#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 19 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 19/03/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 19 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. మోహన పట్ల తనకు ఇష్టం కలిగినట్లు చెబుతాడు షేక్ అహ్మద్.
వర్ధనమ్మ గారి ఆరోగ్యం సరిగ్గా లేనట్లు శంకరంతో చెబుతుంది మాధవి.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 19 చదవండి..
ఆనాడు శంకరం మాధవీ కలసి పకడ్బందీగా తీర్మానించుకున్నట్టు విషయం నిదానంగా ముందుకు సాగలేదు. అసలీ ప్రపంచంలో ఏది మాత్రం ఎంతకాలమని దాగుతుంది? ఇద్దరూ కలసి వెళ్ళడం, అప్పుడప్పుడు కలసి భోంచేయడం, ఇద్దరూ ముచ్చట్లాడుతూ పార్కులో కనిపించడం వంటివన్నీ డాక్టర్ నరసింహులు గారి చెవిన పడ్డాయి; కొన్ని తన మిత్రుల ద్వారాను, మరి కొన్నేమో ఇరుగు పొరుగున నివసిస్తున్నవాళ్ల ద్వారానూ--
అవి గాలి వార్తలు కావచ్చని, వాటిని ఆరాతీయకుండా ఒక అభిప్రాయానికి రాకుడదనుకుంటూ అతడు స్పందించ లేదు. కాని అదే సమయంలో వాటిని అతడు తోసి పుచ్చనూలేదు. ఎందుకంటే ఆ మధ్య భార్య చెప్పిందిగా- పెళ్ళీడుకొచ్చిన కూతురిలో నిగూఢమైన మార్పేదో కనిపిస్తూందని.
మొదట— సమయం చూసి నీరసించి మంచాన సేద తీర్చుకుంటూన్న భార్య చెవిన వేసాడు తను విన్నదంతా. భర్త చెప్పింది విని ఆమె ఆశ్చర్యపడలేదు. అదే సమయంలో ఆందోళన చెందకుండా ఉండలేక పోయింది. మంచికో చెడుకో ఆమె అలా జరుగుతుందని ముందే ఊహించింది. కూతురు క్లోజ్ గా కలసి మెలసి కబుర్లాడుతూన్నఆ అబ్బాయెవరో ఆమెకు ముందే తెలుసు కదా! దూర దూరంగా తిరుగుతూన్న బొంగరం తన వద్దకు ఎప్పుడు వచ్చి ఆగుతుందన్నదే ఆమె ఎదురు చూపు.
అంచేత— ఆమె భర్తను ఆందోళనకు గురికానవసరం లేదని, అవసరం వస్తే మాధవే స్వయంగా వచ్చి తమ వద్ద ఆ ప్రస్తా వన తెస్తుందని, కూతురుది స్వఛ్ఛదనం గల వ్యక్తిత్వం కాబట్టి- జంకుతో బెరుకుతో ముడుచుకుపోయే పెళుసు స్వభావం ఆ పిల్లకు లేదని భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని భరోసా ఇచ్చింది.
ఇంగితమూ ప్రాపంచిక అనుభవమూ గల నరసింహులు అదే అదనుగా భార్య మనసు పొరల్ని సుతారంగా కదప డానికి పూనుకున్నాడు. భార్య ప్రక్కన కుదురుగా కూర్చుని ఆరంభించాడు- “వయసు మీదకొచ్చి స్త్వైర విహారం చేస్తున్నప్పుడు – ఎవరైనా సరే కాస్తో కూస్తో నీరసానికి నిస్సత్తువకి లోను కావడం సహజం వర్థనం! కాని నిన్ను అందరి స్త్రీలతో పోల్చలేను. నువ్వు అలర్టుగా ఉంటావన్నది నాకు తెలుసు. నడుస్తున్నప్పుడు గాని కూర్చున్నప్పుడు గాని నీవు నిటారుగా నిండుగా ఉంటావు. చీకటిని దరికి చేరనివ్వని మెరుపు తీగెలా కదుల్తూ నువ్వు ఎప్పుడూ మందకొడితనాన్ని దగ్గరకు చేరనివ్వవు.
ఇప్పటికీ నీలోని యవ్వన సొబగుల్ని నాకు గుర్తు చేస్తుంటావు. మరెందుకిలా నీకు నువ్వుగా నీరస పడిపోతున్నావో నాకు అర్థమే కావడం లేదు. ఇప్పటికిప్పటి మాట- కూతురి వ్యవహారం విన్నతర వాత కూడా నువ్వు నిబ్బరంగా ఉండగలిగావు. ఇది చాలా మందికి సాధ్యం కాదు. నువ్విలా నీకు నీవుగా నీరసించి తీసిపోయినట్టుంటే నాకెలా ఉంటుందో ఆలోచించావా! ”
సాధ్యమైనంత మేర ఉద్వేగాన్ని దరిచేర నివ్వని భర్త అలా మాట్లాడటం చూసి వర్థనమ్మ రవంత కలత పడుతూనే నవ్వింది. నవ్వుతూనే నరసింహులు చేతిని తన చేతిలోకి తీసుకుని బిగించింది. “ఏం చెప్పను? ఎలా చెప్పను- అన్న సందిగ్ధావ స్థలో పడి కొన్నాళ్ళుగా కొట్టుమిట్టాడుతున్నాను. ఈ రోజు మీరే ఆపద్భాంధవుడిలా ఎదురు వచ్చి నిలిచారు. కళ్ళల్లో కళ్లు పెట్టి అడిగారు. చెప్తాను. మీకు మాత్రమే చెప్తాను. కాని మీకు బోర్ కొట్తుందేమో!”
అంటే- అన్నట్టు చూసాడతను.
“ఇది మరీ అల్పవిష యంగా గోచరిస్తుందేమో! ”
“భలేదానివే! నాతో ముప్పై సంవత్సరాలకు పైగా సంసారం చేసిన స్త్రీ మాట నాకు అల్పవిషయంగా గోచరిస్తుందా? అలానే అనుకో- మరి నాతో కాక మరెవ్వరితో మనసు విప్పి మాట్లాడతావో చెప్పు!”
ఆ మాటకు ఆమె కళ్లలో కన్నీరు ఉబికింది. నిదానంగా చూస్తూ అంది- “ఈ మధ్య ఎందుకో నాకే తెలియదు— విపరీతంగా నోస్టాల్జియాకి లోనువుతున్నానండీ! ”
“నాస్టాల్జియా నీకే కాదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉంటుందోయ్. అందర్నీ ఏదో ఒక దశన వెన్నంటి వస్తుందోయ్. అందుగలడిందు లేడన్న సందేహమే వలదు- అన్నట్టు మనసునీ మనిషినీ ఏదో ఒక దశన తాకేతీరుతుంది. నువ్వు నడుస్తూ పోతుంటే నీ నీడ నీపైన పడకుండా ఇంకెవరిపైన పడుతుందీ! నన్నడిగిత నాకు తోస్తూంది నీకు నాస్టాల్జియా మాత్రమే కాదు, ఇంకేదో బాధ నిన్ను మెల్ల మెల్లగా నలిపేయ నారంభించింది. ఔనా! ”
“మీరన్నట్టు నన్నేదైనా బాధ నలిపి వేస్తున్నా బాగున్నేమోనండీ! కాని అది కూడా కాదేమోనండీ! ఏది తలచుకున్నా విపరీత మైన ఆవేశం కలుగుతోంది. అదే సమయాన మరోవేపు మాటలతో చెప్పలేని అనంతమైన ఆనందం లోలోన పెల్లుబుకుతూంది.
అప్పటి విషయాలను, చిన్న చిన్న విషయాలను కూడా తలచుకుంటూ తరంగమంతటి సంతోషంలో మునిగి పోతుంటాను. ఎంతటి సంతోషమంటే నాకు నేనుగా అలసిపోతుంటాను కూడాను. మళ్ళీ ఆ ఆనందం- అప్పటి భావావేశం మళ్ళీ నాదరి చేరదు కదా- అన్న ఆలోచన సోకినప్పుడు నిరాశతో నిట్టూర్పు విడుస్తూ క్రుంగి పోతుంటాను. నేనెందుకలా తీవ్రంగా ఆలోచిస్తున్నానో- ఎందుకలా తలక్రిందులుగా తయారవుతున్నానో నాకే తెలియడం లేదు”
ఈసారి నరసింహులు స్పందించలేదు. సంభాషణకి విరామం ఇస్తూ ఊరుకున్నాడు. భార్య మనసుని మౌన నివేదనతో అర్థం చేసుకోవడానికి పూనుకున్నాడు. ఒక వయసుకి చేరింతర్వాత చాలా మంది కొన్ని రకాల మానసికోద్రేకాలకు లోనవు తుంటారు. గతంలో పదే పదే తప్పులు చేస్తూ- కుప్పలుగా తప్పిదాలకు పాల్పడుతూ ఉన్నవారు ఏదో ఒక దశన అంతా చల్లారి న తరవాత విషాదమయ మానసిక స్థితికి లోనవుతారు. ఎంత వద్దనుకున్నా దాని ప్రభావం నుండి తప్పుకోలేరు. ఇక మరికొందరున్నారు.
జీవితంలో చెప్పుకోదగ్గ గుర్తుంచుకోదగ్గ తప్పిదాలకు పాల్పడనివారు. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా చింతించనవసరమే లేని వారు. తెలియనితనంతో తెలియక చేసిన తప్పిదాలకు సహితం మిక్కిలి పశ్చాత్తాప్ప పడే మృదు స్వభావులు. అవసరం ఉన్నా లేకపోయినా జ్ఞాపకాల మేఘాల్లోకి దూసుకువెళ్ళి అవి అందించే అనిర్వచనీయమైన బాధను తాముగా కొనితెచ్చుకుని అనుభవించేవారు. తన భార్య ఈ కోవకు చెందినదనే అతడికి తోచనారంభించింది.
తన ఆలోచనలను కుదుటపర్చుకుంటూ డాక్టర్ నరసింహులు భార్య చేతిని ప్రేమగా నిమురుతూ- నవ్వుతూ అన్నాడు-
“నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందే నా అంతటి అదృష్టవంతులుంటారు వర్థనం. నీ వంటి సహచరి లభించడం నా పూర్వజన్మ సుకృతం. ఎలాగూ మనసు పొరల్ని విప్పావు కాబట్టి తడబడకుండా పూర్తిగా విప్పార్చి చెప్పు. ఏ వయసులోని విషయాలు నీకు తెరలు తెరలుగా ఉద్వేగపూరిత జ్ఞాపకాలుగా వచ్చి నిన్ను ముప్పిరి గొంటున్నాయి? ”
“మీది చాలా చక్కటి అవగాహనండీ! మొదటిది- మా అత్తగారిని తలచుకుంటే గుండె తరుక్కుపోతుంటుందండి. ఎంత మంచావి డామె! మా అమ్మకంటే మంచిది. నేనేదైనా పొరపాటు చేస్తే మీరూ బావగారూ విసుక్కుంటారని దానిని తన నెత్తిన వేసుకునేది. లేదా పెద్ద కోడలి నెత్తిన వేసేది. అటువంటి స్త్రీమూర్తి ఆలనా పాలనా ఆమె చివరి దశలో సరిగ్గా చూడలేక పోయానేమోనన్న వ్యాకులత నన్ను వాటేసుకుంటుందండి “
“నీ దిగులుకి కారణమూ లేదు- అందులో రవంత సహేతుకతా లేదు. ఎందుకంటే నువ్వెదుర్కునే వాటిని హౌంటింగ్ మిమోరీస్ అనను. కారణం- హౌంటింగ్ మిమోరీస్ లో నెగటివ్ షేడ్సు వంటివి ఉండవచ్చు. ఇప్పుడు నీలో కనిపిస్తూన్న మిమోరీస్ ఆరోగ్యప్ర దమైనవి. ఆర్ద్రతతో కూడుకున్నవి. ఇక విషయానికి వస్తాను. మా అమ్మ నిన్ను కన్నకూతురులా చూసుకున్నమాట వాస్తవం. కాని నువ్వు మా అమ్మను సరిగ్గా చూసుకోలేదన్నది సత్యం కాదు. ఎలాగంటే— మా అమ్మ ఎప్పూడూ పై పోర్షన్ లో మా అన్నా వదినల వద్దే ఉండేది. ఆరోగ్యం కాస్తంత సహకరించినప్పుడు మాత్రమే మన క్రింది పోర్షన్కి వచ్చి మనతో గడిపేది. మనవడితో మనవరాలితో ముచ్చట్లాడి వెళ్ళేది. ఇంకా నయం- ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి గుర్తుకు వచ్చి చెప్పగలగుతున్నాను. అది సరే— మా అమ్మ ఎందుకని చివరి వరకూ మా అన్నవద్ద ఉందో గ్రహించావా! ”
తల అడ్డంగా ఆడించిందామె.
అతడు కొసాగించాడు- “మా అమ్మ చూపులో అన్నయ్య నష్ట జాతకుడు. బిడ్డాపాపా లేని వాడు. రేపు గాని ఏదైనా జరిగితే పున్నామి నరకం నుండి బైట పడలేని వాడు. అంచేత అన్నయ్య వేపు మొగ్గు చూపుతూ ఉండేది. తల్లి ప్రేమ అటువంటిది మరి. ఇక రెండవదేదో ఉందన్నావుగా- అదేమిటో చెప్పు? ” అంటూ భార్య ముఖంలోకి చూసాడతను.
“చెప్తే నవ్వరు కదా! “
“ఏమిటోయ్ ఎప్పుడూ లేని సందేహం? ఈ వయసులో- అందునా సీరియస్ వ్యవహారం చర్చిస్తున్నప్పుడు ఆటలాటా? “
వర్థనమ్మ జంకుతూ జంకుతూ— పదాలు జాగ్రత్తగా కూర్చుకుంటూ ఇలా అంది- “నాకు నా చిన్ననాటి విషయాలు- ముఖ్యంగా నా యుక్తవయసులో జరిగినవి ముమ్మరంగా గుర్తుకి వస్తున్నావండీ. నన్ను మరీ ఊపిరి సలపనీయనంతగా ముప్పిరి గొనే విషయం- నేను కొత్తగా మీతో కాపురం చేయడానికి వచ్చిన రోజులు. ఎంత వద్దనుకున్నా— ఆ రోజులు నన్ను కట్టి పడేస్తు న్నాయండీ!
ఆ మృదు మధురమైన రోజులు మళ్లీ రావన్న తలంపు సోకిన వెంటనే నాకెంత దిగులు పుట్టుకొస్తుందంటే— మరి కొన్నాళ్లకు మీకు సహితం దూరమైపోతానన్న ఆలోచన నాలో ఆరని జ్వాలలా లేస్తుందండి. నాకప్పుడు వెంటనే కళ్లు మూసు కోవాలని, మీ ఒడిలో తలపెట్టుకొని పైలోకాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంటుందండి.”
నరసింహులు దిమ్మెరపోయినట్టు చూసాడు. చూస్తూనే అడిగాడు- “ఎందుకూ!”
“అప్పుడే కదా త్వరగా మరొక జన్మ ఎత్తి మిమ్మల్ని మళ్ళీ పెళ్ళిచేసుకుని కాపురానికి రాగలను. సగం తెలిసే సగం తెలియని వంటా వార్పుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలను”
ఈసారి నరసింహులు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతడికి తెలియకుండానే రెండు కళ్లూ చెమ్మగిల్లాయి “సారీ! ఎందుకంటే నేనింత వరకూ నవ్వుతూ మాట్లాడు తున్నందుకు. కాని ఉన్నదున్నట్లు చెప్తే నీ ఆలోచనలో నీ ఊహా గానం లో ఏ మాత్రమూ న్యాయం లేదు. ఎందుకంటే- మనకు మరొక జన్మ అంటూ ఒకటుంటే—మనం మళ్లీ మరుసటి జన్మల్లో భార్యాభర్తలం అయే అవకాశానికి తావుగాని ఉంటే- ముందు నేను కదూ కళ్ళు మూయాలి.
అప్పుడే కదా- నేను పుట్టగలను—ఆ తరవాతనే కదా-- తగినంత వయసు తేడాతో నువ్వు పుడ్తావు. కాబట్టి నీ ఆలోచనలో హృదయావేగం ఉంది గాని—నిదానమూ నెమ్మదత్వమూ లేదు. ఇక అసలు విషయానికి వచ్చేదా వర్థనం! ”
ఉఁ- అంటూ ఆమె భర్త రెండు చేతుల్నీ తన గుండెల పైన ఉంచుకుంది.
“ఇది జీవితం. టీ వీ ఛానెల్సులో అక్కడక్కడ చూపిస్తూన్న రియల్టీ షో కాదు. మానవ జీవితం ఎప్పుడూ మన అందుబాటులో- మన అదుపులో ఉండదు. ఎందుకంటే- మనం అనుకున్నదీ మనం ఆశించినదీ వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చు. నిన్ను చూస్తుంటే నాకొక దారిన పోయే దానయ్య గుర్తుకు వస్తున్నాడు. ఒక వీధిన ఉన్న చెట్ల సందున వెళ్తూ విపరీతంగా గొణికాడట- ‘అంతా చీకటే! గుప్పెడంత వెలుగు కూడా లేదు’ అని.
అప్పుడు అదే దారిన పోతూన్న రైతు బలులిచ్చాడట- ‘అదేంవిటి స్వామీ! మీరేమిటి కళ్లు లేని కబోదా? అటు తలెత్తి చూడు. ఆకాశమంతా వెలుగే! ఇంకెంత వెలుగు కావాలి స్వామీ మీకు?’ అని నిలదీసాడట.
అప్పుడు గాని ఆ దారిన పోయే దానయ్యకు వెలుగు కనిపించలేదట. అలా ఉంది నీ వ్యవహారం! కొడుకేమో సెంట్రల్ గవర్నమెంటు ఆఫీసరవగలిగాడు. ర్యాంకుతో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావటాన మూడు సంవత్సరాల లోపునే అమెరికాకి ట్రైనింగు పూర్తి చేయడానికి వెళ్ళగలిగాడు. అక్కడ కూడా వాణ్ణి అదృష్టం తరుముకుంటూ వెళ్లింది.
ఒక పెద్దింటి సంబంధం నీ కొడుకుని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ సంబంధాన్ని ఖాయం చేయడానికి మనం అమెరికా వరకూ వెళ్ళ వలసి రావచ్చు. ఆ ఒక్క దానితో మనింటి శుభకార్యం ఆగిపోతుందా? లేదు. వధూవరులిద్దరికీ తిరుపతిలో పెళ్ళి జరగాల్సుంది.
ఈ లోపల కూతురుకి సంబంధం చూడవలసి ఉంది- మరి ఇంతలోనే అంతా ముగిసిపోయిందని చెప్తూ ముసుగేసుకోవాలను కుంటున్నావా! అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్- నీదారిన నువ్వు మంచాన పడితే మరి నన్నెవరు చూసుకుంటారు? ముప్పై సంవత్సరాల మన వివాహబంధం సంగతి అంతేనా! ”వర్థనమ్మ నవ్వి భర్తను దగ్గరకు జరగమని సైగ చేసి నుదుట మృదువుగా ముద్దు పెట్టుకుంది.
----------------------------------------
నార్త్ కరోలినా ప్రాంతమంతా రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా మంచుకురిసింది. నలువైపులా తెల్లటి మెత్తటి మంచు పేరుకుపోయింది. వేక్ కౌంటీ ప్రాంతంలోని దారులన్నీ శ్వేతరాశితో కప్పబడ్డాయి. ఎట్టకేలకు నరసింహమూర్తి చిరకాల వాంఛ నెర వేరింది. షేక్ అహ్మద్ తో హాస్టల్ ఆవరణలోకి వెళ్లి రెండు చేతులా మంచుముద్దుల్ని పేర్చుకుని- అరిచేతులు రెండూ చురుక్కు మనేంత వరకూ బంతిపువ్వుల్లా వాటితో ఆడుకున్నాడు. కేరింతలు కొడ్తూ షేక్ అహ్మద్ పైన మంచుముద్దల్ని విసిరాడు.
ఐతే—మంచు తాజాగా ఉన్నప్పుడే మెత్తగా ముద్దగా ఉంటుంది. పాతబడ్డ తరవాత గడ్డలా చివరికి గ్లేసియర్ గా కూడా మారిపోతుంది. దాని పైన కాలుపెట్టి నడవడానికి ప్రయత్నిస్తే దొర్లి దేకుతూ పడిపోవడమే! ఆ పైన దారి సుగమం చేయడానికి స్నో క్లియరింగ్ రాక్షస యంత్రాలు రావసిందే! కాస్తంత అలక్ష్యంగా డ్రైవ్ చేస్తే ప్రమాదాలు కొని తెచ్చుకోవలసిందే! ఎందుకంటే- అమెరికాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవించేది ఇటు వంటి మంచుకురిసే కాలంలోనే- మసక వెలుతురులోనే--
అతడు మంచుతో తనివిదీర ఆడుకుని ఆ తరవాత గది చేరుకుని స్నానం చేసి క్రిందకు బయల్దేరడానికి సిధ్ధమవుతు న్నప్పుడు, ఇంటర్ కామ్ ద్వారా కబురొచ్చింది;తన కోసం రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎవరో విజిటర్ వెయిట్ చేస్తున్నాడని. అతడు త్వరగా డ్రెస్సెప్పయి మరచి పోకుండా స్వెట్టర్తో బాటు, నీ- లెంత్ కోటు వేసుకుని షేక్ అహ్మద్ వద్దకు వచ్చాడు- “నేనిప్పుడొక ఫం క్షన్ కి వెళ్ళబోతున్నాను. మీరు కూడా వస్తే బాగుంటుంది. కాని అది లోకల్ ఇండియన్స్ కి మాత్రమే ఉద్దేశించబడ్డ ఫంక్షన్-”
“వేక్ కౌంటీలోని ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్ అనుకుంటాను“
అంతావిన్న అహ్మద్ ఇటీజ్ ఓకే— అండ్ ఇంటరెస్టింగ్ టూ—”
అప్పుడు నరసింహమూర్తి కొనసాగించాడు- “ఔను. నిజం చెప్పాలంటే వాళ్ళెవరూ నాకు ఇన్విటేషన్ యివ్వలేదు. శ్రీరామ్ గారి ఆధ్వర్యాన వెళ్తున్నాను. ఒంటరిగా ఉండకుండా అలా మన సహాధ్యాయుల్ని కలుసుకుని రా! బాయ్!” అంటూ మేడ మెట్లు దిగాడు.
రిసప్షన్ కౌంటర్ వద్ద అతడికి సుజాత తమ్ముడు రామ్ మోహన్ రాబర్ట్ కనిపించాడు. కరచాలనం చేసి కారు వేపు నడు స్తూ నరసింహమూర్తి అడిగాడు- “మీరొక్కరే వచ్చారా? ”.
రామ్ మోహన్ కదలి అతడికి తలుపు తెరచి ఆ తరవాత తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అన్నాడు నవ్వుతూ- “అదేంవిటి బావగారూ నన్ను పెద్దమనిషిని చేసి మీరూ వారూ అని సంబోధిస్తున్నారూ! ఊరకే రాబర్ట్ అనండి లేదా మోహన్ అనండి“
“అలాగే. కాని నువ్వు నా ప్రశ్నకు బదులిచ్చావు కావు. ఫంక్షన్ నిర్వాహకులలో మీఅక్కలిద్దరూ ఉన్నారు కదా! అందుకు అడు గుతున్నాను”
అప్పుడు కారు స్టార్ట్ చేస్తూ బదులిచ్చాడు మోహన్- “మీరెందుకు అడుగుతున్నారు- ఎవర్ని ఉద్దేశించి అడుగు తున్నారో గ్రహించాను బావగారూ! మాపెద్దక్క తప్ప ఇంకెవరూ మిమ్మల్ని పికప్ చేయకూడదని ఆంక్షలు విధించారా యేమిటి”
“భలే జోక్ వేస్తున్నావయ్యా బామ్మర్దీ! ఇంతకూ మీ పెద్దక్కయ్య ఎక్కడుందిప్పుడు? ”
“హాఁ! అలా రండి దారికి. మీరు సుజాత అక్కయ్యను చూడాలి. అంతేకదూ! నాతో రండి“
“ఎక్కడికి? మంచుగుట్టల్లోకా! ”
“మంచు కదానని తీసిపారేయకండి బావగారూ! ఇటువంటి మంచుకురిసే సమయంలో కారు తోలడమంటే సింగల్ ఇంజన్ తో వార్ ప్లేను తోలడమన్నమాట! డ్రైవింగ్ సామర్థ్యం చాలా కావాలి. మొన్న ఒకే ఒక రోజున కురిసిన మంచుకి ఎన్ని కారు యాక్సి డెంట్లు సంభవించాయో తెలుసా? నాలుగు వందల ఎనభై ఆరు. కొంచెం అజాగ్రత్తగా మలుపు తిప్పామనుకో—యిక అంతే సంగ తులు- కారు స్కిడ్ అయిపోయి బోల్తా పడుతుంది”
రామ్ మోహన్ వేపు చూస్తూ అనుకున్నాడు నరసింహమూర్తి- ఇదంతా ఎవరడిగాడని? మొత్తానికి రంకు మొగుడిలా తగుల్కున్నాడు మోహన్ రాబర్ట్.
“డిస్సప్పాయింట్ అయారా బావగారూ!”
నరసింహ మూర్తి పెళుసైన నవ్వొకటి విసిరి ఊరకున్నాడు. ఈ కొంటె గాడితో ఎంతసేపని మాటలు కలుపుతూ ఉండగలడు?
ఈసారి రామ్ మోహన్ దారికి వచ్చాడు- “ఇక విషయానికి వస్తాను బావగారూ! మనమిప్పుడు తిన్నగా వెళ్లేది కౌంటీ ఇండియన్ ఫంక్షన్ కే. కాని అక్కడ మీకు మా అక్కయ్య కనిపించదు”
ఎందుకూ- అన్నట్టు చూసాడు నరసింహమూర్తి.
“ఎందు కంటే- తెరవెనుక మూల సూత్రధారి అదే! కాలిఫోర్నియా నుండి- వాషింగ్టన్ నుండి- న్యుజెర్సీనుండి చాలా మంది తెలుగు వాళ్లకు సంబంధించిన తెలుగు భాషా ఫౌండేషన్- తెలుగు సాంస్కృతిక సంఘం’ వాళ్లందరూ అక్కయ్య చుట్టూ తిరుగుతుంటారు. అంతే కాదు- వేదిక పైకి వచ్చేవాళ్ళందరకూ అక్కయ్యే మిమిక్రీ కార్యక్రమాల నుండి పాటల ప్రోగ్రాము వరకూ ప్రాక్టీసు ఇప్పిస్తుంది“
అలాగా అన్నట్టు తలూపుతూ ఉండిపోయాడు నరసింహమూర్తి. ఇక్కడి తెలుగు వాళ్ళకు సుజాత మేడమ్ ముఖ్య ప్రతినిధి అన్నమాట!
కారు ఫంక్షన్ హాలు ముందాగింది. తనను చూసి మోహన ఎదురువచ్చి తీసుకెళ్లింది- “మీ కళ్ళెందుకో చక్రాల్లా తిరుగుతు న్నట్లున్నాయి బావగారూ! ”
నరసింహమూర్తి కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు. దిగీ దిగిన వెంటనే వింటినారి లాగి బాణం సంధించండమంటే ఇదేకదూ!
“తెలుసు కదా! మరి అడగడం దేనికి? ”అంటూ నవ్వుతూ టిట్ ఫర్ టేట్ ఇచ్చి సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
కూర్చున్న తరవాత ఓపారి చుట్టూ కలయచూసాడు నరసింహమూర్తి. నిర్వాహకులు తెలుగు వాళ్లయినా అక్కడి వాతావరణమంతా నిండైన అఖిల భారతాన్ని గుర్తుకు తెస్తూంది. గుజరాతీలు గుజరాతీ తీరులో— పంజాబీలు పంజాబీ తీరులో- అస్సామీలు అస్సామీ తీరులో- దక్షి ణ భారతీయులు పట్టుచీరల్లో- మొత్తానికి అందరూ భారతీయ సాంప్రదాయ తీరులో కనిపించి పండగ కళతో మండపాన్ని గోదా వరి ప్రవాహ జోరులా-- హోరు మనిపిస్తున్నారు.
చిన్న చిన్న పిల్లలు కూడా అదే రీతిలో రావడం చూసి అతడికి ఆశ్చర్యంతో బాటు ఆనందం ముప్పిరిగొంది. మొత్తానికి అక్కడ అతడికొక చిన్నపాటి భారతదేశమే కనిపించిందనాలి. కళ్లు విప్పార్చి కలయ జూసాడు. తెలుగు చక్కదనం ఉట్టి పడుతూంది. బుటాల జాకెట్లు. రెపరెపలాడే పట్టు పరికిణీలు. ఎగిరే బంగారు అంచుల షిఫాన్ ఓణీలు. చెవులకు వయ్యారంగా ఊగే జూకాలు. నలువైపులా విరిసి మెరిసే యవ్వన సొగసులు. వికసిత వసంత వనాల శోభలు.
ఈ పండగ వాతావరణం వెనుకు మరొక కారణం కూడా ఉండవచ్చేమో! తను రాత్రి టీవీలో చూసాడు- సౌత్ కరోలినాకి భా రతీయ సంతతికి చెందిన ఒక మహిళామణి గవర్నర్ గా ఎన్నికైనట్టు. నిజంగా గొప్పవిషయమే మరి. ఆ ఊపు చాలా మంది ముఖాలలో కనిపిస్తున్నట్లనిపించిందతనికి.
సుజాత కళా బృందం వారు ప్రదర్శన బాగా చేసారు. భారతీయ నృత్యాలతో బాటు అక్కడక్కడ కొన్ని పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అంతా ఐపోతుందనుకుంటూన్న సమయంలో అకస్తాత్తుగా లౌడ్ స్పీకర్ లో వార్త వెలువడింది. ఆ ప్రకటన విని అతను ఖంగుతిన్నాడు.
“ఇక్కడకు భారత ప్రభుత్వం వారి తరపున అధికార పూర్వక శిక్షణ కోసం వచ్చిన ఇండియన్ సెంట్రల్ రెవన్యూ ఆఫీసరు మిస్టర్ నరసింహమూర్తిగారికి వేదిక పైకి వచ్చి ఐదు నిమిషాలు మాట్డాడి వెళ్తారని ఆశిస్తున్నాం“
అతడికి ఉన్నపాటు నట్టేట కాలు జారినట్లయింది. బహుదూరపు బాటసారైన తనకిక్కడి పరిస్థితుల గురించి యేమి తెలుసని? నోరు జారి ఏదైనా అవక తవకగా మాట్లాడితే— అకారణంగా అభాసు పాలుకాడూ!
అతడు వేదికపైకి ఎక్కి స్పీకర్ అందుకున్నాడు. అప్పటికతడికి ఆహ్వానాన్ని స్వీకరించడం తప్ప వేరిదారి కనిపించలేదు.
మొదట తనకు అవకాశం ఇచ్చినందుకు సభా నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పి ఆరంభించాడు- “మీరు ఇక్కడి కార్య క్రమం చాలా బాగా చేసారు. ఎంతబాగా చేసారంటే- మేము మా ఊళ్ళో ఇంత పకడ్బందీగా చేయగలమా అన్నంతగా-- నిర్వాహకు లందరికీ కార్య క్రమాలలో తదితర రంగాలలో పాలు పంచుకున్నవారందరికీ అభినందనలు. ఐతే నేనొకటి సూటిగా చెప్పవలసి ఉంది. స్వీకరించడమూ స్వీకరించకపోవడమూ మీ ఇష్టం.
మనమిక్కడి వాళ్లతో మనుగడ చేస్తున్నాం. ఏం- ఇక్కడ కొందరు మన వాళ్లు వాళ్ళ భవిష్యత్తుని సహితం ఇక్కడి ప్రాంతీయ వాసులతో పెనవేసుకుని పంచుకోబోతున్నారు. ఇది గ్రీన్ కార్డు హోల్డర్సుకి మాత్రమే కాక అందరికీ వర్తిస్తుంది. ఇక విషయానికి వస్తాను-- వాళ్ళకి మన కార్యక్రమాలు అర్థం అవుతాయా లేదా అన్నది కాదు ప్రసక్తి. ఇక్కడి వాళ్ళను అక్కడక్కడ మొక్కుబడిగా పిలిచి కూర్చోబెట్టడం కాదు అసలు ప్రసక్తి. వాళ్ళను- అంటే- ఇక్కడి నగర ప్రముఖుల్ని సామాజిక కార్యకర్తలను- కౌంటీ అధికారుల్ని- విద్యావేత్తలను కుటుంబ సమేతంగా ఆహ్వానించి వేదికపైకి పిలిచి అగ్రాసనం ఇచ్చి గౌరవించడం మనకర్తవ్యం. ఇకపైన ఇలా చేస్తారని ఆశిస్తూ నాచిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను” అంటూ అతడు వేదిక దిగాడు.
కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన మండపం చటుక్కున మేల్కొన్నట్టు కరతాళ ధ్వనులతో మిన్నుముట్టింది. అతడు తన సీట్లోకి వెళ్ళి కూర్చోక ముందే మోహన వచ్చి రెండు చేతులూ అందిపుచ్చుకుంది- “సారీ బావగారూ! మిమ్మల్నింత వరకూ మామూలు ఇండియన్ అనుకున్నాను. యు ఆర్ రియల్లీ ఎ డైనామిక్ ఇండియన్ పర్సనాలిటీ! “
ఆ లోపల ఇంకొందరు కూడా వచ్చి అతడికి అభినందనలు తెలిపి వెళ్లారు. అతడక్కడ ఎక్కువ సేపు కూర్చోకుండా వేదిక వెనుక ఉన్న గ్రీన్ రూము వేపు నడిచాడు. అతడూహించినట్టే సుజాత అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ”నా ప్రసంగం బాగుందా - నీకు నచ్చిందా! ”
సుజాత ఏమీ అనలేదు. మౌనంగా అతడికి ఎదురొచ్చి- ‘ఉష్‘ అంటూ అతణ్ణి చేయి పట్టుకుని లోపలకు తీసుకెళ్లి గాఢంగా ముద్దు పెట్టుకుంది. అతడు ప్రేమగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ”నిజం చెప్తున్నాను సుజా! ఈ ఎర్రటి కాంచీ పురం పట్టుచీరలో లక్ష్మీదేవిలా వెలిగి పోతున్నావు”
”నాకెంత సంతోషంగా ఉందంటే- ఈరోజే నా పెళ్ళి మూహూర్తంలా ఉంది మూర్తీ!” అతడికి మరింతగా హత్తుకుపోతూ అందామె.
“ఇప్పుడు నేనొక మాట చెప్పేదా! ”- నరసింహమూర్తి.
“చెప్పారుగా మీ చక్కటి దేహభాషతో! ”
“నేను చెప్పబోయేది మరొకటి. నీ పెదవుల గరించి.”
“ఉఁ- అందామె అరమోడ్పు కళ్ళతో చూస్తూ.
“నీవి వంపు తిరిగిన పెదవులు. తెలుసా! ”
మళ్లీ- ఉఁ- అందామె.
“ఇటువంటి పెదవులున్న స్త్రీ— కాస్మోటిక్ సైకలాజిస్టుల వివరణ ప్రకారం- ఊహాలోకంలో ఎక్కువగా విహారం చేస్తారు. ఎదుటి వారి పట్ల ఎక్కువగా శ్రధ్ద చూపిస్తారు. తమ ఆనందం కంటే ఎదుటి వారి ఆనందం కోసం- ఎదుటి వారి సౌకర్యం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. ఇటు వంటి లిప్స్ ఉన్న మగువను పెళ్ళాడితే ఆ మగాడి సంతోషానికి అవధులుండవు. ఐతే ఒకటి-- ”అని ఆగాడతను.
ఆమె తలెత్తి చూసింది నవ్వులు చిలికించే మోముతో.
”ఇటువంటి స్త్రీల గురించి ఒక కచ్చితమైన అంచనాకు రావడం కష్టమట. వీళ్ళలో లోతు ఎక్కువ. త్వరగా పైకి తేలని స్వభావమన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఏమి చేస్తారో చెప్పడం బ్రహ్మతరమూ కాదట”
“అబ్బో! అంతలోతైన మనిషినా నేను. సరే అదలా ఉంచండి. మరి మీకంటూ స్వంత అభిప్రాయం ఒకటుంటుంది కదా! “
“ఉంది. ఒక తెలుగు మహాకవి మాటల్లో చెప్పాలనుంది- నువ్వుగాని ఒప్పుకుంటే—“
“ఉఁ అనుమతి ఇచ్చాం. చెప్పండి “
“నీది అందమైన హృదయం. హృదయమున్న అందం“
ఆ మాట విన్న సుజాత పులకరింపుతో ఆత్మీయత వెల్లివెరిసే చూపుతో అతణ్ణి చూస్తూ అతడి ముఖాన్ని తన మోముతో కలిపింది.
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments