top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 16

Writer's picture: Pandranki SubramaniPandranki Subramani

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 16 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 22/02/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 

పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహ మూర్తికి. ఫ్లైట్ లో తనకు పరిచయమైన లేడీ గ్రేసీ కుటుంబాన్ని కలుస్తాడు నరసింహ మూర్తి. 

 


 ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 16 చదవండి.. 


బైటకు వచ్చి కారులో కూర్చొనీ కూర్చోక ముందే అతడూహించినట్లు జరిగింది. మోహన ఆరంభించింది- “ఏంవిటి రాజ మండ్రి బావా! ఆ అమెరికన్ దంపతుల వద్ద ఫుల్ మార్కులు కొట్టేయలనేగా మీరు అలా గన్నారు?”


అతడు అదోలా వెనక్కి తిరిగి చూసి- “నేనేమన్నాను మోహనా?” అని అడిగాడు. 


“మా అక్కయ్యకు ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుందన్నారే! ఇటు చూసి చెప్పండి- మా అక్కయ్యకు ఇష్టం లేకుండానే మీరు దొరికిన ప్రతి సందర్భాన్నీ సాకుగా ఉపయోగించుకుని చేతులు పట్టుకున్నారూ! అసలే అది రఁవనమ్మ గారి ప్రథమ వారసురాలు. దానికి గాని ఇష్టం లేకపోతే మిమ్మల్ని ముట్టు కోనిచ్చేదా? ప్రక్కన కూర్చోనిచ్చేదా?ముందు మా అక్కయ్య గురించి తెలుసుకుని ఆ తరవాత మాట్లాడండి”.


ఆ మాటల జోరుకి నరసింహమూర్తి నిజంగానే తెల్లబోయాడు. తడబడ్డాడు. ”అబ్బే! నేనెందుకు అలా మాట్లాడవలసి వచ్చిందంటే- సాధారణంగా అమెరికన్లకు ఇండియన్స్ జరుపుకునే అరేంజ్డ్ మ్యారేజీలు నచ్చవు. ఇటువంటి వ్యవహారాలను వీళ్లు సీరియస్ గా తీసుకుంటారని చదివాను- అందుకే-- ” అంటూ సుజాత భుజంపైన కుడిచేతి నుంచి- “సారీ!” అన్నాడు. 


సుజాత నిండుగా నవ్వింది. అతడుంచిన చేతిపైన తన చేతినుంచుతూ అంది- “మీరు మా చెల్లి మాటల్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నారో తెలియటం లేదు మూర్తిగారూ! ఇక్కడే కాదు. ఇంట్లో కూడా అందరితోనూ ఇలాగే తగవులు పెట్టుకుంటూ ఉంటుంది. ప్లీజ్! అది ఉపయోగించిన సీరియస్ టోన్ ని మరచి పోయి నెమ్మదిగా దైవ దర్శనం చేసుకుని వద్దాం. సరేనా! “


అతడు మంత్రముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు. అదెప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడు తెలుగు లెక్చర్ మంచి మనసు గురించి వాల్మీకి మహర్శిని ఉదహరిస్తూ అన్నమాటను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు- “మంచి మనసు చల్లని స్వఛ్చమైన సరస్సు వంటిది! ”


ఎంత చక్కటి ఉపమానం! 


వేక్ కౌంటీలో ఉన్న శ్రీ వేంకటేశ్వరాలయం చుట్టూ దట్టమైన చెట్లు- పాముల్లా వంకర్లు పోయే సిమెంట్ రోడ్లతో తిరుపతిని తలపిస్తూంది. నరసింహమూర్తి ఆలయనిర్మాణం గురించి తెలుసుకోవడానికి అంతగా ప్రయాసపడలేదు గాని, మొత్తానికి ఆ ఆలయం తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే నిర్మించి ఉంటారు. 


అక్కడి అర్చక స్వాములు స్థపుతుల పర్యవేక్షణలోనే నిర్మాణం పూర్తియి-- సంప్రోక్షణ కూడా జరిగి ఉంటుంది. లేకపోతే దేవాలయ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉండదుగా! ఆలయ దర్శనం చేసు కున్న తరవాత అతడికి నిజంగానే ఆనందంతో బాటు మనసున నిర్వచించలేని పారవశ్యాన్ని పొందాడు. అలా భక్తి పారవశ్యా న్ని పొందుతూనే అడిగాడు- “ఇద్దరూ నన్ను నాలుగు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయిపించారు. మూడు సార్లు చాలు“


“కారణం ఉంది. బామ్మ చెప్పింది నేను మూర్తిగారికి చెప్పేదా అక్కాయ్?” మోహన అడిగింది. 


నవ్వుతూ- ఉఁ- అంది సుజాత. 


అప్పుడు మోహన అందుకుంది- “గణాధిపతికి- ఒక మారు- సూర్యుడి చుట్టూ రెండు మార్లూ- శివునికి మూడు మార్లూ- విష్ణువుకి నాలుగు మార్లూ పదక్షిణ చేయాలట”


అది విని అతడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంటే- భారతదేశం నుండి వచ్చిన తను ఆలయ సంప్రదాయాల గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాడన్న మాట! తనింకా నేర్చుకోవలసింది చాలానే ఉందని తెలుస్తూనే ఉందిగా! 


ఇక ఆలోచనల నుండి తేరుకుని ఆలయ ప్రాంగణం చుట్టూరా చూపు సారించాడు నరసింహమూర్తి. కొన్ని వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన భారతీయులు—జాతి కులాలను మరచి- ప్రాంతీయాభిమానాలను విస్మరించి- ఏక మనోభావంతో చెదరని భక్తి ప్రపత్తులతో గుమిగూడి ఉన్నారు. కలసి మెలసి గుడి నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. ఇదే భారతదేశంలోనైతే నలతలవంటి ఇగోలను పెద్దరికాలనూ మరచి అకారణంగా పొడసూపే పొరపొచ్చాలను ప్రక్కన పెట్టి ఇలా ఉక్కుమ్మడిగా మెసలగలరా! కష్టమేనేమో! మరీ కష్టమేమంటే- అన్నిటా ప్రాంతీయ రాజకీయాలు చొరబడి పోతున్నాయి. 


అతడికి ఆ గుడి వాతావరణ ఎంతగా నచ్చిందంటే- తను అమీర్ పేటలో ఉన్న వీరాంజనేయస్వామి వారి దివ్య దర్శనం చేసుకున్నంత తెరపిగా ఉంది. 


ముగ్గురూ దైవదర్శనం చేసుకుని వచ్చేటప్పటికి వాన కురవనారంభించింది. సుజాత బైట ఆవరణలోకి వెళ్లి సెల్ ఫోను లో ఇంట్లోవాళ్లతో ఏదో మాట్లాడి వచ్చింది. అప్పుడు నరసింహమూర్తి యాధాలాపంగా అన్నాడు- “నాకీరోజు అంతా నిండుగానే ఉంది ఒక్కటి తప్ప“ 


ఏమిటన్నట్టు ఇద్దరూ అతడి వేపు చూసారు. ”గుడి కదా- అక్కాచెల్లెళ్ళిద్దరూ చీరలు కట్టుకుని వస్తే బాగున్ను“


దీనికి మోహన స్పందించింది. “ఇందులో సందేహమేల— నా ఊసెందుకు గాని, చెప్పినా చెప్పకపోయినా మా అక్కయ్య మాత్రం చీరే కట్టుకునే వచ్చేది. కాని వాతావరణంలో మార్పు వస్తుందని, వర్షంలో తడిసే అవకాశం ఉందని మా పెద్దమ్మ హెచ్చిరించింది. అందుకే అమెరికన్ దైనందిన స్టయిల్ పాటిస్తాం. మాకు ప్రతి అడుక్కీ ఆకాశం చూసి సాగడం మామూలే బావగారూ! ”అంది మోహన. 


’ఔను కదూ! ’అన్నట్టు చూసాడతను. కాని అతడికి తెలుసు మోహన అంతటితో ఊరుకోదని. ఊసులాడటం- పిలిచి కయ్యం పెట్టుకోవడం అంటే ఆమెకు బర్గర్ తిన్నంత ప్రియమని. 


అదే రీతిన ఆమె కొనసాగించింది- ”ఐనా ఇప్పుడు పుట్టి మునిగిపోయిందేమీ లేదులే! ఎలాగూ రేపో మాపో మీ చిటికెన వ్రేలు పట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగి మీ కాళ్లపై కాళ్లుమోపి మీకు సతీమణి కాబోతున్నదేగా! అప్పుడు మా ముద్దుల అక్కయ్యకు రకర కాల పట్టు చీరలు కట్టబెట్టి మనసార- ‘తెల్లచీర కట్టకున్నదెవరి కోసమో! ’అని పాడుకోవచ్చు. సరేనా రాజమండ్రి బావా! ” 


అప్పుడు సుజాత కలుగజేసుకుంది. ”అబ్బ! ఏమిటే నీ సణుగుడు- అదీను కుండపోతగా కురుస్తూన్న వర్షంలో. ఆయనను ఇలా మాటి మాటికీ సతాయించి ఇబ్బంది పెట్టకని చెప్పానా లేదా? ఒకటి చెప్తున్నాను గుర్తుంచుకో. నువ్వింకా ఆయనకు నిజం గానే మరదలు పిల్లవి కాలేదు. ఆయనేమో నీకూ నిజంగానే బావగారు కాలేదు. ఆ హద్దులు గుర్తుంచుకుని మెసలుకో! ”

“ఔనవును! నా హద్దుల్లో నేనుండాలి. కాదనను. మరి ఏమీ లేనప్పుడు- ఏమీ కానప్పుడు మీరూ మీ హద్దుల్లో మీరుండటం ఉభయ శ్రేయోదాయకమేమో! ”


సుజాత విసుగ్గా చూసి- “ఏమిటే నువ్వంటున్నది?” అని అడిగింది. ”ఏమిటో కాదే అక్కాయ్! మీ ఇద్దరి మనసులూ ఎంత క్లోజ్ గా ఉన్నాయన్నది నాకు తెలియ దనుకుంటున్నావా?”


“ఏదేదో చెప్పి బుర్రకు వాపుతేకు. చెప్పేదేదో సూటిగా చెప్పు”


“బుర్ర వాపు తేవడం నా పనికాదు. ఏదీ జరగనట్టు మాట్లాడకే అక్కాయ్! మీ ఇద్దరి ప్రణయ రాగాన్ని నా సెల్ కెమేరాలో బంధించానే రఁణమ్మ మనవరాలా! ” 


ఈసారి నరసింహమూర్తి ఉన్నపళంగా ఉలిక్కి పడ్డట్టయాడు. “ప్రణయ రాగమంటే! ”- సుజాత అడిగింది- . 


“మీ మధ్య ఏమీ లేదని- ఏమీ ఉండకూడదని నేను వాదించడం లేదు. మీకు మీరే ఏమీ లేదని దండోరా వేస్తూ బుకాయిస్తున్నారు. అందుకనే ఫొటో తీసాను. గర్భగుడికి అటువైపు నరసింహమూర్తి నీ ముఖాన్ని తన వేపు తిప్పుకుని నీకు బొట్టు పెట్టలేదూ! నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నవ్వుతూ ముంగాళ్లపై లేస్తూ మూర్తి బావ నుదుట చందనం బొట్టు పెట్తూ అతడి నోటికి తులసి చిగురు అందివ్వలేదూ! ఇంతటి మృదు మధురమైన ప్రణయ రాగం జరిగిన తర్వాత కూడా మీరు ఏమీ లేదు అంటే నేనెలా ఊరుకోను? మీ ఇద్దరిదీ తొలి చూపులో పొడసూపిన తొలి ప్రేమని నాకెప్పుడో తెలుసు లేవే అక్కాయ్”


ఈసారి సుజాత ముఖం ఎర్రబడింది. ”ఔనే! నేను నా కాబోయే భర్తతో క్లోజ్ గానే ఉంటాను మధ్య నీకేమిటంట?”


“ఈ మాట ముందే ధైర్యంగా ముందుకు వచ్చి అనుంటే నాకింతటి ఎనర్జీ పోయుండేది కాదు కదా! సరే—ఇవన్నీ అలా ఉంచుగాని, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం? కారేమో అరమైలు దూరాన పెట్టావు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యమవుతుందేమో!”

 

“వాన పడనారంభించిన వెంటనే బైటకెళ్ళి మాట్లాడి వచ్చిందెవరితోననుకుంటున్నావు? నాన్నగారితోనే! నరసింహమూర్తిగారు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళడం ఆలస్యమవుతుందని— మర్నాడాయన ట్రైనింగ్ క్లాసులకు హాజరవడం ఇబ్బందికరంగా తయారవు తుందని చెప్పాను. అంచేత మనం ముగ్గురమూ రెస్టారెంటులో కలసి భోంచేసి ఆయనను హాస్టల్ వద్ద దిగబెట్టి వద్దాం“”


అదంతా విన్న నరసింహమూర్తి అచ్చెరువొందాడు. ముందు చూపు అంటే ఇది కాదా! తేటదనం గల తెలివి తేటలంటే ఇవే కదా! ఇటువంటి స్త్రీ తనకు జీవన సహచరిగా చేరబోతున్నదన్న తలంపు ఎంతటి పులకాంకిత స్పృహను కలుగజేస్తుందీ!


కాసేపు తరవాత వాన తగ్గుముఖం పట్టింది. గుడి ఆవరణలోకి వస్తూ మోహన ఆరభించింది- “ఇప్పటికీ అనుమానం తీరింది గాని. నాకు మరొక పెను అనుమానం పీడిస్తుందే అక్కాయ్!”


“సన్నటి తుంపరలో తడుస్తూనే హాయిగా ఫీలవుతూనే- 

“చెప్పు” అంది సుజాత. 


మోహన పాయింటుకి వచ్చింది- ”మన ఇండియన్స్ కి ఎందుకే ఇంతటి హిపోక్రసీ! ”


“అంటే మనతోటి అమెరికన్స్ కి ఇతర తెల్లవాళ్ళకూ బ్లాక్ లకూ హిపొక్రసీ లేదంటావా?”


“లేదని వాదించను. కాని చాలా తక్కువంటాను. మన వాళ్లకంటే నిజంగా వాళ్ళకు ఫ్రాంక్ నెస్ ఎక్కువ. మనసులోని ఉన్నదానిని ఎక్కువ సేపు అట్టే దాచి పెట్టకోలేరు. ముఖ్యంగా సున్నితమైన ఎమోషన్స్ ని ఏ మాత్రమూ దాచి పెట్టుకోరు”


“అంటే- సూటిగా చెప్పవే తంటాల తాయారమ్మా! ”


“చెప్తాను. ఇక్కడ కాదు. వర్షం వెలసినట్టుంది. త్వరగా నడచి కారు చేరుకుందాం”


కారు వేపు నడుస్తూ నరసింహమూర్తి మబ్బుపట్టిన ఆకాశం వేపు ఓసారి చూసి, ముసురు మధ్య వెలిగిన ట్యూబ్ లైట్ల వెలుగులో చుట్టూ పరకాయించి చూసాడు. గుడి చుట్టూ పచ్చటి చిక్కటి వృక్ష సముదాయం. ఆ వృక్ష సముదాయాల మధ్యే –స్వామివారి అర్చనలకు కావలసిన తులసీ మొక్కలు ఆలయ ట్రస్టీ వారు పెంచుతున్నారు. ఇప్పుడక్కడ విలసిల్లుతూన్న పార వశ్య వాతావరణాన్ని భారతీయత అనాలా లేక ఆధ్యాత్మికత అనాలో ఉన్నదున్నట్లు చెప్పడం కష్టమేనేమో! 


ముగ్గురూ నడుస్తూ పార్క్ చేసిన కారు వద్దకు చేరుకున్నారు. చుట్టు ప్రక్కల జనసందడి పుంజుకోలేదింకా-- 


“ఉఁ చెప్పవే మోహనా! మమ్మల్ని మరీ సస్పెన్సులో ముంచేయకు“”


“ఇదేమీ సీరియస్ విషయం కాదే అక్కాయ్. చాలా సింపుల్. ఇది ఇక్కడి వాళ్లకు చాలా సాధారణ విషయం”


“ అదేదో నాన్చకుండా చెప్పు. ఏది సాధారణ విషయం?”


“నేను గాని నీ కంటే పెద్దదానిని అయుంటే— సిగ్గు బిడియాల మధ్య మృదు మధురమైన ప్రేమ భావాన్ని అణచుకోకని— ఇక్క డే— ఇప్పుడే— మిమ్మల్నిద్దరినీ నాముందు నిలబెట్టి ఎమోషనల్ గా ఒకరినొకరు ముద్దు పెట్టుకోమని శాసించి ఉండేదానిని”


అది విన్న నరసింహమూర్తీ సుజాతా ఏమీ అనలేదు. రిమూట్ కంట్లోల్ సిస్టమ్ తో కారుని విప్పి లోపల కూర్చున్న తరవాత నరసింహమూర్తి మెరిసే కళ్ళతో వెనుక సీట్లో కూర్చున్న మోహన వేపు తిరిగి— “ఇలా చూడు మోహనా! ” అంటూ సుజాత మోముని తన వేపు తిప్పుకుని ప్రేమగా ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు; ’ఇక నీ అనుమానం తీరిందా! ’ అన్నట్టు మళ్లీ ఆమె వేపు తిరిగి చూస్తూ-- 


ఆవేశం రావాలే గాని, ఏ విషయంలోనూ స్త్రీ వెనుకంజ వేయదు. అంచేత సుజాత తనుకూడా తక్కువ తిన్నది కాదని నిరూపిస్తూ— ప్రక్కకు జరిగి నరసింహమూర్తి పైన ఒరిగి తమకంగా ముద్దు పెట్టుకుంది. కాబోయే భర్తను ముద్దు పెట్టిన తరవాత చెల్లి వేపు తిరిగి అంది- “వెళ్ళి చెప్పుకోవే— మీ పెదనాన్నగారితోనూ- మీ నాన్నగారితోనూ! ”అంది వెటకారంగానూ ధిక్కరింపుగానూ. 


వయసులోని సొగసులు ఫెళ్ళున మెరిసిన వేళ- పరువాలు పాల పొంగులై పొర్లిన వేళ మనసులు రెండు మురిపెంగా మురిసి కలసి- ప్రేమ పక్షులై పెనవేసుకున్న అమృత ఘడియవేళ-- 


అటు తరవాత అంతా నిశ్శబ్దం. కారు సజావుగా సాగిపోతూంది. అప్పుడు నరసింహమూర్తి వెనుతిరిగి అన్నాడు- 

“ఒక మాట చెప్పేదా మోహనా! ”


“ఇక చెప్పడం దేనికి? సాధించి చూపించారుగా! మగాడి గాలిని దగ్గరకు చేరనివ్వని మా అక్కయ్యను మోహ సముద్రంలో ముంచి వశపర్చుకున్నారుగా! ”

“విషయం అది కాదు. మరొకటి” అన్నాడు నరసింహమూర్తి. 

మోహన నవ్వి- ‘ఉఁ చెప్పండి మహాశయా! ‘అంది. 


“నేను ఆ కాలపు మనిషిని కాను. ఈ కాలపు వ్యక్తినే. కాబట్టి— ఇష్టపడ్డ స్త్రీని— పెళ్లి చేసుకోబోతూన్న స్త్రీని ముట్టుకో కూడదన్న నియమం ఏదీ నాకు లేదు. అంతా హృదయ స్పందన పైనే ఆధారపడి ఉంటుంది. నేను మనసార ప్రేమించిన అమ్మాయిని ముట్టు కోకుండా తొలగి తొలగి ఉండటం- బిడియం చేత కాదు. భయం చేత అంతకన్నా కాదు. 


మా అమ్మానాన్నలకు కాబోయే కోడలుగా— మా ఇంట్లో చిరకాలం నివసించబోతూన్న గృహిణిగా ఆమె పట్ల నాకున్న మర్యాదే కారణం. నువ్వు నమ్ముతున్నట్టు— అమెరికన్లలో కొన్ని మంచి ఆనవాయితీలు ఉండవచ్చుగాక. కాని మన భారతీయ సంస్కృతిని బట్టి చూస్తే వాళ్ళు పాటించేవన్నీ ఆమోద యోగ్యం కాకపోవచ్చేమో! ”


మోహన ఏమీ అనకుండా ఊరకుండిపోయింది. 

-------- 

కారు పి. ఎస్ చాంగ్ చైనీస్ రెస్టారంటు వద్ద ఆగింది. 

కారులోనుంచి దిగి బయటకు వచ్చేటప్పటికి యెక్కణ్ణించి యేమూలనుంచి దూసుకు వచ్చిందో మరి- ఐసు గాలొకటి కొరడా విదిలించినట్టు చురుక్కుమనిపించింది.


నరసింహమూర్తి కారులో ఉంచిన లాంగ్ కోటుని చబుక్కున అందుకుని వేసుకు న్నాడు. నవ్వుతూ సుజాత వేపు చూసాడు. అక్కాచెల్లెళ్ళిద్దరూ తనలా చలికి జంకుతున్నట్లనిపించలేదు. 


“చాలా చలిగా ఉందా మూర్తిగారూ! లోపలకు వెళ్ళిం తర్వాత అంతగా అనిపించదు లెండి”- సుజాత. 


“మా భాగ్యనగరం చలితో పోల్చి చూస్తే నాకిక్కడ అదోలా ఉంది సుజాతా!”


అప్పుడు మోహన నోటి పంజా విప్పింది- “బావ పరిస్థితి చూస్తున్నావుగా! మరి అంతదూరంగా నడిస్తే ఎలా? బావగారికి వెచ్చదనం వద్దూ! అది అందిచ్చడం నీ బాధ్యత కాదూ! ”


“మళ్ళీ ఆరంభించావూ నీ రణరంగ తంతూ! ఇక మాట్లడకుండా రెస్టారెంటు వేపు నడు--” అంటూ చెల్లిని ముందుకు తోసింది. 


నరసింహమూర్తి తన వంతు పదాన్ని పలికాడు- “అననివ్వు సుజాతా-- అననివ్వు! మా పెదనాన్నగారి దయవల్ల ఆ ఒక్క శుభముహూర్తమూ జరగనివ్వు. అప్పుడు నాకు మా ఇంట్లో సపోర్టు ఉంటుంది. ఆ అదనుతో నేనూ మీ చెల్లిని ఆటపట్టించనూ!”


నడుస్తూనే అదెవరండీ- అన్నట్టు చూసింది సుజాత. తన చెల్లి పేరు చెప్పాడు. 


“మాధవీనా! అదెవరండి బాబూ! ”- మోహన. 

“ఇంకెవరు? మా చెల్లి”- నరసింహమూర్తి. 


“ఐతే— మాకు మీ ఫ్యామిలీ మెంబర్లు చాలామంది గురించి ఇంకా పూర్తిగా తెలయదన్నమాటే! సరే- ఆ ప్రసక్తి తరవాత లేవనెత్తుదాం. ముందు ఆకలి తీర్చుకుందాం” అంటూ మోహన వడివడిగా నడిచింది. 


డైనింగు హాలులో కూర్చున్న తరవాత సుజాత అన్నీ విజ్ కర్రీసే ఆర్డరివ్వడం చూసి నరహసింహమూర్తి అదోలా చూసా డు. 


“నాకు తెలుసు మూర్తిగారూ మీకు నాన్ విజ్ ఇష్టమని. కాని మనం ఇప్పుడు గుడినుండి కదా తిన్నగా వస్తున్నాం. అందు కని-- ” 


అది విని ఇబ్బందిగా ముఖం పెట్టి- ‘మర్చేపోయాను సుమా! ’ అంటూ నవ్వేసాడతను.


అంత రద్దీలోనూ రెస్టారెంటులో యెటువంటి తొక్కిసలాటా లేదు. అంతా పకడ్బందీగా ఉంది. ఫోను నెంబర్ తీసుకుంటు న్నారు. డైనింగ్ బల్ల ఖాళీ అయినప్పుడల్లా ఫోనులో మెసేజ్ పంపిస్తున్నారు ఇక వచ్చి కూర్చోవచ్చని. దాని ప్రకారం కస్టమర్లు వరసగా వచ్చి కూర్చుంటున్నారు. 


ఆడ మగా బేరర్లందరూ కలగలసి ఉన్నారు- నల్లజాతీయులు- తెల్లజాతీయులు- చైనీయు లు- అందరూ కలిసే వడ్డింపు ఏర్పాట్లు చూస్తున్నారు. పార్ట్ టైమ్ జాబ్ గావాలి- వాళ్లలో కొందరు చాలా యంగ్ గా ఉన్నారు-- బహుశ:పార్ట్ టైమ్ ప్రాదిపదికన పని చేసే స్టూడెంట్సు అయుంటారు. 


అంతా అయి, భోజనం కానిచ్చి కార్డు ద్వారా బిల్లు చెల్లించి- టిప్స్ బిల్లు కార్డులోనే ఉంచి ముగ్గురూ బైటకు వచ్చేటప్పటికి వాళ్లకు అక్కడ ఆశ్చర్యం ఒకటి కాచుక్కూర్చున్నది. బిల్లు పెట్టి కార్డు ద్వారా బిల్లు డబ్బుల్ని చెల్లించి వచ్చిన వాళ్ళకు వడ్డన చేసిన అదే బేరర్ వాళ్ళకు అడ్డంగా వచ్చాడు- 


“ఎక్స్యూజ్ మీ సార్! మిమ్మల్ని మా అసిస్టెంట్ మేనేజరు పిలుస్తున్నారు“


ఆ పిలుపు విని ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 


“బావగారూ! లేడీ గ్రేసీ లాగ ఇక్కడ కూడా మీకెవరైనా తెలు సా?” మోహన అడిగింది నవ్వుతూనే. 


అతడు తల అడ్డంగా ఆడించాడు. అప్పుడు మోహన అక్కయ్య వేపు తిరిగి అడిగింది- “నువ్వేదైనా ఇన్ వేలిడ్ కార్డుగాని ఇచ్చావేంటి? ఎందుకంటే ఇక్కడ చిన్నచిన్నవాటిని సీరియస్ ఐపోయి పోలీసు కేసులుగా మార్చేస్తారు” 


సుజాత నిదానంగా అంది- “నాదగ్గర ఇన్ వేలిడ్ కార్డు ఎందుకుంటుందీ! అటువంటిది ఇచ్చి ఉంటే నా సంతకం కోసం పేమెంట్ స్క్రాల్ ఎలా పంపిస్తారు?”


“దానికేముందిలే! అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మెకానిజమ్ లో ఇటువంటి క్వరీలు వస్తూనే ఉంటాయి. నా వద్ద క్యాష్ ఉంది“ 

అంటూ అసిస్టెంటు మేనేజరు గదివేపు దారితీసాడు నరసింహమూర్తి. 


అక్కాచెల్లెళ్లిద్దరూ అతణ్ణి అనుసరించారు. అతడికి నిజంగానే అసహనం కలిగింది. లోపల కూర్చున్నప్పుడు పిలవాలి గాని- వెళ్ళేటప్పుడు వెంటబడి అనుమానితుల్ని పిలిచినట్టు పిలవడం యేమిటి? ఎందుకైనా మంచిది-- శ్రీరామ్ గారికి కబురందిస్తే బాగుంటుందేమో! 


లోపలకు వెళ్లిన వెంటనే మేనేజర్ సాదరంగా లేచి వాళ్లకు సీట్లు చూపించి- “ఏమీ అనుకోక పోతే ఒకటడుగుతాను చెప్తారా! ” 


ముగ్గురూ తలలూపారు. 


”మీకు నేనెలా కనిపిస్తున్నాను?”


మరొకసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇదెక్కడి ప్రశ్న- తలా తోకా లేకుండా-- మొత్తానికి మేనేజర్ గారు కొంచెం ఆవేశంలో ఉన్నట్టున్నారు. అప్పుడు నరసింహమూర్తి ఇద్దరికీ నోరు తెరవకని కళ్ళతో సైగ చేసి వ్యవహారాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు పూనుకున్నాడు- “చూడండి మిస్టర్ అసిస్టెంట్ మేనేజర్-- నాపేరు నరసింహమూర్తి- ఫ్రమ్ ఇండియా. ఇక్కడకు అఫీషియల్ ట్రైనింగ్ కోసం వచ్చాను- కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్షేంజ్ ప్రాతిపదికన. ఇక విషయానికి వస్తే-- బిల్లు విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురయి ఉంటే చెప్పండి. క్యాష్ ఇచ్చి సెటిల్ చేసి వెళ్లిపోతాం. ఓకే!”


“అబ్బే! బిల్ సెటిల్ మెంట్ విషయం గురించి నేను మిమ్మల్ని పిలవలేదు, నేను మీ కళ్లకు యెలా అగుపిస్తున్నాను. అది చెప్పండి చాలు ”


ఈసారి సుజాతకు కూడా సహనం నశించినట్లుంది. ”అసలు మీరెందుకు మిమ్మల్ని గురించి పదే పదే మమ్మల్ని అడుగుతున్నారో బోధపడటం లేదు. మీరు బాగానే ఉన్నారు మహరాజులా!”


“సారీ! మీరు నా పాయింట్ అర్థం చేసుకున్నట్టులేదు. నేను మీకు పూర్తిగా బ్లాక్ల్ లా కనిపిస్తున్నానా?”


“నలుపు ఛాయతో ఉన్నారే గాని- పూర్తిగా మీరు నా కళ్లకు బ్లాక్ గా అగుపించడం లేదు“- సుజాత. 


అది విన్నంతనే అతడి కళ్లు రెండూ సంతోషంతో మెరిసాయి. ”దటీజ్ ది థింగ్ ఐ వాంట్! దటీజ్ ది థింగ్ ఐ వాంట్! ” అంటూ అతడు ఆమె రెండుచేతుల్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇందులో అతడంతగా ఆనందపడవలసిందేముందో ఆమెకు అర్థం కాలేదు. కాని అతడు మాత్రం చాలా ఆనంద పడిపోయాడు. 


సీట్లోనుండి లేచి తనను తను పరిచయం చేసుకున్నాడు- “ఐ యామ్ క్రిస్టోఫర్- ఎమ్. ఎస్ క్రిస్టోఫర్. యంగ్ లేడిస్! ఇద్దరూ బోర్న్ అమెరికన్స్ అన్నమాట! మీ యక్సెంట్ చెప్తుంది”


అప్పుడు నరసింహమూర్తి కలుగ జేసుకున్నాడు- “అంతే కాదు మిస్టర్ క్రిస్టోఫర్. శ్రీరామ్ అండే శ్రీలక్ష్మణ్ కంపెనీ ఓనర్ల కూతుళ్లు కూడాను. ఇక ఇప్పుడు చెప్పండి అసలు సంగతేమిటి? ఇక్కడి భోజన వసతుల ప్రమాణం గురించి మా సాభిప్రాయ పత్రాన్ని వ్రాసి ఇవ్వమంటారా! ”


మిస్టర్ క్రిస్టోఫర్ కొన్ని క్షణాలపాటు మౌనంగా ఉండిపోయి తల అడ్డంగా ఆడించాడు. మరి- అన్నట్టు అతడి కళ్లలోకి చూసాడు నరసింహమూర్తి. 


“నేనటువస్తున్నప్పుడు మీరు మాట్లాడుకుంటున్నది విన్నాను. మీది రాజమండ్రి అని తెలుసుకున్నాను” 


అతడు కాస్తంత నివ్వెరపోయి అడిగాడు- “మరి మేం మాట్లాడుకుంటున్నది తెలుగులోనే కదా! అది మీకెలా తెలుసు?”


“నాకు తెలుగు కొంచెం తెలుసు. ఎలాగంటే- మా వంశం పుట్టింది రాజమండ్రి గుడిగోపుర వీధిలోనే. నేను మా తాతగారిని చూసాను కాని మా ముత్తాతను చూడలేదు. ఆయన ఫస్ట్ వాల్డ్ వార్ సమయంలో ఇక్కడకు వచ్చి బ్లాక్ స్త్రీని చేసుకున్నాడు. అప్పుడిక్కడ హిందూ దేవాలయాలు లేవు. అందుకని ఆయన గ్రేట్ గ్రాండ్ రుమేనియన్ చర్చిలోనే వివాహం చేసుకున్నాడామెను. 


మాకు అందిన పత్రాల ప్రకారం ఆయన పేరు- లేట్ రఘురామ రాయడు. యుధ్ద వాతావరణంలో మొదటాయన దక్షిణాఫ్రికాకు వెళ్లి ఆ తరవాత ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. అంటే నాలో తెలుగు వాళ్ల రక్తం ఉంటుందని మీరు ఒప్పుకుంటారనుకుంటాను”


 ముగ్గురూ విస్మయాత్మకంగా చూస్తూ కొన్ని క్షణాలు కూర్చుండిపోయారు. 


=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 17 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





17 views0 comments

Comentarios


bottom of page