ఎంత సంబరంగా ఉండేదని.
నేను హెడ్ మిస్రెస్ గా ఉద్యోగ విరమణ చేసి నేను రాజమండ్రి విడిచి వచ్చేటప్పుడు వాళ్ళెలా కన్నీరు కార్చారో మాటల తో చెప్పలేను శంకరం! తలచుకుంటే గుండె తరుక్క పోతుందనుకో. ఇక్కడ కూడా అక్కడ ఉన్నట్లే చెట్ల మధ్య కూర్చుని తింటుం టే నాకు వాళ్ళందరూ నా ప్రక్కనే ఉన్నట్లనిపిస్తుంటుంది. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు చెట్ల మధ్య కూర్చుని భోజనం చేస్తు న్నానో! ”
ఆ మాట విన్న శంకరానికి ఉన్నపళంగా కనురెప్పలు తడిసాయి. మౌనంగా చూస్తూండి పోయాడతను.
“హాఁ మరొకటి-- మొన్న మొన్న ఇక్కడకు వచ్చిన దానిని. వాళ్ళ రెస్టు రూముని పంచుకోవడం ఏమి బాగుంటుంది! కొన్ని అనుభూతులను పంచుకోవాలంటే వయసు కూడా అవసరం కదా శంకరం. అందులో నా పోస్టు కూడా ఒక అడ్డంకే కదా! ”
నోస్టాల్జియా! ఎంత మార్దవమైనది. ఎంతటి గంభీరమైనది. జీవితాన్ని తెప్పలా తేల్చి చివరి వరకూ తోడుగా వెన్నంటి వచ్చే ది ఈ నోస్టాలిజియానేమో!
అతడు ఇక నిశ్శబ్దంగా ఉండ లేకపోయాడు. ఉద్వేగ తరంగాలు అతణ్ణి కూడా ముప్పిరికొన్నాయి- “మీకు స్కూలు జీవి తం తప్ప మరేదీ జ్ఞాపకం రాదా మేడమ్! “
“ఎందుకు రాదు? నేను పెళ్ళి చేసుకుని కొత్త వధువునై మెట్టింట అడుగు పెట్టినప్పుడు నాకు యెదురు వచ్చి హారతి తీసిన మా అత్తగారు జ్ఞప్తికి వస్తారు. కొత్తగా కాపురం చేస్తున్నప్పుడు నాకు వంట సరిగ్గా రాక సతమత మైతున్నప్పుడు మావారు డాక్టర్ నరసింహులుగారు వచ్చి అక్కున చేర్చుకుని ఊరడించిన సన్నివేశం నాకింకా పచ్చగా ఉంటుంది.
ఒకసారి ఏమైందంటే- మా తోడికోడలు ఏదో పేరంటాలకని పొరుగూరికెళ్ళింది. అప్పుడు నేను ఎవ్వరి వత్తాసూ లేకుండా వంటచేయాల్సి వచ్చింది. డాక్టర్ గారు ఇంటి కొచ్చినప్పుడు- ‘ఆకలిగా ఉందోయ్ ‘అని బల్లముందు కూర్చున్నారు. నేను భయపడుతూనే వడ్డించాను; వంటచేసే సాహసానికి పూనుకోకుండా భోజనం మెస్సు నుండి తెచ్చుంటే బాగున్నేమో- అని లోలోన మధనపడుతూ.
మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాక ఒక మాట అన్నారు- ‘కూరలోన లేత వలపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిందోయ్’ఆ మాట విని నాకు నింగి లోకి ఎగిరిపోయినంత సంతోషం కలిగిందనుకో. ఆయనిప్పుడు సర్కారు వైద్య వృత్తి నుండి రిటైరయి ప్రైవేట్ క్లీనిక్ నడుపుతున్నారు.
అన్నట్టు మరొకటి చెప్పడం మరచిపోతానేమో! నా పెళ్ళి కొత్తలో మా బావ భూషణంగారు మా తోడికోడలుతో కలసి వచ్చి వాళ్ళ బామ్మగారు చనిపోతూ ఇచ్చి వెళ్లిన నగానట్రా చూపించి అందులోనుంచి సగ భాగం నేను అడక్కుండానే పంచి ఇచ్చిన దృష్యం నాకిప్పటికీ బాగా గుర్తు. మా బావగారు చాలా గొప్పవారు! అప్పుడు పై పోర్షన్ లో అనారోగ్యంతో ఉన్న మా అత్త గారి వద్దకు వెళ్ళి ఆమె కాళ్లకు నమస్కరించిన్పపుడు ఆమె నన్ను అక్కున చేర్చుకుని నెత్తిపైన చేతులుంచి దీవించడం ఇప్ప టికీ మరచిపోలేను. అటువంటి కుటుంబానికి కోడలు పిల్లగా వెళ్ళగలగడం ఎంత అదృష్టమో!”
ఈసారి వర్థనమ్మ కళ్ళలో కన్నీరు చిలకడం చూసి శంకరం చలించాడు. కొందరి జీవితంలో జ్ఞాపకాలకు మరోపేరు కచ్చి తంగా ఉంటుందేమో- ‘గతకాల పన్నీటి జల్లు‘అంటే బాగుంటుందా! అతడు ఆలోచనలనుండి తేరుకుంటూ అన్నాడు- “ సారీ మేడమ్! ఏదేదో అడిగేసి నట్లున్నాను— మిమ్మల్ని మూడీగా మార్చేసినట్టున్నాను”
“లేదు. బాగానే అడిగావు శంకరం! బావగారూ మాతోడికోడలూ కలసి నాకిచ్చిన వడ్డాణం- కాసుల పేరు- చేతులకు వేసుకునే వంకీలు- కాళ్లకు తొడుక్కునే వెండి గొలుసులు నా దగ్గర ఇంకా భద్రంగానే ఉన్నాయి. నా జీవితాంతం అవి అలాగే ఉండిపోతాయి శంకరం”
అతడిక మాట్లాడలేదు. వర్థనమ్మ మరింత ఎమోషనల్ అవడం మంచిది కాదనిపించింది. భావోద్వాగాల ఉప్పెనను తట్టుకు నేందుకు తగినంత దృఢమైన వయసు ఉండవద్దూ! అతడు మెల్లగా బైటకు నడిచాడు.
వయోపరిమితితో నిమిత్తం లేకుండా అన్యోనత నిండిన మనసులు రెండు నిబిడంగా కలబోసుకున్నఅద్భుత సమయ మది. అతడలా నిష్క్రమించిన తరవాత వర్థనమ్మ తన సీట్లోకి సర్దుకుని కూర్చున్నవెంటనే కూతురి గుండ్రటి అందమైన నవ్వు ముఖం కళ్లముందు మెదిలింది. ఈ మధ్య మాధవి ముందులా లేనట్లుంది. కళకళా—కిలకిలా తుళ్ళుతూ—మెరిసే బంగారు రంగు చేపలా రివ్వున రివ్వున తిరుగాడుతూ ఉండేది. కారణం ఉన్నా లేక పోయినా, అందర్నీ ఆటలు పట్టించడమంటే దానికి సరదా- చివరకు తండ్రిని కూడా విడిచి పెట్టేది కాదు. ఇంక అన్నయ్య వద్దకు వచ్చేసరికి వాణ్ణి పిండి పిప్పుచేసేసి గాని విడిచి పెట్టేది కాదు.
అడిగీ అడక్కుండానే లోగిలి మధ్య కూర్చుని త్యాగరాజు స్వామివారి కీర్తనల్ని- అన్నమయ్యవారి కీర్తనల్ని- పురంధర దాసు వారి కీర్తనల్ని సంగీత కచ్చేరీలో కూర్చున్నట్టు బాసింపట్టు వేసుకుని సాధన చేసేది. అందర్నీ ఎంతలా మైమరి పించేదని! మరి ఇప్పుడలా కాదు. ఎక్కువగా మౌనంగా ఉంటుంది. తన ఆలోచనలలో తను ఉంటూ దూరంగా తొలగి ఉంటుంది. నిశ్శబ్దం మాటున తల దాచుకుంటుంన్నట్లుంది. ఇంకా చెప్పాలంటే- అలసిన రెక్కలతో అల్లార్చే విహంగంలా తన కళ్లకు కనిపించసాగింది మాధవి.
అదంతా గమనించి భర్త కలత చెందకూడదని మొన్నటి రోజు తనే స్వయంగా వెళ్లి అతడికి భరోసా ఇచ్చింది- ‘వయసుకి వచ్చిన అమ్మాయి కదా! అవసరం ఉన్నా లేకపోయినా తేలిగ్గా మనోద్రేకాల పాలవుతుంది. అనుభవంతో దానికదే సంయమనం తెచ్చుకుని సర్దుకుపోతుంది లెండి. నాకు కూడా చెప్పలేదంటే—ఏదో జరిగే ఉంటుంది లెండి. అదే వచ్చి తానుగా చెప్పేవరకూ మనం ఇలాగే ఉందాం. ఆ లోపల మబ్బు దానికదే విడిపోతుంది! ’
కాని పరిస్థితి ఏమిటో ఇప్పుడిప్పుడే- అదీను ఈరోజునే ఆమెకు అల్లనల్లన అవగాహన ఔతున్నట్లనిపించసాగింది. సమస్యకు మూలం మరెక్కడో కాదు- తన చుట్టూనే స్కూలు ఆవరణలోనే తిరుగుతున్నట్లనిపించసాగింది. శంకరం వేసుకు వచ్చిన కొత్త షర్టు చెప్పక చెప్తూనే ఉంది. మాధవి శంకరా నికి కొత్త షర్టు ఇవ్వడంలో పెద్ద విశేషం ఉండకపోవచ్చు. కాని తనకు చెప్పకుండా తన పేరు చెప్పి దానిని అతడికి ఇవ్వడంలోనే కనిపిస్తూంది ఇంకేదో కనిపించీ కనిపించని అంతర్గత మర్మం. అది పూర్తిగా లోపలి గుట్టుని బైట పెడుతున్నట్లు తోచిందామెకు.
ఆ లోచనలనుండి విడివడకముందే ఆమె మనసు ముందు శంకరం రూపం ఉన్నపళంగా మెదిలింది. అతడు వెనుక బడిన వర్గానికి చెందినవాడైనా మంచీ మన్ననా తెలిసిన గుణ సంపన్నుడు. వినమ్రుడు. గుణాత్మక జీవన ప్రవాహం వల్లన మని షిది మంచి ముఖవర్ఛస్సు. నిటారుగా నిల్చుంటే ఆరడుగుల ఎత్తరి. అంతేకాదు- జీవితాన్ని వడపోసిన తన వంటి అనుభవశాలి మన్నన పొందగలిగాడంటే—అతడిలో మామూలు కుటుంబ నేపథ్యాలకు అతీతమైన అమూలమైన జీవకళ- జీవన శోభ ఉన్నట్లే తోచింది. మనసున ఎక్కణ్ణించో పవిత్ర భావ ప్రవాహం వినిపిస్తుండగా ఆమె ప్రశాంతంగా కళ్లు మూసుకుంది-
కిం కులేన విశాలేన
శీలమేవాత్ర కారణం!
కృమయ:కిం నజాయతే
కుసుమేఘ సుగందిఫll
గొప్ప కులంలో జన్మిస్తే ఏమున్నది? సువాసనగల పూవులలో కూడా క్రిములు పుట్తూనే ఉంటాయి కదా! కనుక ప్రతివారి లోనూ శీలమే గౌరవ కారణం. ఇతడు చిన్న కులం వాడు, తక్కువ వంశంవాడు-- అని ఎవ్వరినీ హీనంగా చూడరాదు. ఈ తక్కు వ ఎక్కువలు, హీన ఔన్నత్యాలు—కులం వంశం ఆకారం వర్ణం-- వీటి వల్ల కాదు కదా లెక్కింపబడేది!
ఏది ఏమైనా విషయం అంత తేలిగ్గా తేలిపోయే వ్యవహారం మాత్రం కాదు; మాధవి తానుగా వచ్చి మనసు విప్పి మాట్లా డేంతవరకూ-- నేడు సందడిగా తీసుకోబోయే నిర్ణయం రేపటి ప్రళయ తాండవంగా ప్రతిధ్వనించకూడదు కదా!
=======================================================================
ఇంకా వుంది
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 15 త్వరలో
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_f5bff61d51c142f6b3f590e34e656ca5~mv2.png/v1/fill/w_100,h_131,al_c,q_85,enc_auto/acb93b_f5bff61d51c142f6b3f590e34e656ca5~mv2.png)
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
![](https://static.wixstatic.com/media/acb93b_b3c5f8bac18d4083a277b66c105dc778~mv2.png/v1/fill/w_290,h_427,al_c,q_85,enc_auto/acb93b_b3c5f8bac18d4083a277b66c105dc778~mv2.png)
Bình luận