top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 17

Writer: Pandranki SubramaniPandranki Subramani

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 17 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 04/03/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 17 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 

పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహ మూర్తికి. ఫ్లైట్ లో తనకు పరిచయమైన లేడీ గ్రేసీ కుటుంబాన్ని కలుస్తాడు నరసింహ మూర్తి. హోటల్ అసిస్టెంట్ మేనేజర్ క్రిస్టోఫర్ రాజమండ్రికి చెందిన వ్యక్తి అని తెలుసుకుంటాడు. 



ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 17 చదవండి.. 


“మరి మీ తండ్రి గారి పేరు? ”- మోహన. 


“మా తండ్రిగారి పేరు- మిస్టర్ ముంతల కృష్ణ జేమ్స్. మా తల్లి మాత్రం టాంజానియా బ్లాక్. అందుకే నా ఇంటిపేరు కూడా ముంతల క్రిస్టోఫర్” 


ఈసారి మోహన కదిపింది- “మరి మీరెవర్ని చేసుకున్నారు? బ్లాక్ స్త్రీనే కదూ! ”


“కాదు. మా ఆవిడ ఫిలిఫైన్స్ స్త్రీ. నాకు ఇద్దరు మగబిడ్డలు. వాళ్ళకు తెలుగు పేర్లు కలిసొచ్చేలా ఇక్కడి పేర్లు పెట్టుకున్నాం” అని తన పర్సు తీసి అందులోనుంచి సోషియల్ సెక్యూరిటీ కార్డ్- బ్యాంక్ క్రెడిట్ కార్డూ వాళ్ళముందుంచాడు. ఔను, వాటిలో అతడి పేరు తన ఇంటి పేరుతో సహా ముద్రించి ఉంది. -- 


నరసింహమూర్తి తెలుగు హృదయం ఉప్పొంగింది. రాజమండ్రిలోని తెలుగు వంశం ఆకాశంలోని హరివిల్లులా ఇక్కడి వరకూ ప్రాకుతు వచ్చిందన్నమాట! అప్పుడు క్రిస్టోఫర్ ఉద్వేగం నుండి తేరుకుంటూ అన్నాడు- “రాజమండ్రి గోదావరి నదీతీరాన ఉందని నాకు తెలుసు. చాలా సార్లు అనుకున్నాను ఓసారి రాజమండ్రి వరకూ వచ్చి పోదామని. మా పూర్వీకుల ఫ్యామిలీ రూట్స్ ని స్పర్శించాలని-- అవకాశం రాలేదు. నిజం చెప్పాలంటే నాకు ధైర్యం చిక్కలేదు. నా కెవరు తెలుసని అక్కడకు రాను? అందుకే మిమ్మల్ని చూసి మీ మాటలు విని మా ముత్తాతగారి స్వంత బంధువుల్ని చూసినట్టు ఫీలయాను. గుండె చెరువైంది. దయచేసి కాదనకుండా తీసుకోండి” అంటూ సాదరంగా లేచి రెండు ప్యాకెట్లు నరసింహమూర్తికి అందించాడు. 

నరసింహమూర్తి అయోమయంగా చూసాడు. 


“ప్లీజ్ హేవిట్. ప్రక్కనే ఫేమస్ బేకరీ ఉంది. అందులోనుంచి తెచ్చాను. ఒక ప్యాకెట్లో కేక్ ఉంది. మరొక దానిలో కుకరీస్ ఉన్నాయి”


నరసింహమూర్తి మనసు మూలన చెమ్మదనం! తెలుగుతనంలోని గొప్పతనం! అతడు సగౌరవంగా లేచి అందుకుంటూ అన్నాడు- “తీసుకుంటాను. తప్పకుండా తీసుకుంటాను. ఐతే ఒక షరతుపైన. నేనిప్పుడిచ్చేది కాదనకుండా మీరూ తీసుకోవాలి”


“వైనాట్? విత్ ప్లజర్” అంటూ తనుకూడా సీట్లోనుండి లేచాడు. నరసింహమూర్తి నిశ్శబ్దంగా తన చేతి వ్రేలినుండి ఉంగరం తీసి మిస్టర్ క్రిస్టోఫర్ వ్రేలికి తగిలించి ఇలా అన్నాడు- “మీకెప్పుడైనా మీ ముత్తాతగారి ఊరు చూడాలనిపిస్తే తప్పకుండా నాకు ఫోను చేసి చెప్పండి. మూడునెలల తరవాత ఇండియా వెళ్లిపోతాను. దిజ్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ మై హార్ట్. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ రిసీవ్ చేసుకుంటాను” అంటూ జేబు నుంచి తన కార్డుని తీసి అందిస్తూ మిస్టర్ క్రిస్టోఫర్ తో కరచాలనం చేసి బైటకు కదిలాడు నరసింహమూర్తి. అక్కా చెల్లెళ్ళిద్దరు కూడా అతడితో కరచాలనం చేసి నరసింహమూర్తిని అనుసరించారు.


ఇప్పుడు ముగ్గురి మనసుల్లోనూ క్రిస్టోఫర్ కలయికతో మాటలకందని ఓ విధమైన మృదు భావం చోటు చేసుకుంది. రెస్టారెంటు ఆవరణ దాటి వచ్చారు గాని, చాలా సేపటి వరకూ వాళ్ళకు మాట్లాడాలనిపించలేదు. కొన్ని దశాబ్దాల చరిత్ర వాళ్ళ ముందు సజీవంగా నిల్చున్నట్లుంది. 

ఎట్టకేలకు మౌనాన్ని భంగపరుస్తూ కారు వేపు నడుస్తూ నరసింహమూర్తి అన్నాడు- ఆకాశంలోకి తలెత్తి-- 


“నిండు పున్నమి చంద్రుడు వెన్నెల్ని కురిపిస్తున్నాడు. ఇదే చంద్రుడు మన రాజమండ్రి గుడి గోపురం వీధిలోనూ కనిపిస్తాడు కదూ! అదే చంద్రుడు ఇక్కడ నార్త్ కరోలినాలోనూ మనకు దర్శనం ఇస్తున్నాడుంటే నమ్మశక్యం కాకుండా ఉంది”


అక్కాచెల్లెళ్ళిద్దరూ అతడిలోని తన్మయత్వాన్ని పంచుకుంటూ అసంకల్పితంగా తెలెత్తి చూసారు. అదే చంద్రుడు- ఎన్నా ళ్ళుగానో చూస్తూన్న చంద్రుడు వాళ్లిద్దరికీ ఆ రోజు కొత్తగా కనిపించాడు. ”ఇంతటి చల్లని వెన్నెల రేడు శివుడి జటాజుటంలో ఎలా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో!”


నరసింహమూర్తి మళ్ళీ అదే రీతిన మైమరుస్తూ అన్నాడు. అప్పుడు మోహన కలుగజేసు కుంది- “దీనికి కారణం నాకంతగా తెలియదు గాని, మా అక్కయ్యకు తెలుసుంటుంది చెప్పవే అక్కాయ్. ఇక ఛాన్స్ నీది! ”


“నేను చెప్పేదా మూర్తిగారూ! ”


“ఓ యస్! నువ్వు చెప్పాలేగాని ఎంతైనా వింటాను” 


అతడి మాటల చిలకరింపుకి ఆమె మోము విప్పారింది. కారు దగ్గరకు వచ్చి ఆగుతూ చెప్పనారంభించింది- “చంద్రమా మన సోజాత:- అంటారే— అలా శ్రీకృష్ణ పరమాత్ముని నుండి చంద్రుడు పుట్టాడంటారు. దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు నక్షత్ర పుత్రికల్నిచ్చి చంద్రుడితో వివాహం జరిపించాడు. ఐతే చంద్రుడు అందరికీ సమానంగా ప్రేమను పంచలేదు. రోహిణిపై అత్యంత ఆసక్తి చూపిస్తూ మిగతా సతీమణుల్ని నిర్లక్ష్యం చేయసాగాడు. 


ఈ సంగతి విన్న దక్షుడికి కూతుళ్ల గోడు భరించలేక-- అమితమైన క్రోధం కలిగింది. అల్లుణ్ణి క్షయ రోగపీడితుడిగా జీవించమని శపిస్తాడు. ఆ శాపంతో క్షీణ దశకు చేరుకున్న చంద్రుడు పరమేశ్వరుని పాదాల వద్దకు చేరుతాడు. 


దయామయుడైన శివుడు జాలి తలచి చంద్రుణ్ణి రోగ విముక్తుణ్ణి చేయడమే గాక. తన శిరస్సుపైన నిలుపుకుంటాడు. తమ వేపు కన్నెత్తి చూడకుండా చంద్రుడు శివుడి జటాజుటంలో కాలక్షేపం చేయడం చూసి ఇరవై ఆరుగురు నక్షత్ర పుత్రికలూ తమ కాపురాన్ని కూల్చివేసాడని తండ్రిని నిలదీశారు. 


అప్పుడు దక్షుడు నీలకంఠుని వద్దకు వెళ్ళి తన అల్లుణ్ణి తన కుమార్తెలకు అప్పచెప్పమంటాడు. లేక పోతే శివుడు తన శాపానికి గురవుతాడని హెచ్చరిస్తాడు. అప్పుడు శివుడి కోరికపై శ్రీకృష్ణుడు వాళ్ళ వద్దకు బ్రాహ్మణ వేషంలో వచ్చి చంద్రుణ్ణి దక్షుడికి అప్పజెప్పమని సలహా ఇస్తాడు. దానికి శివుడు ఒప్పుకోడు; శరణాగతుడైన చంద్రుణ్ణి అలా విడిచి పెట్టడం భావ్యం కాదని వాదిస్తాడు. 

అప్పుడు శ్రీకృష్ణుడు పరిష్కారాన్ని సూచిస్తాడు. రోగ గ్రస్థుడైన చంద్రుణ్ణి దక్షుడికిచ్చి, వ్యాధినుండి విముక్తుడైన చంద్రుణ్ణి శివుని తలపూవుగా ధరించేలా ఏర్పాటు చేస్తాడు. ఆ కారణాన క్షయరోగ పీడితుడైన చంద్రుడు వృధ్ధి క్షయాలకు లోనవుతూ తారలతో బుధ్ధిగా కాపురం చేస్తుంటాడు”

అంతావిన్న నరసింహమూర్తి నిట్టూరుస్తాడు- “చంద్రుడి వృధ్ధి క్షయాలవెనుక ఇంతటి కధా కమామిషూ ఉందన్నమాట! రియలీ మార్వెలెస్” అంటూ సుజాత రెండు చేతుల్నీ అందుకున్నాడు. అప్పుడు మోహన వాళ్ళమధ్యకు దూసుకు వచ్చింది. 


“ఆగండి ఆగండీ! మాటి మాటికీ మెచ్చుకుంటూ అవసరం ఉన్నా లేక పోయినా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఎమోషనల్ ఐపోవడం అంత బాగుండదు రాజమండ్రి బావా! అసలే మా అక్కయ్యది మృదు స్వభావం, కరిగి ప్రవహించి కనిపించకుండా పోవచ్చు. పెళ్ళి పీటల పైన కూర్చున్నంత వరకూ క్షీణించకుండా తల్లడిల్లిపోనీయకుండా ఉండనివ్వండి”


మోహన మాటలకు ఇద్దరూ దూరంగా జరిగి గట్టిగా నవ్వేసారు. ఇప్పుడు నరసింహమూర్తికి చలి అంతగా వేయడం లేదు. సన్నటి ఈల వేస్తూ కారులోకి వచ్చికూర్చున్నాడు. కూర్చుని సేఫ్టీ బెల్ట్ తగిలించుకున్న వెంటనే సుజాత వేపు తిరిగి అన్నాడు- “నిజం చెప్తున్నాను—ఇకపైన పెళ్లి పీటల పైన కూర్చున్నంత వరకూ నిన్ను తాకనంటే తాకను. దిస్ ఈ జ్ మై వర్డ్! ”


సుజాత ఏమీ అనకుండా కారు స్టార్టు చేస్తూనే చెల్లిని ఉద్దేశించి అందామె- “చూసావా— నువ్వు తమాషాగా ఏదేదో అనేస్తుంటావు. ఆయనేమో ఉన్నపళంగా ఎఫెక్టు ఐపోతున్నారు. ఇక పైనైనా నీ ఆగడాలూ వాగుడూ తగ్గించవే! ”


“ఊరుకోవే పిచ్చి నాగమ్మా! నీకు కాబోయే జీవన సహచరుడు ఎక్కణ్ణించి వచ్చాడనుకుంటున్నావు? రససిధ్దులైన మహేష్ యోగి వంటి వారు పుట్టిన ప్రదేశం నుండి వచ్చిన వాడు. ఇక వాత్సాయనుడి గురించి విడిగా చెప్పాలా! అటువంటి భూమినుండి వచ్చిన వాడు ఊరకే ఉంటాడా!


ఉండగలడంటావా! నెపం దొరకాలే గాని, కొండను పిండి చేయడూ- అదీను నీవంటి ఐదడుగుల ఆరు అంగుళాల ఎత్తరి ముందు—ఎమోషన్స్ ఆపుకోగలడంటావా! నాకు సుతారమూ నమ్మకం లేదక్కోయ్”


ఈసారి నరసింహమూర్తి నవ్వాపుకోలేక పోయాడు. మృదువుగా సుజాత చేతిపైన చేయి వేసి అన్నాడు- “ఐ లవ్ యూ సుజాతా! నిజం చెప్తున్నాను నువ్వు అమ్మకు నచ్చుతావు”


ఆమె నిండుగా నవ్వి కారు డ్రైవ్ చేయడంలో నిమగ్నురాలైంది. 

***

అనుకున్న ప్రకారం ఒక రోజు సాయంత్రం రీసెస్ దొరికినప్పుడు నరసింహమూర్తి తన రూమ్ పార్టనర్ షేక్ అహ్మద్ ని తన కాబోయే అత్తా మామగార్లింటికి తీసుకెళ్ళాడు. అందరి పరిచయాలూ ఐన తరవాత ఇంటిల్లపాది అందరితో కలసి రాత్రి భోజ నాలు చేసాడు షేక్ అహ్మద్. వంటలంతా దక్షిణ భారతీయ పధ్దతిలో చేసినా— అతడి కోసం ప్రత్యేకంగా పంజాబీ పధ్ధతిలో రెండు మూడు ఐటమ్స్ చేసారు; చపాతీలు. కోడి కుర్మా, మటన్ కుర్మా వంటివి. 


షేక్ అహ్మద్ తృప్తిగా భోజనం చేసి, అనుభవించిన ఆనందానికి చిహ్నంగా రెండు మార్లు గుండెల పైన గుద్దుకొని అన్నా డు- “మీ ఇంట్లో వండిన కాయగూరలు చాలా బాగున్నాయి. మరి మా ప్యాంట్రీ వాళ్ళు చేసిన విజిటబల్స్ అంత బాగాలేవు” 


దానికి శ్రీలక్షణ్ నవ్వుతూ బదులిచ్చాడు- “ఔను. అవి చాలా వరకు హై బ్రీడ్ వి. ఇక్కడ మా పెరటి తోటలో పెంచుతున్నవన్నీ రసాయనాలు తాకని సహజ ఎరువులతో పెంచుతున్నవి. దట్ మేక్స్ ది డిఫెరెన్స్.”


“అలాగండీ! రియల్లీ గుడ్” అంటూ నరసింహమూర్తికి మాత్రం వినిపించేలా మరొకటి అన్నాడు- “మీరు చాలా లక్కీ మూర్తీ! మీకు భార్య కాబోయే అమ్మాయి అప్పటి మీ బాలీవుడ్ స్టార్ మీనాక్షీ శేషాద్రిలా ఉంది. మీ అత్తమామలుకూడా చాలా కైండ్ ప్యూపుల్. మీరు డబల్ లక్కీ! ”


నరసింహమూర్తి నవ్వుతూ థేంక్స్ చెప్పి ఊరకున్నాడు. కాసేపు తరవాత అతడలా ఇంటి చుట్టూ తిరిగి చూస్తూ ఒక పెద్ద ఫొటో ముందు ఆగిపోయాడు. దానిని తేరి చూస్తూ అడి గాడు- “అదేంవిటి మూర్తీ.. ఆ స్త్రీ కుక్కను పట్టుకుని కంటనీరు పెట్టుకుంటుందీ! ఇంతకూ అది మామూలు వీధి కుక్కలాగే కనిపిస్తుంది మరి. ఆ స్త్రీకి మంచి బ్రీడ్ కుక్కే దొరకలేదా? ”


ఆ మాటకు నరసింహమూర్తి షేక్ అహ్మద్ భుజం తట్తూ అన్నాడు- “మేటర్ నువ్వనుకున్నంత సింపుల్ కాదు. ఇటీజ్ ఎ పిక్చర్ ఆఫ్ హై ఎమోషనల్ ఫీల్. దీనిగురించి మోహన బాగా చెప్తుందేమో! ” అని ప్రక్కకు వచ్చి నిల్చున్న మోహన వేపు చూసాడు. 


“దీని గురించి నేను చెప్తాను మిస్టర్ షేక్. దీనిని మా అక్కయ్య వెబ్ సైట్ నుంచి క్యాప్చర్ చేసి ఫ్రేమ్ చేసి కట్టింది. మా అక్కయ్యకు చాలా ఇష్టమైన ఫొటో”


“మరి దీంట్లో నాకేదీ కళాత్మకత కనిపంచలేదే! ”అన్నాడు షేక్ అహ్మద్. 


అప్పుడు సుజాత ముందుకు వచ్చింది- “ నిజమే మిస్టర్ షేక్. కాని ఆ ఫొటోని ఒక క్షణం పైకళ్ళతో చూడాకుండా మనో నేత్రంతో చూస్తే ఒక అనన్య సామాన్యమైన మానవీయ గుణం కనిపిస్తుంది. మీకు తెలిసిన విషయమే-- మొన్నొక రోజు- అంటే నవంబర్ ఇరవై ఆరునాడు కొందరు ఉగ్రవాదులు ఇండియా పొరుగు దేశం నుండి రహస్యంగా చొరబడి ఎడాపెడా కాల్పులు జరిపారు. అప్పుడు ఆ ఉగ్రవాదులు తాజ్ మహల్ హోటల్లోకి కూడా ప్రవేశించి హత్యాకాండకు పాల్పడ్డారు. 


ఆ సమయంలో ఆ ఉగ్రవాదులకూ ఇండియన్ సెక్యూరిటీ కమెండోలకు మధ్యా ఘోర యుద్ధం జరిగింది. ఆ తూటాల మోతల మధ్య ఈ కుక్క కనిపించకుండా పోయింది. ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం పెట్టే ఆ మహిళామణి అది కనిపించకపోయేసరికి తల్లడిల్లిపోయింది. ఎక్కడో ఒక చోట ఆ తూటాల దెబ్బకు చచ్చిపోయుంటుందని విల పించింది. 


అదే కుక్క వారం రోజుల తరవాత తోకాడిస్తూ ఎదురొచ్చేసరికి ఆర్ద్రతను ఆపుకోలేక—‘వారం రోజులుగా నీకు అన్నం పెట్టలేక పోయానే!’ అని దానిని కౌగలించుకుని కంట కన్నీరు పెట్తూంది”

నరసింహమూర్తి అనుకున్నట్లే జరిగింది. షేక్ అహ్మద్ ముఖం మారిపోయింది. వెలవెలబోయింది. అతడికి ఏమి చెప్పి, ఎలా చెప్పి షేక్ అహ్మద్ కి ఊరడింపు కలిగించాలో తెలియలేదు. ఏందుకంటే ఆ ఉగ్రవాదులందరూ అతడి దేశం నుండి వచ్చిన వారే! అతణ్ణి నిశ్శబ్దంగా భుజం తట్టి హాలులోకి తీసుకెళ్ళాడు నరసింహమూర్తి. 


కొన్ని భావ కెరటాలకు మౌనమే కదా సమాధానంగా నిలుస్తుంది! 


ఎట్టకేలకు కొన్ని క్షణాల తరవాత షేక్ అహ్మద్ పెదవి విప్పాడు- “నాకిప్పుడు మీ దేశానికి చెందిన ఒక గొప్ప మానవతా వాది కళ్లముందు నిల్చున్నాడు. అదెవరో చెప్పగలరా మూర్తీ? ”


అతడు మౌనపు పరదానుండి బైటికి రావడానికి ఇష్టపడలేదు. అదే మౌనంతో తల అడ్డంగా ఆడించాడు తెలియదన్నట్టు. 


”ఆయన గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. దేశ విభజన తరవాత కూడా ఇరు ప్రాంతాల మధ్యా సామరస్యానికి ఆలంబనంగా నిలచిన ఆయన ఔన్నత్యాన్ని గుర్తించకుండా మా వాళ్ళు కొందరు ఆయనను హిందూ ఫకీర్ అనేవాళ్ళు. ఇప్పటికీ మా దేశం ఆయన ఉన్నత స్థానాన్ని గుర్తించలేదనే తోస్తూంది మూర్తీ! 


ఈ కాల వ్యవదిలో వచ్చిన తేడా ఒక్కటే- అప్పట్లా మా వాళ్లు ఆయనను హిందూ ఫకీర్ అనడం లేదు. దీనిని ఇంతటి బాధతో యెందుకు చెప్తున్నానంటే- ఒక గొప్ప మనిషిలోని గొప్ప వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి మనకు మనస్కరించడం లేదంటే— దాని అర్థం; ఆయనలో ఇమిడి ఉన్న ఆ గొప్ప వ్యక్తిత్వం రవంత పాలయినా మనలో లేదన్నమాటేగా! ”


వెనుక నిల్చుని అదంతా విన్న శ్రీలక్ష్మణ అన్నాడు- “యు ఆర్ ఎ ఫైన్ యంగ్ మ్యాన్ మిస్టర్ షేక్! గాంధీగారి గురించి మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. ”


అతడు వినమ్రంగా లేచి ధన్యవాదాలు చెప్పాడు. ఆ తరవాత రూమ్ మేట్స్ ఇద్దరినీ రామ్ మోహన్ రాబర్ట్ హాస్టల్ వద్ది దిగబెట్టి వెళ్లాడు. 


కొందరున్నారు. లోపలి సంగతులెలా ఉన్నా పైకి మాత్రం కదలని మంచుకొండలా నిదానంగా ఉంటారు. ఎంతటి తీవ్రమైన సంఘటన ఎదురొచ్చినా ఏమీ జరగనట్టే ఏదీ తాకనట్టే చలనరహితంగా నిల్చుంటారు. చాలా సేపు తేరిపార చూసి గాని ఒక కొలి క్కి రారు. ఇంకా చెప్పాలంటే, ఇకపైన వెనక్కి తగ్గాలా ముందుగు సాగాలా అన్నదానిని అంత త్వరగా తేల్చుకోరు. అలా ప్రవర్తిం చడానికి కొంత వరకు జీన్స్ కారణం కావచ్చు. లేదా- సహజ మానవ స్వభావం కూడా కారణం కావచ్చు. 

ఇంకా మరికొందరు న్నారు. చిన్న చిన్న సంఘటనలకు వాయు వేగంతో స్పందిస్తారు. జ్వాలా ముఖిలా ప్రజ్వరిల్లుపోతున్నట్లు ముందుకు సాగి పో తుంటారు. సిలిండర్ లా పేలిపోతారు అడ్డూ ఆపూలేని ఆవేశంతో-- ఒకడుగు వెనక్కి వేసి తిరిగి చూడాలన్న ధ్యాస ఉండదు. అనుకున్నది అనుకున్నట్లు అప్పటికప్పుడు దూసుకుపోవడమే-- ఈ కోవకు చెందిన వాడు షేక్ అహ్మద్. 

శ్రీరామ్ వాళ్ల ఇంట్లో విందారగించి వచ్చిన మరునాడు షేక్ అహ్మద్—గుప్పెట్లో దాచిన తూటాలా- మోహన ఊసెత్తడం నరసింహమూర్తిక ఆశ్చర్యం కలిగించింది. 


“షి ఈజ్ టాలెంటెడ్- ఎనర్జిటిక్- బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కదూ! ”


సరిగ్గా పాలుపోక ఎవరని అడిగాడు నరసింహమూర్తి, 

“మీ మరదలు మిస్ మోహన”


“అక్కాచెల్లెళ్ళిద్దరూ పొడవుగా ఆరోగ్యంగా బాగానే ఉంటారు. ఇంతకూ మోహన ఊసు ఇప్పుడెందుకు? ”


“మోహనను మళ్ళీ చూడాలనిపిస్తుంది”


ఈసారి ఎందుకని అడగలేదు నరసింహమూర్తి. 

భావ గర్భాలయంలోని స్ఫూర్తిని అతడు అర్థం చేసుకోగలిగాడు. ”కొన్ని మన చేతికందవు కదా! ”- నరసింహమూర్తి. 


“మనసుంటే మనసులో స్వఛ్ఛత ఉంటే ఏదైనా సాధించ వచ్చన్నది నా అభిమతం. ఇక మాటలో మాటగా నేను ఇంతవరకూ మీకొక విషయం చెప్పలేదనుకుంటాను. నాకు మాదేశంలో చెప్పుకోదగ్గ ప్రోపర్టీ ఉంది. లాహోర్లో ఉంది- ఇస్లామాబాదులో ఉంది“


“కావచ్చు-- నేనెక్కువగా మాట్లాడి నిన్ను తర్జన భర్జనకు లోను చేయడం నాకిష్టం లేదు షేక్. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్టుడు అర్జునుడికి చెప్పిన మాటను మాత్రం చెప్పి ముగిస్తాను- ‘చేసిన కార్యానికి రాబోయే ఫలితం గురించి నీకు తెలియనప్పుడు—

దాని కోసం ప్రయాసపడటం వ్యర్థమౌతుంది. అంతే కాక- అశాంతి పాలు కావలసొస్తుంది. ఎందుకంటే అది నీ చేతిలో లేదు గనుక’


“అంటే- ఒక హైందవ కుటుంబానికి చెందిన అమ్మాయిని ఇష్టపడితే నెగటివ్ పర్యావసానాలు తప్పవంటారా? ”


“అలాగనను. పర్యావలోచన చేయవలసిన విషయమంటాను. ఇటువంటి మతాంతర వివాహాలు చాలా సోఫిస్టికేటడ్ రంగాలైన బాలీవుడ్ లో—ఇంకా ఇతర సినీఫీల్డులో జరగవచ్చుగాక. కాని సాధారణంగా అన్నిచోట్లా సంభవించవు. మీరెలాగైతే నాన్- ముస్లి మ్ లకు మీ అమ్మాయిలను ఇవ్వడానికి సమ్మతించరో-- అలాగే నాన్- ముస్లిమ్ లు కూడా వాళ్ల అమ్మాయిల్ని మీకు ఇవ్పడానికి సందేహించ వచ్చుకదా! 


ఇక మరొకటి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మోహన అచ్చు వాళ్ల అక్కయ్యలా నా ముందు అణగి మణగి ఉన్నట్లు కనిపించినా ఆమెది బోల్డ్ టైప్, ఫాస్ట్ లైఫ్. పాశ్చాత్య నాగరికతలోనున్న స్వేఛ్ఛను అమితంగా ఇష్టపడే మనస్త త్వం. వాళ్లక్కయ్య మాటలను బట్టి చూస్తే మోహనకు ఈపాటికి ఎవరో బాయ్ ప్రెండ్ ఉండే ఉంటాడు“


ఆ మాటతో షేక్ అహ్మద్ ఊరకుండిపోయాడు. దీర్ఘమైన ఆలోచనా సాగరంలో మునిగిపోయాడని తెలుసుకున్న నరసింహమూర్తి అక్కణ్ణించి కదలి వెళ్ళబోయాడు. అప్పుడు షేక్ చటుక్కున అతణ్ణి చేయి పట్టుకుని ఆపాడు. ” నౌ ప్లీజ్ టేకిట్ ఫ్రమ్ మి. ఏదో ఒక రోజు నేను భారతీయ స్త్రీనే వివాహం చేసుకుంటాను”


“ఎందుకు సాధ్యం కాదూ! భారతీయులలో కూడా ముస్లిమ్ స్త్రీలు ఉన్నారు కదా! ”


“కాదు. నేను హైందవ స్త్రీనే చేసుకుంటాను”


నరసింహమూర్తి విస్మయంగా చూసి అతడి చేతినుండి తన చేతిని విడిపించుకుని మరు పలుకు లేకుండా కదలి వెళ్లిపోయాడు. తను మాత్రం యేం చేయగలడు? ఉన్నదున్నట్లు చెప్పగలడు. తనకు తెలిసిన మంచీ చెడ్డల గురించి- ఎదురవబోయే పర్యవసానాల గురించి వివరించి చెప్పగలడు. ఇకపైన తను చేయగలిగిందేముంది! 


కొందరికి కొన్ని అబెసెషన్స్- నిగూఢమైన వికారమైన తీవ్ర వాంఛలుంటాయి. వాటినుండి విడవడటం కొందరికి సాధ్యం కాదు. షేక్ అహ్మద్ వంటివారు వాటివల్ల ఏర్పడే పర్యావసానాలు ఎలాగుంటాయో తెలిసినా తగ్గరు. మరు పరిశీలన చేయరు. 


=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





 
 
 

Comentários


bottom of page