top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 18

Writer: Pandranki SubramaniPandranki Subramani

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 18 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 12/03/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 18 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 

పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహ మూర్తికి. ఫ్లైట్ లో తనకు పరిచయమైన లేడీ గ్రేసీ కుటుంబాన్ని కలుస్తాడు నరసింహ మూర్తి. హోటల్ అసిస్టెంట్ మేనేజర్ క్రిస్టోఫర్ రాజమండ్రికి చెందిన వ్యక్తి అని తెలుసుకుంటాడు. మోహన పట్ల తనకు ఇష్టం కలిగినట్లు చెబుతాడు షేక్ అహ్మద్


ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 18 చదవండి.. 


ఇటీవల కొన్ని రోజులుగా శంకరానికీ అతడి తల్లి దండ్రులకూ మధ్య చిన్నచిన్న చిటపట కణికలు చెలరేగుతున్నాయి. బంధువుల్ని రాకూడదన్నది తన అభిమతం కాదని, ముఖ్యంగా దగ్గరితనం గల వాళ్ళను దూరం చేసుకోవడం భావ్యం కాదన్నది తనకు తెలుసునని చెప్తూనే అసలు విషయాన్ని బ్రద్దలు గొట్టడానికి పూనుకున్నాడు; ఒకేసారి అంత మంది బంధువులు గుంపుగా జాతరకొచ్చినట్టు రావడం- ఇంటి లోగిలి మధ్య పొలోమని చేరి మద్యం సేవిస్తూ హడావిడి చేయడం, ఇరుగు పొరుగుల నెమ్మదత్వానికి భంగం కలిగించడం మంచిది కాదని తల్లిదండ్రులిద్దరికీ వివరించాడు. 


అంతేకాక ఇరుగు పొరుగుల మధ్య అనవసరంగా చులకనవుతామని కూడా చెప్పాడు. తండ్రి సాంబయ్యకు కొడుకు మాటలు రుచించలేదు. తీవ్రంగా స్పందించాడు. శంకరం నిన్నకాక మొన్న పుట్టిన వాడని, వాడు పుట్టకముందు నుంచే వాళ్ళతో తమింటికి దగ్గర సంబంధా లున్నాయని- అతడి వ్యవహారం గుడ్డొచ్చి కోడుని వెక్కిరించినట్లుందని- అసలు ఆనాడు వాళ్లందించిన ఆసరాతోనే శంకరం చదువు ముందుకు సాగిందన్నది కొడుకు మరచిపోకూడదని ఎడాపెడా మందలించాడు. 


తల్లి దమయంతమ్మ కూడా కొడుకన్నమాటలకు నొచ్చుకుంది. భర్తలాగే ఆమెకు కూడా సహజంగానే బంధుప్రీతి ఎక్కువ. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా ఆమెకు దగ్గరితనం ఉన్నవాళ్ళను ఏమైనా మాట అంటే కంటనీరు పెట్టుకుంటుంది. చదువుకోక ముందు కొడుకు బాగానే కాకర కాయనేవాడని, చదువులో కాస్తో కూస్తో ఆరితేరిన వాడనిపించుకున్న తరవాతనే కీకీర కాయ అననారంభించాడని ఎత్తి పొడిచింది. 


కాని వాళ్ల మాటలకు శంకరం చలించలేదు. వెనక్కి తగ్గలేదు. వాళ్ళ దెప్పి పొడుపులని లక్ష్యపెట్ట లేదు. కావలసిన బంధువులకు యెప్పుడైనా చేయవలసిన సహాయం చేయాల్సి వస్తే అది చేయడానికి తనకు ఇసుమంత ఆక్షేపణ కూడా లేదని- వాళ్ళు జాతరలావచ్చిఇంట్లో చేసే హడావిడి మాత్రం చెల్లదని కరా ఖండీగా తేల్చాడు. 


స్వతస్సిధ్ధంగా పోలేరమ్మ గుడి ఆనువంశిక ట్రస్టీలకు- నిర్వాహకులకు సభ్యతా మర్యాదలతో మెలిగే శంకరం పట్ల సదభి ప్రాయం ఉంది కాబట్టి – రేపో మాపో ఎవరడ్డు వచ్చినా రాకపోయినా— విద్యావంతుడూ గుణవంతుడూ అయిన శంకరం- ఎండోమెంట్ డిపార్టుమెంటు వాళ్లు రంగప్రవేశం చేసేంత వరకూ గుడి మేనేజిమెంటు బాధ్యతల్ని తీసుకోవలసిన వాడన్న వాస్తవాన్ని గుర్తించారు- ఆ వాడపెద్దలు. 


ఆ తీరున శంకరానికీ అతడి మాతాపితల మధ్యా మధ్య వర్తిత్వం వహించి ఒక ఆచరణ యోగ్యమైన సయోధ్య కుదిర్చారు. కాని అలా సయోధ్య కుదిర్చక ముందు శంకరం నుండి తెలివిగా ఓ మాట తీసుకున్నారు కూడాను. అదేమంటే -- రేపోమాపో తన ఉద్యోగంలో ఎదుగుదల వచ్చినా సంపాదన పెరిగినా అతడు ఆ వాడలోనో లేక దాని చుట్ట ప్రక్కలలోనే ఉండాలని - అందరికీ అందుబాటులోనే ఉండాలని-- అలా ఉంటూనే గుడి వ్యవహారాలు చూసుకునేందుకు వెనుకాడకూడదని శాసించారు. శంకరం ఆ సయోధ్య న్యాయమేనని ఒప్పుకున్నాడు. 


ఆ వాడ పెద్దలు చేసిన ఏర్పాటులోని సారాంశం యేమంటే- సాంబయ్య తరపు బంధువులు గాని, దమయంతమ్మ తరపు బంధువులు గాని వాళ్ళింటికి ఎప్పుడైనా వచ్చి పోవచ్చు- కడుపు నిండా భోజనాలు ఆరగించి వెళ్ళవచ్చు. కాని ఒక షరతుపైన మాత్రమే-- అదేమంటే- విందులు చేసి చిందులు వేసిన తరవాత వాళ్లు ఒకే ఒక సౌకర్యాన్ని వదలుకోవాలి. కల్లు సీసాలు- సారా యం సీసాలు ఆ యింట్లో తెరవకూడదు. ప్రభుత్వ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి కాబట్టి- వాళ్ళు అడపా దడపా అడవి నుండి జంతువుల్ని వేటాడి ఇంటికి తీసుకురాకూడదు. 


అలా చేస్తే కుదురైన ఉద్యోగంలో ఉన్న శంకరం పరపతికి మాత్రమే కాదు; గుడి ట్రస్టీగా ఉన్న సాంబయ్య పరపతికి సహితం భంగం వాటిల్లవచ్చు. ఒక వేళ బంధువులకి కచ్చితంగా పుచ్చుకోవాల నిపిస్తే వాళ్ళ వాళ్ళ ఇండ్లలోనే మద్యం సేవించి రావాలి. శంకరం వాళ్ల ఇంట్లో మాత్రం దాని వాసన వద్దు. 


వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో ఒక వాక్యం ఉంది. ”ఎన్ ఆఫర్ ఆఫ్ ది డీల్ దట్ కెనాట్ బి రిఫ్యూజ్డ్“ ఆ విధంగా పెద్లల ముందు కుదిర్చిన ఒప్పందం ఇటు సాంబయ్య దంపతులు- అటు వాళ్ళ బంధువులూ ఒప్పుకోక తప్పలేదు. 


కాలానుగుణంగా వాళ్లలో చాలామంది కాటికాపర్లు కుల వృత్తి నుండి వైతొలగి ఉండవచ్చు. కాని మద్య పాన సేవనం అనే అనౌచిత అలవాటు నుండి మాత్రం వాళ్లు పూర్తిగా విడవడలేదు. ఆ వ్యసనం నుండి విడివడాలన్న అవసరమూ వాళ్ళకు అగుపించలేదు. వాళ్ళకది నిత్య అన్నదాన సంతర్పణం వంటిది. అంతెందుకు— పోలేరమ్మ గుడి ట్రస్టీగా ఎన్నికైన సాంబయ్య సహితం మద్యపాన సేవనం నుండి పూర్తిగా తొలగలేక పోయాడు. పెళ్ళాం పర్యవేక్షణలో గుట్టుగా చుక్కవేసుకున్న తరవాతనే భోజనానికి కూర్చుంటాడు. గుట్టుగా నిద్రపోతాడు. 


సహేతుకత గురించి ఆలోచించకుండా చూస్తే తీవ్రమైన ఆ అలవాటు వెనుక వాళ్లకంటూ కారణం లేకపోలేదేమో! ఆ పాటి మత్తు తగలక పోతే వాళ్ళ చుట్టూ నిల్చున్న దు:ఖితుల్ని చూస్తూ వాళ్లు పార్థివ శవాలను ముట్టుకుని గోతిలో పూడ్చలేరేమో-- జాతి కులాలకు అతీతంగా మనిషి అంతిమ యాత్రకు రహదారి వేసి- ఆ పుణ్య కార్యాన్ని పకడ్బందీగా చేసే వాళ్లెవరైనా ఉన్నారంటే- ఇప్పటి హైందవ సమాజంలో-- అది వాళ్లే! 


చివరకి ఏది ఏమైనా శంకరం పథకం ఈడేరింది. మాధవి ఇచ్చిన ఆలోచన అతడి మార్గాన్ని సుగమం చేసింది. అనుకున్నట్లుగానే— విధించిన మద్యపాన నిషేధంతో బంధువుల రాకాపోకలు క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టసాగాయి. అప్పుడప్పుడు వచ్చే వాళ్లు తినడం- ఆ తరవాత విరామం తీసుకోవడం- నిదానంగా వెళ్లి పోవడం వంటివే చేస్తున్నారు. మరి కొన్నాళ్ల పాటు వేచి చూసి, ఫలితం ఖాయమన్నది రూఢి చేసు కున్న తరవాత అతడు మాధవికి ఆ కబురు అందచేసాడు. 

మొదటి విజయం గురించిన వార్త విన్నంతనే మాధవి ముఖం మొఘల్ గార్డన్ లోని టులిప్ పుష్పంలా వికసించింది. ఇక మిగతాది కూడా మెట్టు మెట్టుగా సాధించ వచ్చన్న నమ్మకం ఇద్దరికీ కలగసాగింది. తన ప్రియి సఖికి మరింత ఉత్సాహాన్ని కలిగించడానికి శంకరం మరొకటి కూడా అన్నాడు- 


“చూస్తూండు మాధవీ! కొన్నాళ్ళకు మా తండ్రిచేత కూడా మద్యం తీసుకోవడం మానిపిస్తాను”


అప్పుడు మాధవి వారించింది- “మనం మరీ తీవ్రంగా స్పందించనవసరం లేదు శంకరం! మీ తండ్రి నిజమైన పెద్ద మనిషిలా నడచుకుంటున్నారు. ఆయన వల్ల ఎవరికీ ఏ యిబ్బందీ కలగదు. ఏకీడూ కలగదు. అందులో మీ అమ్మే ఆయనకు బాసటగా నిలచి దగ్గరుండి అంతా చూసుకుంటుందిగా! ఆయన మీ అమ్మగారి కనుసన్నల్లో ఉన్నంత వరకూ మన ప్రయత్నాలకు ఏ ఢోకా ఉండదు. హేట్సాఫ్ టు యువర్ ఫాదర్- మై ఫ్యూచర్ ఫాదర్ ఇన్ లా! “ అంటూ సంభాషణకు మలుపు తిప్పింది మాధవి. 


“మనం ఎక్కువ సేపు ఇలా నడవమ్మట మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. ఎవరైనా మా అమ్మ చెవినైనా ప్రిన్స్ పాల్ చెవినైనా వేస్తే బాగుండదు. రేపు ఆదివారం సాయంత్రం నేను మీకు డిన్నర్ ఇప్పిస్తున్నాను- స్ప్రింగ్ గార్డెన్ హాలులో. సరేనా?”


అతడు కాస్తంత విస్మయంతో- “ఇంత చిన్నదానికి అంత పెద్ద విందా!” అని అడిగాడు. 


“అది కాదు మహాశయా! విషయం ఉంది“


“ఆ విషయమేదో స్టాటర్ లా చెప్తే బాగుంటుంది కదా! ”


“లేదు. అక్కడ చెప్తేనే థ్రిల్. సరిగ్గా ఏడు గంటలకు మీరక్కడుంటారు“


“ఇక ఆదివారం వచ్చేంత వరకూ నాకు నిద్రపట్టదేమో! ”


“నాకోసం ఆపాటి త్యాగం చేయలేరా! ”అంటూ నవ్వుల రవ్వల్ని వెదజల్లుకుంటూ వెళ్ళిపోయింది మాధవి. 


మాటల పోటీలో ఆడాళ్లను అందుకోవడం ఎవరికి మాత్రం సాధ్యం గనుక! . 

------------------------------------------------------------------------------------ 

అనుకున్న ప్రకారం ఆదివారం సాయంత్రం ఇద్దరూ స్ప్రింగ్ గార్డెన్ రెస్టారెంటులో కలుసుకున్నారు. 

భోజనాలకు ఆర్డరిచ్చిన తరవాత— శంకరం మెల్లగా అన్నాడు గుసగుసలు పోయినట్టు- “ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను మాధవీ! ”


ఎందుకో అన్నట్టు కళ్లు కలువల్లా విప్పార్చి చూసిందామె. 


”చాలా అందంగా ఉన్నావు— తెల్ల పువ్వుల బూటాలద్దిన నీలం రంగు చీరలో— వదులుగా విడిచిన నిగనిగలాడే కురుల్లో— యెథినిక్ లుక్ తో- నా కన్నే పడేటట్లుంది. నరుడి కన్ను పడితే నల్లరాయి సహితం బ్రద్దలవుతుందంటారు. తెలుసు కదూ! ”


“మీ కన్ను నాపైన పడాలనేగా ఇలా వచ్చింది! మరెందుకనుకున్నారు మరి?”


“అబ్బ! ఆడాళ్లు ఎంత మృదువుగా మాట్లాడుతూనే ఎంత తీవ్రంగా రెచ్చగొడ్తుంటారు! ఔను గాని మనం చేతులు కడుక్కోలేదు. పద!” అంటూ ఆమెను తనతో వాషింగ్ రూములోకి తీసుకెళ్ళి- అటూ ఇటూ చూసి- ఎవరి అలికిడీ లేదని రూఢి చేసుకుని ఉన్న పళంగా ఆమెను గుండెలకు హద్దుకుని గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.


ఆమె నవ్వుతూ స్పందించింది- “అబ్బ! ఎంత ఆవేశం! నన్ను నిలువెల్లా ఆవిరి క్రమ్మేసినట్లనిపించింది“


“సారీ! లక్ష్మణ రేఖను అతిక్రమించానేమో! ”


“అదేం లేదు. రేపు స్వంతం కాబోయే వరాల ప్రోగునుండి కొన్నిటిని అడ్వాన్సుగా తీసుకున్నారంతే!” అంటూ వాష్ బేసిన్ లో చేతులు కడుక్కొచ్చి తన సీట్లో కూర్చుంది. అతడు కూడా చేతులు కడుక్కుని అక్కడికి చేరుకున్న తరవాత కళ్ళనుండి తెలికాంతుల్ని కురిపిస్తూ అతడి చేతిపైన చేతినుంచి—“ఉఁ చెప్పుకోండి—నేనెందుకు పార్టీ ఇస్తున్నానో!” అని అడిగిందామె. 


“చెప్తాను. ముందు నీ ఎడం చేతిని చాచు“ 


ఆమె అదేవిధంగా నవ్వుతూ చేతిని అందిచ్చింది. అతడు జేబులోనుంచి చిన్నపాటి జువలరీ బాక్స్ లోనుంచి రవ్వల ఉంగరం తీసి ఆమెకు తొడిగాడు. 


“ఓ బ్యూటిఫుల్! ఇది మీమనసంత అందంగా ఉంది శంకరం! ఐతే మీరు నేను ఇవ్వబోయే పార్టీ అకెషన్ తెలుసుకున్నారన్న మాట! ”


“ఉఁ మనసుంటే ఏదైనా తెలుసుకోవచ్చు మైడియర్ టీచరమ్మా! నీ ప్రొఫైల్ లోని వివరాలను కంప్యూటర్ సిస్టమ్ లో క్యాప్చర్ అయుంది. ఈ రోజు నీ పుట్టిన రోజని తెలుసుకున్నాను. ఆర్ యు హ్యాపీ! ”


ఆమెకు మాటలు అందలేదు. అలవికాని ఆనందంతో ఆమె కనురెప్పలు తడిసాయి. ఉన్నపళాన లేచి వెళ్లి అతణ్ణి కౌగలించు కోవాలనిపించింది కాని ఆపుకుంది. “థేంక్స్! థేంక్యూ వెరీమచ్ మైడియర్! ” 


“ఇంత చిన్నదానిక ఇంత పెద్ద థేంక్సా! రేపు నా జీవితాన్నే నీకర్పించబోతున్నాను. మరి దానికేమిస్తావు?”- శంకరం.

“ఏమైనా ఇస్తాను. మీ నీడలో నీడనై- మీ జీవితంలో జీవితాన్నై పుష్పిస్తాను. సముద్ర కెరటం వంటి కష్టం యెదురు వచ్చినా నేను తెప్పనై మునుగుతూ తేలుతూ మిమ్మల్ని ఆవలికి చేరుస్తాను”

అతడు మాట్లాడకుండా నిశ్సబ్దంగా ఉండిపోయాడు. అతడి ముఖంలోకి తేరిపార చూసి ఉలిక్కిపడ్డట్టయింది. 


“అదేంవిటి? మీకళ్ళు తడిసినట్టున్నాయి శంకరం!”


“ఎందుకో యేమో తెలియడం లేదు మాధవీ! నీ మాటలు వింటుంటే నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది మాధవీ!” 


ఆ ఒక్క మాటకూ ఆమె గుండె కరిగిపోయింది. అతడి రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుంది. 

ఇద్దరూ భోజనాలు ముగించి బైటకు వచ్చారు. 


రెస్టారెంటుకి చూట్టూరా మొలిచిన చెట్ల సందుల్లోనుంచి చల్లని గాలులు ప్రియులిద్దరినీ స్వాగితిస్తున్నాయి. మనసు లోయల మూలన పొంచి ఉన్న మధురోహల్ని రేపుతూ ఆహ్లాదపరుస్తున్నాయి. కొద్ది దూరం నడచిన తరవాత మాధవి అంది- 

“నన్ను లిబర్టీ వరకు మాత్రమే వచ్చి దిగబెట్టండి. అక్కణ్ణించి ఆటో రిక్షాలో వెళ్లిపోతాను“ 


అప్పుడతను స్కూటర్ ని సమీపిస్తూ అన్నాడు- “ఏం- ఎందుకని? మీ వీధి కొనవరకూ వచ్చి దిగబెడ్తాను. సరేనా! “


“వద్దు శంకరం. మన స్నేహం ఒక పక్వానికి వచ్చేంత వరకూ మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మా అన్నయ్యకేమో, మా పెదనాన్న, అమెరికాలో ఉంటున్న వాళ్ల చిన్ననాటి స్నేహితుడి కూతురి సంబంధం చూస్తున్నారు. దాదాపు ఖాయం ఐపోయినట్లే! వాడు ట్రైనింగు కోసమని అమెరికా వెళ్ళినప్పట్నించీ ఈ అమెరికా పెళ్ళి సంబంధం సంగతి ఊపందుకుంది. ఇక తాంబూలాలు మార్చుకోవడమే మిగిలింది. 


ఈ హడావిడిలో మన వ్యవహారం బైటకు పొక్కితే మొత్తమూ బెడిసి కొట్టవచ్చు. ఇప్పటికి యెంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా మన స్నేహాన్ని పంచుకుంటే-- అంత మంచిది. అది సరేగాని- మీ మేడమ్ గారికి ఒంట్లో బాగాలేదు. తెలుసా! “


అతడు కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు- “నాకు తెలియదు. ఈ మధ్య యాన్వల్ అకౌంట్సు పూర్తి చేయడంలో మునిగిపోయానేమో— గమనించలేదు. ఏమైంది మాధవీ?”


“కారణం చెప్పలేను. పరీక్షలు జరుపుతున్నారు. ఎందుకో మరి- ఇటీవల మిక్కిలి భావావేశానికి లోనవుతూంది. మంచికో చెడుకో - కొందరు ఎక్కువగా ఫీలవుతుంటారు శంకరం. అవసరం ఉన్నా లేకపోయినా గతంలోకి వెళ్ళిపోయి మూడీగా తయారవుతుం టారు. నోస్టల్జాకి లోనవుతుంటారు. ఆలోచించి చూస్తే మీ మేడమ్ గారు ఆ కోవకు చెందినవారనే నాకు తోస్తూంది“


“రెండు మూడురోజులుగా చూడలేదనుకుంటాను. మరి రేపు స్కూలుకి మేడమ్ రారా?”అతడి గొంతున తీవ్రమైన ఆదుర్దా ధ్వనించడం ఆమెకు వినిపించింది. ”ఏమో చెప్పలేను. కొన్ని రోజులవరకూ రారేమో! మీరు కంగారు పడకండి శంకరం సీరియస్ వ్యవహారమేదీ కాదులే. మానాన్నగారు ప్రక్కనున్నారుగా! ఆయన డాక్టరేగా! “


అతడు తలూపి— ఆమెను స్కూటర్ పైన లిబర్టీ వద్ద దిగబెట్టి వెనుదిరిగాడు. 


వర్థనమ్మగారికి ఆరోగ్యం సరిగా లేదన్న వార్త అతడిలో ఆందోళనా అలల్ని రేపుతున్నాయి. 

వాడలోకి స్కూటర్ని తిప్పుతూ అక్కడ ఆగాడు. పోలేరమ్మ గుడి ముందు నిల్చుని వర్థనమ్మగారు త్వరలో కోలుకోవా లని మనసార మొక్కుకున్నాడు. వర్థనమ్మ వంటి ఔన్నత్య గుణ సంపద గల వ్యక్తి తను పని చేసే బడి భవనంలో లేకుండా ఉండటమన్న తలంపుని అతడు భరించలేకున్నాడు. 


మనసున సర్దుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు- తను మరీ అనవసరంగా ఆందోళనచెందుతున్నాడేమో! కాస్తంత విశ్రాంతి తీసుకుంటే సరిపోదూ! అసలామాటకు వస్తే ఆమెగారెప్పుడని తన కళ్ళకు రోగిష్ఠిలా కనిపించిందని?ఎంత ఠీవి గా ఎంత హుందాగా ఉంటారని. ఇప్పటి యవ్వన స్త్రీలు కూడా మేడమ్ గారిలా ఉండరేమో! మాతంగ దేవి ముఖ వర్చస్సుకదూ! 

=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





 
 
 

Comments


bottom of page